Krishnaprema Logo

కృష్ణప్రేమ

ఊయల ..ఊగిసలాట...హిం'దోల్' రాగంపు పాట

23 నవంబర్, 2013

ఊయల ..ఊగిసలాట...హిం'దోల్' రాగంపు పాట

Picture

పా ర్వతమ్మ గారికి వంటింటి హడావుడి తగ్గాక కాస్త తీరిక దొరికినట్టయింది. వాకిలికి, చావడికి మధ్యస్థంగా దూలానికి వేయించుకున్న ఉయ్యాల బల్ల మీద కాసేపు కూర్చున్నారు. కుయ్ కుయ్ అంటూ ఉయ్యాల చేసే శబ్దం ఆవిడ చెవికి తంబూరా నాదంలాంటిది. అలాంటప్పుడే ఏదో ఒక రాగం తీస్తూ ఆమె రిలాక్స్ అవుతుంటారు.

అటునుంచి మనవరాలు కూడా ఏదో రాగం నెమ్మదిగా తీస్తూ ఆమెని చూసి చూడనట్టు చూసి వీత్తలుపు వైపు వెళుతోంది. ‘ఏవమ్మాయ్ సునందా...ఈ ఏడాది అట్లతద్దికి నువ్వు నీ స్నేహితురాళ్ళని పిలవలేదెందుకే? ఎవ్వరూ ఊళ్ళో లేరా ఏమిటీ? మనింటా వంటా ఉన్న ఆచారమే ...ఏడాదికోసారే కదే వచ్చే పండగది ...ఆనందం ఇస్తుందే...మీ తాతగారు వేయించిన ఉయ్యాల...ఆయనే ఉండి ఉంటే చెవులు మెలేసే వారు..'అని ఇంకా పార్వతమ్మ గారు చెప్పబోతుంటే ఇలాంటి ఉపన్యాసాలు అప్పుడప్పుడూ తనకు మామూలే అన్నట్టు సునంద ,'నానమ్మా ...స్నేహిత్ రాళ్ళూ రాప్లూ ...దిస్ ఇయర్ వుయ్ డింట్ గెట్ టయిమ్...అగ్లే సాల్ దేఖేంగే...లెట్ అజ్ సీ...'అని మణిప్రవాళం మొదలెట్టింది.

పార్వతమ్మ గారికిదేం కొత్త కాదు కదా..ఆవిడా ఈ విషయంలో దిట్టే...'ఆ( ..ఏం సీ నో...ఒరే పిల్ల అట్లతద్ది ఆడాలిరా అంటే వినక సముద్రపొడ్డు...చందమామ ..ఆహా ఓహో అంటూ మిమ్మల్ని పట్టుకు పోయాడు మీ నాన్న. పైగా యూ సీ వాట్ పిల్లలు వాంట్ ఐ మస్ట్ డూ ఇట్ ఫర్ దెమ్ అని కూడా అన్నాడు ..ఏమిటో పండగ అంటే అదో దండగ అన్నట్టు రాను రాను తయారౌతున్నారు. సర్లే ...అట్లతద్దా, అట్లాంటిక్కా అంటూ మధ్యలో నాకెందుకీ ఊగిసలాట?..ఈ టీవీయో , మా టీవియో ఏదో ఒకటి చూస్తూ కూర్చోక...' అని కొంచెం విసుగ్గా మొహం పెట్టారు.


‘బయ్ నానమ్మా ...'అంటూ చెయ్యూపి సునంద సెల్ తీసి ‘హాయ్ ఉషా ...కమింగ్ ...వెట్టేమింట్' అంటూ వీత్తలుపు భడాల్నవేసి బయటకి వెళ్ళిపోయింది.

‘మెల్లగానే...పాత్తలుపులవి ...' లోపల్నుంచి జానకి కేకలు. కోడలు జానకి నిజానికి మేనకోడలే పార్వతమ్మ గారికి. తన ఇద్దరి తమ్ముళ్ళ కూతుళ్ళలో ఎవర్ని తన కొడుక్కి చేసుకోవాలా అని పదహారేళ్ళ క్రితం ఆవిడ మనసు ఊగిసలాడింది. అయితే ధర్మారావు ఒక బావగారు కొంచెం కోపిష్టి కావడంతో రెండో శాంతమూర్తి బావగారి కూతురు ఈ జానకినే కొడుక్కి ఓకే చేశారు. మనవరాలు సునంద పుట్టిన రెండేళ్లకే ఆయన కాలం చేశారు.

ఇప్పుడు పార్వతమ్మ గారికి అటు సంప్రదాయం, ఇటు నవోదయం ...ఈ రెంటి మధ్య ఊగిసలాట వల్ల బీపీ గొడవ చేస్తోంది.

