శ్రీ పంచమి- వసంత పంచమి- మాఘ శుక్ల పంచమి
08 ఫిబ్రవరి, 2011
ఈ అయిదవ తిధి అందరికీ సుపరిచితమే.
తల్లి సరస్వతిని పూజించేది ఈ తిధినే.
చదువుల తల్లి- మన అమ్మకీ, నాన్నకీ, మనకూ అందరికీ ‘మాట' నేర్పే మా మంచి తల్లి. మనకు జ్ఞాన మిచ్చే జనని.
పంచ భూత (ఆకాశం, భూమి, గాలి, నిప్పు, నీరూ) ప్రపంచంలో సకల సువిద్యలు పంచి పెట్టే అమృత హస్తం ఆమెది. అదే హస్తం ‘వీణ' మీటి సంగీత ప్రపంచాన్ని ఆవిష్కరించి వీనులకు విందు కూర్చింది. పంచమి తిథి తనదైన కారణం చేత కోకిలకి పంచమ స్వరం ఇచ్చి వసంత ఋతువు మొదలయ్యేలా ప్రకృతిని చూసుకోమంది. ‘పలుకు' ను పలక మీద పరచి ‘అక్షరం' (నాశం కానిది) అనే అద్భుత విషయాన్ని ప్రసాదించింది.
‘అక్షరాభ్యాసం' అనే తొలి విద్య ఈ తిథిని ఆరంభిస్తే – నేటి బుడి బుడి అడుగులే రేపటి అడుగు జాడలవుతాయి.
ఇప్పుడు అ.ఆ.ఇ ఈ అన్న యాభయి పై చిలుకు తెలుగు అక్షరాలతో పాటు A,B,C అనే –మరో సగం- ఇంగ్లీష్ అక్షరాలూ అవసరమే.
పెద్ద బాల శిక్ష అంటే అదేదో పెద్ద వారి బెత్తం బాదుడు శిక్ష అనుకునే పిల్లలున్నారా? అది పిల్లల కోసం రాసిన ‘ఎన్ సైక్లో పీడియా' అని పెద్దలు చెప్పాలి. అందులో ఎంచక్కా పోతన పద్యాలు ఉంటాయి, వేమన పద్యాలు ఉంటాయి. సుమతీ శతకం ఉంటుంది. ఇవే మన ఆస్తులు. ఇవి సంపాదించుకోవడం, నలుగురికీ పంచి పెట్టడం చేస్తే మన అంతస్తు పెరుగుతుంది.
నాటి మదరాసు నుంచి ( ఇప్పటి చెన్నై) గోపాల్ అండ్ కో వారు 1915 నుంచి పెద్ద బాలశిక్షను ప్రచురిస్తూ వచ్చారు. ఆ మధ్య (2004 లో) గాజుల సత్యనారాయణ గారు కొత్త పద్ధతిలో లావు పాటి పెద్ద బాలశిక్ష ను ముద్రించారు. కాలానుగుణంగా కావాల్సిన వన్నీ కొంచెం కొంచెంగా మార్చుకుంటూ రాక పొతే బాలశిక్షలు కను మరుగయ్యే ప్రమాదం ఉంది.
ఏ పుస్తకమైనా సరే భయ పెట్టేదిగా ఉండకూడదు. అభయమిచ్చేదిగా ఉండాలి. అలా అభయమిచ్చేలా మన మస్తకంలో సరస్వతి దేవిని కొలువుండమని కోరు కోవాలి.
తల్లి సరస్వతి ని ఇలా స్తుతిస్తే మన తలల్లో తెలివి తేటలు తేట తెల్లమవుతాయి..
**‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణనీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ'**
**‘యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై: సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ ని:శేష జాడ్యాపహా'
**
ఇవి ఎప్పుడో ఎవరో చెప్పి మనకెంతో మేలు చేసారు.
మనకందరికీ మరో విద్యాలయం సినిమా. ఇప్పుడది ఇంట్లోనే టీవీ లోనూ కంప్యూటరు లోనూ చిన్న రూపంలో వెలసింది. సినిమాల్లోనూ అప్పుడప్పుడూ సరస్వతీ దేవిని తలుచుకోవడం అనే మంచి అలవాటు నాడూ నేడూ ఉంది.
‘మాతా సరస్వతి శారద' అనే స్తుతి ఒక హిందీ సినిమాలో ('ఆలాప్' లో) ఉంది.
మన తెలుగు కమ్మగా రుచిగా ఉండాలని మల్లాది రామ కృష్ణ శాస్త్రి , దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అనే ఇద్దరు కవులలో సరస్వతీ దేవి శాశ్వతంగా ఉండి పోయింది. ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి పాటలు మిగిలాయి. ఆ పాటల్లోని కొన్ని మాటల్లో సరస్వతీ దేవిని గురించి మల్లాది వారు ఏమన్నారో తెలుసా?
‘మది శారదా దేవి మందిరమే- కుదురైన నీమమున కొలిచే వారి... (మది---)
**రాగ భావ మమరే గమకముల –**నాద సాధనల దేవికి పూజ
తరళ తానములె హారములౌ –వరదాయిని కని గురుతెరిగిన మన (మది---)
అని ఒక సారి ‘జయభేరి' (1959) సినిమా లోనూ,
**‘**మధువు చిలుకు గమన మొలుకు వర వీణాపాణి
సుమ రదనా విధువదనా దేవీ
అంబరాంతరంగ శారదాభ్ర రూపిణీ
చిదంబరేశ్వరీ శ్రీ శారదాంబికే**'**
అని ఇంకో సారి**‘రహస్యం'****(1967)** సినిమా లోనూ కొత్తగా తన ‘వాణి' వినిపించారు. ఈయన రాసిన కూచిపూడి నృత్య రూపకంలో కొంత భాగమిది. మల్లాది వారు స్వర జ్ఞాని కూడా. ఆయన ఇలా సరస్వతీ దేవి గురించి రాసారు కనుక ఆయనే ఈ భాగానికి 'సరస్వతి' రాగం సూచించారు. ఘంటసాల మాస్టారు అచ్చం అలానే స్వర పరిచారు.
పద్మనాభం సమర్పించిన, దర్శకత్వం వహించిన 'శ్రీ రామ కథ' లో సుశీల, జానకి కలిసి పాడిన నాట్య గీతం ఒకటి ఉంది- 'సర్వ కళా సారము నాట్యము' అనే ఆ పాటని సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి 'సరస్వతి' రాగంలోనే స్వర పరిచారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ తన 'సప్త పది' సినిమాలో 'అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ' అనే స్తోత్ర పాఠంలో కొంత 'సరస్వతి' రాగాన్ని ఉపయోగించారు.
ఇలా మళ్ళీ 'ఈ పూట నా మాట' గా త్వరలోనే కలుసుకుందాం.
-డా. తాతిరాజు వేణుగోపాల్ ( ఫిబ్రవరి 08, 2011)