Krishnaprema Logo

కృష్ణప్రేమ

మంచి మనసు తెలిపేదే స్నేహము – మనిషి విలువ నిలిపేదే స్నేహము

07 ఆగస్టు, 2011

మంచి మనసు తెలిపేదే స్నేహము – మనిషి విలువ నిలిపేదే స్నేహము

Picture

ఆ మాటలు నావి కావు. మీరు ఇప్పుడిప్పుడే విన్నారే (కనులు మూసినా పాటే లో) - మన మధుర గాయని ఎస్.జానకి కల్యాణి రాగంలో మనోహరంగా ఆలపించిన పాట పల్లవి,అనుపల్లవి అవి. ఆ పాట ఎవరు వ్రాసారో – తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి. మూడు చరణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుత నిర్వచనం పలికిన మహానుభావుడు. స్నేహ బంధం అనకుండా మరుమల్లెల వంతెన అన్నాడు. దానికి కలిమి-లేమి అంతరాలు ఆనబోవన్నాడు. మల్లె,జాబిల్లి,తేనె ఇవన్నీ స్నేహం తరవాతే అని బల్ల గ్రుద్ది మరీ చెప్పాడు.

‘స్నేహం' గురించి చెప్పమంటే ఎవరికైనా గుండె స్పందిస్తుంది. మొన్న మొన్న మన సిరివెన్నెల కవి ఏమన్నారూ? ‘స్నేహం' అనే మాటలో చెరో అక్షరం మనం! అనేగా? అంటే స్నేహం లో ఏకాకితనం లేదు. అదో జంట. అది ఆత్మీయత, ప్రేమ కలబోస్తే పెరిగిన పంట. ‘ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో' అన్నారు ఆత్రేయ. ‘స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం' అన్నారు సి.నా.రె , అంతకు ముందే గుల్షన్ బావ్రా రాసిన హిందీ పాట లోని మాటలు కొంచెం అటూ ఇటూగా చెబుతూ ( ఈ రెండు పాటల వీడియోలు ‘కనులు చూసినా పాటే' లో ఉన్నాయి). ‘స్నేహం' కి భాషాభేదం లేదు కనుక ‘దోస్త్ మేరా దోస్త్, వాస్తవంగా దోస్త్' అనే మాటలు సిరివెన్నెల కలబోసి ఇచ్చారు. ‘స్నేహం'కి మత భేదం లేదు కనుక సినారె -స్నేహితుడు నవ్వితే అదే రంజాన్ పండుగ అని షేర్ ఖాన్ చేత పలికించారు. స్నేహానికి రంగు-రూపు అనే భేదం లేదనిచిలక-కోయిల ల అనుబంధాన్ని కథలాగ చెప్పారు సినారె(కనులు మూసినా పాటే లో వినగలరు). ‘నీవుంటే వేరే కనులెందుకు' అని ఆరుద్ర ఒకనాడు అన్నది ఒక బధిరుడు తన ఆవేదనని తన మిత్రుడికి వెళ్ళబోసుకోవడానికే. ‘భానునివీడని ఛాయలా నీ భావములోనే చరింతునోయి సఖా' అనిశ్రీశ్రీ స్త్రీ-పురుష స్నేహ బంధాన్ని ధైర్యంగా ప్రవచించింది చూపు కోల్పోయిన వారిని ఉద్దేశించే. స్నేహానికి హెచ్చు-తగ్గులు లేవనడానికి ‘మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ' అని ఆటపట్టిస్తూనే ఒక మిత్రుడు తన మిత్రుడితో తన అనుబంధాన్ని చెప్పుకుంటాడు (కనులు చూసినా పాటే లో చూడవచ్చు).


తల్లి నిజానికి తొలి స్నేహితురాలు. అమ్మ కొంగు పట్టుకునీ తిరుగుతుంటే ‘ఆల్ వరల్డ్' చుట్టినంత ఆనందం.

నాన్నకి కోపం లేకపోతే అతన్ని మించిన స్నేహితుడు లేడు.

మామయ్య అన్ని మంచి పనుల్ని సమర్ధించే మధ్యవర్తి స్నేహితుడు.

స్నేహం అనేది కుటుంబం లోంచే ప్రారంభమౌతుంది.

అదే భావంతో బళ్ళో కెళితే అక్కడ గురువుని త్రిమూర్తులుగానే చూడమని ఆదేశాలుంటాయి. ఏ ఒక్కరో ఇద్దరో తప్పిస్తే స్నేహితులుగా ఉండే గురువులు లేనట్టే. అందుకే సాటి స్నేహుతులనుంచి పాఠాలు నేర్చుకుంటారు పిల్లలు.

