Krishnaprema Logo

కృష్ణప్రేమ

ఏరువాక సాగారో రన్నో ... మామా మామా మామా

23 జూన్, 2011

ఏరువాక సాగారో రన్నో ... మామా మామా మామా

Picture

రాజమండ్రి ద్వారా 'స్వరబ్రహ్మ 'గా బిరుదు పొందిన గోదావరి లాంటి శాంత మూర్తి , మామ అని మొత్తం సినీ పరిశ్రమ ముద్దుగా పిలుచుకునే దగ్గరి బంధువు మహదేవన్ మనకి దూరమై పదేళ్లు గడిచాయి. 2001 లో జూన్ 21 న ఆయన గంధర్వ లోకంలో ఏం పనుందో కానీ ఏడు స్వరాలూ, ఎనిమిది పదుల వయసూ దాటి వెళ్లి పోయారు. మామ లేని సినీ లోకం పుట్టింట అమావాస్య చీకటి ఆవరించింది.

ఆయన పూర్తి పేరు లో తొలి పొడి అక్షరాలు ‘కె.వి. ' అంటే ఆయన పవర్ తెలిసిన వాళ్ళు కె అంటే కె రటంలా వి అంటే వి రుచుకు పడే సముద్ర గంభీరుడు అంటారేమో. ఎందుకంటే మామ మాట్ల్లడేదీ పొడి పొడి గానే.

'దొంగలున్నారు జాగ్రత్త ' (1958) –

హఠాత్తుగా ఈ నోటీస్ బోర్డ్ ఏమిటా అనుకునేరు. ఈ వింత టైటిల్ ఉన్న సినిమా మామ తొలి తెలుగు సినిమా కావడం ఆయనకది ఆయన లేని కాలంలో బాగా ఉపకరించింది. ఎందుకంటే ఆయన కట్టిన బాణీలు ఇప్పటికీ మక్కీ కి మక్కీ దించేసి పబ్బం గడుపుకున్న వారూ ఉన్నారు. ఈ తొలి సినిమా లో మామ బాణీ కొంచెం వేరుగా ఉంటుంది. కావాలంటే 'ఏమనెనోయి ఆమని రేయి' అన్నజిక్కి-ఘంటసాల యుగళ గీతం విన్నారనుకోండి, మీరూ అవునంటారు. తొలి సినిమా లో తొలి ఋతువు 'ఆమని' మాట వచ్చేలా పాట రావడం ఆయన అదృష్టం. ఆ అదృష్ట రేఖ గీసింది ఆత్రేయ గారే. అందుకే నేమో వారి అనుబంధం 'ఆత్రేయ-మహదేవన్' వెరసి తమిళ పదం 'ఆమ' , అంటే తెలుగులో అవును అని అందరిచేతా అనిపించింది.


మామ సంగీతం 'energetic ' గా ఉంటుంది. మొదటి మెట్టు ఎక్కగానే ధైర్యం వచ్చేసి మొత్తం నిచ్చెన ఎక్కడం తేలికైపోయినట్టు మామ పల్లవి మెట్టు మీదే ఓ గట్టి పట్టు పట్టి చరణాలు ఆటోమేటిక్ గా పడేట్టు చూసుకునే వారు. మాల్ కోజ్, మోహన, యమన్ రాగాలు సర్వ సాధారణం ఆయనకి. అరుదైన శుద్ధ సావేరి, శహన వంటివి దేవులపల్లి వారి సాహిత్యానికి ప్రయోగించేవారు. కృష్ణశాస్త్రి గారి సంగీత రూపకాలు ఎంత బావుంటాయో వాటిని అందంగా తీర్చి ఇవ్వడంలో మహదేవన్ గారు తన వంతు ‘బాగు' ప్రదర్శించే వారు. ‘నీల మోహనా రారా' (డాక్టర్ ఆనంద్, 1966**)** , ఈ దారి నా స్వామి నడిచేనే (చెల్లెలి కాపురం, 1971), రావమ్మ మహాలక్ష్మి రావమ్మా (ఉండమ్మా బొట్టు పెడతా, 1968) వంటి ముచ్చెం మూడు పాటలు చాలు అవే వేనవేలు.

