మాఘ మాసం వెన్నెల –పాల బువ్వ గిన్నెలా
17 ఫిబ్రవరి, 2011


అంత్య ప్రాసలంటూ ఆరుద్ర ను తలచుకున్నప్పుడు ఎదురయ్యే మహా గొప్ప సమస్య ఇదే. శీర్షిక అలా కుదిరి పోయింది. గిన్నె అనడం బహుశ: రాబోయే ‘వరల్డ్ కప్'కు సూచన ఏమో? నిజంగానే మాఘ మాసం వెన్నెల చంద్రుడు బావుంటాడు. మాఘ మాసం పెళ్ళిళ్ళ సీజన్లో ‘నెర వెన్నెల కురిపించుతూ నెల రాజు పెండ్లిని చేసె' అని బందిపోటు చేత కూడా అనిపించ గల సమర్ధుడు ఆరుద్ర. నాకు తెలిసి ‘మాఘ మాసం వెన్నెల' అని ప్రయోగిస్తూ ఒక్క తెలుగు పాటా లేదు. అలాగే ఈ వెన్నెల్లో.. ఈ ముచ్చట్లు ఇది వరకెక్కడా విననివి , ఆస్వాదించండి.
తెలుగు సినీ సంగీతం లో ‘ సా పా సా' లు...
ఇది సంగీత శిక్షణ కాదు. ఒక చిన్న విలక్షణమైన విశదీకరణ.
సా –సాలూరు రాజేశ్వర రావు. ఈయనే ఎస్. రాజేశ్వర రావు, ‘స్వర' రాజేశ్వర రావు, , ఎస్. రాగేస్వరరావు, ఎస్. రాజే'స్వర'రావు, ‘రసాలూరు' రాజేశ్వరరావు. వీణ పాటల ‘పేటెంట్' ఈయనదే. యమన్ కల్యాణి రాగ ‘కమేండర్ ఇన్ చ్చీఫ్' ఈయనే. పియానో మెట్లు, ఫిడేలు గుట్లు, హార్మోనియం పట్లు, షెహనాయి మట్లు, కోపం వస్తే చీవాట్లు తెలిసిన ‘సకల కళా కోవిదుడు'.
పా- పెండ్యాల నాగేశ్వర రావు. ఈయన కూడా నాగే ‘స్వర' రావే. మరో నాగేశ్వరుడి (అక్కినేని)ని మహాకవి కాళిదాసుగా మార్చి జయభేరి మ్రోగేలా ‘క్లాసికల్ టచ్' ఇస్తూనే జగదేకవీరుడు నందమూరి అందగాడికి ‘శి-వ- శం-క-రి' పంచాక్షరి బహూకరించిన బహు ముఖ ప్రజ్ఞ్యాశాలి.
సా- సుసర్ల దక్షిణామూర్తి. The living legend. సుస్వరాల ప్రదక్షణం ఈ మూర్తి కి దక్కిన గౌరవం.
ఈ ‘సా పా సా' లే మరిన్ని స్వర విన్యాస సాహసాలకు దారి తీసాయి. మరెందరివో సావాసాలకు దారి చూపాయి.
గురువుకు తగిన శిష్యుడు -----
సుసర్ల దక్షిణా మూర్తి –
చక్కని పాట వరసకి చిక్కని స్పూర్తి
ఎస్. పి. కోదండపాణి-**
**వెండితెర పాటల వినూత్న బాణీ
సి. ఆర్. సుబ్బరామన్ శిష్యుడు సుసర్ల దక్షిణా మూర్తి
సుసర్ల దక్షిణా మూర్తి శిష్యుడు కోదండపాణి.
సుసర్ల వారి గురువు పేరులో రామ శబ్దం ఉంది.
సుసర్ల వారి శిష్యుడి పేరులో రామ శబ్దం ఉంది
సుసర్ల వారిది గుంటూరు జిల్లా.
కోదండపాణి గుంటూరు వారే.
సుసర్ల వారు ‘పరమానందయ్య శిష్యులు ' కి సంగీతమిచ్చారు (ఘంటసాల వారి సంగీతంలో వచ్చిన 1966 సం. చిత్రం కన్నా ముందే 1950 లో వచ్చిన చిత్రం)
పాణి ‘గురువును మించిన శిష్యుడు (1963)'కి సంగీతమిచ్చారు.
సుసర్ల వారు ప్రముఖ హిందీ గాయని – లతా మంగేష్కర్ చేత మొదటిసారిగా తెలుగులో పాడించారు (చిత్రం: సంతానం, 1955).
