నాడైనా నేడైనా ఎంత హొయలు! ఎన్నెన్ని హొయలు!
08 జనవరి, 2012


‘ అ హ- నా పెళ్ళంట ' అంది ‘మాయాబజార్ 'పాట.
‘ అహో- ఆంధ్రభోజా ' అంటూ సాకి తో మొదలైంది ‘మంచి మనసులు ' పాట.
సినిమా పేర్లు రెండూ మకారం మీద మమకారమున్నవిగా అనిపిస్తుంది కదూ.
ఈ రెండు పాటలూ అ, హ అనే రెండక్షరాలతో ప్రారంభం కావడమే విశేషం. నిజానికి అ, హ అనేవి తెలుగు తొలి, చివరి అక్షారాలు కదా, అదే ఇక్కడి విశేషం.
తెలుగులో అకార మాటలు అనంతం. హకార మాటలు అతి స్వల్పం.అకార ఆకారమే ఒకానొక సందర్భంలో హకార మౌతుంది. అదెలా అంటే -
పని పూర్తయ్యాక ‘అమ్మయ్య ' అని తృప్తి పడడం, వచ్చిన జిడ్డు మనిషి వెళ్లి పోగానే ‘హమ్మయ్య ' అని ఊపిరి పీల్చుకోవడం మనకు తెలిసినదే కదా.
అచ్చమైన ఆఖరి తెలుగు (దేశ్య విశేష)పదం ఇంగ్లీష్ ఇల్లు లా ఉంటుంది. చెప్పుకోండి చూద్దాం, కష్టమా? కష్టపెట్టక చెప్పేయడం మన కస్టం (ఆచారం) కనుక అదేమిటో చెప్పేయనా?హౌసు.
ఒకే ఒక్క సినీ కవి వీటూరి (వేటూరి కాదు) మాత్రం ‘ఉక్కు పిడుగు( 1969)' కి దర్శనమైన నాగ కన్య చేత ‘ సై అంటే సై అంటాను హౌసుకాడా ' అని అనిపించారు.
హౌసు - అంటే సొగసు, ఒయ్యారం అంటుంది ఏ తెలుగు నిఘంటువైనా.
(మరొక హకార పదం- ‘హొంత', హొంత కాడు. మహాకవి క్షేత్రయ్య సినిమాలో డా. సి.నా.రె ‘అష్ట విధ నాయికల ' స్వభావ వర్ణనలో ఈ పద ప్రయోగం చేశారు. శూరుడు అనే అర్ధం కాబట్టి శూరత్వమే సొగసు అనుకుంటేనే తప్ప ఈ మాటతో ఇప్పుడు పని లేదు).
ఇవి ఇలా పక్కన పెడితే, మరో అందమైన హకార దేశ్య విశేష పదం దొరుకుతుంది. ఏమిటది అని అంటే- ‘హొయలు ' అని చెప్పాలి. హొయలు - అంటే విలాసం అంటుంది నిఘంటువు. ఎటొచ్చీ ఆ మాట ‘నిత్య బహు వచనం '. అంటే- ఏక వచనంగానూ, బహు వచనంగానూ ప్రయోగించ వచ్చు.
తెలుగు మాస్టారినై పోయానేమిటి ఈ పూట?
మా స్టార్ సింగర్ ఎస్ పి. బాలు గారే ఇందుక్కారణం.
ఆయన డిసెంబర్ 12 (2011) న కాబోలు ఈటీవీ వారి ‘పాడుతా తీయగా ' కార్యక్రమంలో ‘** నిలువవే వాలు కనుల దానా** ' (ఇల్లరికం -1959-ఘంటసాల -కొసరాజు -టి.చలపతి రావు) అనే పాట పాడిన కుర్రవాణ్ని బిక్క మొహం వేసేలా చేసారు. ‘** నీ నడకలొ హొయలున్నదె చాన** ' అని ఆ అబ్బాయి పాడితే ‘** నీ నడకలో హొయలున్నవె చాన** –అని అనాలి , హొయలు బహు వచనం కదా ' అని సవరించారు. ఐతే ఆ అసలు పాట క్లిప్పింగ్ ఇచ్చి ఉంటే ‘** నీ నడకలొ హొయలున్నదె చాన** ' అనే ఆ పాటలో ఉందనీ, అక్కడ ‘హొయలు ' ఏకవచనమనే విషయం తేట తెల్లమయ్యేది.
