Krishnaprema Logo

కృష్ణప్రేమ

ఇలాటి రోజు మళ్ళీ (వందేళ్ళకి గాని) రానే రాదు ...

11 డిసెంబర్, 2013

ఇలాటి రోజు మళ్ళీ (వందేళ్ళకి గాని) రానే రాదు ...

Picture

పి ల్లలూ ఇవాళ తారీకేమిటర్రా?'

'డిసెంబర్ 11'

‘సంవత్సరంతోపాటు చెప్పండర్రా..'

‘11-12-13…ఆయ్ ..మాస్టారూ అంకెలన్నీ వరసగా వచ్చాయి'

‘అందుకే ..తేదీ చెప్పమన్నానర్రా...ఇలా వరసగా మూడంకెలు ఎప్పుడొస్తాయో చెప్పగలరా?'

‘మళ్ళీ వందేళ్ళాగాలి కదండీ మాస్టారూ...అంటే ... ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు * కదండీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు **.. కదండీ'

‘అవునర్రా...ఇప్పుడు మీరన్నారే ...అవే పల్లవులుగా రెండు పాటలొచ్చాయి. ఒకటి నేను మీలా స్టూడెంట్ గా ఉన్నప్పుడు డబ్భైల కాలంలో విన్నది. ఒకటి మీతో పాటు విన్నది ...ఈ దశాబ్దం నాటిది. సరే...అడుగుతున్నా ...ఇలాంటి రోజు మళ్ళీ ఎందుకు రాదు చెప్పండీ?'

‘సంవత్సరంలో ఉండేవి పన్నెండు నెలలే కదండీ మాస్టారూ ...డిసెంబర్ తరువాత పదమూడవ నెల లేదు కాబట్టి'

‘గుడ్ గుడ్ ...ఇలాంటి వరస కిందిటి సంవత్సరం కూడా వచ్చింది. ఆ మాట కొస్తే ఏదో ఒక నెలతో ప్రతి సంవత్సరమూ వచ్చింది. ఏదీ చెప్పండీ?'


‘(మనసులో) రెండు వేల పన్నెండు కాబట్టి ఆఖరులో పన్నెండు, మధ్యలో పదకొండు, ముందేమో పది...(పైకి) వచ్చింది మాస్టారూ...10-11-12'

‘భేష్.....అలాంటివి ...01-02-03,02-03-04,03-04-05,04-05-06,05-06-07,06-07-08,07-08-09,09-10-11 …
ఇన్నేనా? ఇంకేవైనా ఉన్నాయా?'

‘ఉండవండీ...అంటే 2003 నుంచి 2013 వరకు మొత్తం పది సంవత్సరాలు మాత్రమే ఈ వరస క్రమాన్ని ఇవ్వగలవు అన్నమాట'

‘అదీ ఇప్పటికాలంలో. వెనకటి శతాబ్దంలో 1903 నుంచి 1913...అంతకు ముందు 1803 నుంచి 1813..'

‘ఏది ఏమైనా 1,2,3 వరస లాగ 11,12,13 వరస రావడమే ప్రత్యేకం.

‘కరెక్ట్...మన కవి ఆచార్యులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ఒక సినిమా పాటలో ఇలా అన్నార్రా ...

ఒకటి రెండు మూడు- విడి విడిగా ఉంటే అంతే...ఒకటిగ కలిపి చూడు ..అవి నూట ఇరవై మూడు **'

‘బలే బలే ...ఈ రోజు 10+1, 10+2, 10+3 ..విడివిడిగా ఉంటే అంతే..ఒకటిగ కలిపి చూస్తే ఒక లక్షా పదకొండువేల రెండొందల పదమూడు ...ఒక గ్రామం తాలూకు జనాభా అవుతుంది'

‘కాబట్టి ..ఏదైనా గ్రామం బాగు పడాలంటే ప్రజలు ఏకమై ...మంచిరోజు వస్తుంది మాకు బ్రతుకు నిస్తుంది ...పది మందిని పోషించే దశ వస్తుంది * ...అని ఒక పాత సినిమా పాటలో కొసరాజు కవి అన్నట్టు అనుకుని అందుకు తగిన కృషి చెయ్యాలి.'

