Krishnaprema Logo

కృష్ణప్రేమ

Big B- B 70- Busy Bee

11 అక్టోబర్, 2012

Big B- B 70- Busy Bee

Picture

కొం దరికి పుట్టిన రోజులు తతిమ్మా రోజుల్లాగే అతి సామాన్యం.

కొందరికవి శూన్యం- వారెప్పుడు పుట్టారో వారికి తెలియదు, చెప్పే వాళ్ళు ఉండరు.

మరి కొందరికి వారి పుట్టిన రోజులు మాత్రం అనన్య అసామాన్యం.

కొందరు.. కొందరేమిటీ .. ఆ లెక్కకొస్తే ఇంచుమించు భారతీయులందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే జనవరి నుంచి డిసెంబర్ లోగా ఎప్పుడు పుట్టినా ఆ రోజులే సులభంగా గుర్తు చేసుకుంటారు. ఏ కొద్ది మందో 'తిథుల ప్రకారం' అంటూ కష్టపడుతుంటారు.

పాతిక, యాభై, అరవై, డబ్భై ఆయిదు ... ఈ అంకెల తమాషా చిత్రంగానే ఉంటుంది.

ఇవి ఏళ్ళు అయితే సిల్వర్, గోల్డెన్, డైమండ్, ప్లాటినం జూబి'లీల' పరంగా వాటి లీలలు ప్రత్యేకత కలిగి ఉంటాయి.

'అరవైలో ఇరవై వయసు ఎవరికైన వచ్చేనా' అని మనసు కవి ఆత్రేయ గారికి కలిగిన సందేహం.

'అరవైకీ ఆరేళ్ళకి ఏమిటి అనుబంధం ..దీపానికి కిరణానికి ఉన్న సంబంధం ...' అని మంచి కవి గోపి గారి ప్రవచనం.

'ఏడాదికే నాలుగేళ్ళు రావాలి ..మా బాబు ఎప్పటికి ముప్ఫయిగ ఉండిపోవాలి' అన్నది మల్లెమాల కవి గారి వింతాశయం.

బహుశా ఇలా ముగ్గురు తెలుగు కవులే వయసు మీద మనసు పెట్టి రాశారనవచ్చు.

అందుకే 'నా మనసు ఇంకా ముప్ఫయ్యే ' అంటారు ఎనభై దాటిన అక్కినేని. వయసు కన్నా మనసు 'యంగ్' గా ఉండాలని ఆయన శభాష్ అనదగ్గ సుభాషితం పలికారు.

అరవై ఏళ్ళకి రిటైర్ అయినాయాన్ని అడిగితే ' అరవై అంటే ఏదో అర వెయ్యి అని పెద్ద మొత్తం అనుకుంటారు - అటు ఆరు ఇటు సున్న ... అందుకే మునుపటి కన్నా ఎక్కువగా భార్య మీద అరుస్తున్నా' అంటారు.

మరి డబ్భై మాటేమిటీ ?


డబ్భై ఏళ్ళాయన్ని అడిగితే ' ఏముందీ ...అటు ఏడు - ఇటు సున్న! అందుకే భార్యతో పాటు ఏడుస్తున్నా' అంటారు.

అలాంటిది భర్త డబ్భయి ఒకటవ పుట్టిన రోజుని భార్య ఘనంగా జరపడం ఎక్కడ సాధ్యం?

ఏబీ పుట్టిన రోజుని ఒక రోజు ముందు బీవీ జేబీ ఆడంబరంగా, ఆర్భాటంగా జరపడం ఎందుకు కాదు సాధ్యం? ఒక రోజు ముందు ఎందుకంటే ఆ రోజుకి డబ్భయి పూర్తయినందుకు!

ఏబీ అంటే అమితాభ్ బచ్చన్. జేబీ అంటే జయా బచ్చన్ అని ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం అనవసరం.

ప్రముఖ కవి సుమిత్రా నంద్ పంత్ తన మిత్రుడైన హరివంశ్ రాయ్ బచ్చన్ గారి శిశువుని చూసి ఒక వినూత్న మైన పేరు సూచించారు. ఆ పేరే అమితాభ్. ఆ శిశువే అమితాభ్.

