ఒక్క 'తాపీ' మరల దక్కెనేని 'కీలు గుఱ్ఱం' మరో కాపీ తీయుదునను 'అక్కినేని'
20 సెప్టెంబర్, 2011

Click to Zoom
కొం ప దీసి ఆ హెడ్డింగ్ నిజమనుకునేరు!
అది ఎవరైనా కోరుకునేదే!
ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవైన పసి బాలుడు కానున్న మన అక్కినేని.
ఇప్పుడు లెక్క వేసి అక్కినేని కి ఇన్నేళ్ళా అని చెప్పడమెందుకు?
నిత్య యవ్వనుడు.
ముందు అక్కినేని వారికి మనసారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
ఫోటోలో పొడవాటి ఆయన, పొడవాటి గడ్డమున్న ఆయన- ఆయన ఎవరో కాదు. ఎంత తాపీగా ఆలోచించినా చప్పున గుర్తుకొచ్చే పేరు- తాపీ ధర్మా రావు. నిన్నఆయన్ని మనసారా సంస్మరించుకున్నాం మన ధర్మంగా, ఆయన జయంతి కనుక.
బరంపురం లో పుట్టి మదరాసు నేలిన కలం తాపీ వారిది. ధర్మారావు నాయుడు గానూ, తాతాజీ గానూ చిరపరిచితులు. యూనివర్సిటీ ఇచ్చిన బిరుదు-'ఆంధ్ర విశారద '. ఆ కలం 'పాత పాళీ' మార్చి 'కొత్త పాళీ' అమర్చి 'ఇనప కచ్చడాలు' 'పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు', 'దేవాలయం మీద బొమ్మలెందుకు?' వంటి వెన్నో ఎడాపెడా రాసేస్తే ముక్కున వేలేసుకుంది ఆంధ్ర జనాభా. ఆయన ఎంత తాత్వికుడో అంత సాత్వికుడు. ఎంత మాటపొదుపరో అంత హాస్య చతురుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవాళ ఎనభై వసంతాలు చూసిన తెలుగు టాకీ ఆయన రచనలతోనే చిగురులు తొడుగుకొంది.
ఆయన తొలి నాలుగు పదుల జీవితంలో కొంచెమేమిటి ఎంతో 'గ్రాంధిక భాషాభిమాని '. ఆ తరువాత గిడుగు రామమూర్తి వారి 'వ్యావహారిక ' భాషోద్యమాన్ని అర్థం చేసుకునీ ఆదరించిన 'జ్ఞాని'.
లేకపోతె సినిమా పాట ఎలా మనగలిగి ఉండేదో? సినిమా పాట అనే గ్రంధానికి తొలి పేజీ -తాతాజీ.
అహ, అహ వంటి మాటలతో పాట ప్రారంభించి వాటికి ప్రాసగా 'ఊహ' అందివ్వ గల గడసరి తాతాజీ. ఒక రకంగాపింగళి వారికి ఊపిరితాపీ. పింగళి వారు రాసిన 'అన్నీ మంచి శకునములే, కన్యా లాభ సూచనలే, మనసున పొంగిన వాద్యములే మ్రోగేనులే' పాట పల్లవి ట్యూన్ చేస్తూ పెండ్యాల వారు 'వాద్యములే' దగ్గర కుదరక ఇబ్బంది పడ్డారట. అప్పుడు పింగళి వారు 'వాద్యమాహా' అని వేసుకో మన్నారట. 'ఆహా' అనుకున్నారు పెండ్యాల వారు. ఇదే పింగళి -పెండ్యాల వారల కాంబినేషన్ లోనే 'మోహన రాగ మహా' అని ఒకటుంది. ఇలా సమయానుకూల చికిత్స చేయడం తాపీ వారికి ఎప్పుడో తెలుసు. 'కన్యకు గూర్చితివి కళ్యాణమహా' అని రాసారు ఒక పాటలో.
తాపీ వారు మంచి డైలాగ్ రైటర్.మాలపల్లి, రైతుబిడ్డ, ద్రోహి - ఇలా ఎన్నో సినిమాలు ఆయన కలం బలంతో ఆరోగ్యవంతంగా ఆడాయి.
తాపీ వారు, ఆరుద్ర కలిసి సంభాషణలు రాయడం కె.బి.తిలక్ వారి 'ముద్దు బిడ్డ ' తో మొదలైంది. ఆరుద్ర తాపీ వారికి అర్పించిన శ్రద్ధాంజలి ప్రతిని 'ప్రతి రాతా ప్రసిద్ధమే' లో మరో సారి చదివితే తెలుస్తుంది తాపీ వారి బయోగ్రఫీ.తాపీ వారి గడ్డం మాత్రం ఆరుద్ర తప్పనిసరిగా అనుసరించారనే చెప్పవచ్చు.
తాతాజీ అభ్యుదయ రచయితల సంఘం తొలి అధ్యక్షులంటే ఆశ్చర్యమే కదా. అలాగే బరంపురం లో పంతొమ్మిదివందల ఇరవైల కాలం లో సాగిన 'వేగుజుక్క ' గ్రంథమాల అనే సాహిత్య ప్రచురణ సంస్థకి సంపాదకులుతాపీ వారితో బాటు మండపాక పార్వతీశ్వర శాస్త్రి , న్యాయపతి రామానుజ స్వామి అయితే కార్యదర్శి దేవరాజు వెంకట కృష్ణా రావు గారు. ఆ సంస్థ ద్వారనె 'వాడె వీడు ' వంటి డిటెక్టివ్ నవలలు తొలిసారిగా వెలువడ్డాయి.
