సినీవాలి చీకట్లో వెడలెను కోదండపాణి
05 ఏప్రిల్, 2012

సినీవాలి చీకట్లో వెడలెను కోదండపాణి
click to zoom
‘శ్రీరామ నామాలు శతకోటి' –
అబ్బే! అన్ని ఉండవండీ. అది కవి ఆరుద్ర అతిశయోక్తి. నిజానికి విష్ణువుకైనా ‘సహస్ర (వేయి) నామాలే కనుక ఆ శ్రీహరి అంశమైన శ్రీరాముడి నామాలు వేయి ఉండవచ్చు. అందుకే ఆ ఆజానుబాహు రూపాన్ని చూడ వేయి కన్నులు చాలవు.
ఆ శ్రీరాముని మరో పేరు కోదండపాణి.
శ్రీరామ నవమి నాటి వెన్నెల మెల్ల మెల్లగా పెరుగుతూ పున్నమి రాబోతోంది.
ఏదైనా ముందు ముందు అయోధ్యలో కాయబోయే వెన్నెల కోసం అడవిదారుల అమావాస్య చీకటిని భరించడానికి ఆనాడు ‘వెడలెను కోదండపాణి'.
అది త్రేతాయుగం. ఇది కలి యుగం.
సినీ విపణి - సంగీతపాణి
ఇప్పుడు చెప్పబోయేది ఆజానుబాహుడు అయిన రాముడి గురించి కాదు. పొట్టివాడు, అయినా రాముడి లాంటి పేరున్న గట్టివాడు కోదండపాణి అనే పేరున్నవాడి గురించే. ఆ గట్టివాడి పాట వినడానికి వేయి చెవులు చాలవు. నిజమని నమ్మలేని వాళ్ళు పూర్తి పాఠం చదవాల్సిందే. నమ్మేవాళ్ళు చదవకుండా వెళ్ళిపోకండి, పాటలు విందామన్న హడావుడిలో.
ఏప్రిల్ 5, 1974 – ఉండేదే, ఆ రోజు విధి రమ్మని పిలవగానే ‘వెడలెను (మన) కోదండపాణి '. సినిమా ప్రపంచానికి ఆనాడు ‘సినీవాలి' (అమావాస్యకా పేరుంది)!
హార్మోనియం మీద పది వేళ్ళ పట్టు ఉన్నా ఆరోగ్యం మీద పట్టు తప్పి ముగిసిపోయిన నాలుగు పదుల వయసు ఆయనిది. అప్పటికి ఆయనకున్న కూతుళ్లతో పాటు కొడుకుఈశ్వర్ కూడ చిన్నవారే.
మదన్ మోహన్ సంగీత రహస్యాలు ఇష్టపడే ఈ మదన మోహనుడు ( ఎప్పుడూ టిప్ టాప్ గా డ్రస్సై రికార్డింగ్ థియేటర్ కొచ్చేవారట ** కోదండపాణి**) అతనిలాగానే ‘తొందరపడి' చిన్న వయసులోనే వెళ్ళిపోయినవాడు.
లత ‘మీరా భజనలు' అమితంగా ఇష్టపడి ఆలపించే పాణి, సుశీలమ్మ ను “ ‘మీరా'మెలాగ పాడేట్టు తీర్చి దిద్దుతాను” అని అన్న మాట నిలబెట్టుకున్న వాడు.
‘మనసే అందాల బృందావనం'
‘ఇది మల్లెల వేళయనీ' ‘పూలు పూచెను నా కోసం'
‘మనసా కవ్వించకే నన్నిలా'
‘బొట్టూ కాటుక పెట్టుకొని' ‘ఎన్నడు చూడని అందాలు'
‘చెలియా సఖియా ఏమే ఈ వేళ' ‘కమ్మని కలలా కనిపించాడే'
‘అవునే తానె నన్నేనే'
‘శృతి చేసి నా వీణ, స్వామీ' ‘నీవే నీవే నా దైవము' ‘రావేలా జాగేలా' ‘ఇంతమాత్రమెరుగవా కన్నయ్యా' ‘పిల్లన గ్రోవిగ మారితిరా'
‘ఈ వీణ పైన పలికిన రాగం' ..'పాడమని పాట వినే' ..
సుశీలమ్మ పాటల పల్లవులన్ని కలిపి సునాయాసంగా కథ చెప్పవచ్చు.
మరిజానకమ్మ వచ్చి ‘నా సంగతేమిటి పాణి గారూ' అని అనక ముందే ‘ నా సంగతులు నీ గళాన చక్కా పలుకుతాయి' అని ఆయన కొన్ని పాటలు కూర్చి పెట్టారు, అవి ఇలా కథగా చెప్పవచ్చు. అదన్న మాట సంగతి!
