వెన్న ముద్దలు తిన్నంత మెత్తని గాత్రం , ఆ బాల గోపాలం మెచ్చే గళం - అది మీకు సరస్వతీ కటాక్షం! అందుకో
28 ఆగస్టు, 2011


- 1936 సతీ అనసూయ + భక్త ధ్రువ (గంగ పాత్ర, గాయని)
- 1936 భక్త కుచేల (తమిళం) (చిన్ని కృష్ణుడు, కుచేలుని కూతురు)
- 1936 బాల యోగిని (తమిళం) ( ఈ చిత్రం ద్వారానే 'బాల ' అని పేరు ముందు చేరింది)
- 1937 తుకారాం (ముసిరి సుబ్రహ్మణ్యం గారు తుకారాం, ఆయన కూతురు గా బాల)
- 1939 మహానంద (చిన్ని పాపగా, ఎస్.పి.లక్ష్మణ స్వామి తో పాట)
-
1939 తిరు నీలకంఠర్(తమిళం) (త్యాగరాజ భాగవతార్ తో పాట)
-
1940 ఇల్లాలు (ఎస్.రాజేశ్వరరావు తో నటించడం, హీరోయిన్ కాంచనమాల కి పాట నేర్పడం) (ఆకాశవాణి మద్రాస్ లో తొలి తెలుగు గాయనిగా అవకాశం)
-
1941 అపవాదు (చెల్లెలి పాత్ర, ఆ పాత్రకే ఎన్నో పాటలు)
-
1941 చంద్రహాస
-
1942 జ్యోతిమలర్ (తమిళం) (బహు సంఖ్యలో సంగీత దర్శకులు పని చేసిన చిత్రం)
-
1942 పరశురామన్ (తమిళం)
-
1942 పృథ్వీరాజ్ సంయుక్త (తమిళం)
-
1942 డాన్సింగ్ గర్ల్ (తమిళం)
-
1943 భాగ్యలక్ష్మి (తొలిసారిగా PLAY BACK - నటి కమలా కోట్నీస్. సంగీతం: బి.ఎన్.ఆర్))
-
1943 చెంచు లక్ష్మి (సంగీతం: సుబ్బరామన్)
-
1944 June 22 - కోలంక రాజా వారితో వివాహం
-
1945 మాయా మశ్చీంద్ర ( నటి మాలతి కి playback. సినిమాలో సీన్ తొలగింది)
-
1945 వాల్మీకి ( పాడిన పాటలు రద్దు)
-
1947 రాధిక ( తండ్రి నిర్మించిన చిత్రం. రాజా వారి అంగీకారంతో తిరిగి పాడడం. రాధగా నటించడం. సంగీతం: సాలూరి హనుమంతరావు)
-
1947 August 15- మద్రాస్ ఆకాశవాణిలో దేవులపల్లి వారి 'ప్రాభాత ప్రాంగణాన మ్రోగేను నగారా' పాడారు.
-
1948 సువర్ణమాల (ఒకటి రెండు డాన్సులు - కొన్ని పాటలు)
-
1948 బిల్హణ (తమిళం) (మొత్తం శాస్త్రీయ గానం) (నటనకి స్వస్తి)
-
1949 లైలా మజ్ను ( సుబ్బరామన్ సంగీతం. 'ఏల పగాయే' పాట )
-
1950 స్వప్న సుందరి (నటిఅంజలి కి పాట. అదీ బలరామయ్య ,దుక్కిపాటి ,అక్కినేని వారు రాజా వారిని ఒప్పించబట్టీ)
-
1950 షావుకారు (సంగీతం: ఘంటసాల) (అంతవరకూ ఆమెకు ఘంటసాల వారితో పరిచయమే లేదు)
-
1952 ప్రియురాలు (సంగీతం: బాలాంత్రపు రజనీ కాంత రావు)
-
1953 అమ్మలక్కలు (గిట్టనివాళ్ళు ఆమె పాటలు వద్దంటే సుబ్బరామన్ 'అయితే పని చేయను పొండ'న్నారు)
-