ధర్మారావు గారు తొందర పడి పైకి వెళ్ళిపోయారు కాని ఉండి ఉంటే ఆవిడకి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఇదిగో ఇలా కబుర్లు చెప్పుకోవడం ఆయన స్నేహితుడు భజన్ సింగ్ దంపతులు చూసి అర్రే ధరంజీ..వాటే లవ్లీ పెయిరూ...బల్లె బల్లే ..యహా పర్ ఝూలా లటకావో...రాధా కిషన్ జైసే ఆప్ లోగ్ ఝూలియే...అని ఉయ్యాల సిఫార్సు చేశారు. ఊయలూగుతున్న రాధాకృష్ణులున్న పెయింటింగ్ కూడా గిఫ్టుగా ఇచ్చారు.

పార్వతమ్మ గారు టీవీ చూస్తున్నారే కాని అలనాటి, ఇప్పటి ఆలోచనల లోనే ఉన్నారు.

ధర్మారావు గారికి తెలిసిందల్లా టీ – అంటే చాయ్ మాత్రమే. విధి లేక హోటలుకి గాని వెళితే వాడిచ్చే టీ బిల్లు అంటే టీకి అయిన సొమ్ము చెల్లించడమే అని తప్ప ఇప్పటి భాషలో అంటున్నట్టు విడిపోతున్న ప్రాంతం మీది బిల్లు అని తెలియని అమాయకుడు. లేడు కాబట్టి ఆ చింత లేనే లేని అదృష్టవంతుడు.

ఇంతకీ హైదరాబాద్ కేం.పా.ప్రాం. అనే మంత్రానికి తన చింత కాయ రాలుతుందా రాలదా అని చిరంజీవి గారు పడిన డోలాయమాన స్థితి ఎరుగని అదృష్టవంతుడు ఆయన, ఇప్పుడు లేడు కనుక.

అంతెందుకు...ఒకానొక మండే నాడు మీరంతా నేనిచ్చే వండే విందు సమావేశానికి హాజరు కండేం అని షిండే మహాశయుడు నేతల్ని పిలుస్తారని ఆయనకి తెలియదాయె. మూతులు తుడుచుకు రావడమే కాని మాటలు పెగలవు కదా నేతలకి... ఆ దృశ్యం చూడాలా వద్దా అనే ఊగిసలాట ఉండదాయే ఆయనకి, స్వర్గ సీమ వాడు కనుక.

పార్వతమ్మ గారు కనుమరుగైన భర్త ఆలోచన్లు తగ్గించుకోవాలని చదివిన పేపర్నే మళ్ళీ చదవడం మొదలెట్టారు. కోడలు జానకి గమనించక పోలేదు.

‘అత్తయ్యగారూ...అమీ తుమీ తేలేలోగా ఇంకో రెండు తెలుగు పేపర్లు వెయించమందామా ..' అని అనేసి కిసుక్కున నవ్వేసింది.

జానకి నవ్వు కన్నా సునంద అట్లతద్ది నిరసన పార్వతమ్మ గారికి ఇప్పుడో పెద్ద సమస్య.

‘చూడమ్మా జానకీ...మనవరాలు సునంద ఈ ఏడు అట్లతద్ది సంగతే పట్టించుకోలేదు. నువ్వైనా చెప్పి ఉండాల్సిందే. ఇంత పెద్ద ఉయ్యాల మామయ్య కట్టించి ఉంచి ఏం లాభం?' అని మాత్రం అన్నారు.

‘మీరు మరీనూ అత్తయ్య గారూ (సునంద పుట్టక ముందు అత్తా నువ్వు నువ్వు అనే జానకి కాస్త సునంద రాకతో పెద్దరికం అలవాటు చేసుకుని అత్తయ్యగారూ మీరూ అనడం నేర్చుకుంది. ఆమెకా పిలుపుల ఊగిసలాట రాకముందే రవి క్లాసు పీకడం కూడా కొంత కారణమే)...ఏదో మా చిన్ననాటి వరకే గాని ...ఈ తరం వాళ్లకి ఇవన్నీ ఉండాలా ఏమన్నానా?' అని మొహమాటం లేకుండా మొహం మీదే అనేసింది.

నిజానికి జానకి మనసులోనూ ఊగిసలాటే. రవి ఆఫీసు వాళ్ళు తనని మేనరికం సాకుతో పాతతరం మేడం అని ఎక్కడ ముద్ర వేస్తారేమో అని లోలోపల భయమే.

‘వీడేడీ...భాస్కర్ ...ఆటకి వెళ్ళాడా?' –పార్వతమ్మ గోడకున్న పాత గడియారం వైపు చూస్తూ అడిగారు.

‘ఆటకే...' అంది జానకి.