అమితాభ్ అంటే అమితమైన ప్రకాశం అని అర్థం.

హరివంశ్ రాయ్ ప్రముఖ కవి. తండ్రి కవిత్వాన్ని తనయుడు అమితాభ్ గంభీర స్వరంతో చదువుతుంటే ఎవరికైనా సరే మనసు పులకరిస్తుంది.

ఆ మత్తైన స్వరమే, ఆ గమ్మత్తైన గళమే అమితాభ్ కి వరమైంది.

అయితే నటుడిగా, నట గాయకుడిగా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకి ఎదిగిన ఈ పొడగరికి తొలినాళ్ళలో 'పనికిరావు పో' అన్న నినాదమే దక్కింది. నిరసన జరిగిన చోట విప్లవాత్మకమైన మార్పులు రావడం తధ్యం.

సినీ పరిశ్రమ గానీ ఆకాశవాణి గానీ తొలి దశలో ఎవరినైతే కాదు పొమ్మన్నాయో ఆ తరువాత వారే ఆ రాజ్యాలకి తిరుగులేని పట్టాభిషిక్తులయ్యారు.

'సాత్ హిందుస్తానీ (1969..ఆ ప్రాంతంలో)' లో చిన్న అడుగు పెట్టిన ఈ ఆరడుగుల రెండించీల ఎత్తున్న మనిషి ఇవాళ నలభైకి పైగా సినీ వత్సరాలు గడిపి ఏడు పదుల వయసులోకి అడుగు పెట్టారు.

తను విశ్వవిఖ్యాత నటుడు. భార్య నటి.

'నాపేరు బచ్చన్ , నా మనసుకి మీరు బాగా నచ్చెన్' అని ఆయన జంజీర్ సినిమా రోజుల్లో తన ఎత్తులో సగముండే జయ బాధురి ముందు తన ప్రేమ మాధురి వ్యక్తం చేస్తే ఆమె నవ్వేసింది. ఇతను బచ్చనా లేక నిచ్చెనా అని ఆమె మళ్ళీ నవ్వింది. ఆ నవ్వే ఆనక నీ ఎత్తులో సగమైనా నీలో సగమై పోనా అని అర్థాంగికారం తెలిపింది. ఆమె అతని అర్థాంగి అయింది.

స్నేహితులు వెల్ డన్ అని వారిని లండన్ పంపించేశారు.

అలా చేసిన తొలి గగన విహారం ఆయన మరచి పోలేదు. అమిత ప్రకాశానికి అదే నాంది.

అటువంటిది అదే లండన్ లో ఇటీవల కాలంలో జరిగిన ఒలింపిక్ క్రీడ చివరి రోజున జ్యోతిని చేపట్టి పరుగు పెట్టిన అరుదైన గౌరవం, ఘనత భారతీయుడు, జగమెరిగిన నటుడు ఈ అమితాభ్ కే దక్కడం ఎవరికి కాదు గర్వ కారణం?

ఆయన కొడుకు నటుడు. కోడలు విశ్వసుందరి, నటి.

అమితాభ్, జయల పూజాఫలం కూతురిగా శ్వేత , కొడుకుగా అభిషేక్ ఒకనాడు. ఆ తరువాత 'ఐశ్వర్య ' మే కొడుకు వెంట నడిచి వచ్చింది. ఇప్పుడు 'ఆరాధ్య ' మనదగ్గ మనవరాలు దక్కింది. అందుకాయన సిద్ధి వినాయకు ణ్ణి వినమ్రంగా నమస్కరిస్తారు.

అసలు ఆ తండ్రే.. ఆ వినాయక మూర్తే తనకి మరు జన్మ ఇచ్చాడు. ఒకనాడు 'కూలీ ' షూటింగ్లో స్టంట్ సన్నివేశమైపోగానే 'వారేవా ..ఏం చేశారు సార్' అని అంతా పొగుడుతూ మూగారే గాని ఆయన మూలుగుతున్నట్టు ఎవరికీ అనిపించలేదు. కడుపు పట్టుకొని ఆయన గిల గిల కొట్టుకునీ పడిపోయారు.

