నీ దారి నీదా కేదారనాథా? నీరు పల్లమెరుగు నిజం నీవెరుగు
30 జూన్, 2013


వ ర్తమాన పుణ్య లబ్ది కోసం ఒకరు, భవిష్య మోక్ష ప్రాప్తి కోసం ఒకరు అక్కడికొస్తారు.
తనువు రాల్చేముందు తనివారా ఆ లయకారుడి నొక్కసారి చూస్తే చాలు అనుకునే వయో వృద్ధులు కొందరు అక్కడికొస్తారు,
చిన్నపిల్లల్ని బంధువులింట విడిచి పెట్టి రాలేక తమతో తీసుకు వచ్చిన దంపతులు కొందరు అక్కడ తారస పడతారు.
వీరంతా ఒక టయిపైతే, అబ్బే పుణ్యం కాదు, మోక్షం కాదు ఆహా ఆ హిమాలయ సౌందర్యం కనులారా చూడాల్సిందే అని ఊరికే కెమెరాలుచ్చుకు బయలు దేరేవారు కొందరు అక్కడ చేరతారు.
ఏటేటా ఆరు నెలల కాలం పాటు అక్కడి కొచ్చే జనం నిజంగానే ఒక ప్రభంజనం. శీతాకాలం అక్కడి రాకపోకలు నిషేధం.
ఎక్కడ జన సంచారం ఉంటుందో అక్కడ వ్యాపార దృష్టి కూడా ఉంటుంది. కనుక ధనార్జనకీ తావే అనువైనదని, అలా సహాయపడడం తమ వైనమని సాహసించి బస చేసుకున్న విక్రయదారులు కూడా అక్కడ ఎక్కువే. కొండ చివర్లలో ఒరుసుకునీ నిలబడేలా వసతి గృహాలు ఎవరి అనుమతి మీద కట్టించారో ఆ శివుడికే ఎరుక. అది సహాయానికి పరా కాష్ట అనాలా? ఊహాతీతమైన విపత్తుకి వైతాళిక మనుకోవాలా?
ఆ ప్రదేశమే చార్ ధామ్ – కేదార్ నాథ్, గంగోత్రి,యమునోత్రి, బదరీనాథ్ అనే నాలుగు విడివిడి పవిత్ర స్థలాల ప్రదేశం.
ఒక్క ఆంధ్ర నుంచే కాదు, దిగువ కన్యాకుమారి కైనా, ఎడమ వైపు గుజరాత్ కైనా, కుడి వైపు బెంగాల్ కైనా , దేశం నలు మూలల నుంచి వచ్చే వారందరికీ ఈ ఉత్తర దిశ దర్శనం, అదీ ఉత్తరాయణ కాలంలో దివ్యమైన వెలుగుల కాలంలో దర్శించడమన్నది ఒక ఉదాత్త జీవన సాఫల్య దశ.
ఏకాదశి తిథి శివుడికి ప్రీతిపాత్రమైనది . కాని శివరాత్రి ఎప్పుడూ? ఫాల్గుణ బహుళ త్రయోదశి నాడే కదా? త్రయోదశి అంటే పదమూడు కదా. పదమూడు అంకె వల్ల మనం భయ పడలేదు ఎప్పుడూనూ. కాని పాశ్చాత్యులు గడ గడ వణుకుతారు. లాడ్జ్ రూములకి పన్నెండు తరువాత పన్నెండు-ఏ అని ఇస్తారు తప్ప పదమూడు ఇవ్వరు.
మరి ఈ సంవత్సరం మాటేమిటీ? రెండువేల 13 !
‘పద, మూడ్ వచ్చింది శివ దర్శనం చేసుకుందాం' అని ఈ పదమూడవ సంవత్సరంలో చార్ ధాం యాత్రకి ఎందఱో బయలు దేరారు. జూన్ పదమూడు నుంచి పదహారులోగా ఎవరి ఊళ్ళకి వాళ్ళు తిరిగొచ్చిఅదృష్టవంతుల కోవలోకి చేరిపోయారు. ఆ ఒక్క జూన్ పదహారు న ఆ ఆదివారం పూట అక్కడ ఉండిపోయిన వారేనా దురదృష్టవంతులు?
ఉండిపోయింది ఒకరో ఇద్దరో కాదు, ఒక వంద మందో రెండొందలో కాదు. వేలాది మంది.
