Krishnaprema Logo

కృష్ణప్రేమ

నట తపస్వి, కళా యశస్వి మన రంగారావు యస్వీ

03 జులై, 2011

నట తపస్వి, కళా యశస్వి  మన రంగారావు యస్వీ

Picture

పూరీ జగన్నాథ్ అనే దర్శకుడు ఒకనాటి angry young man , ఇప్పటి soft man అమితాబ్ బచ్చన్ హీరోగా ‘Bbuddah –hoga terra baap' (2011)అనే సినిమా తీసి దేశమంతటా చూపిస్తున్నది ఈ ఏడు ఈ జులై నెల ఆరంభంలోనే. ప్రపంచంలో ఎక్కడైనా సరే నేటి ముసలి వారు ఒకనాటి యవ్వనులే కదా. ఎందుకంత కోపమో?

ఎవరిమీదా కోపం తెచ్చుకోని దేవుడు, అసలైన ఆ పూరీ జగన్నాథుడు మన జీవన యాత్ర సఫలం కావాలనే కోరికతో ఒడిశా లో తన రథ యాత్ర కి ఈ ఏడు స్వీకారం చుడుతున్నది ఈ జూలై తొలి ఆదివారమే.

మహారాష్ట్ర లో ఆషాఢ మాసం సందర్భంలో మహావిష్ణు రూపమైన పాండు రంగడి సేవలో పిల్లలు, యవ్వనులు, పెద్దలు, పండు ముసలి వారు -- అంతాపండరీ పుర యాత్ర చేసేదీ ఈ జులై నెలలోనే.

మనం కూడా ‘రంగ' ‘రంగ' అనుకోవాలంటే మార్గమే లేదా? ఎందుకు లేదూ? మన కోసం ఒక రంగడు ఈ జులై నెలలోనే పుడితేను! అతన్ని తలుచుకోవడమే మన తక్షణ కర్తవ్యమ్! ఎవరదీ? సామర్ల వెంకట రంగారావు నాబడు మన యస్వీ రంగారావు గారేనా? సాహసము శాయరా డింభకా!


**ఆ మూర్తి - కళ్ళ ముందు కళ్ళు మూసి తెరిచేలోగా ప్రత్యక్ష మయ్యే ఒక నిండైన విగ్రహం!

ఆ మూర్తిది- అదే నిండైన విగ్రహం చూసినంతలోనే చెవులారా వినబడే నిబ్బరమైన కంఠ స్వరం! **

తనకు దైవికంగా సిద్ధించినవి ఈ రెండు వరాలు –

అతని గురించి ఇవీ వివరాలు-

ఎవరెన్ని చెప్పినా ఇంత కన్నా వివ రంగారావు :

జు లై 3 , 1918 న నూజివీడులో పుట్టిన చక్కని మామిడి పండు, ఆ తరువాత నవ రసాల నటనతో పాటు మధు రసంకూడా స్వీకరించి మదరాసు లో అడయార్ చెట్టు లా నిలకడైన ఆత్మ విశ్వాసంతో ఎదిగింది.

అడయార్ చెట్టు మాత్రం ఒకసారి ఎందుకు కదిలిపోయిందో తెలియదు. బహుశా యస్వీఆర్ ఘటోత్కచుడిలా అటువైపు నడిచి ఉండాలి. లేదా 'ఏమిటీ చెమట!, ఏమిటీ ఉక్కపోత?' అని హడాలగొట్టి అనక నెమ్మదిగా ' నువ్వుండి ఏం చేస్తున్నావిక్కడ?' అని మెత్తగానే చెట్టు కొమ్మను మొట్టినందుకైనా అయి ఉండాలి.