చేమకూర కవిని అమితంగా అభిమానించిన విమర్శకుడు తాతాజీ. ఎక్కడ 'ఒరిజినాలిటీ' ఉండేదో అక్కడ తాతాజీ ఆశీర్వాదముండేది.
తాపీ వారు శోభనా చల వారి చలన చిత్రాలకి ఎక్కువగా కథ, మాటలు, పాటలు రాశేరని చెప్పవచ్చు. శోభనా చాల వారి చిత్రాలంటే మీర్జాపురం రాజా వారి, వారి సతీమణి నట గాయని సి.కృష్ణవేణి వారి చిత్రాలే కదా. అందులోఇవాళ తలుచుకోవాల్సిన చిత్రం 'కీలు గుఱ్ఱం' (1949).
తెలుగు సినిమా తొలినాళ్ళలో అయ్యో నాకు 'నా' అనేవారు లేకపోతున్నారే అని వాపోతుంటే 'లేకేం' అని ముగ్గురు 'నా'యకులు (హీరోలు) బయలుదేరారు. వారే- నాగయ్య ,నారా****యణరావు , నాగేశ్వరరావు --- అందులో అక్కినేని ని జనం ఒక్క సారి కొత్త కోణంలో చూసి 'భేష్ బావున్నాడు ' అని అనుకున్నది జానపద హీరోగా ఆయన్ని 'కీలుగుఱ్ఱం ' సినిమాలో చూసాకనే.
అదిగో ఆ గుఱ్ఱం తాపీ వారి కలం నుంచి 'జూలు ' వారినదే. అదే అక్కినేని వారిని కొత్త horse power తో ముందుకు సాగేలా తోడ్పడింది.
అటు తాపీ వారిని తలుచుకోవడమే కాదు, ఇటు అక్కినేని వారి పిలుచుకోవడమూ ఏక కాలంలో జరగాలంటే ఒకటే మార్గముంది. అదే- కీలు గుఱ్ఱం కి దారి ఇవ్వడం.
కీలు గుఱ్ఱం కి షష్టి పూర్తి జరిగి రెండేళ్లు కాలేదూ? అరవై ఏళ్ళ క్రితం అంత అద్భుత సాహిత్యం, దీటైన సంగీతం సినీ సరస్వతి పుణ్య ఫలం.
సంగీతపరంగా చెప్పాలంటే ఘంటసాల అప్పుడప్పుడే రాణిస్తున్న కుర్ర సంగీత దర్శకుడు. ఆయన ప్రతిభ పట్ల పూర్తి నమ్మకం కృష్ణవేణి గారికి. ఆ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చెయ్యని నెమ్మది మనీషి ఘంటసాల. పైగాతాపీ గురువు**** వారివి ఉత్తరాంధ్ర పలుకుబళ్ళయితే 'విజయనగర ' శిష్యుడు ఘంటసాల కవి కొట్టిన పిళ్ళు.
బాలాంత్రపు రజని లాగనే వక్కలంక సరళ గారు అలనాటి ఆకాశవాణి గాయకులు. లలిత సంగీత స్రష్టలు.
కీలు గుఱ్ఱం సరళ గళానికి మరింత వీలు కల్పించింది.
శ్రీదేవి మరో గాయని. ఆమె గాత్రాన్ని కీలుగుఱ్ఱం మేలుకొల్పింది.
నట గాయని సి.కృష్ణవేణి కీలుగుఱ్ఱం లో అంజలి పాత్రకి playback పాడారు.
తాపీ వారు ఈ చిత్రం కోసం రాసిన పాటల్లో అద్భుతమైనది నిజం చెప్పాలంటే- 'కాదు సుమా కల కాదు సుమా'!
చరణం చివరను పల్లవికి జోడిస్తే అక్కడ ఒక సంపూర్ణత రావడం ఒక ప్రక్రియ. ఇక్కడ పల్లవి వెంట అనుపల్లవి తోనే అటువంటి పరిపూర్ణత రావడం గమనించాలి. 'కాదుసుమా కల కాదు సుమా ' అంటుంది పల్లవి. 'ఏది కల కాదు?' అని ప్రశ్నించుకుంటే 'అమృత పానమును అమర గానమును గగన యానమును కల్గినట్లుగ -గాలిని తేలుచు సోలి పోవుటిది- కాదుసుమాకల కాదు సుమా అని తెలుస్తుంది. మిగతా చరణాలు తేలియాడుటిది, ఊగుతుండుటిది, దోబూచులాడుటిది కాదుసుమా కల కాదు సుమా అంటాయి. ఇంత నవ్యత్వం ఆ రోజుల్లోనే ఉండేదంటే 'వారేబో ధన్యులు' అని వాళ్ళ భుజాలు తట్టాలనిపించుటన్నది కాదు సుమా అతిశయోక్తి.
కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే - అన్నీ కీలుగుఱ్ఱం భాగాలే.
ఎప్పటి కీలు గుఱ్ఱం!
ఇప్పటికీ హిప్ హిప్ హుర్రం!
ఆ నాడు తాపీ ధర్మారావు గారు 'నూతనముగ ఈ లేత మారుతము గీతా గానము చేయుగదా' అని నొక్కి వక్కాణించింది అక్కినేని వారి గురించే నేమో!
నిత్య నూతనుడు అక్కినేని వారికి తాపీ గా అందిన సత్య వచనం ముమ్మాటికి నిజం నిజం నిజం -కాదు సుమా కల కాదు సుమా.
-డా. తాతిరాజు వేణుగోపాల్, 20 సెప్టెంబర్ 2011