చినుకూ చినుకూ పడుతుంటే మెల్ల మెల్లగా కునుకు పడుతుంటే కంటి ముందు చెమ్మ- కన్నీరు కాదు, కడలి లేని చోట మొలిచిన నీరు, కదలి వచ్చిన నది నీరు. అసలు నది అంటేనే ప్రవహించునది. మంచు కొండల నెవరో సెగ పెడితే కరిగి వచ్చిందా అన్నట్టు జారుతున్న చల్లని నీరు. ఉలిక్కి పడే లోగా ఊపిరులు ఆగిపోయాయి. ఊత కోసం చూసే లోగా ఊబి పేరుకు పోయింది. ఒకరు చూస్తుండగా మరొకరు ఇసక సమాధిలోకి కూరుకు పోతున్నారు. ఎవరికి వారే తప్పించుకోలేని పరిస్థితి. ఎవరి దారి వారిది. ఎటు లాక్కు పోతోంది నీరు? అది ఏమిటీ? అలకనంద అలక ఎక్కువై ఒలక బోస్తున్ననీరా? మందస్మిత మందాకిని ని ముందుకు నెడుతున్న నీరా? గంగోత్రి గుండె పగిలి రక్తం రంగు మారి కదిలి వస్తున్న నీరా?
ఆప గతిని ఆపేందుకు శివుడు రాడేమీ? సతికి సగం దేహమిచ్చిన సాంబశివుడు తన వంతును లాక్కున్నాడా? గంగమ్మ చాటున దాక్కున్నాడా? లేక మహాశక్తితో మాట పడి సదాశివుడు గంగమ్మ గుండె మీద మహా తాండవం చేశాడా? గణనాధుడు గొడవ చేశాడా? సుబ్రహ్మణ్యుడు సొద పెట్టాడా? ఎందుకని శివుడు కన్నెర్ర చేశాడూ? అందుకే మూడవ కన్ను తెరిచాడా? దాని ఫలితమా ఈ ద్రవోపద్రవం?
ఆ కన్నెర్రకే ఆకాశం చిల్లు పడిందా? అంత విశాల గగనాన్ని ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ లాగ మార్చి నల్ల మబ్బు తొడుగు తొడిగి నీళ్ళు నింపి అంతలోనే కసిగా ఒక్క చిల్లు పెడితే భళ్ళున నీళ్ళు ఒక్కసారిగా పడిపోవా? అంత పనీ చేశాడు ఆ నీటి దేవుడు ఆ పరమ శివుడు, ఆది భిక్షువు ఆదివారం నాడు. మరునాడు సోమవారం, తన వారం అయినప్పటికీ ఆగలేదు సోమేశ్వరుడి ఆగడం. గంగ తానేమి తక్కువ కాదని పెంచుకుంది పొంగడం.
కేదార్ నాథ్ ఎగువ వైపు నుంచి వెల్లువ, కొండ చరియలు విరిగి పడ్డాయి కొల్లగా. నీరూ, మట్టీ, రాయీ, చెట్టూ అన్నీ కలగా పులగమై పెద్ద వినాశనం మొదలైంది.
ముక్కంటి తాండవానికి మూడు రోజుల ప్రళయ గర్జన కొండల మధ్య రాజ్యమేలింది.
యాత్రకని కలిసికట్టుగా బయలు దేరిన కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఎవరినెటువైపు లాగితే అటువైపు ఒరిగిపోయారు. బండరాళ్ళు చేతుల్ని, కాళ్ళని ముక్కలు చేశాయి. కడుపునిండా నీళ్ళు చేరి ఒకరి కళ్ళ ముందే ఒకరు శవాలుగా మారారు. ఉత్తరాఖండ్ లో ఖండ ఖండాలుగా ఇలా యాత్రికులు విడి పడడం మునుపెన్నడూ జరగలేదు.
ఈ బీభత్సాన్ని హిమాలయాల సునామీ అన్నారు ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి.
ఆయువు దక్కిన వారి దృష్టిలో ముక్కంటి దయ వల్లనే ఆయువు పోసుకున్నామనే కృతజ్ఞతా? అయితే అసువులు బాసిన వారేమనుకోవాలి? కోరుకోని శివసాయుజ్యం అప్పుడే పొందినందుకు, రుద్రుడి భూమే తమకి ‘రుద్ర భూమి ' అయినందుకు రుద్రమూర్తికి ఋణపడినట్టు చెప్పుకోవాలా?
