ఇండియా చందమామ మసకేసి పోయే - లండన్ నుంచి కబురేలోయ్
11 డిసెంబర్, 2011

Click to zoom
నిన్న నిండు పున్నమి చంద్రుడికి గ్రహణం పట్టింది కదూ. నిజం చంద్రుడు కాబట్టి తట్టుకో గలిగాడు. భూమి తన నీడ చూసుకోవాలంటే చంద్రుడు అద్దంలా మారాడు. అంతే! ఇండియాలో ఓ చందమామ ఒక వారం క్రితం వరకూ ఉండేవాడు. 'ఖోయా ఖోయా చాంద్ ' అని విచిత్రమైన అడుగులు వేస్తూ తన ముద్రని అద్దం పట్టి మరీ చూపించేవాడు.
డిసెంబర్ 4 , 2011 తెల్లవారు ఝామున చంద్రుడూ, సూర్యుడూ పోటీ పడుతున్న వేళలో ఈ చంద్రుడు తప్పుకున్నాడు. పదహారు కళల చంద్రుడు 'నటన ' తన లక్ష్యమన్నాడు. సూర్యుడు 'బాధపడకు, నీ పాట నేనౌతా ' అన్నాడు. రోజూ అతని పాట ఉదయిస్తూనే ఉంటుందిక. సినీ వినీలాకాశం లో ఇండియా చందమామ మసకేసి పోయింది. లండన్ నుంచి ఆ రోజు ఆ కబురొచ్చింది.
ఆ ఇండియా చందమామ అసలు పేరు దేవానంద్.
దేవభాష పరంగా పేరుకి చెరొక వైపూ 'ద' కారాలు ఉంటే ఇంగ్లీష్ లోనూ రెండు 'డీ' లు కలవాడేగా!
why this kolaveri డీ అనే కొత్త పాట ఊరూరా కుర్రకారును హోరెత్తి చంపేస్తుంటే 'ఆ పాట పెట్టి సినిమా తీయడానికి నేను రెడీ' అనగలిగే వాడేనేమో ఈ ఉభయ 'డీ' కుశలోపరి! అందుకేనేమో వయసుకి అటువంటి కొలతే ఇచ్చి 8 పక్కన 8 వచ్చేవరకు ఆగేడు. అప్పుడే రెండెనిమిదులు పదహారు కాగలిగే అవకాశముంది. దేవానంద్ అంటే పదహారు కళల చంద్రుడే కనుక 'ever green ' గా 'sweet sixteen ' లోనే ఉంటాడని అనే మాట నిజమైంది.
ఆయన ఏకాకి కాదు.
గుంపులో గోవిందా కాదు.
ఆయన వయసు వారు 'రామా కృష్ణా ' అనుకుంటూ ఈజీ చైర్ కి అంకితమౌతుంటే తాను మాత్రం 'హరే రామా హరే కృష్ణ-ఆజ్ ' అనే బిజీ స్క్రిప్ట్ తయారీ లో నిమగ్నమైనవాడు. సోదరులు విజయానంద్ , చేతన్ ఆనంద్ తో పాటు నటదర్శకుడుగురుదత్ అనే మువ్వన్నె చెలిమి కారణంగా ఎప్పుడో ఏర్పడ్డ 'నవ కేతన్ ' ని ఒంటిగా మోస్తూ కొడుకు చేతిలో పెట్టి 'వాపస్ న ఆవూంగా, మై తో చలా జావూంగా ' అని మనసులోనే తన పాటనే ఆలపించుకునీ అన్నంత పనీ చేశాడు.
కవీంద్రుడు రవీంద్రుడు మాత్రమె 'గురుదేవ్ ' కావొచ్చునేమో కానీ బాలివుడ్ లో గురుదత్ , దేవ్ ఆనంద్ లు వెరసి మరో గురుదేవ్ అని సి.ఐ.డి కనుక్కుంది. అందుకే కవి హృదయాలు కలాలు పదును చేసుకునీ ఇద్దరి మనసుల్లోనూ చొరబడ్డాయి. కాని దేవ్ లోని మనసయ్యోసురయ్యో అని గొడవ చేసినా మతాల గోడ వారిని దూరం చేసింది. 'లేకే పెహలా పెహలా ప్యార్ ' అతను తెలుసుకున్నది- 'జీవన్ క్యా హై తమాషా '! అనేది. అందుకే నిషాల జోలికి పోక, గొంతులో జీర తో రాజీ పడక కల్పనా కార్తిక్ తో యావజ్జీవితం గడిపేడు. పైగా ప్రేమ పుస్తకాన్ని ముది వయసులో రాసి విస్తు పోయేలా చేశాడు.
దేవానంద్ అనగానే జుట్టు ముందు భాగాన్ని కొండలా పైకి ఎత్తి నవ్వే ముఖం గుర్తొస్తుంది.
నవ్వినంతలోనే ఒక పక్క లేని పన్నో, సగమే ఉన్న పన్నో దర్శనమిస్తుంది.
