Krishnaprema Logo

కృష్ణప్రేమ

తెకతెకలు, లుకలుకలు, గునగునలు ... తెలుగు భాషవే!

03 ఫిబ్రవరి, 2012

తెకతెకలు, లుకలుకలు, గునగునలు ... తెలుగు భాషవే!

తెకతెకలు, లుకలుకలు, గునగునలు ... తెలుగు భాషవే!

Picture

click to zoom

ఏ భాషకి తగ్గ అందమైన పద సామగ్రి ఆ భాషకి ఉండడం వింతకాదు. తేనె కన్న తియ్యనిది తెలుగు కాబట్టి తెలుగు పదాల మాధుర్యాన్ని ‘తెలుగు 'లోని మూడక్షారాల సాక్షిగా ‘తెలుగు తెకతెకలు ', ‘తెలుగులుకలుకలు ', ‘తెలుగు గునగునలు ' అనే మూడు కొత్త అంశాలుగా సాహిత్య విస్తరిలో వడ్డించి చవి చూడడమే ఈ పూట ప్రత్యేకత.

తెలుగు తెకతెకలు అంటే అవి తెలుగు జోకులు, ఉడుకునీళ్ళ శబ్దం లా కొందరు నవ్వుతుంటారు. అందుకనీ ‘తెకతెకలు ' అందాం. అదేమిటీ – నీళ్ళు ‘కుతకుత ' ఉడుకుతాయి కదా అని సందేహిస్తే దానికి సమాధానం: ఎవరైనా జోకులకి నవ్వలేక పోతున్నారంటే అందుక్కారణం వాళ్ళ మనసు ‘కుతకుత ' ఉడుకోతోందన్నమాట. తెకతెక అలా కాదు. సహజ సిద్ధంగా నవ్విస్తుంది. అది ఏకాకి నవ్వు.ఏకాంత నవ్వు. ‘తెకతెక ' గుంపులో చేరితే ‘పకపక 'అవుతుంది. తెకతెక తెలుగు జోకులంటే అవి ఇతర భాషల్లో సాధ్యం కానివి అని గ్రహించాలి. అంతేకాదు- మూడు చెరువుల నీళ్ళు తాగించినా సరే మరో భాషలోకి తర్జుమా చేయలేనివి ఇవి.

తెలుగు లుకలుకలు అంటే - ‘నా బుర్రలో ఏముంది, అంతా మట్టి' అనే న్యూనతాభావం నుంచి మెదడుకి మేత అందగానే అదే మెదడుని చకచక పరిగెత్తించడం. తెలుగు మాటల పొందిక, మాట విరుపుల సొగసులు ఇందులో కనిపిస్తాయి.


తెలుగు గునగునలు అంటేనా? – ఉన్న తెలుగు మాటకి ఓ చిన్న కత్తెర వేసి వేరు చేసి మరో కొత్త రూపమిచ్చి వయ్యారంగా నడిపించడం, లేదా విడివిడిగా ఉన్న వాటిని కలిపి కొట్టి కావేటి రంగా చెయ్యడం ఈ శాఖ ప్రత్యేకత. ఈ మాట విరుపులూ అంతే, మరో బాషలోకి మళ్ళించ వీల్లేనివి.

ఇలా ఐతే మరి ‘గ్లోబలైజేషన్ ' కి తెలుగు ఎదగదు కదా అని కొందరికి సందేహం రావొచ్చు. సందేహం అనే తెలుగు మాటకి భ.కా.రా(భమిడిపాటి కామేశ్వరరావు) ‘డౌటేహం ' అని పేరు పెట్టి గ్లోబలైజేషన్ మాట పుట్టక ముందే గ్లోబు దాటించేరు. గ్లోబు లో ఎక్కడున్నా తెలుగు వాడి గ్లోవెలిగిపోద్ది ' కనుక ఈ గునగునలు విశ్వ విఖ్యాతమవ్వాలి.

వరసగా ఒక్కొక్కటీ ముచ్చటించుకుందాం-

తెలుగు తెకతెకలు :

వినోద శ్రీరంగం -

చెప్పాలంటే అందులో కొన్నేమిటి చాలా మటుకు మహాకవి శ్రీశ్రీ పేల్చిన జోకులే ఉదాహరించాలి.

హోటల్ రూం లో బాయ్ శ్రీశ్రీ ముందు ‘గుడ్లు' నింపిన ప్లేట్ పెట్టి డబ్బులిస్తారేమో అన్నట్టు చూస్తుంటాడు. ‘ఎందుకలా గుడ్లప్పగించి చూస్తావ్?'- శ్రీశ్రీ విసుగు (గుడ్లు అప్పగించడం, గుడ్లప్పగించడం – చెప్పండి ఇంకే భాషలో సాధ్యం ఇది?).

