Krishnaprema Logo

కృష్ణప్రేమ

నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం వెరసి ఎన్.టి.ఆర్ అనే మణిహారం ----

21 జనవరి, 2012

నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం వెరసి ఎన్.టి.ఆర్ అనే మణిహారం ----

నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం వెరసి ఎన్.టి.ఆర్ అనే మణిహారం ----

Picture

నంటారా కాదంటారా? 'నందమూరి తారక రామారావు ' అనే బృహత్ మేరు పర్వత శిఖరాన్ని మనో దర్పణంలో చూసుకుంటే ఎన్.టి.ఆర్ అనే సంక్షిప్త రూపంగా కనిపిస్తుంది. అంతే కాదు- ఆ పొడి పొడి మూడక్షారాల వరస నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం అనే కలబోత మణిహారంలా అనిపిస్తుంది.

నటరత్నం - సరే సరి. తిరుగులేని సత్యం. అది ఆయనని వరించిన తొలి బిరుదు. సినీ కళామతల్లి బిడ్డలలో అటువంటి వారే అరుదు. తలపెట్టిన సినీ రంగ 'నటన' అనే వృత్తిలో భాగంగా 'దర్శకత్వం' అనేది అవతల పెట్టక రెండిటినీ సమపాళ్ళలో రంగరించడం ఆయనలాగ అందరికీ కుదరదు.

తెలుగు వజ్రం?- ఇంద్రుడి చేతిలో 'పవి ' అనే వజ్రాయుధం ఉండేదట. అన్యాయం మీద ఆ ఆయుధం ప్రయోగించేవాడట. తన ఎడమ చేతిని మడిచి ఒక్క వేలే చెంపల్ని తాకిస్తూ ఆత్మీయంగా చూస్తున్న ఆ తెలుగు చూపు లోనూ 'పవి' ఉంది. ఎటొచ్చీ అది 'పవర్ ఫుల్ విస్ డం' అనే ఇంగ్లీష్ మాటల పొడి పొడి రూపం. అదే ఆయన వజ్రాయుధం. అందులో 'తెలుగు వారి ఉనికి', 'ఆత్మాభిమానం' అనే తీక్ష్ణమైన వెలుగులు దాగి ఉన్నాయి. తెర మీది 'కధానాయకుడు ' అంచెలంచెలుగా ఎదిగి తెలుగు 'దేశోద్ధారకు లు' కావడమన్నది ఆ 'పవి' చలవ లేదా గరిమ. ఇదే ఫోటో తెలుగు వారి ఇళ్ళల్లో మూడు-నాలుగు దశాబ్దాలు అభిమాన దేవుడి పటంగా గోడకానుకుంది. చిత్రం ఏమిటంటే 'కధానాయకుడు ' చిత్రంలో ఆయన కుడి చెయ్యి చాచి 'వినవయ్యా రామయ్యా ' అన్నప్పుడు ఆయన కూడా అనుకోలేదు మరో దశాబ్ద కాలంలో ఎడమ చెయ్యి చాచి జనాన్ని కదిలించే 'అన్న' గా మారబోతాడని. అదీ నియంత్రణ, క్రమ శిక్షణ అనే రెండు వైపుల పదను ఉన్న 'పవి' మహాత్మ్యం. రెండు చేతులా పని ఉన్నప్పుడే మొండి శక్తి ఆవరిస్తుంది. అందుకే ఎన్.టి.ఆర్ మధ్య రూపం- తెలుగు వజ్రం.

రాత ముత్యం?- ఆయన సన్నిహితులూ, స్క్రిప్ట్ చేజిక్కించుకున్న సినీ హితులూ చెప్పే మాట ఇది. ఆయన రాసే అక్షారాలు ఒద్దికగా, పొందికగా, ఓపికగా, నింపాదిగా, నిబ్బరంగా, ఒడిదుడుకులు లేకుండా యోగా ముద్రలో ఉన్నట్టు ఉండేవి. అవే రాత ముత్యాలంటే!


