Krishnaprema Logo

కృష్ణప్రేమ

ఓ బొజ్జ గణపయ్య ... గణపతి బప్పా మోరయా

19 సెప్టెంబర్, 2012

ఓ బొజ్జ గణపయ్య ... గణపతి బప్పా మోరయా

Picture

బప్పా అంటే తండ్రి. బాబా అని కూడా అన వచ్చు. హిందీలో బాప్, గుజరాతీ లో బాపు, మరాఠీలో బప్పా, ఒరియా లో బొప్పా అంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రమే వినపడే ‘గణపతి బప్పా మోరయా' వంటి నినాదం ఇప్పటి మాధ్యమాల ధర్మమా అని ఆంధ్రలోనూ వినబడుతోంది. ‘పుడ్చా వర్షా లౌకర్ యా' అనే మరో నినాదం కూడా ఉంది. చవితి నుంచి పది రోజుల వరకు ఉత్సాహంగా ఉత్సవాలు జరుపు కొన్నాక విగ్రహ నిమజ్జన సమయంలో గణపతి దేవుణ్ణి మళ్ళీ ఏడాది మరలి రమ్మంటూ జనం పలికే జేజేలు అది.

లోకమాన్య బాల గంగాధర్ తిళక్ స్వాతంత్ర్య పోరాట సమయంలో పుణేలో ‘సామూహిక గణేష్ ఉత్సవాలు ఆచరించుదాం రండి' అని ఇచ్చిన పిలుపు నేటికీ మాన్యతని పొంది యావత్ మహారాష్ట్ర ఆదరించి ఆనందించే ఒక సదాచారంగా మారింది. మహారాష్ట్రలో సాధారణంగా ఏ ముఖ్యమైన పండుగ కైనా అయిదు రోజులు కేటాయిస్తారు. ఉదాహరణకి - హోలీ పండుగ . ఇది పౌర్ణమికి వస్తుంది కనుక అక్కడినుంచి వచ్చే అయిదవ రోజుని ‘రంగ్ పంచమి' గా ఆచరిస్తారు. ఆ రోజూ హోలీ నాటిలా రంగులు చల్లుకున్నా అది కేవలం వ్యక్తిగతం. బహిరంగంగా ఆడి ఇతరుల్ని ఇబ్బంది పెట్టరు. ఇక- వినాయక చవితి తరువాత వచ్చే మూడవ తిథిని గౌరీ ఆవాహనం, నాలుగవ తిథిని గౌరీ పూజ, అయిదవ తిథిని గౌరీ విసర్జనం వంటి కార్య క్రమం తప్పక పాటించి పురాణ కథకి జీవం పోస్తారు. తనయుడితో పాటు తల్లినీ స్మరించడం ఎంత గొప్పది!

చెప్పాలంటే - మహారాష్ట్రీయుల కుల దైవం గణపతి. అంతే కాదు ప్రతి కుటుంబానికి వేరుగా ఒక ఆధ్యాత్మిక గురువు కూడా ఉంటారు. ప్రతి శుభ కార్యానికీ గణపతితో పాటు వారి వారి గురు దీవెనలు కూడా కోరుకుంటారు.

గణపతి అంటే గణాధిపతి, శివుని ప్రమథ గణాల వేలుపు కనుక గణేశుడు. హ్రస్వంగా ‘గణేష్' అంటున్నాం. భాద్రపద శుక్ల (శుద్ధ) చతుర్ధి (చవితి) తిథిలో గణపతి ఆవిర్భావం జరిగింది. ఈ యేడు (2012) మనకి రెండు భాద్రపదాలు వచ్చాయి. ముందు వచ్చి వెళ్ళిపోయినది అధిక భాద్రపదం. అధిక మాసం అని మనం అంటాం. ఉత్తరాన మల్ మాస్/మాహ్ అంటారు.


