Krishnaprema Logo

కృష్ణప్రేమ

మనిషి ఆకాశ వీధిని పడ్డాడు...

01 సెప్టెంబర్, 2012

మనిషి ఆకాశ వీధిని పడ్డాడు...

Picture

ఆం జనేయా మహానుభావా.. సుందరా.. శ్రీ రామదాసా.. అంజనీ సుతా ...వాయు పుత్రా ..ఓ పవనాత్మజ ఓ ఘనుడా'

‘ఓం తో కాక ఆం తో ప్రారంభించావ్ చూడు ఆ మాటలు సముద్రాల వారివి , సుందరా రామదాసా నుంచి వాయు పుత్రా అన్నావ్ చూడు అది నీ స్వంతం. చివర్లో ఓ పవనాత్మజ అంటూ పొగిడావే.. అది తాళ్ళపాక అన్నమయ్య కీర్తనం'

‘ఆహా.. బుద్ధికి బృహస్పతివి... కలిపి కొట్టి కావేటి రంగా అని నేననుకున్నా..నిజంగా.. మా బాపు వారి ముత్యాలముగ్గు సినిమాలోలా నా ఎదుట వచ్చి వాలావు. సంతోషం. ధన్యుడనైతిని .. '

‘సగంలో ఆపేయక ...ధన్యుడనైతిని ఓ రామా ..అని రామదాస కీర్తన పాడావో సంతోషిస్తాను. నాకు నిత్యం రామనామం వినిపించాలి. అవునూ .. వాలావు అంటున్నావు. అంటే నాకు మా లావైన తోక.. అంటే వాలం ఉందనేగా నీ వెటకారం'

‘అయ్యయ్యో .. ఎంతమాట.. ఆంజనేయా..నువ్వంటే మమకారమే కాని వెటకారమా తండ్రీ! ఇంతకీ నేనెందుకు పిలిచానో అడగవేం?'

‘ఏముంటుందీ ...లోకపాలకులు కరువయ్యారు రామరాజ్యం కావాలి అనేగా? సీతమ్మను వెతికి పెట్టమంటే నా తండ్రి రామయ్యకి సాయపడ్డాను కానీ మీ లోకానికి మళ్ళీ రామరాజ్యం తెమ్మంటే నా వల్ల కాదు బాబూ .. రామ!రామ! ..ఏం మనుష్యులు ఏం మనుష్యులు!'


‘ఇష్యూ అదే.. మనుష్యులే .. మనుష్యుడు అంటే మనీ ఇష్యూడ్ అని ఈ మధ్య ఒక నింద మోపుతున్నారు'

‘అలా మోపేవారూ మనుష్యులేగా.. వింతేముందీ.. మీది కలికాలం'

‘అంటే త్రేతా యుగం వాడివి నువ్వు, భీమాంజనేయ యుద్ధం , పాండవవనవాసము సినిమాల్లో చూసి నువ్వు ద్వాపర యుగంలో కూడా ఉండేవాడివి అని తెలుసుకున్నాం. కలి యుగంలో లేవా? మరి హిమాలయాల్లో యతి ఉన్నాడు, అతడు నువ్వే నువ్వే అని అక్కడంతా ఘోషిస్తున్నారే'

‘అలా అయితే ఆ యతే మీ మతులు మార్చవచ్చు కదా'

‘స్వామీ .. ఆ యతిని మేం చూడలేదు కానీ .. నీ చల్లని పాదాల గుర్తులు సిమ్లా లో ఉన్నాయట. విన్నాను. నీ శయన భంగిమలో ఉన్న మూర్తిని మాత్రం ఔరంగాబాద్ లో చూశాను'

‘ఔరా.. అందుకేనా రంగా అంటూ ఇందాక గుండె బాదుకున్నావ్'

‘బాద్ మే హసూంగా, హనుమాన్ జీ'

‘మధ్యలో హిందీ కూడానా? ఏం మళ్ళీ హిందీ రామాయణం సీరియల్ గానీ మీ టీవీల్లో వస్తోందా?'

‘భలే తెలుసు నీకు బజరంగబలీ... నాదో కోరిక.. నీలా గట్టి భుజాలు గల మనిషి మాకు కావాలి. పైకెగరాలి. మరో గ్రహం మీద తిరగాలి'

‘రాజ్యమేలడానికి శ్రీరామ ప్రభువు లాగ ఆజానుబాహుడు వద్దా?'

