పా.ప! కథ చెప్పు...బాగా చెప్పు చెప్పు...
18 ఫిబ్రవరి, 2012

పా.ప! కథ చెప్పు...బాగా చెప్పు చెప్పు...

‘శీ ర్షిక చూస్తుంటే ఎప్పుడో విన్న ఒక పాట పల్లవి గుర్తొస్తోంది.. సమయానికి ఏవీ గుర్తుకు రావు, అదే చిక్కు'
‘చెప్పనా, శ్రీశ్రీ గారు ‘చిలకా గోరింక ' చిత్రం కోసం రాసిన ‘పాపా, కథ విను, బాగా విను విను ' పాటని ఆధారం చేసుకునీ అలా మార్చాను'
‘మా నాయనే, మా బాబే. మరయితే ‘పాపా' అనే దీర్ఘమేమైంది, ఆ పొట్టలో చుక్కేమిటీ?'
‘ఓ అదా.. పా.ప అంటే పాలగుమ్మి పద్మరాజు '
‘అయ్యయ్యో- నా బుర్రకేమైందీ పూట? అంత పేరు మోసిన మహా రచయిత చిన్న పేరుని మరచి పోవడమా?- అందుకా నాయనా – కథ చెప్పు అని ఆయన్నే అడుగుతున్నావ్'
‘వట్టి పా.ప కాదాయన. బంగారు పా.ప '
‘కరెక్ట్. వాహినీ వారి బంగారు పాప కి పద్మరాజు గారు తొలిసారిగా కథ, మాటలు సమకూర్చారు'
‘బి.ఎన్.రెడ్డి గారి దూర దృష్టి అమోఘం. అంతకు ముందే ఒక సినిమా తీసి నాగయ్య గారి చేత ‘రావే రావే బంగరు పాప ' అని పాడించింది ఇందుకేనేమో. పా.ప గారికానాడే ఆహ్వానం అందింది.'
‘పా.ప గారు మహా మేధావి. రచయితగా ఆయనదొక అద్భుత శైలి. తెలుసు కదా- ఆయన కథ కి 1952 లో వీసా లభించింది. అంటే- ఆ ఏడాది అంతర్జాతీయ కథా రచనల పోటీ లో అద్వితీయంగా గెలుపు సాధించింది. ఆ కథే cyclone పేరిట అనువదించబడింది కూడా. ఇరవై మూడు దేశాలనుంచి వచ్చిన యాభై తొమ్మిది కథల మధ్య పద్మరాజు గారి కథ ఎంపిక కావడం నిజంగా మనకి గర్వకారణం. '
‘గాలివాన – కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది 1985 లో'
‘ఇదే కథని తమిళంలో ‘పుయల్ ' పేరిట గిరిప్రకాష్ అనువదించారు'
‘మానసిక ద్వంద్వ అవస్థల్ని ఆయన ఆవిస్కరించినంత లోతుగా ఎవ్వరూ చెయ్యలేదేమో'
‘అవును- ‘పడవ ప్రయాణం ' కథ అలాంటిదే. రంగి చూడండి – పద్దాలు తాగి వాగినా మరొకర్తితో ఊరేగినా ఏమిటో చిన్న పిల్లాడిలా తన దగ్గర బావురుమన్న ప్రతిసారీ ఇట్టే కరిగి పోతుంది'
‘అన్నట్టు- పడవ ప్రయాణం కథ అమెరికా విద్యార్థులకి ఇతర దేశాల బడుగు జీవుల మాండలిక యాసలు తెలియాలని ఎంచబడ్డ కథ అని విన్నాను. dsal.uchicago.edu/digbooks/ లింకు లో ఈ కథను చదువుకోవచ్చుఅని చెప్పండి'
‘ఒకటి గాలివాన , మరొకటి పడవ ప్రయాణం - ఈ రెండూ పదే పదే అనుకుంటుంటే ఒక పాట గుర్తొస్తోంది'
‘గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం - డా. ఏసుదాస్ పాడిన దాసరి నారాయణ రావు గారి పాట, అవునా?'