ఏ ఇంట్లో స్నేహితులకి నిత్య ప్రవేశం ఉంటుందో ఆ ఇల్లు స్వర్గమని ఎవరూ ఎందుకు అనలేదో! స్నేహితుల రాకపోకలే సంఘం అనే రైల్వే వ్యవస్థ కి ఆయువు పట్టు.

గీతాచార్యుడే నయం ‘నీవే తల్లివి, తండ్రివి, గురువువి, సోదరుడువి, సఖుడివి' అని అందరి నోటా పలికించాడు. ‘సఖుడు'.'సఖి' కి సముచిత స్థానం ఉందనేగా దానర్థం?

‘స్నేహం', ‘చెలిమి','మైత్రి' అనేవి ఒకే గాలినే మూడు దిశల్లో మూడు components గా విడదీస్తే ఎలాగో అలాగా. అయితే ఇప్పటి friends వాడే మాట –స్నేహం, పాత సినిమాలు వాడిన మాట – చెలిమి. అప్పుడూ ఇప్పుడూ పేరుకే కాని ఎప్పటికీ సాధ్యంకాని మాట ‘మైత్రి' అనే దానిని రాజకీయ రంగం వారు ప్రయోగిస్తారు.

స్నేహం అనేది ఎవరెవరి మధ్య ఎందుకు, ఎప్పుడు కలుగుతుందో చెప్పలేం. బాల్య స్నేహం, యువక స్నేహం, వృద్ధాప్య స్నేహం అనేవి ఉంటాయి. ఇందులో బాల్య స్నేహం ఒక తీపి గురుతు. యువక స్నేహం కొన్ని చేదు అనుభవాల దొంతి. ముసలితనం స్నేహం ఒక సర్దుబాటు. ఏ వయసుకు తగినట్టుగా స్నేహం ఆ వయసుకి ఒక బాసటని అమర్చి పెడుతుంది.

స్నేహాన్ని వ్యాపార లక్ష్యంగా చూడొద్దు. స్నేహాన్ని భారంగా స్వీకరించొద్దు. స్నేహాన్ని స్నేహంగా పోషించాలి.

ఒకప్పుడు ఇద్దరు మిత్రులు, ఆప్త మిత్రులు, ప్రాణ మిత్రులు, మంచి మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, బాల మిత్రులు అనే వారు సినిమాల రూపంలో దర్శనమిచ్చారు. మరికొన్నాళ్ళకిస్నేహ బంధం, స్నేహం, స్నేహం కోసం అనేవి ప్రత్యక్ష మయ్యేయి. సినిమా మిత్రుల స్నేహం సెంటిమెంటు కొంచెం అతిగానే ఉంటుంది, అతిశయంగానూ ఉంటుంది. నిజ జీవితంలో నా దృష్టిలో ‘స్నేహం' అంటే మనలోని ‘అహం' సగం అణగ్గొట్టే ఒక మంచి మార్గం. అందుకేనేమో కవి ‘స్నేహం' అంటే ‘మనం' అని అనుకోమన్నాడు.

సంఘం నడవడిక చెప్పడానికి వేదకాలంలో ఋక్కులుంటే ఇప్పటి నెట్ యుగంలో బుక్కులున్నాయి. ఇరుగువాడు పొరుగువాడిని అక్కడే కలుస్తాడు. సందేశాలకి సెల్లులొచ్చాయి. స్నేహుతుల సంఖ్య ఈ- మెయిళ్ళు వల్ల కుప్పలా పేరుకుపోతోంది. అన్నిటిని నిర్ణయించేవి టవర్లూ, సాటిలైట్లే. అంతా బాగానే ఉంది- కానీ-

ఎవరో అన్నట్టు ‘పొరపాటున కూడా నీ మిత్రుడు నీకు శతృవు కాకూడదు '.

ఎవరు మిత్రుడు,ఎవరు శతృవు ? కలిస్తే మిత్రుడు, విడిపోతే శతృవు అనే దారుణ తీర్మానాలు పక్కన పెట్టి కనీసం ఈ ఆగస్ట్ తొలి ఆదివారమైనా ఒక బాస చేస్తే రాబోయే ‘పందరాగస్ట్' జెండా ఎంత హాయిగానో రెపరెపలాడుతుంది కదా! మూడు రంగులు వేరు వేరుగా ఉన్నా ఆ జెండా ఒక ముప్పేట గొలుసుగా స్నేహమయి భారతమాతకి అలంకారంగా లేదూ?

– డా. తాతిరాజు వేణుగోపాల్ , 07 ఆగస్ట్ 2011 (ఆదివారం)