Krishnaprema Logo

కృష్ణప్రేమ

తనువును ...నిలవనీయదు...విడదు...తనివి  అంటే అదే మరి

09 ఆగస్టు, 2013

తనువును ...నిలవనీయదు...విడదు...తనివి  అంటే అదే మరి

Picture

ఏవీఎస్ అన్నట్టు అదో తుత్తి.....

డా క్టరూ, సంగీత జ్ఞాని అయిన కీర్తిశేషులు శ్రీపాద పినాకపాణి గారు తృప్తిగా నిండు నూరేళ్ళు జీవించినట్టే భావించాలి. ఎందుకంటే వృత్తిలో తృప్తి లేనిదే పరుల బాగు కోసం వైద్యసేవ చేయడం కష్టం కనుక. ప్రవృత్తిగా సంగీత విద్య నభ్యసించి పదిమందికి నేర్పడంలోనూ ఎంతో తృప్తి ఉంది కనుక. రోగాలు మాపేవి రాగాలు అని ఆయన ద్వారా తెలుసుకున్న వారంతా ఎప్పుడో ఒకప్పుడు ఆయన్ని రెండు చేతులా నమస్కరించి తృప్తి పొందే ఉంటారు. తృప్తిగా బతక నిచ్చేది మంచి నీరు కాబట్టి ఆయన వల్ల బతికి బట్ట కట్టిన ఉత్తరాది వారొకాయన పినాకపాణి అంటే ‘పీనేకా పానీ' అని తృప్తిగా చమత్కరించారు.

డాక్టరూ, రచయితా అయిన కీర్తిశేషులు కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఒకనాటి జ్యోతి మాస పత్రికలో ‘మనిషికి ఏం కావాలి?' అనే సీరియల్ పూర్తి చేస్తూ చిట్ట చివర్న రెండంటే రెండే అక్షరాలున్న, బోలెడంత అర్థమున్న పదం వాడారు - అది ‘తృప్తి!'. నిజమే మనిషికి ఏం కావాలనే ప్రశ్నకి ఇవ్వాల్సిన సమాధానం ‘తృప్తి'యే.


డాక్టరూ, నటుడూ, కథకుడు అయిన కీర్తిశేషులు ఎం.ప్రభాకర రెడ్డి నిర్మించిన నాలుగైదు సినిమాలు (పండంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, నాకూ స్వతంత్రం వచ్చింది, కార్తీక దీపం, ఎట్ సెట్రా) ఆయనకి తృప్తి నివ్వబట్టే చూసిన అప్పటి ప్రేక్షకులు కూడా తృప్తి పొందారనే చెప్పొచ్చు.

అల్లు అనగా హాస్యపు జల్లు అని ప్రేక్షకులు రామలింగయ్య ను కీర్తిస్తే ఆయనకే మాత్రం తృప్తి కలగదు కానీ ‘మీ హోమియోపతి మందులు అమోఘం' అంటేనే ఆయనకి తృప్తి.

అలాగే హిందీ సీమలో అశోక్ కుమార్ ఒక పక్క నటిస్తూనే హోమియోపతి మందులిచ్చి తృప్తి పరచే నటుడని ఖ్యాతి.

ఇప్పుడు చెప్పుకున్న ఇంతమందీ కీర్తిశేషులైన డాక్టర్లు కావడం విశేషం కావొచ్చు. అలాగని వారికి మాత్రమే ‘తృప్తి' లభించింది అంటే ఇంకెందరినో కించ పరచినట్టే అవుతుంది.

ఇంకో రకం డాక్టర్లు ఉన్నారు. పరిశోధకులుగా కీర్తి గడించిన వారు. వీరిలో ఇండియాలో శోధిస్తూ రూపాయలతో తృప్తి పడే వారొక రకం అయితే విదేశాల్లో సాధిస్తూ డాలర్లతో తృప్తి పడే రకం మరొకటి. అవసరాల రామకృష్ణారావు వంటి అరుదైన ఆచార్యులుంటారే వారు మాత్రమే ‘పోయేటప్పుడు మన వెంట రావు' అని తమ అవయవాలన్నీ అవసరమైన వారికి పనికొచ్చేలా చూడండని తృప్తిగా కన్ను మూయగలరు.

