అరమరిక లేని అనురాగ సామ్రాజ్య నేతలు -- ఆ .. భా .. మ
13 సెప్టెంబర్, 2011


'మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే'
పాట పాడుకుంటూ ఆచార్య ఆత్రేయ 'ప్రేమ నగర్' లో ప్రవేశిస్తున్నారు.
అక్కడ కొంత దూరంలో 'అనురాగం' కాలనీ లో ఉంటున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చెవిని పడ్డాయి ఆ మాటలు.
'ఇక్కడి కొచ్చేశాక ఇంకా మనసు-- మనిషీ అంటూ ఏమిటోయ్ ఆత్రేయులూ?' అంటూ సిల్కు పంచె, లాల్చీ దాల్చిన మరు మల్లె పువ్వంటి శాస్త్రి గారు నవ్వేశారు.
'అయ్యా.. నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చి వచ్చి ఈ స్వర్గ సీమ లో పడ్డాను. అదీ ఈ సెప్టెంబర్ నెలలోనే. అదీ ఒక్క రోజు తేడాలో. ఎటొచ్చీ మరీ షష్టిపూర్తి చేసుకునీ ఇహ చాల్లే అని మీరు తనువు చాలించేరు. నేను ఇంకొన్నాళ్ళు నా మహా కాయాన్ని, తెలుగు పాట అనే మహా గాయాన్ని మోసుకొచ్చేను.'
'అవును కదూ. నేనా- సెప్టెంబర్ 12 న , నువ్వా 13 న , ప్చ్ ! అయినా తెలుగు పాట అనే మహా గాయం అంటావేం? తెలుగు వారి చేత తన్నులు తినడం ఖాయం!'
'కాకపొతే ఏమిటి చెప్పండి శాస్త్రి గారూ. మీతోనె తెలుగు పాట కదా - అది మీరు లేక ఎటూ దిక్కు తోచక జ్వరం తెచ్చుకునీ సంధి ప్రేలాపన చేస్తూ వచ్చి ఇంక లాభం లేదని కోమాలో పడిపోయింది'
'కోమా నయం కదా, కామా కన్నా'
'కామా వే, కోమా కాదు. ఎందుకంటే సంధి ప్రేలాపన మరీ హెచ్చయ్యింది'
'పోన్లేస్తూ. ఎవరి తరం వారిది.'
'మీరు రాసిన కథలు, మీ పాటలు మళ్ళీ మళ్ళీ చదివిస్తేనే గానీ తెలుగు బాగు పడదండీ'
'అన్నగారు సముద్రాల ఎంతో బిజీ గా ఉంటుంటే కొన్ని పాటలు రాశానని, నిజం చెప్పండనీ ఎందరో నిలదీసే వారు. మీ పేరెందుకు రాలేదు అని గొడవ చేసారు. పోనీ ఇద్దరి పేర్లూ చేర్చవచ్చు కదా అని గొణిగే వారు. ఇదంతా ఎందుకు. పోనీ నువ్వన్నట్టు నాదేదో వేరే తెలుగనుకుంటే దాన్ని పట్టుకునీ నా రచనలు పోల్చుకోవచ్చునే!'
'సముద్రాల వారు చక్కని ప్రాసలు వేస్తారు. మీరు కమ్మటి పదాలు రాస్తారు. ఇదే తేడా. ఇవి రెండూ కలబోసి ఆరుద్ర తన ముద్ర బయట పెట్టేడు. ఇక నేనంటారా-- నేను ఏది రాసినా 'మనసు ' పెట్టి రాస్తానని ఒక నమ్మకమేర్పడి పోయింది తెలుగు ప్రజకి. నన్నేకంగా 'మనసు కవి ' అన్నారు. అంటే అనననీండి కానీ నేను మాత్రం మిమ్మల్ని 'మన కవి ' అంటాను. అంటేమ నిషికి న చ్చిన కవి అని.'