ఆయన నటన అంటే ఎందరికో ఎంత ఆరాధన అంటే రౌడీ సున్నం రంగడిగా (షావుకారు, 1950), మాంత్రికుడిగా (పాతాళభైరవి, 1951), కీచకుడిగా (నర్తనశాల, 1963) , రావణుడిగా( సంపూర్ణ రామాయణం, 1972) , బందిపోటు భీమన్న(1969) గా , పెద్దదొర గా (బందిపోటు దొంగలు, 1968) ఆయన నటిస్తే అవి నెగటివ్ పాత్రలైనా సరే ప్రేక్షకులు పాజిటివ్ గానే తీసుకునేవారు. అలా ఆయన ద్వారా ‘బీ పాజిటివ్' అనే ధోరణి ఆనాటి యువక రక్తంలో కదిలింది.

'బంగారు పాప, 1954 ' తో 'తాధిమి తకధిమి తోల్ బొమ్మా' అని ఆయన పాడుతుంటే ఆ ముఖ కవళికల్లో తత్వవేత్త కనపడే వాడు. బూచివాడు గా 'రాము, 1968 ' ని భయపెట్టినా ఆనక లాలించిన తీరులో ఒక పెద్ద దిక్కు తోచేది. హిరణ్య కశిపుడి గానో, కంసుడి గానో సింహాసనం మీద కూర్చునీ నాట్య గత్తె పొగడ్తలు వింటూ మురిసిపోతున్నట్టే ఉంటూ ‘విష్ణు మాయ కాదు కదా' అనే అప్రమత్తత కనపర్చే తీరు ఆనంద పరిచేది.

తనముందు 'వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు'(పాతాళ భైరవి) అని వెనకటి కాలంలో ఒకరు నాట్యం చేసారు. 'రారా ప్రియా సుందరా' (భక్త ప్రహ్లాద , 1967) అని మరుసటేడు మరొకరు నాట్యం చేస్తారు. వీటి మధ్య కాలంలో పద్మిని (మోహిని) తో సరి సమానంగా భారీ శరీరంతోనే అవలీలగా నాట్యం చేసేందుకు 'భస్మాసుర, 1966 ' అయిన వాడు మన చతురంగారావు.

ఎంత నవ్యత్వంతో ఏనిమేషన్ సినిమాలొచ్చినా కె.వి.రెడ్డి గారు తీర్చి దిద్దిన ఘటోత్కచుడు (మాయా బజార్) అంటేనే
ఎస్ వీ ఆర్ అనే భావం బలంగా నాటుకుపోయి , ఇప్పటికీ తెర మీదికి ఆయన రాగానే తెర ముందు చప్పట్లే, నోటి ముందు ఈలలే!. నాటి పిల్లలు నేడు పెద్దలై పోయినా, నేటి పిల్లలు పెద్దలతో కలిసి సినిమాలకు పోక పోయినా ఎవరికి వారే ఎస్వీఆర్ సినిమాలంటే చూపించే ఇష్టం మాత్రం కించిత్తైనా మారలేదు.

ఆ మహా నటుడు భౌతికంగా అస్తమించడంతో ఆయన నటనకి తెర పడింది తప్ప ఇప్పటికీ టీవీ లో ఏ చానెల్ లో నైనా రంగారావున్న ఏ పాత దృశ్యం కనపడినా ఆగి కాస్సేపు చూడకుండా ఎవరూ ఉండలేరు. అటువంటి ఆకర్షణ శక్తి ఇంకే నటుడికీ లేదు. నటనలో నూతనత్వం కాదు ఆకర్షణ అని పాపం న్యూటన్ కూడా తెలుసుకోలేక పోయాడు.

అవకాశాలు అందరికీ అనవస రంగారావు:

రంగారావు చిన్నతనమంతా మద్రాసులోనే గడిచింది. అప్పటికే నాటకాలంటే వల్ల మాలిన అభిమానం ఉండడం, వీలు చూసుకునీ నటించడం చేశాడేమో ఇలా కాదని ఆయన్నికాలేజీ చదువుల కోసం విశాఖ, కాకినాడ పంపేరు. అక్కడ కాకినాడలో young men 's happy club మళ్ళీ నాటకాలకి తెర తీసింది. అయినా ఎందుకైనా మంచిదని తన రూపంకి సరిపోయే fire officer వృత్తి చేపట్టాడు. కానీ లో లోపల నటన అనే అగ్ని జ్వాల ఆయన్ని దహిస్తూనే ఉంది.