కృష్ణన్ కోయిల్ వెంకటాచలం – ఇవి ఆ కె.వి. అనే రెండు పొడి అక్షరాల వెనక ఉన్న రహస్య నామాలు. ఆగలేక దాశరథి గారు ఒక పాట కూడా రాశేరు. అందులో కోవెల, కృష్ణ శబ్దాలు ఉన్నాయి. ‘మనసే కోవెల గా – మమతలు మల్లెలుగా- నిన్నే కొలిచితిరా –నన్నెన్నడు మరువకురా –కృష్ణా ' అన్నదే ఆ పాట. మామ గడసరి. ఈ పాట కోదండపాణి చేతిలో పెట్టి ‘శిష్యా ,పదండి ముందుకు అని వెళ్లవు కదా రష్యా, దీనికి వరస కట్టే బాధ్యత నీదే నయ్యా' అనడమేమిటి ‘చిత్తం గురూ' అని పాణి యమన్ లో కట్టి పడేశారు. అంతకు ముందు ఇదే శిష్యుడు ‘ఆత్మబంధువు, 1962' మామ కోసం ‘అనగనగా ఒక రాజు' పాట కూర్చాడు. పాణి ‘పదండి ముందుకు, 1962' అంటూ చేసిన ‘మనసు మంచిది వయసు చెడ్డది' పల్లవి గల పాట వింటే రెంటి మధ్య పోలికలు వినిపిస్తాయి.

మామ అందరి బంధువు అయితే ఆయన ఆత్మ మాత్రం ‘పుహళేంది ' అనే అంటారు సినీ పెద్దలు. పుహళేంది తనకు తానుగా కొన్ని సినిమాలు చేసినా జీవితాంతం మామ తోనే మమేకమైపోయారు. పుహళేంది మంచి కవి కూడా. తెలుగు లోనూ ఆయన కవితలు రాశేరు. అందుకే మామ స్వర పరిచిన తెలుగు పాటలు ఏ ఒక్కటీ బుట్ట దాఖలైన ఆధారమేదీ లేదు.

మామ మొత్తం 680 సినిమాలు చేస్తే అందులో సగం తెలుగువే. ఇది మనం గర్వించాల్సిన విషయం. ఆయన ఎంచుకున్న ప్రతి స్వరంలో ఏం భాస్వరం ఉందో కాని మన అదృష్టం కొద్దీ మంచి వెలుగులే చూశాం. ఇప్పటి సినీ గీతాల్లో వెలుగు లేదనలేం కానీ ‘డిమ్మింగ్' ఉంది. మామకు తగ్గ అల్లుళ్ళు లేరు మరి.

భాస్వరం గా పిలిచే ఎల్లారీశ్వరి గాత్రాన్ని తొలి సారిగా పరిచయం చేసింది మహదేవన్ గారే. ఘంటసాల-సుశీల యుగళ గీతాలు అధిక శాతం మామ కూర్చినవే అయినా ఘంటసాల-ఈశ్వరి కాంబినేషన్ లో ‘ఆకులు పోకలు ఇవ్వొద్దు – నా నోరు ఎర్రగ చెయ్యొద్దు', ‘పగటి కలలు కంటున్న మావయ్యా', ‘లేలేలే నా రాజా' వంటివి డబ్భై ల్లో హిట్లే కానీ ఎవ్వరి నోటా తిట్లు కాలేదు.