అయ్యారె! ఎన్.టి.ఆర్ అంటే 'ఇంతా' అనుకునీ అవాక్కయ్యారే. ఒక్కసారి గతంలోకి రమ్మని స్వాగతం పలుకుతాను. కనులు మూసినా పాటే అనేది తెరవండి. నాలుగు స్తంభాల్లా నాలుగు పాటలుంటాయి. ఎన్.టి.ఆర్ అనగానే డా. సి. నారాయణ రెడ్డి కవి గారు కళ్ళ ముందు మెదలుతారు. ఆయన చేత సినిమా పాట రాయించి తీరాలనే 'పవి' ఉన్నవాడు కనుకనే ఎన్.టి.ఆర్. ఆయన్ని తన 'గులేబకావళి కథ' చిత్రంతో పరిచయం చేసి ఆయన్ని తన మదిలో దాచుకునీ ఈయన్ని మన హృదయాలు దోచుకునేలా చేశారు. 'అయ్యారె ' అని ఆనాడే సి.నా.రె రాతలు చూసి ఎన్.టి.ఆర్. ఆశ్చర్యపోయి ప్రశంసించారు కాబోలు (నాకు తెలిసి) నాలుగంటే నాలుగు సార్లు 'అయ్యారె ' పద ప్రయోగం చేస్తూ నాలుగు పాటలు కేవలం ఎన్.టి.ఆర్. పాత్రలకే కూర్చారు సి.నా.రె. ఆ నాలుగు స్తంభాల పాట పందిరి 'కనులు మూసినా పాటే ' అన్నంత అందంగా కనిపిస్తుంది. ఈసారి ఔనంటారా? అనరు మరీ- రాజేంద్ర ప్రసాదు ఇదే జనవరిలో నిన్నంటే నిన్నే 'అయ్యారే ' అనే టైటిల్ తో సినిమా చేసి తయ్యారై పొతే!

(అయ్యారే - పద ప్రయోగం సినిమాల్లో తొలిసారిగా ఎవరు చేశేరో? 'వివాహ భోజనంబు ' -మాయాబజార్(1957) - పాటలో పింగళి వారి చేతి చలవగా 'అయ్యారె బూరెలిల్ల ' అంటూ తమాషాగా పాడగా విన్నాం. తరువాత ' కలిమి లేములు ' (1962) చిత్రంలో మల్లాది శాస్త్రి వారి భావ గరిమగా ఒకే ఒక్క పాటలోనే నాలుగు సార్లు 'అయ్యారె ' మాట వినిపించింది. పైగా పాట కూడా పల్లవిలోనే 'అయ్యారె ' అంటూ ఆరంభమైంది. అది కోలాటం పాట - కృష్ణుడి మీద. మాయాబజార్ లో తొలిసారిగా 'నూటికి నూరు పాళ్ళు' కృష్ణుడు గా పాత్ర పోషించి ఇక కృష్ణుడంటే ఎన్.టీ.ఆరే అని అనిపించుకున్న రామారావు గారికి మరోసారి కోలాటంలో 'అయ్యారె ' మాట కోలాహలం చెవిని పడింది కాబోలు కుతూహలంతో సి.నా.రె. చేత 'అయ్యారే' అని అనిపించుకున్నారు. లేదా ఎన్.టీ.ఆర్. కవళికలు ఎరిగిన సి.నా.రె ఆయన అడగకుండానే ఎదుట తెరచి ఉంటారు 'అయ్యారె ' మాట ఖజానా).

