సూపర్ మూన్ --- ఈ ‘హోలీ' చంద్రుడు
19 మార్చి, 2011


ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు ( 19 మార్చి 2011 ) చంద్రుడు ఎప్పటిలాగే గుండ్రంగానే కన్పించినా కాస్త ఒళ్ళు చేసినట్టు ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు కొంచెం తక్కువ దూరంలో భూమి, సూర్యుడు ఉన్న సరళ రేఖలో తిన్నగా వచ్చి ఉంటాడో అప్పుడే ఇలా లావుగా కనిపిస్తాడు. ఇది సుమారు 19 ఏళ్ల కొకసారి జరుగుతూ ఉంటుంది.
ప్రతి పున్నమికి ఈ ముగ్గురూ ఒకే రేఖలోనే ఉన్నా ‘ఎంతెంత దూరం' అన్న దాని బట్టే ఉంటుంది. ప్రతి నెలా చంద్రుడు భూమికి దగ్గర్లో ఉండే స్థానాన్ని ‘పెరిగీ ' (పెరిజీ) అని , దూరంగా ఉండే స్థానాన్ని ‘అపోగీ ' (అపోజీ) అని అంటారు. అరిచి ‘గీ' పెట్టినా హం ఏ సబ్ జాన్తా నై ‘జీ' అని విసుక్కోకండి. ఉండండుండండి ... సులభ మార్గం చెబుతా. ‘అపార దూరంలో ఉంటే అది అపోగీ, పరిమిత దూరంలో ఉంటే అది పెరిగీ '. అదే భూమి సూర్యుడికి దగ్గర్లో ఉంటే ‘పెర్హీలియన్', దూరంగా ఉంటే ‘ఎపి హీలియన్' అంటారు.
భూమి అమ్మ.
ఈ అమ్మ చుట్టూ కన్న బిడ్డలు సూర్యుడూ, చంద్రుడూ నిరంతరం ఒకర్నొకరు పట్టుకోవాలనే పరిగెడుతూ ఉంటారని, ఆ దృశ్యం చూస్తూ భూమాత మురిసిపోతుంటుందని మన పూర్వీకులైన వరాహ మిహురుల వారు అన్నారు. ఆరవ శతాబ్దపు మేధావి అయిన ఈయన ఆనాడే చంద్రుణ్ణి ‘సలిల ' గ్రహం అంటే ‘జల ' గ్రహం అని అన్నాడు. అక్కడ నీరుందని ఆయనకప్పుడే తెలుసునన్న మాట. అలాంటిది ఈ 21 వ శతాబ్దంలో ‘చంద్రయాన్ ' అనేది చంద్రుడి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసి ‘అవును అక్కడ నీటి ఆనవాళ్ళు ఉన్నాయోచ్' అని చెప్పాల్సి వచ్చింది. ‘ఇస్రో ' మని మనుషులుంటే ‘నాసా 'మి రంగా దేశాలే బాగు పడునోయ్. వరాహమిహురుడు అంతటితో ఆగి పోలేదు. ‘భ చక్రం ' అనే పన్నెండు రాశుల వృత్తంలో నాల్గవ రాశి అయిన ‘కర్క ' (కర్కాటక) రాశిని ‘జల' రాశి అన్నాడు. అనడమే కాకుండా దానికి అధిపతి ‘చంద్రుడు' అని కూడా అన్నాడు. మనకి కెమెరా లేనిదే కనిపించనివి ఆయనకి కను చూపు మేరలోనే కనిపించాయేమో.
రామాయణం తలుచుకోండి- సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఉన్నాయి అందులో. శ్రీ రామ ‘చంద్రుడు' సాక్షాత్తు ‘సూర్య' వంశానికి చెందిన వాడు. ‘భూమి' పుత్రి సీతని వరించిన వాడు. ఈ మాట నిజం. అందుకే అబద్ధం అసలు ఆడని వాడు సత్య హరిశ్ ‘చంద్రుడు' అయ్యాడు.
చంద్రుడి వల్ల సముద్రంలో ఆటు పోటులు వస్తాయి. అవి పున్నమికీ, అమావాస్యకీ ఎక్కువగా ఉంటాయి. అందుకే సముద్రాన్ని ‘ సంద్రం' అన్నారు.
ఇంతకీ చందమామ అంత పెద్ద సైజులో ఉంటే ఏ(విటట ?
మహా భయానక భూకంపాలూ, మహా బీభత్స అగ్ని పర్వత విస్ఫోటాలూ, పెద్ద పాము పడగలా సునామీ, ఏదైనా సరే వచ్చే ప్రమాదముందని కొందరి భయ వాక్కులు. ఇందుకు నిదర్శనం మార్చి 11 న వచ్చిన జపాన్ సునామీ అని చెబుతున్నారు. జాగర్తగా చూస్తె జనవరి 26,2001 న గుజరాత్ లోని ‘భుజ్' భూకంపం అమావాస్య కి రెండు రోజుల తరవాత వచ్చింది. డిసెంబర్ 26, 2004 భూకంపం + సునామీ పౌర్ణమి నాడే వచ్చింది. ‘బార్క్' ఆయన ఇటీవల నిజం ఇది నమ్మండంటూ ఒక పరిశోధనా వ్యాసం కూడా రాసారు.