ఆర్ డీ బర్మన్ ‘దమ్మారో దమ్' అని దుమ్ము రేపక ముందే ఆ ‘ద' ‘మ' కార గుణింతం తిరగేసి ‘ముమ్ముమ్ము-ముద్దంటే చేదా' అని దుమారం లేపారు మహదేవన్. ఏమైనా ‘హరే రామ హరే కృష్ణ ' ఇద్దరూ ‘అదృష్ట వంతులు, 1968 ', ప్రజామోదం పొందిన సంగీత ప్రవీణులు. వీరితోనే అలనాటి, ఆధునిక సంగీతం ఆఖరు అనిపించుకోవడంలో ప్రసిద్ధులు.

సినీ పరిశ్రమలొ పాటలు పది కాలాలు మనగలగాలంటే పెద్ద పెద్ద సంస్థల వారి చేయూత అవసరం. జగపతి రాజేంద్ర ప్రసాద్, సురేష్ రామానాయుడు , బాబూ మూవీస్, అక్కినేని-ఆదుర్తి చక్రవర్తి చిత్ర, వంటి దిక్కులు, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదన్ రావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణ రావు, కె. రాఘవేంద్ర రావు , వంటి దిక్పాలకులు మహదేవన్ వారికి సంప్రాప్తించడం ఆయన పొందిన అదృష్టం.

మహదేవన్ చేతికి న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఇచ్చినా మహా ఈజీగా ట్యూన్ కట్టగలరని ప్రజా వాక్యం.

'క్షేత్రయ్య పదాలు ' ఉన్నట్టే ఆత్రేయ వాక్యాలు ఉన్నాయి. ఆత్రేయ అంత నిడివి గలవి రాసినా ఆ వాక్యాలు మామ చేతిలో పడి కావ్యాలుగా రూపు దిద్దుకున్నాయి. మహాకవి శ్రీశ్రీ భావావేశం మాత్రం మహదేవన్ గారికి కొద్ది గానే దక్కింది. 'మనుషులు మారాలి ,1969' లో 'తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం' చూపించి పుట్టిన రోజు వేడుకలు జరిగే తీరు మారాలి అన్నంత గొప్పగా పాట కూర్చారు ఇద్దరూ.

మహదేవన్ వీణ పాటలు పరుగులు పెట్టే ట్రెయిన్ కోచుల్లాంటివి.ఎవరో రావాలి ఈ వీణను సవరించాలి, , ఈ వీణకు శృతి లేదు, వీణ లోనా తీగాలోనా ఎక్కడున్నది రాగము వంటివి వింటే అలా అనిపించదూ? అయితే పఠదీప్, చక్రవాకం వంటి రాగాలతో ఈ వీణ పాటలు కొత్తగా వినిపించాయి.

మహదేవన్ చేతిలో రెండు రత్నాలు బాగా మెరిశాయి. ఒకే ఒక్క సినిమా పాట -నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది- రాసిన గుంటూరు శేషేంద్ర శర్మ గారు మరింత ప్రఖ్యాతమయ్యారు. తొలి సారిగా అక్కినేని కి పాడిన పాట- నా హృదయపు కోవెలలో- తో ఎస్పీ బాలు డు 'ప్రౌడ్' త్వం పొందారు.

మహదేవన్-వేటూరి కాంబినేషన్ తరువాతి కాలంలో ఒక అపూర్వ కానుకైంది శ్రోతలకి. సీతాలు సింగారం, పుత్తడిబొమ్మ, గోవుల్లు తెల్లన, కంచికి పోతావా కృష్ణమ్మా, కుహు కుహు కోకిలమ్మ పెళ్ళికి, రాగాల పల్లకిలో కోకిలమ్మా, ఒకటా రెండా ఇలా లెక్క వేసుకుంటూ పొతే పక్క ఊరికి పోగలం.

మామ దయ వల్ల 'గంధము పుయ్యరుగా' అని కోరుకున్న వారికి శాస్త్రీయ పరిమళం దక్కింది. మామ కృప వల్ల మలయమారుతం మోసుకొస్తే అన్నమయ్య వారి 'ఇన్ని రాశుల యునికి' ఎక్కడుందో తెలిసింది.