కూతురు తన స్వంత అవయవ దానం చేసి తనకి మరో జన్మ ఇచ్చిందని ఎంత తృప్తిగా హాస్య నటుడు ఎ.వి.ఎస్. చెప్పారూ!

ఒక ఇల్లు, ఒక ఇంతి నినాదంతో తృప్తి పడే జనాభా ప్రపంచంలో బహుశా ముప్పాతిక వంతు ఉండవచ్చు. బహువచనానికి దారిచ్చి తృప్తి పడే జనాభా ఆ మిగులు పాతిక వంతే కాబట్టి పోన్లే అని తృప్తి పడొచ్చు.

లెక్కకు మించిన గీతాలు ( అందులో ‘నీ ఇల్లు బంగారం కానూ' ఒకటి) రాసిన కీర్తి శేషులు వేటూరి సుందరరామ మూర్తి గారికి తనకంటూ ఒక ఇల్లు భాగ్యనగరంలో కుదరలేదంటే ఇంత వెలుగు వెలిగిన ఆయనకేం తృప్తి మిగిలి ఉంటుంది?

మనసు మీద పేటెంట్ లాంటిది ఉంటే కచ్చితంగా తనకే దక్కేలా అన్నేసి ‘మనసు' పాటలు రాసిన కీర్తిశేషులు ఆచార్య ఆత్రేయ గారు ‘కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరుజన్మ రావాలని' ఒక పాటలో అభిప్రాయ పడ్డారంటే ఇంకా ఈ జన్మలో ఆయనకీ ఎక్కడో తీరని తృప్తి ఉన్నట్టే కదా.

అసలు ఆడా అని గానీ మగా అని గానీ కాదు, మనిషికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది?

సంసారుల సారాంశం ఇదీ...

సగటు మనిషికి కచ్చితంగా నెలాఖర్న వచ్చే జీతం తృప్తి నిస్తుంది. అది కాస్త మొదటి పది రోజులకే అనే వేదాంతం మళ్ళీ అసంతృప్తి లోకి తోసేస్తుంది.

ఆ వచ్చిన జీతమిలా ఇవ్వండి అని గోముగా అడగ్గానే చేతికిచ్చేసే భర్త నైజమంటే భార్యామణి కెంత తృప్తి!

వేళకింత కూడొండిపెట్టి వడ్డించే భార్యామణిని రోజూ కృతజ్ఞతగా చూడడంలో బంగారు భర్త కెంత తృప్తి!

‘కలో గంజియో తాగి పడుందాం' అని కల్లు ముట్టని పేద మొగుడు వెల్లడి చేసినప్పుడు తల్లడిల్లక కంటి తడి కనపడనీయక నవ్వేసే బీద పెళ్ళాం మనసుకీ తృప్తి ఉంటుంది.

రోజూ ముందు అట్లు తరువాత ఆవిడ చేత అలవాటుగా చీవాట్లు తిని బతుకు ఈడ్చే మధ్య తరగతి మగడికి రోడ్డు మీద జుట్లు పట్టుకు పోట్లాడే సాధారణ దంపతులెదురైతే వచ్చే తృప్తే వేరు.

నడిచేవాడికి పేవ్మెంట్ ఖాళీగానూ, ఆవు పేడ లేకుండా కనిపిస్తే ఎంత తృప్తి.

పిడకల వాడికి అదే పేవ్ మెంట్ మీద పేడ కనిపిస్తే ఎంత తృప్తి!

కుర్రకారు సారాంశం ఇదీ...

పీడకల తప్ప వేరే రాని పరమేశానికి తొలిసారిగా ‘మీది సైకాలజీ గ్రూపా?' అని పూర్ణిమ అడిగితే ఎంత తృప్తి!

సైకిలిమ్మంటే స్కూటరిచ్చిన తండ్రి పర్సు కన్నా మనసే గొప్పదని గ్రహించడమే కొడుకు పొందే తృప్తి.