మాసం అనేది ఉత్తరాదిని పూర్ణిమాంతం (పున్నమితో ఆఖరు) , దక్షిణాదిని (వింధ్య పర్వత శ్రేణికి దిగువున) అమాంతం (అమావాస్యతో ఆఖరు). అయితే మాసం పేర్లు మాత్రం మారవు. ఎటొచ్చీ ఉత్తరాదిని ఒక మాసం ముందే ప్రారంభ మైందేమో అని అనిపించడం సహజం. పండగలు శుక్ల (శుద్ధ) పక్షంలో వస్తే ఇటూ అటూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బహుళ (కృష్ణ) పక్షంలో వస్తేనే జనానికి ‘కన్ఫ్యూ జన్'. పెద్ద ఉదాహరణ – కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి. మరొకటి –మహాశివరాత్రి. దేవుళ్ళ జన్మ తిథులు ఏ పక్షం లో వచ్చినా నిజ మాసం లోనే వారి వేడుకలు జరపాలి. అధిక మాసం ప్రత్యేకత ఏమిటంటే అధిక మాసం రాబోయే ముందే ఒక రాశిలో సూర్య సంక్రమణం జరిగి పోతుంది (అంటే- అధిక మాసంలో సూర్య సంక్రమణం ఉండదు).

అసలే అధికమాసం, అందునా కరువు .. అని మనకో సామెత ఉంది. ఈ ఏడాది ఇది సార్ధకమైంది. గణనాథా.. ఈతిబాధలు తొలగించు [ఈతిబాధలంటే ఎన్నో తెలుసా? ఆరు. షడశీతి అంటారు .. ఉపద్రవం, ఊరు విడిచి పోవడం, మారి (అంటువ్యాధి వంటివి- ఒకప్పుడు మశూచికం ఒక మహమ్మారి అనడం వినే ఉంటారు), అతి వృష్టి/అనావృష్టి ( ఏదొచ్చినా చిక్కే- వాన ఎక్కువైతే వరద, తక్కువైతే కరువు), మిడతల దాడి/ ఎలకల దాడి /చిలకల దాడి (మిడతల దండు పొలం మీద దాడి చేస్తే పెరిగే పంటకి నష్టం, ఎలకలు/పందికొక్కులు గాదె కింద చేరితే రైతుకి కష్టం, చిలకలు తోటల్లో పళ్ళు కొట్టి పోతాయి), రాజు స్నేహితుడు కావడం ( ఇది ఎక్కువమందికి బాధాకరమే అయింది. అతి కొద్ది మందికి లాభాదాయకమూ అయ్యింది). మొత్తం ఎన్ని? ఆరు బాధలు కదా. రెండేళ్ళ క్రితం పుణే లో గణేష్ ఉత్సవాలు వెలవెలబోయాయి- స్వైన్ ఫ్లూ బాధ వల్ల. ఒకప్పుడు ఎంతో స్వేఛ్చ ఉండేది ఒక్కొక్క మండల్ గణేశుని దర్శించుకోవడంలో. ఇప్పుడు అంతటా బితుకు బితుకు.. కెమెరాలూ... ఏ బుట్టలో ఏ బాంబు ఉందో ఎవరి కెరుక వంటి నిర్లిప్త విచారాలూ.. ఇది కొత్తగా చేరిన ఏడవ ఈతిబాధ అనవచ్చు].