భద్రాచల రామదాస కీర్తనల కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బాలమురళీకృష్ణ గళాన 'పలుకే బంగారామాయెగా అందాల రామ' అనే నవ్యత్వం ఒలికించిన ఘనత మామకే చెల్లింది.

ఇంతకీ మహదేవన్ గారికి ఆ ‘మామ' అనే ప్రజా బిరుదు దొరకడానికి కారకులెవ్వరు? ఈ క్షణంలో ఆ కవి పేరు చెప్పక పొతే నిప్పు కణికల్లాంటి పదాలతో మెదడుకు చురక పెట్టే ఆ కవి కలం ‘కొస ' ‘రా జు'కుంటుంది. అవును- ఆ కవి పేరు కొసరాజు రాఘవయ్య చౌదరి అని మూడు ముక్కల్లో చెప్పే బదులు 'కొసరాజు ' అని ఒకే ముక్కలో చెబితే అందరికీ అర్థమౌతుంది. ఈ జానపద కవి భోజ రాజు ‘మామా మామా మామా –ఏమే ఏమే భామా' అనే పాట ఎంత బాగా రాశారో అంతే బాగా దాన్ని స్వర పరిచి మహదేవన్ ప్రజా హృదయం దోచుకున్నారు. ఆ దోపిడీ ఫలితమే ఆ ‘మామ' అన్న బిరుదు.

కొసరాజు గారు గుంటూరు అప్పికట్లలో 1901, జూన్ 23 న పుట్టారు.

కొన్ని పాటలు రాసి కవి గానూ , నటుడిగానూ గూడవల్లి రామబ్రహ్మం గారి ‘రైతు బిడ్డ, 1937' లో తొలి ప్రవేశం ఆయనది. ఏకంగా మహా నగరానికొచ్చిన ఈ రైతు బిడ్డ పల్లె గుండె సవ్వడి తెలిసిన తెలుగు శబ్ద విరించి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పల్లె అయినా, పట్నమైనా అక్కడ ఉండే అమాయక ప్రజల పలుకుబళ్ళు,ఆటా,పాటా,కట్టుబాట్లు, నడవడి,సంప్రదాయాలు తన రచనల్లో చూపించేందుకు ఇష్టపడేవారు. కొసరాజు అదే పల్లె ప్రజలను 'లోకం పోకడ ' అనేది ఒకటి ఉంది సుమా అది ఎరిగి మసలుకోవాలని హెచ్చరించేందుకు తన రచనలు ఉపయోగపడాలని కాంక్షించేవారు.
ఇద్దరి దృష్టిలో పల్లె ప్రజలు, దుక్కి దున్నే పని చేసుకు బ్రతికే వారు కల్లా కపటం లేని వారే. అందుకే తొలి కారు వస్తే ‘నెల మూడు వానలు ' కురిసి నేల తడియాలనే తపన ఎందుకుండాలో కొసరాజు వారి పల్లె పాటల ద్వారనే తెలుస్తుంది.

కొసరాజు 'practicality ' చూపించి రచనలు చేసేవారు. లోకం తీరు ఎలా ఉందో చెప్పడానికి ఏ మాత్రం కూడా జంకే వారు కాదు. ఉన్న నిజం చెప్పడం, అది చేదు నిజమైనప్పుడు దానికి పరిష్కార మార్గం సూచించడం ఆయన రచనల్లో చూడవచ్చు. కొసరాజు పాట అనగానే జానపద బాణీ మాత్రమే అవసరం అని అనిపించినా ఆయన రచనల్లోని వైవిధ్యానికి ముగ్ధులై సంగీత దర్శకులు రక రకాల బాణీలు కూర్చేవారు.

