Krishnaprema Logo

కృష్ణప్రేమ

భారతి ఇచ్చిన బహుమతి - భానుమతి

07 సెప్టెంబర్, 2011

భారతి  ఇచ్చిన బహుమతి - భానుమతి

Picture

అవునా కాదా? అని అడగాల్సింది పోయి ఇంకా 'ఔనా నిజమేనా?' అని ఆశ్చర్యపోయే వారున్నారంటే ఆమె ఈ భూమ్మీద లేదు కనుక సరిపోయింది. ఉంటే మాత్రం 'మట్టిలో మాణిక్యం' లో చలం వదినలా పట్టుకు 'ఝాడించేది'.

అంటే 'చండీ రాణి' లా చీల్చి చెండాడేస్తుందని అనుకుంటే తప్పు తప్పు.

ఆమె కోపం గబుక్కున పొంగి పడిపోయే పాలవంటిది.
ఆమె మనసు వెన్న లాంటిది.
ఆమె గాత్రం కమ్మని పెరుగు లాంటిది.
ఆమె మాట తీయ తేనియ.
ఆమె నటన సెలయేటి ధీమా.

వెరసి ఆమె పంచామృత పాళి.

పేరు పి. భానుమతి.

సెప్టెంబర్ 7 న ఆమె జయంతి.

అదేం చిత్రమో 'వర విక్రయం ' ఆమె తొలి సినిమా. ఇక మూడోది- 'ధర్మపత్ని '. ఐదో సినిమా 'కృష్ణ ప్రేమ '! ఇవన్నీ ఎంత నిజమో కృష్ణ ప్రేమ టైములోనే ఆమె పడిపోయారన్నది అంతే నిజం. ఎక్కడ? ప్రేమలో! రామకృష్ణ ఆమెలోని కళా తృష్ణ కి గొడుగై నిలిచారు. గృహమే కదా 'స్వర్గసీమ ' అనుకునీ సాధారణ దంపతుల్లాగే బతికారు. మధ్య తరగతి 'గృహ ప్రవేశం ' వారిది. వారి సంసార 'రత్న మాల ' భరణి అనే కొడుకు రూపంలో అవతరించింది. ఆ కొడుకు పేరిట స్థాపించిన 'భరణి' సంస్థ వారికి 'రక్ష రేఖ '. ఇక ఎ.ఎన్.ఆర్ , ఎన్.టీ.ఆర్. వంటి 'అపూర్వ సహోదరులు ' ఆమెతో నటించి 'నటీమణులందు ఈ భా.మ వేరయా' అని తేల్చి చెప్పేరు.


నాగిరెడ్డి ,చక్రపాణి , డి.వి.నరసరాజు ఆమెకు ఆప్తులు.

'బొబ్బిలి యుద్ధం ' కానీండి, 'పల్నాటి యుద్ధం ' కానీండి అవేవీ ఆమెకు పట్టవు. ఆమె కోరుకున్నది సినిమా రంగంలోనూ, రచనా వ్యాసంగం లోనూ తన తండ్రి 'పెంచిన ప్రేమ ' -సంగీత సేవలోనే 'సరిగ పదమని' ఆయనిచ్చిన సందేశం!

రామకృష్ణ తో 'వివాహ బంధం ' , ఆయనా తానూ 'తోడూ నీడా ' అయినప్పుడు ఇంకే 'అంతస్థులు ' ఎందుకు ఈ 'గృహలక్ష్మి ' కి? ఈ 'పుణ్యవతి 'కి?

ఎదురు దెబ్బలు తగిలినా 'అంతా మన మంచికే ' అని అనుకోగలిగే సాత్వికురాలు ఆమె.

అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అది పొగరు అనిపించేలా కనిపించే 'అసాధ్యురాలు ' ఆమె.

దక్కిన మంచి అత్తగారు పక్కన ఉన్నా సరే 'అత్తగారూ ఆవకాయ', 'అత్తగారూ-నీళ్ళబండి బసవయ్యా' ,'అత్తగారూ-అరటికాయ పొడి' వంటి కథలు రాసి తెలుగింటి అత్తగార్ల ఆట పట్టించిన ఏకైక రచయిత్రి ఆమె. అంతటితో ఆగక 'అత్తగారూ స్వాగతం', 'అత్తగారూ జిందాబాద్' అంటూ సినీ స్లో 'గన్స్' పేల్చిన ఓర్మి సైనికురాలు ఆమె.

ఆమె సినిమాలు చాలామట్టుకు వివాహం, పెళ్లి,వరుడు,మాంగల్యం,మొగుడు, అమ్మాయి పెళ్లి, అల్లుడు అంటూ పరిభ్రమించేయి.

ఆమె యవ్వనంలో 'మల్లీశ్వరి '. తమిళనాట 'అష్టావధాని' అని పిలిపించుకున్న 'రాణి లలితాంగి '.

ఆమె కాస్త తల పండగానే తెలుగింట మంగమ్మ, తాతమ్మ,బామ్మ అయిపోవడం, అదే తమిళ నాట కూడా 'పెరియమ్మ' అనిపించుకోవడం పంచామృతం బదులు కష్టర్డ్స్ రావడం వంటిది.

