Krishnaprema Logo

కృష్ణప్రేమ

అసలు కరోడ్ పతి - సిసలైన మన ఆరుద్ర

01 జనవరి, 2012

అసలు కరోడ్ పతి - సిసలైన మన ఆరుద్ర

Picture

click to zoom

2012 లోకి అడుగు పెట్టేం.

‘why this kolaveri kolaveri di' అనే పాట కసిగా పదహారు వెర్షన్స్ గా హిట్ అవుతూ ఉంటే 2011 లో నట గాయకుడు ‘ధనుష్ ' ప్రపంచంలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు.

ఇప్పుడు ‘వై దిస్ జనవరి జనవరి డి (యర్)' అంటే ‘బికాజ్ ఇట్ బ్రింగ్స్ న్యూ ఇయర్' అని ముందు పాడుకోవాలి.

ధనుష్ కి తగ్గట్టే సూర్యుడు ధనుర్మాసం లో ఉన్నాడు. ధనుర్మాసం అనగానే ఒడిశా లో మా వూరుబరంపురం స్పెషల్ మిఠాయి ‘ధనుర్ ము(వా' గుర్తుకు రావాల్సిందే. ఒకప్పుడు అది కొరుకుడు పడని గట్టి పంచదార పాకం, ఎండు కొబ్బరి, పేలాల మిశ్రమ మిఠాయి. తింటుంటే ‘సామి రంగా' ఆ రుచే వేరు. ఈ మధ్య కాలంలో నెయ్యి, బెల్లం పాకం మిళాయించి కొంచెం ‘మెత్త' బడ్డారు. ఆ ము(వా తిని ఆనందించే భాగ్యం పుణే లో ఉన్న మాకు ఈ సారి దక్కింది.

డిసెంబర్ లో ‘కృష్ణ ప్రేమ ' కాస్త బద్ధకించినట్టు మీకనిపిస్తే చలికాల మహిమ అని తప్పించుకోలేను. ప్రయాణాల ప్రహసనం వల్ల అలా ‘డిలే' జరిగింది. డిలే- అంటే ఆలస్యం. అదే పదం తిరగ బడితే ‘లేడి'- పరుగుల సంకేతం. ‘లేడిలా మనసు పరుగిడినా' అన్నారు కృష్ణశాస్త్రి. మనసు ‘డీర్ డీర్ డీర్ డీ' అని హీరో కృష్ణ లా ఈల వేసి గంతులేస్తోంది, కొన్ని ముచ్చట్లు పంచుకోవాలని.


డిసెంబర్ లో మా వరంగల్ అన్నయ్య (తాతిరాజు) మా మంచి వార్త చెవిలో వేశాడు. తన కొడుకు పెళ్ళి కొడుకౌతున్నాడని. ఎక్కడా అంటే మన విశాఖ లోనే అనీ! ఆబ్బాయి ‘ప్రేమ'పెళ్ళి రోజు మాఅమ్మ(ప్రేమ) జయంతి (డిసెంబర్ 18) కావడం మా అందరికీ మరింత ఆనందదాయకమైంది.

'ఆహా ఏమి డబల్ భాగ్యం' అనుకున్నాను. ఎందుకంటే విశాఖ నుంచి నాలుగు గంటల ఇంటర్ సిటీ ప్రయాణం నన్ను బరంపురం లో పడేస్తుంది కాబట్టి. అన్నయ్య మరో వార్త చెప్పాడు. రిసెప్షన్ హన్మకొండ(వరంగల్) లో అనీ.

డిసెంబర్ కీ, వరంగల్ కీ మంచి అనుబంధముంది. డిసెంబర్ నెలలో పుట్టిన ప్రముఖ మిమిక్రీ మేధావి, ధ్వన్యనుకరణ శిల్పి నేరెళ్ళ వేణు మాధవ్ వరంగల్ వాసి కదా. ఆయనికి కృష్ణప్రేమ శుభాకాంక్షలు ఆలస్యంగా అందిస్తోంది. సినిమాల్లోని నేరెళ్ళ వారిని ఇది వరకే ‘చిత్ర ‘re' చిత్ర హాస్యం ' లో చూశాం. పోనీ, మరోసారి అటువైపు దృష్టి సారించి ఇటు రద్దురూ.