ఈ జ్వాల ఇలా ఉంటే అప్పుడే తొలి సినీ అవకాశం ఆయనికి 'వరూధిని, 1946 ' పక్కన 'ప్రవరాఖ్యుణ్ని' చేస్తూ కవ్వించింది. మను చరిత్ర ఆధారంగా ఆ కథ సాగినా అతని సినీ చరిత్రలో మాత్రం అది flop కావడం వల్ల ' ఎందుకొచ్చిన గొడవ జ్వాలా, నీకు డెస్క్ వర్కే చాలా ?' అని సినిమాలకి టాటా చెప్పేసి మళ్ళీ ఉద్యోగ వేటలో పడ్డాడు రంగా రావు. జంషెడ్పూర్ లో టాటా కంపెనీ ఉద్యోగమిచ్చింది. అయితే అక్కడి ఆంధ్రా అసోసియేషన్ ప్రోత్సాహంతో మళ్ళీ నాటకాలాడితే విజయా వారి ‘షావుకారు ' కబురంపి కర్రనిచ్చి రౌడీ వేషం వెయ్యమన్నాడు. ఆ తరువాత **'**పాతాళ భైరవి ' మాంత్రికుణ్ణి చేసి , ఆనక 'పెళ్లి చేసి చూడు, 1952' అంటే ఏకంగా మామ కూతుర్నే పెళ్ళాడేశాడు రంగా రావు. మంత్ర ముగ్ధురాలై అతని వెంట నడిచింది మరదలు లీలావతి.

కళ తప్ప కాసుల వైపు అంతగా కాంక్ష లేని వాడు, అడిగితే లేదనే చేయి (పర్సు లోనే) తిరిగిన దాత అతడు.

అందుకే జీవన నాణెం కిరువైపులా చల్లని సంసారం- చక్కని మధు పానం అనేవి చాలని ఎంచుకునీ ఆ రెండిటా నిలకడగా నిలిచిన వాడు సినీ రంగా రావు. అదే విశేషం!

యస్వీ ఆర్కైతే పాటలు కవుల****ప రంగా రావు:

‘సినిమాలేమిటీ, వేషాలేమిటీ' అని అయిన వారందరూ ఆక్షేపిస్తున్నా నొచ్చుకోక, అలాగని ‘వేస్తె నువ్వేవేయాలోయ్' అని పొగిడే వారినీ మెచ్చుకోక అందరినీ ‘ఆత్మ బంధువు, 1962 ' లు గా ఎంచి ‘ఎవరో ఏ ఊరో --- కృష్ణా' అంటూ మరల మరల ఆత్మ గీతోపదేశం చేసుకున్న సామర్ల సాధువు రంగారావు (కనులు మూసినా పాటే- లో ఆ పాట వింటూ నేపధ్యం లో ఎస్ వీ ఆర్ నటన ఒక్క సారి గుర్తు చేసుకోండి – కన్ను చెమ్మ గిల్లితే ఇటు వైపు రండి )!

ఈ లీలా రంగ 'చిలకా-గోరింక, 1966' జోడీ బావుండబట్టే 'నా రాణి కనుల లోనే ఆనాటి కలలు దాగే' అని అనురాగ వీణ మీటి పరవశించాడు శృంగా రంగా రావు (‘కనులు మూసినా పాటే' లో ఆనాటి కలల పాట వినాలని ఉంది కదూ).