శ్రీశ్రీ రైల్వే ప్లాట్ ఫాం మీద అటూఇటూ పచార్లు చేస్తుంటే ‘ఏవిటండీ శ్రీశ్రీ గారూ ఊరికేనా?' అని అడిగారెవరో. ‘ఆ( -- ఊరికే' – అన్నారు శ్రీశ్రీ నిదానంగా ( ఊరుకే , ఊరికే – ఈ పద మైత్రి ఇతర భాషలో ఉందా?)

హోటల్ లో అసిస్టెంట్ శ్రీశ్రీ దగ్గరికొచ్చి ‘సార్, అందరూ అట్లు అడుగుతున్నారు. మరి మీకు?' అని నసిగాడు.
శ్రీశ్రీ సమాధానం: ‘అట్లే కానిండు' (అట్లే –అలాగే కానివ్వండి – మాండలికం మార్పు లో జోకు పండింది)

కొచ్చిన్ సిస్టర్స్ తో ప్రోగ్రాం. ఆర్గనైజర్స్ హడావుడి పడిపోతున్నారు. ‘ఎక్కడ ఎక్కడ వారు?' అని వెతుకుతున్నారు.
ఇది గమనించి శ్రీశ్రీ ‘ఎందు కొచ్చిన్ సిస్టర్స్?' అన్నారు ( ఎందుకొచ్చిన అని ఒక అర్ధం, ఎందు? అని ప్రశ్న రూపంలో ఒక అర్ధం).

‘ఆయనేడీ?' ‘గదిలో ఉన్నాడు' ‘గదిలో ఏం చేస్తున్నాడు?' ‘సున్నాలు వేస్తున్నాడు'
గదిలోకి వెళ్లి చూస్తే ఆయన గోడ మీద సున్నా, సున్నా, సున్నా అలా ఎన్నో సున్నాలు వేస్తూ కనిపించాడు.

ఒక కవి సమ్మేళనానికి అంతా రాసుకొచ్చారు. కృష్ణశాస్త్రి ఖాళీగా వచ్చారు. అదేమిటి? అని అంతా తెల్ల బోతుంటేశ్రీశ్రీఆయన ‘రాయని' భాస్కరుడు లెండి ' అని చమత్కరించారు. (రాయని భాస్కర కవి ఒకనాటి కవిపుంగవుడు)

శ్రీశ్రీ ని ‘సార్, టీ, కాఫీల్లో ఏది బావుంటుందంటారు?' అని అడిగారు ఒకరు. శ్రీశ్రీ గారి సమాధానం ‘టి ఏ మధురం'!
( T.A. మధురం – తమిళ నటి).

శ్రీశ్రీ గారు బరంపురం సభలో పానుగంటి వారి వాక్చాతుర్యం గురించి చెబుతుంటే ఎంత ఆనందించాం! పానుగంటి వారంటే ‘సాక్షి వ్యాసాలు ' రాసిన పానుగంటి నరసింహారావు గారు. ఆయనికి ఎవరో బహుమతులిస్తామని ప్రకటించారట. ‘ఉన్న ఒక్క ‘మతి 'తోనే సతమతమౌతుంటే నాకీ బహు'మతులు' ఎందుకయ్యా!'- అని అన్నారట పానుగంటివారు.

శ్రీశ్రీ గారంటే ఒకశ్రీ పక్కన మరోశ్రీ. ఒకటి విప్లవకవిగా అగ్ని పర్వతమైతే మరొకటి వినోదమనే చలివేంద్రం. ఇలాంటి తెలుగుకి మాత్రమే పరిమితమై పోయిన జోకుల వెలికితీత ఆయన వల్లనే సాధ్యమైంది.

వే'టూరిజం'- ఆత్రేయ'వే'

ఆచార్య ఆత్రేయ అంటే వేటూరి సుందర రామమూర్తి కి అమితమైనగౌరవం. కొన్ని సందర్భాల్లో వేటూరి వారు పాటలు రాస్తూ ఆత్రేయ ని అనుసరించారు. ఆత్రేయ మనసు కవి ఐతే వేటూరి మన సుకవి. ఆత్రేయ ‘తెల్లబోయిన' తన జుట్టుకి రంగు వేసేవారు. ఒకసారి వేసుకోక వేటూరి కి ఎదురయ్యారు. అప్పటికే వేటూరి వారి జుట్టూ పండి పోయినా ఆయన కాస్త రంగు పులిమారు. ఆత్రేయ గారిని చూడగానే ‘ఏమిటండీ గురువు గారూ, రాయడం మానేశారా?' అని వేటూరి చిలిపిగా అడిగారు. ‘అంతేగా మరి- నువ్వు రాయడం మొదలెట్టాక నే రాయడం మానేశాను'- ఆత్రేయ చెణుకు ( వ్యవహారికంలో వ్రాయడం –రాయడం అవుతుంది).

