Krishnaprema Logo

కృష్ణప్రేమ

అమ్మలగన్న అమ్మకు జేజేలు - దసరా సరదాలు తృప్తి నిస్తే చాలు

28 సెప్టెంబర్, 2011

ళ్ళు తెరిచి చూస్తుంది పసి పాప.
ఎదురుగా తన బొమ్మ చూపిస్తూ ఓ కనుపాప.
ఆ కనుపాపలో ఉన్నది తన బొమ్మే అని తెలియని తనం.

ఆ అమాయకపు చిరునవ్వే, ఆ ఆకలి ఏడుపే ఆ కనుపాప ధనం.

కనుపాపకో పేరుంది. అమ్మ.

కమ్మనైన అమ్మ మాట వేదం.
కమ్మనైన అమ్మ చేతి వంట ఆహా.
అమ్మ కొంగు తగలక పొతే అమ్మో.
అమ్మ కనుమరుగైతే అయ్యో.

జగన్మాత అమ్మలాగ వేద వాక్కుతో జగతిని పాలిస్తుంది.
అన్నపూర్ణ అయి అమ్మ లాగ అన్నం పెడుతుంది.
కొంగు చాటున మనల్ని దాచి గొడుగులా నిలుస్తుంది.
కంటికి కనపడక దోబూచులాడిస్తుంది.

అందుకే ఆమె అమ్మలగన్న అమ్మ.

ఆమెకెన్నో రూపాలు. ఆమె వెన్నో భావాలు.

ఆమె కొండ మీద కొలువుండగలదు. గుహల్లో విహరించగలదు. గ్రామాల్లో వసించగలదు. గుండెల్లో నిలువగలదు.

బతుకమ్మ ఆమె. గాజులమ్మ ఆమె. నూకాలమ్మ ఆమె. పెద్దమ్మ ఆమె. కనక దుర్గమ్మ ఆమె. పైడి తల్లి ఆమె. కాళి మాతఆమె. సర్వ శక్తీ ఆమే.

విజయమో,వీర స్వర్గమో అనే ద్వంద్వ సందేహం రానీయదామె. ఆ తల్లి స్మరణం వీరుల విజయం వైపే గాని మరణం వైపు కాదు. సద్వీరుల జయం, ముష్కరుల మరణం ఆమె లక్ష్యం.

శ్రీ రాముడు సాధించాడు రావణుని మీద తుది గెలుపు.

పాండవులు సాధించారు కౌరవుల మీద గెలుపు.

అందరికీ ఆమె ప్రసాదించిన శక్తియే ఆలంబన.

అందరి నోటా ఆమె నామ మంత్రమే ఆలాపన.

సురలున్న చోట అసురులుంటారు.

సురలే అసురులైనా, అసురులు మితి మీరి అహంకారులైనా దేవి సహించదు.

అసురులు నశిస్తేనే ధర్మం నిలకడయ్యేది.

తలుచుకుంటే శివుడు మూడో కన్ను తెరిచి నాశనం చేసెయ్య గలడు అసుర గణాన్ని.

కానీ అంబ శక్తిగా అవతరించాలి. అంబ శక్తి తెలిసి లోకులు తరించాలి.

శివుడి ఆజ్ఞ కానిదే చీమైనా కుట్టదు.

అంబ అయినా అంతే. ఆ ఆజ్ఞ తోనే ఆది శక్తి అయింది.

అంబ అస్త్రశస్త్రాలు ప్రయోగించక పోలేదు. మొద్దుబారిపోయిన, కరడు గట్టి పోయిన గుండెలు చీల్చేందుకు అవి అవసరమయ్యాయి.

అసలు అసురులంతా స్త్రీ మూర్తుల చేత హతమైనవారే.

భస్మాసురుడు విచిత్ర వరాలు పొందినవాడు. అతని ఆట కట్టు చేసుందుకు విష్ణువుకైనా 'మోహిని' రూపం తప్పలేదు. మోహిని చేతలతో అసురుడు భస్మం కాక తప్పలేదు. భండాసురుడు త్రిపుర సుందరి చేతిలో బ్రద్ధలయ్యాడు. నరకాసురుడు అంతేగా. సత్యభామ చేతిలో చిక్కి నరకానికి పోయాడు.

మహిషాసురుడు గోముఖ వ్యాఘ్రంగా ఉంటే దుర్గమ్మ పులి సాయంతో మదించింది.