సినీ కవులు ‘హొయలు ' అనే మాటని అధిక శాతం మగువకే పరిమితం చేసారని చెప్పాలి.
సినీ గీతాల్లో 'హొయలు ' మాటని తొలిసారిగా ప్రవేశపెట్టినది ఎవరో గానీ వెన్నెల రేయి కాబట్టి 'నీ కళలూ నీ హొయలూ చల్ల చల్లగా విరిసేనే ' (పెళ్ళినాటి ప్రమాణాలు -1958-ఘంటసాల,లీల-ఘంటసాల) అని జాబిల్లితో ఒక జంట విన్నవించుకుంటునట్టు పింగళి నాగేంద్రరావు గారు రాసిన పాటే తొలి ప్రయత్నమేమో అని అనిపిస్తుంది. ఇందులో 'హొయలు ' బహువచనమైంది (refer కనులు చదివినా పాటే). తరువాత కొసరాజు రాఘవయ్య గారు 'హొయలు ' అనేది ఏకవచనంగా తీసుకునీ నెలత నడకకి అన్వయించారు.
మల్లాది వారు కానీ, దేవులపల్లి వారు కానీ, శ్రీశ్రీ గారు కానీ 'హొయలు ' ఊసే ఎత్తలేదనిపిస్తుంది. సొగసు,సోయగం,ఒయ్యారం చాలనుకున్నారు ఈ కవులు. చిత్రంగా పింగళి వారు జగదేకవీరుడి(1961) కన్నుల సాక్షిగా ‘** కులుకు లొలికే హొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి** ' కొత్తగా light & sound effect ప్రవేశ పెట్టేరు. లయ లో ధ్వని ఉంటుంది, అలాంటిది లయను చూడడం విడ్డూరం. ఏదైతేనేం, ‘హొయలు ' అనే నిత్య బహువచనానికి కి సరియైన ప్రాస ‘లయలు ' అనేది తొలిసారిగా ఆయనే ప్రయోగించారు (watch the video in కనులు చూసినా పాటే ).
ఇక సినిమాల విడుదల క్రమంలో చూసినట్టయితే 1960-1970 ల కాలంలో ‘హొయలు ' నడక బాగానే సాగింది. దాశరథి వారు ‘** మేని హొయలు** ' (మంచిమనసులు , 1962) గిలిగింతలివ్వడం గురించి చెప్పారు. అప్పటికి నటీమణి సావిత్రి అంత లావు కాలేదు కనుక అప్పటికి ఆ పదం సరిపోయింది. సముద్రాల వారు ‘ కల్పనలో ఊహించిన హొయలు ' శిల్ప మనోహర రూపం పొందడం గమనించారు (నర్తనశాల , 1963). వీటూరి(వేటూరి కాదు) వారు 'నాగమల్లి కోనలోన ' నక్కిన లేడి కూన ‘** నడకల్లో హొయలుంది** ' (బంగారు తిమ్మరాజు , 1964 ) అనే సత్యాన్ని పునరావిష్కరించారు (listen toకనులు మూసినా పాటే).
సి.నా.రె. వారి రూటే వేరు కనుక ఆయన ‘** హొయలు చిలికే కళ్ళ లోని ఓర చూపులు ఏమన్నవి?'** అని ఎన్ టీ ఆర్ చేత ప్రశ్నించారు ( మంగమ్మ శపథం , 1965) (refer కనులు చదివినా పాటే) . ఏ ఎన్ ఆర్ చేత ‘** మొలక నడుము హొయలు చూసి మురిసి పోదును** ' (జమిందార్ ,1965) అని అనిపించారు (watch the video in కనులు చూసినా పాటే, refer కనులు చదివినా పాటే).