అన్నపూర్ణ సంస్థ లో దాదాపు అన్ని చిత్రాలకు ఒకటి రెండు పాటలు ప్రత్యేకంగా కొసరాజు రాసినవే అయినా కె.విశ్వనాథ్ గారు తొలి సారిగా దర్శకత్వం వహించిన 'ఆత్మ గౌరవం ,1966' చిత్రంలో ఆయన రాసిన పాట ఒక్కటీ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. కవి డా. సి.నారాయణ రెడ్డి గారే స్వయంగా అన్నారు 'తాను ఆ సినిమా కోసం "మా రాజులొచ్చారు మహరాజు లొచ్చారు" అనే కొసరాజు తరహా పాట నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు గారి సూచనల సాయంతో రాశానని. అందులో ముద్ద పప్పు, కొత్త ఆవకాయ, గుత్తి వంకాయ, గారెలు, నేతి బూరెలు, బొబ్బట్లు – మెనూ కార్డ్ వస్తుంది. అదే ఏడు శ్రీక్రిష్ణ పాండవీయం చిత్రానికి భీముడి బండి-తిండి పాట రాస్తూ కొసరాజు అట్టు, మినపట్టు, బొబ్బట్టు, పప్పు, పచ్చడి వంటి ‘స్వరయుక్త' రుచికర పదాలు వడ్డించడం బహుశా ముందే జరిగి పోయి ఉండవచ్చు.

‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' అన్నది అప్పటికప్పుడు అనుకున్న సన్నివేశానికి అవలీలగా కొసరాజు గారు రాసి ఇచ్చిన పాట. మాస్టర్ వేణు అంతే అవలీలగా స్వర పరచడం, అక్కడెక్కడో అప్పటి బొంబాయి లో ఉన్న ఎస్డీ బర్మన్ దా అది విని తెగ మెచ్చుకునీ అదే వరసను తానూ తీసుకోవడం, తీసుకోవడమే కాకుండా తన హిందీ పాటలోనూ కొస లో ‘చిన్నన్న ' అనే మాటనే ఉంచేయడం వింటుంటే కొస'రాజు వెడలె రవి తేజములలరగ ' అని అనవలసిందే. మరాఠీ లోనూ ‘అన్న ' అనేది ఉండడం వల్ల బర్మన్ దా కది సబబే అని అనిపించి ఉండాలి.

కొసరాజు సినీ పద బంధ కోశం తెరిస్తే- డాంబికాలు, గడపొచ్చు, బ్రతకొచ్చు, అద్దెకు పోనూ, చీట్ల పేకలు, మిట్ట రాళ్ళ దారి, కార్ల వసతి, గొడ్డూ గోదా, కూరా నారా, పిల్లా జెల్లా, లెక్క లేక, పలచనై పోవడం, గొడవ చాలించు, గోల వింటాను, బొల బొల, ఎలపడ దాపట,ఒలె,హతాహతముగా, ఠలాయించు, ఠారెత్తి పోవడం, మింట పోయే, కోడెలు, జాతి వన్నె బుజ్జాయిలు, తువ్వాయిలు, తోడుకోని, పుట్టిముంచు, మర్మ మెరిగి, చిత్రంగా, పదారు, పస్తాయించక,తత్తర బిత్తర, గాభర గీభర, తిరు క్షవరం, సర్వ మంగళం, తెల్వి,గెల్వడం, గెల్పు, కుదువ బెట్టు, దెబ్బతో, జోలె కట్టు, గల్లంతై పోవడం, ఈడవలు, బాడవలు, ఊచ బియ్యము, చీటీ కట్టు, లబ్జు, వాలైన, కల్గు, ఉలికించు, నెల మూడు వానలు, మురిడి గొలుసులు, కొంప కాల్చే, గొప్ప చెప్ప, చీదర, సదురు ---------ఇదంతా ఒక పెద్ద కొండవీటి చాంతాడే.