సంవత్సరం పొడుగునా సాధారణంగా పన్నెండు చాంద్ర మాసాలు ఉంటాయి. అధిక మాసం వచ్చే సంవత్సరంలో పదమూడు. గణపతి దేవుడి ముఖ్య దినం భాద్రపద శుక్ల చతుర్థి ... సరే.. మరి ప్రతి చాంద్ర మాసంలో బహుళ/కృష్ణ పక్షం లోనూ చవితి ఉంటుందే. అప్పుడేం చెయ్యాలి? మహారాష్ట్రలో ప్రతి చాంద్రమాస శుక్ల చతుర్ధిని ‘వినాయక చతుర్ధి' అంటారు. భాద్రపద శుక్ల చతుర్ధిని మాత్రమే ‘శ్రీగణేశ్ చతుర్ధి' అంటారు. మరి బహుళ పక్షంలోని నాలుగవ తిథి మాటేమిటీ? బహుళ పక్షం కష్ట కాలం అనేది ప్రతీతి. కాబట్టి ఆ చతుర్ధిని ‘సంకష్ట చతుర్ధి' అంటారు. ఆ రోజు ఉపవాసముంటారు ( ఇలాంటిదే అష్టమి తిథి కూడా. ప్రతి మాసం శుక్ల పక్షంలోని అష్టమిని దుర్గాష్టమి అని, బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కాలాష్టమి అని అంటారు. ఆశ్వయుజ శుక్లాష్టమిని ‘మహాష్టమి' అంటారు. మరొకటి బహుళ త్రయోదశి – ప్రతి చాంద్రమాస బహుళ త్రయోదశిని ‘శివరాత్రి' అంటారు. మనం ‘మాస శివరాత్రి' అంటాం. ఒక్క మాఘ బహుళ త్రయోదశినే ‘మహా శివరాత్రి' అనాలి).

వినాయక చవితి నాటి చంద్రుణ్ణి చూడరాదని నియమం. నింగి వైపు చూడక పోయినా నీటిలో ప్రతిబింబం చూసినా నీలాపనిందలు కలుగుతాయని కదా చెబుతారు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు- శ్యమంతక మణి కథ చదువుతాం.

దీనికి ప్రతిహారంగా సంకష్ట చతుర్ధి నాడు ఉపవాసముండి చంద్రుణ్ణి చూడ వచ్చు. ఆగస్టు-సెప్టెంబరుల మధ్య కాలం లో ఆకాశం కొన్ని చోట్ల మేఘావృతం కావడం సహజమే కనుక కొందరు భాద్రపద శుక్ల చవితి చంద్రుణ్ణి చూడనందుకు సంతోషిస్తారు. మేఘాలు లేని చోట్ల మంచు కడిగిన ముత్యపు నావలా చంద్రుడు నెత్తిని నిలబడి కవ్విస్తూ అప్రయత్నంగానే చూసేలా చేస్తాడు. పాపం శివుడికి శిరోధార్యం అయిన చంద్రుడు శివుడు అర్ధ నారీశ్వరుడే, ఒక పక్క పార్వతమ్మ ఉంటుందే అన్న సంగతి మరిచి పోయి బొజ్జ గణపయ్యని చూసి వంకర బోతూ నవ్వాడట. అమ్మ శపించింది. తర్కానికి పొతే సందేశమే ఉందిక్కడ- చవితి నాడు మరీ కడుపుబ్బ తిని మితి మీరిన ఉచ్చ్వాస నిశ్వాస లనే నెలవంక ఆకారంలో పడుకుంటే మంచిది కాదు, పైగా వానాకాలమాయే!

విఘ్నాలనుంచి రక్షించే వాడు, పూజలలో ప్రథమ పూజ అందుకునే వాడు గణేశుడే. అందుకే అతడు ‘ప్రధమేశ్' అయ్యాడు.

వినాయకుడి ఆరాధన లో ప్రముఖమైనది- ఏక వింశతి పత్రీ పూజ. ఇరవై ఒక్క ఆకులు- గరిక, గన్నేరు, మామిడి, మాచి, మారేడు, మరువం, రావి( అశ్వత్థ) , రేగు(బదరీ), ఉమ్మెత్త, జిల్లేడు, జమ్మి, జాజి, దానిమ్మ(దాడిమ), దేవదారు, తులసి- ఇలా ఒక పదిహేను బాగా గుర్తుంటాయి. మిగతా ఆరు – విష్ణుక్రాంత, వాకుడు, వావిలి, ఉత్తరేణి,గండకి, మద్ది. తమలపాకు అనేది ప్రత్యేకంగా చెప్పలేదు, ఎందుకంటే ప్రతి పూజలోనూ ‘తాంబూలం' ఉండి తీరాలి కనుక.

