Krishnaprema Logo

కృష్ణప్రేమ

వారూ వీరూ ఒకరేనా? వేరు వేరా? అదే సుందర గోప్యం !

17 ఏప్రిల్, 2011

వారూ వీరూ ఒకరేనా?   వేరు వేరా? అదే సుందర గోప్యం !

Picture

“టైటిల్ చివర్లో చూస్తే---అందమైన రహస్యం గా నువ్వంటున్నా ---సుందర గోప్యం —అనేది మన పేర్ల కలగలుపులా అనిపిస్తున్నాది గోపీ

“ యమా కరెక్ట్ గా పోల్చేవు, సుందరూ

“ఇంతకీ ఆ ‘వారు' ఎవరు? ఈ ‘వీరు' ఎవరు?”

“ వస్తున్నా –వస్తున్నా... వారి పేరు ‘ఆచార్య అత్రే ', వీరి పేరు ‘ఆచార్య ఆత్రేయ '--- అదన్న మాట”

“సరిగ్గా విన్నానా? ఆచార్య కామన్ గా ఉంది, ఒకరు అత్రే, ఒకరు ఆత్రేయ. ఒకరే అనుకునే ప్రమాదం ఉంది. కానీ కాదు. కరెక్టేనా?”

“మళ్ళీ యమా కరెక్ట్. అత్రే అన్న మాట బట్టి చూస్తే మహారాష్ట్ర కి చెందిన పేరని అనిపించిందా?”

“అవుననుకో. ఆయన ఎవరో, ఏమా కథ? ఈయన మన సుకవి, అదే ‘మనసు కవి' ఆత్రేయ అని ఇప్పుడే పుట్టిన బిడ్డ కూడా చెప్పగలదు”


“ఆచార్య ఆత్రేయ అన్నది కలం పేరు. అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఆత్రేయస గోత్రం కారణంగా (సప్తర్షులలో ఒకరు ‘అత్రి మహర్షి') అదీ, తన పేరులోది కొంతా కలిపి ‘ఆచార్య ఆత్రేయ' అనిపించుకున్నారు”

“ అలాగే అత్రే గారు కూడానా?”

“ఉహూ( --- ప్రహ్లాద్ కేశవ్ అత్రే , ఆచార్య అత్రేగా ప్రసిద్ధులు. నవముఖ ప్రజ్ఞాశాలి. పుణే దగ్గర్లో సాసవడ్ ప్రాంతం ఉంది, అక్కడ 1898 ఆగస్ట్ 13న పుట్టారు. 1969 జూన్ 13న మరణించారు

“బహు ముఖ ప్రజ్ఞాశాలి అనగా విన్నాం . నువ్వేమిటి, ‘నవ ముఖ' అని లెక్క పెట్టి మరీ చెబుతున్నావ్?”

“ ఎందుకంటే – ఆయన మరాఠీ రచయిత, కవి,విద్యా వేత్త, వార్తా పత్రిక సంపాదకుడు, రాజకీయ వేత్త, సినీ నిర్మాత, సినీ కథకుడు, సినీ దర్శకుడు, అన్నిటికీ మించి గొప్ప వక్త - ఎన్నయ్యాయి? తొమ్మిది కదా”

“మన ఆచార్య ఆత్రేయ కూడా—నంబరు తెలీదు కానీ ప్రజ్ఞాశాలే!”

“ ఆత్రేయ షణ్ముఖ ప్రజ్ఞాశాలి – ఎలా అంటే నాటక రచయిత, కవి, సినిమా పాట రచయిత, సినిమా సంభాషణ రచయిత, సినీ దర్శకుడు, సినీ నిర్మాత”

“అత్రే గారి గురించి ఆత్రేయ గారికి తెలిసే ఉండాలే”

“ ఏమో గానీ – ఆత్రేయ గారి రచనల్లో ఎక్కడా అత్రే గారి ప్రసక్తి రాలేదు. ఇద్దరి మధ్యా విచిత్రంగా ఇరవై ఏళ్ళ కాలం గ్యాప్ ఉంది, పుట్టుకలోనూ, మరణంలోనూ. ఆత్రేయ జననం 7 మే 1921, మరణం 13 సెప్టెంబర్ 1989.”