తన ఈడు సుందరేషుని రోజూ స్కూటరు మీద చూడడం కారులో షికారు కెళ్ళే కామరాజు కెంతో తృప్తి.

ఫేవరేట్ హీరో పేరు రోజుకి పది సార్లు జపించనిదే తృప్తిగా నిద్ర పోరు కొందరు కాలేజీ కుర్రాళ్ళు.

అవతలి వాళ్ళ హీరో సినిమా ఆరో రోజునే చెట్టెక్కేస్తే ఇవతలి హీరోభిమానుల కెంత తృప్తి!

భాగ్ మిల్కా భాగ్ ' సినిమాకి టాక్స్ ఫ్రీ అని వినగానే ఎంతమంది తృప్తిగా ఆ సినిమా ఉన్న థియేటర్ వైపు కుర్రకారూ, పెద్దకారూ పరిగెత్తారూ!

హాస్టల్ లో మంచానికి పక్కనే ఆరడుగుల భామ బూతు భంగిమ అంటించడంలో కుర్రాడికి ఏదో తృప్తి ఉంది అని అనుకుంటే పొరపాటు. అది చూసి మతి పోయి వేరేవాడు ఫెయిల్ అవ్వాలనే ఎత్తుగడే ఆ కుర్రాడికి అమితమైన తృప్తి నిస్తుంది.

సంఘం, సమాజం అంతటా ‘తృప్తి' రాజ్యమేలుతుంది.

మూడు రంగులు ఒక దాని కింద ఒకటి ఒద్దికగా ఉండి జెండా రూపం పొందడం వల్ల ఎంత తృప్తి కలుగుతోందీ! 'ఝండా ఊంచా రహే హమారా ' అని ఎలుగెత్తి పాడుకోవడంలో ఎంత తృప్తి ఉందీ!

మూడు ముక్కలు అతికినట్టున్న భూభాగం నుంచి ఒక ముక్కను వేరు చేయడంలో తృప్తి పొందేది భూకంపమే. లేదా భూకంపం లాంటి ఆలోచనే! శకుని మామల వంటి వారి తృప్తి నిర్వచనమే వేరు.

అనుకోని వాటా అప్పనంగా చేతికొస్తున్నా ‘నాకేం తృప్తి లేదు' అని నీల్గడంలోనూ రాజకీయ తృప్తి ఉంటుంది.

స్కాములోళ్ళమయ్య మా పెగ్ చూడరయ్యా- అని బారెడు చిందులు వేసే నేతలకి నిత్యం తృప్తే.

బారు డాన్సులు మూసేసి ప్రభుత్వం తృప్తిగా మేను వాలిస్తే తెరవమని కోర్టు ఆర్డరిచ్చి తృప్తిగా జారుకుంటుంది.

రాజధాని నగరంలో అరవై ఏళ్ళ నాడు సర్వీసు పూర్తయిన వెంటనే సొంత ఊరులో స్థిరనివాసం ఏర్పరుచుకుంటే తమ ముందు చూపు పట్ల ఎంత తృప్తి కలుగుతుందీ!

సొంత ఊరులో ఎదుగూ బొదుగూ లేదని రాజధాని వైపు ఒకప్పుడు పరుగు తీయడంలో పొందిన తృప్తి, తరువాత జీవనం ఇరకాటంలో పడగానే రాదేం?

భాష కాని భాషా ప్రాంతంలో కాలు మోపిన క్షణంలో ‘మీరు తెలుగా?' అనే అమృత వాక్కు వినిపిస్తే అప్పుడు కలిగే ఆ తృప్తే వేరు. ‘యా మీ టెల్గూ' అని అప్పుడూ ఇంగ్లీషులో బదులివ్వడంలోనే తృప్తి ఉంది.

ఈ తృప్తి అనే విశేషణానికి ఎటువంటి లింగ బేధాలు లేవు. ఎటువంటి కుల,మత, జాతి వైరుధ్యాలు లేవు. ఎటొచ్చీ ఇలా టయిపు చేస్తే వచ్చేసే ‘తృప్తి' అనే పదం రాయమంటే ఎందరికో తృప్తి నివ్వదు. త్రుపై అనో తృపై అనో తురుప్తి అనో (తురుఫ్ తీ అన్నట్టు) రాయడంలో వారికి తృప్తి ఉంటుంది.