అలనాటి ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణ రూపం లేక ఇలా నేడు వెండి తెర మీద ఏదో వెలితి కానవస్తోంది. 'సీతా' అని స్తంభం ఆనుకునీ విలవిలలాడే శ్రీ రామ రూపంలో ఆయన తెర మీద కనపడగానే గుండె చెరువైన ప్రేక్షకులు మరో శ్రీరామ రూపానికి చేరువ కాలేక పోతున్నారు. రావణ పాత్ర వేసి రుద్రవీణ మ్రోగించినా, కర్ణ పాత్ర వేసి కుంతీదేవి కంట తడి పెట్టించినా, దుర్యోధనుడిగా పౌరుష మీసం మెలి తిప్పినా ప్రేక్షకుల్లో తన్మయత్వం, విస్మయం, అద్భుత వశీకరణం. అవన్నీ మళ్ళీ మళ్ళీ రాక, ఉన్న వాళ్ళలో చూడ లేక దిగాలు పడి పోయింది వెండి తెర. వేరే పాత్రల అసహనంతో పని పెంచుకుంది సెన్సార్ కత్తెర.

'కనులు చూసినా పాటే ' క్లిక్ చేస్తే - నాలుగు ఎన్.టీ.ఆర్. పాట దృశ్యాల్ని చూడ వచ్చు. మాయాబజార్ చిత్రంలో సూత్రధారి శ్రీకృష్ణుడే అయినా పాటలన్నీ అభిమన్యుడివే. పాత్ర తప్ప పాత్రధారి ముఖ్యం కాదనుకునే స్వభావం ఎన్.టి.ఆర్ గారిది. అయినా ఎంతో రమ్యంగా, చాక చక్యం గా దర్శక మహాత్మ కె.వి.రెడ్డి గారు 'లాహిరి లాహిరి లాహిరి లో ' అనే నౌకా విహారం పాట కొన సాగింపు లో కృష్ణబలరాములిద్దరినీ ప్రవేశ పెట్టారు. ఆ పాట ఇక్కడ ఉందేమో అని వెతికేరో --కష్టమే. మీ మనసుల్లోనే ఉందన్న సంగతి మరచిపోయారా? 'రసపట్టులో తర్కం కూడదు '!

ఎన్.టీ.ఆర్ గొప్ప కళాకారుడే కాదు గొప్ప సమాజ శ్రేయోభిలాషి. యాభైల కాలంలో సినీ రంగం 'మనదేశం ' సినిమాలో హీరోగా ఆయన చేత తొలి అడుగు వేయిస్తే ఎనభైల కాలంలో 'తెలుగు దేశం ' ఆయన్ని రాజకీయ రంగం లోకి మలుపు తిప్పింది. ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆయనకెందరో మిత్రులుండేవారు. అందులో ప్రముఖులు వీరమాచనేని మధుసూదన రావు. విక్టరీ మధుసూదన్ రావ్ గా పేరు పొందిన ఈయన దర్శకత్వంలో వచ్చిన 'వీరాభిమన్యు ' (1965) ఒక అద్భుత చిత్రరాజం. అందులో శ్రీకృష్ణుడి రాజసం అంతా 'నల్లనివాడా రారారా ' పాటలో చూపించారు. విక్టరీ ఇటీవల కన్ను మూసారు. వారిని తలుచుకుంటూ ఆ పాట చూడండి. సంగీత సరస్వతి ఎస్.జానకి కృష్ణ భక్తురాలు. కృష్ణ గానం ఆలపిస్తే ఆమెలో మీరా పరకాయ ప్రవేశం చేస్తుంది.

ఎన్.టి.ఆర్. లోని దర్శకత్వ ప్రతిభ కూడా అసామాన్యమే. అంతవరకూ కృష్ణుడు లో 'కృ ' కష్టపెడుతూ ఉంటే అందరూ పలికే 'క్రి ' ని వాడుకుంటే నష్టమేముందీ అని తన సినిమా టైటిల్ ని 'శ్రీక్రిష్ణ పాండవీయం ' గా మలచిన ధైర్యశాలి ఎన్.టి.ఆర్. 'మత్తు వదలరా ' పాట సంగీత దర్శకుడు టి.వి.రాజు ముద్ర చూపించే పాట. టి.వి.రాజు, ఎన్.టి ఆర్. వారికి అత్యంత ఆప్త మిత్రులు. వీరు ఒకే గదిలో ఉండేవారట మదరాసు సినీ దశలో.