‘ఆ సినిమా ‘స్వయంవరం ' అయినా పా.ప గారి అదృశ్య హస్తం దాసరి వారికి స్వీయ వరం అనిపించేలా ‘మేఘ సందేశం ' సినిమా వచ్చింది. అందులో జయదేవ అష్ట పది-‘ప్రియే చారుశీలే ' మధ్యలో పద్మరాజు గారు వినూత్నంగా చక్కని తెలుగు చక్కెర కండ విరుపులు అందించారు'
‘అంటే- ఆయన ప్రపంచ ఖ్యాతి పొందిన రచయిత మాత్రమే కాదు, కవి కూడా. సినిమాలకి పాటలూ,పద్యాలు రాశారు అన్నది ముఖ్యం'
‘ఆగండాగండి పా.ప. అంటే పా ట, ప ద్యం అనికూడా అనుకోవోచ్చునేమో'
‘పాటలనగానే కనులు మూసినా పాటే అన్నంత చక్కని పాటలు రాశారాయన. శ్రీకృష్ణ కుచేల ,బికారి రాముడు , దేవత , భక్త ప్రహ్లాద - ఒకనాటివైతే మేఘసందేశం , శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ మరో నాటివి'
‘ఆహా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి శ్రీరంగం గోపాలరత్నం గారి ‘నిదురమ్మా –కదలీ వేగమే రావమ్మా ' విన్నాం. ఆ పాట పద్మరాజు గారిదని ఎందరికో తెలియదు. పైగా బి.గోపాలం గారి బాణీ. మరోటి – ఘంటసాల, గోపాల రత్నం గార్ల కాంబినేషన్ లోని ‘ఇదియే నీ కథ ', పాట రూపం లో ఒక కథని కుదించి చెప్పడం ఒక గొప్ప ఆర్ట్.
ఇలాంటిదే కథ రూపంలో ఒక పాట దేవులపల్లి వారు బంగారు పంజరం సినిమా కోసం రాశారు. గోపాలం తొలి నాళ్ళలో ఘంటసాల వారికి సహాయకులు. రంగులరాట్నం , బంగారు పంజరం సినిమాల్లోని పాటలు చాలా మటుకు గోపాలం గారి బాణీలే. ఇంకో చిత్రం – ఒక సినిమాలోగోపాలం గారు నటిస్తే ఆయనికి ఘంటసాల పాడారు.
ఇలా చెప్పుకుంటూ పొతే పా.ప కథ నుంచి సినిమా విశేషాల కథ లోకి మళ్ళిపోతాం. హాస్య నటుడు పద్మనాభం పద్మరాజు గారిని వదులుకోలేదు. దేవత లో పాట రాయించారు. ఆజన్మ బ్రహ్మచారి కి కథ రాయించారు. పద్మరాజు గారు బహుశా నటుడు కాంతారావు చేత ఎక్కువగా తన మార్కు మాటల్ని పలికించి ఉంటారు.'
‘పద్మరాజు గారి పద్యాలనగానే – ఏమున్నాయి చెప్మా?'
‘దొరికిన ‘భూలోకంలో యమలోకం ' సినిమా పాటల పుస్తకంలోని కొన్ని పద్యాలు చూశాను. కనులు చదివినా పాటే**-** అనుకుంటూ చదవాలి. అందులో ఆయన కలం వాక్కులు - ‘దమ్ములుంటే సొమ్ము తెమ్ము, దద్దమ్మవైతే పొమ్ము ''పాలు పట్టు జేతిని కరచెడు పాము వీడు ' అనే కొత్త చెమక్కులున్నాయి.
పాటల్లోనూ అంతే – మాయదారి నాగకుమారి మతులు పోయెనే అని అన్నారొక చోట. పక్క పక్క పదాలతోనే ప్రాస, అనుప్రాస నియమం పాటించడం వారికిష్టంగా ఉండేదనుకుంటా. ‘ఏ పాప మెరుగని పసిపాప ' ‘నీ దయ రాదయ ' వంటి ప్రయోగాలు ఉదాహరించ వచ్చు'
‘గాలివాన – అనేది ప్రకృతి భీభత్సంగా ఎరుగుదుం. అలాంటిది ‘చల్లనైన జాలివాన జల్లవేమి స్వామీ ' అని ఒక్క అక్షరం మార్చి ప్రాస కూర్చి కరుణాకృతిని మన ఎదట నిలబెట్టేరాయన.'