‘అదీ..అలా ఉండాలి...సాయంత్రాలు పిల్లలు పుస్తకాల యంత్రాలు కాకుండా హాయిగా ఆడుకోవాలి. అవునే..సునంద మ్యూజిక్ క్లాస్ కెళ్లాలనుకుంటా..'-పార్వతమ్మ చెప్పుకుంటూ పోతుంటే జానకి అడ్డుపడి, ‘ ఆటంటే...అత్తయ్యా...సాయంత్రం ఆట సినిమాకి వాడు వెళ్ళింది..'అంది. ‘ఓర్నీ ..వీడి చదువు బంగారం కానూ... ఇంతకీ ఏం సినిమా? క్రిష్ ఎన్నోదీ..దానికేనా?' అన్నారు పార్వతమ్మ. ‘అబ్బే.. హిందీ కాదు..అత్తారింటికి దారేది?'-జానకి చెప్పగానే ‘ఓహో..పవర్ స్టార్ సినిమానా?' అన్నారు పార్వతమ్మ. ‘అబ్బో...మీకన్నీ తెలుసునే' జానకి అత్తయ్యగారి భుజం నిమిరింది.

నిజానికి జానకి మనసులో అనుమానం లేకపోలేదు ...కొడుకు భాస్కర్ వేరే సినిమాకి వెళ్ళే ఉంటాడు. పదిహేను రోజుల క్రితమే వాళ్లకి వేరే హీరో నచ్చేసి ఆయన ఫ్యాన్స్ అయి పోయారు కదా అందుకని.

ధర్మారావు గారు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకూ ఇద్దరంటే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కావడం ఆచారం గా ఉండేది. ఒక్కోసారి ఎన్టీ ఆర్ బావుంటే ఒక్కోసారి ఏఎన్నార్ బావుండేవాడు. అంచేత ఈయన ఈ ఊగిసలాట ఎందుకనీ హీరోల్ని పక్కన పెట్టి మ్యూజిక్ డైరక్టర్ ని ఎంచుకున్నారు. ఇది మిగతా వారికి విడ్డూరం గా ఉండేది.

ఆయన కొడుకు రవి శోభన్,కృష్ణ అని కొన్నాళ్ళు, కృష్ణంరాజు,చంద్రమోహన్ అని కొన్నాళ్ళు ఊగిసలాటలో పడి లాభం లేదని నాన్నలా మ్యూజిక్ డైరెక్టర్ వైపు నిలబడలేక సింగర్ వైపు దృష్టి మళ్ళించాడు. సమస్యే లేదు- ఘంటసాల. తప్పిస్తే బాలులే కదా, అట్టే గొడవ లేదు. నాన్నఉన్న టయిం లో ఆయనకి ఘంటసాల. తనకి- లేని ఘంటసాల తో పాటు ఉన్న బాలు. ఇబ్బందే లేదు.

రవి కొడుకు భాస్కర్ ఇంకా చిన్నవాడే కనుక రెండు పిక్చర్స్ లో ఎవడైతే హిట్ అవుతాడో ఆ హీరో అంటే ఇష్టం అనే పద్ధతిలో ముందుకు సాగి పోతున్నాడు. ఇదేమిట్రా అంటే ...ఎవరికీ పూర్వంలాగ డికేడ్స్ గ్యారంటీ లేదు నాన్నా అని ఫిలాసఫీ చెబుతాడు.

జానకికి తన పేరున్న జానకి లాగే తన పేరు కాని సుశీల అన్నా ఎంతో ఇష్టం. పార్వతమ్మ గారు మాత్రం ‘అందరినీ వినాలే..ఒక్కో రాగం ఒక్కొక్కరి గొంతులో అందంగా పలుకు తుంది. ముక్కుతో జమునా రాణి, మురిపెంగా జిక్కి, కోమలంగా కోమల, రాజసంగా రాణి, బహుగళ జాణగా జానకి, సునాయాసంగా సుశీల ' అని అంటుంటారు.

జానకి ‘వెన్నెల తెచ్చాడు మా పాపడు ' అని పాడుకుంటోంది. ‘అవునా...పైగా ఇంటికి దీపం ఇల్లాలు కదా...మనకి కరెంటు ఖర్చే ఉండదు' అని రవి ఒకప్పుడు అన్న మాట తలుచుకుని ముసిముసిగా నవ్వుకుంది.

వీత్తలుపు చప్పుడైంది. రవి వచ్చాడు, జానకి భర్తని చూడగానే ‘నీరు తేనా?' అంది. ‘తే నీరు' అని కొంటెగా అన్నాడు రవి. టీ ఉందా అనే సైగ చేస్తూ.