1953 దేవదాస్ ( చంద్రముఖి గా నటించిన లలిత కి పాటలు- 'తానే మారేనా గుణమ్మే మారేనా' ఉదాహరణ)
-
1953 నా ఇల్లు ( సంగీతం: నాగయ్య , దేవులపల్లివారి గీతం 'అదిగదిగో గగనసీమ ' పాపులర్)
-
1953 (హిందీ అవకాశం వచ్చినట్టే వచ్చి పోవడం)
-
1955 అంతే కావాలి (సంగీతం: పెండ్యాల)
-
1955 జయసింహ (సంగీతం: టి.వి.రాజు , నటి వహీదా రెహమాన్ కి పాడారు)
-
1956 తెనాలి రామకృష్ణ ( సంగీతం:విశ్వనాథన్-రామ్మూర్తి . ఆమె పాడిన 'ఝణ్ ఝణ్ కంకణములూగ' పాట సన్నివేశం చిత్రంలో లేదు)
-
1956 భక్త మార్కండేయ
-
1957 పెద్దరికాలు (సంగీతం: మాస్టర్ వేణు)
-
1957 తొలి తెలుగు డబ్బింగ్ చిత్రం 'ఆహుతి ' కి మహాకవి శ్రీశ్రీ పనిచేస్తే వారి పాటలు తొలిసారిగా పాడేరు)
-
1968 డిల్లీ లో జాతీయ స్థాయి సంగీత కార్యక్రమం లో పాల్గొనడం
-
1974 (భర్త రాజా వారి మరణం)
-
1975 నటి విజయనిర్మల ప్రోద్బలంతో ఆమె దర్శకత్వంలో వచ్చిన 'సంఘం చెక్కిన శిల్పాలు ' లో మళ్ళీ పాడారు
-
1995 అప్పటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్.టి.ఆర్ చెప్పగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు
-
2003 ఘనంగా 75 సంవత్సరాల జన్మదినోత్సవం
ఇవన్నీ కంపెల్ల రవి చంద్రన్ సంపుటీకరించిన ఆమె 'జ్ఞాపకాలు '. మనం మరిచిపోరాని విశేషాలు.
ఆమె వల్ల లలిత గీతాలు సినిమా పాటలతో దీటుగా నిలబడ్డాయి. లలిత గీతాలు నేర్పేందుకు తాను సిద్ధమనీ, ప్రభుత్వం సాయపడాలని ఆమె తరచూ గుర్తుచేస్తున్నారు. కళల గురించీ, కళాకారుల గురించి ఆలోచించే రాజకీయ వాతావరణం ఇప్పట్లో లేదు, రాదు కూడా. దిక్కూ మొక్కూ, మాటా పలుకూ లేకుండా పోయిన తెలుగు సినిమా పాట పక్కన లలిత గీతం నిలబడగలిగితే అంతకన్నా 'మ్యూజిక్ థెరపీ ' ఏముంటుందీ? చెవుల్లో రొదలు వింటూ గుండె దడలు పెంచుకునే యువతకి జిమ్ము థెరపీ కావాలి గానీ 'ఇది నిజమ్ము' అంటే వినే ఓపిక ఉందా? అన్నా - లాంటి వారు యువతను మేల్కొల్పుతారు. అలాంటి క్రాంతి తెలుగు నాట అన్ని రంగాల్లోనూ అవసరమిప్పుడు.
ఆమె ఎటువంటి రాజకీయం జోలికి పోకుండా, ఎవరినీ నిందించకుండా జీవిస్తున్న ఒక మధుర గాయని. ఒక బాలికగా సినిమాల్లో నటించింది. లేలేత గొంతుతో అద్భుతంగా పాడింది. ఒక అమాయక పెళ్లికూతురిగా మారింది. ఒక ఆదర్శ గృహిణిగా నిలిచింది. ఇప్పుడామెకి 83 ఏళ్ళు.