‘మంచి రోజు ఆశించడమంటే అంతకు ముందు చెడ్డ రోజులు బాధించాయనా మాస్టారూ?'

‘దక్షిణ ఆఫ్రికా జాతిపిత, గాంధేయ వాది, నోబెల్ శాంతి పురస్కార విజేత, భారత రత్న నెల్సన్ మండేలా మొన్న కాక మొన్న అంటే డిసెంబర్ 5న తన 95వ ఏట చనిపోయారు కదా . అక్కడనే కాదు, ప్రపంచమంతటా ఎన్నో ఏళ్ళుగా అంటువ్యాధిలా పాకి పోయిన వర్ణ వివక్షని అంతం చేయాలనే పట్టుదలతో ఆయన ఎన్నో చెడ్డ రోజులు చవి చూశాడు. ఇరవైఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. అయితేనేం, ఆ ఇరవై ఏడు సంవత్సారాలు చీకటి లోకంలో ఇరవై ఏడు నక్షత్రాల్లా చేసుకుని ముందు ముందు ‘మంచి రోజులు వస్తాయి' అని నమ్మిన ఆ నల్ల సూర్యుడికి తుది విజయం లభించింది. ఆయన వెంట వచ్చిన ప్రజకి ‘మంచి రోజులు వచ్చాయి'. అరవై ఏడేళ్ళ ఆయన ప్రజాసేవకి గుర్తింపుగా అక్కడి ప్రజ అరవై ఏడు నిమిషాలు ప్రజా సేవలో నిమగ్నమైనది ఏ రోజునో తెలుసా?'

‘...'

‘చెబుతా...ఆయన పుట్టిన రోజున. అది ఈ సంవత్సరం జులై 18 న.'

‘ఆయన వయసు తొంభై అయిదు కాబట్టి ఆయన 1918 లో పుట్టారన్న మాట. 18-7-18 ….ఇదీ గమ్మత్తైన రోజే కదండీ మాస్టారూ '

‘ఏడుకి అటు ఇటు ఒకే సంఖ్య నిలబడింది...ఆయనా అంతే... వర్ణ వివక్షకి ఇటు అటు ఒకటే ఆయుధం నిలిపాడు- దాని పేరే శాంతి పోరాటం'

‘బడి పిల్లల్లో కూడా నలుపు, తెలుపు తేడాలతో ఒకర్నొకరు ఉడికిస్తూ ఉంటారండి..ఒకర్ని పిండి బస్తాలా ఉన్నావంటే మరొకరు బొగ్గుల బస్తాలా ఉన్నవంటూ ఆక్షేపించుకుంటారు మాస్టారూ. మీరూ బడిలో చదివినప్పుడు ఇవి ఉండేవా?'

‘అదే దురదృష్టం...మీ వరకే కాదు మా ముత్తాతల కాలంలోనూ ఉండేది. బడిలో చదువు దొరుకుతుంది...కాని సంస్కారం ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. నారాయణ రెడ్డి కవిగారు గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి అని నల్ల కోయిల, పచ్చని చిలకల మధ్య ఉన్న స్నేహం గురించి మీ పిల్లల భాషలో చక్కగా చెప్పారు...వీలయితే మీరు యూ ట్యూబు లో చూడండి'

‘ఇలాంటి వర్ణ వివక్ష ప్రపంచ మంతటా లేకుండా ఉండాలంటే జులై పద్ధెనిమిదో తేదిని అంతర్జాతీయంగా గుర్తించాలి కదండీ మాస్టారూ..'

‘ఇక మీదట మారుస్తారో ఏమో కాని...అలాంటి రోజు ఈ డిసెంబర్ నెల పదిని అంటే నిన్న ప్రపంచ మానవ హక్కుల దినం గా వచ్చింది. దీనికి ప్రతి ఏటా ఒక అంశం ఉంటుంది. ఈ ఏడు మహిళలపై హింస అనే అంశం ప్రకటించారు.'