‘అబ్బాయి ఒచ్చినట్టున్నాడే జానకీ..టీ పెట్టు..' –పార్వతమ్మ ఇలా రోజూ అనడం అది తను వినడం ‘అలాగే అత్తయ్యా' అనడం జానకికి అలవాటై పోయింది. ‘నా మొగుడు నా ఇష్టం' ‘మీ కెందుకూ మధ్య' అనే విసుగు తెప్పించే పెత్తనం ఊగిసలాట ఎందుకని ఆమె నిర్ణయించుకోవడం వల్ల జీవితం సాఫీగా ఉంది ఆమెకి

‘అమ్మా...ఇది విన్నావా..హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అవుతుందా లేదా, కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందా లేదా, ఒకవేళ కేంపాప్రాం అయితే గనుక కేంద్రమే జోక్యం చేసుకుంటుందా, గవర్నర్ చొరవ తీసుకోలేడా అని తలలు పట్టుకు ఊగిసలాడుతున్నారనుకో'- రవి చెబుతున్నాడు. అమ్మ దగ్గర అరగంట కూర్చొనీ ఇలా కబుర్లు చెబుతాడు రవి. రవికి సినిమాలో మ్యూజిక్ రంగం ఇష్టం. కాని ధర్మారావు ఎందుకురా నిలకడలేని సద్యోగం..హాయిగా ఉద్యోగం చేసుకోక అని ఉపదేశించారు కాబట్టి అదా ఇదా అనే ఊగిసలాటకి స్వస్తి చెప్పి ఆఫీసు నుంచి రాగానే ఇంట్లోనే పాడుకోవడం భేష్ అనుకున్నాడు.

‘అవునురా రవీ..ఇందాక విన్నాను...కొత్త రాజధాని అంశం మీద కూడా ఊగిసలాట మొదలైందట.' పార్వతమ్మ గారు అన్నారు.

ఇలా తల్లీకొడుకులు రాజకీయాలు మాట్లాడుకుంటుంటే కూని రాగం తీస్తూ సునంద వచ్చింది. నాన్నని చూడగానే ‘హాయ్ డాడ్...మ్యూజిక్ టీచర్ ఏమిటో ఇవాళ మాల్ కౌజ్, హిందోళం, హిందుస్తానీ హిందోల్ అంటూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఏమిటో ఆవిడకి ఎప్పుడూ ఏదో ఒక డైలమా వే' అంది సునంద.

‘డైలమా? సందేహమా? అదో ఊగిసలాటే తల్లీ' అన్నారు పార్వతమ్మ.

‘దలై లామాకి సైతం టిబెట్టు విషయంలో డైలమా ఉంటుంది' –తన భాషా చాతుర్యానికి తానే మురిసిపోతూ పైకి అన్నాడు రవి.

ఊయల లోగినదోయి మనసే తీయని ఊహల మాలిక పైన...' పాడుకుంటూ వచ్చింది జానకి.

‘ఉష్...ఈ పాటేమిటీ...టీవీ ప్రోగ్రాంలో లాగ. అక్కడ భానుమతి గారివి ఇంకేవి పాటలు లేనట్టు ఈ పాటా ...ఎన్నో రాత్రులు వస్తాయి .. పాటా పాడించేస్తుంటారు పిల్లలచేత..'అన్నాడు రవి. అన్నాడే కాని ‘సా విరహే తవ దీనా...' అని భానుమతి జయదేవ గీతం అందుకున్నాడు.

భానుమతి పాట కాబట్టి ‘జానకీ... మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోల లూగెనే ...పాడవూ' పార్వతమ్మ పాడమన్నట్టు సైగ చేశారు.

‘మీరే బాగా పాడతారు అత్తయ్య గారూ ...ఊ( ..మీరే అందుకోండి' అంది జానకి.

పార్వతమ్మ గారు పాటంతా పాడి చివర్లో ఎక్స్ ట్రా ఆలాపన వేశారు, స్వర కర్త రాజేశ్వరరావు కచేరీల్లో పాడినట్టు.

‘అమ్మకి యమన్ రాగం అంటే ఎంతో ఇష్టం. అదీ రాజేశ్వరరావు వేసే యమన్ చెణుకులున్నాయే అవంటే మరీ ఇష్టం' అన్నాడు రవి అమ్మ వైపు ఆనందంగా చూస్తూ. రాజేశ్వరరావు స్వరమిస్తుంటే తను నోట్ చేసుకుని తతిమ్మా వారికి చెబుతున్నట్టు పూర్వం బంగారు కలలు కనే వాడు. ఎక్కడో తవ్వితే బంగారం వస్తుంది అని చెప్పే కల కంటే జ్ఞాపకాల గొయ్యి తవ్వితే వచ్చే బంగారం లాంటి ఆనందం గొప్పది అని ఆయన ఫిలాసఫి .

‘అమ్మాయీ, నువ్వూ యమన్ అందుకుంటే నేనూ ఆగలేక పోయాను. అందుకనే అందుకున్నాను. అన్నట్టు ..యమన్ అంటే గుర్తొచ్చింది...భజన్ సింగ్ అంకుల్ వాళ్ళు కొడుకు యమన్ లో ఉన్నాడని అక్కడికి వెళతామన్నారు. ఏమిటో ..అక్కడ పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఏమో.' అని పార్వతమ్మ అన్నారు.