వేదకాలంలో సంకల్పించే ఏ యజ్ఞం అయినా ఇరవైఒక్క రోజులు జరిగేది. ఇటూ అటూ పది రోజులుగా విడదీసి మధ్య వచ్చే పదకొండవ రోజున పెద్ద పెట్టున యజ్ఞం చేసేవాడు యజమాని. ఆధునిక విజ్ఞానం కూడా sun's declinations తాలూకు నాలుగు turning points ని March 21 (zero), June 21 (maximum, north), September 22 (zero) & December 22 (maximum, south) లకి ఆపాదించడం చూస్తుంటే ‘ఏకవింశతి' లో ఏదో విశేషముందనిపిస్తుంది.

వినాయక పూజలో తొలుత విగ్రహానికి నమస్కారం చెయ్యడం, తరువాత పాదానికి నీరివ్వడం, ఆసనం ఇవ్వడం, చేతికి నీరివ్వడం, పంచామృతంతో సేవించడం, వస్త్రం ఇవ్వడం, గంధం పూయడం , పదిహేడు శరీర భాగాల (ఆపాదమస్తకం) పూజ చేయడం, ఇరవై ఒక్క ఆకులతో పూజ చేయడం, నూటెనిమిది నామాలతో పూజ చేయడం అయ్యాక ధూపం, దీపం చూపించి మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం అర్పించిన తరువాత తాంబూలమివ్వాలి (భారీ భోజనానంతరం తాంబూల సేవనం జీర్ణక్రియలో సాయపడుతుంది). గణపతికి ప్రియమైనవి గరికలే. అందుకే చివర్లో ‘దూర్వాయుగ్మం' (గరిక జత) మంత్ర పూజ చేయాలి. పది మంత్రాలే. కానీ ఇరవై గరికలు. ముందు పత్రీ పూజలో ఒక గరిక ఇచ్చుకున్నాం కనుక దానితో కలుపుకొని మొత్తం ఇరవైఒక్క గరికలు ఇరవైఒక్క పత్రులకి సమానంగా సమర్పించుకున్నామన్న మాట.

నూటెనిమిది నామాలు- రుద్రాక్ష మాలలో ఉండే నూటా ఎనిమిది రుద్రాక్షల్ని సూచిస్తున్నా అవి నూటెనిమిది నక్షత్ర పాదాలు (అశ్విని నుంచి రేవతి వరకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున 27 x 4 =108 పాదాలు) అని గ్రహించవచ్చు. అలా విశ్వమంతా పరచుకున్న విశ్వ రూపం గణపతిది.

సినిమా బొమ్మల్లో, బయటా గణపతి :

నటుడు శివాజీ గణేషన్ ఇంటి సమీపంలో గణపతి మందిరం కట్టుకొని రోజూ స్వామి దర్శనం చేసుకునేవారట. ఆ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు ప్రభు చేపట్టారు.

దేనికైనా ఊరేగింపు అంటే మనకి మూడు గుర్తొస్తాయి- గణేశ నిమజ్జనం, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పూరీ లో జగన్నాధ రథయాత్ర. కన్నుల పండుగ కలిగించేది భద్రాద్రి పైన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం. ఇంతవరకూ బ్రహ్మోత్సవాలు సినిమాల్లోకి రాలేదు. గణేశ నిమజ్జనం ఒక సినిమాలో వ్యంగ్యానికి ప్రతీక అయ్యింది. గణపయ్య బొజ్జలో నల్లధనం దాచి ఊరు దాటిస్తున్న దుండగుల్ని ఇద్దరు ‘హీరో'చితంగా ఎదిరించి బట్టబయలు చెయ్యడం చూశాం.