సహజకవి గా పేరు పొందిన మల్లెమాల ఇటీవల దైవాలంకృతమయ్యారు. అసలు పేరు ఎం.ఎస్.రెడ్డి అయిన ఈయన 'శ్రీకృష్ణ విజయం' సినిమా ఎన్.టీ.ఆర్ తో తీశారు. సాధారంగా శ్రీకృష్ణుడి పాత్రలున్న సినిమాలకి పెండ్యాల వారుగానీ, రాజు గారు గానీ సంగీతం కూర్చాల్సిందే. పెండ్యాల వారు ఈ సినిమాలో వినిపించిన 'పిల్లనగ్రోవి పిలుపు ' పాటలో లో పిల్లన -క్రిందికి, గ్రోవి- పైకి వచ్చేలా చూడడమే కాదు 'మెలమెల్లన' అన్నప్పుడు నిజంగానే మెలమెల్లగా పడుతున్న అడుగులు స్ఫురణకి వచ్చేలా చేశారు. ఎన్.టీ.ఆర్ లోని కృష్ణుడు తొలిసారిగా 'స్టెప్స్' వేసిన సినిమా పాట ఇది.

నాలుగో పాట 'విన్నారా అలనాటి వేణుగానం '. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు అలనాటి యాభయిల్లోనే సంగీతం చేస్తూ ఓ పదకొండేళ్ళ విరామం తరువాత డబ్భైల్లో తన రెండో ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఆ ఊపులో దాదాపు పదిహేనేళ్ళు తన సత్తా చూపేరు. ఎన్.టీ.ఆర్ గారి చిత్రం ఒకే ఒక్కటి ఆయనకి దక్కడం అందులో ఘంటసాల-బాలు ల కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి పాట ఉండడం విశేషం. 'దేవుడు చేసిన మనుషులు ' (గురజాడ అప్పారావు గారి కథకి సగం శీర్షిక ఇది, ఐతే ఆ కథకి ఈ సినిమాకి సంబంధం లేనే లేదు) లో ఆ పాట కాదు మీరు చూసేదిక్కడ. ఇది వేణు గానం కదా- ఎన్.టి.ఆర్ కృష్ణుడి గా కనపడీ చాలా ఏళ్ళైన కారణంగా ఈ పాటలో 'సాకి' పాడుతుంటే కృష్ణుడిగా ప్రత్యక్షమౌతారు ఆయన. లేని మురళి వాయిస్తున్నట్టు ఎన్.టి.ఆర్ నటిస్తారు కూడా. చారుకేశి,కళావతి,మలయమారుతం,చక్రవాకం మేళవించి నాయుడు మెత్తగా పలికిస్తే అంతే హృద్యంగా నటించారు ఎన్.టీ.ఆర్. ఆ పక్కన ప్రత్యక్ష సాక్షి ఎస్వీ రంగారావు గారు.

(ఈ చివరి రెండు పాటల్లో అభినేత్రి జయలలిత యే కావడం కాకతాళీయం. వీరుభయులూ ముఖ్య మంత్రులు కావడం చరిత్ర పాఠం).

ఎన్.టి.ఆర్ కృష్ణుడు కానీ కాకపోనీ, ఒకటి రెండు సినిమాల్లో కృష్ణ గల్పికలు చోటుచేసుకున్నాయి. కృష్ణుడుగా నటించిన మాయాబజార్ చిత్రంలో కృష్ణుడి ఎదుటే చిన్ని కృష్ణుని లీలలు ప్రదర్శించే గేయ గల్పిక నొకటి కల్పించారు. పింగళి వారి అద్భుత పద జాలం, ఎన్.టి.ఆర్ వారి చ మందస్మితం ఎవరు మరవగలరూ? ఎన్.టి.ఆర్ కృష్ణుడు కాని 'డాక్టర్ ఆనంద్ ' చిత్రంలో దేవులపల్లి కవి 'నీల మోహనా రారా ' అనే గేయ గల్పిక రాశారు.