ఆ గండం నుంచి బయట పడినా బోఫోర్స్ నిందలు భరించడం కష్టమై పోయింది ఆయనకి. జేజేలు పలికినవారే ఛీఛీ అన్నారు. ఎబీసిఎల్ సంస్థ పెడితే అది అప్పుల్లోకి నెట్టింది ఆయన్ని. అదో పీడ కలల నిద్రాభంగ జీవనం...

ఎంత ఎత్తుకి ఎదుగుతామో అంత పల్లం కూడా ఎదురు చూస్తుంటుంది, గభాల్న లాగేయడానికి.

ఈ తరంగ తత్త్వం అన్ని రంగాల్లో అందరికీ చెల్లుతుంది. పడి లేచే కెరటం చూడు... పడినా లేచి నడిచి చూడు -- ఈ సత్యం అను నిత్యం ఆయన ఆపాదించుకొనీ కాలానికి అనుగుణంగా కదిలారు.

కారు చీకట్లు కమ్ముతుంటే కారు లైట్లు పనికి రావా?
అమితాభ్ బహు 'కారు'ణ్య మూర్తి... అనగా ఎన్నో కార్లున్న వ్యక్తి. పుట్టిన రోజు అక్టోబర్ పదకొండున కనుక ఆయన దగ్గర పదకొండు కార్లున్నాయని అంచనా. అవన్నీ కాంతులు వెదజల్లితే అదే 'అమితాభ్' అనే మాటకి సరియైన అర్థం అని ఆయన భావమేమో!

అమితాభ్ బచ్చన్ ప్రతిభ - దేశం మొత్తాన్నేకాదు విదేశాల్నీ ఆకట్టుకుంది. విదేశం నుంచి బుల్లి తెర మీదకి ఎగిరి వచ్చిన క్విజ్ కాన్సెప్ట్ దేశీయంగా 'కరోడ్ పతి ' అయితే దాన్ని నడిపే తీరు అమితాభ్ కి తప్ప మరొకరికి సాధ్యం కాలేదు. చివరకి అమితాభ్ తీరుని విదేశాలూ అనుసరించాల్సి వచ్చింది.

అమితాభ్ అమిత భాషి అనుకుంటే పొరపాటే. బహు భాషీయుడు కూడా కాదు. కాని అన్ని భాషల నిర్మాతలు, దర్శకులు ఆయన లోని పటిమని మనసారా పట్టి చూపగలిగారు. అందుకే 'పా ' అనే ఏకాక్షరం, షోలే అనే రెండక్షారాలు, షరాబీ అనే మూడక్షరాలు ఇంకా ఇంకా పేర్చుకు పొతే అమర్ అక్బర్ ఆంథనీ , ముకద్దర్ కా సికందర్ , కభీ కుషీ కభీ గమ్..అలా అలా ఆయనంత ఎత్తుకు ఎదిగిన అక్షరాల చిత్రాలన్నిటా ఆయన తన నట విశ్వా రూపం చూపారు.

తన కొడుకు తండ్రిగా తాను అతని కొడుకుగా పాత్రోచితంగా నటించగలిగేది అమితాభ్ కే సాధ్యం. అది అనితర సాధ్యం.

వాస్తవానికి ఈ అలాహాబాద్ శ్రీవాస్తవీకుడు బాబూ మొషాయ్ అని ఆనంద్ లో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పిలిచినట్టు బెంగాలీ బాబే. ఆ వరసన బెంగాలీ భాషీయులైన జయ,షర్మిలా, రాఖీ, మౌసమీల సరసన ఒకనాడు, రాణీ సరసన కొన్నేళ్ళ క్రితం ఆయన అద్భుతంగా పోటీ పడి నటించారు. బెంగాలీ కాని అరుణా ఇరానీ బాంబే టు గోవా వెళ్ళే బస్సు లో కూర్చుంటే 'దేఖాన హయోరే' అని అల్లరి చేష్టలు ఎంత బాగా చేశారూ? దక్షిణ దిశగా జెమినీ గణేషన్ కుమార్తె రేఖా 'సలామీ ఇష్క్' అంటే ఎందుకు రిస్క్? అని అనలేదు ఆయన. సౌందర్య తో, జయసుధతో సూర్య వంశ్ లో నటించినా ఆ చిత్రం మూలం ఏ హిందీ నవలో అన్నట్టు మెస్మరైజ్ చేశారు.