‘ఇప్పుడంతా ఓ జానెడు బాహువుల వారే స్వామీ .. మళ్ళీ అడుగుతున్నా.. నీలా గట్టి భుజాలు గల మనిషి మాకు కావాలి'

‘రెట్టించి మరీ అడుగుతున్నావ్ కనుక చెబుతా... బ్రహ్మ దేవుడు అటువంటివాడిని ఎప్పుడో మీకిచ్చాడు.. మీకు అంటే మీ ప్రపంచం మొత్తం మానవాళికి.. ఈ మధ్యనే లయకారుడు లాక్కున్నాడు.. అతగాడిని ఎనభై ఏళ్ళు భూమ్మీద ఉండనిచ్చి'

‘ఎవరు స్వామీ వారు?'

‘నీలా గట్టి భుజాలు ...అని నువ్వు రెట్టించి అడిగినప్పుడు నీ మాటల్లోనే అతగాడి పేరుందని గ్రహించాలేదా నువ్వు?'

‘బాప్ రే.. తండ్రీ.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ... అదేనా పేరు?'

‘అదే.. సూర్యుణ్ణి పండనుకునీ నేను ఎగిరి మూతి కాల్చుకున్నాను. మంచిదే అయింది—సూర్యవంశానికి చెందిన శ్రీరామ చంద్రుడికి యావజ్జీవితం సేవ చేశాను. సూర్యలోకానికి అలా తొలిసారి పయనించింది నేనేనేమో. శ్రీరామ చంద్రుడిలో నేనెలాగూ ఉన్నాను కనుక చంద్రలోకం మీకు విడిచి పెట్టాను. ఈ నీల్ అనే ఆయన ‘నాసా 'మిరంగా ..అమెరికా వాడు.. చంద్రతలం మీద 1969 జులై 20 న కాలు మోపిన తొలి మానవుడు గా కీర్తి సంపాయించాడు'

‘ఎంత ఆశ్చర్యం ... నీలాకాశం అంటూ మేం పాడుతుంటాం.. ఇలా ఆకాశం అంచులు దాటి గగన సీమ దాటి చంద్రుణ్ణి తాకిన మానవుడి పేరులో నీల శబ్దం ఉండడం కాకతాళీయమా స్వామీ?'

‘గగనసీమ అని అన్నావ్ .. గుర్తుందా.. యుగ పురుషుడు ఒకడు 1961 ఏప్రిల్ 12 న రోదసి యానం చేశాడు. పోల్చుకుంటావా... క్లూ ఇచ్చా.. యు..గ..'

యురి గగారిన్... స్వామీ .. జోహారు నీకు.. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని విన్నాను కాని యతి ప్రాసలు తప్పినా ఇప్పుడంటాను .. పురుషులందు యుగపురుషులు వేరయా ... అని. నాకో సందేహం..గగన ..శబ్దం ఆయన పేరులో ఎలా ఉంది స్వామీ. సంగీతం తెలిసిన వాడివి కదా .. గ,గ,రి,ని స్వరాలు అతని పేరులో ఉన్నాయని నీకు అనిపించవచ్చు'

‘అది ఆయన అదృష్టం. ఒక్క జర్మన్ లోనే సంస్కృతం ఉంది అని అనుకోరాదు, లుఫ్తాన్సా అంటే లుప్త హంస, నామే అంటే నామం వగైరాలు విని. రష్యా అనగా ఋషియా? అని ఎవరో అడిగారు.. అక్కడివాడేగా ఇతగాడు? సర్ పే లాల్ టోపీ రూసీ .. అని మీ రాజ్ కపూర్ పాడలేదూ.. ఋషి నుంచి పుట్టినదే రుసి '

‘అయితే వీళ్ళంతా విశ్వ మానవులు అనాలి .. ఒక జన్మలో అరమరికలు లేని ఋషులేమో'

‘మీ వేటూరి వారన్నట్టు కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులౌతారు'

‘అలాగే .. తన పేరులో కొండ శబ్దం ఉన్న ఎడ్మండ్ హిల్లరీ .. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి మానవుడు గా ఘనత సాధించాడు'