తల ఊపుడే కాని తల తిరుగుడు లేని మంచితనం ఎదురౌతుంది.
ఫారినర్ లాగ ఏదో పని చేసుకుంటూ మాట్లాడే వాడిగా కనపడుతుంది.
పాటలో చిట్టి చిట్టి పరుగులు పెట్టి హీరోయిన్ చేత పరిగెత్తించే చిలిపితనం బావున్నట్టే అనిపిస్తుంది.
గళ్ళ చొక్కాలు, కోట్లు, స్వెట్టర్లు, పెద్ద టోపీలు, చేతిలో కర్ర, టైలు- ఇదీ అతని స్టైలు.
ఆయన రంగుల్లోకి రాగానే జుట్టు పలచనైంది తప్ప మిగతా హంగులు షరా మామూలే.
ఎటొచ్చీ - హీరోయిన్లు తప్పనిసరిగా ఎర్రటివీ, గులాబీ రంగువీ చీరలు కట్టాల్సిందే.
దేవానంద్ చిత్రమైన కథకుడు. కాబట్టేఆర్కే నారాయణ్ వంటి మేటి రచయిత రాసిన 'గైడ్ ' నవలని ఎంతో హుందా గా అదే పేరుతో సినిమాగా సమర్పించాడు.
ఆయన సినిమాల పేర్లూ విశేషమైనవే. ఒక సినిమాకి 'GUIDE ' అని పెట్టిన పేరు ఊరికే పోలేదు. నిర్మాత అంటే సాహసి అని నమ్మే వారికి ఆయనే ఒకగైడ్ - అని ఆనక తెలిసింది.
'JEWEL THIEF ' అన్నాడు. అమ్మ దొంగా, గడుసు! బంగారం లాంటి కథలు, వెండి తెర, ముత్యాల్లాంటి పాటలు, రత్నాలాంటి హీరోయిన్లు,వజ్రాల్ల్లాంటి మాటలు- ఇన్ని ప్రవేశ పెట్టి ప్రేక్షకుల 'పల్స్' దోచుకున్నవాడు.
'GAMBLER' అన్నాడు. ఒక దాని వెంట ఒకటి సినిమా ఆడించి బెట్ కాయించిన వాడే.
Black & White కాలానికి తగ్గట్టు 'KALA PANI', 'KALA BAZAR' అన్నాడు.
రంగుల్లోకి రాగానే ' తేరే మేరె సప్నే అబ్ ఏక్ రంగ్ హై ' అని రంగులకల లుంటాయని పాడించుకున్నాడు.
ఒక్క సారే 'TAXI DRIVER' పాత్ర అనుకున్నా అడపా దడపా సినిమాల్లో సైకిలో, కారో, జీపో, ట్రైనో ఆఖరికి లారీవో ఏదో ఒక దాని మీద సవారీ చేసి హీరోయిన్ బుంగ మూతికి మరింత అందమొచ్చేలా, ఆడ పిల్లకి అబ్బాయి ప్రేమ అర్థమయ్యేలా ఆట పట్టించాడు.
ఇన్ని చేయడానికి నాలుగు దశాబ్దాలు పెద్ద కాలమే. అయినా ఎంత ఓపికో ఆయనకి. ' పని లేక ఖాళీగా కూర్చోవడమంటే బతికుతూ చచ్చినట్టు పడి ఉండడమే ' అనే వింత మనిషి ఆయన. అందుకే పని అనేది ఆపని వాడిగా, రేపని, మాపని చేసే పని వాయిదా వెయ్యడం తప్పని చెప్పే వాడిగా దేవ్ జీ కి గౌరవముంది.
దేవ్ జీ సంగీత పిపాసి. అందుకే సంగీత దర్శకుల్ని విసిగించి అయినా అర డజను ట్యూన్స్ చేయించుకునీ నచ్చినది, 'సీన్' పండించేదీ ఎంపిక చేసుకునే వాడు. అందుకే ప్రతి మ్యూజికల్ సిట్టింగ్ లోనూ ఆ'సీను'డయ్యేవాడు.
దేవ్ తన పేరులో సగమున్న సచిన్ దేవ్ అనే బెంగాలీ రసగుల్లా తీపి చలవ వల్ల మహమ్మద్ రఫీ గళమాధుర్యం వల్ల తన పాటలంటే ప్రతి ఒక్కరూ చెవి కోసుకునేలా చేసుకున్నాడు. అదే బర్మన్ కుమారుడు రాహుల్ దేవ్ యువ తాపం , కిశోర్ కుమార్ గళ మాయాజాలం తోడైనప్పుడూ తన పాటలంటే తప్పక ప్రతి ఒక్కరూ చెవి అప్ప చెప్పేలా చేసుకున్నాడు.