తన ఇల్లు 'లక్ష్మీ నివాసం' అయినా 'ధనమేరా అన్నిటికి మూలం' అంటూ ( ఇది కూడా ‘కనులు మూసినా పాటే' లో వినాలని ఉంది కదూ) విర్ర వీగి పోక రెండంటే రెండు సినిమాలు స్వయంగా తీసి పరిశ్రమ బాగు కోసం తన వంతు కృషి చేసాడు ‘వ్యయ' సాయ పడే సిరి రంగా రావు. రెండు సినిమాలకి ఒక్కరే సంగీత దర్శకుడని కాక ఇద్దరికి చెరొక అవకాశమిచ్చాడు కనుకనే తను పరచిన 'చదరంగం, 1967' లో టి.వి.రాజు వల్ల ఆట బావుండి 'నవ్వని పువ్వే నవ్వింది' ; తను కలగలిపిన 'బాంధవ్యాలు, 1968 ' లో సాలూరి హనుమంతరావు వల్ల 'తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి' ఎగిరి గంతేసింది. చదరంగం చిత్రం రజిత నందిని , బాంధవ్యాలు చిత్రం బంగారు నందిని దక్కించుకున్నాయి. ఎంత అమాయకుడంటే రెండూ తన స్వంత చిత్రాలే అయినా ఓ యమా కంగారు లో తన పెదవులు కదిలేలా తన మీద ఒక్క పాటా పెట్టుకో లేదు.

****అందరికీ అన్ని పాత్రలూ ఇంతకన్నా బంగా రంగారావు:

మాంత్రికుడిగా తొలిసారి 'పాతాళ భైరవి' లో , మరో సారి 'బాల నాగమ్మ,1959' లో ; బందిపోటు దొంగగా 'బందిపోటు దొంగలు' , 'బందిపోటు భీమన్న' చిత్రాల్లో, పాదుషా గా 'అనార్కలి, 1955' లో, మహారాజుగా 'జయభేరి,1959' లో; అంధుడిగా 'సంతానం, 1955 ', 'సుఖదుఖాలు,1967 ' చిత్రాల్లో; కోయవాడిగా 'చిన్నారి పాపలు, 1968 ' ,'జాతక రత్న మిడతంభొట్లు, 1971' చిత్రాల్లో ; కంసుడిగా ‘****శ్రీకృష్ణ****లీలలు**'** , యశోద కృష్ణ, 1974' చిత్రాల్లో - ఇలా ఒకే పాత్ర రెండు సార్లు పోషించిన ఘనత రంగారావుదే. ఎన్ని సార్లు పోషించినా కొత్తగానే ఉన్నట్టనిపించే బంగా రంగా రావంటే అతనే. గారాబంతో కూతుర్ని వెనకేసుకొచ్చిన నాన్న గానో (అడుగుజాడలు,1966) లేదా గిరి గీసుకున్న హోదా వల్ల కూతురి తో పోట్లాట వేసుకున్న తండ్రి గానో (అభిమానవంతులు,1973) వైవిధ్యం చూపగల సత్తా ఉన్న రంగారావుకి పాత్రలు ఇంతకన్నా ఇతరంగా రావు..

ఇంచు మించు తన సాటి వయస్కులైన నటులు హీరోలైనా వారికి తండ్రిగానో, మామయ్య గానో, మామగారిగానో, పెద్ద అన్నయ్య గానో 'ఒక ఇంటి పెద్ద' గానే నటించేందుకు వెనుకాడని వాడు , అలా నటించి సినిమాకి వెన్నెముక అయిన వాడు రంగా రావే.

చివరిగా 'తాత' గానూ నటించి 'అనుబంధం, ఆత్మీయత, ఆత్మ తృప్తి' అనే అమాయక బాంధవ్యాల మధ్య జరిగే జీవన చదరంగం ఆట గురించి చెప్పి దాసరి నారాయణ రావు అనే దర్శక రత్నం విలువ పెంచేందుకు సాయపడిన దార్శికుడు రంగారావు (ఈ జూలై 3 న శ్రీ దాసరి కి జీ వీ ఆర్ ఆరాధన సంస్థ ఎస్ వీ ఆర్ పురస్కారాన్ని అందజేయడం విశేషం).

ఆయన లోనిexpressionsఎప్పుడూ ఘో రంగారావు:

గబగబా మాటలాడి ఒక చిన్న విరామంతో ఒక చిన్న ముక్క చివర్లో విసరడం, ఆ విరుపులో ముఖంలో చిన్న నవ్వు మెరుపు చూపించడం రంగారావు ప్రత్యేకత. ‘నిబ్బరించే' కంఠ స్వరం' అని ఇంతకు ముందు అన్నది అందుకే! (నిబ్బరించు- అంటే అతిశయించు, నిదానించు అని అర్థం కదా).

