రాబోయే నవమి వరకు..."అంతా రామమయం"
09 ఏప్రిల్, 2011


'ఆ మనీ పాడవే హాయిగా--- మూగవై పోకు ఈ వేళ'
ఆ పాట పల్లవి ఇప్పటికి సార్ధకమైంది.
ఉత్తరాన-
ఆమనిలోనే ఆ 'మనీ' వికృత చేష్టలకు కళ్ళెం వేయాలని గొంతెత్తినఅన్నాహజారే తో జనం గొంతు కలిపింది. ఇన్నాళ్ళూ మూగవై పోయిన నోళ్ళు ఒక చోట మూగగానే ఎంతో మంత్ర శక్తి ఆవహించింది. హజారే అంటే అవినీతి పక్కలో కైజారే!
అంత నిరాడంబరుడూ, లక్ష్య సాధకుడూ దేశంలో అరుదు కనుక అతన్ని బిరుదులు వరించాయి. అయినా వాటికి మురిసిపోక తన గమ్యం రమ్యం గానే సూచించ గల ధృఢ మార్గ దర్శి ఆయన. ఈ 'లోక్ పాల్ ' విజేతకు జేజేలు. అన్నా 'పౌర శక్తి ' కి నిదర్శనమే 'సిటిజన ' మద్దతు.
దక్షిణాన-
తమకోసం ఆవిర్భవించిన మహా మనీషి, తొంభై ఆరేళ్ళ వరకూ మీకు అండగా ఉంటానన్న దైవ శక్తి సత్య సాయి బాబా
అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే అక్కడ భక్త జనం గొంతు కలిపి భజన చేసింది. లోక కళ్యాణం ఆశించే సాయి వారికి సర్వదా నమస్సులు. బాబా లోని 'సౌర శక్తి 'యే భక్త చంద్రుల వెన్నెల!
జనం జనం-
లక్ష్యాలు, లక్ష్య సాధనలూ, ధర్మాలూ, ధర్మ రక్షణలూ, ఎన్నో ఎన్నెన్నో ఉన్న జనం. కూల్చే జనం, కాల్చే జనం, పడగొట్టే జనం, నిలబెట్టే జనం, ఏకమయ్యే జనం, విడిపోయే జనం, నిదానంగా జనం, పరుగులు తీస్తూ జనం, నీడలో జనం, నెత్తిన కుంపటి లాంటి ఎండలో జనం -----
దేశ జనాభా లెక్కలు తెలిసాయి కదా. మనం నూటా ఇరవై కోట్ల జనం. ఎంతైతేనేం? 'నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు', ఒక మంచి పనికోసం. వారి అవసరమే కోరుకుంటుంది దేశం. అలాంటి వారికి ప్రేరణ - ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక పరమ శివుడు.
అన్నీ ఉండి ఏమీ లేని వ్యక్తిగా పద్నాలుగేళ్ళు వనవాసం చేసిన 'పితృ వాక్య పరిపాలకుడిగా', జన హితుడిగా శ్రీ రామ చంద్రుడు మాన్యుడయ్యాడు.
ఏమీ లేనట్టుగా, 'మాత్రు వాత్సల్యుడిగా, అన్నీ తెలిసిన వాడిగా ఎదిగీ పద్ధెనిమిది అధ్యాయాల 'భగవద్గీత 'ను తరతరాల అమృతంగా పంచి పెట్టిశ్రీ కృష్ణుడు అసామాన్యుడయ్యాడు.
తను 'దయ' చేస్తేనే తప్ప 'లయ' అనేది లేని మనిషి కట్టెతో సమానం అని గరళం మింగిన భోళా శంకరుడు తన వేడి మూడో కన్ను తెరవక ముందే మన చల్లని కళ్ళు తెరిపించిన హిమ భాస్కరుడు.
వీరందరిలోని ఏదో 'దివ్య సందేశం ' మనందరికీ అందజేయ్యాలని తపన పడిన వారు కొందరు రాగం కట్టి భక్తిగానం చేస్తే మరి కొందరు గళం విప్పి భక్తి బోధలు చేశారు. అయితే కలియుగంలో కొన్ని శతాబ్దాల వరకే ఈ అదృష్టం దక్కింది.
అందులో ఎక్కువగా వినిపించినది 'శ్రీ రామ నామం '.
రామాయణ కాలం లో రామ భక్తులెవరంటే - శత్రు రాజ్యంలోని మిత్రుడు విభీషణుడు , తన గుండెల్లో రాముని దాచుకునీ గుండె చీల్చి చూపగలిగిన హనుమంతుడు , అన్న వెంటే తానూ అని తలచిన లక్ష్మణుడు , అన్న లేని రాజ్యంలో అన్న పాదుకలే శరణ్యం అని కొలిచినభరతుడు , మహా రాజును నావలో ఎక్కించుకున్న గుహుడు , ఎంగిలి తిండి కన్న తండ్రి నోటిరుచికి మొదటి ఎరుకగా ఎంచుకున్న అమాయక శబరి , ఇంతమంది భక్తుల ప్రసన్నుడు తన పతి అని అబ్బురపడే సీత - ఈ ఏడుగురేనా? అంటే నేనూ ఉన్నాను అంటూ సాయపడిన ఉడత నూ చెప్పుకోవాలి.
