ఆబాల గోపాల బర్హం పురం కోరేది సముద్రాల ఘో(భా)షే !
03 మే, 2011
‘ఈ సారి నన్ను కులాసా కబుర్లకి రమ్మంటున్నావని తెలిసిపోయింది గోపాలా '
‘అవునవును బాలాజీ , మనం మనం బరంపురం. శ్రీ శ్రీ స్పృహ తొలి సంచిక అట్ట మీద ఓ కవిత రాశారు గుర్తుందా. అందులో బరంపురం బదులు బర్హం పుర్హం అన్నారు. బర్హ: అంటే నెమలి పురి అని లేటుగా తెలిసింది'
‘నెమలి పింఛమనగానే కృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణుడు అనగానే పడమట ద్వారక లాగ ఇక్కడ తూర్పున మన గోపాల పురం గుర్తొస్తుంది. గోపాల పురం అనగానే సముద్రం గుర్తొస్తుంది. ఎన్నెన్ని తుపాన్లు భరిస్తుంది పాపం.'
‘కదా. గోపాల పురం మన బరంపురానికి వేసవి విడిది. అక్కడవేణుగోపాల స్వామి కోవెల ఉంది చూశావూ'
‘చూడకేం? Bank వాళ్ళు ఆ వూరి జన సేవకి నన్ను మూడేళ్ళు పురమాయిస్తేనూ'
‘ఆ వేణుగోపాల స్వామి పేరే నా పేరని మా అమ్మ చెప్పేది. అదేం చిత్రమో, గోపాల పురం, విశాఖపట్నం సముద్రాలు ఎన్ని సార్లు చూసినా నేను మాస్టర్ లెవెల్లో సముద్ర శాస్త్రం చదువుతానని ఎప్పుడూ అనుకోలేదు. దీన్ని మా పరమగురు మిత్రుడు సాముద్రిక శాస్త్రం అని చమత్కరించే వాడు. శ్రీశ్రీ గారికి సముద్రమంటే ఎంతో ఇష్టం కదా. అంచేత వాళ్ళ అబ్బాయి రమణ మెరైన్ సైన్స్ చదివినట్టు గుర్తు'
ఇందర్ని తలుచుకునే క్రమంలో ఒక సారి ఏదీ ‘కనులు చూసినా పాటే' క్లిక్ చెయ్యి. చూసావా- మధుర కంఠం తో భానుమతి ‘ శ్రీ కర కరుణాల వాల వేణుగోపాలా ' ఎలా ఆలపిస్తున్నారో. ఇప్పుడు చెప్పు మన ఈ కులాసా కబుర్లలో ఇవాళ ఎవర్ని ప్రముఖంగా తలుచుకుంటామో? '
‘నదుల్లా కబుర్లని తిప్పి తిప్పి నువ్వుసముద్రాల దగ్గరికొస్తున్నట్టు అనిపిస్తోంది'
‘ఆహా- ఎప్పటిలా ఫిలా'సాఫీ'గా మాట్లాడేవ్! నిజమే. చెప్పుకొనేది కవి,రచయిత అయిన సముద్రాల గారి గురించే. అయితే సీనియర్ కాదు జూనియర్ గురించే'
‘అంటే-సముద్రాల రాఘవాచార్యుల వారి కుమారుడు సముద్రాల రామానుజా చార్య గురించే కదూ'
‘యస్. సముద్రాల జూనియర్ భలే రాసేవారు పాటలైనా, సినిమాకి మాటలైనా. ఈయన జోక్ చేసేవారు-మా తండ్రి పేరు పూర్తిగా రాయక ఇంటి పేరు పక్కన (సీ) అని రాస్తే ఫరవా లేదు సీ –అంటే SEA – అంటే సముద్రమే కాబట్టి ఓకే. కానీ నా పేరు బదులు ఇంటి పేరు రాసి (జూ) అనడం ఏం బావుంటుంది? నేనేదో అక్కడనుంచి వచ్చేననుకొనే ప్రమాదం ఉంది'
‘బావుంది. సముద్రాల జూనియర్ మన ఘంటసాల మాస్టారుకి మంచి మిత్రులని విన్నాను'
‘అవును. అసలు ఘంటసాల వారిని సినిమా రంగానికి తీసుకొచ్చింది సీనియర్ సముద్రాల వారే కదా. అంచేత జూనియర్ సముద్రాలతో చనువూ అదీ కాస్త ఎక్కువే. ఒక రకంగా చెప్పాలంటే ఘంటసాల వారి సంగీత లక్ష్యం ఒక బాణం అనుకుంటే ముందు గీసే పెద్ద లైన్ ఉందే అది సముద్రాల వారు. దాని ముందు ఉండే త్రికోణంలో మధ్యన ఘంటసాల ఉంటే ఆ మూడు కోణాల్లో ఒకరు సంగీత రావు గారు, ఒకరు జె.వి. రాఘవులు, ఒకరు సముద్రాల జూనియర్ అని చెప్పొచ్చు'
‘అందుకేనా ఘంటసాల మాస్టారు విసిరిన ప్రతి పాట బాణం ఓ పెద్ద హిట్. మరి మాస్టారు వారి, సముద్రాల జూనియర్ వారి కాంబినేషన్ లో నాకు తెలిసి ‘ రాగాలా సరాగాల , హాసాలా విలాసాల సాగే సంసారం ' భలే బావుంటుంది'
