Krishnaprema Logo

కృష్ణప్రేమ

‘ఏ సీమ వారలో ఎగిరెగిరి ఒచ్చి...ఏ దూరపు సీమనో చేరుకొని...'

03 ఫిబ్రవరి, 2013

‘ఏ సీమ వారలో ఎగిరెగిరి ఒచ్చి...ఏ దూరపు సీమనో చేరుకొని...'

Picture

‘మాస్టారూ...భరత ఖండంబు చక్కని పాడి యావు ..అనే పంక్తి వరకు చాలనుకునీ చిలకమర్తి వారి పద్యంతో ఇవాల్టి మన సంభాషణ ప్రారంభిస్తూ మీ చిలుక పలుకులు వినాలని ఉంది.'

‘మంచిది బాబూ.. గోమాత లాంటి అమాయక జీవి, శ్రామిక జీవి మన దేశం. గోమాతని పూజించాలి. దేశ ప్రజలంతా హాయిగా జీవించాలి. సుశీలమ్మచెంగు చెంగునా గంతులు వెయ్యండి ' అని ఆవుదూడల నుద్దేశిస్తూ పాడితే ‘వినరా వినరా నరుడా ' అని గోమాతనై పోయి నేనూ ఒక పాట పాడాను. రెండు గీతాలూ మన కొసరాజు రాఘవయ్య కవి గారి రచనలే అనుకుంటాను. అలాగే కరుణశ్రీ వారి ‘గోఘోష ' పద్యాలు పాడాను. గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని చిత్రంగా మలచినప్పుడు వారి పూర్ణమ్మ క థని బుర్రకథగా వినిపించానా..అందులో ఆవులు, మొదవులు అనే మాటలు దొర్లాయి. నిజానికి ఆవులు,పెయ్యలు అని ఉండాలి. వారు అలాగే రాశారు. విజయనగరం లో నా సంగీత శిక్షణ కావడం వల్ల ఆ మాండలీకంలో దూడల్ని పెయ్యలు అంటారని తెలిసినా సినిమాలో ఈ మార్పు ఎలా జరిగి పోయిందో తెలియదు. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత సుశీలమ్మ పాడిన ఇదే పూర్ణమ్మ కథ లో పెయ్యలు అనే మాటనే ప్రయోగించారు. సంతోషం. మాండలీకాలు కవుల పాలిట కామ ధేనువులు!

సరే..ఇక నన్ను మాత్రం ‘పలుక రాదటే చిలకా ' అని జెండరు మార్చేయొద్దు బాబూ..'

‘అయ్యయ్యో ..ఎంత మాటండీ...ఏదో చిలకమర్తి వారు అంటూ యతి ప్రాసలతో మతి పోయి చిలక పలుకులు అని అన్నాను ... అయినా మీరు గోరొంక అవతారమెత్తి మాకో చక్కని పాట వినిపించారు కదండీ.. అవన్నీ రప్పించాలి మీ నుంచి. అదీ నా ఎత్తుగడ. మీరు చూడండీ.. దేశం అనగానే ఎంచక్కా మన గురజాడ వారిని స్మరించుకున్నారూ... ఆయనొక్కరే బహుశా దేశాన్ని మట్టిగా కాక మనుషులుగా అభివర్ణించింది. అందుకే దేశాన్ని ప్రేమించమన్నారు, అంటే మనుషులంతా ప్రేమగా ఉండమనేగా?'


‘అంతే కాదు ..మంచి యన్నది పెంచుమన్నా అని హితవు పలికారు. పాడియావు అంటావ్, చిలక అంటావ్, గోరొంక అంటావ్. ఏమైంది బాబూ ఉన్నట్టుండి ఈ మూగజీవుల ప్రసక్తి తెచ్చావ్?'

‘ఒకనాడు మూగ జీవులకి మల్లే దేశంలో ఎందరో మంచిగా చెప్పాలనుకున్నవి చెప్పలేక తమలో తాము కుమిలిపోతుంటే వారి తరఫున మీ వంటి గాయకులు తరలి రావడం ఈ దేశం చేసుకున్న అదృష్టం కదండీ మాస్టారూ'

‘సినిమాలు నాకా అదృష్టాన్ని కలిగించాయి బాబూ. లేకపోతే గుడివాడ దగ్గర మా చౌటుపల్లె లో కచేరీలు చేస్తూ మా గ్రామసీమకే పరిమితమై పోయేవాణ్ణి కదూ...'