ఇలాంటి నిజమైన 'అష్ట దిక్కులు' ఉన్నప్పుడే 'రామ రాజ్యం' నిలిచేది.
కృష్ణ భక్తురాలైన మీరాబాయి 'పాయోజి మై**(నే రామ్ రతన్ ధన పాయో ', ' రామ్ నామ్ రస్ పీజై మనువా(**రామ్ నామ్ రస్ పీజై ' అని రెండు కీర్తనలు పాడి రామ నామం వల్ల దక్కే 'సత్సంగ్', రామనామం వల్ల మనసు పొందే నిర్వికార రూపం విలువైనవని చాటింది.
మొల్ల రామాయణం రచించి గుహుడి భక్తిలోని చొరవని ఇలా చమత్కరించింది-
**నుడి గొని రాము పాదములు సోకిన ధూళి/ వహించి రాయి, యే/ర్పడ నొక కాంత యయ్యెనట, పన్నుగ నీతని/పాదరేణువి/య్యెడ వడి, నోడ సోక, నిది ఏమగునో యని/ సంశాయాత్ముడై/ కడిగె గుహుండు, రామ పద కంజయుగంబు/భయమ్ము పెంపునన్
**
ఇదే ప్రేరణగా కొంచెం వెనక కాలం నాటి ఆధునిక కాలంలో సినీ కవి కొసరాజు 'రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ ' అని గుహుడి మనసులోని చిలిపి మాటకి పాట కట్టేరు. అంతే కాదు- దాట గలిగే శక్తి ఉన్నా రాముడు తనను దయ చూపేందుకే నావ ఎక్కుతున్నాడని ఎంతో వినమ్రంగా గుహుడు మురిసిపోతున్నట్టు చమత్కరించేరు. అయితే అంతకు ముందే ఒకసారి 'ఎంత గొప్ప వాడివయ్య రామయ తండ్రి' అనీ ఈయన మాటలే తన భక్తి గానంగా గుహుడు పాడినప్పుడు ఈ భావాలు లేవు. (వీడియో పాట చూడండి , ఆడియో పాట వినండి)
దేవులపల్లి వారు 'ఈ గంగ కెంత దిగులు ' అని గుహుడి 'ప్రకృతి' జీవనాన్ని మొదట దర్శించి 'ఒడిదుడుకుల సంసారపు /కడలులకే తారకుడవు/నీకు గుహుడు కావాలా/ఈ కొద్ది పాటి యేరు దాట' అని చమత్కరిస్తూ చివరికి కళ్ళు చెమర్చేలా ఒక మాట అన్నారు-'పదునాలుగేండ్ల పైన క్షణం బ్రతకను సుమ్మీ' అని.(ఆడియో పాట వినండి)
శబరి పాడి ఉంటే అచ్చం దేవులపల్లి వారి పాటలే పాడి ఉండాలి- అన్నట్టు దేవులపల్లి వారు శబరి ఆత్మ తానై మూడు పాటలు రాశారు. నిన్నుజూచునందాక, ఊరికే కొలను నీరు, ప్రతి కొండ నాతొ కలసి రామా యని పిలిచేను - అన్న ఆ మూడు పాటలు చాలు శ, బ, రి అనే మూడు అక్షరాల అమాయక భక్తికి ప్రతీకలు.
ఇటీవల కాలంలో శబరి నెరిగిన కవికి రాముడి పంచె, సీతమ్మ నార చీరలు కనిపించడం వింటుంటే ఎంత అవగాహన లోపం అని బాధ పడాల్సిందే.
దేవులపల్లి వారు 'గుహుడు ' అనే చిన్న నాటిక రాశారు. 'తిరుగు లేని మాట ' లో చదవండి. మనలోని గుహుడిని బయటకు తెచ్చి మన మనసును సరిదిద్దడమే ఆయన చేసిన పని.
మంగళ వారం రాబోతున్న శ్రీ రామ నవమి నాడు మరిన్ని శ్రీ రామ నామ 'పానకపు ' మాధుర్యాలు పంచుకుందాం.
రామాయణంలో సముద్రాల ప్రసక్తి ఉంది. అందులో విశేషం లేక పోవచ్చు.
'సముద్రాల' కవి చిట్ట చివరి రచన 'రామాయణం' కావడం, అది 'ప్రశస్తి' పొందడం మాత్రం విశేషమే కదా. దానిని రాగ మాలికలో స్వర పరిచిన సంగీత మేధావి పేరు కూడా 'కోదండపాణి' కదా. ఇంకా చెప్పాలంటే- అది 'బాలు'రామాయణం.
ఆ పానకం సేవించేముందు 'కాస్త బెల్లం, మిరియాలు' ఉండాలి కదా. ఈ పూట అవి సిద్ధం. అవునా? కాదా?
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 09 ఏప్రిల్ 2011