‘రారారా అంది వెన్నెల, కూ కూ కూ అంది కోయిల' ‘ రావోయీ – నా రాజువు నీవేనోయి', ‘వెన్నెల్లో కనుగీటే తారక' ‘ఏమనుకున్నా ఏముందీ?' ‘ ఒకసారి కలలోకి రావయ్యా' ‘భళారే ధీరుడవీవేరా' ‘కోడెకారు చినవాడా' ‘కొంగున కట్టేసుకోనా' ‘చూపులు కలసిన నాడే' ‘పువ్వులు పూయును పదివేలు' !
‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' ఘంటసాల మాస్టారు ఉండగలరని పాణి కి తెలుసు. ఆయన తరువాతి కాలం సంగతో? అదికూడాశ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి కి తెలుసు. తన హార్మోనియం తన కోదండంగా భావించి కొత్త గొంతు అన్వేషణ కోసం ‘వెడలెను కోదండపాణి '. దొరికెను సుబ్రమణి ( వెడలెను కోదండపాణి- త్యాగయ్య వారి కీర్తన అనుకరిస్తూ, అనుసరిస్తూ నే రాసిన రాతలు పాట = తిరుగు టపా లో చదవండి) .
సినిమా అంటే బొమ్మలాట. కదిలే బొమ్మలు మనల్ని కదలకుండా కూర్చోమంటాయి.
'బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక'(దేవత , 1965 ) అని ఘంటసాల మాస్టారు ఆర్ద్రంగా పాడగానే ఆ బొమ్మ గానానికి స్వర ప్రాణం పోసిన మహానుభావుడెవరా! అని ఆశ్చర్య పోని వారు ఆనాడు లేరట.
మళ్ళీ చాల ఏళ్ళకు 'ఇదిగో దేవుడు చేసిన బొమ్మ,ఇది నిలిచేదేమో మూడు రోజులు' (పండంటి కాపురం ,1972) అనే చిటికెడు వేదాంతాన్ని ఆలపించిన గాయకుడు ఆ మహానుభావుడే అని తెలియగానే ఈ బొమ్మల రహస్యం ఏమిటా అని ఆశ్చర్య పోవడం జరిగిందట.
ఈ గొంతెక్కడో విన్నట్టుందే అని సందేహ పడుతున్నవారు లోగడ 'సంతానం**'** సినిమాలో 'సంతోష మేలా సంగీత మేలా?' అని జమునారాణి గళంతో జత కలిపిన 'కోదండపాణి' గొంతే ఇది అని తెలుసుకున్నాక 'ఆ -- అదే అనుకున్నాం--' అని బుకాయించారట. అప్పటినుంచి పాణి ని మరింత స్పీడ్ గా ‘బుక్' చెయ్యడం మొదలెట్టారు. అంతలోనే పాణి అంతే వేగంగా బొమ్మదేవుడి పిలుపొచ్చి వెళ్ళిపోయారు.
పాణి కి చిత్రంగా కీలుబొమ్మలు , ఆటబొమ్మలు సినిమాలు కూడా దక్కాయి. ఆటబొమ్మలు చిత్రం పోస్టర్ లో ఎస్.వి.ఆర్**** బొమ్మ బావుంటుంది. తొలిసారిగా నంది బహుమతులు ప్రకటించిన 1964 లో ‘కీలుబొమ్మలు ' చిత్రానికి వెండి నంది (ద్వితీయ బహుమతి) దక్కింది. కీలుబొమ్మలు -లో నాయకి జమునే అయినా 'బొట్టూ కాటుక పెట్టుకునీ' పాట మాత్రం జమున ని ఆట పట్టిస్తూ వాసంతి పాడుతుంది. ఈ నిజం తెలియక చాలా మంది నటి జమున పాటల ఆడియో క్యాసెట్/ సీడీ చూసి అయ్యో ఆ పాట లేదే అని నిరుత్సాహ పడి ఉంటారు.
కోదండ**పాణి** కి ఇలా బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం అన్నట్టు ఇప్పటి ఎంపీ త్రీ పాటల వెతుకులాటలో సంగీతం: కోదండపాణి , చిత్రం: బొమ్మలు చెప్పిన కథ అనే తప్పుడు సమాచారం దొరుకుతోంది. ఈ కథకి మాస్టర్ వేణు**** సంగీతమందించారు.**** అయితే వేణు దగ్గరపాణి ప్రత్యేక**** హార్మోనియం కదలికలు**** నేర్చుకున్నారు కనుక ఇదీ ఒక రకంగా మంచిదే. పాణి కి గురువులెందరో అయినా తన బాణీ అనేది, తన ముద్ర అనేది ‘అనితర సాధ్యం' అనేలా చూపించి ‘గురువును మించిన శిష్యుడు' అనడం కాకుండా ‘గురువులు మెచ్చిన శిష్యుడు' అని అనిపించుకున్నారు.