'సర్లే.. మనకవి అనవసరం కానీ-- కానీ నువ్వూ నేనూ కలిసి కొన్ని సినిమాలకు పని చేశాం కదూ. నాకు 'అనురాగం' ఓటీ, 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం' ఓటీ గుర్తున్నాయి'
'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం లో నేను ఎవరో అతనెవరో ఆ నవ మోహనుడెవరో .. అంటూ ఓ పాట రాసా. అందులో 'కబురు ' అనే పదం దొర్లిపోయింది. హడిలి పోయాను.కాలాల తేడాలో భాషల జాడ గుర్తుకు రాలేదు. అప్పుడు మీ దగ్గరకొచ్చి మొర పెట్టుకున్నాను. పాట కూడా రికార్డ్ అయిపోయిందే అని నా బాధ'
'అవునవును. అప్పుడు నాకు ఆ వెంకటేశ్వరుడే ఆదుకున్నాడు. నాకు వెంటనే 'బీబీ నాంచారమ్మ ' ఆ కాలం నాటిదని గుర్తొచ్చింది. కాబట్టీ కబురు అనే అన్య భాషీయ పదం నువ్వలా అక్కడ వేయడం భేషే అనిపించింది. ఆ మాటే నీతో అన్నాను'
'అలా మీరు కవులకు కవి. మార్గదర్శకులు అనిపించుకున్నారు'
'అనురాగం చిత్రంలో చిత్రం ఏమిటంటే మహా గాయని భానుమతి నీ పాటా, నా పాటా పాడడం. అవి రెండూ పిల్లల పాటలు కావడం.'
'మీరు 'సన్నజాజి తీవలోయ్ సంపంగి పూవులోయ్ ' అని, నేను 'ప్రేమా పిచ్చీ ఒకటే ' అనీ రాశాం'
(ఇంతలో విసా విసా నడుస్తూ భానుమతీ రామకృష్ణ ప్రవేశిస్తారు)
'ఏమిటేమిటి, నా పేరు విన్నా ఇక్కడ. ఏమిటండీ మల్లాది శాస్త్రులూ, ఏమిటండీ ఆచార్యులూ. నా అదృష్టమే అంటాను నేనూ సెప్టెంబర్ లోనే మీ వంటి చెయ్యి తిరిగిన రచయితల లోకం లోకి వచ్చి పడ్డాను. అవునా కాదా?'
'అమ్మా భానుమతీ. కాదంటే మా చెయ్యి తిరిగి-- కాదు కాదు విరిగి పోదూ'
'అదే అదే ఒద్దంట. సూర్యకాంతమ్మది ఎడం చెయ్యి వాటం అయితే నాది రెండు చేతుల ఉబలాటం'
'రెండు చేతులూ వద్దు గానీ ఒక్క గొంతు చాలు. మేం ఇద్దరం చెరొక పాట రాస్తే పాట రాయడం మీ వంతు , కమ్మగా పాడేది నా గొంతు అంటూ ఎంత కమ్మగా ఆ పాటలు పాడావమ్మా. ఏది మన తెలుగు వాళ్ళ కోసం ఇప్పుడు మేం అనుకున్నామే ఆ రెండు పాటలూ మళ్ళీ పాడ కూడదూ? '
'మళ్ళీ పాడడమెందుకు మల్లాది శాస్త్రి గారూ. అవేవో రికార్డ్స్ ఉన్నాయిగా. వింటే పోలా? దొరక్క పొతే మన క్రిటిక్ విఎకే రంగారావు దగ్గర ఎలాగూ బోలెడన్ని రికార్డ్స్ ఉంటాయి కనక 'విన వేడుక' గా ఉంది వినిపించవయ్యా అంటే ఇట్టే వినిపించేయరూ? '
'పోలా -- అనగానే మన రచయిత, ఏదీ బెంగాలీ శరత్ ని తెలుగువాడే అనేలా భ్రమలో పడేయించినచక్రపాణి గుర్తుకొస్తున్నారు'
'అంతే కానీ నేను తొలినాళ్ళలో తీసిన 'చక్రపాణి ' సినిమా గుర్తుకు రాదంటారు'
'నీతో గొప్ప చిక్కేనె తల్లీ- వేలికేస్తే కాలికేస్తావ్'
'వేలూ కాలూ అంటూ అసలు విషయానికి తిలోదకాలు ఏవిటీ? చూడమ్మా ఆత్రేయా నేనూ అనురాగం సినిమాలో కలిసి రాశాం. కాబట్టి ఆత్రేయ 'ఆ ' , మల్లాది 'మ ' కలిస్తే 'ఆమ ' అంటాను. సరేనా?'