‘ఆయనతో పాటు టెంజింగ్ నార్గే పేరు మరవకు. ఈ విశేషం జరిగింది 29 మే 1953 న'

‘ఎవరెస్టూ... మేరు ..అదే సుమేరు ... ఒకటేనా వాయునందనా'

‘అది.. పెద్దలు మహాదేవు లు చెప్పగలరు.. చల్లని కొండ మీద ఆయనికి ఎవ్వర్ రెస్ట్ దొరుకుతుంది కదా. సంకీర్తనాచార్యులొకరు సుమేరు మధ్య వాసినీ ..అని అమ్మ వారిని కీర్తించారు. ఇలాంటి సిద్ధార్థ బసు ప్రశ్నలన్నీ అమితాబ్ బచ్చన్ మళ్ళీ వచ్చున్ .. కరోడ్ పతి ప్రోగ్రాం లో అడుగున్ . చూడబోతే.. నువ్వు నన్ను పిలిచింది టీవీ చానెల్కా అని అనిపిస్తోంది'

‘నువ్వేదో మాలోకం వాడివి, రామభక్తి తప్ప ఎరుగనివాడివి అని అనుకున్నా .. నీకు మా లోకం సంగతులన్నీ తెలుసే'

‘హిందీ సినిమాల్లో సీరియల్లో నా పాత్ర పోషించి అలిసి పోయి నాలో కలిసిపోయిన పహిల్వాన్ దారాసింగ్ నాకివన్నీ చెప్పాడులే. అంతకు ముందు ‘రాం కా నాం బద్నాం నా కరో ' అంటూ తలెగరేస్తూ మీ ఎవ్వర్ గ్రీన్ దేవానంద్ కూడా వచ్చేశాడు. ఇపుడిప్పుడే పుష్పా ఐ హేట్ టియర్స్ అంటూ తల పంకిస్తూ సూపర్ స్టార్ రాజేశ ఖన్న ఖిన్నుడై వచ్చాడు'

‘రాజేష్ ఖన్నా నీ పాట లేవీ పాడలేదే.. అయినా వీళ్ళంతా నీ దగ్గరికి ఎందుకొచ్చారు?'

‘రాజేష్ జై జై శివ్ శంకర్ అని పాడి ఆడి మిమ్మల్ని ఆకట్టుకున్నాడు. మాకు హరి అయినా హరుడై నా ఒకటే.. మా రాముడు ..రామేశ్వరం ..అదీ . మరిచావా ? ఇంతకీ ఈ నటులంతా ఎందుకొచ్చారంటే .. సంజీవినీ రహస్యం చెప్పి ఉంటే నిండు నూరేళ్ళు ఇంకా సినీ సేవ చేసేవాళ్ళం అని చెప్పడానికి'

‘అలాగా? ఈ మధ్యనే దాదాపు నూరేళ్ళు జీవించి స్వర్గానికి తరలిపోయాడు ఒక పాతతరం క్యారెక్టర్ నటుడు ..పేరు హంగల్. చనిపోయాడా... అయ్యో పెద్దాయన పాపం అని ఒక్కడంటే ఒక్కడు సినీ పెద్ద వాటికకి సరే... ఇంటికి కూడా రాలేదు. మృత్యువుని ఎవరూ జయించలేరు కదా మారుతీ దేవా .. మా శ్రీశ్రీ కవిగారు గాంధారీ గర్వభంగం సినిమా – డబ్బింగ్ లెండి.. మాతృక మరాఠీ అనుకుంటా... ఆ సినిమాలో మనుష్యుడిల మహానుభావుడే.. అని మనిషి గొప్పతనాన్ని ప్రస్తుతిస్తూ ఒక గొప్ప పాట రాశారు. అందులో ఆయన అన్నారు- జరామరణములను దాటి సదా అమరకీర్తి నందగలుగు ధీరుడోయి మానవుడు ..అని'

‘అదొక్కటే మానవులకు అసాధ్యం. రాసినంత సులువు కాదు నాయనా, అసలీ సృష్టి రహస్యమే మీకు ఇంకా ఒక వింత'

