Krishnaprema Logo

కృష్ణప్రేమ

మనసే అందాల బృందావనం---అదుకాహా ఆనందం వేణుం(వేండుం)

22 ఏప్రిల్, 2011

మనసే అందాల బృందావనం---అదుకాహా ఆనందం వేణుం(వేండుం)

Picture

ఆ( వేణూ --- ఏమిటీ – కవి గారు ఆరుద్ర , నటీమణి షావుకారు జానకి కాంబినేషన్ అంటూ ఏదో అన్నావ్'

‘వారితో పాటూ మరో జానకి –అదే మన సంగీత సరస్వతి ఎస్. జానకి –గురించి కూడా, ఎందుకంటే మా జానకమ్మ పుట్టిన రోజు ఈ శనివారం , ఏప్రిల్ 23న. ఈ 22వ తేదీ ఉందే దీన్ని ప్రతి ఏటా ‘పృథ్వీ దినం ' గా పాటిస్తారు. ప్రతి ఏడూ ఓ సందేశం ఉంటుంది. ఈ ఏడాదికి ‘గ్రీన్ ఎర్త్ ' (హరిత పృథ్వీ) అనుకోమన్నారు.'

‘ఓహో—అలాగా—అయితే ముందు జగమే పచ్చని ప్రకృతితో ఊయలూగాలని ఆశిద్దాం. ఊహలకే కన్నులుంటే జగమే ఊయలని చెప్పిన జానకమ్మకి మనందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు కృష్ణ ప్రేమ ద్వారా '

జానకి పియానో మెట్లు మీటకుండానే పాట పాడితే పగలే వెన్నెల. జానకి ఉయ్యాల ఊపకుండానే పాట పాడితే వెన్నెల తెస్తాడు ప్రతి పాపడు. జానకి నాట్యం చేయకుండానే ‘ఓమ్ నమశ్శివాయ' అని పాట పాడితే శివుడి సిగలో ఉన్న నెలవంక పున్నమి చంద్రుడవుతాడు. అమ్మా జానకమ్మా --- సిరిమల్లె పువ్వల్లె నవ్వే పసిపాపలా, రామచిలకా పెళ్లికొడుకెవరే అనే సిగ్గూ పూబంతి పదహారేళ్ళ పడుచులా, మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం అనే ముదుసలిలా ఒకే గొంతులో ఎన్నో మరెన్నో అభినయాలతో మీ పాట ‘మా జానకి పాట పట్టగ' అనే కీర్తనగా మారి పోవాలని పది కాలాలు మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం '

‘మొత్తానికి – నాకు తెలిసి 1964 లోని ** పూజా ఫలం** పాట, 1968 లోని అత్తగారు-కొత్త కోడలు పాట, 1983 లోని సాగర సంగమం పాట ‘కనులు మూసినా పాటే ' లో వినిపిస్తున్నావ్. అవునా?'


‘అవునవును. చెప్పొచ్చేదేమిటంటే ఆ ఇరవై ఏళ్లలో ఆ గొంతులో అదే మాధుర్యం కదూ. ఇంకోటి గమనించావా? ఈ మూడు పాటలూ ఒకే రాగానికి సంబంధించినవే'

‘అది హిందోళం కదూ'

‘బ్రహ్మాండం. తమిళ నాట ఉంటే తకధిమి నాట్యమే కాదు సాపాసాలూ వంటబట్టేస్తాయి'

‘సాంబారు వంట కూడా'

‘పూర్వం చెన్న పట్నంలో సినిమాలు ఉభయ భాషా కుశలోపరి అన్నట్టు ఉండేవి- అదెలా అంటే తమిళం వాడు ఇడ్లీ డెడ్లీ గా చేస్తే తెలుగు వాడు అబ్బో కొబ్బరి చట్నీ వడ్డించినట్టుగా'

‘ఇదిగో అనవసరంగా తిండి ఊసెత్తకు. మన కబుర్లే మనకు బూర్లు. హిందోళం అనగానే జానకి, బాలు పాడిన సామజ వరగామనా పాట అనే కన్నా ‘శారదా' అంటూ సోమయాజులు అరవడం, శుద్ధ హిందోళంలో ఆ రిషభం ఎలా వచ్చింది అని కేకలేయడం బాగా గుర్తొస్తుంది'