‘నా ఎత్తుగడ ఫలించింది మాస్టారూ... మీ నుంచి ఈ ‘సీమ ' టపాకాయ ఎప్పుడు పేలుతుందా అని ఆలోచిస్తున్నాను. మాకు టపాకాయ కన్నా ఘంటసాల అనే గాన కల్పవృక్షం లోని గళ శాఖ మీద మొలిచిన పాట కాయలే ఇష్టం.. గోరొంక అవతారమెత్తి మీరు చిలక ఎదుట ఏం పాడారూ? ‘ఏ సీమదానవో ఎగిరెగిరి ఒచ్చావూ..మా మల్లెపూలు నీకు మంచి కథలు చెప్పులే..' అనేగా? మీది ఏ సీమ అనేది మేం తెలుసుకునే అవసరం లేకుండానే సరస్వతీ దేవి మీకు ఉదాత్తమైన ‘గళసీమ 'నిచ్చి, సంగీత కళా (శాల) సీమ ‘ద్వారం ' దగ్గరికి చేర్చి, ‘చిత్ర సీమ ' వైపు మిమ్మల్ని రానిచ్చి మూడు పదుల కాలం పాటమల్లెపూల పరిమళాలు మీ చేత వెద జల్లించేలా ‘స్వర్గసీమ(1945)'లో అడుగు పెట్టించింది. మీరు పాడిన ఒక్కొక్క పాట మల్లెపూవై ఒక్కొక్క మంచి కథ చెబుతూ వచ్చాయి. ఎందుకో ఒకసారి మీకు సందేహం కలిగి ‘మల్లియలారా ..మాలికలారా..మౌనముగా ఉన్నారా? మా కథయే విన్నారా?' అని మీరు పాడిన పాటలనే ప్రశ్నించారు. కొన్నేళ్ళకే జీవిత కథకి గడువు కాలం ముగియనుందని మీకెలా తెలిసిపోయిందో గానీ ‘పాట'సఖిని ఉద్దేశిస్తూ ఒక మాట అని మాట నిలబెట్టుకున్నారు. ఏమిటా మాట? ‘రానిక నీకోసం సఖీ.. ఏ ‘దూరపు సీమ'నో చేరుకునీ..'!

మాకు తెలుసు మాస్టారూ...మీ పాట వింటూ స్వప్నసీమ లోకి మేం వెళ్లిపోతుంటే అక్కడ మీరు గళం విప్పి, మాకు మెలకువ రాగానే మా ఎదుట మౌనం పాటిస్తున్నారనీ..

మాస్టారూ, ఎంత మీ వెండి తెర పాటలతో మిమ్మల్ని నిత్యం దర్శించుకుంటున్నా తన్మయత్వంలో కళ్ళు మూసుకుని ఒక్కసారి తెరిచేసరికి మీరు లేరనే ‘వెలితి తెర' అడ్డు పడుతూనే ఉంది. మాకేం తెలుసు? మీరు ఎంతో లలితంగానే ‘గీతోపదేశం' చేస్తూ అలా అలా మీ విశ్వరూపాన్ని ఆకాశం వైపు తరలించుకు పోతారనీ?

పోనీ లెండి... విధి అనేది ఏ సీమకి చెందిందో ఆ విలాసం మాకు తెలియదు గాక తెలియదు గానీ ...మీ పాటల మల్లె పూదండ మా తెలుగు తల్లికి వేయగానే ఒక్కొక్క పాట మల్లికలో ఒక్కొక్క సీమ అమరి పోతోంది. ఆమె హృదయ సీమ ఏక కాలంలో కాసేపు పులకించడం, కాసేపు విలపించడం గమనిస్తుంటే ఆ తల్లి క్షీరధారలు అందిచే గోమాతలా కన్పిస్తోంది, దూడలమై చెంగుచెంగున ఆమె చెంతకు చేరుతున్నాం మేం.

{సీమ విరులు పూల దండలో ఇలా అమరి ఉన్నాయి-

భానుమతి,ఘంటసాల వారు పాడిన లైలా మజ్నూ(1949) చిత్ర యుగళగీతం ‘విరి తావి లీల' నుంచి ‘పదసీమ '(సముద్రాల)...

'ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు..గగన సీమ ల దేలు ఓ మేఘమాలా'..మల్లీశ్వరి(1951), నాగరాజుల నోట దేవులపల్లి వారి పాట...