‘చూడబోతే గాలివాన, పడవ ప్రయాణం , గాలి బ్రతుకు --- ఇవన్నీ ఈయన్ని ఓ ఓషనోగ్రాఫర్ అనేలా ఉన్నాయి'
‘అలా అనే కన్నా- కరెక్ట్ ‘నోషనోగ్రాఫర్ ' అనొచ్చు'
‘అసలే- కెమిస్ట్రీ బోధకుడు మొదట్లో. అంచేత కథలోనైనా, పాటలో నైనా భావం , భాష – ఈ రెండూ- సమపాళ్ళలో రంగరించడం ఆయనకి తెలిసిన రహస్యం'
‘కొన్ని పాటలు వింటుంటే కృష్ణశాస్త్రి గారి భావజాలం అనే ఇంద్రజాలం లో ఈయనా పడిపోయేవారా అని అన్పించవచ్చు- రాకోయి అనుకొని అతిథి , గాలి వీవన పూని--- అలాంటివి మచ్చుకి'
‘బి.ఎన్.రెడ్డి, నాగయ్య, దేవులపల్లి, పాలగుమ్మి - ఆ నలుగురు – ఉండేవారే – వారిదంతా ఒక గట్టి అనుబంధం. ఎటొచ్చీ అంతా సౌమ్యులు! ఒకరికి నడకలో మెత్తదనముండాలి. ఒకరికి నటనలో. మరొకరికి పాటలో. ఇంకొకరికి మాట లో'
‘బి.ఎన్.రెడ్డి గారు రంగుల రాట్నం, బంగారు పంజరం సినిమాల కథలు పా.ప గారి చేతే రాయించుకున్నారు'
‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్- విజయా వారి సినిమా. నిర్మాతగా చక్రపాణి వారి ఆఖరి సినిమా.పద్మరాజు కథ- బాపు దర్శకత్వం, ఒక అరుదైన కలయిక'
‘భాగ్య రేఖ – ఈయనదే కదూ'
‘ఆహా, సర్దార్ పాపారాయుడు కూడా'
‘మొత్తానికి కథా రచయిత, పాట రచయిత, కవి అనే త్రిముఖాలు ఆయన ప్రతిభని అద్దం పట్టి చూపించాయని అనాలి'
‘దర్శకత్వం అనే శాఖ కూడా కలిపి చతుర్ముఖ అనడం సబబు.'
‘ఆయనా డైరెక్ట్ చేశారా పిక్చ ర్లని?'
‘బహు వచనం తెలియదు. దేవుడిచ్చిన భర్త - సినిమాని మాత్రం డైరెక్ట్ చేశారు (మాటలూ ఆయనవే). తమిళం ట్యూన్ తెలుగులో ఆ దేవుడిచ్చిన పతివి నీవే పాటగా ఏ.ఏ.రాజ్ (అప్పలరాజు) సంగీతంలోస్వర జానకి గళం లో, ప్ర.భ శ్రీనివాస్ హమ్మింగ్స్ తో బాగానే హిట్.'
‘పద్మరాజు గారు రాసిన వ్యాసాలు ఒకటి రెండు ‘తిరుగులేని మాట ' లో చదువుదాం. ఇంకా ‘ప్రతి ముఖమూ ప్రముఖమే ', ‘ప్రతి రాతా ప్రసిద్ధమే ' ఇవన్నీ ఆయన ప్రతిభకి అద్దాలే, అడ్డాలు కావు'
‘శ్రీశ్రీ గారు చిలకా గోరింక లో అన్నట్టు ‘చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా ''
‘అయినా – గంగిగోవు పాలు గంటెడైనను చాలు '
‘గోపాల! రావా – అని పాలగుమ్మి వారు పిలిచినట్లు గోపాల రావు మాస్టారూ – నాతో ఈ పూట నా మాట ముచ్చట్లు పంచుకున్నందుకు మీకు నా థాంక్యూలు'
‘అలా ఐతే వేణూ, వెల్ కమ్'
‘బాగు బాగు – బ్లాగు లోకి రమ్మంటారా?'
‘వచ్చే వారం – దేవులపల్లి వారి కృష్ణ శాస్త్రీ య మార్గం ( వర్ధంతి - ఫిబ్రవరి 24) మీదుగా--!'
‘తప్పకుండా. ఒకటి వినండి- ఇది వరకు ముగ్గులోకి దించేవారు, ఇప్పుడు బ్లాగులోకి దించుతున్నారు'
‘మీరు మాత్రం నవ్వించి నవ్వించి నన్ను దగ్గులోకి దింపుతున్నారు. ఉంటా. అన్నట్టు ఈ సారి చలి బాగానే అందర్నీ రగ్గులోకి దింపింది. అయినా ‘శివశివా ' అంటూ మహా చలి మహా శివరాత్రికి ఎగిరి పోతుంది కదా'
‘పంచభూతాలన్నీ ఆ పంచాననుడి దయతోనే ఉన్నాయి. దేవులపల్లి వారన్నట్టు ‘శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన!'
‘గాలివాన నుంచి గంగమ్మ వాన వరకూ చెప్పుకున్నాం. సెలవా మరి!'
----------------------------------------------------------
(సుప్రసిద్ధ తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి వర్ధంతి 17 ఫిబ్రవరి సందర్భంగా----)
------------------------------------------------------------------
(మహాశివరాత్రి- ఫిబ్రవరి 20 - సందర్భంగా కనులు చూసినా పాటే లో భక్త కన్నప్ప (తెలుగు) , భక్త మార్కండేయ(కన్నడ) చిత్రాల పాట సన్నివేశాలు చూడవచ్చు. పా.ప గారి గురించి చెబుతూ నాగయ్య గారిని తలచాం, బాపు గారిని పిలిచాం. శివుడాజ్ఞ కాబోలు వారిరువురి పాటలు వచ్చి వాలాయి)
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 19 Feb 2012