కొసరాజు ఇటువంటి జాన పదాలే కాదు చక్కటి యుగళ గీతాలూ రాశారు. నమ్మిన బంటు చిత్రంలో ‘ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగుడుదురా' అన్నది వేనోళ్ళ పొగడబడ్డ పాట. రాజు-బంటు కూడా చక్కగా కుదిరిన జంటే. కొసరాజు తత్త్వం నింపి రాసిన ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ' (లవకుశ) అన్న పాట నిజంగా ఎవరూ ఊహించనిదే.
నమ్మినబంటు చిత్రానికి కొన్ని పాటలు రాజేశ్వరరావు స్వర పరిచి తప్పుకున్నారు. తతిమ్మావి వేణు పూర్తి చేశారు. అలా రక్షించినందుకేమో కొసరాజు 'ఎంత మంచివాడవురా' అని తన శైలికి భిన్నంగా రాయవలసి వచ్చింది.రాజేశ్వర రావు గారు కొసరాజు రాసిన 'చెంగు చెంగునా గంతులు వెయ్యండి' అన్న తువ్వాయిల మీద పాటని ఎంత మోహనంగా స్వర పరిచారూ! కవి హృదయం తెలిసిన స్వర కర్త ఉంటే కాల దోషం పట్టిపోవు కవి వాక్కులు.

కొస'రాజు' వాక్య 'పరిపాలన' లో కొన్ని ఆదేశాలు, పక్కన కుండలీ కరణాలలో నా 'చిత్తం' లు -

‘మాటల్లో మోమాటం నింపి రాగంలో అనురాగం కలిపి –పాట పాడుతుంటే ‘ ( నిజమైన ప్రేమ కొలమానం)

‘టౌన్ పక్క కెళ్ళేవో డౌనై పోతావురో' ( నేటి అర్బనైజేషన్ మీద నాడే విసురు)

‘కాఫీ తోటే గడపొచ్చంట –కబుర్లు చెప్పుకు బ్రతకొచ్చంట' ( ఆఫీస్ పని మీద సెటైర్)

‘అద్దెకు పోనూ అణా మిగలదు' ( నాటి ఎకానమీ నేటికీ వర్తిస్తుంది)

‘మిట్ట రాళ్ళ దారి పోయి సిమెంటు రోడ్డు వెలిసింది' (ఇప్పటికీ ఇదే తీరు)

‘కాలి నడక మారిపోయి కార్ల వసతి కలిగింది' ( ఫీట్ల రోడ్లు ఎక్కువై ఫుట్ పాత్ లు కరువు)

‘ఈ లోకమంటే లెక్క లేక ఎగిరి పోదువా' ( కౌన్సెలింగ్)

‘ఈ రోజుకీ గొడవ చాలించులే –తీరికగా నీ గోల వింటానులే'( రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం)

‘కాపు బీదే కానీ గడ్డ బీదే కాదు' ( నేల విలువైనది)

‘కోటి విద్యలు కూడా కొండకే లోకువ' ( విల్ పవర్ కాదు హిల్ పవర్)

‘పడమట దిక్కున వరద గుడి' ( halo around moon)

‘కాలచక్రం ధాటి కన్న గబ గబా పరుగెత్తు బండి' ( be dynamic than time bound)

‘సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే- పళ్ళు పదారు రాలునులే' (అది= గంగ, నేను= గౌరి; శివుడు అర్థ నారీశ్వరుడు కనుక తన నోటి పళ్ళు పదహారు భద్రం, ఆవిడవి రాలాల్సిందే)

‘పౌడరు దెచ్చెను నీ కందం –బాగా వెయ్ వేలెడు మందం' ( అప్పుడూ ఇప్పుడూ ఇంతే)

‘గెల్పూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు / మళ్ళీ ఆడి గెల్వ వచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు? –ఇల్లూ కుదువ బెట్ట వచ్చు

చాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీర వచ్చు

పొతే?