‘ఈ మధ్య గాడ్ పార్టికిల్ విషయాన్ని కనిపెట్టేశారు మానవులు ..అదే సైంటిస్టులు. శ్రీశ్రీ గారు ఇంకా ఏమన్నారంటే – ఈ గాంధారి గర్వభంగం చిత్రం విడుదలైన తొలిరోజుల్లోనే తొలి మానవుడు గగారిన్ భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి రోదసి యాత్ర చేస్తూ ధరణి పరిభ్రమణం కావించడం కూడా ఆ చిత్ర విజయానికి కారణం కావచ్చును.. అని'

శీశ్రీ గారి శైలి అద్భుతం. పాట ఎంత సులభంగా అర్థమయ్యేలా చెబుతారో మాటల రాత కూడా అంతే తేటతెల్లం... ఈయన రాసిన పాటనే ఒక దశాబ్దం తరువాత ఆరుద్ర కవి గారు అనుసరించారు'

ఆరుద్ర కవి గారంటే ఎన్నో రాముడి పాటలు రాశారని ప్రేమా నీకు?..వెంటనే చెప్పేశావ్ ఆంజనేయా?'

శ్రీశ్రీ గారు ఏకంగా రాముడి మీద హరికథ రాశారు కదా'

‘నీతో వేగలేను .. వేగాన్ని జయించిన వాడివి పైగా.. వేలికేస్తే కాలికేస్తావ్'

‘అయితే నా వేలూ,కాలూ ఒదిలేసి తోక పట్టుకో ... కీలుగుఱ్ఱం సినిమాలో మీ నాగేశుడు ఎగిరినట్టు వేగంగా గగన విహారం చేయిస్తాను'

తాతాజీ అనబడే తాపీ ధర్మారావు .. కాదు సుమా కల కాదు సుమా .. అని పాడించారు అప్పుడు, అప్పటికే హీరో ఎక్కడో కునుకు తీస్తూ కలగంటున్నాడేమో అని జనం అనుమానించకుండా ఉండడానికి. ఇంతకీ తాతాజీ ని అనుసరించి గడ్డం పెంచుకున్న మా ఆరుద్ర శ్రీశ్రీ గారి పాటని అనుసరించి రాసిన పాట ఏదో చెప్పనా?'

మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు .. అని చెప్పాలని నీ ఉబలాటం. అవునా? వీళ్ళ మధ్య మీ డాక్టర్ కవి సినారె ..భలే మొనగాడు '

‘అదేమిటీ ఆయన ఆచార్యులు.. మా కవి గురువులు .. ఆయనకి పాటల సాము గరిడీ తెలుసు కానీ కండల వీరుడు కాదు'

‘నా చమత్కారం.. భలే మొనగాడు సినిమా.. అందులో ఆయన మనిషి తలుచుకుంటే గిరులు ఝరులుగా పొంగవా ..అని నానా హడావుడి చేశారు. అంతటితో ఆగక ..మనిషి సత్యాగ్రహమే ఆయుధమ్ముగా మృత్యువునే ఎదిరించడా? అని ప్రశ్నించారు. సత్యాగ్రహం మహాత్ముడి ఆయుధం. కాని మహాత్ముడు మృత్యు వాత పడక తప్పలేదు. మనుషులంతా ఒక్కలాగ ఉండరు కదా. మంచి చెడు అన్నవి జంట పదాలు. మంచి చెడుని లేకుండా చేస్తుంది అనుకోవడం భ్రమ. చెడు మంచిని శ్రమ లేకుండానే చంపేస్తుంది. ఒక్క మంచే గనుక ఈ భూమ్మీద ఉంటే కేవలం పుట్టుకలే ఉండేవి. చావులు చచ్చినట్టు చచ్చేవి'

‘మీరు చెప్పిన పాట మొత్తం గుర్తొచ్చింది. చంద్రబింబమున పందిరివేసి ... అని రాశారాయన. ఆయన ఒక ఏడాది ముందే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ సాధించబోయే ఘనకార్యం ఊహించినట్టున్నారు. మంచి అనగానే నాకు మా దాశరథి కవి గారి పాట గుర్తొచ్చింది.. మంచిని మరచీ వంచన నేర్చీ నరుడే ఈనాడు వానరుడైనాడు.. అని అన్నారాయన'

‘అదే నాకు నచ్చనిది. నరుడు, వానరుడు ఏదో ఒక దానికి మరోటి వ్యతిరేక పదాల్లా అనేస్తుంటారు మీరంతా'