'మీకు ఎన్నో భాషలొచ్చుశాస్త్రి గారూ. నాకు ఇంచుమించు చాలానే తెలుసు. తమిళంలో నేనూ చాలా సినిమాలు చేశాను, పాడాను కూడా. ఈ ఆత్రేయ గారికి మనసు లాగ స్నేహం, మమత, 'అనురాగం' అన్నవి నాకూ ఇష్టమే. ఈ మధ్య భూమ్మీద అమెరికా అంతా ఒబామా అంటూ తెగ పొగుడుతోంది. ఆయనకి గాంధి బోధలు ఇష్టం. నాకు రాజకీయాలు చేతకావు. లేకపోతె ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లాగ దూసుకు పోయే దాన్నే. ఇంతకీ నా పాయింట్ ఏమిటంటే- నన్నూ కలపండి. మొత్తంగా 'ఆ-భా-మ ' అనండి, ఎంచక్కా ఒబామా లాగ ఉంటుంది.'
'అంటే--- అరమరిక లేని అనురాగం అనే సామ్రాజ్య నేతలు ఆత్రేయ, భానుమతి,మల్లాది - వెరసి ఆ-భా-మ అనమంటారు. అవునా'
'ఔనా నిజమేనా- అనడానికి నేను కృష్ణశాస్త్రిని కానే. అవును, ముమ్మాటికి నిజం నిజం నిజం అంటాను. ఇంతకీ నేను విసవిసా మీ దగ్గరికి వచ్చింది దేనికి, ఆ మాట కాస్త మరచి పోయాననుకునేరు! '
'ఏదో మీ పాటలు అదే మీరు పాడిన మా పాటలు తలచుకుంటుంటే వచ్చారని సంబర పడ్డాం. అప్పటికీ మీరు కోపంగా ఉన్నట్టు పసిగట్టేననుకోండీ...'
'నా కోపమంతా ఇదిగో ఈ శాస్త్రి గారిని గురువంటారే, ఆ విఎకే మీదే. సుబ్బరంగా మల్లాది వారి పాటలన్నీ సినిమా ఫొటోలతో సహా వేశారే ఆయన 'విన వేడుక' అని పేరు పెట్టి , మరి నేను పాడిన శాస్త్రి వారి పాట ' జయ శంభో శివ శంకరా' , అదే ఆ 'పల్నాటి యుద్ధం' లొ రాజేశ్వరరావు గారు ట్యూన్ చేసిన పాట ఎందుకు చేర్చలేదో? సినిమా పాటల పుస్తకంలో ఉంది. 'విన వేడుక' పుస్తకం మలి ముద్రణలో వెయ్యమనాలి.'
'అమ్మా, భానుమతీ రామకృష్ణా! ఈ రామకృష్ణ శాస్త్రికి మతి పోతోంది. ఈ వాదాలెందుకు గానీ హాయిగా నీ అత్తగారి కథలు మాకు వినిపించు, నేను మీకు నా కృష్ణా నది కథలు వినిపిస్తా. ఏమంటారు ఆత్రేయా'
'నన్నూ ఓ నాటకం ఆడించనీయండి'
'అంటే... సినిమాలొద్దు, పాటలొద్దు అంటారు. అయినా మీ నాటకాలు మా దగ్గరే సాగుతాయ్'
'మళ్ళీ ఓ విసురా తల్లీ'
-డా. తాతిరాజు వేణుగోపాల్, 13 సెప్టెంబర్ 2011