ఇలాంటి గేయ గల్పికలు ఎన్.టి.ఆర్ వారి సినిమాల్లో తరచూ సాక్షాత్కరిస్తాయి. దేవులపల్లి వారు 'శ్రీరామ పట్టాభిషేకం 'లో ముచ్చటైన గల్పికలు ఎన్నో రాశారు. 'మాయని మమత ' చిత్రంలో వాసవ దత్త వృత్తాంతం ఒక గేయ గల్పికే. 'ఏకవీర ' లోనూ అటువంటి గేయ గల్పిక -సి.నా.రె. వారిది- ఉంది.

ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఎన్.టి.ఆర్. లో మంచి సాహిత్యాభిలాష ఉండేది, అది ఆయన నటించిన సినిమాల్లోనూ, దర్శకత్వంలోనూ కనిపిస్తూ ఉండేది అని పునర్వ్యక్తీకరించడానికే. కొన్ని ప్రబంధాలు సినిమాలకి నప్పవు అని ఆయన వాపోతుండేవారట.

అసలు ఎన్.టి.ఆర్ లోని నటుడిని వెలికి తీసింది ఆయన గురువుగారైన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారే. ఆయన జ్ఞానపీఠ కవి. అలాగే ఎన్.టి.ఆర్ వెతికి తీసుకొచ్చిన కవి డా. సి.నారాయణరెడ్డి(ఈయన అసలు పేరు కూడా సత్యనారాయణే) గారు కూడా ఆనకజ్ఞానపీఠం అధిరోహించినవారే. పైగా 'విశ్వంభర ' సంపుటిలోని 'విశ్వ ' అటు విశ్వ నాథ వారిని సూచిస్తోంది కూడా. ఎన్.టి.ఆర్ తన గురువుగారి 'ఏకవీర ' రచన సినిమాగా మారుతుంటే హర్షించారు. హృద్యంగా నటించారు. ఈ ఏకవీర చిత్రానికి తొలిసారిగా డా. సి.నా.రె. మాటలు రాశారు.

దేవులపల్లి వారు కూడా తొలిసారిగా సినిమాకి మాటలు రాయడం 'మల్లీశ్వరి' చిత్రం కోసమే జరిగింది. అందులో ఎన్.టి.ఆర్ శిల్పి నాగరాజుగా అవతరించారు (ఈ పాత్రల ప్రభావం ఎంతటిదంటే డా. మల్లీప్రియ నాగరాజు అనే వ్యాసకర్త కది పేరై పోయింది). ఈ చిత్రంలోనూ దేవులపల్లి వారు ఒక యక్ష గాన గల్పిక రాశారు.

వేటూరి సుందరరామమూర్తి వంటి కొత్త తరం ప్రతినిధిని సినిమా రంగానికి ఆహ్వానిస్తే తెలుగు బతికి బట్ట కడుతుందని ఎన్.టి.ఆర్. ఆయన్ని మందలించి మరీ లాక్కొచ్చారట. లేకపోతె ఒక పాత్రికేయుడిగా మిగిలిపోయేవారు వేటూరి.

ఎన్.టి.ఆర్ లో మరో విశేషం- పాటని అనుభవిస్తూ అభినయించడం. కొన్ని పాట సీన్లు చూస్తే తెలుస్తుంది ఆయన కంఠం కదలికలు ఎంత సహజంగా ఉంటాయో. అంతేకాదు అడపా దడపా ఘంటసాల వారితో గొంతు కలిపేవారు కూడా. 'వచ్చిండన్నా ''వచ్చాడన్నా ' అన్న రెండు ముక్కలు ఆయన అనడం, జనం వాటిని 'తారక (రామ) మంత్రం' లా తీసుకోవడం నాటి రోజుల విశేషం.

