అందానికి అందం బాపు బొమ్మ ...
12 అక్టోబర్, 2013


'అందాల రాశి ఐశ్వర్య రాయి బచ్చన్ ఎక్కడ కనిపించినా ఎవరో ఒకరు ఈల వేస్తూనే ఉంటారట. కాని వాళ్ళాయన ఉన్నాడే...అభిషేక్ ...అస్సలు ఈల వెయ్యడట'
‘ఏమో...వాళ్ళిద్దరూ హాయిగా ఈల వేసి పిలవకోయి అని మన తెలుగు పాట పాడుకుంటారు కాబోలు. ఎవడికి తెలుసూ?'
‘అయ్యో..జోకుల్తో అడ్డు పడకమ్మా.. తెలుగు పాడరు...ఆమె కన్నడం అందుకుంటుంది'
‘కన్నడం అనగానే మరొక అందాల భరిణె శిల్పా శెట్టి గుర్తొస్తోంది'
‘మహా ప్రభో ..నాకు తెలుసు ఎందరో ఎప్పటినుంచో చెవిలో ఇల్లు కట్టుకుని యోగాసనాలు వెయ్యండర్రా మంచిది మీ ఒంటికి అని అంటుంటే వినలేదు కాని ఈమె వీడియో రిలీజ్ చెయ్యగానే ఎక్కడ లేని హుషారు తన్నుకొచ్చి అంతా తెగ ఆసనాలు వేసేస్తున్నారు. బేడప్పా బేడ ..దయ విట్టు స్వల్ప నన్న మేలె దయ తోర్సీ ( వద్దు బాబూ వద్దు. దయ చేసి కొంచెం నా మీద దయ చూపండి)'
‘ఓహో...వీడియో కావాలా? బెంగళూరు ఎమ్జీ రోడ్ లో అప్పుడెప్పుడో కొన్న ఆ ముప్ఫయి రోజుల్లో కన్నడం పుస్తక మహిమా ఇది. మా తండ్రే. అయినా ఈ పాత అందాలు బోరు బోరు. కొత్త అందాలుండగా......'
‘కొత్త ఒక వింత నాయనా ....మిస్ వరల్డ్ 2013 ... మెగాన్ యంగ్ అట. ప్రపంచం మొత్తం లో నూటా ముప్ఫై మంది లోంచి ఎన్నిక కావడం తమాషా కాదు'
'యంగ్ కి కాక ఓల్డ్ కిస్తారా చెప్పూ ...ఏమిటో నువ్వు మరీనూ.'
‘జోకాపండి. ఆమె పేరే అంత. ఒకనాటి బాక్సర్ ఈమె. డిషిం అని పాత సినిమాల్లో లాగ ఒక్కటిస్తే ఫిలిప్పీన్స్ లో పడతారు'
‘అదేం? ఇండియాలో పడతాం గానీ'
‘ఎందుకంటే- ఈమె మిస్ ఫిలిప్పీన్స్ కాబట్టి. ఈమె అమెరికాలో పుట్టి ఫిలిపీన్స్ లో పెరిగింది. ఫిలిం మేకింగ్ చదువు చదువుకుంటోంది. అయినా ఇండియన్స్ కి కాస్త నిరాశే కలిగింది.'
‘ఏం? హిందీ సినిమా తీయను గాక తీయను అని గానీ ప్రతిజ్ఞ చేసిందా ఇప్పటి నుంచే?'
‘జోకేవూ? ...ఇండియన్స్ కి నిరాశ ఎందుకంటే పదేళ్ళ తరువాత మిస్ వరల్డ్ దక్కించుకునే లెవెల్ కి చేరిన మిస్ ఇండియా నవనీత్ కౌర్ ధిల్లాన్ చివరికి వచ్చేసరికి మొదటి పది స్థానాల్లో నిలబడలేక పోయింది.'
‘అంటే ...చతికిలబడి పోయి ఉంటుంది'
‘జోకా..పాహిమాం. అయినా మాకు తెలీక ..అదే… పోనీ...నాకు తెలీక అడుగుతా...పదేళ్ళ క్రితం ఎవరబ్బా మిస్ వరల్డ్?'
‘ఇంకెవరూ...ప్రియాంకా చోపడా '
‘ అవునా? నిజమేనా? '
‘అడుగుతున్నావా, పాట పాడుతున్నావా?'
‘రెండూనూ... ఇంతకీ.. మీకు తెలుసో లేదో...మెగాన్ ...'
‘మెగా స్టార్ తో సినిమా తీస్తానని మొగమాటంగా అందా?'
‘ఒకప్పుడు అనగలిగేదేమో...ఆయన టూరిజం పుణ్యమా అని అమెరికా వెళితే గనుక'
‘అమెరికా అంటే గుర్తొచ్చింది ...పాపం ఒబామా హెల్త్ కేర్ ఆమోదం పొందక మొత్తం అమెరికా ప్రభుత్వ పోషణనే షట్ డౌన్ చేసేశారు. అయినా మనం ‘నాసా 'తో పోటీ పడక పోయినా అక్కడలా పరిస్థితి ఉన్నా ఈ నెల ఇరవై ఎనిమిదిన కుజ గ్రహం, అదే మంగళ గ్రహం మీదికి ...నా సామి రంగా ... శ్రీహరికోట నుంచి శాటిలైట్ పంపించేస్తున్నాం. ఇంకో విషయం తెలుసా .. ఇరవై తొమ్మిది మంగళ వారం.'