సముద్రాల వారు ఎల్ విజయలక్ష్మి వంటి నర్తకిని చందమామ తో పోల్చి ‘** అడుగడుగున లయలు కులికి హొయలు చిలికి ఏలవే** ' (పాండవ వనవాసం ,1965 ) అనిహరనాధు ని చేత ఆర్డర్ పాస్ చేశారు (listen to కనులు మూసినా పాటే). సినారె వారు ‘ఓహో అలాగా?' అని మనసులో అనుకున్నారేమో, రెండేళ్ళ తరువాత ప్రకృతి భిన్నంగా ‘** పగటి పూట చంద్రబింబం** ' తో కృష్ణకుమారి వంటి నటిని పోల్చుతూ ‘ ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు' అని కాంతారావు విస్తుపోయేలా చేశారు (చిక్కడు దొరకడు ,1967) (watch in pagalu vennela of video archives, refer to కనులు చదివినా పాటే).
దాశరథి గారు ఒక**** పుట్టినరోజు పాటలో సరికొత్తగా ‘నెమలి లోని హొయలంతా చెలికీయ ' మని నిస్వార్ధ అభ్యర్ధన ఒకటి చేశారు (కంచుకోట , 1967).
ఆరుద్ర గారు ఆకలి కేకలు వేసి ‘** అందాల నా హొయలు ఆరగించుమా** ' (సుఖ దుఃఖాలు ,1967 ) అని కొంచెం అతిశయించేరు. మళ్ళీ ఆయనే రెండేళ్ళ తరువాత ‘** ఏటికీ ఎదురీదకు** ' అని మహాబలుడు (1969) ని నియంత్రించి ‘ లతకూన తరువును పెనవేయదా? లాలించితే హొయలు చిగురించదా? ' అని పాఠాలు నేర్పారు (watch the video in కనులు చూసినా పాటే).
‘** ఓ చామంతీ ఏమిటే ఈ వింత** ' అని వాణిశ్రీ చేతిలోని పువ్వుని ప్రశ్నిస్తే ఏ ఎన్ ఆర్ వంటి ‘చిన వాడికి కలిగెనేల గిలిగింత'? ‘** ఇన్నాళ్ళూ (నీ) హొయలు చూశాను – (నా) ఎద లోనే పదిలంగా దాచాను, వేచాను** ' అనే మధుర వాక్కుల ప్రభావమే అంత! అదీ సినారె చమక్కు! (ఆత్మీయులు , 1969).
ఉషశ్రీ (రేడియో ఆయన కాదు) అనే అరుదైన సినీ కవి అప్పటి యువతరానికి శోభన్ బాబు చేత హాయి గొల్పే మాట ‘** హొయలు గొలిపే వయసు** ' అనేది ఉంటుందని స్పస్టం చేశారు (పసిడి మనసులు , 1970) (listen to కనులు మూసినా పాటే).
శ్రీశ్రీ కాదు, ఉషశ్రీ కాదు రాజశ్రీ ని నేను అంటూ రాజశ్రీ గారు అద్భుతంగా ‘ నీ నీడగా నన్ను కదలాడనీ ' (మాతృమూర్తి , 1972) అనే పాటలో ‘** హరివిల్లు చూశా, నీ మేను చూశా – హరివిల్లులో లేని హొయలుంది నీలో** ' అని గమ్మత్తు రంగులద్దారు (హొయలు - మాటని ఆఖరిసారిగా ఘంటసాల వారు ఈ పాటలోనే గానం చేశారని చెప్పవచ్చు) (listen to కనులు మూసినా పాటే, refer కనులు చదివినా పాటే).