అతనివి ఇతనివి కావు ఇష్టాలు అందరివీ:

‘తనవ' అనే వ్యర్థ పదం బాగా కొమ్ములొచ్చి ‘తనువు' అయితే చక్కగా గుడులొచ్చి ‘తనివి ' అయ్యింది. అందుకేనేమో కొమ్ములొచ్చిన ‘తనువు'కి లేని తృప్తి గుడులున్న ‘తనివి 'కి దక్కింది. ఔను, తనివి కి అర్ధం తృప్తి అనే అంటోంది నిఘంటువు.

గుడిని తలుచుకున్నాం కనక ఒక్కసారి పురాణ కాలానికి పోదాం. త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడు సీతని, సీతమ్మ తల్లి రాముణ్ణి ఒకర్నొకరు ఎంత సేపు చూసుకున్నా ఇద్దరికీ తనివి తీరలేదనే చదివుంటాం. ‘శ్రీరామ చంద్రుడి ఆజానుబాహు రూపాన్ని అలా ఎంత సేపు చూస్తున్నా తనివి తీరడం లేదు' అంటాడు రామ భక్తుడు కలియుగంలో.

తాను శ్రీరామ బంటు కావడం హనుమంతుడికి కలకాలం తృప్తినిస్తే లంకలో ఉన్న విభీషణుడికి కొద్దికాలంలోనే రామసేవా భాగ్యం దొరికినందుకు తృప్తి నిచ్చింది. వీరందిరి మీదా పద సంకీర్తనలు రాసి శ్రీ వెంకటేశ్వరుడికి ఎన్ని సమర్పించుకున్నా తాళ్ళపాక అన్నమయ్య కి తనివి తీరలేదు. చివరికి అన్నిటినీ మూటగట్టి దాచుకోవయ్యా అని తృప్తిగా సీల్ వేశేశాడు. అదే అన్నమయ్య సంకీర్తనల్ని మళ్ళీ ఇన్నాళ్ళకు తనివి తీరా వినగలుగుతున్నాడు ఏడుకొండలవాడు.

‘నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా' అన్న నాదయోగి త్యాగయ్య తన సంగీత నిధితో తృప్తి పొందినా, ఆ మనీషి భక్తి గానాన్ని ‘ఎందరో మహానుభావులు' తనివి తీరా విని శ్రీరాముణ్ణి సాక్షాత్కరింప జేసుకున్నారు.

శ్రీరామ మందిరం కోసం నిధులు చాలక కటకటాల పాలైన కంచర్ల గోపన్న లో ఉన్న పట్టుదలకి కారణం తనివి తీరని శ్రీరామనామ ధ్యానమే.

‘త్యాగయ, క్షేత్రయ,రామదాసులు తనివి తీర వినిపించిన తెనుగు పాట పాడనా' అని ‘అమెరికా అమ్మాయి ' చేత అనిపించారు గత శతాబ్దంలో కృష్ణశాస్త్రి గారు.

లవకుశ లో ఎన్టీఆర్ ని ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు కదూ? రాముడంటే ఇలాగ ఉండేవాడేమో' అని అయోధ్య వెళ్లి వచ్చిన ఆనందరావంటే, ‘ గోపికకి తనివి కలిగించేలాంటి చిలిపి కృష్ణుడు కూడా ఆయనలాగే ఉండి ఉండాలి' అని అభిమానం ద్విగుణీకృతం చేస్తాడు మధుర నుంచి తిరిగొచ్చిన మన్మథరావు. పైగా ‘కావాలంటే...గోపాలుడు భూపాలుడు ...సినిమాలోని పాట చూడు...'అని ప్రోత్సాహిస్తాడు ఆ కలియుగ కళా పిపాసి (కనులు చూసినా పాటే ).