విపత్కాలానికి శ్రీకారం విధి లేక విధాత చుట్టాడా?
వినాశానికి గంగమ్మ సహకారం విధి లేకనే జరిగిందా?
కురిపించడమే తన విధి అంటూ వరుణుడు గంగమ్మకి ఉపకారం చేసి మురిసాడా?
అందుకు ఫలితం - బుర్రలు కొట్టుకు పోయాయి, వెర్రి తలలు వేసిన గంగమ్మ పూనకంలో.
గుర్రాలు దొర్లిపోయాయి, పదిమందిని మోసి శివ దర్శనం చేయించలేని అసహాయ స్థితిలో.
ఇసక మేట వేసింది, దాని కింద నలిగి సజీవ సమాధి అయి పోయిన వారెందరో. బురద ఊబిలోకి దింపితే బుడుంగున మునిగిన అసహాయులు ఎందఱో.
ఇంత భీభత్సంలో ఆశ్చర్యకరమైన ఘటన ఒక్కటే అందరికీ ప్రశ్నార్ధక మైంది. అదే- కేదార్ నాథ్ శివ లింగం చెక్కు చెదరక పోవడం. శివలింగం ఉన్న గుడి గోపురం బెదరక పోవడం. గోపురం వెనక పెద్ద శిల పడి గంగమ్మని దారి మళ్ళించడం.
ఆది శంకరుల పుణ్యమా అని మనకందిన ద్వాదశ జ్యోతిర్లింగాల కాంతి పుంజంలో కేదార్ నాథ్ జ్యోతిర్లింగం అత్యంత ఎత్తైన ప్రదేశాన ఉన్న శివ తేజం. ఇప్పుడా ఆది శంకరుల వారి సమాధి ఆనవాళ్ళు లేక కొట్టుకు పోయింది.
అటువంటి మంచు కొండల మీద ఇటువంటి విపత్కాలంలో ఆదుకో గలిగేది మన సేనా దళాలే.
ముందు బతికిన వారిని, వారే స్థితిలో ఉన్నా నిస్సహాయంగా అలా గాలికొదిలేయలేదు వాయు సేన వారు, హుటాహుటిన హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు, డెహ్రాడూన్ వైపు అసహాయుల్ని తరలించారు. డెహరా అంటేనే డేరా.
ఓర్మితో, కూర్మితో ఆర్మీ రంగంలోకి దిగి అవసరమైన సేవలన్నిటినీ అందించింది.
వారి అన్వేషణలో ఒక చిన్నారి దొరికింది. అమ్మా అమ్మా అని ఒకసారి, అక్కా అక్కా అంటూ ఒకసారి ఏడుస్తూ అరుస్తున్న ఆ పాప ఎవరిదో, ఎక్కడిదో తెలియని సంఘటన ఎవర్ని మాత్రం కలచి పెట్టదూ? ఇప్పుడా చిన్నారి అనాథ! ఆ చిన్నారి పేరేమిటో తెలియదు. హిమాలయాల చాటు నుంచి వచ్చింది కనుక ‘హిమజ' అనాలా? శివుడూ శక్తి కలబోసిన అర్థ నారీశ్వరుడి దయకి పాత్రమైంది కనుక ‘శిశజ' అనాలా?
విషాదంలో ఊహించని పెను విషాదం- పదిరోజులు సేవలందించి ‘తిరిగి వస్తున్నాం' అని ప్రకటించుకున్న సేనా దళం (ఇరవై మంది) విధి విష వలయంలో చిక్కుకు పోయి, వారి చాపరు (M-17) నేల కొరిగి పోవడం. వారు చేసిన సేవకి ఇదా శివుడిచ్చిన ప్రతిఫలం? ఇదేనా శివుడాజ్ఞ? భాషా,కుల, ప్రాంతీయ తత్వాలకతీతంగా నిస్వార్ధంగా సేవ చేసినందుకు వారికి శివసాయుజ్యమే బహుమానమా? తప్పకుండా వీరు గత జన్మలో శివ ప్రమథ గణంలోని వారే అయ్యుంటారు.