అలనాటి వేణు మాధవ్ అంటే ఆంధ్రులకెంత ప్రేమో ఆరుద్ర గారు చెప్ప గలిగారు. ‘మంచి కుటుంబం ' సినిమా కోసం ఒక వీణ పాట ‘ మనసే అందాల బృందావనం ' అనేది రాస్తూ ‘వేణు మాధవుని పేరే మధురామృతం ' అని ఆయన అనలేదూ?

మహాకవి శ్రీశ్రీ కి విశాఖ సముద్రం అంటే ఇష్టం. అలాగే ఆయన మేనల్లుడు ఆరుద్ర గారికీ, విశాఖపట్నం కీ అనుబంధముంది. నాలుగ్గంటలు దాటితే బరంపురం కాబట్టి బరంపురం తెలుగు ప్రజలు వీరిద్దరి సరదాలు, చెణుకులూ ఒకనాటి స్వర్ణ యుగంలో తరచూ విని తరించారు. ఆ కబుర్ల బూర్లు మధురంగా తినిపించ గలిగే మా జగదీశ్ అన్నఊరిస్తూ కొన్నిటిని గుర్తు చేస్తుంటే ఉన్న పళాన ఐసై పోయాం
( అప్పటికి అంతో ఇంతో చలి ఎముకలు కొరికేంత స్థాయికి చేరుకో లేదు).

ఈ పెళ్ళి వేడుక పుణ్యమా అని బరంపురం సాహితీ మిత్రులు కొందరు విశాఖ లోనూ, మరి కొందరు వరంగల్ లోనూ ఈ సందర్భంగా కలిసారు. ఈ ఆత్మీయ కలయిక ‘కోటి ' రూపాయల కన్నా ఎక్కువే.

ఉన్నట్టుండి ఈ హార్దిక, ఆర్ధిక కలగలుపు ఏమిటో? అని ఆశ్చర్య పోవద్దు.

కిందిటేడాది, అంతకు ముందు రెండు సార్లు (కొన్నేళ్ళు) తన గంభీర కంఠంతో, ఛలోక్తులతో గంటకు పైగా క్విజ్ నిర్వహిస్తూ ‘కౌన్ బనేగా కరోడ్ పతి ' అనే స్లోగన్ ఇంటింటా ప్రతిధ్వనించేలా చేసిన అమితాభ్ ఒక్క పొరపాటు చేశారు. కరోడ్పతి అనే కోటీశ్వరుడు మన తెలుగువాళ్ళ మధ్య ఒకడు ఉండేవాడు, పైగా కవీశ్వరుడు అన్న విషయం ఆయన దాక రాక పోవడం. తెలుగు వాళ్ళకి ఎస్ ఎం ఎస్ లు చేసి పంపడమంటే తెగ చిరాకు కాబట్టి అలా జరిగి పోయింది- అని చెప్పి తప్పించుకుందాం.

ఇంతకీ ఆరుద్ర కవి కోటీశ్వరుడా? ఈయనేం తిరుపతి వెంకన్న, త్రివేండ్రం అనంత పద్మన్న కాదే! – ఇది మీ అనుమానం. ‘కోటి ' అనే మాటలో రెండంటే రెండు అక్షారాలుంటే మీరు సంఖ్యగా గుర్తించి ఒకటి పక్కన అన్నేసి సున్నాలు చుడితే ఎలా?

నే చెప్పేది ‘కోటి ' అనే సంఖ్యా వాచకాన్ని దాదాపు ఇరవైకి పైగా పర్యాయాలు తన పాటల్లో వినిపించి రికార్డ్ నెలకొల్పిన వాడు ఆరుద్ర కనుక అతనే అసలైన ‘కరోడ్ పతి' అన్నది.