విపణిలో కొత్త బోణీ - కోదండ బాణీ****
'కోదండపాణి వెంటనే మరచి పోవు ఎన్నో చిత్రములకు మంచి పాటలే చేసిననూ ఒక్క****దేవత**(**1965) చిత్రంలో పాటలకే జ్ఞాపకం ఉండగలరు' అని పాత్రికేయులు వి.ఎ .కె రంగారావు గారు 1975 నాటి విజయచిత్ర లో అన్నారంటే అది నిజమే. అలాగని ఒక్క దేవత తోనే ముగించేయడమూ సబబు కాదు. పాణి ప్రత్యేకత ఎక్కువగా జాన పద చిత్రాల తోనే పార దర్శక మైంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఆయన చేసిన ప్రతి ఒక్క జానపద చిత్రంలోని పాటలు ఎందరికో కనిపించని చెవి సెల్లుల్లో రింగుమన్న టోనులే. అంతెందుకూ సాధిస్తే నేడూ సెల్ రింగ్ టోనులుగా ఆ పల్లవుల ప్రారంభ సంగీత 'ధుని' లో మునిగి తేలి 'ధ్వని' గా మలచుకోవచ్చేమో?
లే లే లేత వయసు గల చినదానా, చుక్కలన్ని చూస్తున్నాయి,చిరు చిరు చిరు చిరు నవ్వులూ, కొంగున కట్టేసుకోనా ఓ రాజా రాజా రాజా, ఏ ఊరూ మీ పయనం చక్కని మగరాయా, ఏ ఊరు ఎవరు మీ వారు కొనుమా అందాల రాణీ జోహారు, ఓ --విశాల గగనములో చందమామా, ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈ వేళా, చెలీ నీ కోరిక గులాబీ మాలిక, రా వెన్నెల దొరా కన్నియను చేర, అమ్మమ్మమ్మమ్మమో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే, ఇదియే అందాల మానవ సీమ , ఒహోహో ఓ జవరాల నా సుమబాలా, మనసులోని మౌన వీణ మధుర గీతం పాడనీ, ఒకసారి కలలోకి రావయ్యా, కోటలోని మొనగాడా వేటకు వచ్చావా, ఎంత బాగున్నదీ--అందరాని చందమామ, చూడకూ చూడకూ మరీ అంతగా, మరదలా చిట్టి మరదలా- ఇలా 'ఉదాహరిస్తే ఎన్నో యుగళ గీతాలు నాడే వైవిధ్యమైన స్పీడ్ తో 'ఆహా' అనిపించేలా మాధుర్యం మూటకట్టి ఇచ్చారు పాణి.
ఇవన్నీ వినగానే ఎవరనగలరు అతను కోదండపాణి యనీ, అతని బాణీ రూటే వేరు కనుక**'కోదండ బాణీ'** అని ఆంధ్ర లోకం అనుకోవాలి గానీ (తమిళనాట ఎలాగూ ప,బ లు ఒకటే కనుక అక్కడ అప్పటికే అలా పిలిచేవారు ఆయన్ని. తెలుగువారి తెలివిని తేటతెల్లం చేసి చూపించేది తమిళులే. సుబ్రహ్మణ్యం గారిని పద్మభూషణుడు చేసినది వారే కదా).
రామాయణం అంతా విని రాముడి కథ చెప్పవూ అన్నట్టుంది, చెబుతా పాణి కథ
చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే**........**
గుప్పెడు ఆశతో గుంటూరు నుంచి మద్రాసు వచ్చి నందుకు,
గీతా హోటలే తన గీతాల నెలవుగా మార్చుకున్నందుకు,
గొంతులో గానాన్ని, చేతిలో హార్మోనియం వాయిద్యాన్ని నమ్ముకున్నందుకు,
చతికిల బడక నిలకడగా నిలిచి నందుకు,
అదృష్టవశాత్తు అప్పుడే వచ్చి చారి గారు విన్నందుకు,
పాణి పాడే పద్ధతి నచ్చి, ఉన్న పళాన లాక్కు పోయి నాగయ్య గారి 'నా ఇల్లు' చిత్రం పాటల హడావుడిలో ఉన్న అద్దేపల్లి రామారావు గారికి పరిచయం చేసినందుకు,
తొలి అనుభవం 'చూద్దాం' అనే మాటే తారక మంత్రంగా పాణి మలచుకున్నందుకు,
కోరస్ గాయకుడిగా పాణి కి కొద్ది పాటి చోటు దొరికినందుకు,
మహాను భావులు సుసర్ల దక్షిణా మూర్తి , మాస్టర్ వేణు , అశ్వత్థామ , కె. వి మహదేవన్ గార్లకి సంగీత సహకారం అందించినందుకు,
తెలుగు సినీ కళామతల్లి 1961 లో**'కన్న కొడుకు'** ను పాణి చేతుల్లో పెట్టింది.
1962 లో నటుడు జగ్గయ్య సొంత చిత్రం తలపెట్టి 'పదండి ముందుకు' అని పాణి భుజం తట్టారు. తన రెండవ చిత్రం నిజంగానే రష్యా వరకు వెళ్ళేలా ముందుకు నడిపించినందుకు పాణి గర్వించారు.