పాణి ప్రముఖ హిందీ గాయకుడు – మహమ్మద్ రఫీ చేత మొదటిసారిగా తెలుగులో పాడించారు (చిత్రం: పదండి ముందుకు,1962).
సుసర్ల వారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ‘బాల' మురళీకృష్ణ కు (బాల – గమనించండి) తొలి పాటను ఇచ్చారు.
పాణి సకల కళా వల్లభుడు ‘బాల'సుబ్రహ్మణ్యంకు తొలి పాటను ఇచ్చారు. (బాల- గమనించండి) (సుబ్రహ్మణ్యం – ‘సుబ్బ రామన్'యం గా వినిపించదూ?)
బాల మురళి వారి తొలి పాట- ‘సలలిత రాగ సుధా రస సారం' (1963) లో ‘సుమ, మధు, రాగ, సుధ' అనే నాలుగు పదాలున్నాయి.
బాలు గారి తొలి పాట –‘ఏమి ఈ వింత మోహం'–లో ‘సుమ, మధు, రాగ, సుధ,' అనే నాలుగు పదాలున్నాయి.
సుసర్ల వారు అక్కినేని కి రఘునాథ్ పాణిగ్రాహి (పాణి అన్న పదం గమనించాలి) చేత పాడించడం ఒక విశేషం.
అక్కినేని కి పాణి ఒక్క పాటా (అంటే పెదవి కదిపేలా) పాడించలేక పోవటం ఒక విడ్డూరం. (మంచి కుటుంబంలోని ‘త్యాగ శీలవమ్మా మహిళా' అనే పాట సన్నివేశంలో అక్కినేని ఉన్నా అది నేపథ్య గీతం. అక్కినేని లిప్ మూవ్మెంట్ ఉండదు).
సలలిత రాగ సుధా రస సారం –సర్వ కళా మయ నాట్య విలాసం , ఇది సుసర్ల వారి నాట్య గీతం (చిత్రం: నర్తన శాల,1963).
సర్వ కళా సారము నాట్యము, నయన మనోహరము, ఇది పాణి కూర్చిన నాట్య గీతం (చిత్రం: శ్రీ రామ కథ, 1968) .
సుసర్ల వారు ‘వచ్చిన కోడలు నచ్చింది' (1959) అనే చిత్రం కోసం తెతకమహిం (మంత్రం కాదు- తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) అనగా అయిదు భాషల గీతం స్వర పరిచారు.
కోదండపాణి ‘కథానాయిక మొల్ల' ( 1970) అనే చిత్రం కోసం కమతతెఉ (మంత్రం మారింది-కన్నడ,మరాఠీ,తమిళ్,తెలుగు,ఉరుదు) అనగా అయిదు భాషల గీతం స్వర పరిచారు.
( పాట కవలలు )
సుసర్ల వారు ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో' అనే పాటను పురుష (ఘంటసాల, 1955) కంఠం లో వినిపించారు.
పాణి ‘వెన్నెల్లో కనుగీటే తారకా- వినవే కన్నె మనసు కరిగించే కోరిక' అనే పాటను స్త్రీ (జానకి,1963) గళంలో వినిపించారు.
వెన్నెల ప్రస్తావనలో కొసమెరుపు:
సుసర్ల వారు స్వర పరిచిన ‘చల్లని రాజ ఓ చందమామ ' –పాట ఒక ‘ త్రిగళ' గీతం. (సుశీల, రఘునాథ్ పాణిగ్రాహి, లీల)
కోదండపాణి స్వర రచన ‘ఎంత బాగున్నది ఎంత బాగున్నది అందరాని చందమామ అందుతున్నది'- పాట ఒక ‘త్రిగళ' గీతం. (జానకి, ఘంటసాల, సుశీల)
దక్షిణామూర్తి కి ఉన్న ముందు మాట ‘సుసర్ల' అనేది ‘సుస్వరాల' గా మారిపోతే గనుక , కోదండపాణి కి ముందు ఉన్న మాటలు ఎస్ అంటే సా, పి అంటే పా అనే అనుకోవాలి కదా.
ఇప్పుడు చెప్పండి- ఇది కాక తాళీయమా? లేక నా పెన్ను ‘పాళీ'యమా? ఏదైనా సరే- ఇది మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ దొరికే నారికేళ పానీయమా? అయితే ధన్యుడ నైతి.
-- తాతిరాజు వేణుగోపాల్(ఫిబ్రవరి 17, 2011)