‘చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చొనే కన్నా, ప్రయత్నించి ఒక్క దీపం వెలిగించి చూడు ...అని మీరే చెప్పారు కదా మాస్టారు. అందుకే మాకు దీపావళి రోజంటే చాలా ఇష్టం. ఆ రోజు అమావాస్య అని మా బామ్మ చెబితేనే కాని మాకు తెలియలేదు.'

‘అవును...అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు... రంగుల కలగలుపుతో వచ్చే దీపావళి రోజు. మల్లెమాల అనే కలం పేరుతో ఎమ్మెస్ రెడ్డి గారనే సినీ ప్రముఖుడు దీపావళి గురించి చక్కటి పాట రాశారు...వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు... అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు..దీపావళి రోజు.. *'

‘దక్షిణాఫ్రికా రాష్ట్రపతిగా ఉండేవారు కదండీ మండేలా గారు...మరి ఆయనకి మన దేశం నుంచి భారత రత్న రావడం...'

‘ఎందుకూ అన్నది నీ సంశయం, అవునా? వివేకానందుడు ఏమన్నాడూ...లెట్ నోబుల్ థాట్స్ కం ఫ్రం ఆల్ డైరెక్షన్స్ ..అనేగా. మడిబా అని జనం ఆప్యాయంగా పిలుచుకునే మండేలా ఉన్నారే...ఈయన మన కాలంలో మనం చూసిన మహాత్ముడు ...మనమంతా గాంధీ మహాత్ముడి గురించి వినడమే కాని చూడలేదు. ఈయన గాంధీ పథాన్ని విశ్వసించారు. అందులోని మహత్తుని గ్రహించారు. దెబ్బకి దెబ్బే విరుగుడు అనే వితండ వాదానికి ఇద్దరూ విముఖులు. మనుషులు ఒకర్నొకరు హింసించుకుంటూ పొతే బుద్ధి ఉన్న మనిషికి, సహజంగా క్రూరత్వం ఉన్న అడివి జంతువుకి తేడా ఏముంటుందీ? అహింసాత్మక పద్ధతిలో భారత దేశ ప్రజకి తెల్ల దొరల పెత్తనం నుంచి విముక్తి ప్రసాదించిన వాడు కనుక గాంధీ తాతని జాతి పితగా పదికాలాలు స్మరించుకుంటున్నాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరో తరాన్ని చీకటి లోంచి వెలుగులోకి నడిపించిన నేత కాబట్టి మండేలా భారతరత్న గౌరవానికి అన్ని విధాలా అర్హుడు.'

‘మండేలా గారికి భారత రత్న ఎప్పుడిచ్చారు మాస్టారూ?'

‘1990 లో... అప్పటికి ఆయన జైలు నుంచి విడుదలై వర్ణ వివక్ష అనే రాక్షస చర్య నుంచి ప్రజానీకాన్ని విముక్తి చేశారు. ఇటీవల మన దేశంలో ఇద్దరికి ఈ ఏడాది భారత రత్న గౌరవ పురస్కారం లభించింది. ఒకరి పేరు చెబుతాను. ఎందుకంటే ఆయన సైంటిస్టు కనుక మీకంతగా తెలియక పోవచ్చు. ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్ర రావు అనబడే సి ఎన్ ఆర్ రావు గారు, దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచిన ప్రముఖ శాస్త్రవేత్త. రెండవ వారు ఎవరు?'