( సినిమా కవిగా ఆత్రేయ తరువాత వేటూరి బిజీ అయ్యారు. అందుకే ‘నువ్వు పాటలు రాయడం మొదలెట్టాక నేను పాటలు రాయడం మానేశాను' – అని ఆత్రేయ గడుసు సమాధానం).

బాపురే రమణీయం

ఇక బాపు -ముళ్ళపూడి వారు సరే సరి.

వారు పేల్చిన జోకులు:

టీచర్ పిల్లవాడిని ‘గుఱ్ఱము ' అని రాయమంటాడు. పిల్లవాడు ‘గఱ్ఱమ ' అని రాసుకొస్తాడు. ‘ఇదేమిట్రా?' అని టీచర్ కేకలేస్తాడు. పిల్లవాడు అంటాడు : ‘మీరే కదా అన్నారు టీచర్ - ‘గుఱ్ఱము' నకు కొమ్ములుండవు అని' ( అసాధ్యమిది వేరే భాషలో)

కృష్ణుడు తలుపు తీసి చూస్తే ఎదురుగా స్త్రీ మూర్తి ఉంటుంది. ‘అరె మీరా?' అంటాడు కృష్ణుడు. ‘మీరా కాదు సక్కుబాయి ' –ఆ స్త్రీ సమాధానం (ఎలాగండి- వేరే భాష వారికి ఈ జోక్ చెప్పేది? బాపూ, ఇదే ఇదే –ఈ తెలుగు తనమే మిమ్మల్ని డిల్లీ దాక చేర్చడం లేదు. అందుకే సర్కారు ‘పద్మా'సనం వేసి మిమ్మల్ని సత్కరించడం లేదు).

వీరంతా సరే – పెద్దపెద్ద వాళ్ళు. ఎన్నెన్నో చెప్పి మనల్ని నవ్వించేరు. మరి కొన్ని అక్కడా ఇక్కడా ఎందరో పేలుస్తూ ఉంటారు. వీటికి మూలం ఎవరనేది తెలియదు. మచ్చుకి-

సంక్రాంతి సంబరాల్లో బసవన్న రావడం తెలిసినదే కదా. రోజంతా వీధీ వీధీ తిరుగుతూ, బసవన్నని తిప్పుతూ ‘డూ డూ డూ డూ బసవన్నా ' అని ఆడిస్తుంటారు. బాగా అలిసి పోయాక ఇంక చతికిలపడిపోయి ‘ ఐ కెనాట్ డూ' అంటుందట ఆ బసవం ( కిసుక్కున కొందరే నవ్వి ఉంటారని అనుమానం. తెకతెక సరిగ్గా కుదరకపోతేనే ‘కితకిత' అవుతుంది. మొత్తానికి ఈ జోకులో ‘గ్లోబలైజేషన్' తాపత్రయం కనపడుతూ ఉంది కదూ. అన్నట్టు జోకు తిప్పితే కుజో – నచ్చని జోకుని విద్యార్థి పరిభాషలో కుజో అనాలి. కె. జె. అని కూడా అంటారు మరి కొందరు ఇంగ్లీషు పాండిత్య ప్రోకోపులు).

గ్లోబ్ అంటే గుర్తొచ్చాయి మూడు లోకాలు. ‘ముల్లోకాలు ' , ‘కాల్లో ముల్లు ' – ఇవి ఒకదాని తరువాత ఒకటి గబగబా అనండి. పది సార్లన్న తరువాత ఆగుతారు, ఎందుకంటే అప్పుడు ‘కాలు ముల్లు ముల్లు' అని మీరంటారు కనక. కాల్లో ముల్లు మీద ఓ జోక్ ఉండేది. పెళ్ళైన కొత్తలో ‘ముల్లోకాలు వెతికినా నీలాంటి స్త్రీ దొరకనే దొరకదు' అని పొగిడే భర్త భార్యతో నడుస్తూ దారిలో ఏదైనా ముల్లు కంటపడితే ముందే తీసి పారేస్తాట్ట. అదే కొన్నేళ్ళ తరువాత భార్య కాల్లో ముల్లు గుచ్చుకుంటే ‘చూసి నడవలేవూ?' అని కసరుకుంటాడట.

తెలుగు లుకలుకలు :

మెదడుకి మేత అని ముందే అన్నాం కాబట్టి ఇవి పదబంధ ప్రహేళికలు/గళ్ళ నుడికట్లు/ పద రంగాలు అనబడే తెలుగు క్ర్రాస్ వర్డ్ పజిల్స్ లో మేధావులైన వారు కూర్చితే తారస పడతాయి. మేధావులకి విపర్య పదం మేతావులు (మేత+ఆవులు) అని ఎవరన్నదీ? ముళ్ళపూడివారా?జంధ్యాల వారా? ఎవరైతేనేం, మా బాగా అన్నారు.