1963 లో- అంతగా ఇప్పటి తరానికి తెలియని- జి.కె.మూర్తి 'ఏడేడు జన్మల నుండి పడి ఉందీ బ్రహ్మ ముడి' అని పాట రాస్తే కొత్త తరహాలో ట్యూన్ కట్టి 'గురువును మించిన శిష్యుడు' అనిపించుకున్నారు పాణి. అప్పటికే హాస్య నటుడు పద్మనాభం , వల్లం వారి రేఖా-మురళి నాటక కంపెనీకి శాశ్వత స్వర కర్త పాణి యే. తరువాత పద్మనాభం సమర్పించిన 'దేవత ' తో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి - బొమ్మను చేసి ప్రాణము పోసి పాణి తన ప్రత్యేకతను చూపగలిగేరు. పద్మనాభం 'పొట్టి ప్లీడర్ ' సినిమా తీసి శ్రీశ్రీ గారి చేత 'చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే -ఎపుడో ఒక సారి ఏదో ఒక దారి దొరుకునులే బాటసారి ' అని రాయించుకోవడం మంచిదే అయింది. పాణి పట్ల అది నిజమైంది.
అయినవారు నా వాళ్ళని అనుకోవలెనోయ్**......**
'చీకటి విచ్చునులే' పాటలో ఒక చోట ఈ మాట వినిపిస్తుంది. అలాగే పాణి అనుకున్నారు కూడా. ఒక పక్క ఘంటసాల యుగం నడుస్తూ ఉన్నా మరో కొత్త గాయకుడి యుగం ఎప్పటికైనా రాక తప్పదనీ భవిష్యద్దర్శనం చేసిన కోదండపాణి ఒక యుగ సంధికి నాంది పలికినట్టయింది .
1966 లోనే సినీ సంగీత నందన వనంలో ఒక కొత్త 'పిల్ల గాలి'కి చోటు కల్పించారు కోదండపాణి. అప్పటి ఆ పిల్ల గాలి పొడుగు పేరు 'యస్పీ బాలసుబ్రహ్మణ్యం '. అదే పేరు ఇన్నేళ్ళ ఆత్మీయత వల్ల ' బాలు ' గా మారింది అభిమానుల నోట. పద్మనాభం సమర్పించిన ' శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ' సినిమా పేరులోనే మూడు శ్రీలు ఉన్నట్టే ఏకంగా ముగ్గురు ఉద్దండుల (సుశీల , పి బి శ్రీనివాస్ ,ఈల పాట రఘు రామయ్య)తో కలసి పాడే అవకాశం నాడు బాలు గారికి దక్కింది. బయట స్టేజి మీద కల్యాణి రాగంలో పాడి బహుమతి గెల్చుకున్న బాలు కి తొలి సినిమా పాట చరణం కూడా కల్యాణి రాగంలోనే ('రావే కావ్య**సుమబాలా**జవరాలా**** ' -ఏమి ఈ వింత మొహం -పాటలో) స్వర పరిచి పాడించారు పాణి. అదే చిత్రంలో 'విశ్వముకంటే విపులమైనది ఏది' అనే పద్య గేయం బాలు , సుశీల పాడారు. ఇవాల్టి వీడియోల్లో ఈ పాట అదృశ్యం కావడం తెలుగువారి దృష్టిలోపం. తెలుగు వారికి పాత వీడియోలు నచ్చక పోవడం సృష్టి లోపం.
సాఫీగా సాగే తెలుగు పాట ఒకటి **రఫీ ** నోట తొలిసారిగా 1962 లోనే ( స్వయంగా బొంబాయి వెళ్ళి) పాడించి ఆయన్ని తెలుగు చిత్ర సీమలో 'పదండి ముందుకు ' అని భుజం తట్టగలిగిన సమర్ధుడు కోదండపాణి. దురదృష్టం ఏమిటంటే పెద్ద హీరో భలే తమ్ముడు ,ఆరాధన వంటి చిత్రాల్లో రఫీ చేత పాడించడం వల్ల అవే రఫీ తొలి తెలుగు సినిమాలుగా చరిత్ర కెక్కేసాయి. ఈ పదండి ముందుకు –రఫీ తెలుగు పాట దొరికితే పద్మనాభుడి బంగారు కానుకలు వెలికి వచ్చినంత ఆనందంగా ఉండదూ? అదెంత పని, మన (వి.ఏ.కె) ‘రంగడు ' ఉండగా!
విలక్షణ నటుడు జగ్గయ్య రాసిన సలక్షణమైన పద్య రచన కూడ 'పదండి ముదుకు ' చిత్రం లోనే తొలి సారిగా పరిచయమైంది.
1964 లో 'బంగారు తిమ్మరాజు' వెండి తెర మీద ఏసుదాస్**** చేత**** 'ఓ నిండు చందమామ నిగ నిగల భామా ' అనే పాట సంతకం చేయించి ఆయనకి తెలుగులో తొలి అవకాశం ఇప్పించారు. అలా అలా ఎదిగిన ఏసుదాస్ ‘మేఘ సందేశం ' తెప్పించిన అవార్డుల నందుకోగలిగారు.