‘తెలుసు మాస్టారూ...నే చెప్తా...సచిన్ టెండుల్ కర్ '

‘తెందుల్ కర్ అనాలి'

‘సచిన్ ఇకపై క్రికెట్ ఆటలో కనపడరు...ఆఖరి ఆట ఆడిన ఆ రోజుందే అది మాకేం మంచి రోజు కాదు'

‘మీలాగే చిన్నతనంలో అల్లరి చేసిన సచిన్ క్రికెట్ ఆటకే గౌరవం తెచ్చిన వాడు. ఇరవై నాలుగవ తేదీన పుట్టాడు. సరిగ్గా ఇరవై నాలుగేళ్ళు క్రికెట్ ఆటతో పండిపోయి ఇక చాలని విరమించుకున్నాడు. ఏ రోజు విరమించుకున్నాడో ఆ రోజు కూడా ఎప్పటిలా ఇరవై నాలుగు గంటల కాలం కదా. ఒక్కొక్క గంట కాలం ఆయన క్రికెట్ జీవితంలోని ఒక్కో సంవత్సరం గుర్తు చేసుకుంటే తెలిసేది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి- నెల్సన్ మండేలా యువకుడిగా ఉన్నప్పుడు గొప్ప బాక్సర్ తెలుసా?.'

‘అసలు పుట్టిన ప్రతి వారికి గుర్తింపు రావాలంటే వీరిలా పుట్టాలి కదండీ మాస్టారూ...మా తాతగారు మా పల్లెటూరిలో బడి కట్టించారు. ఆయన కొడుకై పుట్టిన నేను అయ్యో ఏమీ చెయ్యలేకపోయానే అని మా నాన్న బాధ పడుతుంటారు.'

‘పోన్లే నాన్నా ..నేనున్నా...నే సాధిస్తా ..అని అన్నావా లేదా? ఏం? అందరిలాగా అందరూ పుడతారు. కొందరికి మాత్రమే వారి వారి పుట్టుక సార్ధకమౌతుంది. పుట్టిన రోజు పండుగే అందరికి ..మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి? **...అని నారాయణ రెడ్డి కవి గారే ఒక సినిమా పాటలో వివరించారు. చూడండి.....ఇంతకీ...ఇవాళ ఎవరిదైనా పుట్టిన రోజు ఉందా? చూడనీండి రిజిస్టరు.'

‘భరత్ దండీ... పుట్టిన రోజని వాడు రాలేదు బడికి...సాయంత్రం వాళ్ళింట్లో పార్టీ.

అంజలీ థామస్ పుట్టిన రోజు నిష్కారణంగా నిన్ననే అయ్యిందట ..ఇవాళ కాలేదే అని బాధ పడి పోతోంది మాస్టారూ. ఇవాళే అయితే గనుక ఎంచక్కా అంకెలన్నీ వరసగా వస్తాయి కదా అంటుంది.'

‘పిల్లలు మీరు...మీకు ప్రతి రోజు పుట్టిన రోజే నర్రా...చూడమ్మా అంజలీ ...దాశరథి కవి గారు ఓ పాట ఎప్పుడో రాశారు- ఈ పుట్టిన రోజు నీ నోములు పండిన రోజు ..దివిలో భువిలో కని విని ఎరుగని అందాలన్నీ అందే రోజు *.. అని. విను. దానితో పాటు కావాలంటే మరొకటి అందుకోవచ్చు ..ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు..అయినవారి కందరికీ పండుగ రోజు **. అయితే ఆ హరనాథ్ అబ్బాయి అంత సంతోషంగా ఒక వైపు పాడుతుంటే ఇంకో వైపు చంద్రకళ అనే అమ్మాయి తెగ బాధ పడిపోవడం మీకేం అర్థం కాదు. తల్లిదండ్రులు సినిమా పేరు.'

‘మాస్టారూ...అంజలి కాక అంజి బాబు పుట్టిన రోజు అయితే ఏ పాట పాడాలి?'

ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు **..'

‘ఏ సినిమాలోది ఈ పాట మాస్టారూ ?'

తాత-మనవడు '

‘భలే భలే...తల్లిదండ్రులు, తాత మనవడు అన్నీ రక్త సంబంధాలే మాస్టారూ'

‘ఇందాక మంచి రోజు వస్తుంది అని పాడాను కదా.. ఆ పాట రక్తసంబంధం సినిమాలోదే'

‘అందులో అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూపించారట...మా బామ్మ చెప్పింది...అది జరిగిన కథా మాస్టారూ?'