‘అమ్మా...అక్కడ రాజేశ్వరరావు కూర్చిన యమన్ రాగం గానీ వీళ్ళు వినిపించారో అక్కడ ఇంక ఎటువంటి ఊగిసలాటలుండవు.' అన్నాడు రవి, జానకి వైపు తిరిగి ‘ఎలా ఉంది నా జోకు' అన్నట్టు కను బొమలు ఎగరేస్తూ. జానకి ముక్కు చివర్లు చిట్లించింది, డోకు అన్నట్టు.

‘జానకి ఊయల అంటూ పాట మొదలెడితే నేను డోల అని అందుకున్నాను. ఊయలా,డోలా అర్ధం ఒకటే. రెండు పాటల రాగం ఒకటే'అన్నారు పార్వతమ్మ.

సామజ వరగమనా ... సాధు హృత్ సాదు హృత్ ..తననన ...కాలాతీత విఖ్యాత' –సునంద త్యాగరాజ కృతి సాధన చేస్తోంది. టీవీలో ప్రకటన వస్తోంది- సంస్కారమంతమైన సోప్ ...

‘సంస్కారం అంతమైన సోప్ ...హహహ ...' అని పగలబడి నవ్వుతూ, ‘జానూ..టీవీ కట్టేసి .శంకరాభరణం క్యాసెట్ పెట్టు' అన్నాడు రవి.

‘సీడీ పెట్టాలి నాన్నా...ఇంకా క్యాసెట్ ఏమిటీ?' సునంద రాగం తీయడం ఆపి నాన్నని దెప్పుతోంది.

‘మీ తాతయ్యకి గ్రామఫోను రికార్డులని ఉండేవి..అవంటే ఇష్టం. మీ నాన్నకి క్యాసెట్టులు...మీరు పెన్నులు వాడరు కాని పెన్ను డ్రైవులు అంటారు' పార్వతమ్మ మారుతున్న వంశాభీష్టాల గురించి చెబుతున్నారు.

‘శంకరాభరణమా? ఓహో...అమ్మాయి పాడుతుంటే మీకు సోమయాజులు గారిలా**** పాట చివర్లో సునందా అని అరవాలని ఉందా?' జానకి రవి వైపు తిరిగి అనేసి, నవ్వుతూ సామజ వరగమనా పాట పెట్టేందుకు లోపలికి వెళ్ళింది.

‘ఎవరో చెప్పారర్రా ...త్యాగరాజ స్వామి వారి సామజ వరగమనా పాడమంటే శంకరభరణం సినిమా డ్యూయెట్టు పాడిందట ఒకానొక సింగరు. సరే కాని..సినిమా పాట పెడితే పిల్ల అసలు కీర్తన మరచి పోతుందిరా. తన మానాన తను ప్రాక్టీసు చేసుకుంటుంటే ఎందుకురా డైవర్ట్ చెయ్యడం?' పార్వతమ్మ కొడుకుని మందలిస్తూనే ‘నాకు తెలిసి హిందోళ రాగంలో మూడో నాలుగో కీర్తనలు రాశార్రా స్వామి వారు ..జానకీ ఏదమ్మా ...త్యాగరాజ కీర్తనల పుస్తకం తెద్దూ' అన్నారు.

జానకి కీర్తనల పుస్తకంలో విషయసూచిక చూస్తూ వేళ్ళతో హిందోళ రాగం ఉన్న చోట్లు స్పర్శిస్తూ ‘అవునండీ అత్తయ్యా ... ఎంతో పాపులర్ అయిన సామజ వరగమనా ఒకటైతే ఇంకో రెండు ఉన్నాయి- చలమేలరా సాకేత రామా...ఒకటి, మనసులోని మర్మమును తెలుసుకో మాన రక్షకా...ఇంకోటి,' అని ఆగింది.

‘అదే భక్త కవి రామదాసు గారు ఈయన కన్నా మునుపటి తరం వారు కదా ...హిందోళ రాగంలో ఏ ఒక్క కీర్తన చేయనే లేదు. ఆయనకన్నా ఇంకా వెనకటి తరం వాడైన తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలకి నలభై ఏళ్ళనుంచి రాగాలు కడుతున్నారు కనుక కొండలలో నెలకొన్న కోనేటి రాయడు , దేవునికి దేవికిని తెప్పల కోనేరమ్మా వంటి కీర్తనలు హిందోళ రాగంలో స్వర పరిచారు.'-నానమ్మ ఇలా చెబుతుంటే ఆసక్తిగా వింటోంది సునంద.

‘ అమ్మా... ఈ మధ్య త్యాగరాజ కీర్తనలు ఆయన నిర్దేశించిన రాగాలేనా లేక హిందుస్తానీ పద్ధతిలో ఎవరికి తోచిన రాగాల్లో వారు పాడుకోవచ్చునా అనే ఊగిసలాట కొందరికి మొదలైంది.'-అన్నాడు రవి.