ఎక్కువగా తెలుగులోకి డబ్ చేసిన చిత్రాలలోనే ప్రముఖ గాయకుడు ****సౌందరరాజన్ గొంతుని విన్న మనకి ఈయన అచ్చమైన తొలి తెలుగు పాట 'సెబితే సానా ఉంది ' (చిత్రం: శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న) అనేది ఒకటి చరిత్రలో ఉంది అని చెప్పగలిగిన వారు పాణి ఒక్కరే. పాణి 'గోపాలుడు-భూపాలుడు ' లో మళ్ళీ సౌందర్ రాజన్ చేత 'ఇదేనా -- తరతరాల చరిత్రలో జరిగింది ఇదేనా, జరిగేదీ ఇదేనా ' పాట పాడించి చరిత్రకెక్కారు. సౌందర్ రాజన్ వారు పాడిన తెలుగు పాటలు తెలుగు స్టేజీ మీద వినపడవు. ఆ గొంతుని అనుకరించాలే తప్ప ఆయన పాడినట్లు పాడడం కష్టం. అందుకే కొందరు స్వరకర్తలకి ఆయన గొంతిష్టం. ఆయన్ని 'సౌండ్ అర్ రాజన్ ' అని కూడ అనేవారు.
'అభిమాన వంతులు'(1973) చిత్రం ద్వారా గాయని వాణీ జయరాం ను పరిచయం చేసారు కోదండపాణి. 'ఎప్పటి వలె కాదురా నా స్వామీ' అని ఆమె పాడిన ఆ జావళీ వింటే ఆమె నాట్యం చేస్తూ పాడారా అనే భావన కలుగుతుంది. వాణి వారి గొంతూ అంతే- ఆమె పాడిన పాటలు ఆమె మళ్ళీ స్టేజి మీద పాడితేనే బావుంటాయి. ఇతరులు అనుకరిస్తూ పాడితే పప్పులోనే కాదు, స్టేజ్ దాటి కాలేస్తారు. ఈ జావళి సంపాయించి దాచుకోండి.
పద్మ నాభుడు తన**'పాణి'**ని మదిలోన దాచాడు-------
మొదటినుంచీ పాణి కి నాటకాను భవం హెచ్చు. రంగస్థల పద్యాలు పాడడంలో దిట్ట. గుంటూరా,మజాకా! పైగా పద్మనాభం హితుడు,స్నేహితుడూనూ! పద్మనాభం నిర్మాతగా తొలి చిత్రం 'దేవత' నిఎన్.టి.ఆర్ ని పెట్టి తీశారు**.** అందులో పద్మనాభం చేత తొలిసారిగా 'మా వూరు మదరాసు నా పేరు రాందాసు**'అనే** సరదా**** పాట 'అల్లరీ'శ్వరి తో గళం కలిపించి పాడించారు పాణి.
పద్మనాభం గారు సమర్పించిన రెండవ చిత్రం పొట్టి ప్లీడర్ లో పాణి 'ఇదిగో ఇదిగో తమాషా ' పాట సన్నివేశంలో**** ఆర్కెస్ట్రా తో కనిపించారు కూడా.
చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ రఘురామయ్య గారి గొంతు మనం విన్నది పద్మనాభం సమర్పించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న ' చిత్రంలోనే (పద్యం ఒకటి ,'నా హృది****పయనించు శృంగార రథమా ' అనే చరణం ఒకటి). ఇదే చిత్రంలో ఘంటసాల వారి పాట ఒక్కటీ లేదు. బదులుగా కొత్త గొంతును బయటి ప్రపంచానికి తెలియజేశారు పాణి.
(నటీమణి జి వరలక్ష్మి నిర్మించిన 'మూగ జీవులు ' చిత్రం ద్వారా ఆ కొత్త గొంతుకి అమ్మ పైన ఎంతో హృద్యంగా సాగే పద్యాన్ని తొలిసారిగా సమర్పించారు పాణి). ఆ కొత్త గొంతే నేటి కొత్త తరానికీ చిర పరిచయమైపోయిన ' బాలు ' అనే రెండక్షరాలు!
పద్మనాభం**** సమర్పించి దర్శకత్వం వహించిన 'శ్రీ రామ కథ ' లో చాలా ఏళ్ళ విరామం తర్వాత హాస్య నట గాయకులు రేలంగి**,తిలకం చేత పాడేట్టు చేసారు పాణి. ఈ చిత్రంలోనేసీనియర్ సముద్రాల** వారి****ఆఖరి గీతం - సంక్షిప్త రామాయణ గానం - రెండు భాగాలుగా, ఒక దాంట్లో 21 చరణాలు, ఇంకొక దాంట్లో 11 చరణాలు - బాలు గారి**** గొంతులో అవలీలగా రాగ మాలికలతో సాగింది. ఇదే చిత్రంలో బహు వాయిద్యాల మేళ వింపు తో వీటూరి కవి రాసిన రెండు యుగళ గీతాలు ఒకటి 'రాగ మయం అనురాగ మయం' బాలు , సుశీల కి, మరొకటి 'మాధవా మాధవా నను లాలించరా' ఘంటసాల , సుశీల కి కూర్చి ఒక కొత్త సాహసానికి శ్రీకారం చుట్టారు కోదండపాణి. ఆయన ఎక్కువగా స్వర పరచినవి **వీటూరి **వారి గీతాలే.