‘కాదమ్మా ...జగమెరిగిన కథ.'

జరిగిన కథ అనగానే నాకూ అలాంటి పేరున్న సినిమా గుర్తొచ్చింది సార్ . అందులో ఓ పాట నాకు భలే ఇష్టం. పాడనా మాస్టారూ?'

‘ఓ...తప్పకుండా పాడు నాన్నా..'

భలే మంచి రోజు...పసందైన రోజు ..వసంతాలు పూచే నేటి రోజు **'

‘మాస్టారూ ..ఇప్పుడు వసంతం కాదు కదండీ...చలికాలం..చలి చలీ...'

‘ఆరు ఋతువులు ఆమని వేళలే ..ప్రతి రాత్రి వసంత రాత్రి..అన్నారు భావకవి దేవులపల్లి. తొలి ఋతువు వసంతంలో అంతటా కొత్తదనమే. అలా జీవితం మొత్తం కొత్త కొత్త ఆశలతో ఆశయాలతో వసంతంలా గడవాలి.'

‘మాస్టారూ ..రాము ఈ డిసెంబర్ లో రోజులన్నీ వేసుకునీ ఏదో ఆలోచిస్తున్నాడు చూడండీ'

‘రామూ....ఏదీ చూడనీ ... ఆ( ...గతవారం ఒక రోజు వచ్చింది...5-12-13. దీనిలో ఓ విశేషం ఉంది. కనిపెట్టగలవా?'

‘5 x 2 + 2 = 12, 12 x 1 + 1 = 13..అలా ఒక అంకెతో మరొక దానికి జత కూర్చవచ్చు. కదండీ మాస్టారూ'

‘నీ తెలివికి సంతోషించాను కాని బాగా .స్పష్టంగా ఉండే రిలేషన్ ఏదైనా ఉందేమో చూడరా'

‘...'

‘చెప్పనా? 5 స్క్వేర్ + 12 స్క్వేర్ = 13 స్క్వేర్.....పైతాగరస్ సిద్ధాంతం !'

‘ఓ బలే బలే... 5-12-13 కూడా మళ్ళీ వందేళ్ళకే ప్రాప్తం కదండీ మాస్టారూ'

‘అవును...ఇందాక పదేళ్ళ గురించి చెప్పుకున్నామే...అందులో ఒక ఏడాది.. ఒక నెల... ఒక రోజు కాంబినేషన్ ఇలా లంబకోణ త్రిభుజ గణితం చూపిస్తోంది. ఏదీ చెప్పండి, ఏమిటో అది?'

‘03-04-05 కదండీ... ఎందుకంటే మూడు స్క్వేర్ + నాలుగు స్క్వేర్ = అయిదు స్క్వేర్.'

‘శభాష్... పైగా ఇలా ఈ మూడు వరస అంకెలే స్క్వేర్ చేసినప్పుడూ కలిసుందాం రా అని ఒకదానికొకటి చెప్పుకుంటాయి'

‘మాస్టారూ...ఈ రోజు లోనూ ఏదో గణితం ఉండే ఉంటుంది. భరత్ కి మేం చెప్పాలి..ప్లీజ్ చెప్పండి మాస్టారూ'

‘ఓకే ఓకే ఓకే.. 11-12-13 లో వచ్చిన అంకెలతోనూ ఒక తమాషా చేయొచ్చు ...మొదట పదకొండు తీసుకుందాం. పదకొండులో రెండు ఒకట్లు ఉన్నాయి కదా. ఒకటి + ఒకటి ఈక్వల్ టూ ఎంత?'

‘టూ ..అదే...రెండండి.'

‘పదకొండు స్క్వేర్ ఎంత?'

‘పదకొండు ఇంటూ పదకొండు .....నూటా ఇరవై ఒకటి..'

