Krishnaprema Logo

కృష్ణప్రేమ

ఏమంత అవసరమొచ్చిందనీ వెళ్ళిపోయారు మాస్టారూ ...

29 అక్టోబర్, 2011

ఏమంత అవసరమొచ్చిందనీ వెళ్ళిపోయారు మాస్టారూ ...

Picture

తెలుగు వాళ్లకి తెలుగులోనే నవ్విస్తూ ఇంగ్లీష్ పాఠాలు నేర్పే గురువు అవసరం.

తెలుగు కథకులకి తెలుగంటే ‘ఇలా ఉంటే బావుంటుంది' అని నచ్చ జెప్పే కథా గురువు అవసరం.

ఇన్ని, మరిన్ని ‘అవసరాలు' తీర్చేందుకు ఒక ఇంట మాత్రమే రాముడూ కృష్ణుడూ ఒకటై పోయి ‘రామకృష్ణా రావు' గా అవతరించడం అవసరం. ఆ పేరు ‘అవసరాల రామకృష్ణారావు ' అని చెప్పి తరించడం మన కవసరం.

కథకి కథనం అవసరం.

కథకుడికి భాష అవసరం.

విషాదమైనా కంట తడి పెట్టించే ఆనంద బాష్పం కావడం అవసరం.

అందుకు హాస్యం ఆధారం కావడం అవసరం.

మనిషికి ఆత్మ విశ్వాసం అవసరం. రాజీ పడని మనస్తత్వం అవసరం. చేయి చాచని వ్యక్తిత్వం అవసరం.

మనుషుల్ని గమనించడం అవసరం. తలెత్తుకు తిరగడం తల తిరుగుడు కాదని గుర్తించడం అవసరం.

పొడవాటి జడ ఆడ పిల్లకి అందం అని మొహమాటం లేకుండా చెప్పడం అవసరం.

అన్నిటికన్నా – చెప్పింది చెయ్యడం, చేసింది చెప్పడం అవసరం.

ఇన్ని అవసరాలు ఉండబట్టే, ఇన్ని సరాలు మోసేందుకు సిద్ధపడ్డారు అవసరాల వారు.


తుని – తమ వంశానికి పుట్టిల్లు. తనకు జన్మ నిచ్చింది నాటి మదరాసు. భగవం‘తుని'కి ఈయన ఉనికి తెలిసి ఆయన తండ్రి పేరు ‘జగన్నాథ'మని తెలిసి ఆయన్ని ఒడిశాకి పంపింది. ఎందరో తెలుగు వాళ్లకి, మరెందరో ఒరియా వాళ్లకి ఆయన ‘ఇంగ్లీష్' నేర్పారు. ఐతే తెలుగు వాళ్లకి మాత్రమే అన్నట్టుగా ఆయన ‘అంగ్రేజీ మేడీజీ' అనే ‘తెలుగులో ఇంగ్లీష్ గ్రామర్' పుస్తకం రాస్తే ఎమెస్కో వారు 2005 లో ముద్రించారు. ఇది నిజంగా అనితర సాధ్యం. అలా ఇంగ్లీషు, తెలుగు భాషల పట్ల పట్టు ఉన్న ‘పన్' డితుడు చాలా అరుదు. అదే ఆయన బిరుదు. ఒక పక్క సరదాగా ఈదుతూనే ఇంగ్లీష్ గ్రామర్ లోతులు తలుచుకునీ జాగర్త పడండర్రా – అన్నది ఆయన సందేశం.

‘హేతువాది' లోనే ‘తు' ‘ది' అక్షారాలున్నాయి. ఎందరో హేతువాదులు స్వహితం కోరి ‘నేనూ నా దేహం' అనుకున్నవారే. కాని మాస్టారు అలా కాదు. తుది దాక ‘నేను' లేనప్పుడు ‘నా దేహం' నాది కాదు కనుక అది పరులకి ఉపయోగ పడాలి అని ఆశించి, తన బంధు మిత్రుల్ని తన మరణానికి ముందే శాసించి**‘అవయవాల' దాత గా చరిత్ర కెక్కిన అచ్చమైన హేతువాది.**

బరంపురం ప్రకాశం హాలు ఒకనాడు గురజాడ వారి సహ పంక్తి భోజనానికి ‘అన్నపూర్ణమ్మ' విడిది ఐతే, మరి కొన్నేళ్ళ తరువాత ఉప్పల లక్ష్మణ రావు వంటి మేధావి అందిచ్చిన కొత్త పిలుపుకి కదిలిన యువతరం**‘గంగ వెల్లువ'** కి ఆనకట్ట ఐతే, ధర్మపురి కృష్ణ మూర్తి వంటి మాస్టారి గంభీర వాక్కుల ప్రతిధ్వనుల**'మేరు నగ'** మైతే – సన్నగా, చిన్నగా ఉండి తాను నవ్వక ఎదుటవాడిని నవ్విస్తూ గులాబీ పువ్వు సింబల్ గా కొత్త ‘వికాసం' మొక్కను నాటి యువత మెదళ్ళలో నాటినఅవసరాల మాస్టారు అప్పుడెపుడో ప్రవేశపెట్టిన పరిమళాలు ఇప్పటికీ మోస్తూ ‘ప్రకాశం' అనేది శాశ్వతం అని గొప్పలు పోతోంది.