‘శ్రీహరికోట అనగానే గుర్తొచ్చింది. కలిపి కాక విడగొట్టి చూస్తే శ్రీహరి, కోట కనిపిస్తారు. ఒకరు మొన్ననే దు:ఖాన్ని మిగిల్చారు. మరొకరి అచీవ్ మెంట్ కి అటు మొన్ననే సంతోషించాం. సౌమ్యుడు, సమాజ సేవకుడు, విభిన్న పాత్రలు పోషించిన నటుడుశ్రీహరి మొన్ననే ముంబైలో అకస్మాత్తుగా కన్ను మూసి మనకి కన్నీరు మిగిల్చారు. స్వర్గీయ అల్లు రామలింగయ్య పేరిట ఇస్తున్న అవార్డ్ ఈ ఏడు వైవిధ్య నటుడు కోట శ్రీనివాస రావు కి ఇచ్చి వారం క్రితం సన్మానించగా ఆ దృశ్యం చూసి సంతోషించాం.'
‘శ్రీహరి బాస్... షేర్ ఖాన్ గా అదర గొట్టి, ఎన్నో సినిమాల్లో బ్రదర్ గా చేసి ..ఎందుకు ఇంత తొందరగా పేకప్ అయిపోయారూ? ‘
‘ఒరే ఒరే ఒరే...ఖాయము కాదిలన్ మనుజ కాయము...అని అన్నారు. ఏదీ మనకి అంతు పట్టదు. కొందర్ని గుండెల్లో దాచేసుకోవాలి. పోయారని వాపోకూడదు. శ్రీహరి ఒక మంచి సమాజ సేవకుడు గానే మిగిలిపోవాలి తప్ప క్షుద్ర రాజకీయాలకి తగడు అని భగవంతుడు నిర్ణయించేశాడు. దట్సాల్ ...లెట్ అజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ ఫుల్ సీన్...
అమెరికా అంటే ఆకాశ మార్గామే గుర్తుకు రావాలా...బొత్తిగా కళాపోషణ లేకుండా మీరున్నారే, ఇంతసేపూ మిస్సుల గురించి చెప్పుకుని ఒక ముఖ్యమైన సంగతి మాత్రం మిస్సు కొట్టారు.'
‘మిస్సు అంటే గుర్తొచ్చింది..మిస్సమ్మ సినిమా ...బృందావన మది అందరిది ...అందములందరి ఆనందములే '
‘అరె ఉండుండు...దీనికి పేరడీ తనికెళ్ళ భరణి గారి సినిమా మిథునం లో కదూ వచ్చింది'
‘బాగా నోట నలిగిన పాట రెడీ గా ఉంటే పేరడీ రాక తప్పదు'
‘పేరడీ ..సరే ...అసలు తెలుగు సినీ జగమంతా ఒకటే కుటుంబం అనుసరణ విషయంలో'
‘ఏమిటో కవి హృదయం ...కాస్త విడమరచి చెప్పు...మరీ మమ్మల్ని మరచి కాదు'
‘అంటే...ఈ 1956 కాలం నాటి మిస్సమ్మ సినిమా పాట ఉందే..కవి పింగళి నాగేంద్రుల వారు జాన్ కీట్స్ కవి చెప్పిన a thing of beauty is joy for ever అనే సూక్తిని తెనిగించినట్టే కదా..'
‘ఆగండి మహాశయా ...ఈయన కన్నా ముందే సముద్రాల వారి అబ్బాయి జూనియర్ సముద్రాల – అందమే ఆనందం ..అని అన్నారు కదా, 1953 నాటి బ్రతుకు తెరువు సినిమాలో'
‘నువ్వు లాయరువి కావాలిరా....ఫిలాసఫర్లు అనడం ఏమిటంటే... కీట్స్ ఇలా అని ఉంటే బావుండేదట ...a thing of joy is beauty for ever అని. అంటే ఆనందమే అందం అని. బాపు బొమ్మ ని చూడు...ఓ బోసి నవ్వు, ఓ ధోవతి, చక చక నడక, మంచి నడవడిక – అంతే... ఇవే ఆ మహాత్ముడికున్న అందాలు. వాటితో ఆయన ఆనందంగా ఉండేవారు..అందర్నీ అలా ఉండేలా చేశారు.'
‘బాపు బొమ్మ అంటే ...ఎంచక్కా మన చిత్రకారులు,సినీ దర్శకులు, ఆలస్య పద్మశ్రీ బిరుదాంకితులు బాపు గారి బొమ్మ గురించి చెబుతా వనుకున్నా. భలే వాడివే. అయినా మహాత్ముడికి తొట్ట తొలుత ఎదురైన వర్ణ వివక్షా పరిణామమే మన స్వాతంత్రోద్యమం.'