‘ఏంట్రోయ్...ఫియాన్సీ ఫోటోని అన్ని సార్లు చూస్తున్నావ్.. ఎంత చూసినా తనివి తీరడం లేదా?' అని ఆట పట్టిస్తాడు హాస్టల్ రూమ్మేట్ అప్పటికి తనకే ఏదో అనుభవం ఉన్నట్టు. ‘మంచి మిత్రులు ' కాబట్టి కలలో చెలి ఓరచూపులు చూడకముందే.. నాలుగు వైపుల (నిద్ర) గిరి గీసి ప్రేమ కబుర్లు ముచ్చటించుకుంటారు (కనులు మూసినా పాటే). ఆ పైన ‘తనివి తీర లేదే నా మనసు నిండలేదే ' (కనులు చూసినా పాటే) అని నిద్ర రాక ఒక్కడే గొణుగుతాడు.

తనివికి రెండు క్రియా పదాలు మాత్రమే అన్వయిస్తాయి. ఒకటి- కలగడం, మరొకటి- తీరడం.

తనివి పద ప్రయోగం కనిపించే తెలుగు సినీ గీతాలు తొంభైకి పైగా ఉన్నాయనుకోవడం భ్రమ. అసలు లేవని వాదించేవాడు అజ్ఞాని. ‘ఉన్నా...ప్రతి ఒక్క పాటా శృంగారమయం అయి ఉంటుంది... ఈ తనివి కలగడాలూ తీరడాలూ అన్నీ ఆ బాపతే' అని తేల్చే వాడు జ్ఞాని.

లేకపోతె ‘రాధా..అందించు నీ లేత పెదవి..ఏహే లాలించు తీరాలి తనివి ' అని ఆరుద్ర గారు ఎందుకు రాస్తారూ? (కనులు మూసినా పాటే – కాని చూస్తే బావుణ్ణు అని కోరుకోవడం సహజం, యూ ట్యూబులో పాట చూడ దొరకదు, అది నిజం). ఈ పాటలో సెన్సార పక్షంగా కత్తెర్ల గాట్లు పడినట్టున్నాయి. అందుకే కేవలం ఒకే ఒక్క సారి అనుపల్లవిలో ‘ఏహే లాలించు తీరాలి తనివి' అనే మాటలు వినిపిస్తాయి. పాటలో మళ్ళీ ఎక్కడా పునరుక్తం కావు.

వీరాభిమన్యు ' సినిమాలోనూ ఇంతే.. ‘రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె? ' అనే ఆరుద్ర గారి పాటలో (కనులు చూసినా పాటే) ‘ తనివి తీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ' అనే పంక్తి మరోలా ఉండేదట.

తీరే తనివి, మీరే అలవి ..ఏదో గారడీ ' అని తేల్చేశారు మత్తు మైకంలో ‘మహాబలుడు 'న్న స్థితిని చూసిన ఆరుద్ర ఒకసారి (కనులు చూసినా పాటే - విశాల గగనములో చందమామ). దీన్ని ప్రేరణగా తీసుకున్న ఉషశ్రీ గారు – మగువ సరసన మధువు బిగువున తనివిని నీవొందుమా -(కనులు మూసినా పాటే) అని బోధించారు. తనివి తీరా తాగిన మైకంలో పడితే లేవడం అసహజమే అయినా ప్రేమ మైకంలో పడితే మాత్రం ‘ అలలాగ పడిలేచే అందాల తనివి ' కలగడం నిజం. ఆరుద్ర అదే అన్నారు (కనులు చూసినా పాటే- ఇదియే అందాల మానవ సీమ- ఆర్కైవ్స్ వెతుకు సుమా). ఈ ప్రేమ మత్తులో మునిగిన జంట ‘ తనువులు రెండూ ఒకటైపోతే తనివికి లెఖే లేదు ' (కనులు చూసినా పాటేఓ అందమన్నది ) అని తీర్మానించుకుంటుంది.