‘రోజులు ఇలాగే మారిపోతూ పైత్యాలు పెరుగుతాయి. వనభోజనం పేరు చెప్పుకుని నాన్ వెజ్ తింటే తప్పా అని రేప్పొద్దున్న కార్తీక మాసంలో విందులు చేసుకున్నా చేసుకుంటారు. ఎవరి వెర్రి వారికానందం. జానకీ...మనవడు కొమ్ము మిఠాయి అంటూ నిన్న గొడవ చేశాడు. చేద్దామా ఏమిటీ'- నానమ్మ మాటలకి ఉలిక్కి పడింది సునంద, తమ్ముడు సినిమా నుంచి రాగానే పిజ్జా ఆర్డర్ చేయాలి అన్న విషయం గుర్తొచ్చి. అమ్మ వైపు చూసింది.

జానకి మాట మార్చే ప్రయత్నంలో ‘సునూ .. నానమ్మకి హిందోళం ఆరోహణ అవరోహణ చెప్పవే' అంది.

సునంద చెప్పబోతుంటే రవి ‘శుద్ధ హిందోళంలో ఆ రిషభం ఎలా వచ్చిందీ?' అని శంకరాభరణం సోమయాజుల్లా గర్జించాడు.

‘ఏంటి నాన్నా నువ్వు మరీనూ' అంది.

‘అమ్మా...శంకరాభరణం విశ్వనాథ్ గారి ధర్మమా అని హిందోళరాగం అందరికీ పట్టు బడింది. అందులో రిషభ స్వరం ఉండదని మరీ తెలిసింది. సునూ ...'అని కూతురికి ఏదో చెప్పబోతుంటే పార్వతమ్మ అన్నారు-‘ప - స్వరం కూడా ఉండదురా'.

‘నానమ్మా...బృందావనంలో కృష్ణుడు గోపికల మధ్య నిలబడి మురళి మీద హిందోళ రాగం వాయించేవాడట కదా..మా టీచరు చెప్పింది'- సునంద అందుకుంది.

‘టీచరు చెప్పారు అని అనాలి సునూ' –జానకి మందలింపు.

‘అదే...టీచరు చెప్పారు' అని సర్ది చెప్పింది సునంద.

‘సునూ...హిందోల్ అని హిందుస్తానీ లో అంటారు. ఇక్కడ దోల్ అంటే ఉయ్యాల అనే అర్ధముంది. హిందోల్ రాగం కల్యాణ్ థాట్ కి చెందింది.' అన్నాడు రవి.

పార్వతమ్మసునంద వైపు తిరిగి ‘కర్నాటక సంగీతంలో 72 మేళకర్త లెలాగో హిందుస్తానీ పధ్ధతిలో 10 థాట్ లని ఉంటాయి.' అన్నారు.

‘అమ్మా ...ఇందాక ఊయల లూగినదోయి, కన్నుల వెన్నెల డోల లూగెనే ..అన్న రెండు పాటల్లో ఉయ్యాల శబ్దం ఉన్నా అవి హిందోల్ రాగంలో లేవు, యమన్ కల్యాణి లోనే ఉన్నాయి. యమన్, హిందోల్ రెండూ కల్యాణ్ థాట్ లో ఉండడం వల్ల ఇక్కడ బాగానే కుదిరింది జోడీ.' అన్నాడు రవి.

‘అంటే..హిందోళ రాగంలో ఉన్న పాటల్లో ఉయ్యాల పదం ఉండాల్సిందే అంటారా ఏమిటి?'అంది జానకి.

‘అన్నీ కాకపోయినా కొన్నింట మాత్రం ష్యూర్ గా ఉన్నాయి జానూ ...గుర్తొస్తున్నాయి..చెబుతా... నన్ను వదలి నీవు పోలేవులే...అనే పాటలో ఉయ్యాల పదముంది. చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోన –పాటలో ఉయ్యాల పదముంది. మావి చిగురు తినగానే కోవిల పలికేనా ... ఇందులోనూ ఉయ్యాల ఉంది. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ... పాటలో ఊయల ఉంది.'అంటూ ఆలోచనలో పడ్డాడు రవి.

పగలే వెన్నెల ..జగమే ఊయల ' అని అందుకుంది జానకి.

‘ఫరవాలేదే..నాట్ బ్యాడ్...' జానకి భుజం తట్టాలని చెయ్యెత్తి అమ్మ ఎదుట బావుండదని దించాడు రవి. జానకి మాత్రం ‘సునూ..జరా సునావో ...నీకు ఏదైనా జ్ఞాపకం వస్తోందా?' అంది.

‘నాన్నా...గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి....పాట...' అంటూ ఆగింది సునంద.

‘పూర్తిగా పాడరాదటే సునందా...'అని ఊ( కానీ అనేలా చెయ్యూపారు పార్వతమ్మ.