శ్రీశ్రీ పదబంధ ప్రహేళికలు అల్లుతూ గళ్ళకి సరిపోయే అక్షారాలకి తగిన ఆధారాన్ని ఇవ్వడంలో చమత్కారం చూపించేవారు. ఇచ్చిన ఆధారం చదివితే మొదటిసారి అదో వాక్యంలా అనిపిస్తుంది. రెండు భాగాలుగా విడదీస్తేనే ఆ గళ్ళకి సరిపోయే పదం దొరుకుతుంది. ఉదాహరణకి- ఉన్నవి అయిదు గళ్ళు. అక్కడ ఇచ్చిన ఆధారం: నటీమణి నదికి ప్రమాదం. వాక్యంలా చదివితే ‘నటీమణి నది' ఏమిటో ఒక పట్టాన తోచదు. రెండుగా విడదీసి ‘నటీమణి, నదికి ప్రమాదం' అని అనుకుంటేనే సమాధానం ఇట్టే దొరికిపోతుంది. ‘నదికి ప్రమాదం' – ఇందులో ‘నది, కి, ప్రమాదం' అని మూడున్నాయి కదా, వీటికి బదులుగా ‘కృష్ణ (నది) , కు (కి) , మారి( ప్రమాదం) ' వేసి కలిపేస్తే ‘కృష్ణకుమారి ' అవుతుంది. కృష్ణకుమారి – నటీమణి కదా.

హబ్బ! ఒక్కసారి తల తిరిగినట్టయింది కదూ. తల తిరగడమంటే మళ్ళీ శ్రీశ్రీ పజిల్ లోని రెండు గళ్ళకిచ్చిన ఆధారమే గుర్తొస్తుంది. ఒక రచయిత్రి పేరొస్తుంది కనక రాయడం సబబు కాదు. నన్నే పజిల్ కూర్చమంటే (మేధావి వర్గానికి చెందకపోయినా) ఆ రెండు గళ్ళకిచ్చే ఆధారం ఇలా ఉంటుంది: ‘తల తిరిగితే పాకుతుంది'. అంటే సమాధానం : ‘పాము' కాబోలు అని సంబరపడేవారు ఉండవచ్చు. కానే కాదు - సమాధానం: లత.

కృష్ణప్రేమ లో పాట= తిరుగు ‘టపా ' అని ఒకటుంది, చూస్తున్నారా? ఆ పేరుశ్రీశ్రీ గారి కూర్పే. అందులో పాటలు వెతికి పోల్చి ఇవ్వడం వరకూ నా స్వంతం. శ్రీశ్రీ గారు ఒకసారి అయిదు గళ్ళ కోసం తన దైన శైలిలో ఒక ఆధారం: ‘పాట ' అని ఇచ్చారు. ఎంత కష్టమది! అయిదు గళ్ళలో ‘పాట' అంటే ఏం వెయ్యాలి? శ్రీశ్రీ గారి తెలివి చూడండి- టపా తిరిగితే పాట అవుతుంది కదా, అంచేత ‘పాట = తిరుగు టపా' అన్నది స్ఫురించాలి . నిజానికి తిరుగు టపా అనేది ఉత్తరాల రవాణాలో జరిగేది. ఇక్కడది అవసరం లేదు. తికమకల తిరనాళ్లివి, వాటి సరదాలే వేరు. మేధావుల కూర్పులు ఎందరికో నిట్టూర్పులు. అదే రెండు గళ్ళు వేసి ఆధారం: ‘తిరుగు టపా' అని ఇస్తే టపా ని తిప్పమంటున్నారు అని గ్రహించడానికి అట్టే సమయం పట్టదు. మేతావులు అలా కూర్చగలరు.

మూడు గళ్ళు కూర్చి ఆధారం: ‘రాత్రి లేక త్రిరా ' అని శ్రీశ్రీ గారు ఇస్తే దానికి సమాధానం ‘రారారా' అని గ్రహించడానికి ఎక్కువ సమయమే పడుతుంది. రాత్రి – అంటేనే రా,రా,రా అని మూడుసార్లు అనవచ్చన్న స్పృహ రాదే! పైగా ‘త్రిరా' అని తిప్పి చెప్పినా మూడు సార్లు రా,రా,రా అవుతుందే, చప్పున వెలగదే బుర్రలో బల్బు. ఏమిటో ఈ పజిలీలలు!

తెలుగు గునగునలు:

తెలిసిన తెలుగు పదాన్ని చిన్న మెలిక తిప్పి ఉచ్చరిస్తే , అద్దాన్నే (అద్దం కాదు, ఆ+దానిని) రాగ యుక్తంగా పాడితే గునగున మంటూ నవ్వు గుబాళించవచ్చు. అలాంటిది మాయాబజార్(1957) –పాట లో ఉంది- ‘అహ నా పెళ్ళి యంట ' పాటలో స్త్రీ గొంతు పురుష గొంతులోకి మారగానే ‘త తోం తోం తోం తత్తాం తత్తాం – అటు తంతాం ఇటు తంతాం' అని వినిపిస్తే తెగ విరగబడి నవ్వుకున్నామా లేదా? తాళ భాషలో ‘తంతాం' అనే క్రియాత్మక పదం చేరి నవ్వించింది..