ఇప్పుడు ఆచరిస్తున్న 'దశ్శహరా ' దశ అహోరాత్రుల కురచ రూపం. అంటే దుర్గామాత పాడ్యమి నుంచి నవమి వరకు 'నవ రాత్రులు' పోరాడి ముందు మహిషాసురుడి అనుచరుల్ని, అంతాన మహిషుణ్ణి దునిమిన మరుసటి దినం (దశమి నాడు) ఆనందోత్సాహాలతో నాటి ప్రజ జరుపుకున్న సంబరం అది. మాటలు కుదించడం తెలుగువారికి సరదా.

'దసరా' గా మారిన 'దశ హరా' అంటే బుల్లోళ్ళకి సరదా.

చిన్నవారూ, యవ్వనులూ కోలాటం (దాండియా) ఆడేందుకు ఉబలాట పడతారు.

తొమ్మిది రోజులూ 'కుమారి' పూజలు అందుకునేందుకు రెండేళ్ళ నుంచి పదేళ్ళ వయసున్న బాలికలు అర్హులు కనుక వారు గర్వ పడతారు. లేత వయసులోనే శక్తి మొలకెత్తిన బాలా త్రిపురసుందరి ప్రతిమకి ప్రతీకలు వీళ్ళు.

ఇది జరిగిన చాంద్ర మాసం- ఆశ్వయుజమ్. పౌర్ణమి నాడు చంద్రుడు అశ్వినీ నక్షత్ర కూటమికి సమీపంలో ఉండడమే ఈ మాసానికి ఆ పేరు రావడానికి కారణం. పైగా ఆశ్వయుజ, కార్తిక మాసాలు 'శరత్ ' ఋతువుకి చెందినవి. దసరా రాత్రులుశారద రాత్రులని అందుకే పేరు పొందాయి.

అశ్విని ఇరవైఏడు నక్షత్రాలలో తొలి నక్షత్రం. ఆ రకంగా చంద్ర మాసాల్లో తొలి మాసం గా ఆశ్వయుజ మాసం ఆది శక్తి మాసం అయింది.

జన్మ కారకులైన పితృ దేవతలు లోకం విడిచినప్పటికీ బాంధవ్యాలు వీడి పోలేరు. అందుకే వారికి తృప్తి భోజనం అర్పించాలి. అది ఈ సమయంలోనే అయితే అదంతా దేవీ ప్రసన్న నైవేద్యంగా వారు స్వీకరిస్తారు.

నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెడితే అమ్మ కను బొమ్మల కదలికల అందమే వేరు. ఆ అందమే మన ఆనందం. ఇంటింటా బొమ్మల కొలువుంటే ప్రతి ఇంటా దేవి కొలువున్నట్టే.

'ముగురమ్మలకే మూలపుటమ్మవై భువిలో వెలసిన ఆది శక్తివో' అని కవి దాశరథి పలికినట్టు అదిగో అల్లదివో కొండలమీద కొలువై ఉన్నాడు శ్రీనివాసుడు. ఈ నవరాత్రుల్లో స్వామి ఎన్నో రథ వాహనాల పైన ఊరేగి కనువిందు చేస్తాడు. ఆ వాహనాలు నాగ, హంస, గరుడ,సింహ వంటి జీవాలవి, సూర్య,చంద్ర, హనుమంత వంటి తేజోమూర్తులవి కావడం విశేషం. పదునాలుగు భువన భాండాల సంచారికి పదునాలుగు వాహనాలు కావాలి.

లక్ష్మి, సరస్వతి,గౌరి - త్రిమూర్తీ దర్శనమే మాహాష్టమి, మహానవమి, విజయ దశమి తిథుల పరమార్థం.

బెజవాడ కనక దుర్గమ్మ తొమ్మిది రూపాల దర్శనమిస్తుంది. బాల త్రిపుర సుందరి, గాయత్రి, మహాలక్ష్మి,అన్నపూర్ణ, లలితా దేవి, సరస్వతి, దుర్గా దేవి ,మహిషాసుర మర్దని, రాజరాజేశ్వరి - ఆ తొమ్మిది రూపాలు. ఇలా దేవిని విభిన్న రూపాలతో చూసే భాగ్యం మరెక్కడా దక్కదు.

విజయనగరంలో జరిగే పైడి తల్లి జాతర అనితర సాధ్యం.

ఉత్తరాదిని రావణ, కుంభకర్ణ, మేఘనాథుని బొమ్మలు దగ్ధం చేసి 'విజయోస్తు' అనుకుంటారు.

బెంగాల్, ఒడిశా ల్లో ముఖ్య స్థానాల్లో దేవి ప్రతిమలు స్థాపన చేసి వైభవంగా పూజిస్తారు.