'సాహసం శాయరా డింభకా' , 'హే లంబూ హే జంబూ', 'అసమదీయులు', 'దుషటచతుషటయం' – వంటి మాటలన్నీ పేర్చుకుంటే యస్వీఆర్ డైలాగ్ డిక్షనరీ తయారౌతుంది. ఇటువంటి లిస్టులు తీసుకునీ సినీ జర్నలిస్టులు కొందరైనా పూనుకొనీ అక్షర లక్షల లక్షణమైన డిక్షనరీలు నిష్పక్షపాతంగా తెస్తే బావుణ్ను. అవి రేపటి చీకటి సినీ సిల 'బస్' ప్రయాణంలో కరదీపికలుగా పనికొస్తాయి. నిం'బస్' మేఘాలై ఆనందబాష్పాలు కురిపిస్తాయి.

విశేషం ఏమిటంటే 'నటన' అనేదే లక్ష్యంగా పెట్టుకునీ, ఏటికి ఎదురీది వచ్చిన నాటి నటీ నటులు కేవలం నాటకానుభవంతో వచ్చిన ఒంటి కదలికలు, నాజూకు తనంతో కుదిరిన కంటి కదలికలు తప్ప ఇతరత్రా ఏ రికమెండేషన్ గానీ, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకునీ వచ్చిన దాఖలాలు లేవు. వారి వారి నటనే తరువాత కోర్సులకీ, ట్రైనింగ్ సంస్థలకీ దారి తీసింది. చిత్త శుద్ధి తోనే చిత్రసీమ నేలిన వారే అంతా. అలా ఒకనాడు రంగా రావనే రత్నం సినీ రంగానికి రావడం నేటి చిత్ర సీమ చేసుకున్న అదృష్టం. గొప్ప గురువు దొరకడం కన్నా మించిన అదృష్టం ఏముంటుందీ? అక్కినేని వారు అద్భుతమైన ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవలే నెలకొల్పారు. అందులో రంగారావు ప్రతిమకి పటం కాక ప్రతిభకి పట్టం కట్టమని అంతా కోరుకుందాం.

తతిమ్మా వారికి అవార్డులంటే అంతదూ****రంగా రావు:

మొట్ట మొదటి భారతీయుడిగా జకార్తా ఆఫ్రో-ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో 'ఉత్తమ నటుడు' అనిపించుకున్న వాడు- ‘నర్తనశాల**'** కీచక పాత్ర ధారి అయిన రంగారావే.

అదేం చిత్రమో ఇటు తెలుగు వారికి, అటు తమిళులకి ఎంతో ఇష్టమైన రంగా రావుకి ఏ ప్రభుత్వమూ ‘ పద్మ ' పురస్కారాలతో సత్కరించలేదు. ఆయన నటన అనుసరించివారికి మాత్రం అవలీలగా అవి దక్కుతున్నాయి. పోనీ ప్రభుత్వాలు స్థిరంగా ఉన్నప్పుడైనా మరీ రాజకీయాలే ఆపోసన పట్టకుండా కాస్త ‘కలాపోసన' వైపు దృష్టి సారించి ఎస్ వీ ఆర్ గురించి ‘ఇప్పటికైనా' ఆలోచిస్తే బావుణ్ణు- ఆయన ఆత్మ శాంతిస్తుంది.

ఇక మీ కోసం కొన్ని వీడియోలు ఎంత కోరుకున్నా సుబ్బరంగా రావు:

మన కళ్ళు కోరే నకళ్ళు అంతే మరి. అయినా మన ఎదుటే తెర, ఆ తెరలో మన యస్వీ ఆర్ , ఎలా ఉన్నా చల్తా హై యార్! ముచ్చటైన మూడు వీడియోలు (‘కనులు చూసినా పాటే '- లో ) చూసి తరిస్తే నా ప్రయత్నం ఫలించినట్టే.