(అలాగే ‘తోం తోం – తథిగిణ తోం' అనే లయ విరుపుని ‘తోం తోం – ధథి గిన్నె తోం' (పాల గిన్నె తోమడం) అనే పేరడీ గా మార్చితే నవ్వొస్తుంది).

పదాన్ని గానీ పదాల్ని గానీ మెలిక తిప్ప కుండా మధ్యలో కత్తెర వేసి విడదీసో, విడిగా ఉన్న వాటిని కలిపేసో చేసి రాగ యుక్తంగా పాడిస్తే నవ్వు రావొచ్చు, కవి చతురతకి భేష్, శభాష్ అనే ప్రశంసలూ దక్కవచ్చు. ఇప్పుడిప్పుడే ఆత్రేయ కవిని మనసుకవి అనిన్నీ, వేటూరి కవిని మన సుకవి అనిన్నీ అన్నాం కూడా. ఇలా ‘మనసు కవి' మాటల మధ్య కొంచెం కత్తెర వేసి అక్షరం ఒక్కటే జరిపితే ఎంత మార్పొచ్చిందో కదా.

ఇటువంటి అవకాశం దక్కంగానే ఆరుద్ర తాండవమాడిన తీరు చూడండి. ఇద్దరుమిత్రులు (1961) లో హాస్య నటుల ల మీద యుగళ గీతం ఉంది. స్త్రీ పాత్ర పేరు ‘మీనా '. ‘చక్కని చుక్కా సరసకు రావే ' అనే ఆ పాట చివర్లో ‘తీయకుమీ నా ప్రాణం, తీయకు మీనా ప్రాణం ' అని ప్రయోగిస్తే ఎంత నవ్వుకున్నాం!

ఈనాటి ఈ బంధమేనాటిదో ' (మూగ మనసులు , 1964)) యుగళ గీతాలు అందరికి కొట్టిన పిండి. యుగళ గీతాలు అనే బహు వచనం ఎందుకంటే అదే మకుటంతో ఆ సినిమాలో రెండు పాటలున్నాయి కనక. అందులో రెండో గీతంలో ఆత్రేయ చమత్కారం ఉంది లెండి. ‘అనురాగము అను రాగము నే ఆలపించి నిను లాలిస్తా ' అని అంటారు ‘అమ్మాయ్' గారు. ఇలాంటి మాట విరుపుల దగ్గర ‘కలిసుంటే సల్లాపము, విడిపోతే కల్లోలము ' అనే ఆరుద్ర సూక్తి
(అది జంట కోసం చెప్పేరనుకోండి) వర్తించదు. కలిసి ఉన్నా, విడగొట్టినా తెలుగు తెలుగే.

డా.సి. నారాయణరెడ్డి గారు తన ‘శివరంజనీ నవరాగిణీ '( తూర్పు-పడమర , 1976) పాటలో ‘నీవే నీవే నాలో పలికే నాదానివి , నీవె నా దానివి ' అని సొగసుగా హీరో చేత పలికిస్తే పాపం ఆవిడ హీరో చెంప చెళ్లుమనిపిస్తుంది. నాదం లో ఉన్న వర్షిప్ బాగానే ఉన్నా , ‘నా దానివి' అనడంలో దొర్లిన ఓనర్ షిప్ రైట్ వినగానే హుంకరించింది చారుకేశి (నటి శ్రీవిద్య కి పొడవైన జుట్టు ఉండేది).

కలవరమాయే మదిలో ' అన్నాడు పాతాళభైరవి తోట రాముడు. రాజ కుమారి తనను వరించడం కల అని అనుకోలేదు. నిజమనుకున్నాడు. కాబట్టి పింగళి కవి ‘కల వరమాయే మదిలో ' అని మరో పంక్తిలో విరవ లేదు. అదే సి.నా.రె వారికి అక్కరకొచ్చింది. ‘కురుక్షేత్రం '(1977) కోసం ఆయన రాసిన ‘మ్రోగింది కళ్యాణ వీణ ' అనే యుగళ గీతంలో నాయిక ‘కల వరించి, కలవరించి ' అంటుంది ( అదేమిటో ఇంత చక్కని పాట వీడియో గానీ, ఆడియో గానీ ఇవ్వాలనే బుద్ధీ జ్ఞానం తెలుగు వాళ్ళకి ఎందుకు లేదో?).