పద్మనాభం గారి దర్శకత్వంలో వచ్చిన కథానాయిక మొల్ల - ఇంటూరి వారి సంక్షిప్త కథనం. బంగారు నంది పొందిన చిత్రం. శ్రీశ్రీ గారు 'అప్పు, నిప్పు, చెప్పు, ' అనే దత్త పది ఇచ్చి ఆ మాటల అర్ధంలో కాక రామాయణార్ధం లో పద్యమల్లమంటే ఎలా ఉంటుందో ఇందులో చక్కగా చెప్పారు. శ్రీరామ నవమి సందర్భంలో మననం చేసుకున్నాం మనం.
శ్రీశ్రీ గారు 'పొట్టి ప్లీడర్' చిత్రం కోసం 'లాలిజో లాలిజో లాలీ లాలీ' అనే పొడి పొడి పదాల అతి చిన్న పల్లవి రాస్తే అద్భుతంగా స్వరపరిచారు పాణి.
పద్మనాభం గారు ఎంతో ఆశపడి 'మాంగల్య భాగ్యం ' చిత్రంలో బహు ప్రజ్ఞాశీలి భానుమతి గారి సుమధుర గానం 'రామ కథ మరీ మరీ అనరాదా' అనేది పాణి ఉండగా పాడించలేక పోయారు. అంతకు ముందే సముద్రాల వారిశ్రీరామ కథ ను మరీ మరీ అన్నాను కదా అని అనుకున్నారో ఏమో పాణి ఘంటసాల మాస్టారు గారికి తోడుగా ఉండేందుకే అన్నట్టు 1974 లో ఏప్రిల్ 5 న**'ఈ కాల చక్రము నాపగ ఎవరి తరమురా'** అని తను (పొట్టి ప్లీడర్ -చీకటి విచ్చునులే) స్వరపరచిన పంక్తికే పట్టం గడుతూ గంధర్వ లోకాల వైపు చక్రం తిప్పేసుకున్నారు.
కౌసల్యా సుప్రజాకోదండపాణీ.....
అని ఎందుకనడమంటే చిన్నా చితకా గాయనీ గాయకులెవ్వరైనా సరే వారికి సినీ గీతాల సుప్రభాతం పాణి చలవ వల్లే జరిగేది.
'పొట్టి ప్లీడర్ '(1966 ) లో 'ఝుమ్మనే మనసు' అనే యుగళ గీతం పాడించడానికి కొత్తవారిని ఎంచుకున్నారు.
'మా మంచి అక్కయ్య'(1970) చిత్రంలోబసవేశ్వర రావు**,కౌసల్య లకి అవకాశమిచ్చి 'బుల్లెమ్మ బుల్లెమ్మ జలసా బుల్లెమ్మా' అనే హాస్య గీతం పాడించారు.'పండంటి కాపురం'(1972)** లో జి.ఆనంద్**** కి తొలి సారిగా 'ఆడి పాడే కాలంలోనే' కొంత పాడే అవకాశం కలిగించారు.
'గాంధీ పుట్టిన దేశం ' చిత్రంలో టైటిల్ సాంగ్ పాడించి సుశీల అండ్ బృందం అని అనలేదు పాణి. కౌసల్య , రమణ ల పేర్లు కూడా రప్పించారు.
పాణీ**,పెద్ద నటులూ,పాత్రికేయులూ---**
పాణి ఆనాటి పెద్ద పెద్ద హీరోల చిత్రాలకు పని చేయలేదు. ఒక్క ఎన్టీఆర్ గారు నటించినవి కనీసం నాలుగైనా పాణి కి దక్కాయి -దేవత, గోపాలుడు-భూపాలుడు,లక్ష్మీ కటాక్షం, ఒకే కుటుంబం - ఆ నాలుగు చిత్రాలు. చిత్రంగా ఎఎన్నార్ నటించిన 'మంచి కుటుంబం ' (మాతృక: తమిళం-మోటార్ సుందరం పిళ్ళై) ఒక్కటే పాణి కి దక్కినా అందులో ఎఎన్నార్ ఉండే ఒక సన్నివేశంలో 'త్యాగశీల వమ్మా మహిళా' పాట నేపధ్యంగానే వినిపిస్తుంది.
ప్రముఖ పాత్రికేయుడూ, రచయితా ముళ్ళపూడి వారి పాట అంటే 'మేడ మీద మేడ గట్టి' (ప్రేమించి చూడు చిత్రం) ఒక్కటే అని అనుకుంటారు ఇప్పటికీ చాలామంది. ఆయన పాటలు రాసిన రెండవ చిత్రం 'పక్కలో బల్లెం ' (తెలుసో ఏమో అందానికి అలకే అందం, కదలే నీడలలో కనబడు వారెవరో'). పాణి స్వర రచనలీ రెండూ ఇప్పుడు అలభ్య మేమో అనిపిస్తుంది. రంగడు తలచుకోరు, తలచుకుంటే తెలుగు వారికెన్నో ఇలాంటి అరుదైన ఆస్తులు అందివ్వగలరాయన.