ఎన్.టి.ఆర్ ,ఏ.ఎన్.ఆర్ అనే రెండు మహా వృక్షాలు ఘంటసాల గానామృతంతో ఎదిగినవే. ఘంటసాల వారి మరణం ఎన్.టి.ఆర్ గారికి నిజంగా వృక్షానికి గొడ్డలి పెట్టు లా అయిపోయింది. ఐతే మారుతున్న కాలాన్ని తొందరగానే స్వీకరించి ఎన్.టి.ఆర్. తన నటనని ఒక కొత్త మలుపు తిప్పారు. ఎస్.పి. బాలు గళం సహకరించింది. బాలు 'ఏకవీర ' లో తొలిసారిగా ఎన్.టి.ఆర్ గారికి 'ఎంతదూరము అది ఎంత దూరము ' అని పాడినా అచిరకాలంలోనే ఆయన అభిమానానికి దగ్గరయ్యారు. ఆ ధైర్యంతోనే అదే ఎన్.టి.ఆర్ గారికి రెండవ పాట 'నిద్దురపోనా పిల్లా ' అనేది పాడి ఎన్.టి.ఆర్. చిలిపి తనాన్ని కొద్ది కొద్దిగా అనుకరించారు.

ఘంటసాల, బాలు ల కాంబినేషన్ లో నాలుగు పాటలే ఉంటే అందులో రెండు ఎన్.టి.ఆర్ వారివే కావడం విశేషం. కాని ఆ రెండిటిలో ఎన్.టి.ఆర్ వారికి ఘంటసాల పాడారు. బాలు యుగంలో ఎన్.టి.ఆర్ కి బాలు పాడగా, మరో హీరో ఎన్.టి.ఆర్ సరసన నటిస్తే ఎవరు పాడేరో?

ఇలా చెప్పుకుంటే ఎన్.టి.ఆర్ జీవితం బాగు బాగు, ఎన్.టి.ఆర్ జీవన గ్రంథం బ్లాగు బ్లాగు - ఎన్ని పుటలైనా చాలవు.

ముక్తాయింపు:

'జయం మనదే ' అని ఒకసారి, 'విజయం మనదే ' అని మరోసారి ఘోషించినవి తను నటించిన సినిమా పేర్లే అయినా ఆ మాటలు వమ్ము కానివ్వలేదు నందమూరి అందగాడు.

సినిమా పేర్లు ఆయన్ని అనుసరిస్తాయి.
ఒక సారి 'టైగర్ రాముడు ', మరోసారి 'కొండవీటి సింహం '.
ఒకసారి 'అడవి రాముడు ', మరోసారి 'వేటగాడు '.
ఒకసారి చెల్లెలి కాపురం నిలబెట్టే అన్న వేసే మారు వేషంలో ఉత్తుత్తి స్వామి, మరోసారి సమాజ శ్రేయస్సు కోసం నిలబడిన వీర బ్రహ్మేంద్ర స్వామి.

'ఉమా చండీ గౌరీ శంకరుల కథ ' తెలిసిన వాడికి 'తెలుగు గంగ ' శిరోధార్యం కాదా?

కృతజ్ఞత - అతను నమ్మిన సిద్ధాంతం. ముందు తరాలకిదే ఆయనిచ్చే సందేశం.

పాత రీళ్లు తిరుతున్నంత కాలం, పాత పాట వ్రేళ్ళు చితికిపోనంత కాలం బ్రతికే ఉంటారు ఎన్.టీ.ఆర్. మెరుస్తూనే ఉంటుంది నటరత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యాలు కలబోసిన మణి హారం!

('ఆహా ఆహాహా ' లో 'ప్రతి రాతా ప్రసిద్ధమే ', 'ప్రతి ముఖమూ ప్రముఖమే ' ఎన్.టి.ఆర్ ప్రత్యేకం అని చెప్పకనే చెబుతాయి)

-డా. తాతిరాజు వేణుగోపాల్, 21 January 2012