‘నల్లనివాడు..పద్మనయనంబులవాడు ...అని బమ్మెర పోతన కవి బాలకృష్ణుణ్ణి ఎంత అందంగా వర్ణించాడూ... అయినా బ్లాకూ,వైటూ అంటూ ఇంకా పెద్ద పెద్ద దేశాల్లో .. అదే అగ్ర రాజ్యాల్లోనే వివక్ష ఉంది కాని మన మధ్య కృష్ణుడు దేవుడై తిరిగి మనల్ని ఓ దారిలో పెట్టాడు.'
‘అలా అంటావా...మరి నాదీ ఆడజన్మే అని 1965 నాట ఓ పాత సినిమా ఉండేది. అందులో పాపం సావిత్రి కన్నయ్య నల్లని కన్నయ్యా ..నిన్ను ప్రేమింతురే...పూజింతురే..నన్ను కనినంత నిందింతురే ...అని తెగ బాధ పడింది.'
‘అలాగే శారద కూడానూ...అదేం సినిమా పేరూ... ఆ( ...ఊర్వశి. 1974 లో వచ్చింది. ఈమెది ద్విపాత్రాభినయం. ఒకామెది పిండిలాంటి తెలుపు తోలు. ఇంకొకామెది అందుకు విరుద్ధం.'
‘చెల్లెలి కాపురం అనే మరో సినిమా ఉండేది. కళా తపస్వి బిరుదు రాక ముందు విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. అందులో నాయకుడు ఇలాగే రంగులో కొంచెం తేడా ఉండి వాపోతాడు. కాని మంచి కవి. చివరకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన నీలాకృష్ణుల ప్రణయ విషయాన్ని గేయ రూపకంగా చూపిస్తారు. రేయికన్న నల్లనైన దీనురాలిని, అందుకనే చెలులు అపహాస్యమాడుతున్నారని నీల కుమిలిపోతుంటే కృష్ణుడు అంటాడు ఇలా - కనులకు తోచేది కాదు సోయగము...మనసున పూచేటి మధురిమ కానీ...నీ చెలులు చూసేది నీ బాహ్యమూర్తి ...నేను వలచేది నా నీలలో దీప్తి '
‘అధిక చక్కని పాయింటే సుమీ...అయితే ...ప్రపంచం మొత్తంగా బ్యూటీ క్వీనులనండీ,,,మిస్సు వరల్డూ, మిస్సు యూనివర్సూ ..అనండీ ...రంభా ఊర్వశి మేనక తిలోత్తమ వంటి ఆర్డర్లో కేవలం అందగత్తెలకే కిరీటం సుమండీ..వీళ్ళకి మళ్ళీ శిక్షణలు...పెర్సనాలిటీ డెవలప్ మెంటూ అదీనూ...మంచి మాటలు సమయస్ఫూర్తిగా తొణకక, బెణకక చెప్పడాలు అలవాటు కావాలి.. ఆ కోవలో కొందరు తొట్రు పడతారు..కొందరు బెట్టర్ అవుతారు.'
‘ఏది ఏమైనా ...మనకి గర్వ కారణం...ఇండియా అమ్మాయి ఈ ఏడాది మిస్ అమెరికా కావడం.'
‘అరె...ఏవేవో పాటల్లో పడి మనం మిస్ అయ్యాం'
‘మగ వాళ్ళంరా ఒరే...మిస్ కాలేం'
‘దుర్మార్గుడా...మళ్ళీ జోకా'
‘దుర్మార్గుడు వాడు అని బాలు గారు పా.తీ. ప్రోగ్రామ్ లో సరదాగా, స్నేహంగా, ఆత్మీయంగా అంటుంటే కొందరు ఆయనెవరినో తిడుతున్నట్టు ఫీలై పొయ్యారట. ఇప్పుడు నేనూ అలా ఫీల్ ...'
‘అవుతున్నావా నాయనా ..సారీ'
‘సారీ ఏమిటీ...మగవాళ్ళం అని చెబుతున్నా...'
‘అబ్బబ్బబ్బ ...మళ్ళీ జోకా?'
‘ఫీల్ అవ్వట్లేదని అనబోతుంటే మాట పూర్తీ కానీక అడ్డు పడ్డావ్'
‘మీ గొడవలో కాస్త విశ్రాంతి దొరికి పేపర్లు దులిపి తెచ్చాను'
‘తేతేతే...తెలుగువా? ఇంగ్లీష్ వి కూడానా? ఏదీ...మిస్ అమెరికా గురించేనా?'
‘తెమ్మని అరుస్తున్నావా? నయం ...తేతేతే తెలుగు అంటుంటే సడన్ గా నత్తి వచ్చి మీద పడిందేమిటి వీడికి అని భయపడ్డా'
‘ఒరే ఒరే ఒరే...నీ జోకులు ఇక్కడ కాదురా...ఏ విశాఖ లోని లాఫింగ్ క్లబ్ లోనో పేల్చు'
‘అంటే...మీది వీపింగ్ క్లబ్బా?'