‘కోపగించుకోకు స్వామీ.. మనిషి బుద్ధిని కోల్పోతే వానరుడితో పోల్చడం మాకు పరిపాటయ్యింది. దాశరథి కవి ఆ పాటలో మనిషి చంద్రలోకము జయించాడు .. అని కొంత మెచ్చుకున్నారు. ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు ..అని చురక వేశారంతే'

‘దీనికి ముందర మీ దేవులపల్లి కవి ..అసలు మనిషైతే మనసుంటే కరుణ కరగాలిరా**..** అని ఉన్న మాట చెప్పారు. కరుణ అనేది ఇప్పుడు భూలోకంలో దారుణంగా దగా పడింది'

‘అది అమాయకుడు పాడుకోబట్టి అలా అన్నారేమో. కాని ఒక భలే రంగడు మాత్రం డబ్బు లేక సుఖం లేదు, సుఖం లేక బతుకు లేదు ..అని అంటాడని దేవులపల్లి వారే రాశారు. అలా కానీ డబ్బుంటే ..ప్రతి రోజూ చంద్రుణ్ణి పలకరించి రావచ్చు .. అని కూడా అనిపించారు'

‘ఇప్పుడు జరుగుతున్నది అదే.. మీ స్పేస్ రిసర్చ్ అణా పైసలతో జరిగేదేనా? ఎంతెంత కావాలి! ఒక్కోసారి మూడు వందల కోట్లు అలా చూస్తుండగా సముద్రంపాలు కావట్లేదూ..'

‘పొతే పోయింది.. మళ్ళీ రాబట్టుకోవచ్చని నమ్మకం. చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళు ఉన్నాయనగానే అక్కడ స్థలం కొనేద్దామని అప్పుడే ఆరాటపడుతున్నవాళ్ళు ఉన్నారు స్వామీ'

‘చందమామ ఈ చేతులకందేనా? అని మీ దేవులపల్లి వారు కోర్కెను వెళ్ళబోసుకోలేదూ?'

‘పట్టేశావ్ ... యూ ఆర్ గ్రేట్ మహానుభావా.. మనసుకవిగా పిలుస్తామే.. మా ఆత్రేయ గారు అడపా దడపా పాటల్లో మనిషి మీద కోపగించుకున్నా తల్లిదండ్రులు సినిమాలో మాత్రం ఓ చక్కని మనిషి పాట రాశారు మంచితనం, మృగత్వం ,వికలమైన మనసు, వికటమైన మమత, మనుగడ, మానవత, స్వార్థం,త్యాగం.. ఇలా ఎన్నో అంశాల మధ్య మనిషిని చిత్రించారు'

‘అప్పుడు సరే .. ఈయనే రాశారో.. ఇంకెవరో కానీ ... ఆ తరువాతి కాలంలో కోతినుంచి పుట్టాడు మానవుడు అని హేళన చేశారు. శ్రీ రాముడై చిక్కులపాలై చివరికి కోతే దిక్కనుకున్నాడు .. అని ఎద్దేవా చేశారు'

‘చెప్పా కదా స్వామీ.. బుద్ధి వక్రిస్తే నరుడు వానరుడు అయినట్టే అని భూలోకోక్తి. అలా చెప్పాల్సి వస్తే ఇలానే రాస్తారు'

ఆత్రేయ గారు మరోసారి అనలేదూ... మనిషి మనిషికి తేడా ఉంది.. తేడాలో ఒక పోలిక ఉంది ..పోలిక చూస్తే కోతులము.. తేడా చూస్తే మనుషులము... అని'

డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం వల్ల ఇదంతా జరిగింది. వెక్కిరింపులకి సైతం ఇంపుగా ఉండేలా కోతి శబ్దం వాడుతారు. దేవులపల్లి కవి గారు సరదాగా కోతీబావకు పెళ్ళంట ... అని అన్నారు కదా స్వామీ.. సరే.. ఈ మేటర్ని ఈ డార్క్ మేటర్లో వదిలేద్దాం. ఈ విశాల విశ్వమంతా పంచభూతాల దయా భిక్ష కదా. ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు – వీటి సమన్వయమే మా మానవ ఉనికి. అయితే ఈ పంచభూతాలు మనిషికి ఏం బోధిస్తాయన్నది శ్రీశ్రీ గారో మరెవరో ఓ పాటలో బాగా చెప్పారు. ఆకాశం లాంటి విశాల హృదయం , భూమి కున్నట్లే సహనం, గాలి కుండే చల్లని గుణం, నీరులో కన్నీరు, అన్యాయాలు దగ్ధం చేసే అగ్నితత్వం .. ఇవన్నీ మనిషిలో ఉండాలట'

‘అనుకోవడంలో ఆనందం ఉంది. అయినా మనిషి నడవడిక ఇంచుక ఒక ఇంచీ అయినా మారలేదు..'