‘హిందోళం ఒక రకంగా డోల. అంటే ఉయ్యాల. అందుకే రాజేశ్వరుడు ‘జగమే ఊయల' అన్న ముక్క పట్టుకునీ పాటకి రాగం కట్టేరో, లేక హిందోళం అని ఆయన అంటే ఆ తనననాలకి తగ్గట్టుగా సినారె పాట రాశేరో కానీ మొత్తానికి ఆధా హై చంద్ర్ మా వరసలో ఉంటుందా ‘పగలే వెన్నెల ' పాట. ఇక ఇళయరాజా గురువు గారైన జి.కె.వెంకటేష్ ఉయ్యాల ఊపుతూ పాడించిన అనుభూతి కలిగించారు ‘వెన్నెల తెచ్చాడు మా పాపడు ' అన్న హిందోళం పాటలో. శిష్యుడు రాజా ఏకంగా ‘రిషభం' అంటే నంది కదా అది లేకుండా చూసుకునీ వేటూరి వారి చేత ‘ఓం నమశ్శివాయ ' ని హిందోళంలో రాయించాడు'

‘మలయాళం సినిమాలోలా ఈ చివర్నుంచీ ఆ చివరివరకూ నడిచి మళ్ళీ అంతే దూరం వెనక్కి తిరిగి రావడం ఇప్పుడు మనం చేస్తున్న పని –అవునా?'

‘ఇప్పుడు మనం ఆరుద్ర, షావుకారు జానకిల పాటలోకి వద్దాం. మనం టైం మెషిన్ పట్టుకునీ 1966-1967 లోకి వెళ్లి పోవాలి'

‘అంటే –మన హేపీ డేస్ అన్నమాట'

‘ఆరుద్ర అన్నది కలం పేరు అని చెప్పాగా. నిజానికి ఆరుద్ర నక్షత్రం అని పొరపాట్న అంటారు. అది ఆర్ద్ర నక్షత్రం. గమ్మతేమిటంటే ఇది ఇరవై ఏడు నక్షత్రాలలో ఆరవది. అందుకేనేమో ఆయన ‘ఆరు'ద్ర అనుకున్నారు. బాపు ఒక చోట జోకేరు. ఎలా అంటే – 6ద్ర 7పు అనీ'

‘నేను ఇంకో జోకు విన్నాను. ఆరుద్రతో ఒకాయన కార్లో వెళుతూ ఊరుకోక ‘మీకేమైనా ఇక్కడ స్వంత భూములున్నాయా' అని అడిగాట్ట. ఆరుద్రకి సమయానికి స్మశానాలు కనిపించాయి. వెంటనే' ఆ రుద్ర భూములన్నీ నావేగా' అని అన్నారట'

‘కారంటే గుర్తుకొచ్చింది. ఏ ఎన్ ఆర్ ‘ మంచి కుటుంబం ' లోని కారు గుర్తుందా?'

‘లేకేం. కారుతో పాటు కుర్ర కారు పాడే ‘ప్రేమించుట పిల్లల వంతు' పాట కూడా గుర్తుంది'

‘అసలైన పాట – మనసే అందాల బృందావనం – మరిచి పొతే ఎలా?'

‘అవునూ—టైటిల్ లో ఆ చౌ చౌ ఏమిటీ? సగం తెలుగూ, సగం తమిళం. ఓహో- ఆనందం కావాలి అనడంలో ఆనంద్ అని నా పేరు, వేణుం అంటూ నీ వేణు పేరు ఇరికించావే'

‘ఎందుకూ అంటే- మంచి కుటుంబం సినిమాకి మాతృక తమిళం లో వచ్చిన ‘ మోటార్ సుందరం పిళ్ళై ' కాబట్టి , మనసే అందాల బృందావనం పాట ‘ మనమే మురుగనిన్ మయిల్ వాగనం ' పాటకి ఒక రకంగా చూస్తే ఇంప్రూ వైజేషన్ కాబట్టి'

‘ప్రేమించుట పిల్లల వంతు పాటలో ఈ ‘కాబట్టి' మధ్య మధ్యలో వచ్చి భలే ఎఫెక్ట్ ఇస్తుంది'

‘అదే మరి- నాగేశుడూ, కాంచన ప్రేమించుకున్నా పాపం నాగేశుడుకి షావుకారు జానకితో పెళ్ళవుతుంది. ఈ అక్క చెల్లెళ్ళ పాటే ఆ మనసే అందాల బృందావనం. అది ఫ్లాష్ బ్యాక్. పాట ముందుకనులు చూసినా పాటే చూడు. ఇద్దరూ పోటీ పడి నటించారు కదూ. వాళ్ళ ప్రతిభ చూస్తూ గుమ్మడి తండ్రి ఎంత మురిసిపోతున్నాడో. చూడడం అయిందా—ఇప్పుడు విను. ‘వేణు మాధవుడు' అనే కొత్త పేరు ప్రయోగం చేశారు ఆరుద్ర. ఎందుకనుకున్నావ్? ఆ రోజుల్లో వేణు మాధవ్ మిమిక్రీ చాలా ఫేమస్ కాబట్టి. చిత్రం- ‘re'చిత్రం లో వేణు మాధవ్ హాస్యం క్లిప్పింగుంది చూశావా? ఈయన లాగే మరో ఘనుడు ఫన్ చంద్రశేఖర్. నెహ్రూ, జాకిర్ హుస్సేన్ ఇలా ప్రముఖ వ్యక్తుల ఆహార్యం వెంట వెంటనే మార్చుకుంటూ సభల్లో ప్రదర్శించే వారు. శిష్ట్లా జానకి వీరి కోడలే. ఆయనే సినీ గాయనిగా ఆమెకు అవకాశం వచ్చేలా చూశారు. అలా తెలుగులో జానకి పాడిన తొలి పాట ‘నీ ఆశ అడియాశ' ఉంది కదా- అది కూడా ఆరుద్ర రాసినదే'

