ఎవరికీ ‘ఎనిమీ' కాదు ఎనిమిది రూపాల లక్ష్మీ దేవి!
12 ఆగస్టు, 2011

Click to Zoom
ఎ ప్పుడో 1930ల నాటి కాలంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం మళ్ళీ అమెరికాకి ఇప్పుడు సంభ వించిందని ఆ రంగం నిపుణుల ఆవేదన! ఎప్పుడూ విననంతగా బంగారం ధర పెరిగిందని అరకు లోయ నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు ఒకటే చర్చ!
డాలర్ లోని మధ్యాక్షరం లకారం అంటే లక్ష్మీ దేవి ఆగ్రహించి బయటకు వెళ్ళిపోతే ఇంక మిగిలేదేముంది- డర్ (భయం) తప్ప. పైసా,పరక, అణా, కానీ, దమ్మిడీ లకు ఎప్పుడో కాలం చెల్లిపోతే ఇప్పుడు పావలా కూడా హరీ మంది. రేపో మాపో ‘అర్ధ రూపాయి' కి కూడా అదే గతి పట్ట వచ్చు. ‘ఈ పిల్లంగోవి వెల ఎంత-అర్థ రూపాయి' వంటి కొన్నేళ్ళ క్రితం నాటి పాటలు కొన్నాళ్ళకు విచిత్రంగా వినిపిస్తాయి.
భూమి చిత్ర విచిత్రంగా ఏర్పడింది. భూలోక వాసులుగా పుట్టడం ఒక భాగ్యమైతే ఒక్కో చోట ఒక్కో భాగ్యాన్ని తమదిగా ఎంచుకునీ భూమిని తమ చేతులతోనే తిప్పుతున్నారు. అందుకే కాలం చాలా వేగంగా పోతోంది. చమురు నిల్వలు ఒక చోట, చెత్తా చెదారం నిల్వలు మరో చోట – శ్రీమంతులు ఒక చోట, గర్భ దారిద్ర్యం మరో చోట.
‘--------ధన మూలం ఇదం జగత్' అనే సూక్తికి ముందు కొన్ని అక్షారాలు లుప్తమై పోలేదు. అవి గుప్తంగా ఉన్నాయి. అవి ఏమిటో తెలియజేయడానికి ఎనిమిది రూపాలు ఎంచుకుంది శ్రీ మహాలక్ష్మి.
వాన చినుకులు ధాన్యం పండించి పొట్ట నింపే ఈ శ్రావణ మాసం విశిష్టమైంది. శ్రీ మహావిష్ణువు ‘శ్రవణ' నక్షత్రంలో జన్మించాడు. సృష్టి-బ్రహ్మ , స్థితి-విష్ణువు , లయ-శివుడు అని తెలుసు కదా. మన స్థితికి విష్ణువెలాగో , మన మన:స్థితికి చంద్రుడు అలాగ కారకులు. చంద్రుడు తన మార్గంలో పయనిస్తూ శ్రవణ నక్షత్ర సముదాయం లోకి పున్నమి నాటికి వస్తాడు. కనుక ఆ మాసం శ్రావణ మాసమైంది. ఆ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రీతి! ఆ నాడే**‘వరలక్ష్మీ' వ్రతం** ఆచరించాలి. ఆ పూజలో భక్తి శ్రద్ధలతో శ్రవణానందకరంగా ఉచ్చరించే మంత్రాలకు తల్లి ఆనందపడి మన మనసులోని ‘మంచి' కోరికలని స్వామి వారికి (విష్ణు మూర్తి కి) విన్నవించుకుంటుంది. ‘విన్నపాలు వినవలె వింత వింతలు' అని విష్ణువునీ, ‘జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీర లక్ష్మి' అనిశ్రీ లక్ష్మి ని అన్నమయ్య స్తుతించింది మన బాగు కోసమే.
శ్రీ మహావిష్ణు వే అనంత పద్మనాభుడు. తన శయ్య కింద నాగ బంధం (ఎనిమిది ఆకారం) వేసుకునీ బంగారంతో పాటు అనేకానేక ఇతర ధాతుసామగ్రిని ఏళ్ళ తరబడి దాచుకునీ ‘గుప్త నిధులే నర్రా గుర్తుంచుకోండి రేపటి ఆస్తి! –లుప్తమైపోతే గుండెపోటే తగిన శాస్తి' అని ప్రకటించేస్తున్నాడు. బంగారం విలువ ముందు ఏ సింగారం అయినా దిగదుడుపే. ‘సీతాలు సింగారం మా లచ్చి బంగారం' అని సరిపెట్టుకునే వాళ్ళు అదృష్ట వంతులు. ‘బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం' అని గమనించే వాళ్ళుంటే మరీ అదృష్టవంతులు. అలా ఉండమంటుంది మాలక్ష్మి. ‘రాయి'ని చూసి రత్నమనుకోకు, ‘ఐశ్వర్యం' అంటే వేరు అని ఎనిమిది రూపాలు చూపించింది మాలక్ష్మి. ఆది లక్ష్మి, గజ లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య (వీర) లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి, సంతాన లక్ష్మి అనే అష్ట లక్ష్మీ వైభవమే ఈ మానవ జీవితం. సరస్వతి ఉన్నచోటలక్ష్మీ దేవి ఉండదు అని నానుడి. మరి ‘విద్యా లక్ష్మి' మాటేమిటీ? అక్షారాలు లక్షలు కురిపించక పోవు.