పింగళి వారి మాటలు గుర్తు చేస్తున్నావు పావనీ ... మనిషి మారలేదు ..అతని మమత తీరలేదు... కాంక్ష తీరలేదు...బాధ తీర లేదు... అని వారు ఘంటాపథంగా చెప్పారు'

‘అవి ఉండబట్టే మనిషి ఇంకా ఏదో సాధించాలి అని నిత్య శోధనలో ఉంటాడు. అదిగదిగో గగన సీమ .. అందమైన చందమామ..'

‘ఇంత దూరం వచ్చినా చందమామ ఇంకా దగ్గర కావడం లేదు, సాపేక్ష సిద్ధాంతమా స్వామీ. అయినా స్వామీ దేవులపల్లి వారి పాట గుర్తు చేశావు కనుక చంద్రుడు దగ్గరైనట్టే'

‘సాపేక్షమంటే అంతే.. ప్రేయసి ముందు యుగం ఒక క్షణం.. నిప్పుల ముందు క్షణం ఒక యుగం'

‘బ్రహ్మచారివి ... ఇంత చక్కగా ఎలా చెప్పేవ్?'

‘మీ పింగళి కవి గారూ బ్రహ్మచారులేగా ... వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమి లోనే చల్లనేలనో ... అని అబ్బురపడలేదూ? బ్రహ్మచారులంటే... బ్రహ్మ పురంలో బ్రహ్మ పథం మీద నడిచేవారు ... తెలుసుకో'

‘అందుకే మీకు సరస్వతీ కటాక్షం దక్కింది... నాకో సందేహం స్వామీ.. ఆకాశ వీధిలో వెన్నెల ఉంటుందా? చంద్రుణ్ణి భూమ్మీద నుంచి చూస్తే ఎప్పుడూ ఒక వైపే కనిపిస్తాడట. ఇంత దూరం వచ్చేం.. రెండో వైపు చూస్తున్నానా?'

‘నీకు తెలియదు రహస్యం.. రెండో వైపు నుంచి తారను చూస్తాడు'

‘చిలిపి... స్వామీ.. భూలోకంలో ఇప్పుడు అధిక మాసం నడుస్తోంది. చంద్రుడు ఎక్స్ ట్రా గా ఏ తారని చూస్తాడో?'

‘సినీ తారని ..అని నానుంచి బదులు ఆశిస్తున్నావా?'

‘చెప్పాగా.. నీతో వేగలేం'

‘వేగ డానికి నేనేమైనా వంకాయనా? దుంపనా?...అదిగో వేగా... నిన్నక్కడ దింపనా?'

‘వేగా .. అంటే అభిజిత్ నక్షత్రం. దీన్ని కూడా చేర్చితే 28 నక్షత్రాలు అవుతాయట కదా?'

‘అలా కాదు.. ముందున్న నక్షత్రం కొంచెం కనుమరుగవుతుంది. అలా ఎప్పటికీ 27 నక్షత్రాలే మిగులుతాయి'

‘అప్పుడు మా చాంద్రమాసం లెక్కలన్నీ మారి పోతాయే'

‘అందుకే.. ఇంగ్లీషు వాళ్ళు ఏదో ఒక కాలెండర్ చాలు బాబూ అని సరి పెట్టుకున్నారు. అలాగనీ.. పున్నమీ అమావాస్య వాళ్లకి అక్కరలేదని కాదు.. వన్స్ ఇన్ బ్లూ మూన్ అని అన్నది వారే'

‘సమయానికి గుర్తు చేశావ్ సుందరా . మొన్న ఆగస్టు నెలాఖరున వచ్చిన పున్నమి నాడు చంద్రుడు బ్లూ మూన్ అట. ఇంగ్లీష్ కాలెండర్ లో ఇలా ఒకే నెలలో రెండు పున్నములు వస్తే బ్లూ మూన్ అంటారట. అంతేగానీ అందరూ అనుకున్నట్టు నీలి రంగులో కనపడడు'

