Krishnaprema Logo

కృష్ణప్రేమ

దినకరా శుభకరా తిమిర సంహారా , సప్త వర్ణ సప్త లోక సప్త స్వర సమస్త శక్తి ధరా

10 ఫిబ్రవరి, 2011

రథ సప్తమి – మాఘ మాసం శుక్ల పక్షంలో ఏడవ తిథి.

‘సప్తాశ్వ రథ మారూఢమ్ ప్రచండమ్ కశ్యపాత్మజమ్

శ్వేతపద్మ ధరమ్ దేవమ్ తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్'

ఈ శ్లోకంతో ఆ భాస్కరుని స్తుతిస్తూ ఈ పూట నా మాట గా ------

జనవరి 24 (2011) వ తేదీన పూణే (మహారాష్ట్ర) లో భారత రత్న, ప్రముఖ గాన కళా కోవిదుడు పండిట్ భీమ్ శంకర్ జోషి గంధర్వ లోకానికి తరలి పోవడం తెలిసినదే. మహారాష్ట్రలో ఆయన్ని ‘స్వర భాస్కర' అంటారు. ఆయన పేరునే సమీకరిస్తే ‘గళ భీమ' (అనితర సాధ్యమైన బలమైన గళం ఆయనది కనుక), సంగీత సేన ( ఆయన శిష్య గణమే ఒక సేన కనుక), కంఠంలో ‘జోష్' ఉన్న తేజస్విగా ఆయన్ని కొనియాడవచ్చు. ఆయన స్మృతి చిహ్నంగా పూణే కార్పోరేషన్ వారు ఫిబ్రవరి 11 న మరో ‘భారత రత్న' , సునాద సుస్వర సుకుమార గళ విన్యాసిని లతా మంగేష్కర్' ను ‘స్వర భాస్కర భీమ్ సేన్ జోషి అవార్డ్' తో సత్కరిస్తున్నారు. ‘లతా దీదీ'కి అభినందనలు, అభి వందనాలు.

‘వీనుల విందు'లో లతా పాడిన ‘నిద్దురపోరా తమ్ముడా' వినండి. మధ్యలో ఘంటసాల మాస్టారు కూడా ఆలపిస్తూ వస్తారు. అవును తన గానంతో మనల్ని లేపి లేపి అలసి అలసి ఆయన ఫిబ్రవరి 11న శాశ్వతంగా నిదుర పోయారు. రేపటి నా మాట ఆయన గురించే.

-- తాతిరాజు వేణుగోపాల్, ఫిబ్రవరి 10, 2011