అనుభవమ్ము వచ్చు – చివరకు జోలె కట్టవచ్చు' ( great logical thinking ! )

‘నీరసించు శక్తినంత చేరదీయ బూనవోయ్' (positive suggestion in counseling)

‘జీవితమ్ము సార్థకమ్ము చేయు దారి వెదుకవోయ్' ( -do-)

‘కొంపలు భగభగ మండేటప్పుడు- నూతులు తవ్వి ఫలితం లేదు' ( not the knowledge but wisdom is needed )

‘పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయ్' ( boldly face any untoward situation)

‘ఓర్చుకొన్నవారికే ఓరుగల్లు' (patience fetches)

'గుర్రం గాడిద ఒకటని వాగే/ వెర్రి వాడికి బుర్ర ఎక్కడ /అది ఇది కాదు ఇది అది కాదు/అరవకపోతే తేడా తెలియదు ' (not to be fooled by similarity keeping aside individuality)

ఇదంతా కొన్ని పాటల సారాంశమే.

సారా వంటి అంశమే కాదు సిగరెట్టు తాగడం, పేకాట, డాబు ప్రదర్శన , డాంబికాలు పోవడం, ఇల్లరికం కోరడం , బద్ధకం పెంచుకోవడం వంటి వ్యర్థ మైన అంశాలను ఆయన తూర్పార బట్టారు.

అందుకే కొస రాజుకుందంటే కొసరాజు పాట లోని నిప్పు కణిక చురక పెట్టి తీరుతుంది.

వీలు చూసుకునీ వీలైనన్ని ఆయన పాటల ఖజానా తెరవండి. అదే ఆయన మనకి రాసిచ్చిన వీలునామా.

'పాదుకా పట్టాభిషేకం ,1966 ' చిత్రం కోసం 'రామయ తండ్రి రఘురామయ తండ్రి ఎంత గొప్ప వాడివయ్య రామయ తండ్రి' అని ఆయన రాసిన పాట ఘంటసాల గారి స్వర నావ పైన మెల్లగా సాగితే, మళ్ళీ ఇంచుమించు అవే భావాలతో ఆయనే 'సంపూర్ణ రామాయణం (1972)' కోసం రాసిన 'రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ - మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి' అన్న పాట మహదేవన్ గారి సంగీత నావ మీద వేగంగా కదిలింది (పాట=తిరుగు టపా లో ఈ రెండు పాటల పోలిక చూడవచ్చు) (లోగడ ఈ రెండు పాటల వీడియో/ఆడియో లు ఇవ్వడమైంది).

కొసరాజు గారి ఒక రచన 'చిల్లర రాళ్ళకు మొక్కుతూ ఉంటే' (పూల రంగడు , 1967) దైవికంగా దొరికిన వరం -ఘంటసాల, నాగయ్య గార్ల అరుదైన యుగళం.

కొసరాజు గారు గుర్రం పైన, గుర్రబ్బగ్గీ మీద పోతూ పాడుకునే పాటలు చాలా రాశారు. ఆడవె ఆడవె గుర్రమా, నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా వంటి పాటలు జనం మెచ్చారు.

నవీన కాల జ్ఞానం చెబుతూ ఆయన 'బిడ్డలు లేని గొడ్డురాలికి బహుమతులన్నారీనాడు' అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రష్యాలో జనాభా తగ్గుతోందట. అందుకనీ వారక్కడ ‘తల్లులూ పిల్లల్ని కనండి- ఉచితంగా నేల బహుమతిగా పొందండి' అని ప్రచారం చేసుకుంటున్నారు. నవీన కాలంలో మరింత నవ్యత్వమా?
‘కనులు తెరిచినా పాటే' లో మహదేవన్ స్వర పరిచిన కొసరాజస ఠీవిని నాలుగు రకాలుగా కనులారా చూడండి.

‘కనులు మూసినా పాటే' లో కొసరాజు విసుర్లు చెవులారా వినండి.

చిత్రం- ‘re'చిత్రం లో కొసరాజు మార్క్ హాస్యాన్ని నవ్వుతూ చూడండి.

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 23 జూన్ 2011