ఆబాల గోపాలము ఆ బాల గోపాలుని'(శ్రీమద్విరాటపర్వం , 1979- వేటూరి - జీవితమే కృష్ణ సంగీతము) – ఈ ముక్క విన్నారా? ఆబాల గోపాలము అంటే చిన్న పిల్లవాడి దగ్గర్నుంచి అందరూ – అనే అర్ధంలో ప్రయోగిస్తూ ‘ఆ బాల' అని విడదీసి ఆ చిన్ని కృష్ణుడిని చూసారని చెప్పడం!

త్రిక సంధి తెలుసు కదా- ఆ, ఈ, ఏ – ఈ మూడింటిని త్రికములందురు----అని చదివేం కదా. ఆ+చోట= అచ్చోట, ఈ+కడ=ఇక్కడ, ఏ+వారు= ఎవ్వారు ఇలా ఆ సంధికి ఉదాహరణలు ఇస్తుంటారు. ఇప్పుడే కదా ‘అద్దాన్ని' అనేది విడదీసి చెప్పుకున్నాం. వేటూరి వారు ‘వ్రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవ రస మురళి' (సప్తపది , 1981) పాట రాశారు. అందులో ‘అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ ' అని అంటారు. ఒక దానికి అచ్చెరువున = ఆశ్చర్యంగా, మరో దానికి ఆ+చెరువున ఆపాదించిన గడసరి ఆయన. ఇందులోనే మళ్ళీ ‘ఆబాల గోపాలమా బాల గోపాలుని ' అనేది పునరుక్తం చేశారు.

డా. సి.నా.రెసువ్వీ సువ్వీ సువ్వాలమ్మి ' (స్వాతిముత్యం , 1986) అనే జానపద శైలి లో ఇటువంటి కావ్య సొగసును జార విడుచుకోలేదేమో అని అనుకునీ మోసపోయాం. అమాయక హీరో: ‘---ఘడియ వస్తుందమ్మా ఒకనాడు – చూస్తున్నాడు పైవాడు ' అని అంటాడు. విధి వంచిత హీరోయిన్: వస్తుందా ఆనాడు- చూస్తాడా ఆ పైవాడు' అని బదులిస్తుంది. హీరో ‘ఆ పైవాడు ' అని, హీరోయిన్ ‘ఆపై వాడు ' అని గానీ అని ఉంటే ‘గునగునలు ' కి మరో ఉదాహరణ అయ్యేది. కళా తపశ్వి సినిమాల్లోనే ఈ ప్రయోగాలు ఎక్కువగా కన్పించేవి [దేవ భాషలో మహాకవి కాళీదాసు ‘పార్వతీ పరమేశం' నే ‘పార్వతీప రమేశం' గా విరవడం వేటూరి వారు తన పాట ‘నాద వినోదము'కి సాకి రూపంలో అందిస్తేనే ఎందరికో తెలిసింది. అది సాగర సంగమం(1983) పాట. అదీ విశ్వనాథ్ సృష్టే]

పింగళి వారు వేయనిది, సి.నా.రె గారు వేసేసినది మళ్ళీ వేటూరి వారి వే లో టూర్ చేసింది. ‘ప్రేమించు-పెళ్ళాడు ' (1985) చిత్రం కోసం రాసిన పాటలో పల్లవిలోనే ఒయ్యారంగా ఈ గునగున నడిచింది. ‘ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం? – కలల ఒడిలో కలిసిపోతే కల వరం ' అనే ఆ పాటలో ఇళయరాజా వారు కల-వరం విరిచిన తీరు కడు ప్రశంసనీయం. బాలు గారు కల గంటే అటువంటి గిమ్మిక్కుల పాటలు ఆయనికి గమ్మత్తుగ వరమై దక్కుతాయి.

ఇలాంటి కవి అల్లరి చేష్టలు స్వర కర్త కి తెలియాలి. కవి భావం కళ్ళకు కట్టినట్టు పాడాలి గాయకులు. దృశ్యం కనువిందు చేసేలా శ్రమ పడాలి దర్శకుడు. అప్పుడే అటువంటి తెలుగు గునగునలు అందంగా ఉంటాయి.

వీటిని ఎలాగోలా తర్జూమా చేసెయ్యొచ్చు కానీ ఆ తెలుగు తేట లోని మాధుర్యం రమ్మన్నా రాదు.