ఆయనికి ఒడిశా ఎంతగానో ఋణ పడి ఉంది. చిత్రం ఏమిటంటే ఒడిశా ప్రభుత్వాలు ఆయన్ని తగిన రీతిలో సత్కరించాయా అని అనుమానం. ఆంధ్ర తో బాటు మదరాసు, డిల్లీ, చండీఘడ్ లు ఆయనకి సాహితీ పురస్కారాలు అందించాయి.

ముళ్ళపూడి వారి ‘బుడుగు' - బొమ్మల రామాయణం కన్నా కొంచెం పెద్ద సైజులో అచ్చయిన ఆ రోజుల్లోనే అవసరాల వారి ‘కేటూ డూప్లికేటూ' వచ్చింది. అప్పట్లో వచ్చిన ‘చిక్కడు-దొరకడు ' సినిమా లోని ట్రిక్కులు ఇందులోనూ చూడవచ్చు. అవసరాల వారి పేరులోనే రామకృష్ణు లుంటే ఇంకా ఆయనకి మల్లాది రామకృష్ణుల ‘తెలుగు తనం' నచ్చకుండా ఉంటుందా? అందుకే ‘సంపెంగలూ సన్నజాజులూ ' మకుటంతో నవల రాశారు. ఎన్నో కథలు ఆయనివి.

మహాకవి శ్రీశ్రీ కూర్చిన పదబంధ ప్రహేళికలు ఎంతిష్టమో అంతే ఇష్టంగా తానూ క్ర్ర్రాస్ వర్డ్ పజల్స్ కూర్చి ‘రచన ' కందించిన రచయిత ఆయన.

బరంపురంలో అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం జరిగింది 1979 లో. ఆ సభలు మూడు రోజులు జరిగాయి. అనారోగ్య కారణంగాదేవులపల్లి వారు రాలేక పోయారు. అదొక్కటే వెలితి. కానీ తెర వెనుక శ్రీకృష్ణ దేవరాయల వారే ఉండి నడిపించారా అన్నంత గొప్పగా జరిగాయి ఆ సభలు. భరాగో అనబడేభమిడిపాటి రామగోపాలం ఈ సభల మీద రాసిన వ్యాఖ్యఆంధ్ర జ్యోతి ప్రచురించింది.భరాగో రాయనిది, మా మెదడులో పదిలంగా ఉండి పోయినది ఒకటి ప్రస్తావిస్తాను. మామూలుగా ప్రేక్షకుల్లో ముందు వరసలోనే కూర్చున్నారు అవసరాల మాస్టారు. అక్కడే కాబోలు కవి ‘జ్వాలాముఖి ' కూడా కూర్చునీ ఉన్నారు. ఆ రోజుల్లో ‘మినీ కవితలు' బాగా పాపులర్. అలాంటివి శ్రీ శ్రీమహా ప్రస్థానం ' లో అంతకు ముందే చూపించేరు. అప్పుడప్పుడే ‘టుమ్రీ ' లు అనే సాహిత్య ప్రక్రియ తలెత్తి చూస్తోంది. ఇది అలాగనీ హిందుస్తానీ సంగీతంలో చెప్పే ‘తుమ్రీ' వంటిది కాదు. ప్రేక్షకులనుంచి ఒకరు అడిగారు – ‘టుమ్రీ' అంటే ఏమిటి? ఇలా ఉంటుందా అని ఉదాహరిస్తూ. వెంటనే స్టేజి పైకొచ్చి అవసరాల మాస్టారు ఇలా అన్నారు- ‘ఉదాహరణకు ఉదాహరణే జవాబు: పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పలుకు బళ్ళు – జ్వాలా ముఖి- చాలా సుఖి' . ఎంత మెల్లగా చెప్పారో అంత వడివడిగా స్టేజి దిగి పోయారు. ఈ మాటలకు జ్వాలాముఖితో బాటు అంతా ఘొల్లున నవ్వేరు. అంతలా తేటతెల్లం చేసే ఆచార్యులు ఆయన.

బరంపురంతాపీ ధర్మారావు నాయుడు గారిని కన్నది. దేవరాజు వెంకట కృష్ణా రావు పంతులు గారిని పెంచింది. గురజాడ వారిని అతిథిగా ఆదరించింది. అవసరమున్నప్పుడల్లా అవసరాల మాస్టారు గారిని రప్పించుకుంది. ఇంత మంది ఉన్న చోట ‘మనం మనం బరంపురం ' అనుకుంటే ఎంత హాయి!