'కథానాయిక మొల్ల ' లో పాణి స్వర రచన- 'మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్యా' మహా నటుడు గుమ్మడి పైన చిత్రీకరించిన పాట (బాల సుబ్రహ్మణ్యం పాట, తొలి సారిగా గుమ్మడి గారికి). అంతకు ముందు ఎన్నడో అయిదు భాషల గానం ఒకటి గురువు గారు సుసర్ల వారు స్వరపరిస్తే శిష్యుణ్ణి వెతుక్కుంటూ అచ్చంగా అలాగే అయిదు భాషల గీతమే వచ్చి వాలింది పాణి చేతిలో.
పాణీ**,ప్రముఖ రచయితలూ---**
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి అరుదైన రెండు రచనలు 'పక్కలో బల్లెం ' (1965 ) చిత్రం కోసం స్వర పరిచే భాగ్యం పాణికి కలిగింది. దేవులపల్లి వారి రచనలు 'మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు', 'ఇది మల్లెల వేళ యనీ ఇది వెన్నెల మాసమనీ' తొలి సారిగా స్వర పరచే భాగ్యం 'సుఖ దుఖాలు ' (1967 ) ద్వారా పొందారు.
పాలగుమ్మి పద్మ రాజు గారి తొలి సినిమా పాట 'భళారే ధీరుడవీవేరా' 'దేవత ' (1965 ) లోనూ , దాసరి నారాయణ రావు గారి తొలి సినీ పద్యం 'శిల్పాలు శిధిలమైనా' 'ఒకే కుటుంబం ' (1970 ) లోనూ ప్రవేశ పెట్టారు -ఇవన్నీ వారికీ ప్రథమం, వీరికీ ప్రథమం. అలాగే జి కె.మూర్తి గారి రచన 'ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మ ముడి' పాణి స్వర రచన వల్ల మంచి పేరు తెచ్చుకుంది.
'మళ్ళీపెళ్ళి ' లో తొలి పాట రాసిన గోపి తరువాత పాణి వరసలతో పాపులర్ అయ్యారు 'జాతక రత్నమిడతంభొట్లు' లో 'చిన్నారి రాణి సిరిమల్లె పువ్వు', 'నీ చెయ్యీ నా చెయ్యీ పెనవేసి బాస చెయ్యి'; 'పచ్చని సంసారం 'లో 'పాడమని పాట వినే రాజు ఎవ్వరు?', 'పండంటి కాపురం ' లో 'ఇదిగో దేవుడు చేసిన బొమ్మ' , 'మనసా కవ్వించకే నన్నిలా' ఎంత మధురాలూ! అలాగే అప్పలాచార్య వారి పాటలు పాణి చేతి చలువలే. 'జాతక రత్న మిడతంభొట్లు ' లో 'చెలియా సఖియా ఏమే', 'బంగారు తల్లి నా చెల్లెలు', 'మా మంచి అక్కయ్య ' లో 'బుల్లెమ్మ బుల్లెమ్మ సరదా బుల్లెమ్మ' గుర్తుకొస్తున్నాయా?
డా. సి.నా.రె గారు**** తన పాటల పరంపరలోపాణి వరసల గురించి ముచ్చటించిన విషయాలు ‘ప్రతిరాతా ప్రసిద్ధమే 'లో చదవండి.
పాణి గ్రహణ నేపథ్య****సంగీతం-----
గూడుపుఠాణి చిత్రంలో ఒకానొక శృంగార సన్నివేశం సంసార పక్షంగా చిత్రం చూసే వారికి కనుల పండుగ కాక పోవచ్చు. కాని కళ్ళు మూసుకునీ వింటే చాలు. పాణి వినిపించిన నేపథ్య సంగీతం వీనులకు విందు కలిగిస్తుంది. ఆయా వాయిద్యాల క్రమ శిక్షణ చూస్తే విస్తు పోతాం.
వాయిద్యాల చల్లదనం - మనకో థండాపానీ --
ఇంగ్లీష్ లో రాస్తే 'దండపాణి' 'థండాపానీ గా అనిపిస్తుంది అంటాడు మా కొమార రత్నం. బాలవాక్కు- నిజమే. కోదండపాణి బాణీ అంటే స్వర రచన + వాయిద్యాల ఎంపిక + గాత్ర, వాయిద్య చేరిక క్రమబద్ధంగా ఉండడం. ఏ పాట విన్నా అది వేసవిలో చల్లదనం ఇచ్చే రిలీఫ్ కలిగిస్తుంది.