కూతురు పాట పూర్తి చేసేలోగా హిందోళ ప్పాటల్లో ఉయ్యాల పదాన్వేషణ ధ్యాసలోనే ఉన్నాడు రవి.

‘చివురులు ముట్టదు చిన్నారి కోయిల...చిలక ఊగదు కొమ్మ ఊయల...గున్నమామిడి కొమ్మమీద...' అని పాత పాట పూర్తిగా పాడేసింది సునంద.

‘జానూ...వీణ వేణువైన సరిగమ విన్నావా?..' అని ఆగాడు రవి.

‘ఓ ఓ ..తీగ రాగమైన మధురిమ కన్నావా?' అంది జానకి.

‘ఒరే ఒరే..మీ ఇద్దరు బృందావన్ గార్డెన్స్ లో డ్యూయెట్టు మొదలెట్టారా?' అన్నారు పార్వతమ్మ.

ఇద్దరూ సిగ్గు పడ్డారు. ‘అమ్మా..వేటూరి వారి ఈ పాటలో ఉయ్యాల పదముంది. ఇది రాజన్ నాగేంద్ర ల అద్భుత హిందోళ' అని కితాబిచ్చాడు రవి.

ఇళయరాజా గారు కూడా హిందోళం బాగా ఇష్టపడతారు కదండీ' అంది జానకి, సాగర సంగమమే, ఓం నమశ్శివాయ వంటి పాటలు తలుచుకుంటూ.

‘యసెస్...యూ ఆర్ కరెక్ట్. ఆయన కట్టిన హిందోళ ప్పాట - రంగులలో కలవో ... ఉంది చూడు..ఏదీ ...అదే..అబినందన సినిమాలోది... ఆ పాటలో ఉయ్యాల పదముంది'అన్నాడు రవి.

‘కాని ఒకటర్రా...సంగీత దర్శకుడు హిందోళ ట్యూన్ ఇచ్చి పాట రాయమంటే కవికి ఉయ్యాల పదం వెయ్యాలని తోచిందా? కవి ఉయ్యాల పదం వేసి ఇస్తే స్వర కర్తకి హిందోళ రాగం స్ఫురించిందా? అన్నది చెప్పడం మన వల్ల కాదు.' అన్నారు పార్వతమ్మ.

‘అదో డోలాయమాన స్థితి' అన్నాడు రవి, నవ్వేస్తూ.

‘తన కీర్తనలకి తానే స్వరం కట్టుకున్న త్యాగరాజుల వారు హిందోళ కీర్తనల్లో ఉయ్యాల పదం వెయ్యనే లేదండీ అత్తయ్యా. ఉయ్యాల లూగవయ్యా అన్న ఉత్సవ సంప్రదాయ కీర్తన నీలాంబరి రాగంలో ఉంది' అంది జానకి.

‘మనం కొంచెం ఆలోచిస్తే తెలిసేదేమిటంటే – ఏదైనా పాటలో డోలాయమాన స్థితిని వ్యక్తం చెయ్యాల్సి వచ్చిందనుకో ..అప్పుడు ఆ పాటకి హిం‘డోల' రాగం బావుంటుంది' అన్నాడు రవి.

‘ఉదాహరణలు స్వామీ' అంది జానకి.

ఈ వీణ పైన పలికిన రాగం – నాలోన విరిసిన అనురాగం ...పాట ఉందా...అందులో కలిమి,లేమి అనే డోలాయమాన స్థితి ఉంది. మనసే అందాల బృందావనం .వేణు మాధవుని పేరే మధురామృతం ..పాట ఉందా... అందులో రాధ, సత్యభామల మధ్య కృష్ణుడి మానసిక డోలాయమాన స్థితి ఉంది.' అన్నాడు రవి.

‘రాధా కృష్ణులంటే గుర్తొచ్చింది ...చూడు మదే చెలియా కనుల ....ఏ ఎం రాజా గారి పాట లో నారి నారి నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి ...అనే మాటలొస్తాయి. ఇదీ డోలాయమాన స్థితే కదా' అంది.

లవకుశ పాట చెప్పండర్రా... సందేహించకు మమ్మా రఘు రాము ప్రేమను సీతమ్మా .. ' పార్వతమ్మ పాడారు.

‘అమ్మా ...మామూలుగా హిందోళం, మాల్ కౌజ్ రాగాలు ఒకటే అంటారు. రెండిట్లోనూ రి,ప స్వరాలుండవు. కాని హిందుస్తానీ సంగీతంలో మాల్ కౌజ్ రాగం భైరవి థాట్ లో చేరింది. హిందోల్ ఉత్సాహ భరితంగా ఉంటే మాల్ కౌజ్ లో సాంత్వనం ఎక్కువంటారు' అని ఆగాడు రవి.