‘ఏడిశావ్'
‘మిస్ అమెరికా మనమ్మాయే'
‘మీకు పెళ్లయిందటర్రా...అప్పుడే పిల్లలా...నాకు తెలియలేదే...ఇన్నాళ్ళూ నేనెక్కడున్నాను?'
‘ఒరే ఒరే ఒరే.. మళ్ళీ మళ్ళీ జోకులేస్తే ..ముప్ఫై రోజుల్లో కన్నడం కాదు తన్నడం నేర్చుకొచ్చి తంతాం. విను..'
‘మనమ్మాయే అంటే మన ఆంధ్రా అమ్మాయే అని అర్ధం. బెజవాడ బ్యూటీ అట. పేరు నీనా దావులూరి.'
‘ఓహ్...ఇంకేం... తెలుగు సినిమాలో చూసేస్తాం'
‘ఆశ దోస అప్పడం... పూర్తికానీండి నే చెప్పడం. అమెరికా సుందరిగా ఒక భారత సంతతి యువతి గెలుపొందటం ఇదే తొలిసారి'
‘నువ్వంటుంటే ..మేం వింటుంటే...పేపర్ చదివినట్టు ఉందిరా'
‘పేపర్లోదే చదూతున్నాడు...ఇటు తిరిగి చూడు...ఊరికే నెట్ లో ఆ చచ్చు ధియేటర్ వెర్షన్ వీడియోలు వెతుక్కోక'
‘సుందరిగా గెలుపొందక ముందు ఈమె పాపం స్థూలకాయంతో ఉండేదిట. యాభై మూడు రాష్ట్రాల మిస్సుల నుంచి ఎంపికైన ఈమె మిస్ న్యూయార్క్ అట'
‘బాబోయ్...ఈ అమ్మాయి ప్రజ్ఞావంతురాలు. బ్రెయిన్ బిహేవియర్ లో డిగ్రీ తీసుకుందట.'
‘న్యాయ నిర్ణేతలు ప్లాస్టిక్ సర్జరీ గురించి అడిగితే వాళ్ళ బ్రైయిన్ గిరగిరా తిరిగేలా ఏమందో తెలుసా? జన్మత: వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలొగ్గని మానసిక అందమే గొప్పది – అని. తమ రూపంపై ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఉండాలి –అని'
‘ఈమె కూచిపూడి నృత్యం అభ్యసించారట ..అదీ మన బెజవాడలోనే. కథక్ కూడా వచ్చునట.'
‘కూచిపూడి నృత్యంతో పాటు బాలీవుడ్ డాన్స్ జత చేసి అందరినీ ఔరా అనేలా నర్తించిందట'
‘సాధారణంగా..ఇలా ఎన్నికైన వారు ఏదో ఒక ప్రచార అంశం ఎంచుకోవాలే ...మరి ఈమె సంగతో?'
‘అక్కడా...వెరైటీనే ...సాంస్కృతిక దక్షతతో భిన్నత్వాన్ని ఆనందించడం...ఇదీ ఆమె వ్యక్తం చేసిన ప్రచార అంశం'
‘చూసారా...చూసారా...ఫైనల్ గా అందం ఆనందానికి దారి తీసింది. ఆ ఆనందమే అసలైన అందం '
‘ ఆనందమే జీవిత మకరందం...అని బదులిచ్చాడు జూనియర్ సముద్రాల కవి. ఆ తరువాత ‘మాకందం' అని మరో లైన్ వేస్తే ట్యూన్ కింతే చాలు అని వద్దన్నారట స్వర కర్త ఘంటసాల మాస్టారు '
‘మీకు తెలుసా? ఆంజనేయుడి మరో పేరు సుందరుడు. ఆయనంత అందంగా అంటే బుద్ధి పూర్వకంగా, శుద్ధిగా, తెలివిగా, వినయంగా మాట్లాడడం అందరికీ చేత కాదు. ఆయనకి రామనామమే అందం. నిత్య రామస్మరణే ఆయనకి ఆనందం.'
‘నాకు కోతిని చూస్తే వణుకు. కాని కోతి పిల్లని చూస్తే బలే ముద్దొస్తుంది'
‘ముద్దొచ్చింది అంటే అందంగా ఉందనేగా?'
‘కాదోయ్...ఆనందం కలిగించింది అనే అర్ధంలో చూడాలి. వీడేమిట్రా పడిపడి నవ్వుతున్నాడూ? మన మాటలకే?'
‘అపార్ధం తగదర్రా మొద్దులూ...ముద్దురావడం అనగానే బాపు జోకు గుర్తొచ్చి తెగ నవ్వుతున్నా? చూడండి...'
‘ఓహ్...బుడుగు జోకా? ఒప్పుకుంటాం ...ఇప్పుడు నువ్వన్నట్టు ...బాపు బొమ్మ అంటే అందానికి అందం '
‘ఒరే ఒరే ...ఆ రేడియో మిర్చీ చిటపటలు ఆపు. ఎంచక్కా అందాల గురించి ఇక్కడ మాట్లాడుకుంటుంటే..హన్నా'
‘చిటపటలు అన్నావు...నా దగ్గర ఓ చిట్టా పాటలున్నాయి. ఇష్టపడి,కష్టపడి తయారు చేసా. కవీంద్రులు, తెలుగు వారి అపర శ్రీనాథుడు వేటూరి సుందర రామమూర్తి గారు వేలాది సినిమా పాటల్లో వందకు పైగా ‘అందం ' అనే మాట ప్రయోగించారు. వాటిని ఏర్చి కూర్చాను.'