‘హాయ్ అని ఘంటసాల వారు హాయిగా అన్నంత బాగా చెప్పావ్.సముద్రాల జూనియర్ జయంతి ఏప్రిల్ 15 న, వర్ధంతి మే 3 న. ఈ పూట ఆయన రాసిన ఎన్నో పాటల్లో కొన్నైనా తలుచుకుందాం. ఆయనదో చిత్రమైన శైలి. ‘** రావే ప్రేమలతా** ' అన్న పాటలో ‘అందవతి ' అనే చిత్రమైన పద ప్రయోగం చేశారు. ‘తల్లి విసుగునా ' అని ‘** ధరణికి గిరి భారమా** ' పాటలో క్రియా పదంగా ‘విసుగు'ని వాడారు. చందమామని ‘జిలిబిలి రాజా ' (కలనైనా నీ వలపే) అని సంబోధించారు. ‘** పయనించే ఓ చిలుకా** ' పాటలో ‘పుల్లా పుడక ', ‘బిగి రెక్కలు ' వంటి ప్రయోగాలు కనిపిస్తాయి. తేలికైన మాటలతో లోతైన భావాలు చెప్పడం ఆయనకే చెల్లింది. ఈయన్ని ఎన్ టీ ఆర్ బాగా ప్రోత్సాహించారు. రామారావు స్వంత చిత్రం ‘తోడు దొంగలు' తీసినప్పుడు మన ఈ రామానుజులే మాటలూ అవి రాసేరు. నర్తన శాల చిత్రంలో ఒక సన్నివేశం- కీచక స్వగతం –అంతా ఈయనే రాసేరట, ఆ సమయంలో తండ్రి అస్వస్థత గా ఉండటం వల్ల అలా రాయాల్సి వచ్చింది. ఆ మాటలు రాసింది జూనియర్ అని తెలియగానే కీచకుడుగా వేసిన ఎస్.వి. రంగారావు ఆశ్చర్య పోయి ‘ఇంకా జూనియర్ ఏమిటీ –సీనియర్ లెవెల్ కి ఎదిగిపోతేనూ'అని ప్రశంసించారట'
‘కొంచెం నిష్టా అవీ ఎక్కువేమో సముద్రాల జూనియర్ కి ? భక్తి సినిమాలకి మడీ గట్రా పాటించే వారని విన్నాను'
‘ఉన్నా- ఒక చేతిలో కలం, ఒక చేతిలో సిగరెట్టు - తప్పేవి కావు'
‘గొప్ప కవుల లక్షణమే అంత అనుకుంటా. శ్రీశ్రీ గారి చేతి ఆయుధాలు ఇవే'
‘శ్రీశ్రీ గారి లా సముద్రాల జూనియర్ కి కూడాపద్యం అంటే ప్రాణం. ‘** రావే ప్రేమలతా** ' పాటకి ముందు సాకి లా ఒక పద్యం రాయడం విశేషం. అదే ఈ ఉత్పల మాల –
చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికా
**లాపన సేయు కూర్మి జవరాలొక వైపు, మరొక్క వైపునన్
ఈ పసి కమ్మ తెమ్మెరలు ఈ పువుదోటల శోభలున్నచో **
రేపటి ఆశ నిన్న వెత లేటికి నేటి సుఖాల తేలుమా
అలా సాగి పోతుంది ఆ సాకి. శ్రీనాథుని పద్యం సాకిగా పెట్టి శ్రీశ్రీ వారు ‘మురిపించే అందాలే' రాశారు కదా, ఏదీ , బొబ్బిలి యుద్ధం లోనే'
‘ఆహా. ** అందమే ఆనందం , ఆనందమే జీవిత మకరందం** - a thing of beauty is a joy for ever అన్న ధోరణిలో రాయడం లోనే ఓ అందం, ఓ ఆనందం ఉన్నాయి.'
‘అవును. ఈ పాట ఉందే- అందమే ఆనందం , దీనితోనే ఆయన పాట సత్తా జనానికి తెలిసింది. పాటలే కాదు మాటలూ అంతే. అందంగా ఉంటాయి. ఆనందం ఇస్తాయి. ఆయన అనేవారు-‘ పాత్రకి తగ్గట్టే కాకుండా, పాత్రధారికి తగ్గట్టు కూడా సినిమా రచయిత రాయాలి'. మరో కొన్ని అందమైన పాటలు ఉన్నాయి. ‘** అందాల సీమా సుధా మధురం** ','ఓ అందమైన బావా ' ‘** అందాలు చిందు దీపం** '
‘అందాల సీమా –పాట వింటుంటే ఈల వేయాలనిపిస్తుంది'
‘ఈల తో పాటూ తలత్ గొంతు లొ ఆ కమ్మని తెలుగుకి ‘వహ్వా' అనాలనిపిస్తుంది కూడా. అటువంటి మంచి పాట ఇచ్చి పుణ్యం మూట గట్టుకునీ ‘ఈ లోకమే దివ్య ప్రేమ మయం' అని సందేశమిచ్చి సముద్రాల లోకం విడిచి పెట్టి ఆకాశ గంగలో కలిసి పోయారు'
‘ఆయన కొంత కాలం పాటలు రాసి తర్వాత సినిమా సంభాషణలకే పరిమితమయి పోయినట్టున్నారు కదూ'
‘అవును. ఆయనే అన్నట్టు ‘ఎగిరిపో, పాడై పోయెను గూడు' అని అనిపించి ఉండాలి'
‘ఇప్పటి పాటలు వింటూ ‘అయ్యో పూర్తిగా పాడై పోయెనే గూడు' అని అనుకుంటూ ఉంటారేమో!'
‘సరే – విశాఖ గుర్తు చేసింది, రేపటినుంచి వైశాఖ మాసం అనీ. ‘అక్షయ తృతీయ' గురించి మాట్లాడాలి.
సీ యూ'
‘సీ యూ నా? జూ యూ నా'
‘జూచెదము'
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 03 మే 2011