మనసు కవి ఆత్రేయ ఎప్పుడో 'మూగమనసులు ' నాటికి ‘** అనురాగం అను రాగం ఆలపించి నే లాలిస్తా** ' అనే అద్భుత పద కేళి ప్రయోగించడం విన్నాం. మళ్ళీ ‘అమర దీపం (1977) ఆయనలో ఆ పలుకుల్ని రీ చార్జ్ చేసింది. ‘** ఏ రాగమో – ఇది ఏ తాళమో- అనురాగానికనువైన శృతి కలిపినామో** ' అనే పల్లవి అప్పుడే వెలిగింది. అందులోనే పింగళి వారి పలుకుబళ్ళు హొయలు-లయలు అంతలోనే ప్రత్యక్షమై పోయాయి. ‘** హొయలైన నడకలే లయలైనవి** '! (listen to కనులు మూసినా పాటే)
(మరిన్ని 'హొయలు' ఉన్న పాటలు ఉదాహరణకి శారద (1973) లో 'శారదా నను చేరగా' (సి.నా.రె కలం) అంతగా సాహిత్య గుబాళింపు లేనివి కనుక ఇక్కడ హుష్ కాకి అవుతున్నాయి),
ప్రభంజనం లా వచ్చిన వేటూరి వారు ప్రబంధం, పద బంధం అన్నీ కలబోయగలరని తెలిసిన విషయమే. కావాలనుకుంటే అన్నమయ్య, ఆత్రేయ,దేవులపల్లి, సినారె అన్నీ తానై పోగల సమర్దులే. అన్నమయ్య వెంకన్న పాదాన్ని వీక్షించినట్టే ఆయన ‘** ఈ పాదం ఇలలోన నాట్య వేదం** ' (మయూరి , 1985) గా సమీక్షించారు. కాని అంతలోనే ముమ్మాటికీ పింగళి వారినే అనుసరించాలనుకున్నారో ఏమో వారి మూడు మాటలు – గానం, హొయలు, లయలు -ఎంచుకునీ ‘ గానమే తన ప్రాణమై లయలూ, హొయలూ విరిసి ' ఈ పాదం నర్తిస్తే నాట్య వేదం అయ్యిందని తీర్మానించారు (refer to కనులు చదివినా పాటే ).
సినీ సాహిత్యంలో అప్పటికింకా చీకట్లు రాకపోయినా ‘సిరివెన్నెల ' ని ప్రవేశపెట్టారు కళా తపస్వి విశ్వనాధు లు. సీతారామశాస్త్రి గారి ఇంటి పేరే కాదు కలం తీరు కూడా మారిపోయింది. అందరిలా పడతి శారీరిక ‘హొయలు ' కాకుండా ‘** ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదం కలిపితే అన్నన్ని లయలు** ' (సిరివెన్నెల , 1986) అని ఆయన వినూత్నంగా ప్రకటించారు (watch the video in కనులు చూసినా పాటే ).
ఆశ్చర్యం ఏమిటంటే- ఆధునిక సినీ ప్రపంచంలోనూ ‘హొయలు ' అనే ప్రాచీన పదం బతికి బట్టకట్టుకోవడం (హీరోయిన్లకి తగని పని) ! 'సెల్యూట్ ' లో సాహితి, 'నేను-నా రాక్షసి ' లో విశ్వ ‘** సిగ్గుల మొగ్గల హొయలు** ', ‘** హొయలు ఒలికే చెలియ తళు కే**' వంటి పంక్తులు ప్రవేశ పెట్టడం మెచ్చ దగ్గదే.
పాత తరం కవులు హొయలు, సొగసు ఈ రెండూ జంట పదాలుగా తరచూ ప్రయోగించేవారు.
లేడికూనకి ‘** సొగసైన రూపుంది, నడకల్లో హొయ లుంది** ' అన్నది వీటూరి వారే.