‘ఆయన పేరే సుందర రామమూర్తాయె...అందం ఆయన అక్షర సొత్తు. ఏదీ చూపించు...కనులు చదివినా పాటే '
‘ ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం...అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం – అని ఆయన అన్న ఈ ఒక్క పంక్తి చాలు మన ఆనందం కోసం ఆయనలోని ప్రతిభామూర్తి నేల దిగి వచ్చి సాక్షాత్కరించిన సుందర రామమూర్తి అని గ్రహించడానికి'
‘టూరిజం అంటే ఏమిటీ...అందమైన ప్రదేశాలు దర్శించటం ...అవునా...'
‘కనుక..వేటూరిజం అంటే ప్రతి పది పాటల్లో ఒక పాటలో తప్పనిసరిగా ‘అందం' అనే మాటని దర్శించడం'
‘అయితే బాసూ...అందం అందం అంటూ ఇన్ని పాటలు ఆయన రాసినా ఎందుకో మనసులో బాగా నాటుకు పోయేవి మనసు కవి ఆత్రేయ మాత్రమే సాధించారనిపిస్తుంది.'
‘అంటే...వేటూరి వారు ఆయన పాటలోనే అన్నట్టు ఏమంత అందాలు కలవని ఆయన పాటల్లో అని నువ్వంటావా? నిజమే. ఆత్రేయ గారి కాలంలో హడావుడి తక్కువ. వేటూరి వారి కాలంలో అంతా శర వేగమే. కనుక అలా అనిపించడం సహజమే.'
‘నీ చిట్టా లోనే చూడు కొన్నిటిని లావు అక్షరాలతో చూపిస్తున్నావు. అంటే...అవి ఆనందం కలిగించిన పాటలనేగా?'
‘అవును...'
‘ఉండు...ఇవాళ నే కూర్చొని ఆత్రేయ గారి పాటల్లో అందం అనే మాట వెతుకుతా'
‘నువ్విస్తే... నా వేటూరి చిట్టాకి అతుకుతా'
‘కాని ఏమాటకా మాటే చెప్పాలిరా ...అందానికి అందం అని సినిమా గీతంలో రాయాలంటే కవికి ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకే వీలైనంత ఈజీ ప్రయోగం – అందం- అనే సింగిల్ మాట వేసి తప్పుకుంటారు కవులు. అందమైన పెళ్లి, అందమైన ఇల్లు, అందాల పసిపాప, అందాల జాబిల్లి, అందచందాల సొగసైన వాడు, అందమైన తీగ...ఇలా ఎన్నైనా రాసేయొచ్చు.'
‘అందానికి అందం అని సినిమా పాటల్లో మొట్ట మొదట ఎవరు ప్రయోగించారో తెలియదు కాని...ప్రస్తుతం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే ఆద్యులని సరి పెట్టుకుందాం. ఎందుకంటే – మనవాడు తయారు చేసిన ఈ బోర్డు వంక ఓసారి చూడండీ...
అందానికి అందం:
చివరకు మిగిలేది (1960) - అందానికి అందం నేనే (పల్లవి) – మల్లాది రామకృష్ణ శాస్త్రి – అశ్వత్థామ –
జమునా రాణి
ఎదురీత (1963) – ఒకే మాట ఒకే మాట అడగనా చెలి (పల్లవి) : అందానికి సహజమైన అందమే అది – ఆచార్య ఆత్రేయ – మహదేవన్ - శ్రీనివాస్, జానకి
దత్తపుత్రుడు (1972)- అందానికి అందానివై ఏనాటికి నా దానవై (పల్లవి) – దాశరథి – చలపతిరావు – బాలసుబ్రహ్మణ్యం,సుశీల
పాడిపంటలు (1976) – అట్లతద్దోయ్ ఆరట్లోయ్ (పల్లవి): అగుపడి అగుపడకున్నప్పుడే అందానికి అందం వస్తుందోయి – ఆచార్య ఆత్రేయ – మహదేవన్ – సుశీల,బృందం
సిరిసిరి మువ్వ (1976) – అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ (పల్లవి) – వేటూరి సుందర రామమూర్తి – మహదేవన్ – బాలసుబ్రహ్మణ్యం
జెమిని (2002)- చెలి చెడుగుడు జెమిని జెమిని (పల్లవి): మల్లెల్లో గంధము మనసుల్లో బంధము అందానికి అందమే తెచ్చినావులే – వేటూరి సుందర రామమూర్తి - ఆర్పీ పట్నాయక్ – అనురాధా శ్రీరాం, బాలసుబ్రహ్మణ్యం
.....అంటే పట్టుమని పది కూడా లేవు. విశేషం ఏవిటంటే రామకృష్ణులు తొలిసారిగా ప్రయోగిస్తే రామమూర్తి చివరిసారిగా ప్రయోగించారు.'