1974 వ సంవత్సరం లో సినీ పరిశ్రమ ముగ్గురు మేధావుల్ని కోల్పోయింది. ఆ ముగ్గురిలోనూ ఉన్న అంశం ఒక్కటే – కళా సరస్వతి కన్న బిడ్డలు. వారు- ఘంటసాల( ఫిబ్రవరి ) , కోదండపాణి( ఏప్రిల్ ) ఎస్ వీ రంగారావు (జూలై) . ఒకరు బాణీ కూర్చితే ఒకరు పాడితే ఒకరు అద్భుతంగా నటించడం ఒక్క ఈ పాటలోనే సాధ్య పడింది. ఆ ముగ్గురి సమైక్య కృషి కనిపించే పాట –పండంటి కాపురం చిత్రం లోని ‘బాబూ వినరా అన్నా తమ్ముల కథ ఒకటి ' మీ కోసం! ఆ సీను లో ఓ పదమూడో వ్యక్తి గానో ఆసీనులై పోవాలని అందరికీ అనిపించే ఉంటుంది. ఇంటింటి కథ ఎస్ వీ ఆర్ చెబితేనే ఓ అందం మరి.

ఎస్ వీ ఆర్ విషయంలో ఎన్నో అంశాలు రెండుగా ఉంటూ ఏకత్వం సాధించినట్లే ఆయన జననం ( 3 వ తేదీన), మరణం రెండూ జూలై ( 18 వ తేదీన) నెలలోనే సంభవించడం సంతోషం, బాధ అనే రెండు అంశాలు విధి విన్యాసాలు అని హెచ్చరించడానికేనా?

మరో వీడియో లో సంపూర్ణ రామాయాణం' లో బాపు-రమణ అనే భిన్నత్వం కాని ఏకత్వం ఎస్ వీ ఆర్ ప్రతిభను అద్దం పట్టి చూపించడం చూడగలం.

ఇంకో వీడియో లో లలితాదేవి ప్రసన్నత కోసం ‘రహస్యం(1967) ' గా చేసే పద్య పఠనం – ఆ కనుల చాతుర్యం మళ్ళీ మళ్ళీ చూసి తీరాల్సిందే.

అనేక రంగాల లోని రంగా రావుని కవితాత్మకంగా ముళ్ళపూడి వెంకట రమణ గారు ఎలా ప్రశంశించారో మీకు తెలుసు. అయినా మరోసారి 'బాపురే రమణీయం' లో కొత్తగా తలెత్తిన 'రమణ రాత ' లో చదూకోండి. అక్కడ 'బాపు గీత ' అని ఒకటి ఉంది. వెనకటి రోజుల్లో మీరు నవ్వుకున్న క్షణాలు తలచుకోండి.

అచ్చం అవే అచ్చులు' లో ‘తిరుగు లేని మాట ' లో కొన్ని ఎస్ వీ ఆర్ భావాలు చదవొచ్చు. 'ఆహా ఆహహా' లో

ఎస్ వీ ఆర్ హావ భావాలు ‘పొటిగిరాపులు' గా ఉంటాయి చివరాఖరికి.

ముక్తా**‘ఇంపు':**

‘ఆం ఫట్'------

‘నరుడా ఏమి నీ కోరిక?'

‘ఎస్ వీ ఆర్ అనే నా గురించి ఒక్కసారి చదవాలి, చూడాలి – నెట్ జనానికి ఎక్కడుంది నెనరైన తీరిక?'

‘రంగా రావు! – నీ నటన చూస్తున్నంత సేపు ఎవ్వరికీ ఎటువంటి చింతా, చీకాకు, బెంగా రావు'

‘అటులనే అయితే- నాకు పునర్జన్మ ప్రసాదించు మాతా, తెలియక జేసిన నేరమిది, జై శాంభవీ!'

-డా. తాతిరాజు వేణుగోపాల్ ,03జూలై****2011