ఘంటసాల వారి స్వీయ సంగీతంలో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న వి.కృష్ణ గారి గీతం ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..' కొద్ది మార్పులతో ‘పల్లెటూరు( 1952)' చిత్రంలో చోటు చేసుకుంది. ‘వీర రక్తపుధార ధారవోసిన సీమ '-పలనాడు గురించి తొలి పంక్తుల్లో చెబుతారు. ఇక తతిమ్మావి :

ఘంటసాల మాస్టారు గారి సొంత చిత్రం సొంతవూరు (1956) లో మాస్టారు పాడిన ‘స్వాగతంబోయి ' గేయం నుంచి ‘స్వాతంత్ర్య సీమ ', ‘గ్రామ సీమ ' (సముద్రాల)

పెళ్లికాని పిల్లలు (1961) చిత్రంలోని యుగళగీతం ‘నాలోని మధుర ప్రేమ ' నుంచి ‘ఏకాంత సీమ '(ఆరుద్ర)

మహామంత్రి తిమ్మరుసు (1962) చిత్రం లోని యుగళగీతం ‘మోహనరాగ మహా మూర్తివంతమాయే ' నుంచి ‘చిత్రసీమ ' (పింగళి)

దాగుడుమూతలు (1964) చిత్రంలోని ‘గోరొంక గూటికే చేరావు చిలకా ' పాట నుంచి ‘ఏ సీమ దానవో'(దాశరథి)

దాగుడుమూతలు (1964) చిత్రంలోని యుగళగీతం ‘మెల్ల మెల్ల మెల్లగా ' నుంచి ‘వలపు సీమలు '( ఆత్రేయ)

దేవత (1965) చిత్రంలోని నేపధ్య గీతం ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ' నుంచి ‘గృహసీమ ' ( వీటూరి)

పాండవవనవాసము (1965) చిత్రంలోని ఒక యుగళగీతం ‘హిమగిరి సొగసులు మురిపించే మనసులు ' నుంచి ‘మనోజ్ఞ సీమ ', ‘అనురాగ సీమ '(సముద్రాల)

పాండవవనవాసము (1965) చిత్రంలోని ఒక యుగళగీతం ‘నా చందమామ నీవె భామా ' నుంచి ‘ప్రేమసీమ '(సముద్రాల)

పాండవవనవాసము (1965) చిత్రంలోని ఒక యుగళగీతం ‘రాగాలు మేళవింప ' నుంచి ‘మధుర సీమ '(సముద్రాల)

వీరాభిమన్యు (1965) చిత్రంలోని యుగళగీతం ‘అదిగో నవలోకం ' నుంచి ‘దోర వలపు సీమ '(ఆరుద్ర)

పేదరాశి పెద్దమ్మ కథ (1968) చిత్రంలోని యుగళగీతం ‘ఇదియే అందాల మానవ సీమ ' నుంచి ‘మానవసీమ ','మురిపాలసీమ ' (ఆరుద్ర?)

జైజవాన్ (1970) చిత్రంలోని యుగళగీతం ‘అనురాగపు కన్నులలో ' నుంచి ‘రణసీమ ' (సి.నా.రె?)

మాయని మమత (1970) చిత్ర గీతం ‘రానిక నీకోసం సఖీ ' నుంచి ‘దూరపు సీమ '( దేవులపల్లి) }

ఒక్కొక్క సీమ విరిని ఏరుతూ సుందరాచారి గారి వైపు గర్వంగా చూసి చిలకమర్తి వారు మీ వైపు తిరిగి ‘తెలుగుసీమ చక్కని పాడియావు' కదూ గోపాలా ...అనే ఎస్ ఎం ఎస్ ఇవ్వనా మిస్టరూ'(మాకు మీరు మాస్టారైతే, మీకన్నా వారు వయసులో చాలా పెద్దవారు కనుక మిస్టరూ అని కాక మరేమంటారూ, యస్ మాస్టారూ యస్ ) అని శాటిలైట్ వైపు టార్చి లైట్ వేశారు.

ఆ వెలుగు నా మీద పడగానే నా ‘స్వప్న సీమ' చివర్లో మాస్టారు సంగీత సామ్రాజ్యానికి రాజా వారిలా కనిపించారు. వచ్చేవారం రాజా వారిని ‘రాజా' లాగ చూపించే కల వరమై వస్తుందో, రాజా వారు నిద్రలేవరు అన్న కలవరమే తెస్తుందో... ‘ఏమౌనో చూతము'!

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 03 ఫిబ్రవరి 2013 (ఆదివారం)