అయితే జపాన్ లో పాపం ఒక షష్ఠి (ఆరవ తిథి) నాడు అలా జరిగింది. మనకు షష్ఠి, వారికో? నష్టి! ! పైగా నాలుగు న్యూక్లియర్ రియాక్టర్ల రేడియషన్ ఎఫెక్ట్ లెవల్స్ అయిదుకు చేరాయని వారంటే , కాదు దాటి ఆరుకి చేరాయని దూర దేశాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం. అగ్ని ఎక్కడ ఉన్నా నీరు ఉండాల్సిందే. అడవిలో దావానలం వ్యాపిస్తే పక్కన కదల లేని నది వల్ల ప్రయోజనం లేదు. వాన ఒక్కటే మార్గం. వాన ఎక్కువైతే మళ్ళీ వరద. అదో బెడద.
అడవికీ సముద్రానికీ దూరం పెరుగుతోంది. మనిషి ‘అల'కా పురం చేరే ప్రయత్నంలో అల పక్కనే కాపురం పెట్టేస్తున్నాడు. ఇప్పటి పిల్లలకి ‘అడివి' అంటే తెలీదు. ‘కాంక్రీట్ జంగల్స్' అనే మాట మాత్రం సిటీ లోని ప్రతి కేజీ లెవెల్ పాపడు కూడా పలుకుతాడు. ఆరుబయట తిరగలేని వాళ్ళు ఇంట్లోనే అర తెర తొలగిస్తే ఏమో ‘వెన్నెల' కనిపిస్తుందో లేదో చెప్పలేం.
‘చందమామ బాగుంది నేడు' అని ఆనాడే ఎప్పుడో ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు ‘అమాయకుడు' అనే సినిమా కోసం పాట రాసారు. ఈ పల్లవి నాయకి అంటుంది. నాయకుడు అమాయకుడు కదా- ‘ఏముంది, వింత ఏముంది- అవి ఇంతే కదా ఏ నాడు' అంటాడు. అదిగో ఆ మాటే నచ్చక ‘అడవి మనిషివి నీవు' అని దులిపేస్తుంది నాయకి**(ఆడియో వినండి)**.
కాని తాజ్ మహల్ పైన కురిసే వెన్నెల అడవిలోనూ కురుస్తుంది. భక్త కన్నప్ప లో బాపు గారు అడివి మనుషుల చేత ‘ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ' అని ఓ చిన్నదాని మనువు సందర్భంలో పాడించారు
( వీడియో చూడండి).
అక్కడా ఇక్కడా ఒకే వెన్నెల అయినట్టు, అప్పుడూ ఇప్పుడూ ఒకే వెన్నెల అంటుంది ఒక జంట-‘ఈ వెన్నెల – ఈ పున్నమి వెన్నెల—ఆనాడూ ఈనాడూ ఒకే వెన్నెల' అని ఇంగ్లీష్ ట్యూన్ లో పాడుతూ. ( గమ్మత్తు గా తెలుగు, తమిళం, మాతృక – మూడూ ముచ్చటగా ఉన్న వీడియో చూడండి)‘వెన్నెల లోనే వేడి యేలనో' అనే సందేహాల జంట కూడా ఉంది. ఆ మాయ పింగళి వారి సినిమాయ ముద్ర ఏమో? (ఆడియో విని చెప్పండి).
వసంతాల సంకేతం హోలీ. ఇదే ఫాల్గుణ పౌర్ణమి నాడు ‘హోలీ క ' (రాక్షసి ) దహనం చేసి మరు నాడు రంగులు చల్లు కునే ఆచారం దేశమంతటా ఉంది. మదనుడి (మన్మధుడు) మనసు దోచే గుణ గర్వం చూసి శివుడు మూడో కన్నుమరీ తెరిచి భస్మం చేసాడు. అందుకనీ ఈ పౌర్ణమిని ‘కాముని' పున్నమి అంటారు.
పాపం కోయిల ఎండల్లో చల్లగా పాడుతుంది కనుక నల్ల బడిపోయింది. ఈ నలుపు.తెలుపు భేదం ఆనాడు కృష్ణుడికీ ఒక సందేహమే. రాధ చేతి పక్కన తన చేయి నల్లగా ఉంటే కించిత్ ‘న్యూనతా భావం' కలిగింది. యశోదమ్మతో విన్నవించుకున్నాడు. ఆ తల్లి ఎంత చక్కగా సర్ది చెప్పింది- ‘రంగులు చల్లుకుంటే ఎవరి రంగు ఏదో ఎలా తెలుస్తుంది?'.
ఏడు రంగులు కలిసిపోతే ఆ రంగు తెలుపు. అది కన్ను గ్రహించలేకపోతే అప్పుడది నలుపు. నల్లని చీకటిని మరపింప జేసేది వెన్నెల. ఈ వెన్నెల స్నానాలు మరు నాటి రంగు నీటి స్నానాలు కావడమే ‘హోలీ '.
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 19 మార్చి 2011