పూవులలోనే వాసనతోనూ పురుగులు నిలిపావా? – అని ఒక పాట వేంకటేశ్వరుణ్ని నిలదీసి అడగ్గా విన్నాం. ఈ విపత్కాలంలో అక్కడక్కడా ఆదుకోవడానికి వచ్చిన జనంలోనూ విపరీత బుద్ధులవారూ లేకపోలేదు. నీరు నోటికందించి సెల్లు లాక్కు పోయిన కుహనా సేవకులు ఎందఱో. డబ్బిస్తాం రొట్టె వెయ్యండి అని బ్రతిమిలాడితే వేలం పాడే వెర్రి పోకడలు పోయిన వారు అక్కడ లేక పోలేదు.
బతికిన వారిలో అందరూ దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులే అయినా ఏ భాష వారు ఆ భాష పరంగా విడి పోయి రాష్ట్రాల ఉచ్చు తగిలించుకున్నారు. మధ్యలో అబద్ధాల పెచ్చులు అద్ది నాయకులు మరింత బీభత్సం సృష్టించారు. తమ నిఘంటువులో సకారం పేజీలు పోగుట్టుకున్న నాయకులు సహకారం, సహాయం,సౌజన్యం, సేవ అనేవి తెలియని వారిలా విస్తు పోయి కుస్తీ పట్లకి దిగారు. త్యాగాలు తెలియని వీళ్ళు బయటకొచ్చి చనిపోయే వారి ఆత్మశాంతి కోసం యాగాలు చేశారు.
ప్రకృతి వికృత చర్యలు పంచభూతాల్లో ఆవహిస్తాయి.
గ్రహ శకలాలు మోసుకొస్తూ ఆకాశం బెదిరించవచ్చు.
తన గుండె పగిలేలా భూమి కంపించ వచ్చు.
సముద్రం ‘అల' కల్లోలం సృష్టించ వచ్చు. అది సునామీ పేరుతో జరిగే ప్రళయం కావొచ్చు.
అడవులు అగ్నికి ఆహుతి కావడం, ఆ జ్వాలలు ఊళ్లవైపు రావడం సంభవమే.
గాలులు వెర్రెత్తి పోయి సుడులు తిరిగి గురి పెట్టి మరీ సతాయించవచ్చు.
మనిషి కూడా తక్కువ తిన్నాడా?
యంత్రాలు సమకూర్చుకున్నాడు. సదుపాయాలు పెంచుకున్నాడు.
విమానంలోనో, హెలికాప్టరు లోనో ఎక్కి ఆకాశంలో వడి వడిగా షికారు కొడుతూనే అంతలోనే సంభవించిన తాంత్రిక లోపం కారణంగానో, సహకరించని దృశ్యత కారణంగానో దారి తప్పితే ఫలితం ఏమిటీ? నేల కొరగటమేనా?
అడవులు నరికేసి భూములు ఆక్రమించి నదుల దారులు మరచి పోయి మనిషి గొప్ప నాగరీకుడయ్యాడు. తన కన్ను తానే పొడుచుకునీ కృత్రిమ సులోచానాలతో తృప్తి పడుతున్నాడు.
కేదార్నాథ్ పరిసరాల్లో జరిగింది అదే. కందిపోయే భూ ప్రాంతం అది. అందినంత అందుకుందామనే ఆశ వెర్రి తలలు వెయ్యడమే ఈ వినాశానికి తొలి సంకేతం. ఋతుపవనాలు నెలకు ముందే అక్కడికి చేరుకునీ అతివృష్టి సృష్టించడం అగ్నికి ఆజ్యం పోసి నట్టయింది.
అమర్నాథ్ మంచు లింగ దర్శనానికి ఒక పధ్ధతి, నియమావళి పాటిస్తుంది ప్రభుత్వం. అటువంటి నియంత్రణ అనేది ఏమాత్రం లేదు చార్ ధామ్ విషయంలో.
గతంలో దేశంలో ప్రకృతి ప్రకోపిస్తే ఎన్నెన్ని భయానక సంఘటనలు జరగలేదూ?
1977 నవంబర్ 19 – దివిసీమ తుపాను.
1999 అక్టోబర్ 29 - ఒడిశా సూపర్ స్టార్మ్.
2001 జనవరి 26 – భుజ్ (గుజరాత్) భూకంపం.
2004 డిసెంబర్ 26 – భారత్ కని విని ఎరుగని సునామీ జల తాండవం.
2005 జులై 26 – ముంబై మునుపెన్నడూ చూడని వాన నీటి ముప్పు.
ఇందులో భూకంపం మినహా తక్కినవన్నీ జల ప్రళయాలే.