[ పిడకల వేట :

ఇంకో పాతపాట ఉంది- చంద్రుడి మీద. అందులో మాట విరుపులు లేవు కానీ పాడే వారు ఏ మాత్రం శ్రద్ధ తీసుకోక పోయినా పొరపాటు ధ్వనించే ప్రమాదం ఉంది. ‘నీలి మేఘాలలో నిలిచి చూసెదవేల చందమామా ' (పెళ్ళి సంబంధం , 1970) పాట అది. క్షమించాలి. అందులో ‘తరలిపోయెదవా' అనే చోట ‘తరలిపో యెదవా' అని విరిచి పాడితే చిక్కే. ‘తరలిపో' అని కాస్త ఆగి ఊపిరి తీసుకునీ ‘యెదవా' అన్నా చిక్కే. మంచి తెలుగు లోనే కొంప ముంచే విరుపులన్న మాట. అందుకనే ఈ రోజుల్లో తెలుగు పాటల్లో తెలుగు లేకుండా జాగర్తలు తీసుకుంటున్నారు, పాత వాళ్ళు ఎంత మూతి విరుచుకుంటున్నా]

అనువాదానికి అందుబాటులో లేని తెలుగు స్వరాక్షరి అల్లరి ఒకటుంది తెలుసా?

‘సరిసరి, దాని నిగ నిగ, గరిమ, పస గని' అతను రోడ్డు మీద నోరెళ్లబెట్టి పడబోతే ‘మగని సరిగ పద మని' ఆమె ఒక్కటిచ్చింది.

దీని ‘అనువాదం ' ఎలాగబ్బా ‘అను వాదం ' ఎప్పటికీ ముగియక బ్రహ్మ దేవుడు బాధపడుతుంటే సరస్వతీ దేవి చేతిలో తెలుగు వారి కాగితం ఎగిరొచ్చి పడింది. చూస్తే - ‘శారద - హిందీవిశారద ' అని అందులో రాసి ఉంది.

బ్రహ్మ కి దిక్కు తోచక నాలుగు తలలు తిరిగాయి. హిందీ లోనూ ఉన్నాయి కాబోలు హికహికలు అని నిట్టూర్చాడు (హికహికలు- అంటే ఎక్కిళ్ళ వంటి నవ్వులు. హిక్కప్ నుంచి జనితం)

తెలుగు వాడికి కోపం వస్తే ‘పోరా ' అంటాడు. పో అంటూనేరా అని బుజ్జగిస్తాడన్న మాట.

హిందీ వాడికి ప్రేమ పుట్టి ‘ఆజారే ' (రారావోయి) అంటాడు. ‘ ' అంటూ రమ్మంటూనే ‘జారే ' అని పొమ్మంటాడు.

ఏమిటీ మాయ? రెండు భాషల ‘ద్విభాష్యం!' అని బ్రహ్మ ‘విట్టూ'ర్చాడు.

‘మాయె మాయె ! మీకేమాయె? కాసేపు లోకాల వైపు కాలం వెళ్ళబుచ్చక ‘కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే ' – చూస్తూవిందురు గానీ పదండి – అంది సరస్వతీ దేవి.

నా గోల


కవి తల్లో లేనిది కవితల్లో ఏం వస్తుందీ?

ఒక కవిత నిలా అల్లాను నేను యువక దశలో:

'నా గుండె

స్పందనలు నిమిషానికి

డబ్భై రెండె!

అయితేనేం?

అవి

డబ్భై రెండు 'మేళకర్త'లై

**అనురాగం **

అను రాగం

కొత్తగా ఆలపిస్తాయి'

నేనూ రాయగలను అని అనిపించి ఓ పాట రాసుకున్నాను పాతికేళ్ళ క్రితం –

‘**కృష్ణా నువ్వన్నా నీ మురళి యన్నా ఎంతో ఆరాధన!

అయినా నువు తలచేదీ, నువు వలచేది ఆ రాధనా?'
**
ఇది ఆ పాట పల్లవి.

( వేటూరి వారు రాసిన ‘వ్రేపల్లియ యెద ఝల్లున' పాటలో బాలు వంతు పంక్తుల్లో ‘ఆ రాధ ఆరాధనా గీతం ' ఉంది నాయనా. కట్ & పేస్ట్ బాపతా అని నన్ను ఎద్దేవా చెయ్యకండి మహా ప్రభో! అందులో లేని ‘న', ‘నా' పక్కన కొస్చెన్ మార్క్ నా పల్లవిలో ఉన్నాయని మనవి. మీవి, మావి కలిపితేనే ‘మనవి' అని గ్రహించుడీ**.**

ఇంకోటీ రాసేను- ‘ఔనే కోయిలా, అనుకో యిలా ' అని.

తె.లు.గు – మూడక్షరాల సాక్షిగా మీ దగ్గరా తెకతెకలు, లుకలుకలు, గునగునలు ఉండి ఉంటాయని, వాటిని మనసారా ( మాట విరవకండి మన సారా అని) పంచుకుంటారని ‘మిత్రుల పత్రాలు ' విభాగం ఆత్రంగా ఎదురు చూస్తుంటుంది.