“అత్రే గారు ఆత్రేయ గారిలా సినిమా పాటలు రాయలేదంటావ్”

“ఆత్రేయ గారు అత్రే గారిలా రాజకీయాల్లోకీ రాలేదంటాను”

“బావుంది –భిన్నత్వంలో ఇదో ఏకత్వం”

“అత్రే అంటే మహారాష్ట్రలో ఎంత గౌరవమంటే – ఆయన పేరిట ఎన్నో ‘రంగ మందిర్ ' లు, ‘సభా గృహ్ ' లు ఉన్నాయి. పుణే లోని పింపిరిలో ఉన్న ఆచార్య అత్రే రంగ మందిర్ లో మేం ఒక హిందీ పాటల కచేరి చేశాం కూడా. ముంబై లో అయితే ఆచార్య అత్రే చౌక్ ఒకటి ఉంది. పుణేలోనే ఆయన పేరిట ఒక ‘వినోద విద్యా పీఠం ' ఉంది. అత్రే ఛలోక్తులు విసరడంలోనూ , పేరడీ కవితలు రాయడంలోనూ దిట్ట. రంగ మందిర్ ఎందుకంటే ఆయన చేసిన నాటక రంగ సేవ ఇంతా అంతా అని కాదు. నాటక రంగం అని మనం అంటాం. మరాఠీలో ‘రంగ భూమి' అంటారు. అలాగే వారు ‘నాట్య సంగీత్ ' అంటారు, నాటకాల్లో వినిపించే పాటలన్న మాట. ఇక్కడ నాట్యం అంటే భంగిమ కాదు, ఆడే నాటకం అన్న మాట”

“మరి ఆయన సినిమాల్లోకి ఎలా వెళ్లారు?”

“స్వతహాగా అభ్యుదయ వాది ఆయన. మార్పు అనివార్యం కదా. ఇంకో విశేషం- ఈయనకి ఎన్నో మారు పేర్లున్నాయి. కలం పేర్లే అనుకో. మకరంద్ అని ఒక పేరు. కేశవ్ కుమార్ పేరిట పేరడీలు రాశారు. ‘ఝేండూచీ ఫులే' అనే పేరడీ కవితా సంకలనం బాగా పాపులర్. ఉర్దూ భాషా కోవిదుడు కనుక ఖిల్జీ అనే మారు పేరుతో రాసిన ‘శ్యామలే' అన్న గేయంలో సరళమైన సంస్కృతం, ఉన్నతమైన ఉర్దూ రెండూ పెనవేసుకునీ ఉంటాయి”

“ ఆత్రేయ గారు కూడా సంస్కృతం ,ఉర్దూ శబ్దాలు ప్రయోగించేరు కదూ”

“అవునవును. ఆత్రేయ నాటక రంగం నుంచి 1951లో ‘దీక్ష ' సినిమాతో సినిమా రంగంకొచ్చినా నాటకాలు రాయడం మాన లేదు. నాటకానుభవం వల్ల సినిమా సంభాషణలు పలికించడం ఆయనకి పెన్నుతో పెట్టిన విద్య అయింది. 1952 లోనే ఆయన ‘ఆదర్శం ' సినిమాలో బజారు, బేజారు, కైజారు వంటివీ, ‘దాసి ' సినిమాలో ‘జోర్సే చలో నా రాజా ఘోడా' వంటివీ ఉర్దూ పదాలు ప్రయోగించారు. ఆత్రేయ గారు రాసిన ‘ఎన్జీవో ' నాటకమే 1953 లో ‘గుమాస్తా ' అనే సిన్మాగా వచ్చింది. ఆత్రేయ సినీ నిర్మాతగా మారి సినీ దర్శకుడూ అయి 1961 లో ‘వాగ్దానం' సినిమా తీశారు. దీనికి శరత్ చంద్ర నవల ‘వాగ్దత్త ' ఆధారం. ఇప్పుడు ఆ సినిమాలోని ఒక పాట రామ నవమి వచ్చి వెళ్ళిపోయినా ఒక సారి ఆ ‘వెలుగు చూపవయ్యా రామా ' విందామా? అయితే దానితో పాటూ ఆ పాటకి మూలం అయిన మరాఠీ పాట కూడా ‘కనులు చూసినా పాటే ' అనుకుంటూ విందాం. ఈ మరాఠీ పాటకి అత్రే గారికి సంబంధం లేదనే అనుకుంటాను. 1960 లో వచ్చిన ఆ మరాఠీ పాటనే తన సినిమాలో పెట్టాలని ఆత్రేయ గారికి ఎందుకనిపించిందో మరి?”

“అత్రే గారి సినిమా అనుబంధం ఎలాంటిది?”

“అత్రే తీసిన సినిమాల్లో ‘శ్యామ్ చీ ఆయీ 'కి 1954 లో జాతీయ అవార్డ్ వచ్చింది. ఇది ‘సానే' గురు జీవిత చరిత్ర. 1955 లో ‘మహాత్మా ఫులే' చిత్రానికిరాష్ట్రపతి రజిత పతాకం దక్కింది. ఈ రకంగా ఆయనకి చారిత్రాత్మక చిత్రీకరణంటే ఎక్కువ ఇష్టముండేది. అలాగే ‘స్వీయ చరిత్రలు' ‘ఆత్మ కథలు' ఎన్నో రాశేరు. ఈయన రాసిన కామెడీ నాటకం ‘మొరుచి మౌశీ ' ఆధారంగా 1998 లో అంటే ఇటీవల కాలంలో ‘ఆంటీ నెంబర్ వన్ ' అనే సినిమా తీశారు. ఈయన తీసిన ‘పాయాచి దాసి' మరాఠీ సినిమా హిందీలో ‘చరణో(కి దాసీ' గా వచ్చింది. తెలుగులోని ‘చరణ దాసి' కూడా అదేనేమో!”