ముక్తాయింపు:
కళ్ళు మూసి పసిపాప కన్నతల్లి గురించే కలలు కన్నట్టే లోకమంతా శాంతి మయం చేయమని అమ్మల గన్న అమ్మను కోరుకుంటే ఆమె 'తప్పకుండా' అని మనకి వరమిస్తుందని కలలు కనాలి. ఆ కాస్త నిదురకైనా ముందు మన మనసులు ప్రశాంతంగా ఉండాలి. ఉంచాలి.

కనులు చూసినా పాటే లో మహానటి సావిత్రి 'జననీ శివకామిని ' పాట పాడే దృశ్యం ఎన్ని సార్లు చూసినా ఎందుకు తనివి తీరదు? ఎందుకంటే సావిత్రి రెప్పలార్చకుండా ఆ పాటంతా నటించింది కనుక. అలా గనుక అంబను చూస్తే అంబ కనికరిస్తుందేమో. రెప్ప వేసి తీసే లోగా అంబ కనుమరుగు కాకూడదని భక్తురాలి తపన.

కనులు చూసినా పాట లో 'లలిత భావ నిలయ ' అనే మల్లాది వారి అద్భుత గీతం 'రహస్యం ' గా ఇక్కడికి చేరగలిగింది కనుక సరస్వతి,శ్రీ, లలిత రాగాల అందమైన మాల ఆ మూడు మూర్తుల దేవికెంత ఇష్టమో వారి అపురూప రచన ద్వారా మనకు తెలిసింది.

కనులు చూసినా పాటే లో అందరికీ ఇష్టమైన మంగళ హారతి పాట 'శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా ' యే అని చెప్పడంలో 'రహస్యం ' ఏముందీ? అంతగా తెలుగు ఆడపడుచుల వశ్యమై పోయిన పాట రాసిన మల్లాది వారికి శతకోటి నివాళులు.

కనులు మూసినా పాటే లో 'అమ్మా నీవు లేని తావే లేదు ' అని సర్వ వ్యాపి శక్తి మాతగురించి చెబుతూ
'ఈ లోకులంతా నీ పాపలమ్మా' అని తెలుగు పడతి లాలించమంటోంది.

కనులు మూసినా పాటే కనుక వింటే కనక దుర్గమ్మ రూపమే మనో వీధిలో దర్శన మౌతుంది.

కనులు తెరిపించేలా కరుణ రసం కురిపించి 'ఓ లోకాలేలే చల్లని తల్లి ' అని రెండు ఆర్ద్ర హృదయాలు వేడుకుంటుంటే నేటి సమాజానికి దేవి రాక ఎంతో అవసరమనిపిస్తుంది.కనులు మూసినా పాటే లోలోపల ధ్వనిస్తూ ఉంటుంది.

అఖిలాండేశ్వరి , చాముండేశ్వరి పాట పలుకులు వేటూరి వారివే. పేరు చెప్పకపోతే ఆదిశంకరు లే వ్రాశారేమో అనే భ్రమలో మనల్ని పడేస్తుంది భ్రమరాంబ, కనులు మూసినా పాటే వినపడుతున్న ధ్యానంలో.

ఇవన్నీ రాసుకోవడం కష్టం బాబూ, రాతలు ఫోటోలైతే బావుణ్ణు అని మీరాలోచిస్తుంటే అందుకు నేను సిద్ధం అంటోంది 'కనులు చదివినా పాటే '.

దసరా వేడుకల మధ్యలో కాస్త వినోద విశ్రాంత వేళ ఉండాలి కదా. మరో మూడు రోజుల తరువాత వినోదంలో పాలు పంచుకుందాం. అందాకా అందరికి దసరా శుభాకాంక్షలు, దుర్గమ్మ తల్లికి 'జయ జయ జయ' వినతులు.

భారత రత్నం, పాట ముత్యం, చిరునవ్వు కెంపు Lata Mangeshkar దీదీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి మనసారాmany happy returns of the day! ఆమె తన కంటూ ఉన్న ఆ శ్రావ్యగానంతోనే నాటి యువతకి దేశం పట్ల ఎంతంటి శ్రద్ధ అవసరమో అన్నది తెలియ జాశారా అన్నట్లు 'వందే మాతరం' పాడారు. 'కనులు చూసినా పాటే ' లో చూడండి.బంకిం చంద్రుడు దుర్గ,లక్ష్మి, సరస్వతి కలబోసిన ఆదిశక్తి గా భారత మాతను దర్శించడం విశేషం.

'తిరుగులేని మాట ' లో వందే మాతరం పూర్తి రచన మీ కోసం వేచి ఉంది.

-డా. తాతిరాజు వేణుగోపాల్, 28 సెప్టెంబర్ 2011