కొన్ని పాటలకి కొన్ని ప్రత్యేక వాయిద్యాలనే ఎంచుకోవడం ఆయన స్పూర్తికి కొలమానం. చీకటి విచ్చునులే, లాలిజో లాలిజో, చూపులు కలసిన నాడే, ఒకసారి కలలోకి రావయ్యా, నాగమల్లి కోనలోన, ఎవరూ లేని చోట, చెలీ నీ కోరిక, ఇంతమాత్రమెరుగవా కన్నయ్యా, ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు, చిరు చిరు చిరు నవ్వులు, చింతపువ్వు ఎరుపు, నీ చెయ్యీ నా చెయ్యీ పెనవేసి బాస చెయ్యి, బంగారు తల్లి నా చెల్లెలు -- ఉదాహరిస్తే ఎన్నో పాటలు.
ముక్తాయింపు:
కనులు చూసినా పాటే - ఆ వీడియోలు పాణి ముద్రలు చూపించే వేడుకలు. ఇవి కొన్నాళ్ళ తరువాత మళ్ళీ చూద్దామంటే దొరకవు. వాటి వాటి పరిమితులు వాటికుంటాయి. ఆలస్య వీక్షణం ఆశాభంగం! ముఖ్యంగా ఇవాళ 'ఐటం సాంగ్స్' అని చెప్పుకుంటున్నారే- అటువంటివి తెలుగు చిత్రాలకి కొత్త కాదు. తన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో అప్పటి హీరోలు నలుగురు, హీరోయిన్ ** రాజశ్రీ** లని రప్పించి ఒక పాట, కొంత సన్నివేశం కూర్చడం పద్మనాభం గారికే చెల్లింది. ఆ రకంగా బాలు గారి మొదటి పాట - ఐటం సాంగే!
కనులు మూసినా పాటే – ఆ ఆడియోలు కొన్ని దొరికేవే . కొన్ని ఎంత గాలించినా వట్టి గాలే తప్ప దొరకనివి. అయితే కృష్ణప్రేమ లో ఆలస్యంగా విన్నా ఆశాభంగం కానివ్వవ్. ఉక్కుపిడుగు – చిత్రంలో జానకి ,వసంత ల గళంలో పలికిన ‘జయహో ' మాట విని ఒక్కసారి ఏ.ఆర్. రెహమాన్ ని తలచుకుంటారు. ‘జయహో' ఎప్పటి మాట! అయితే ఇన్నాళ్ళకి ఆస్కార్ అవార్డ్ కి ఆస్కారం కలిగించింది. పాణి ‘జయహో' ని ఆ రోజుల్లోనే ఎంత సొగసుగా స్వరపరిచారో చూడండి. అవార్డ్ లు ఆశించని వారికి కనీసం రివార్డ్స్ కూడా ఉండవేం? నాకు తెలిసి జయహో - అనేది భక్త ప్రహ్లాద చిత్రంలోనూ, ఉక్కుపిడుగు లోనూ నాట్య గీతాల్లోనే తొలి,మలి సారి రావడం సంభవించింది. మొదటిది రాజేశ్వరరావు స్వర పరిచారు.
కనులు చదివినా పాటే - బాలు గారి తొలి పాట రచయిత వీటూరి. వీటూరి నుంచి వేటూరి వరకు కవుల భావుకతను అర్థం చేసుకునీ, ఒక వరవడి సాధించిన బాలు, ఆ మార్గం చూపించిన కోదండపాణి పట్ల కృతజ్ఞతని ఒక స్టూడియో రూపంలోనూ, ఒక నిర్మాణ సంస్థ రూపంలోనూ తెలియజేసుకున్నారు. పద్మనాభం తొలి భుజం తట్టు నేడు పద్మభూషణ్ వరకు తీసుకొచ్చింది.
పాట=తిరుగు టపా : చెప్పా కదా ‘వెడలెను కోదండపాణి ' కి నకలు రాశానని. విశేషం ఏమిటంటే కుమారస్వామి (సుబ్రహ్మణ్యం) శివుడి మీద అలిగి దక్షిణ దిశగా కొండల వైపు వెళ్ళి పోతాడని చదువుకున్నాం కదా. అలా కోదండపాణి(రాముడు) దక్షిణం వైపు వెళుతూ బాలసుబ్రహ్మణ్యం ని వెతికి పట్టుకున్నాడని ఓ పిచ్చి ఆలోచన వస్తే త్యాగయ్య గారి కీర్తన తీసుకునీ ‘అనుకరించాను', కొంత అనుసరించాను. ‘దక్షిణ ' అంటే సుసర్ల దక్షిణామూర్తి గారినే హ్రస్వంగా మార్చానని, అవన్నీ ఇలా చెప్పాలని నాలోని కవికి ఆరాటం.
గురువులకు తగిన శిష్యుడిగా పాణి మీద మరింత వ్యాఖ్యానం చెయ్యాలని ఉంది, వచ్చేవారం! మహానటి సావిత్రి ని ఇక్కడ విస్మరించినట్టున్నాడు అని కొందరికి అనుమానం కలిగితే ధన్యుణ్ణి. వచ్చేవారం ఎందుకోసమనీ... మీరు మరీనూ!
-తాతిరాజు వేణుగోపాల్ , 05 ఏప్రిల్ 2012