పేరు లక్ష్మి అయినా దారిద్ర్యం కొందరికి. పేరుసరస్వతి అయినా విద్యా విహీనులు కొందరు. పేరు పార్వతి అయినా శక్తి సామర్ధ్యాల కొరవ మరి కొందరికి. అందుకే షేక్స్ పియర్ ‘వాట్ ఈజ్ ఇన్ నేమ్?' అని తేల్చి పారేశాడు. ఎందరు ఎలా ఉన్నా ఏటా ఏటా శ్రద్ధతో మనసారా మాలక్ష్మి ని స్మరించుకోవాలి. ‘సమయానికి తగిన సంపద చాలు' అన్నదేగా ప్రతి గృహిణీ కోరేదీ!
ప్రతి మంచి పనికి ‘శ్రీ' కారం చుట్టాలి.
ప్రతి ఒక్కరిని ‘శ్రీ' మకుటంతోనే గౌరవించి పిలవాలి.
దేవుడు లేడు పొండర్రా అన్న మహాకవి శ్రీశ్రీ తన పేరులోనే రెండు శ్రీలు ధరించ లేదూ?
ముందు కరుణ, తరువాతే సంపద అని మరోకవి ‘కరుణశ్రీ ' తన పేరును మార్చుకోలేదూ?
‘ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు, బలవంతుడు,భగవంతుడురా' అనిఆరుద్ర కవి శాంతంగా చివాట్లు పెట్టలేదూ?
‘కాసే బ్రహ్మానందం' అని ఎవరి పేరునో తీసుకునీ కోపంగా మహాకవి అన్నా అదో నిత్య సత్యం. ‘కాసుకు లోకం దాసోహం' అని సంబరాల రాంబాబు పాడబోతే ఆ పాట చూడ నోచుకోవడంలో తిరకాసైంది. ‘కాసు లేనిదే కాటికైనా కొరగాడు' అనే సామెత ఉందా? ఉన్నట్టే అనుమానం. వేమన తూర్పారబెట్టలేదూ? ‘పిసిని వాని ఇంట –వెడలిన కట్టె కోలకులకు కాసులిచ్చి వెక్క మాయె ననుచు వెక్కివెక్కేడ్చురా' అని. డబ్బు లేక ఒకరేడిస్తే ఉన్న డబ్బు పోతోందే అని మరొకరి ఏడ్పు.
ఎక్కడెక్కడో దోచుకొచ్చిన ధనం ఇంకెక్కడో దాచుకోవడం నవ్య భవ్య దివ్య సమాజం అమలు చేస్తున్న విధానం. అదే వారి భావి బండి కదలికకి ఇంధనం.
నిజమే- కావాల్సినన్ని కాసులు లేకపోతె కాలం వెళ్ళబుచ్చలేం. కాసో, కనకమో ఏదైనా సరే కాసింత ఉండక పొతే కాశ్మీరు దాక ఎందుకు కావలి వరకైనా వెళ్ళలేం.
ఒక్క కాసు, దాని తిరకాసు వ్యవహారంతో మాలక్ష్మి ని దూరం చేసుకోవద్దు. ఆమె అష్ట రూపాలు భూమాత మీద వాలి పోవాలి. ఆమె ఎవరికీ శతృవు కాదు. అందరి బంధువు. అందరి మిత్రురాలు.
వరలక్ష్మీ దేవి ని కోరితే ఈ విన్నపం కూడా చేర్చండి-
‘అమ్మా! నీ అష్ట రూపాల ఇష్ట సఖి మా భారతమాత
ఆమెను కలకాలం వర్ధిల్లేలా చూడు, అందుకో మా జోత!'
( కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే- ఈ త్రివేణి సంగమంలో స్నాన మాడి మాలక్ష్మి దీవెనలు పొందండి)
-డా. తాతిరాజు వేణుగోపాల్ 12 ఆగష్ట్ 2011
