ఒకరు నండూరి! మరొకరు ఖలే! – రచయితగా ఒకరు, స్వరకర్తగా ఒకరు ప్రముఖులే!
03 సెప్టెంబర్, 2011

Click to Zoom
అవును- ఆ ప్రముఖులిద్దరూ నేడు లేరు.
గురువారం రాత్రి (సెప్టెంబర్ 1, 2011), తెల్లవారితే శుక్రవారం అనగాశ్రీనివాస్ ఖలే అస్తమించారు.
శుక్రవారం (సెప్టెంబర్ 2, 2011)నండూరి రామమోహన రావు ఆయన్ని అనుసరించారు.
స్వరం.లయ, తాళం, గానం, భక్తి అన్నీ గణపతి దేవుడిలో ఉంటాయని కాబోలు ఎనభై వయసు దాటిన శ్రీనివాస్ ఖలే ఆత్మ ఆ బొజ్జ దేవరలో మొన్న నిమజ్జనమై పోయింది. మరాఠీ వారి ‘సంప్రదాయ ధ్యేయం' ఆయన.
నండూరి వారిది ఎనభై నాలుగేళ్ల సుదీర్ఘ జీవన యాత్ర. రచనా పాంథికుడిగా ఇంక నడవలేను, అలసిపోయానని ఆఖరి వాక్యానికి నిన్ననే ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆయన. తెలుగు వారి ‘సంపాదకీయం' ఆయన.
ఖలే అంటే ఆరు శతాబ్దాల సంగీత బాణీ. ‘ఖలే కాకా ' గా ఆత్మీయుడైన పెద్ద దిక్కు. లతా దీదీ అన్నట్టు మరాఠీ సంగీత స్వర్ణ యుగానికి సంబంధించిన మూల స్తంభాలలో ప్రముఖుడు. లతా , భీమ్సేన్ జోషి వంటి రెండు భారత రత్నాల నొక చోట కూర్చోబెట్టి అందమైన స్వర మాల లో ఇమిడ్చిన గాన శిల్పి ఆయన. స్వంత బాణీ తో వాణీ సేవ చేసుకున్న పద్మ భూషణుడు.
ఖలే స్వర మాధురి వింటూ ఉంటే ఒక మదన మోహన్ , ఒక కోదండపాణి స్వర లాలిత్యం గుర్తుకొస్తుంది.
హృదయనాథ్ మంగేష్కర్ , అరుణ్ దాతే , సుధా మల్హోత్రా ,సుమన్ కళ్యాణ్ పురి వంటి మేటి గాయకులు ఆయన స్వర రచనలు (భావ గీతాలు) పాడి మెప్పించిన వారే.
ప్రముఖ నవీన గాయకుడు శంకర్ మహదేవన్ ఆయన శిష్యుడే.
ఆ మహానుభావుడి కొన్ని వరసలు వినడమే మనం ఆయనకిచ్చుకునే నివాళి. కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే- ఈ స్వర ధ్యానంలో.
నండూరి వారిదే అసలైన ‘నరావతారం '!
నండూరి వారిదే మేలైన ‘విశ్వ రూపం'!
నండూరి వారి ప్రతి రచనా ఒక ‘విశ్వ దర్శనం'!
ఆయన ఒకనాడు వెలిగించిన ‘ఆంధ్ర జ్యోతి ' ఈనాడూ ‘నవ్య ' కరదీపికగా తెలుగు నాట ఉపయోగపడుతోంది.
అసలు ఆయన ఇంటి పేరు కాదేమో నండూరి - అవునేమో నవీన వ్యాకరణ సూరి.
జర్నలిజం మంచి తెలుగు భాషా వస్త్రం కట్టుకునీ బతికి బయట పడాలంటే తొందరపడీ కొన్నేళ్ళ క్రితం వెళ్ళిపోయినబూదరాజు రాధాకృష్ణ ,, నా అవసరం ఇంకాస్త ఉందని ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయిన నండూరి రామమోహన రావు ల భాషను అనుసరించాల్సిందే. భయంగా ఉంది- పత్రికా రంగం భాషా వియోగంతో మరీ కృంగిపోతుందేమో.
పత్రికలది అర్థరాత్రి ప్రపంచం. తెల్లవారేసరికి ఇంటి గడపల ముందు వాలాల్సిందే. నండూరి వేగుచుక్క అనే నక్షత్రం ఇంక లేదు. ఆ సిరా చుక్క ఇంక అక్షరంగా మారదు.
నండూరి వారి పేరులో మూడు ‘రకారాలు 'న్నాయి. అవన్నీ ఆయనలోని రచనా శక్తి త్రివిధ రూపాలు. ఒకటి అభ్యుదయ భావనం. ఒకటి తాత్విక చింతనం. ఒకటి సరళ బోధనం.
నండూరి వారి పేరులో రెండు ‘మకారాలు 'న్నాయి. అవన్నీ ఆయనలోని మానవతా వాది లక్షణాలు. ఒకటి – మంచి మనసు, ఒకటి మహత్తర మనీషి.
నండూరి వారి పేరులో రెండు ‘నకారాలూ ' ఉన్నాయి. లేదు,లేదు అని కానీ , కాదు కాదు అని కానీ అనేవి కావవి. ఒకటి నవ్యత్వం, ఒకటి నాణ్యత.
నండూరి వారి రచనలకి బాపు గీతలు పువ్వులకొచ్చిన పరిమళాలు. కావాలంటే ‘బాపు గీత' లోకి ఒక్క సారి తొంగి చూడండి.
ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వచ్చిన 'విశ్వదర్శనం ' రెండు భాగాల విశ్వ శిల్పి నండూరి. 1980 ల్లో మొదటి భాగం, 1990 ల్లో రెండో భాగం ప్రచురితమయ్యాయి. రెండో భాగం ముందు మాటలో ఆయన ఇలా అన్నారు- ‘మనకు మత విశ్వాసం, తత్వ చింతన కలగలిసిపోయి ఉంటాయి. నిజానికి అది వేరు, ఇది వేరు. మత విశ్వాసం ప్రశ్నించడానికి వీలు లేనిది. బహుశా ప్రశ్నకు అతీతమైనది. తత్వ చింతన అలా కాదు; హేతు వాదాన్ని, తర్క వాదాన్ని ఆలంబనం గా చేసుకుని సాగుతుంది. మతం ‘కళ్ళు మూసుకుని విశ్వసించు' అంటుంది. తత్వ చింతన ‘కళ్ళు తెరచుకుని ప్రశ్నించు' అంటుంది. మతం ‘సంశయాత్మా వినశ్యతి'అంటుంది. కాగా, తత్వ చింతనకు సంశయమే ఆత్మ.'
నండూరి వారు మిగిల్చిన అక్షర సంపద వీలయితే తిరగ తోడి మళ్ళీ మెదడు కందిస్తే మరిన్ని కొత్త కోణాలతో మన జీవితాల మూలలు కనపడతాయేమో!
‘ప్రతి రాతా ప్రసిద్ధమే' లో నండూరి వారి అక్షర సంపద ఉంది. గమనించండి.
**రామ మోహన శ్రీనివాసులంటే మూడు యుగాల పుణ్య ఫలం. ఈ పుణ్య పురుషులిద్దరికీ ఇదే ‘శ్రద్ధాంజలి'!
వేర్వేరు క్షేత్రాల్లో మేరు నగాలైన ఈ గురు మూర్తుల పాదాల చెంత పుష్పాంజలి.
**
-డా. తాతిరాజు వేణుగోపాల్,03సెప్టెంబర్****2011