ఆమె పుట్టిన తేదీ 28 , పుట్టిన సంవత్సరం కూడా 28 (1928) యే. అందుకేనేమో ఆమె పాట అనే మాట కోసం పుట్టి ఇటు సినిమాల్లోనూ, అటు రేడియో లోనూ రెండు చోట్లా 'అల్లారు ముద్దు' తెలుగు మాటలు వల్లెవేసిన 'బాల', తెలుగు నేలను వెలసిన 'సరస్వతీ దేవి'. మెట్టినిల్లు ఆమెను 'రావు ' అంది. ఇక పాటలు రావు అని ప్రతి తెలుగు గుండె తల్లడిల్లింది. చాలు- ఆమె అందించిన ఆ అమృత భాండం, వెల లేనిది, విలువ కట్టలేనిది. ఆమె సంక్షిప్తంగా రా.బా.స అయినా ఎప్పుడూ రభస చెయ్యని ఉత్తమ బాల, ఉత్తమ గాన సరస్వతి, ఉత్తమ దేవి. ఆమె గలగలా నవ్వేస్తూ ఉంటే మనమూ ఆమె ఆపాత ఆ పాత గానాన్ని వింటూ, అప్పుడప్పుడూ టీవీల్లో పలకరిస్తూ పాడుతుంటే చూస్తూ ఆమెను అభిమానిస్తూనే ఉందాం.
ఆమె పుట్టిన బాపట్ల, పెరిగిన మద్రాస్, తిరిగిన మైసూర్, బెంగళూరు, స్థిరపడిన హైదరాబాద్ అన్నీ ఆమె గళాన్ని ఆస్వాదించి దేశావిదేశాలకి ఆ సువాసనలు వెదజల్లేలా తోడ్పడ్డాయి.
ఆమె ఒక గాయనిగా ఎదిగేందుకు తండ్రి ప్రోత్సాహమే ఎక్కువ. సొంత థియేటర్ నడుపుతూనే సంగీతం లో నిష్ణాతుడు కావడం అరుదైన విషయం. సినిమాలో సంగీతం బావుండకపోతే ప్రదర్శన ఆపేసి నాటక సమాజం వారి చేత పద్య నాటకాలాడించే వింత సంగీతాభిమాని ఆయన. ఆ రకంగా వ్యాపార విపర్య సిద్ధాంతాలు పాటించి దెబ్బతిన్నా 'సంగీతం' విడవని మహానుభావుడు. ఆ అభిమానమే సరస్వతికి ఆత్మ విశ్వాసం నేర్పింది. లేకపోతె చిన్ననాడు కపిలవాయి రామనాథ శాస్త్రి అంతటి మహోన్నత నటుడి ఎదుటే 'ఆ పద్యాలు నాకొచ్చు' అని తల్లితో అంటుంటే అవి విన్న ఆయన చిన్నారి సరస్వతిని ఎత్తుకునీ స్టేజి మీద పాడించడమా?
రేసు గుర్రాల వీక్షణం ఆమెకు ఇష్టం. అలా రాజా వారు అదే రేసు కోర్సుకొచ్చి ఆమెను చేసుకోవాలని ముచ్చట పడ్డారు. చిన్నతనంతో అమ్మ మాటకి విలువిచ్చి రాజా వారిని పెళ్లి చేసుకున్నారామె. వేటూరి వారు 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అని ఒక పాట రాసారే- ఆ పాటని 'ఆ రేసు కు పోయి పారేసుకున్నాను' అనవచ్చు. పాడే అవకాశం పారేసుకోవడం- ఎంత కఠిన శిక్ష ఏ కళా కారుడి కైనా, కళా కారిణి కైనా.
ఇవన్నీ ముందు తరాలకు పాఠాలు. మంచితనం, అమాయకత్వం - వీటికి 'రక్షణ' ఉండాలి. జాణతనంతో నెట్టుకు రావొచ్చు కాని అది జాతి ఎంతోసేపు హర్షించనిది.
'వెన్నముద్దలు తిన్నంత మెత్తగా పాడుతున్నారు మీరు' - ఇది డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ వారు అలనాడు ఆమె కిచ్చిన కితాబు. చిరు నవ్వు, కోమల గానం ఇప్పటికీ ఆమె జవాబు.
(కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, ఆహా ఆహాహా --- ఇవన్నీ రావు బాల సరస్వతీదేవిని చూపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి) (అభిప్రాయాలు చెప్పడంలో ఎందరికో ఎందుకో మొగమాటం! మా రాతల మీద అభిప్రాయలు మాకు ఉబలాటం)
- డా. తాతిరాజు వేణుగోపాల్ , 28 ఆగస్ట్ 2011