తన ఒకానొక పాటలో ‘** సొగసులు లాలన చేసి** 'నట్టే మరో పాటలో ‘** లాలించితే హొయలు చిగురించదా** ' అని ఆలస్యంగా ముడిపెట్టింది ఆరుద్ర గారే. ఆయనే ‘** పదారు వయసు- పండింది సొగసు** ' అని ప్రకటించి ‘** అందాల నా హొయలు ఆరగించుమా** ' అని మాటల విస్తరి వేశారు కూడా .
‘** (నా) వయసు, (నా) సొగసు నిండెను (నీ) మదిలో** ' అని నాయకి గుర్తు చేస్తే ‘(నీ) మేని హొయలు గిలిగింతలిడ ' గలిగాయి నాయకుడికి – అని దాశరథి వారి చమత్కారం.
‘** మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును, జిలుగు పైట నీడలోన పరవశింతును** ' అని నాయకుడు చెణుకు విసిరితే నాయకురాలేం తీసిపోలేదు. ‘** సొగసు లొలుకు నడుము హొయలు చూడనీయను – కడకొంగున నిను బిగించి నడచిపోదును** ' అని తేల్చేసింది. ఇవంతా భళారే!సినారె వారి సొగసైన పాటలలోని మాటల హొయలు!
‘** హొయలు చిలికే కళ్ళలోని ఓరచూపులు ఏమన్నవి?** ' అని నాయకుడు ప్రశ్నిస్తే ‘ నగవులొలికే రాజులోని సొగసులన్నీనావన్నవి ' అని నాయకి బదులివ్వడం కూడా సినారె వారి కలం నేర్చిన లయలు.
అంటే- సొగసులు మగవానికీ ఉంటాయనేగా!
మళ్ళీ ఒకసారి వెనకటి కాలానికి వెళితే విప్లవ కవి శ్రీశ్రీ వారి హరికథలోసీతాదేవి
శ్రీరాము ణ్ణి చూసి ‘** ఎంత సొగసుకాడే మనసింతలోనే దోచినాడే** ' (వాగ్దానం , 1961) అని అనుకోవడం మరచిపోలేం. అంటే ‘సొగసు' అనేది పురుషులకీ వర్తిస్తుంది అన్నది నిజం.
మరి ‘హొయలు ' మాటేమిటీ? అదీ పురుషులకి వర్తిస్తుందా? అవును అంటారు త్యాగయ్య.
ఈ కవులందరికంటే వందేళ్ళ ముందు వచ్చిన నాద బ్రహ్మ, వాగ్గేయకారుడు త్యాగయ్య వందనాలు అందుకోదగ్గ 'ఎందరో మహానుభావుల ' గురించి (ఆయన వర్ణనలో వారంతా పన్నెండు మంది అని తేల వచ్చు – గమనిస్తే. ఈ జనవరిలోనే త్యాగయ్య గారి జననం కాబట్టి నెలకొకరు చొప్పున ఆయన కోరుకున్నట్టు రామ నామ జపం చేస్తే సంవత్సరం పొడుగునా మహానుభావులుంటారు) ఇలా చెప్పారు-
‘హొయలు మీర నడలు గల్గు సరసుని సదా-
కనుల జూచుచును, పులక శరీరులయి యానంద పయోధి నిమగ్నులయి ముదంబునను
యశము గలవారెందరో మహానుభావులు'!
(పూర్తి గానం 'తిరుగులేని మాట ' లో ఉంది. గమనించండి)
శ్రీరాముడు సరసుడు. ఆ నడకలో విలాసముంది. అదే ‘హొయలు ', అదే ‘సొగసు 'న్న వాడు కనుక సీతాదేవి అంతగా మురిసిపోయిందనిశ్రీశ్రీ గత శతాబ్దంలో చమత్కరించారు.
ముక్తాయింపు :
నడకలో ‘హొయలు ' కన్నా నడవడిక లో ‘హొయలు' ఉంటే చాలు, అంతకుమించిన సొగసైన జీవితం పురుషుడికైనా, స్త్రీకైనా మరోటి ఉండదు.
-డా. తాతిరాజు వేణుగోపాల్, 08 జనవరి 2012