‘ఆరు పాటలు కదూ...అందానికి అందం ...కనులు మూసినా పాటే ..అనుకుంటూ వినాలని ఉందర్రా...నన్ను కాసేపు ఆ ప్రపంచంలో తిరగనీండి ...'
‘అయితే...అటు పో...వీడేమిట్రా ఆ ఫేసూ వాడూనూ...ఏరా .కాసేపు నవ్వినవాడివి అలా కోపంగా మొహం పెట్టేవు...ఏం జరిగిందేమిటి?'
‘అందమైన నడక కాదురా అందమైన నడవడిక ముఖ్యం'
‘ఓరోరి ఫిలసఫరూ...జిందగీ ఇక్ సఫరూ...నీ సఫరింగుకి కారణం ఏమిటిరా బాబూ?'
‘అదే అదే...ఇక్ సఫర్ అంటూ ఆమె ఆగ్రా ప్రయాణం పెట్టుకుంది. తాజ్ మహల్ దర్శించింది. అంతటితో ఆగితే బావుణ్ణు.'
‘ఎవర్రా వారూ? హీరో ఔట్ అనగానే లోపలికి వచ్చిన హీరోయినా?'
‘కాదురా...గతేడాది మిస్ యూనివర్స్ ..'
‘పోగుట్టుకుందా మనీ పర్స్?'
‘జోకులాపరా...ఒరే నువ్వు చెప్పరా...'
‘ఒలీవియా కల్పో..'
‘కలిపో, తీసో అంటూ ఇప్పుడా లెక్కలేమిట్రా ...పర్సు కాబోలు పోయింది'
‘కాదురా...ఆ మిస్ పేరది. తాజ్ మహల్ కెదురుగా ఓ పెద్ద పాలరాతి శిలాసనం ఉంటుంది కదా..గుర్తొచ్చిందా...డయానా సీట్ అని ఆర్కియాలజీ వాళ్ళు పేరు పెట్టారు దానికి ...దాని మీద ఈమె ఎవరికీ చెప్పా పెట్టక చెప్పుల ప్రదర్శన చేసింది. ఆర్కియాలజీ వాళ్ళు లబో దిబో మని చివాట్లు పెట్టి అసలు వీళ్ళని ఇలా చెప్పుల ప్రదర్శనకి ఎవరు అనుమతిచ్చారో వారిని చెప్పు తీసి కొట్టాలి అన్నంత కోపంతో దుమ్ము దులిపేశారు'
‘అసలే..అక్కడ దుమ్మూ,ధూళి ఎక్కువే. ఇలా దులిపేస్తే... ఇంకాస్త పేరుకు పోదూ?'
‘అన్నీ జోకులేనట్రా నీకు?'
‘హాయిగా నవ్వేస్తే మనసు రిలాక్స్ అవుతుంది. బిజీ లైఫ్ లో నవ్వుతూనే అన్నిటినీ టేక్ ఈజీ. సంతోషం సగం బలం'
‘ఇంకోలా...చెబితే...ఆనందం అర్ధ బలం.'
‘అదే నా ఆరోగ్య రహస్యం అన్నారు అక్కినేని వారు'
‘అవును మేమూ అంతే అన్నారు దిలీప్ కుమార్ , అమితాభ్ బచ్చన్ మొదలైన తక్కిన వారు'
‘అక్కినేని అని ఇప్పుడే అన్నారు కదూ...ఇందాక ఎవరో విశ్వనాథ్ పేరెత్తారు. ఈ విశ్వనాథ్ గారికి దర్శకుడిగా దక్కిన తొలి చిత్రం అక్కినేని వారి అన్నపూర్ణా పిక్చర్స్ సమర్పించిన ఆత్మ గౌరవం '
‘ఒరే ..కంపూ..అదేరా కంప్యూటర్ కి షార్ట్ ఫాం. ఇప్పుడా తెవికీ పీడియా ఎందుకురా?'
‘అందం ..'
‘ఇక్కడేమీ ఇంటర్ వ్యూలు లేవు కదా...కంగారు పడక ఆస్ట్రేలియా లో యాస్ట్రే ధరలు అంటూ ఏదో తికమకగా తిక్క తిక్కగా చెప్పక తిన్నగా చెప్పి ఏడవరా బాబూ'
‘ఆత్రేయ ,కొసరాజు ,దేవులపల్లి వారు- ఈ ముగ్గురు కవులు తప్పించి శ్రీశ్రీ , ఆరుద్ర , సినారె , దాశరథి ..క్షేత్రయ్య వంటి వారు పాటలు రాసిన అందమైన చిత్రమది.'
‘వోయ్ వోయ్...ఇటీవల జీవన సాఫల్య పురస్కారం అందుకున్న గొల్లపూడి మారుతీ రావు ఈ సినిమాకి కథ కూర్చారు. సినిమా అనుసరణ దుక్కిపాటి మధుసూదన రావు గారిది. మాటలు గొల్లపూడి వారివి, భమిడిపాటి రాధాకృష్ణ గారివి. సంగీతం రాజేశ్వరరావు. ఇన్ని అందాలు ఉన్నాయి ఆ సినిమాకి'
‘అందుకేనేమో అందుకుంది నంది'
‘ముందు ..నే చెప్పబోయేది వినండి..'