ఈ రహస్యం నేను ‘రచన ' మాస పత్రిక కి కొన్నేళ్ళ క్రితం చేర వేశాను. రచన సంపాదకులు శ్రీ శాయి ముచ్చట పడిపోయి కవర్ పేజీ లోనే ‘ప్రత్యేక రచన - కరోడ్ పతి మన ఆరుద్ర- డా. తాతిరాజు వేణుగోపాల్' అని చాటించడం నాకు మహదానందమైంది. ఇప్పుడా రచనే ‘ప్రతి రాతా ప్రసిద్ధమే ' లో సిద్ధంగా ఉంది. ఆరుద్ర ‘కోటి ' ని మరీ ఆదుర్దా గా చదివేయక తాపీ గా చదవడం ధర్మంగా ఎంచి అక్కడ చెప్పిన పాటల్లో కొన్నిటిని ‘కనులు చూసినా పాటే ' లోనూ, కొన్నిటిని ‘కనులు మూసినా పాటే ' లోనూ, ఇంచుమించు అన్నిటినీ ‘కనులు చదివినా పాటే' లో దర్శించి, స్పర్శించి మీరు పులకిస్తే పులికేట్ సరసు నీళ్ళ మీద ఫ్లెమింగో పక్షిలా నా మనసు ఎగిరి గంతులేస్తుంది.

కాసేపు ‘లేడి' అన్నావు, ఇప్పుడు పక్షి అంటున్నావు , ఇదేమి మనసు బాబూ నీది? –ఇది మీ స్వగతం, కదూ.

మనసు గతి ఇంతే- అన్నారు ఆత్రేయ. అలాగే పాడేరు ఘంటసాల. లోగడ ‘తెలుగు వారి గళవేల్పు ఘంటసాల' అని apallround.com లో ఆ మహానుభావుడికి బిరుదు తగిలిస్తూ మరో మాట అన్నట్టు గుర్తు. ఆయన భూమ్మీదకి డిసెంబర్ లో వచ్చి స్వర్గానికి ఫిబ్రవరి లో తరలిపోయారు. మధ్యన మిగిలింది – ముప్ఫై ఏళ్ళ జనవరి , అన్నేళ్ళూ జనం వరించిన గాయకుడు కనుక ఆయన ‘జనవరి '!- అన్న మాట.

కాబట్టి ‘వై దిస్ జనవరి జనవరి డీ' అంటే – ఇంకా - సూర్యుడి మకర సంక్రమణం, ఉత్తరాయణ కాలం, భోగి,సంక్రాంతి, కనుమ పండుగ వేడుకలు, పుష్య మాస పుణ్య పురుషుడుత్యాగరాజ వారి జననం, తెలుగు వారి అపర కృష్ణుడు ఎన్ టీ ఆర్ స్మృతి, ముక్కోటి ఏకాదశి, వివేకానందు ని జననం, మాఘ శుక్ల పంచమి నాటి సరస్వతీ మాత కటాక్షం, రథ సప్తమి, అమర వీరుల సంస్మరణం – ఇన్ని ఉన్న నెల అని చెప్పేందుకే అని చెప్పాలి.

పండుగలు, మధుర స్మృతులూ, మేలు కలయికలు – ఇవే మనకు మిగిలే ‘కోటి ' సంపదలు.

నూతన సంవత్సరంలో ‘కృష్ణప్రేమ' కాస్త ముస్తాబు మార్చుకుంది. ఆదరించేవారికి ‘కోటి ' దండాలు.

ముక్తాయింపు-

చలి పులి కి భయపడితే గనుక తెలుగు వాడు (కోటు ధరించే) ఒక ‘కోటీశ్వరుడే!'. ఇంత మంది కోటీశ్వరులని నిజంగా వణికించే మూడు నెలల కాలం ( ఇంకం టాక్సు రూపంలో డబ్బు అవుట్ గోయింగ్ ) కి ఈ జనవరి ఆది. బహుశా ఇదే ఆరుద్ర గారి అన్ని వేలపాటల్లో ఓ ఇరవై సార్లు ‘కోటి ' ముద్ర వేయించి ఉండాలి.

-డా.తాతిరాజు వేణుగోపాల్, 01 జనవరి 2012