‘నీ లీల పాడెద దేవా'పాట కూడా ఆరుద్ర రాసినదే. ఈ పాట నిజానికి గాయని లీల పాడవలసి వస్తే సన్నాయికి తగిన స్వరాలు పలికించే శక్తి జానకికి ఉందని చెప్పి ఆ పాట జానకికి దక్కేలా చేశారావిడ'

‘సన్నాయి లోంచి వీణ వైపు వద్దాం. మనసే అందాల-- పాటకి వీణ చిట్టిబాబు గారిదే. దానికి తగ్గట్టు సుశీల గొంతు వహ్వా. లలితమైన శృంగార గీతం ఇది. ఎంత మాత్రం సందేహం లేదు. ఇప్పుడు తమిళం పాట విను. రాదా జయలక్ష్మి జంట గాత్రాల్లో రాధ పాడగా వింటున్నాం. పాట మొత్తం విన్నావు కదా. ఇప్పుడు చెప్పు – అందులో భక్తి ఉంది. అవునా. పైగా ‘మురుగన్ ' (సుబ్రహ్మణ్యుడి) నెమలి వాహనమే మనసట. లేత మావి చిగురు వంటి తనువే ‘గుహన్ ' (మురుగన్) కోవెలట. గళంతిరుచెందూర్ గుడి గంట అట. ఇక పైన ఎప్పుడూ అది ‘గుహ షణ్ముఖ ' అనే మ్రోగుతుంది- అని ముగించాడు కవి. ఇంత చక్కగా అనువాదం అడిగిన వెంటనే చేసి ఇచ్చిన మా బెంగళూరు సురేష్ కి కృష్ణప్రేమ ద్వారా మరో సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

‘షణ్ముఖ' అనే సంస్కృత శబ్దం తమిళంలో ‘ఆర్ము****గ ' అయింది కదా. ఈ ఆరు ముఖాల దేవుడి పాట మన ‘ఆరు'ద్ర చేతిలో పడగానే సినిమా కథకి బలం చేకూర్చడానికా అన్నట్టు కృష్ణ లీలా తరంగిణి గా మారి పోయింది. మాధవుడు అంటూ రుక్మిణి గురించి చెప్పకనే చెప్పి కృష్ణుడు పెళ్లి చేసుకున్న సత్యభామని, పెళ్లి చేసుకోని రాధని ప్రస్తావించారు గడసరిగా. ‘కాంచుట' ‘కడగంటి చూపు' వంటి సమాన స్థాయి పదాలు ప్రయోగించి సొగసులద్దేరు దళసరిగా. ‘కాంచుట' అన్నప్పుడు నటీమణి కాంచన గుర్తుకొచ్చి ఉండాలి కంపల్సరిగా. ‘మధురామృతం' అని ప్రారంభించి ‘సుధలందు' తనియించునే అని ముగించారు లాహిరిగా. మొత్తానికి కోదండపాణి పైనా కిందా పడేసి పాట విసిరారు లహరిగా'

‘తమిళంలో కన్నా తెలుగు లోనే బావుందా అనిపిస్తుంది ఈ పాట'

‘అది సహజమే. జన్మతహా వచ్చిన అందానికి మెరుగులు దిద్దిన బ్యూటీ పార్లర్ శ్రమకే విలువ ఎక్కువ. ఒకే రాయి ఇద్దరు శిల్పులకిస్తే ఇద్దరూ ఒకేలా చెక్కినట్టనిపించినా వారి వారి ‘మనో'శిల్పం బట్టి ఆకృతి వస్తుంది. అసలు కన్న వడ్డీ ముద్దు అన్నారు'

‘అసలు ఎం ఎస్ విశ్వనాథన్ అంటేనే తమిళంలో మేధావి అని అర్థం. మళ్ళీ ఆయనంత గొప్పగా సంగీతం వడ్డించిన వాడు ఇసై రాజా ఇళయ రాజా'

