రేపటి పున్నమి వెలుగుల జగతిలో కరుణ కురియాలిరా
24 ఫిబ్రవరి, 2013
‘అవునా నిజమేనా?' రేపటి రేయి పున్నమి రేయేనా? ‘రేయైతే వెన్నెల బయలంత' నిండేనా?
అయితే ‘పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే?' అసలు ‘ప్రతి రాత్రి పున్నమి' కాగలిగితే ఎంత బావుణ్ణు!
ఆ పాన్పుపైన పరుండి నా స్వామిని చూడాలి. నా చందమామను చూడాలి.
‘అనుకోనా ఇది నిజమనుకోనా?' ‘చందమామ ఈ కనులకు విందేనా?' ‘ఎందుకు ఆ చందమామ? ఎవరి విందుకోసమో?'అని ‘ఎవరు ఏమని' గుసగుసలాడినా...
‘ఔరా! కోరికలు,కలలు తీరా నిజమైతే?' ‘జాబిలి కూన' ‘ఎదుటనుంచి కదలను'...
‘గగన సీమల తేలు ఓ మేఘమాలా', ‘కాస్త ఆగు'.. ‘ఆగు ..రవంత ఆగు'...‘ఆకాశపు అంచుల విహరించే చందమామ.. అవును..ఆ ‘చందమామ పైని ఏ మబ్బులు ముసరరాదని' ... ‘మరి మరి విన్నానులే'.
అటువంటి ‘తరగని తగ్గని జాబిలి' వస్తుంటే ‘వాకిటిలో నిలబడకు' ఏదో..‘మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం!' ‘అవునే.. తానే..నన్నేనే...నిజమేనే' చూడ వస్తున్నాడు.
‘ఒరిగింది చంద్రవంక...ఒయ్యారి తార వంక' అనో, ‘నెలవంక పక్క ఈ తళుకు తార మెరవాలి' అనో అక్కడెక్కడో ‘ద్వారానికి తారామణి హారం..హారతి వెన్నెల కర్పూరం' అమరిన చోట అనుకుంటే విన్నాను. కాని ఇప్పుడో.. ‘అందేనా ఈ చేతుల కందేనా? పోనీ ‘నింగి పైకి ఆశలనే నిచ్చెన' వేస్తేనో? అమ్మో.. అది నా వల్లనయ్యే పనేనా? అయినా ‘మాటలాడగానే సరా? మనసులో నిజం పలకాలి'
అదిగో..అంతలోనే ‘అలలు కొలనులో గలగలమనినా నీవు వచ్చేవని ...కన్నుల నీరిడి కలయ' చూసానని,
‘అసలే ఆనదు చూపు.. ఆపై ఈ కన్నీరు ..తీరా దయ చేసిన నీ రూపు తోచదయ్యయ్యో' అని చందమామకెలా విన్నవించుకోనూ? పైగా ‘వెన్నెల పారిజాతాలు' నా స్వామిని ఇటు వైపు రానిస్తాయా?
వద్దు..కన్నీరొద్దు... ఈ కొలనులో ఆ ‘ముద్దుల జాబిల్లి' ప్రతి బింబం చాలు.. అంత చేరువలో తానుండగా ‘అన్ని రాత్రులూ పున్నమి రాత్రులే మన మనసులో', అంతెందుకు? ‘ప్రతి రోజూ చంద్రుణ్ణి పలకరించి' సంబర పడవచ్చు ...
-ఇదంతా కలువ గోడు..
ఎంత మసి పూసి మారేడు కాయ చేసినా ఈ రాతల వెనక దాగి ఉన్న పద సంపద ఎవరిదో చెప్పడానికి అట్టే సమయం పట్టదు. పట్టేలోగా పున్నమి చంద్రుడిలా ఆయన నవ్వక పోరు...
కానీ ఆయన చంద్రుడిలో లీనమై ఇప్పటికి మూడు పదుల మీద మూడు ఏళ్ళు గడిచి పోయాయంటే ‘అవునా నిజమేనా?'అని అనిపించక మానదు.
ఇంతకీ ఆయన ఎవరు? పద్మభూషణ బిరుదాంకితులు, భావకవివర్యులు శ్రీ దేవులపల్లి వారు! శ్రీ కృష్ణశాస్త్రి గారు! వెరసి శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు!
పుట్టుక తేదీని మాత్రం ఘంటసాల (డిసెంబర్ 4) వారికి ముందే ఎంచుకున్నవారు (నవంబర్ 1)
ఆఖరు తేదీ నిమిత్తం ఘంటసాల ( ఫిబ్రవరి 11) వారినే అనుసరించిన వారు (ఫిబ్రవరి 24).
