Krishnaprema Logo

కృష్ణప్రేమ

The MAP of Cricket - లేదా క్రికెట్ ‘పుండరీకాక్షుడు'

25 సెప్టెంబర్, 2011

The MAP of Cricket - లేదా  క్రికెట్ ‘పుండరీకాక్షుడు'

Picture

పటౌడి లేరు.

క్రికెట్ ఉంది, ఉంటుంది.

క్రికెట్ జ్ఞాపకాల దొంతర్లలో పటౌడి ఆత్మ ఉంది.

దేశంలో చూపులేని ఎవరో ఒకరికి అతని కన్ను దన్నుగా ఉండనుంది.

ఇరవైవ ఏటనే ఒక కన్ను కోల్పోయిన పటౌడి బెంబేలెత్తి పోలేదు. క్రికెట్ మైదానం విడిచి పారిపోలేదు.

ఆత్మ విశ్వాశం అంత గొప్పది.

మొన్నటికి మొన్న మరణిస్తూ కూడా ఆయన మేలుకోరాడు.

తన రెండో కన్ను ఎవరికైనా పనికి రాక పోదా అని అనుకున్నాడు.

జీవితాంతం నేత్ర దానం మీదనే ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిన వాడు తన వంతు కర్తవ్యం కూడా నెరవేర్చాడు.

క్రికెట్ ఫీల్డ్ మీద ‘టైగర్' అనిపించుకున్నాడు. అంటే ‘పులి' అన్న మాట.

అందుకే ఆయన్ని**‘పుండరీకాక్షుడు'** అంటున్నాను.

పుండరీకాక్షుడంటే విష్ణువే. విష్ణువంటే ‘స్థితి' కారుడు కదా. అసలు పటౌడి పుట్టినది ‘హరి 'యాణ లోనే కదా. అంతెందుకు ఒక అష్టావధాని గారికి క్రికెట్టు, వాలీ బాలు, టెన్నిస్ వంటి పదాలిచ్చి రామాయణ ఘట్టం చెప్పమంటే ఆయన 'క్రికెట్టు' ని ఎంత సమంజసంగా 'చక్రి కెట్టు ల' అని విరిచాడో తెలుసా. చక్రి అంటే విష్ణువే. హరికీ, క్రికెట్ కీ ఏదో సంబంధముంది కాబోలు.

క్రికెట్ కి ఒక ఉన్నత ‘స్థితి' కల్పించిన వాడు పటౌడి.

బ్యాటూ, బంతీ, వికెట్లు, పరుగులు – ఈ నాలుగు స్తంభాల ఆట క్రికెట్.

ఆ స్తంభాల మూల స్తంభం పటౌడి.

పటౌడి ని క్రికెట్ MAP అంటున్నాను. M ansur A li khan P ataudi కి సంక్షిప్త రూపమేమో అని అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఆ చిత్ర పటం సాయంతో క్రికెట్ ఉనికి, దిక్కులూ,ఎల్లలూ తెలిసాయేమో.

అల్లా కావొచ్చు, ముక్కంటి కావొచ్చు, జీసస్ కావొచ్చు వారి చల్లని చూపు కోసమే జీవితాంతం మనిషి బతికేది. ఆ చూపు దీపమే మనల్ని నడిపిస్తూ రక్షిస్తోందని మన విశ్వాసం.


కాని మనుషుల్లో ఎందరికో కళ్ళిచ్చి కొందరికే ఎందుకు అవి లేకుండా చేస్తుంది విధి?

పాపం రోడ్డు కిటు వైపు నుంచి అటు వెళ్ళలేక ఎవరైనా 'చేయూత' ఇస్తారేమో అని బస్టాండ్ దగ్గర ఎదురు చూసే బధిరులకి నిజంగా ఎంతమంది కళ్ళున్న వారు సాయ పడుతున్నారు? ‘అమ్మో మాకంత టైం లేదు' అని తప్పించుకునేవారే. ఒక్కసారి వాళ్ళ చేయి పట్టుకుని ఈవల నుంచి ఆవలకి దాటించి చూడండి. కనపడని దేవుడి ఆశీస్సులుంటాయి.

‘చూపులు కలసిన శుభవేళ' గా ప్రేమికులు పొంగిపోవడం పాట వరకే బావుంటుంది. ఒకసారి బస్సులో దంపతుల్ని చూసాను. ఇద్దరికీ చూపులేదని తెలుస్తోంది. సరిగ్గా వాళ్ళు దిగాల్సిన స్టాప్ లో కండక్టర్ గుర్తు చెయ్యక ముందే లేచి నిలబడి ఎవ్వరి సాయం లేకుండా ఒకరి చేయి మరొకరికి ఆసరాగా చేసుకునీ దిగారు. ఆ దృశ్యం కొందరి కళ్ళని మాత్రమే చెమర్చింది. ‘సాథీ హాత్ బడానా ‘ పాట పల్లవి ఎంత గొప్పది.