‘చంద్రుడి గురించి మీ పూర్వీకులు వరాహమిహిరులు ఎంతో చెప్పారు. చంద్రు డంటే సలిల గ్రహం అన్నారు. అంటే నీటి ఆనవాళ్ళు చూచాయగా సూచించినట్టే కదా. పైగా కర్క రాశి జలరాశి. దానికి అధిపతి చంద్రుడు అని కూడా వివరించారు. ఇప్పుడు బోలెడంత ఖర్చు పెట్టి మీ వాళ్ళూ , విదేశీయులూ చంద్రుడిలో నీరు వెదుకుతున్నారు'

‘ఆయన అన్నది జ్ఞానం కోసం, మేం వెరిఫై చేసేది మా భవిష్యత్ మనుగడ కోసం. ఇంకా ఏఏ చోట్ల వనరులుంటాయో పసిగట్టి కొల్లగొట్టేయడమే మా పని. చంద్రుడు సోముడు.. అతనిది సోమవారం. ఆ( స్వామీ.. నీది మంగళ వారం. నీకు మంగళ గ్రహం తో అనుబంధం ఉందా? మంగళ, కుజ, అంగారక ..ఇలా ఎన్నో పేర్లున్న అరుణ గ్రహం నీ స్వంతమా? ఎర్రగా నీ మూతి ఉందనీ అతనూ ఎర్రటి వాడనీ మీ ఇద్దరికీ జత కలిపేరా? అగ్ని కి అధిపతి సూర్యుడిలాగే కుజుడు కూడా కదా. ఏదో క్యూరియాసిటీ .. అడిగా అంతే'

‘అయ్యిందా అడగటం.. క్యూరియాసిటీ అనగానే అనుకున్నా ‘నాసా'మి రంగా .. వాళ్ళు మార్స్ మీదకి పంపిన రోవర్ ...పేరు క్యూరియాసిటీ కదా ... దాని ప్రతిభ గురించి నువ్వు అడుగుతావని'

‘స్వామీ.. అక్కడ కొండా మట్టీ అమెరికా లో ఓ ప్రాంతాన్ని పోలి ఉన్నాయట. క్యూరియాసిటీ ఫోటోలు పంపింది'

‘రేపు మీరూ పంపిస్తే .. అక్కడ మట్టీ అవీ అచ్చం ఇండియాని పోలి ఉన్నాయనే అంటారు. లేకపోతే వాళ్ళు యంత్రాన్ని పంపి మరో దేశానివి పోలి ఉన్నాయని అంటారా? రాకేష్ శర్మ గారిని ఇందిరమ్మ ఇండియా ఎలా కనిపిస్తోంది అంటే .. సారే జహా( సే అచ్ఛా హిందుస్తా హమారా.. అని అనలేదూ..ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది'

‘మా వాళ్ళు మార్స్ మీద వాతావరణం లేకపోయినా అక్కడ మిథేన్ వాయువు ఎలా ఉంటోంది అని బండారం బయట పెడతారట'

‘మంచిదే.. గోమయం అదీ అక్కడ లేదే .. కామధేనువు గానీ తిరిగిందేమో'

‘జోకులేమిటి స్వామీ .. ఇందాక నువ్వన్నావే.. వరాహమిహురులు అనీ.. ఆయన అన్నారు కుజ గ్రహం ఒక నక్షత్ర కూటమి వైపు పయనిస్తే ఒక ముఖం కలిగి ఉంటాడని, అలాంటివి అయిదు ముఖాలుంటాయని...'