ఇక గణపతి మీద వచ్చిన సినిమాలు అరుదే. పాటలూ అరుదే. ఒక ప్రసిద్ధ రచన ‘లంబోదర లకుమి కర' మనకి ‘మల్లీశ్వరి ' చిత్రం టైటిల్స్ లో మాత్రమే విన్పిస్తుంది. ప్రతి సంగీత శిక్షణలో ఈ కీర్తన తప్పని సరి అని తెలిసినదే. 'వినాయక చవితి' చిత్రంలోని వాతాపి గణపతిం భజే .. గానం హంస ధ్వని రాగానికి తొలి ఏకైక ఉదాహరణ. వినాయక మూర్తికీ, హంస ధ్వనికీ ఏమిటి సంబంధం? హంస నడక, గజ గమనం ప్రత్యేక మైనవి కనుక ఈ సంబంధం ఏర్పడిందేమో. కీర్తిశేషులు భరాగో (హాస్య, వ్యంగ్య రచయితా, మ్యూజిక్రీ ఆర్టిస్టూ..భమిడిపాటి రామ గోపాలం) తన ‘ఇట్లు ..భవదీయుడు ' సంపుటిలో అంటారు- ఘంటసాల గారు ‘అనేకదంతం భక్తానాం ..ఏక దంత ముపాస్మహే '.. అని పాడిందే అంతా వల్లె వేస్తున్నారు అనీ. అనేకదం తం – అని అక్కడ విరుపు ఉండాలి అని, అలా మాస్టారు చేయలేదని ఆయన ఆవేదన. నిజానికి మళ్ళీ మళ్ళీ విని చూడండి – విరుపు ఉండీ లేనట్లు ఉంటుంది.

'నర్తనశాల' చిత్రంలో ఘంటసాల,జానకి పాడిన ‘ జయ గణనాయక విఘ్న వినాయక ' పాట వ్రాసినది సముద్రాల రాఘవాచార్య కవీశ్వరులు. గణేశుడికి తల్లి పార్వతి నాట్య కళా కౌశలాన్ని వివరించే పాట అది. నాట్య ప్రదర్శనకి అనువైన పాఠం ఇది. గతేడాది సంక్రాంతికి ఒక బృందం పుణేలో ఇదే నృత్యాన్ని ప్రదర్శించారు( గాయని జానకి గారు ఘంటసాల గారితో ఎక్కువ యుగళ గీతాలు పాడలేదని ఒకసారి మాతో ముచ్చటిస్తూ అన్నారు. పాడినవి తక్కువే అయినా గుర్తుండేవే, పదిమంది పాడుకునేవే పాడారండీ అని మేం అన్నాం. ఈ పాట లాగే ‘నడిరేయి ఏ జాములో' ప్రసిద్ధం కదా).

'వినాయక విజయం ' చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కవీంద్రులు ‘ ఎవరవయా .. ఏ దివ్య భువి నుండి దిగి .. ఈ అమ్మ ఒడిలోన ఒదిగి ' వంటి చిట్టిచిట్టి మాటలతో బాల వినాయక రూపాన్ని కళ్ళ ముందు ఉంచారు.

శివశివ మూర్తివి గణనాథా , డబ్బుకు లోకం దాసోహం గణనాథా , దేవుడు చేసిన మనుషుల్లారా – వంటి పాటల్లో గణపతిని అడ్డుపెట్టుకొని సంధించిన వ్యంగ్యం బాణాలు కనిపిస్తాయి.

మొత్తం మీద వినాయకుడు తెలుగు వారి పూజలు అందుకున్నా తన మీద పాటలు మాత్రం తక్కువే రాయించుకున్నాడు. పద్యాలూ అంతే...

‘ఆరతిచ్చే వేళ ఆశ్చర్యముగా' చూస్తాం అని ఆత్రేయ గారు ఒక పాటలో ఏడుకొండల సామిని దర్శిస్తూ అంటారు. అలా- ఆరతులివ్వడం అనేది మనం పేరంటాల్లో ఒక ఆచారంగా మాత్రమే పరిమితం చేసుకున్నాం. షిరిడీ సాయిబాబా ఆరతి, శ్రీగణేశ్ ఆరతి – దేశంలో బాగా ఆకట్టుకున్న ఆరతులని చెప్పవచ్చు.