‘కదా..121 లోని అంకెల మొత్తం ఎంత?'

‘121 లో 1+2+1 = 4'

‘నాలుగంటే రెండు రెళ్ళు నాలుగు కదా...4= 2 x 2 అంటే 2 స్క్వేర్. అనగా 11 లోని అంకెలు రెండూ కూడితే 2 రాగా 11స్క్వేర్ లోని అంకెలు కూడితే 2 స్క్వేర్ వస్తోంది. ఇప్పుడు మీరు చప్పున చెప్పాలి, రెండో సంఖ్య 12 గురించి'

'12 లో 1+2 = 3, 12 x 12 = 144, 1+4+4 = 9 = 3 x 3 అంటే 3 స్క్వేర్ '

‘13 లో 1+3 = 4, 13 x 13 = 169, 1+6+9 = 16 = 4 x 4 అంటే 4 స్క్వేర్ '

‘భలే భలే... గతేడాది 10-11-12 తోనూ ఇలా చెయ్యగలం కదండీ మాస్టారూ'

'09-10-11 తోనూ వస్తుంది..'

‘ఉహూ( రానే రాదు ... 9 వల్ల కుదరదు. అది ఏకాకి కదా. పది, అంతకు పైవాటి నుంచే సాధ్యం.'

‘ మాస్టారూ ...01-02-03,02-03-04,03-04-05,04-05-06,05-06-07,06-07-08,07-08-09,09-10-11, 10-11-12, 11-12-13 ఈ తేదీలు చూస్తే మధ్య సంఖ్య ఇటు అటు ఉన్న సంఖ్యల సగటు అని కూడా చెబుతున్నాయి కదండీ..'

‘the average of two consecutive odd s or evens makes a successive number series by remaining in between those consecutive numbers.'

‘(ఒకడు )1,3,5 ..ఇవన్నీ ఆడా మాస్టారూ?

(మరొకడు) కాదురా మగా ...'

‘సైలెన్స్... 1,3,5 ….ఇవి odd numbers అంటే బేసి సంఖ్యలు, 2,4,6 ఇవి even numbers అంటే సమ సంఖ్యలు'

‘(ఒకడు పక్కవాడితో) నే చెప్పాగా ...1,3,5 ఇవి ఆడ నంబర్లే.

(ఆ పక్కవాడు రెండోవాడితో) అయితే 11-12-13 అంటే ఇద్దరాడాళ్ళ మధ్య మగాడ్రా

(ఇంకొకడు) ష్...కాదురా ..ఇద్దరు పెళ్ళాల మధ్య ముద్దుల మొగుడురా

(మరొకడు) నారీ నారీ నడుమ మురారీ ...'

‘చాలు చాలు చాలు...మీ తెలివి తెల్లారినట్టే ఉంది'

‘కాదు మాస్టారూ... చీకటి పడబోతోంది'

‘ఇవాళ మార్గశీర్ష శుక్ల నవమి లెండర్రా ...బయలంతా వెలుగే ..'

...............................................
'నవమి నాటి వెన్నెల నేను - దశమి నాటి జాబిలి నీవు '

‘ఏమిటి సారూ...ఇవాళ అంత హుషారు...అయినా ఇదేమిటీ..ఇవాళ తారీఖు పదకొండు కదా..పది, తొమ్మిది అంటూ లెక్కలు వెనక్కి పోతున్నాయేం?'

‘గోల చేసే పిల్లలతో గోళీ లాడాను గౌరీ'

‘గోళీలా?'

‘అదేలే...ఈ రోజు 11-12-13 కదా...అన్నీ ఒక వరసలో వచ్చిన సంఖ్యలు...ఆ ఊపుతో బోలెడు మేథ మ్యాజిక్కులు చేశాను. పిల్లలకి పుట్టిన రోజు పాటలు గుర్తు చేశాను.'

‘ఇక్కడ..మన పెళ్లి రోజు అంటూ రాగాలు తీస్తారా ఏమిటీ?'