వీరిరువురి కలయికలో ఒక గుండె, ఒక గొంతు మేళవిస్తే ఏ పాట రావాలో అదే వచ్చింది. కాని పాటలో మాత్రం ‘రాక' లేదు. రాననే మాటే ఉంది. అది- ‘రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం '.
అన్నారే కాని ఆయనకి మాత్రం అందరూ ‘అచ్చంగా వసంతమాసం వచ్చేదాక'ఎదురు చూడాలని, అందరికీ ‘మల్లెలతో వసంతం' కనిపించినట్లే, వారికి ‘ఆరు ఋతువులూ ఆమని వేళలే' కావాలని, ఎందరికో ‘ప్రతిరాత్రి వసంత రాత్రి' గా గోచరించాలని, కొందరైనా ‘వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం' అనే ఆశతో ఉండాలని, అందులో ఏ ఒక్కడో ప్రేమ బికారైతే ‘కరుణించిన కణ్వ తపోవనిలో విరబూచిన వసంతలక్ష్మి' కోసం వలపు జోలె పట్టాలని, ‘ఏనాటికీ వసంతము ఈ తోట కింక రాదా?' అనే దిగులు విడిచి పెట్టాలని ...ఎంతో ఆశ! ఆ ఆశకి పరాకాష్ట అనడానికి నిదర్శనం ఆయన పలికిన మాటలే (కాదు ఆయన పలకలేరు..)..ఆయన కలం చిలికిన పలుకులే- ‘శీత వేళ రానీయకు రానీయకు..శిశిరానికి చోటీయకు చోటీయకు '!
ఇంకా అక్కడక్కడా శీతవేళ ఉండనే ఉంది.
ఆకులు నేల రాల్చాలనే తపనతో శిశిరం ఉంది.
కాని ఆకులకన్నా ముందు కనపడని దయ్యాల నిర్దయ వల్ల హృదయాలు నేలకొరిగాయి.
‘దిల్ సుఖ్' గా ఉందామని ఎంత ప్రయత్నిస్తున్నా ఆదరాబాదరాగా ‘ఉగ్రమైన వేసంగి గాడ్పులు' దాడి చేస్తున్నాయి.
అయ్యో.. నందన మా...మరో నలభై యాభై రోజుల్లో నీకు ఆనందంగా వీడ్కోలు చెప్పాలని ‘తొందర' పడుతుంటే ‘సుందర సురనందన వనమల్లీ జాబిల్లీ' అయిన మా చందమామలో మచ్చని చూపిస్తావేం? నిండు పున్నమి వెన్నెల చంద్రుడిలో మచ్చ మరింత పెద్దగా కనిపిస్తోంది. ఆ మచ్చ పేరు మచ్చరమా? అయితే అది తొలగి పోవాలంటే ‘కనులు కరగాలిరా ...కరిగి కరుణ కురియాలిరా ..కురిసి జగతి నిండాలిరా '
అవునా నిజమేనా? కరుణ కింకా స్థానం ఉందా?
[కనులు చూసినా పాటే - ఒక మల్లీశ్వరి ‘నెలరాజా వెన్నెల రాజా వినవా ' అని తన విషాద గాధ వినిపించడం, పూజా ఫలం గా చందమామ దక్కినట్లున్నా ‘అందేనా ఈ చేతుల కందేనా ' అని ఒక పేద కలువ సందేహ పడడం, ‘అదే మసక జాబిలి ' కనిపించినప్పుడు ఒక జంట వేదనతో గద్గదమవ్వడం ...ముత్యం మూడు పాటల భావాలు కనులు చూస్తూ చెవులకి వినిపిస్తాయి.
కనులు మూసినా పాటే - ‘అనుకోనా ఇది నిజమనుకోనా ' ‘మనిషైతే మనసుంటే కరుణ కురియాలిరా ' అనే ‘అమాయకుడు ', 'తాధిమి తకధిమి తోల్ బొమ్మా..మాయ బొమ్మా ' అనుకుంటూ ఒక బంగారు పాప ఆలనా పాలనా చూసే తాతయ్య, బాధను దాచుకొని జీవితం మోసుకొని అయినవారి పద సన్నిధి వాలే ఆడజన్మ అంతర్మథనం ...కనులు మూసినా సరే...నలు దిక్కులా నినదించే గీతాలు వినిపిస్తాయి.
(వచ్చేవారం మరిన్ని కృ.శా పాటలు ... వినాలని తొందర తొందర లాయె కదూ..)
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 24 ఫిబ్రవరి 2013