“విద్యా వేత్త అంటున్నావ్ – అత్రే ఆ రంగంలోనూ ఘనుడేనేమో?”

“ముమ్మాటికీ ఘనుడే. లండన్ యూనివర్సిటీ నుంచి టీచింగ్ డిప్లమా పొందిన వాడు. ఇరవై ఏళ్ళు టీచింగ్ లైన్ లో ఉన్నవాడు. స్కూల్ ప్రిన్సిపాల్ గానూ చేశారు. పాఠ్య పుస్తకాల కూర్పరి కూడా.”

“మరాఠీ లో ‘పత్రకార్' అంటుంటారు కదూ? పత్రికా రంగంలో అత్రే సేవలేమిటీ?”

“విచిత్రమో విశేషమో గానీ ఆయనజైహింద్ అనే సాయం కాలం పత్రిక,దైనిక్ మరాఠా అనే దిన పత్రిక, సాప్తాహిక్నవయుగ్ , తుకారాం అనే వార పత్రికలకి సంపాదకులుగా వ్యవహరించేరు. మహారాష్ట్ర సాహిత్య, నాట్య, పత్రకార్ సమ్మేళనాలకి అధ్యక్షులుగానూ ఉండే వారు”

“బావుంది. అత్రే, ఆత్రేయ ల్లో ఒకటి రెండు పోలికలు దొరికితే బావుణ్ణు”

“అత్రే భీమ్ రావ్ అంబేడ్కర్ ఆలోచనల్ని అభిమానించే వారు. ఆత్రేయకి హైదరాబాద్ లోని డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రసాదించారు”

“మొత్తానికి అత్రే నుంచి ఆత్రేయ దాకా పడమరనుంచి తూర్పు దాకా భూమి తిరుగుతుంది అన్నట్టు చూపించావ్”

“అంతే గా మరి. ముంబై నుంచి ఠాణే కి మొట్ట మొదటి రైల్వే సేవ నిన్ననే అంటే ఏప్రిల్ 16 న 158 సంవత్సరాల క్రితం 1853 లో అందిన పుణ్య ఫలమే ఈ రోజు దేశమంతటా రైళ్ళు పరిగెడుతున్నాయి. సినిమా కూడా అంతే. అటునుంచి ఇటు వాలిన పిట్టయే కదా”

“మారు పేర్లు ఈ రోజుల్లో కన్నా ఆ రోజుల్లోనే ఎక్కువేమో?”

“ఇప్పటిలా సినిమా పేరే ఇంటి పేరైన ‘సిరివెన్నెల' కవిలాగ అప్పట్లో నటీమణి ‘షావుకారు' జానకి ఉండే వారు. ఆరుద్ర కవి అసలు పేరు తెలుసుగా- భాగవతుల శివ శంకర శాస్త్రి . ఈయనతోనూ, షావుకారు జానకి తోనూ మనకి ఈ వారం పని ఉంది. ముచ్చటిద్దాం. ఆగాగు—ఒక్క మాట. అసలే కసిరే ఎండలు, ఆపైన ముసిరే వానలు. ఈ మధ్య కాలంలో మెరుపులూ ఉరుములూ తోడై భళ్ళున కురిసే వర్షాలు. ఆత్రేయ ఒక పాట రాశారు-‘ చిటపట చినుకులు పడుతూ ఉంటే ' అని. కానీ ఆయన అన్నారు కదా అని కుర్రకారు ‘చెట్టు నీడ కై పరిగెట్టడం' మాత్రం తగదు సుమా. మెరుపు దాడి చెట్ల దగ్గరే ఎక్కువ. ‘మటాష్' అయిపోతారు. ఏదీ ఒకసారి ఆ పాటని ‘కనులు మూసినా పాటే ' అంటూ విందాం. ఇక్కడే కారు మబ్బులు కమ్ముతు ఉంటే ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చాన ' గురించి ఆత్రేయ రాసిన పాట కూడా విందాం. ఈ పాట విని ఆ రోజుల్లో అది శ్రీశ్రీ రచన అని భ్రమ పడ్డారట. అలాగే శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై' పాట ఆత్రేయ గారే రాశారని వాదించే వారూ ఉంటారు. ఎందుకంటే ‘మనసు' మీద పేటెంట్ హక్కులు ఆత్రేయవై పోయాయి కదా. ఆత్రేయ రాసిన సినిమా పాటలే తప్ప వేరే ఏదీ చదవని వారికోసం ఆయన ఘంటసాల గారిని తలచుకుంటూ రాసిన ఒక ‘ఎలిజీ' ‘తిరుగులేని మాట ' లో ఉంచుదామా?

-డా. తాతిరాజు వేణుగోపాల్,17ఏప్రిల్****2011