అందుకే ఎప్పుడో భరణి నుంచి తీయచ్చులే అని వాయిదా వేయకుండా అందరూ పిల్లలే నటించేలా తొలి ప్రయత్నంగా 'భక్త ధృవ మార్కండేయ ' సినిమా తీయడం ఆమెకే చెల్లింది. తొలి మహిళా దర్శకురాలు ఆమె. ఒకే సినిమాణిక్యాన్ని మూడు భాషల్లో మెరుగు పెట్టగలిగిన స్త్రీ శిల్పి ఆమె. ఒకే చిత్రానికి తాను పూర్తిగా సంగీత నేతృత్వం వహించి తతిమ్మా చిత్రాల్లో తన 'వరసలు' తనవే సుమీ అని చెప్పక నేపధ్యంలో ఉండిపోయిన పేరు కోరని (పేచీ కోరు కాదు) 'బాటసారి ' ఆమె.

రండి. దయచేయండి. అలనాటి ఆ మధుర గాయని గాన ముద్రలు 'పాటల కొలువు'లో పరచుకొని ఉన్నాయి. స్టూడియో నుంచి వీడియో, రేడియో నుంచి ఆడియో గా మారిన ఈ శతాబ్దపు తొలి దశకంలో ఆమె కన్ను మూసినా ఆమె ఆమెగా తెలుగు, తమిళ ఇళ్ళ లోగిళ్ళ వదిలి పెట్టిన చెరగని ఆత్మీయత ముద్ర పదిలంగానే ఉంటుంది.

ఆమె మూడు భాషల్లో ఎంత అవలీలగా పాడేరో కదా- హిందీ అయినా, తమిళమైనా, ఇంగ్లీషైనా ఆ ముద్ర చెరిగిపోనిది.
ఆమె 'మేలుకోవయ్య కావేటి రంగ' అని పాడితే 'మరికాస్త నిద్దుర పోనీ, అంత బాగా పాడుతున్నావు భక్తా' అని రంగడు బద్ధకించగలడు. ఆమె 'మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావె నిదుర రావే' అని జోల పాడితే 'ఈ రేయి ఆగిపోనీ' అని కోరుకోవాలనిపిస్తుంది.

అసలు భానుమతి ఉండగా మరొకరు పాడే అవసరమే లేదు. కాని ఆమె నటించిన కొన్ని హిందీ సినిమాల సన్నివేశాలు చూస్తే మనసు చివుక్కుమంటుంది. షంషాద్ బేగం భానుమతికి ప్లే బ్యాక్ పాడటమా?

భానుమతి ఒక సందర్భంలో వరలక్ష్మీ వ్రతం కారణంగా విజయా వారి 'మిస్సమ్మ' షూటింగ్ కి రావడం ఆలస్యమైందట. చక్రపాణి మండి పడ్డారు. అంతా సారీ చెప్పేయి అన్నారు. ఉహూ(. ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా భానుమతి బదులు సావిత్రి నటించాల్సి వచ్చింది. అలాగే 'దేవదాస్' లోనూ మొదట భానుమతినే తీసుకున్నారు. ఏవో కారణాలవల్ల ఆమె బదులు సావిత్రి చేయాల్సి వచ్చింది.

అలనాడు భానుమతి కనిపించే దృశ్యాలో? అప్పటివెప్పటివో సినిమాల్లో ఆమెలో ఎంత రాజసమో కదా. మరికొన్ని చదివేందుకూ ఉన్నాయి. వాటిని 'ఆహా ఆహాహా' లో 'ప్రతి రాతా ప్రసిద్ధమే' లో చదువుతూ ఉంటే ఎంత సంతోషమో కదా.

ఆమెకి రాని అవార్డుల సంఖ్య చాలా తక్కువ. ఆమె ఏ సిఫారసూ లేకుండా సాధించుకున్నది మాత్రం 'ప్రజాభిమానం'! అదే ఆమెకు ఎక్కువ, బహుశా మక్కువ.

మట్టిలో కలిసిపోయిన ఈ మాణిక్యం మళ్ళీ మరో రత్నంగా, మరో పేరు 'చంద్రమతి' గా ఆవిర్భవిస్తుందా? 'ఔనా నిజమేనా','ఔనా కలలేనా'?

మీరు 'భానుమతి సినీ కాంప్లెక్స్' చూడలేదు కదూ. ఇక్కడే దిగువున ఆమె చిత్రాలు, కొన్ని పాటల పల్లవులు మీకు గుర్తుంటే గనుక వేరే కాయితం మీద నేనిచ్చిన గళ్ళు వేసో, ప్రింట్ తీసో ఇచ్చిన ఆధారాలతో గళ్ళు నింపండి. భానుమతి అంటే మజాకా? అది తికమక పెట్టించే భామ నుతి.

You can download the crossword page and the clues separately as word documents given below. Take your own time to fill up. The quicker you solve, the happier would be Late Bhanmumati. You can send your solved versions to [email protected]

-డా. తాతిరాజు వేణుగోపాల్, 07 సెప్టెంబర్ 2011

భానుమతి సినీ కాంప్లెక్స్
( బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారి సినిమాలు, పాటల ఆధారంగా గళ్ళనుడికట్టు )**** ********


**కూర్పు: డా. తాతిరాజు వేణుగోపాల్
**

Picture

Click to Zoom

bhanumati_cine_complex.doc

File Size: | 72 kb
File Type: | doc
Download File


bhanumati_puzzle_clues.doc

File Size: | 37 kb
File Type: | doc
Download File