మూల విరాట్ లు వేరే ఉన్నారు

**
**

ద్వర్ధ్యి కావ్య రచనలో ఇలాంటి పద ప్రయోగాలు జరుగుతాయి. ఐతే వాటిలో మాట విరుపులతో పూర్తిగా వేరే అర్ధం వచ్చేలా రాస్తారు, మచ్చుకి-

లంకా విజయం లో :

'సీతను వే విడువంగ మేలగున్' అని ఉంటుంది. ఇక్కడ 'సీతను' విడిచి పెట్టమనే హిత బోధ ఉంది. ఇదే వాక్యాన్ని 'సీ! తనువే విడువంగ మేలగున్' అని చదివితే మరో అర్ధం వస్తుంది.

వసు చరిత్ర లో:

-------ఆడుబడుచులే

పగవారికి వలదన నా

పగవారికి నేల యొసగె (బద్మజుడు

అనే పద్యంలో ఒక విరుపు- 'ఏ పగవారికి వద్దంటే ఆ పగవారికెందు కిచ్చినట్టు?'

ఇంకో విరుపు- 'ఆపగ ( అంటే నది) వారికి ( అంటే నీటికి) ఎందుకివ్వడం?

తెలుగు వారి తరగని ఆస్తి - పద్యం. తెలుగు పద్యం మరో భాషలోకి అనువాదం కాదు, కాలేదు.

ఇలా ఎప్పుడో , ఎక్కడో ఒక 'మానిసి ' చూపిన బాట మలుపు తిరిగి 'సినిమా ' అయి మనోరంజనమైంది.

నా సామి రంగారావు, మరి మీ సామి?

తెలుగు వారికి మాత్రమే తెలిసిన నానుడి – నా సామి రంగా. ఇదీ అంతే అతర్జూమీయం. ఆత్రేయ చిలిపి మాటలు వల్లె వేసి హీరో ‘చింతచెట్టు చిగురు చూడు-చిన్నదాని పొగరు చూడు-చింత చిగురు పుల్లగున్నాదోయ్- నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్ ' అని ఆ చిన్నదాన్ని చూసి ‘వావ్ ' అని ఎగిరి గంతేశాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ తెలిసిన హీరో, హీరోయిన్ లు అదృష్టవంతులు(1968).

ఐతే వారికంటే భాగ్యవంతుడు సిపాయి చిన్నయ్య(1969). ఆరుద్ర మాటలు వల్లె వేసి – ‘నా జన్మ భూమి ఎంత అందమైన దేశము- నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము- నా సామిరంగా హొయ్ హొయ్ నా సామి రంగా' అని దేశాన్ని చూసి ‘వావ్ ' అని ఆనందంగా ఈల వేస్తూ ఎగిరి గంతేశాడు.

‘ఈసురో మని మనుషులుంటే దేశమే గతి బాగు పడునోయ్' అని గురజాడ వారు హెచ్చరించారు కనక ప్రేమికులూ, సిపాయిలూ ఈసురో మని ఉండకూడదు.
ఈసురోమని ఉండరు ‘ఇస్రో ' సూర్యులు, పైగా వారికి అండ ‘నాసా 'మిరంగ మార్తాండులు , చంద్రుణ్ణి చూసి అంతా చల్లగా జారుకునీ చెప్పెందుకేముందని చల్లటి నీళ్ళు నములుతుంటే ‘చంద్రుడి శిలా రూపంలో చక్కని నీటి ఆనవాళ్ళు ఉన్నాయి' అని చకచక చాటగలిగేరు. ఎంతైనా వీరి ‘స్పేస్' వేల్యూ వే వేరు.

మొత్తానికి ‘తె లు గు' లో ఉన్నన్ని తెకతెకలు,లుకలుకలు,గునగునలు వేరే భాషలో లేవా? నా సామి రంగా

చివరికి మిగిలేది చిన్నారి ప్రశ్న**:**

అన్ని భాషల చంటి పిల్లలు ఏదేదో అంటారు. తెలుగు చంటి మాత్రం ‘ఉంగా ఉంగా ' అనే ఎందుకంటాడు? వై దిస్ జస్ట్ ఫర్ టెల్గూస్ ఓన్లీ? (ఏ భాషలో పసి వాళ్ళు ఏం పలికినా- పసివాళ్ళు దేవుళ్ళు. దారుణంగా హింసించి చావు బతుకుల మధ్యకీడ్చి ఒక రెండేళ్ళ పాపని డిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో విసిరి పారేసిన నర హంతకుల చర్యని తీవ్రంగా ఖండించండి. మనం చూడలేని కొత్త ప్రపంచం పిల్లలు చూసే భాగ్యం పిల్లలకి ఎందుకు కలగకూడదో నిలదీసి అడగండి. పిల్లి అయినా తన పిల్లల్ని ఇల్లిలు తిప్పి రక్షిస్తుందే- ఎవరా తల్లి? ఎక్కడికి పోతోందీ నాగరిక సమాజం? కృష్ణా-- నీ బేగనే బారో!)

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 04 February 2012