చూపులు కలసిన నాడే నీ రూపం మిస మిస లాడే *'

మామంచి అక్కయ్య ఏర్పాటు చేసిన మన పెళ్లి చూపుల రోజు గుర్తొచ్చిందా?'

‘అబ్బే ...సి నా రె వారి పాట గుర్తొచ్చింది... ఒకసారి ఆకాశం వైపు చూడు'

‘ఏముందీ...నవమి నాటి వెన్నెల అంటూ వేటూరి వారి పాట పాడుతూ వచ్చారు కదా...ఈ రోజు చందమామ అందంగా కనిపిస్తాడు ..అంతేగా? '

‘కాదు కాదు ...అందుకు విరుద్ధంగా ...పగడాల జాబిలి చూడు ..గగనాన దాగెను నేడు *.... '

'ఒహో బడాయి చాలోయీ...కోతలెందుకు పోవోయీ...నేడు అమావస కాదోయీ '

'ఆ చిన్నదాని అందానికి చందమామ మొహం ఎర్ర బడిందట, అందుకే మొహం చాటు చేసుకున్నాడట. సినారె బలే రాసినారె!'

'అది కవి హృదయం. చందమామ దాక్కోవడమంటే ...అమావాస్య అనడమే న్యాయం.'

'నీ మాటే రైట్ అనాలంటే నువ్వు ఈనాడు పేపర్ తో వచ్చిన కేలండర్ తిరగెయ్యాలి'

'ఎందుకూ?'

'కేలండర్ తిరగేస్తే జనవరి కనిపిస్తుంది. ఆ నెల పదకొండవ తేదీ ...మార్గశిర అమావాస్య'

'చూసారా సారూ...తిరుగుబాటు మహాత్మ్యం ... ఒప్పుకున్నారు కనుక నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే* ...అని పాడుతా '

' ఈ యుగళ గీతంలోరఫీ గారు ఒక చోటఈనాడే అని పలకబోయిఈ నాణ్నే అని అనేశారు. అది అలాగే రికార్డ్ అయిపొయింది. మళ్ళీ అలాంటి తప్పు దొర్లకుండానేడే తెలిసింది ఈనాడే తెలిసింది..కమ్మని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని*....అని మరో సినిమాలో ఆయన చేత పాడించారు. అలా తప్పు దిద్దిన రోజు ఉందే... అదే భలే మంచి రోజు. విశేషం...ఈ రెండు పాటలూ సి నా రె వారివే కావడం. అయితే సి నా రె వారి చేతే తప్పనిసరిగా తప్పు చేయించిన రోజు కూడా ఉంది.'

'అవునా? ఏ(విటది?'

'ఇందాక పాడినదే... చూపులు కలిసిన నాడే నీ రూపం మిసమిసలాడే.. సినిమాకి ముందు విడుదలైన రికార్డ్ లో ఎదలో పయ్యెదలో అని పాపం ఆయన నాజూగ్గా రాస్తే సెన్సార్ వారికేదో అభ్యంతరం తోచింది...ఎటులో మనసెటులో అని అక్కడ ఏమాత్రం కుదరని పదాలు వేయించారు. వీడియో పాట విను...సరిగ్గా ఈ మాటలొచ్చేటప్పుడు ఒక చిన్న జంప్ వస్తుంది.'

'సెన్సార్ తీరుకి నవ్వొస్తుంది ...ఈ కాలం పిల్లలకి చెబితే సరి ...సెన్సారంలో సరిగమలు ఇలాగే ఉంటాయని. చెప్పడం మరిచిపోయాను ...సరిగమలు అనగానే గుర్తొచ్చింది ...బహు భాషా గాయనివాణీ జయరాం గారిని పిలిచి ఈ రోజు గురించి అడిగితే ఏ(వంటారూ... ఈ రోజు మంచి రోజు... మరపు రానిది మధురమైనది******...'