ఉష్ణ వక్త్ర, అశ్రు ముఖ, వ్యాల వక్త్ర, రుధిరానన, అశి ముసల ... ఆ అయిదింటి పేర్లు'

‘ధన్యుడిని స్వామీ.. మరి ఇవన్నీ మనవాళ్ళు ఎందుకు స్టడీ చేయరూ? ఆయన అంత కచ్చితంగా చెప్పగలిగినప్పుడు క్యూరియాసిటీ ఎందుకుండదో? ఏదో కంటి తుడుపు అన్నట్టు బుధ గ్రహం లోపలి పొరలు మూడిటికి వ్యాస మహర్షి, వాల్మీకి ముని, త్యాగరాజ స్వామి వార్ల పేర్లు పెట్టారు. చంద్రుడి పొరల్లో ఒక దానికి గగారిన్ పేరు పెట్టారు. రేపు ఆర్మ్ స్ట్రాంగ్ పేరు చంద్రుడి మీద వినిపిస్తుంది. ఇంతవరకు ఆర్యభట్ట, వరాహమిహురుడు, బ్రహ్మగుప్తుడు... లాంటి ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞుల పేర్లు ఎక్కడా వినిపించలేదు. కనీసం మనవాళ్ళు చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళ స్థానాలకి ఆ పేర్లు పెడతారని ఆశించడం నీటి మీద రాతేమో. నిన్నటి ప్రతిపాదనలు, ఇవాళ్టి టెక్నాలజీ అనే పాత కొత్తల మేలుకలయికతో ఎన్నో విషయాలు ఆవిష్కరించవచ్చు. దీనికి నా దేశం, నీ జాతి, నా మతం, నీ కులం, నా పార్టీ నీ గీర్టీ లాంటి అవరోధాలు అడ్డురాకూడదు. వాస్తవం అంత సజావుగా లేదు.

ఎందుకీ లంపటాలు.. మేమేమన్నా అలాంటి ప్రయత్నాలు చేశామా ... మా కన్నా మీకు గొప్పగా తెలుసా? ఏదో ప్రవాహంలో పడి వెళ్ళిపోకుండా ఏటి కెదురీదడం నాన్సెన్స్ లాంటి చీవాట్లు గురువుల నుంచి , పెద్దలనుంచి దక్కుతున్నాయి.

ఆంజనేయా .. ఆలోచించి ఆలోచించి తలనొప్పి వస్తోంది... తల నొప్పి...తలనొప్పి..

ఆంజనేయా తోక వెంట్రుక ముక్కుకి తగిలి తుమ్మొచ్చింది. హాచ్..

అయ్యో ..అయ్యో.. పట్టు తప్పుతున్నా. నన్ను వదిలేయకు సు...మీ...'

----------------------------------------------------------------

దభీమని మంచం కింద పడ్డ నన్ను లేపి ..

‘ఏవి(టోయ్.. తలనొప్పి తలనొప్పి.. అంజనం ..అంజనం.. అంటున్నావ్. తుమ్ముతున్నావ్. నిజంగానే పడిశం అనుకునీ అమృతాంజనం రాయబోయాను .. కలగంటున్నావా? పైగా కలలో పలవరింతలూనా? ఏ సినీ హీరోయినో రావాలి గానీ .. కలలో జబ్బుల గొడవేమిటీ? ఈ పడిపోవడాలేమిటీ'- అంటూ శ్రీమతి వేస్తున్న కేకలకి పూర్తిగా నిద్రా, కలా, కలలో ఆంజనేయుడూ ...ప్చ్... అన్నీ హుష్ కాకి! దభీమని మంచం కింద పడడమే వాస్తవమా హయ్యో...చివరికి!

------------------------------------------------------------------------------------------------------

{మధ్యలో పాటల ప్రస్తావన రానే వచ్చింది ..అవన్నీకనులు చూసినా పాటే , కనులు చదివినా పాటే లో పదం పదం అధిక భద్రం గా ఉన్నాయి , అధిక భాద్ర పద మాసం కదా అందుకనే!

టీచర్స్ డే కి ప్రత్యేకంగా ఎటువంటి రచనా లేదు. ఆర్యభట్ట, వరాహమిహురుడు, బ్రహ్మగుప్తుడు ... వీరంతా కాళిదాసు,జయదేవులు సాహిత్యం అందించి గుర్తుండిపోయినట్టు సామాన్య జనానికి గుర్తుండరు. మనం మరచిపోతున్న ఈ గురువులుకి ... శిరసు వంచి మనసారా ప్రణామాలు.. వారి ఋణం పాటలతో తీరదు.

ఇంపైన నాట్య సంగీత సాహిత్యాల మేళవింపు ఆయా రంగాల గురువు లందజేసిన ఉమ్మడి వరం. కనులు చూసినా పాటే...కనుక అక్కడంతా నయన మనోహరం }

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 01 సెప్టెంబర్ 2012