‘ఎన్నెన్ని వొంపులు ఎన్నెన్ని సొంపులు – నాకున్నవేమో రెండే కనులు - ఎలా చూసేది ఏది చూసేది?' హీరోది సందేహాల గొలుసు ప్రశ్న. ‘చాలకుంటే కావాలంటే నావి కూడ తీసుకో తనివి తీరా చూసుకో ' అన్నది హీరోయిన్ పెళుసు జవాబు.

హౌరా? కళ్ళ ప్రయోజనం ఇంతేనా? ఇది రాసిన కవి ఆత్రేయే! హతోస్మి. అది డబ్భైల కాలం.

నీ కనులలోకాంతి కరిగిపోవక ముందే - సృష్టిలో అందాలు అనుభవించాలి- అందాలలో హరి దాగి ఉంటాడు ' అని ఒక లలిత తత్వ గీతం ఎం ఎస్ రామారావు గారు రేడియోలో పాడగా వినే ఉంటారు. ఇక్కడా కళ్ళ ప్రయోజనం పెద్దగా కనిపించదు. అందాల వరకేనా కళ్ళ హద్దు?

కాని ఆచార్య ఆత్రేయ గారు మాత్రం అరవైల కాలంలో కళ్ళు లేని వారి, కళ్ళున్న వారి ‘మంచి మనసులు ' అర్ధం చేసుకునీ రెండు చక్కని పాటలు రాసారు. వాటిని ఆదుర్తి సుబ్బారావు అంత చక్కగానూ సినిమాలో చూపించారు.

కంటి చూపు లేని ఆమె చిన్నతనం నుండి విన్నది ఒక్కటే- పావురాలు సందేశాలు తీసుకు వెళతాయని. పావురం చేసే చిన్న ధ్వని తో అది పావురమా కాదా అని కళ్ళు మూసుకున్నా చెప్పేయ వచ్చు. అలాంటి ఒక పావురంతో ఆమె ఏమని విన్నవించుకుందీ?

ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా ' అని ముందు పొగడింది. పావురం ఇంక ఆమె వశమే కదా. (ఈ టెక్నిక్కృష్ణశాస్త్రి గారిది. ఆయన మల్లీశ్వరి లో ‘ఎందుకే నీకింత తొందర ' అని చిలుక ముందు ‘ఓ చిలుక ! నా చిలుక ! నా రామ చిలుక! , ఒయ్యారి చిలుక ! గారాల మొలక' అని అన్ని రకాల అభిశంసలు వ్యక్తం చేశారు)

‘మా వారి అందాలు నీవైనా తెలుపుమా' అంది. తనవాడు అందగాడు అని చెప్పకుండా పావురాన్ని వయ్యారిగా పిలుస్తూ పావురానికి పని పెట్టింది.

‘మనసు మధురమైనది' అంది. మనసు కంటికి కనిపించదు కనుక, అది హృదయానికి సంబంధించిన అంతర్ సౌందర్యం కనుక.

‘సొగసు నే నేరుగనిది' అంది. అది బాహ్య సౌందర్యం కనుక, తాను చూడలేదు కనుక.

‘అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా?'- ఎంత చోద్యం! పావురం కళ్ళు అరువుగా అడుగుతోంది. పని కాగానే ఇచ్చేస్తా అనే అమాయకత్వం ఆమెది. అదీ ‘కరుణతో ' ఇమ్మంటోంది. తప్పదా అని విసుక్కోవద్దనేగా?

‘కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారిని'- అంటే మళ్ళీ కళ్ళు వాపస్ చేసేయాలి కాబట్టి ‘కరువుతీరా ' చూసేస్తుందట.

ఇంకా ఏవేవో విన్నవి చెబుతూ ‘అందరు అందురే – అంత అందమైనవారా?' అని పావురాన్ని ప్రశ్నిస్తోంది.

ఎక్కడ అందం ఉంటుందో అక్కడ ‘దిష్టి' తగలడం సహజం అని ఒక నమ్మకం. తనకీ ఆ నమ్మకం ఉంది. అందరి కళ్ళూ అతని మీదనే ఉన్నాయని విందట. ‘అన్నది నిజమేనా? అల్లిన కథలేనా?' ఏమో నాకు భయంగా ఉంది , ‘కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా!' – ఇది ముక్తాయింపు. కన్నులున్న – అనడంలో కళ్ళుండీ వాక్సుద్ధి లేని వారికంటే నోరు లేక పోయినా మంచి కళ్ళున్న నువ్వే చూసి ఉన్న మాట మౌనంగా చెప్పగలవు- అని ఆ పావురాన్ని నమ్ముకుంటోంది ఆమె. (కనులు చూసినా పాటే – లో చూస్తూ వినండి ఈ పాట, కనులు చదివినా పాటే - లో చదువుకోవచ్చు కూడా).