మహారాష్ట్రలో వినిపించే గణపతి మంగళారతి పూర్తి పాఠాలు ‘కనులు చదివినా పాటే ' లోచూడవచ్చు. దేవనాగరి కనుక మరాఠీ లిపి చదవడం కష్టం కాదు. 'కనులు చూసినా పాటే ' వాటినే కను విందు కలిగించేలా చేస్తోంది.

సాధారణంగా వినిపించే (మహారాష్ట్ర) గణేశ ఆరతిలో – కొన్ని కృష్ణ వాక్కులూ వినిపిస్తాయి, వినాయక చవితి కథలో శ్రీకృష్ణుడు వచ్చినట్టు.

ముక్తా'యింపు' శ్లోకం :

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ / తానితాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే

పాపోహమ్ పాప కర్మాణామ్ పాపాత్మా పాప సంభవ: / త్రాహిమామ్ కృపయా దేవ శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ/ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష వినాయక

శ్రీరస్తు, శుభ మస్తు, అవిఘ్నమస్తు ...

-**డా. తాతిరాజు వేణుగోపాల్ ,**19 సెప్టెంబర్ 2012 (బుధవారం)

{ఓ బొజ్జ గణపయ్య .. సినీ క్విజ్ ఉందయ ... అని ప్రకటించడం చూశారు కదా ...

కంప్యూటర్ ని గణ యంత్రం అంటారు, అన్ని విషయాల విజ్ఞత కలిగి ఉన్న గణపతికి ప్రతీకగా. . గణపతి సేవకి ఎలక సాయపడుతోంది. అందుకే ‘మౌస్' సాయంతో కంప్యూటర్ పనులు చురుకుగా సాగుతున్నాయి. కంప్యూటర్ ‘ram' భజన చేస్తుంది. రాముడి సేవకి ఉడుత దూకుతూ సాయ పడినట్టే ‘వరుడు డాకు' సాయపడుతోంది. క్విజ్ లో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకడం అనేది ‘ఏ లక్ – ఫ్యాక్టర్' అని పెదవి విరిచేయడం కన్న ‘ అన్నిటినీ రాబడుతా' అని పెదవి తెరిచేయడమే మిన్న.

చవితి చంద్రుణ్ణి చూడడం నిషేధం కనుక దిక్కులు చూడొద్దు. చంద్రుడి మార్గంలో ఇరవై ఏడు తారలు ఉంటాయి. అంచేత ఒక ఇరవై ఏడు ప్రశ్నలు మీ ముందు ‘తార'సిల్లుతున్నాయి. సిల్లీ గా ఏవీ ఉండవని హామీ. ఇకనేం- తలొంచు కొనీ, గతాన్ని ఒకసారి తలచుకొనీ.. ఆ ఈ ఏ ... మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి..

మోదక ప్రియుడు గణపతికి మీ మోదమే ...modem అంటే అదేనేమో- ఆమోదం. కనుక మీ అసలైన సమాధానాలు భద్రంగా ఉంచుతూ ఈ నిజ భాద్ర మాసంలో అమావాస్య లోపు నెట్ ద్వారా పంపితే చాలు. అలాగనీ అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా?

అందుకనీ త్వరపడండి. మీ పేరూ ఊరూ, సమాధానాలు Home Page –Comments లో చేర్చకండి. [email protected] కి మాత్రమే పంపండి.

తిరుగు టపా లో మీరు ‘ఎన్ని కరెక్ట్ చేశారు' అనేది Home Page లో ఉన్న Comments శాఖలో చెబుతాను. బహుమతి లేని దానికి ఉన్న ఒక్క మతి పోగొట్టుకోవడం దేనికి అని నీరసించ కండి. మీ మతి యే మీకు గణపతి ఇచ్చిన ఉత్తమ బహుమతి!

Click here to go to the Quiz Page

ఆ ఈ ఏ ... త్రిక తికమక (సినీ క్విజ్) ... సమాధానాలు రాసేయండి చకచక ... }