‘ఊ( వింటాం చెప్పు...ఆ సినిమాలో ఒక పాటలో వచ్చేలా అన్నాం కదూ..'
‘సినారె గారు పరువము పొంగే వేళలో..'
‘సినారె మగవారు..పరువం పొంగడం ఏమిట్రా...'
‘తంతానర్రా...అడ్డుపడితే ...పరువము పొంగే వేళలో పరదాలవెందుకో...అని పాట రాశారు సి.నా.రె'
‘అదీ..అలా చెప్పు...సో.. ఇంకేమన్నారు?'
‘ అందమైన హృదయం నీది- హృదయమున్న అందం నీది '
‘భళారె ! సినారె !!'
‘ఇదే సినిమా గనుక టీవీలో వేస్తే... బ్యూటిఫుల్ ఈజ్ యువర్ హార్ట్ ...దేర్ ఈజ్ హార్ట్ ఇన్ యువర్ బ్యూటీ ..అని సబ్ టైటిల్స్ వస్తాయి, ఘోరంగా'
‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ..ఇది నిలిచేదేమో మూడు రోజులు ...బంధాలేమో పదివేలు ...అని పాట వస్తే వీళ్ళు ఇంగ్లీష్లో ఏమని వేశారో చెప్పనా? లుక్ ..దిసీజ్ గాడ్స్ టాయ్. దిస్ రిమైన్స్ ఫర్ త్రీ డేస్, టైస్ ఆర్ టెన్ థౌజెండ్'
‘ఏ భాషకి తగిన నేటివిటీ ఆ భాషకి ఉంటుంది. అది ఇంకో భాషలో పొసగదు. సరే...అందం గురించి చెప్పనివ్వండి. ఇందులోనే..అంటే ఈ ఆత్మగౌరవం సినిమాలోనే..ఆరుద్ర అంటారు- అమ్మాయిలు ఎటు బొంకినా అహ అందమెంతొ చిందేనులే..అని.'
‘ఇదే సినిమాలో దాశరథి గారు మాత్రం ఊరుకున్నారా? అందేను నేడే అందని జాబిల్లి – నా అందాలన్నీ ఆతని వెన్నెలలే – అనేసి జారుకున్నారు'
‘అందం,ఆనందం అంటూ ఊ తెగ లెక్చరు దంచారే... చూడండి ఈ సినిమాలో దాశరథి ఇంకొక పాటలో ఏమన్నారో...
ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి – వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి '
‘అద్గదీ... అందం, ఆనందం అలా కలిసొచ్చాయన్న మాట.'
‘ఒకే సినిమాలో అందం మీద నాలుగు పాటలా? అయితే వీడియో పెట్టారా బాబూ. కనులు చూసినా పాటే ..'
‘ఎన్టీ ఆర్ అంటే కొండవీటి సింహం రా బంగారు కొండా...ఏదీ ఈ మధుమాసంలో పాట కూడా వినిపించేయ్.'
‘అందం,హృదయం –హృదయం,అందం అని మిర్రర్ ఇమేజ్ పదాలు వినిపించావు కదా...నాకూ గుర్తొచ్చాయి...ఆత్రేయ గారే అన్నారు...**ఈ అందానికి బంధం వేశానొకనాడు – ఆ బంధమే నాకందమైనది ఈనాడు **...ఇందులోనూ మిర్రర్ ఇమేజ్ ఉంది.'
‘అయితే ఇకనేం..ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు ని దివినుంచి రప్పించేయడమే'
‘మిర్రర్ ఇమేజ్ ని పాటల్లో ఆత్రేయ గారే ప్రవేశపెట్టారోచ్. దాగుడు మూతలు సినిమా పాట ఉంది- దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం ...అందులో అంటారు బుద్ధికి హృదయం లేక, హృదయానికి బుద్ధే రాక...అని'
‘ఆగ్రా అన్నావ్ ఇందాక. ఇప్పుడు ఆగరా బాబూ... ఈయనకన్నా ముందే పింగళి వారన్నారు – అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే...అని. మిర్రర్ ఇమేజ్ ఎప్పటిదోరా'
‘ఒరే ఒరే ..మీ మాటల దెబ్బలాటలు అందంగా ఉన్నాయిరా.'
‘ఎవర్రా అదీ ...మొగుడూ పెళ్లాల్లా దెబ్బలాడుకుంటున్నారూ... అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ '
‘ఏమిట్రా ..ఆరు పాటలూ వినడం అయిపోయిందా..మళ్ళీ వచ్చావ్...నీకేం కావాలి?'
‘నాకూ పెళ్ళాం కావాలి...'
‘మా నాయనే ...పెళ్ళామట పెళ్ళాం...మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడు..'
‘అన్యాయంరోయ్ ...నేను ఆ సినిమా పేరు చెప్పి మీ నుంచి ఆత్రేయ రాసిన పాట రాబట్టుకుందామనుకుంటే...హాస్యాలూ మీరూనూ...'