ఒక సభకు అవసరాల వారు రాలేక పోయి ‘అతిధులారా ఆప్తులారా ' అని పాట రాసి ఇచ్చారు ( చూడండి ఆప్తులు అనే మాట అతిథి కి తరువాతే వాడారు- సంప్రదాయానికి విరుద్ధులు కాదు మాస్టారు). ఆ పాటను దేవరాజు సీత అద్భుతంగా ఆలపించారు. అక్కడఅవసరాల వారే ఉన్నట్టు అందరికీ అనుభూతి కలిగింది.

అవసరాల మాస్టారు రెండు దశకాలు విశాఖలో ఉండి ‘ మృత దేహ దాన సమితి ' స్థాపించి , తరువాత దానిని సావిత్రీ బాయి పులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటేబల్ ట్రస్ట్ లో విలీనం చేసి ఒక కొత్త మార్గదర్శి అయ్యారు. అలా ఆయన మహారాష్ట్ర వారికీ సుపరిచితులే. చనిపోతూ అవయవాలు ఇచ్చేసి ఇప్పుడు ఆయన అందరి వాడై పోయారు. అవసరాల వారు లేరు అనే బాధ లేకుండా చేసుకున్నారు.

పూనేలో మాకు మస్తాన్ రెడ్డి వారు పరిచయం కావడం మా అదృష్టం. మస్తాన్ మంచి విశ్లేషకుడు , కథా రచయిత, హాసం ప్రోత్సాహించిన ‘హాస్యం క్లబ్' నిర్వాహకుడూనూ. ‘విశాఖ వెళ్లి వస్తాన్' అని మస్తాన్ ఎప్పుడు ప్రకటించినా అవసరాల వారి ‘స్టిల్ యాక్టివ్' ధోరణి గురించి కబుర్లు తెస్తాన్ అనేవారు. తరువాత మస్తాన్ విశాఖలోనే స్థిరపడి పోయారు. ఇంకా అవసరాల వారు విశాఖ లోనే ఉంటూ తనదైన ఇంగ్లీషు- తెలుగు శాఖలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారనే అనుకుంటున్నాం. ఇంతలోనే ఈ రోజు పేపర్లు కంట తడిపెట్టించాయి.

అవసరాల వారు ఎనిమిది పదుల కాలం జీవించి పది కాలాలు గుర్తుండేలా ‘మనిషి జీవించడం అవసరం' అని అన్నది చేసి చూపించిన అపర రామకృష్ణులు. హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ( 28 అక్టోబర్ 2011) మనుషుల్లో ఐక్యమై పోయిన ఆ పరమ హంస కి ఇవే నివాళులు.

పాటల కొలువు:
కనులు చూసినా పాటే, కనులు చదివిన పాటే – లు అలా ఉంచితే 'కనులు మూసినా పాటే' తో కొంత అవసరముంది. అవసరాల వారికి ఆడ పిల్లలు పొడవాటి జుట్టుతో ఉండి కనిపిస్తే ఇష్టం. వాళ్ళు ఏమాత్రం జుట్టు కత్తిరించేసుకున్నా కోపం వచ్చేసేది ఆయనకి. సత్యభామ కైనా, బాపు గీసిన ఆడపిల్ల కైనా పొడవాటి జుట్టే ఉంటుంది. అలా ఉంటేనే ‘మీరజాల గలడా నా యానతి ' అని అనగలిగే, అది అహంకారం అనిపించే, అలా కాని ఆత్మ విశ్వాసం హెచ్చవుతుంది. రంగ స్థలమే నా స్థానం అని చాటి చెప్పిన సత్యభామ వేషధారి స్థానం నరసింహారావు , సుస్వారాలఎస్.వరలక్ష్మి , పాటల పుత్రిక సుశీల పాడి మూడు తరాల వారిని ‘ఆహాహా ' లో ముంచి పడేశారు. ఆ మూడు పాటలు గుచ్చి అల్లిన ‘కనులు మూసినా పాటే ' అనే సుస్వర సరమే అవసరాల వారి స్మృతికి అంకితం.

అచ్చం అవే అచ్చులు:
'తిరుగులేని మాట' లో అవసరాల మాస్టారి ఇంగ్లీష్ గ్రామర్ చదివి గ్లామర్ పెంచుకోండి.

చిరునవ్వులోని హాయి :
'బాపురే రమణీయం' లో అవసరాల మాస్టారి రచనకి బాపు గీసిన బొమ్మ, మాస్టారిచ్చిన వివరణ చూడండి, చదవండి.
అలాగే రమణ - అవసరాల మాస్టారి రచనకిచ్చిన 'కితాబు' చదవండి.

ఆహా ఆహాహా :
'ప్రతి ముఖమూ ప్రముఖమే' లో అవసరాల మాస్టారు ఉన్నారు. గమనించండి. బరంపురం సభల్లో అతిరధ మహారధులెందరో ఉన్నారు. పోల్చుకోండి. భరాగో ప్రేమగా రాసిన ఉత్తరాన్ని అందుకోండి.

-డా. తాతిరాజు వేణుగోపాల్**, 29 అక్టోబర్ 2011**