పెళ్ళైన దంపతులకి తేనె చంద్రుడి యాత్ర అనే తంతు ఉంది. బాగా డబ్బున్న ఇండియా వాళ్ళు దుబారాగా ఖర్చు చేసేందుకు దుబాయి వెళ్ళొచ్చు. ఏమీ లేని వాళ్ళు ఏడు కొండల వాణ్ని మెట్లెక్కి చూసి రావొచ్చు. ఈ హీరో మాత్రం శిలలూ శిల్పాలు చూపాలనుకుంటాడు తాను తాళి కట్టిన ఈమెకి. వాటిని పాట రూపంలో చెప్పాలంటే మళ్ళీ ఆత్రేయ గారే చెప్పాలి.

కృష్ణదేవరాయలు ఎంత మంచి పని చేసారో చూడమంటాడు. ‘కనుచూపు కరువైన వారికైనా –కనిపించి కనువిందు కలిగించు రీతిగా' ఆయన శిల్పుల చేత శిల్పాలు చెక్కించాడని సంతోషిస్తాడు. అయితే- ఆ శిల్పాల తీరును అభివర్ణిస్తూ ఉంటే చూపులేని ఆమె ‘అయ్యో నాకు ఆ అవకాశం లేదే' అని లోలోపల బాధపడుతోందని గ్రహించి ‘కనులు లేవని నీవు కలత పడవలదు – నా కనులు నీవిగా చేసికొని చూడు' అంటాడు. ఈ ‘transformation' ఎలా సాధ్యం. అది భౌతిక శాస్త్రానికి చెందినది కాదు. ‘meta physics' కి చెందినది. ఆ శిలలు శిల్పాలుగా మారిపోయి కనువిందు చేస్తున్నట్లే ఆమె రూపం కూడా శిల్పాల వలె తన హృదయం నుంచి చెదరదని అతను ఆమెకి ‘భరోసా ' ఇస్తున్నాడు.

అదీ కళ్ళ ప్రయోజనం.( కనులు చూసినా పాటే –లో చూస్తూ వినండి ఆ పాట).

‘నీ వుంటే వేరే కనులెందుకు' అని తన స్నేహితుణ్ణి చూపు కరువైన వాడు సముదాయిస్తాడని మరో కవి అద్భుతంగా ఊహించగలిగేడు. (కనులు మూసినా పాటే – భండాగారంలో ఈ పాట ఉంటుంది. మరోసారి వినండి).

ఆసరా ' విలువ అంత గొప్పది.

ఒక దీపం పది దీపాలు వెలిగించినట్టే – ఒక కన్ను మరొకరికి వెలుగివ్వగలదు.

ఒకనాటి నలుపు-తెలుపు ‘దోస్తీ ' చిత్రం (అదే బాపు గారు ‘స్నేహం 'అని చాలా ఏళ్ళ తరువాత తీశారు) దేవుడు కరుణించని పురుషులకి ఆసరా ఎలా ఇవ్వాలో చూపించింది. ‘అనురాగ్ ' చిత్రం రంగుల లోకం మనకి చూపిస్తూ దేవుడు కరుణించని స్త్రీలకి ఆసరా ఎలా ఇవ్వాలో చూపించింది. ‘అనురాగ్ ' లోని రెండు పాటలు ‘కనులు చూసినా పాటే ' లో చూస్తూ వినండి. హిందీ వరసను తెలుగులోకి తీసుకున్నా తెలుగు పాటలోనూ స్వర జానకి ఎంత ఆర్ద్రంగా పాడారో కదా! (కనులు మూసినా పాట లో వినండి). అంతకుముందు అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో కళ్ళు పోగుట్టుకున్న డాక్టర్ నిస్సహాయ స్థితి కి ఓదార్పుగా పాడిన జోల పాట తెలుగు మొదటి 'ఆరాధన ' చిత్రంలో వచ్చింది. శ్రీశ్రీ కలమది (కనులు మూసినా పాటే లో వినండి).

ఈ రంగులు ఆనని కళ్ళ ఆవేదన మీద నేనూ ఒకనాడు ( 1987) పాట రాశాను. అయితే గత సంవత్సరం జులై నెలలో స్వర జానకి గారు పుణే వచ్చిన సందర్భం లో ఆ పాటల సంకలనం ఆమె ముందుంచి random గా తెరిచి ఓ పేజీ మీద మీ సంతకం చేయండి అని కోరాను. ఆమె ఓ పేజీ తెరిచి చేవ్రాలు చేశారు. చిత్రంగా ఆ పేజీలో ఉన్నది ఈ పాటే. ఆ పేజీ నకలుఇక్కడే చూసే చదువుకోవచ్చు.

సాటి మనిషి నుంచి మరో సాటి మనిషి కోరుకునేవి మూడక్షరాలే- A,B,C అండీ**** - అంటే సరా, రోసా, చే యూత.

ముక్తాయింపు:

పటౌడిభారత రత్న ' కావాలి, తన కంటి ప్రకాశాన్ని మరొకరికి అందించిన ఆ ‘భా 'రత్న ఆటగాడు ఎప్పటికీ ‘not out ' from the hearts of people.

-డా. తాతిరాజు వేణుగోపాల్,25సెప్టెంబర్****2011