ఇక మానవ చేష్టల కారణంగా జరిగిన బీభత్సాలు:
1975 డిసెంబర్ 27 - నాటి బీహార్ లోని ధన్ బాద్ లో చస్నాలా బొగ్గు గనిలో ఏర్పడ్డ జలప్రళయం.
1984 డిసెంబర్ 2-3 - భోపాల్ గ్యాస్ లీకేజీ
ఏ ప్రళయమైనా అధిక జన సంచారం ఉన్న చోట జరిగితే ప్రాణ నష్టమే ఎక్కువ.
ప్రళయం ఎప్పుడు ఎక్కడ వస్తుందో చెప్పలేం కనుక ఎత్తైన మంచు పర్వత ప్రాంతాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ జనావాసం, జనసంచారం పట్ల ‘నియంత్రణ' అమలు చెయ్యాల్సిందే. లేకుంటే కోరి కొరవితో తల గోక్కున్నట్టే!
అప్పుడోసారి శ్రీకాకుళం వైపు రైలు బండి వెళుతుండగా పట్టాల మీదికి వంశధార నదీ ప్రవాహం ఎదురొచ్చింది. ఇంజన్ డ్రైవర్ ( ఇప్పుడు పైలట్ అంటున్నారు) అతి చాక చక్యంగా ట్రైన్ ని వెనక్కి మళ్ళించి ప్రయాణీకుల్ని సురక్షితంగా దగ్గరి స్టేషన్ కి చేర్చాడు.
నదీ ప్రవాహం అంటే ఆషామాషీ కాదు. నీరు పల్ల మెరుగు – కనుక నది నీరు ఎప్పుడు కూడా ఉరకలు పరుగులతో ఉంటుంది.
బ్రహ్మపుత్రా నది కలిగించే వరద బాధ ఇంతా అంతా కాదు. అందుకే ఈ నదిని బెంగాల్ విషాదం అంటారు.
నదుల్లో మహారాణి హోదా పొందింది గంగ. పవిత్రతకి మారు పేరు గంగ.
నిజమే భూమ్మీద డబ్భయి శాతం నీరే ఉంది. మనిషి శరీరంలోనూ డబ్భయి శాతం ఉన్నది నీరే. నీరు ఆమ్లజనిని కలిగి ఉంది. అదే మనకు ప్రాణవాయువు నందిస్తోంది. నీరే మన ఆయువుని నడిపిస్తోంది.
అంతెందుకు మృత్యు ఘడియల్లో తులసి తీర్థం కోరుకోరూ?
‘నీ దయ గౌతమి గంగ రామయ నీ దాసులు మునుగంగ ' అని ఆర్తితో, భక్తితో శ్రీరాముడిని ధ్యానించనిది ఎవరూ? అటువంటి శ్రీరాముడిని ఆవలి ఒడ్డున చేరుస్తూ ‘ఈ గంగ కెంత దిగులు ' అని గుహుడు విలవిల్లాడాడని కృష్ణశాస్త్రి అన్నారు. పెరటిలో తవ్విన నూతి నుంచి నీరు ఎగజిమ్మితే ‘పాతాళ గంగమ్మ రారారా ..ఉరికురికి ఉబికుబికి రారారా ' అని పరవశంతో పాడుకున్నట్టు వ్రాసినదీ ఆయనే. కలిసికట్టుగా కర్షకులు ‘శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన ' అని పాడుకుంటూ మురిసిపోవడం వంటి మాటల దృశ్య కల్పన చేసింది ఆయనే.
గంగ – భగీరథ ప్రయత్నంగా దివి నుంచి భువికి దిగి శివ కటాక్షం పొంది ఒద్దికగా భగీరథుడి మార్గాన్ని అనుసరిస్తూ పొరలింది. గంగావతారణం గురించి చెప్పాలంటే ప్రతి కవి నుంచి పదాలు ఉప్పెనలా పొంగుకొస్తాయి. అటువంటిది తన కుమార్తెలకి నదుల పేర్లు పెట్టుకున్న డాక్టర్ సినారె కవి కలం కదిపితే ఎలా ఉంటుంది? మాటల వెల్లువే.