‘అంటారా? అలా తన పాట గుర్తు చేసుకు పాడతారు గానీ ? ఇంతకీ ఆమెకి ఎందుకని మంచి రోజు?‘

‘ ఎందుకంటే...ఈ పాట సుశీలమ్మ, వాణీజయరాం కలసి పాడారు కనుక .'

‘అవునౌను .. సినిమా పేరు ...ప్రేమలేఖలు ...మనం రాసుకున్నట్టు'

‘ప్రేమ లేఖలు...బుట్ట దాఖలు'

‘చంపేసావ్...చింపేసావా?'

‘డిటెక్టివ్ నవల పేరులా ఏమిటా కంగారూ...ఎక్కడో అటక మీద ఎలకలకి రోజూ ఫలహారం లా ఉండే ఉంటాయి'

‘అన్యాయం... రోజుకు రోజు మరింత మోజు ప్రేమ డింగ్ డాంగ్ బెల్ ప్రియురాలు నైటింగేల్ ...అవన్నీ పాత మాటలన్నమాట... సరే .. ఇద్దరు మాహా గాయనీ మణుల గురించి చెబుతున్నావ్...ఏమిటి విశేషం'

‘నాటి గాయనీ మణులు బాలసరస్వతీ దేవి , జమునారాణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి వాణీ జయరాం గారికి ఈ ఏడాది సుశీల పురస్కారం ప్రకటించారు.'

‘వండర్ ఫుల్...షీ డిజర్వ్స్. అవార్డ్ ఏ రోజున ఇస్తారో? ...మండేలా నిష్క్రమణకి యావత్ ప్రపంచం నివాళి దినాలు ప్రకటించింది. బహుశా ఈ అవార్డ్ ఫంక్షన్ పోస్ట్ పోన్ అయి ఉంటుంది.'

‘వాణీ జయరాం గారికి ..అందాల మల్లెల మాల మెడలోన నిలవాలి '

‘ఆగాగు..అంటున్నావా? పాడుతున్నావా? ఎందుకంటే మాంగల్య భాగ్యం అనే సినిమాలో సుశీల,వాణీ పాడిన స్త్ర్రీ యుగళ గీతం ఈ మాటలతోనే ప్రారంభమౌతుంది. ఇలాంటి యుగళ గీతాలు కొన్ని ఉన్నాయని చాలా మందికి తెలియదు.'

‘తెలియనివారి లిస్టులో నన్ను పడేయకండి సారూ...ఆరు నెలల్లో వారు వీరౌతారు అన్నట్టు ఇన్నాళ్ళ మీ సావాసంలో నాకూ కొన్ని పట్టుబట్టాయి. సారూ ...మీరు ఫిల్మీ డాటా బ్యాంక్ మేనేజరు ..ఏదో చనువుకొద్దీ ఖాతా చూశాను. దొరికింది.'

‘మంచి వార్త చెప్పావ్...భలే మంచి రోజు...పసందైన రోజు...'

‘మనకున్న మూడువందల అరవై అయిదు రోజుల్లో ఏ రోజుకా రోజే మంచి రోజు అనుకోవాలి...ఆల్వేస్ బీ పాజిటివ్'

‘గౌరీ గారి బ్లడ్ గ్రూపా?'

‘కాదు... ఆమె భర్త ఈశ్వర్ టీచర్ గారి ముందు చూపు'

ఈ రోజు చాలా మంచి రోజు******...'

‘మళ్ళీ మొదటికే వచ్చారా సారూ?'

విజయనిర్మల దర్శకత్వంలో నటశేఖర కృష్ణ నటించినదేవదాసు సినిమా పాట పాడుకుంటున్నా...'

‘నిరభ్యంతరంగా పాడొచ్చు ...అయితే షరతు...కేవలం మంచి నీళ్ళతోనే...'

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 11 డిసెంబర్ 2013 (11-12-13)

(* **** ఇలా ఒక స్టార్ ఉంటే ... కనులు మూసినా పాటే ,
** **** అని రెండు స్టార్లు ఉంటే****... కనులు చూసినా పాటే )