సినిమా సంగీతమే ఒక 'మహల్ ' అనుకున్నప్పుడు తానే దేశీయంగా 'బనారసీ బాబు ' అని చెప్పాడు. మరో సారి విదేశీయంగా 'జానీ మేరా నామ్ ' అన్నాడు. ఇక్కడే 'మీ వరస మాకు తెలిసినదే' అని కళ్యాణ్ జీ ఆనంద్ జీ సోదర ద్వయం ఆయన అభిరుచికి తగ్గట్టే పాట మెట్లు కట్టించి ఇచ్చారు.
ఓపీ నయ్యరు లత కు పాటలు ఇయ్యరు - అనేది లోక విదితం. అందుకు ప్రత్యేకించి సి.ఐ.డి నిఘా అక్కర్లేదు. గీతా దత్ ,షంషాద్ బేగం , ఆశా - రఫీ ల యుగళ గీతాలకి జనం వెర్రెత్తి పోవడానికి దేవానంద్ ఒదగడమే కారణం.
శంకర్ జై కిషన్, మదన మోహన్, సలిల్ చౌదరీ,జయదేవ్ - ఎవరి బాణీ వారిదే. కాని పాట వింటుంటే ఏది దేవానంద్ కోసమో, ఏది ఇతరులకోసమో అనేది చెప్ప గలిగే గుణం శ్రోతలకుందంటే అది దేవానంద్ ప్రతిభే.
దేవానంద్ యుగళ గీతాలు చూసినా, విన్నా హాయిగా ఉంటాయి. స్వతహాగా 'సిగ్గు ' ఆయనకి ఉగ్గుబాల నాటినుంచి వచ్చిన కానుక. షకీలా, కల్పనా కార్తిక్, మాలా సిన్హా, సుచిత్రా సేన్, నూతన్, వహీదా రెహమాన్, ముంతాజ్, ఆశా పారేక్, సాధన, నంద, వైజంతి మాల, హేమ మాలిని ల వరకు ఆయనతో నటించిన వారిది ఒక యుగమైతే, జీనత్, టీనా, టాబూ ల కాలం మరొకటి.
దేవానంద్ ది గ్రేట్ అని చెప్పేందుకు అందరూ ఏక కంఠంతో ఒప్పుకునే చిత్రాలు రెండున్నాయి- ఒకటి 'Hum Dono -హం దోనో' ( ఇది మళ్ళీ రంగుల్లో ముస్తాబైతే బాగా చేశారు అని దేవానంద్ మెచ్చుకున్నారు), ఇంకొకటి- 'Guide-గైడ్'.
దేవానంద్ ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్న వాడు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ త్రయంలో కాల గమనంలో అలుపెరగని, వెరపెరగని బాటసారి. 'మై జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా ' అని 'ఇక చాలు' అని ఎక్కడో కనపడనిరంగుల దేవ లోకం కనిపిస్తే ఆనందంగా వెళ్ళిపోయాడు.
కనులు చూసినా పాటే - ఎస్.డీ. బర్మన్, మహమ్మద్ రఫీ, దేవానంద్ ల ముచ్చటైన కాంబినేషన్ కి నివాళి అర్పిస్తోంది.
కనులు చూసినా పాటే - సచిన్ దేవ్ బర్మన్ కాక మిగతా మేధావుల బాణీ ల్లో రాణించిన యుగళ గీతాలతో దేవ్ ని స్మరిస్తోంది.దేవ్ కనబడక పోయినా దేవ్ నడక మన ముందుంచిన రఫీ, కిశోర్ లు ధన్యులు. దేవ్ కితలత్ మెహ్మూద్ , హేమంత్ కుమార్ లు కూడా పాడి మెప్పించారు. ఎవరు పాడినా ఆ పాటలో దేవ్ జీ కనపడాల్సిందే. అలా కనిపించేలా వారంతా పాడేరు కూడా. సినీ గాయకులకి ఇదే మొదటి అర్హత. శ్రావ్యత, ఆర్ద్రత, నమ్రత వంటి సుగుణాలు తోడైతే వారిదే నాలుగైదు దశాబ్దాల 'హవా '. అలాంటి గాయకులుంటే నటుడికీ వయసు గుర్తుకు రాదు.
సినిమాకి పాట అనేది ప్రాణం అని చాటి చెప్పిన దేవానంద్ పాటసారి కి, అతన్ని ఒక హాలీవుడ్ నటుడితో పోల్చితే ఆ నటుడికీ ఇతనికీ ఉన్న తేడా ఒక్కటే అని గమనిచ వచ్చు - అదే పాట! పాట - ఇండియన్ ఫిల్మ్స్ అందించిన వరం.
దేవ్ ఆనంద్ సినిమా పాటలు అలనాటి రికార్డ్ లై ఇంటింటా 'అరిగాయి '. వాటి కవర్లు అక్కడక్కడా చిరిగాయి. అటువంటివి 'ప్రతి ముఖమూ ప్రముఖమే ' లో దర్శనమిస్తుంటే దేవానంద బాష్పాలు రాలవూ!
-డా. తాతిరాజు వేణుగోపాల్, 11 డిసెంబర్ 2011