‘రాజా ని గుర్తు చేశావు. జానకి పాడిన ‘ఓం నమశ్శివాయ ' లో వేటూరి ఏమన్నారు?- పంచ భూతములే ముఖ పంచకమై అన్నారా? శివుడికి అయిదు ముఖాలు కాబట్టే ‘పంచానన ' అంటారు. శివుడి మూడో కంటినుంచి వచ్చిన అయిదు కిరణాలు ‘గంగ'లో కలిస్తే అవి ‘శరవణం' సరస్సు చేరి అయిదు కలువలుగా వికసించాయి. అప్పుడు పార్వతి ముచ్చట పడి వాటిని ఒడిని చేర్చుకోగానే ఆమె స్పర్సవల్ల ఆరు ముఖాల శిశువయ్యాడు. అందుకే ‘షణ్ముఖుడు ''శరవణన్ ' ‘శరవణ భవన్ ' (ఇక్కడ భవన్ అంటే భవనం కాదు, జనియించడం) అని పేరు పొందాడు. అగ్ని నుంచి జనియించిన వాడు ఇతడు. కృత్తికా నక్షత్రం అగ్ని తత్త్వం కలది. ఆ నక్షత్రాధిపతి కావడం చేత ‘కార్తికేయుడు ' లేదా ‘కార్తికేయన్ ' అని మరో పేరుంది ఇతనికి. గుహన్ , గుహేశన్ అని కూడా అంటారు. చాలా శక్తిమంతుడు ఇతడు. ఎందుకంటే- అతి వడి గలది గంగ, ఆమె ప్రకృతి. అమిత శక్తి కలది పార్వతి. ‘ప్రకృతీ, పార్వతి నీతో కలిసి' అని వేటూరి శివుడిని దర్శించినట్టు ఆ శివ కుమారుడు శక్తిమంతుడుగా ఉద్భవించాడు. తిరుచెందూర్ మురుగన్ కోవెల సముద్రపొడ్డున కన్యాకుమారి నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక రాక్షసాహంకారాన్నిఅణిచే నేఫద్యంలో శివుడే షణ్ముఖుడిని సృష్టించేడని అంటారు. ఆరు రోజుల హోరాహోరీ యుద్ధంలో ఆరవ నాడు ఈ ప్రదేశంలోనే ఆ రాక్షస సంహారం జరిగిందని చెబుతారు. తన తండ్రి అయిన శివుడికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన విగ్రహానికి పూజలు చేసే వాడట షణ్ముఖుడు. అటువంటి విగ్రహం ఈ కోవెల్లో చూడ వచ్చు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యత మయుడు చేపట్టాడంటారు. నాలుగు ముక్కల్లో చెప్పేసిన ఆ తమిళం పాట వెనక ఇంత కథ ఉంది చూశావా?'

‘సుందరం పిళ్ళైది మంచి కుటుంబం కావొచ్చు గాక. మా సుశీలమ్మ మనసే అందాల బృందావనం అని చెప్పొచ్చు. ఎందుకంటే కృష్ణ భక్తురాలు మా జానకికి ఆమె తన ట్రస్ట్ తరఫునుంచి మొదటి పురస్కారాన్ని అందించారు. ‘గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటి లోన చిలకుంది, ఒక గూటి లోన కోయిలుంది' ఎవరదీ- ఒకరు సుశీల, ఒకరు జానకి'

‘జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఆనాడు – అని సుశీల పాడిన దాంట్లో అతిశయోక్తి లేనే లేదు. గాయని జానకి భర్త శ్రీరామ్ ప్రసాద్ కొంచెమైనా ఆమె మనసు గాయ పరచని మా మంచి మనిషి. ఆయన ఇప్పుడు లేరు. దివంగతులు. పురుషుడి అహంకారం స్త్రీని అణచివేస్తుంది. పురుషుడి సహకారం స్త్రీ అభివృద్ధికి తోడ్పడుతుంది. 'ప్రత్యేకంకా ఓ మహిళా దినం అనడమేమిటి? ఎప్పుడూ మహిళని గౌరవించాలి' అన్నదే ఆమె కోరిక. అభిమానుల అభిమాన ధనమే మోస్తూ చిరు నవ్వేస్తూ ‘నువ్వేమిటో ఎందుకొచ్చావో తెలుసుకునీ నిష్క్రమించడమే నీ పని' అని తత్వం పలికే ఈ నిరాడంబర స్నేహమయికి ‘కోటి దండాలు శత కోటి దండాలు'.

-డా. తాతిరాజు వేణుగోపాల్,22ఏప్రిల్****2011