‘అన్ని తేడాలు, రాగం పాడే వేళలు...ఇవన్నీ అప్పటి దర్బారుల్లో కుదిరేవి. ఇప్పుడు కష్టం. రాగం లోని మాధుర్యానికి ఆస్వాదించే గుణమే ఉండాలి కాని కఠోర నియమాలతో వాటికి దూరమైపోకూడదు. సరే గానీ ...క్యాసెట్లు వెదికి టివి రాజు గారి హిందోళ ప్పాటలు వినిపించరా రవీ' అన్నారు పార్వతమ్మ.

‘జానూ... అమ్మ అన్నది నిజం.. రాజు గారి మాల్ కౌజుల మెలోడీ అద్భుతం అనుకో..' అన్నాడు రవి.

‘నానమ్మా...నెట్ లో వెతకనా?' సునంద అంది.

‘మనం ఏదడిగితే అది దొరకాలంటే కుదరదే తల్లీ ...శోధించి సాధించాలి అదియే ధీర గుణం' అన్నాడు రవి.

మా వారు శ్రీవారు ..మా మంచి వారు...' పాట అందుకుంది జానకి.

‘అందులోనూ ఊయల ఉంది శ్రీమతీ' అన్నాడు రవి.

‘అది రాజేశ్వరరావు స్వర పరచిన భానుమతి పాట ...యమన్ సుమీ' అన్నారు పార్వతమ్మ.

తలుపు చప్పుడైంది. భాస్కర్ తోసుకుంటూ వచ్చాడు.

‘యూ మిస్సుడ్ ఏ గ్రేట్ మ్యూజికల్ ఈవెనింగ్ రా బాసీ' అంది సునంద.

‘సో వాట్ ..వేర్ ఈజ్ మై పిజ్జా?' అన్నాడు భాస్కర్.

‘పిజ్జాలు నింపవురా బొజ్జలు. ఇంతకీ ఏమంటాడు మీ పవర్ స్టార్..'అన్నారు పార్వతమ్మ మనవడు కాళ్ళు కడుక్కుంటుంటే.

‘సినిమాకి వెళ్ళలేదు నానమ్మా. మా ఫ్రెండు రాబర్ట్ లేడూ...యమహా కీ బోర్డ్ కొన్నాడు... రమ్మన్నాడు. ఓహ్. చాలా ఒచ్చేసింది నాకు...డాడ్... లెట్ అజ్ బయి ..ఓకే ...' అన్నాడు భాస్కర్.

‘అప్పుడు నేను మాల్ కౌజ్ ట్రై చేస్తా ...' అంది సునంద.

‘వాట్ కౌజ్... క్యా మాల్ ? వాట్స్ గోయింగాన్?' భాస్కర్ కంతా అయోమయంగా ఉంది.

‘చెప్పింది కదరా... యూ మిస్సుడ్ ఏ గ్రేట్ మ్యూజికల్ ఈవెనింగ్ అనీ' అంది జానకి.

‘అమ్మా...బాసి కంతా అయోమయంగా ఉంది' అంది సునంద.

‘కాదు...నాన్న కీ బోర్డ్ కొంటాడా కొనడా అని డోలాయమాన స్థితిలో ఉన్నాడు. అవునా కాదా ఆస్క్ హిం'అంది జానకి.

‘వాట్..హిం ...కౌన్ డోల్ బాజే ...వాట్ యమన్ స్థితి? అన్నాడు భాస్కర్.

‘హారి పిడుగా... మనం గమనించలేదు... వీడే బెట్టర్..ఇక్కడ లేకుండానే యమన్, హిందోల్ అంటూ అన్నీ వల్లించేశాడు.' అన్నాడు రవి.

‘తొందరగా బోయినాలు చేసేసి పడుకోండర్రా..' అని ఆవులిస్తూ పార్వతమ్మ గారు సోఫాలో నడుం వాల్చారు.

-------------------------------------------------------------------------------------------------------------------------

కనులు చూసినా పాటే - ఎనిమిది ‘హిందోళ' రాగంపు మధురిమలు , పైగా ‘ఉయ్యాల' అనే పదమున్న సరిగమపలు...తప్పు తప్పు...స గ మ ద ని లు!

కనులు మూసినా పాటే -ఇటా ఆటా, ఇదా అదా అని ఊగిసలాడే మన మనసుని నిలకడగా ఉంచేందుకు స్వర కర్త తోటకూర వెంకట రాజు...అదే...టి వి రాజు గారు అందించిన ఆరోగ్యకర ‘హిందోళ' స్వర గుళికలు

మీకో పరీక్ష: టి వి రాజు గారి ఈ ‘హిందోళ'ప్పాటలు విన్నాక కనుక్కోండి చూద్దాం- ఒక పాటలో ‘ఊయల' పదం ఉంది.

ఏ పాట అది? (జవాబు ఇవ్వాలా వద్దా అని మీకు, వస్తుందా రాదా అని నాకు ఒకే డోలాయమాన స్థితి!)

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 23 నవంబర్ 2013