‘అదో సినిమా అని మాకు తెలిస్తే కదరా...ఊరుకో నాన్నా ఊరుకో'
‘ఆ పాటలోరా...ఆత్రేయ భలే అన్నార్లే..'
‘ఏమని?'
‘ ఆడది వెతికే అందం ఒకటే/ వంచనలేని మంచితనాన్నే _**
అప్పుడు మగడు వామనుడైనా హిమాలయంలా కనపడును
_ _ఆకారంలో ఎలాగున్నా /మన్మధుడల్లె వుంటాడు**_ '
‘ఒరే...ఇంత జ్ఞాపకంరా నీకూ?'
‘ఆ బడాయి...ఇందాక అందానికి అందం పాటలు వింటూ ఆత్రేయ పాటలు సెర్చ్ చేసి ఉంటాడు'
‘ఎంత సెర్చ్ చేశాం అన్నది కాదురా ముఖ్యం ..ఎంత రిసెర్చ్ చేశాం అన్నదే చూడాలి'
‘వీడి మాటల ధోరణి చూస్తే స్కాలర్ ని కాలర్ పట్టి వాయించేలా ఉన్నాడు'
‘వాయించడం అంటే గుర్తొచ్చింది...ఒరే ఒరే ..నాకూ పెళ్ళాం కావలి సినిమాకి ఎవర్రా సంగీతం?'
‘ఎస్ రాజేశ్వరరావు గారి అబ్బాయి'
‘కోటి?'
‘ఉహూ(....ఇంకొకరు'
‘వాసూ రావు?'
‘శాభాషు రావూ'
‘ఒరే...చిన్నమాట ..ఒక చిన్న మాట '
‘సీక్రేటా?'
‘సీక్రేటు కాదు..సిగరెట్టూ కాదు...వేటూరి వారి పాట....పాట పాడ లేక పైకి వచనంలో అన్నా'
‘ఆహహా ...గుబాళింపు...మల్లెపూవు..'
‘ఒరే ఒరే..ఇది బాయిస్ హాస్టల్ రా...కొయ్యకు'
‘వాడు సినిమా పేరు కలవరించాడురా'
‘వాడు సరే...ఇదిగో వీడి పని ఎంతసేపూ వీడియో చూసేయడమే ... వేటూరి వారి పాట కి ఎన్టీఆర్ నటన కదా మరి'
‘ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం...అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం '
‘ఎన్నిసార్లు తలుచుకుంటున్నామో ఈ వాక్యాన్ని. వేటూరి వారి ఈ మాటలకి ప్రేరణ తెలుసా?'
‘చెప్పరా...తిలకిస్తున్నాం పాటని'
‘సగం సమాధానం నువ్వే ఇచ్చేశావ్'
‘దేవరకొండ బాలగంగాధర తిలక్ ...రచయితా,కవి ...అన్నవి'
‘ఏమన్నారాయన?'
‘నా అక్షారాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు '
‘వావ్...ఒరే ...ఎటురా...లాబ్ కా ?'
‘సెకండ్ షో...బాపు బొమ్మ కి'
‘ఏ బొమ్మ?'
‘అందాల రాముడు '
‘పిచ్చాడు...వీడియోలు చూసుకోక థియేటర్ కెళతాడు. అన్యాయం ..మనల్ని రమ్మన్నడు. ఒక్కడే వెళ్ళిపోతాడు'
‘ఏడీవీ...రూలు అంటారు (ఎవడి డబ్బు వాడిదే) కానీ..మూడు సార్లు నాకే పడింది మొత్తం దెబ్బ. అందుకే ఎవడి దారి వాడిదే'
‘అలాగే చూడరా బాబూ ధియేటర్ కి వెళ్లి మరీ... సినీ పరిశ్రమకి అదే అందం. అదే ఆనందం. చూడు అత్తారింటికి దారేదీ...రిలీజ్ కి ముందే ఎవరో కాపీ చేసి అమ్మేశారు...పట్టేరనుకో...'
‘నాకు థాంక్స్ చెప్పండర్రా...నాకూ పెళ్ళాం కావాలి ..అని గుర్తు చెయ్యబట్టే కదా మీకు అత్తారింటికి దారేదీ ...గుర్తొచ్చింది'
‘ఓహోహో...ఇది అందమైన సెల్ఫ్ డోలు...వాయించండిరా, వీడు అనే దాక లబో దిబోలు...'
----------------------------------------------------------------------------------------------------------------
(రాత్రి ఏడు తరువాత మెస్ లో భోంచేసి ఎవరో ఒక స్నేహితుడి రూమ్ లో చేరే హాస్టల్ కుర్రాళ్ళ సంభాషణ గంటల కొలదీ ఇలాగే ‘అందంగా' సాగుతుంది. అదే ఆనందం...అదే అనుబంధం ప్రభూ మాకేల ఈయవు ..అన్నది ఊళ్ళో ఉండే కుర్రాళ్ళ నిత్య గానం)
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 12 అక్టోబర్ 2013