సీతా కల్యాణం - అతి సున్నితమైన సినిమా. సున్నుండ లాంటి సినిమా. అది బాపు చేతి వెన్న ముద్ద. బహుశ: తెలుగులోనే కాదు యావత్ భారతీయ చలన చిత్రాల్లో ‘గంగావతారణం ' దృశ్యం కళ్ళకి కట్టినట్లు చూపించిన ఏకైక సినిమా ఇదే నేమో. ఆ గంగావతారణ గీత కావ్యాన్ని సి నా రె రాశారు. ‘గళమున గరళము ధరించినావే, తలపై గంగను భరించలేవా? ' అని భగీరథుడు ప్రశ్నిస్తే ముక్కంటి ప్రసన్నుడయ్యాడు. ఇంక గంగమ్మ ఊరుకుంటుందా? ‘కదిలింది కదిలింది గంగ ..ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా...హరుని శిరమున పోటులెత్త గా, బ్రహ్మాండ భాండము బీటలెత్తగా.. '.
అయితే ఒక్కటి నిజం ‘శ్రీ గౌరీ శ్రీ గౌరియే ..శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా '. ఇది కూడా సినారె వారి ఉవాచే.
జూన్ పదిహేడు న కవి, కథకులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి. అచ్చ తెనుగు నుడికారానికి ఆయన పెట్టిందే పేరు. ఆయన గనుక శివుడు గురించి ప్రస్తావిస్తే ఎలా ఉంటుంది? అచ్చ తెనుగు ఉంటుందా? సంస్కృతాంద్రం కలబోసుకు వస్తుందా? శివుడికిష్టమైనవి మారేడు దళాలే కాబట్టి మల్లాది కవి తన కిష్టమని మరుమల్లెలు ఇవ్వగలరా? వారు ఆ మాత్రం జాగర్త తీసుకున్నారు లెండి.
1958లో వచ్చిన ‘రాజనందిని ' లోనే ఆయనకి తొలిసారిగా శివుడి గురించి వ్రాసే అవకాశమొచ్చింది. ‘హరహర పురహర శంభో ' అనే గీతంలో శివుడిని ‘ఆనంద గంగా తరంగాంతరంగ!' అని కొనియాడుతూ ‘అరుణ ఘనాఘన జటా మండలీ ' అని అన్నారు. అది నలుపు-తెలుపుల చిత్రం. అక్కడ ‘అరుణ' వర్ణం చూపించే అవకాశమే లేదు. కవి దృష్టిని మన ఊహకే వదిలేశారు దర్శకులు. మరో పాటలో వ్యంగం కుప్పిస్తూ ‘కొమ్ముల్ తిరిగిన గొర్రె పొటేలు –గుభేలుమంటూ కొండను కుమ్మితె- కొండకు లోటా? గొర్రెకు చేటా? - చెప్పర దేవా సాంబశివా- కను విప్పర దేవా సాంబశివా ' అని మల్లాది వారన్నారు. ఇప్పుడు జరిగిందిదే. మనిషికి కొమ్ములొచ్చి మంచుకొండను దొలిచెయ్యాలనుకుంటే నష్టపోయేది ఎవరు? శివుడు కను విప్పాడు.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార్ నాథ్ లో ఉన్నది అయిదవది అంటారు. ఈ మధ్య రాజమండ్రిలో కొన్న ఒక పుస్తకంలో కేదార క్షేత్రం గురించి వ్రాస్తూ ఓ మాట అన్నారు - ‘భక్తులు మార్గంతరమున మరణించినను ముక్తి లభిస్తుంది అనటంలో సంశయము లేదు'. అందుకు కారణం – ప్రయాణ మార్గం అంత సులువు కాదు కనుక. పైగా అయిదారు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది కనుక శ్వాస విషయంలో ఎందరికో ఇబ్బంది కలగ వచ్చు. ఈ క్షేత్రంలో కూడా శ్రీశైల క్షేత్రంలోలా శివ లింగాన్ని స్పర్శించ వచ్చు.
శ్రీశైల జ్యోతిర్లింగం రెండవది. కర్నూల్ జిల్లా ఆత్మకూరు తాలూకా నల్లమల పర్వతారణ్య ప్రాంతంలో కృష్ణా నదీ తీరాన ఉందీ శ్రీగిరి క్షేత్రం. ఆంధ్రుల అదృష్టం ఈ క్షేత్రం అని అనుకుంటే మహారాష్ట్ర వారికీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి భవానీ దేవి వీర ఖడ్గాన్ని అప్పజెప్పి జైత్రయాత్రకి నడుం కట్టమని దీవించింది.