ఒకానొక తొలి దశలో సరియైన దారి దక్కక అమితాభ్ దిక్కు తోచని స్థితిలో ఉంటే ఆత్మీయంగా కళ్యాణ్ జీ ఆనంద్ జీ అన్నదమ్ములు (సంగీత దర్శకులు) స్నేహ హస్తం చాచి ప్రకాష్ మెహరా గారికి పరిచయం చేశారు. ఆయన తీసిన జంజీర్ చిత్రం లో ఇన్స్పెక్టర్ ఎడమ చేత్తో పిస్తోల్ పేల్చితే అంతకు ముందెన్నడూ అమితాభ్ ని అలా చూడని జనం పిచ్చగా వెర్రిగా చూస్తూ మైమరచి పోయారు. ప్రాణ్ తన నటనకి ప్రాణం పోస్తే అతనికి ఎదురొడ్డిన ఇన్స్పెక్టర్ గా అమితాభ్ జంజీర్ లో జీవం పోశారు. కొత్త అమితాభ్ కనిపించారు.

కొత్తదనంతో పాటలు పాడి మరో కొత్త రూపం మెల్ల మెల్లగా చూపించారు.

పద్మ భూషణుడు ... కాని పద్మ 'భాషణుడు' గా భాసిల్లారు. తన వయసుకి తగిన పాత్రలు ఎంచుకునీ అతనితో పాటు ఎదిగి వచ్చిన అమితాభిమానులకి ఇప్పటికీ ఈ బాలివుడ్ బాబు 'వస్తున్నా మీకోసం ' అని తన జీవన యాత్ర సార్ధకం చేసుకుంటున్నారు.

బిగ్ బీ ఒక బిజీ బీ ... తేనేపట్టు తప్పని, పట్టుదలతో నటనలో తేనె నింపే, విరామం ఎరుగని శ్రమ జీవి !

బాలివుడ్ షెహన్ షా, యూ మే బీ సెవెంటీ ... యట్ యూ ఆర్ ఏ సింబల్ ఆఫ్ యూత్ అండ్ నావల్టీ. అందుకే తెలుగు వాళ్ళ తరఫు నుంచి 'జన్మ దిన' శుభాకాంక్షలు ఈ కృష్ణప్రేమ అందిచ్చెన్ ....

మీవి నూటా ఎనభై పై చిలుకు చిత్రాలు. కాని ఇప్పుడీ డబ్భై నిండిన సందర్భంలో మేటి చిత్రకారుల చేత డబ్భయ్ బొమ్మలు గీయించి ప్రదర్శనకి పెట్టి, వేలం వేయించి ఆ ఆర్జనని సేవా సంస్థకి అందజేయాలన్న మీ సతీమణి జయా బచ్చన్ ఆలోచన ...నేడు జనం మెచ్చెన్...

(కనులు చూసినా పాటే - కళ్యాణ్ జీ ఆనంద్ జీ ల స్వర కల్పనలో ఆ రోజుల్లో కేక కెవ్వు అదుర్స్ అనదగ్గ అమితాభ్ నట చాతుర్యం గమనించండి.

కనులు మూసినా పాటే - ఎస్డీ బర్మన్, ఖయ్యాం, జయదేవ్, ఆర్డీ బర్మన్, శివ్ హరి, ఇళయరాజా ల వంటి మేటి స్వర కర్తలు, రఫీ, ముకేష్, ఏసుదాస్, అమితాభ్ వంటి మేటి గాయకులు అమితాభ్ నటనకి నేపధ్య సారధులు. వినండి అతని విజయ రథ సారథుల మంగళకర గళ మాధుర్యాలు).

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 11 అక్టోబర్ 2012