మల్లాది వారికి 1962 లో ‘శ్రీశైల మహాత్మ్యం ' చిత్రం కోసం ముత్యాల్లాంటి పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే రెండు పాటల్లో కన్నడ పలుకులు వచ్చినట్టు అనిపిస్తుంది, ‘మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే ' అన్న పాటలో ‘పుణ్యద జ్యోతిగ ', ‘బ్రోవ భారమే ఐతిమె దేవా ' అనే పాటలో ‘మానవ క్షేమద బాధ్యతకే ', 'పరమేశు పూజలేలే ' అనే మరో చిన్న గీతంలో ‘మోక్షద సాధనల ఫలమే నీవు ' వంటి పదప్రయోగాలు నిజమేస్మీ అనిపిస్తాయి.
శ్రీశైల శివుడికి మల్లెలంటే ప్రీతి. ఇక మల్లాది వారి ‘మరు మల్లెల' స్వేఛ్చకి అడ్డే లేదు. ‘లేమల్లె రేకల ఉయ్యాలల్లి ', చిన్నారికి జోలపాడి ‘నాగాభరణుని దీవెన నీ కబ్బు ' అని దీవించారు.
‘ఈశుని కానగ ఆతురయై భోగలీల పర్వేను గంగా – చండ ప్రచండ ప్రవాహ రూపిణీ భీకర ప్రళయ తరంగా – గంగకు దారిగ శిలపై గురిగా చక్రము విడచెను శ్రీకరుడే –వసుధ నెరియగా దారి చూపగా పరవళ్ళాయెను గంగా –ఇదియే పాతాళగంగా ' అని సంక్షిప్తంగా మల్లదివారు గంగావతరణం చూపించారు.
కనులు మూసినా పాటే –అనుకుంటే ‘కైతల మల్లాది భావన - కైలాస మలయ దేవర దీవన' వీనులారా వినడమే తక్షణ కర్తవ్యమ్.
(కనులు చూసినా పాటే - అంతా శివమయమే కాదా! )
గంగ పలుకు లేని వేటూరి వారి పాట ఉందా? ఆయనే ఉంటే వే - టూరిజం ఇంకా అద్భుతంగా ఉండేదే.
కాని ఆయన లేక ‘తెలుగు పాట' దారీ తెన్నూ లేక అలమటిస్తోంది.
కేదారనాథ్ కిక పైన కొన్నేళ్ళ వరకు ‘వే' లేదూ, ‘టూరిజమూ' లేదు. నిజం శివుడెరుగు.
జూన్ నెల 'ఋషిపీఠం ' చదివిన వారికి నెలలోని 'ముఖ్య దినాలు' గుర్తుకు రావాలి. అవి ఇవి -
జూన్ 18 (మంగళవారం) - దశపాపహర దశమి. ఆ రోజున గంగాదేవిని దర్శించి,పూజించి, స్నానం చేస్తే పాపహరమౌతుంది. గంగాస్నానం కుదరకపోతే వేరే నదుల్లోనూ పదిమార్లు మునిగి స్నానం చేయొచ్చు.
జూన్ 19 (బుధవారం) - నిర్జల ఏకాదశి. ఆ రోజున ఆదిశంకరులు కైలాసం చేరారని చెబుతారు.
జూన్ 20 (గురువారం) - జ్యేష్ట శుద్ధ ద్వాదశి- ఈ తిథి కూడా ఒక రకంగా 'దశహర' యే. ముఖ్యంగా గంగావతరణం జరిగిన రోజిది. అంటే - భగీరథుడు గంగను భువికి తరలించిన పుణ్య తిథి ఇది.
కాల గమనం తన కాల ధర్మం పాటించినట్టేనా? ఆ తిథులకు ముందు జరిగిన విధి లీలలో ఎందఱో కాలధర్మం చెందడం - ఆస్తికులకి, నాస్తికులకి కొన్నేళ్ళ వరకు అంతు చిక్కని ప్రశ్న, ముడి విడని చిక్కు ప్రశ్న!
(నెట్ లో ది హిందూ మొదలైన న్యూస్ సోర్సులు ముద్రించిన ఫోటోలు ఇక్కడ ‘ఆల్ బొమ్మలే ' లో ఉపయోగించుకున్నాను. వారందిరికీ కృతజ్ఞతలు.)
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 30 జూన్ 2013 (ఆదివారం)