ప్రేమ లెక్క తెలిసిన ఆత్రేయ గారు ఒకసారి అనలేదూ? 'నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి' అని. దీన్ని ఆసరాగా తీసుకుని ఒక కొంటె పిల్లడు ‘ఎన్నెన్ని వొంపులు,ఎన్నెన్ని సొంపులు...నాకున్నవేమో రెండే కనులు..ఎలా చూసేది, ఏది చూసేది? ' అని అడిగితే ‘ కావాలంటే నావి కూడ తీసుకో ..తనివి తీరా చూసుకో ' అని (జవాబు) వడ్డిస్తుంది గడుసు పిల్ల. ఇదంతా తనివి తీరని ప్రేమ మోహం. కాని జగతిని ప్రేమమయం చేసిన కారుణ్య మూర్తిని సిలువ నెక్కించడం ‘ తనివి తీరని రక్తదాహంకి గురుతు ' అని ఇదే ఆచార్య ఆత్రేయ ఒకప్పుడు అన్నారన్న విషయం మరచి పోకూడదు (కనులు చదివినా పాటే). ‘రవి గాంచనిది కవి గాంచును' అని ఎవరో ఊరికే అనలేదు.

ఒకబ్బాయి, ఒకమ్మాయి ‘ఇలాగే ఇలాగే సరాగమాడితే ' ‘ తనువు,మనసు తనివి రేపునే ' అన్నది ఆరుద్ర డిస్కవరీ (కనులు చదివినా పాటే). ‘ వయసే పాడే వలపుల డోల ' అని అమ్మాయి హిందోళంలో పాడిందంటే అబ్బాయిని ‘ దరికి చేర్చుకొని తనివి తీర్చమని ' కోరుతున్నట్టు అర్ధమని సి.నా.రె. వివరణ (కనులు చూసినా పాటే).

చాలాసార్లు ‘తనివి ' పదాన్ని ప్రయోగించి పాటలు రాసిన ఆరుద్ర కవికి జోహార్లు చెప్పినా దాశరథి కవికి ‘హాట్స్ ఆఫ్' అనాలి, ఎందుకంటే ఈయన కూడా కొన్ని సార్లు ‘తనివి 'ని పాట మధ్యస్తంగానో, చివర్నో ప్రయోగించినా ఒకే ఒక్కసారి ‘తనివి 'ని పాట తలకెక్కించారు కనక. అంటే – పల్లవిలో ‘తనివి 'ని చేర్చారన్నమాట. ఇంతమంది ఇన్ని రకాలుగా ‘తనివి ' గురించి చెప్పాలని తంటాలు పడుతున్నా ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే '(కనులు చూసినా పాటే) అని ఆయన అనుకోవడం మేలు చేసిందనే చెప్పాలి.

అయితే ఆరుద్ర గారితోనూ ‘చేయి కలపాలి'. ఎందుకంటే ‘గో గో గో గో ' అని ఇప్పుడేదో స్వంత తెలుగు అన్నదమ్ముల్నే పరాయి వారిని చేసి పొమ్మన్నట్టు కాక ‘గోంగూర ' ని ‘ తనివి తీర అన్నంలో ' కలిపి తిందాం రా రా రా రా అనే అర్ధంలో అందరికి నోరూరించే ఆహ్వానం పంపినందుకు.

కాలం మారింది. తొంభైల కాలం రాగానే తెలుగు మాటలు కొన్ని తెల్లమొహం వేస్తాయి, తెలుగు రుచులు కొన్ని తల్లడిల్లిపోతాయి అని వేదన పడుతుంటే ...'ఆ చింత నీకేలరా' అని వేటూరి కవి ఓదార్చారు. ఏదీ ఈయన ‘తనివి తీర ' రాస్తే ‘చూడాలని ఉంది ' అని కోరుకోగానే ‘అబ్బబ్బా ఇద్దూ ' అన్నారు (కనులు మూసినా పాటే – చూసినా పాటే కావొచ్చు కాని వామ్మో వాయ్యో వద్దురా బాబూ) - ఏమివ్వగలం? మిన్నంటే ఆయన జ్ఞాన భండారానికి ఒక కైతట్టు తప్ప!

మరో కవి సీతారామశాస్త్రి గారింట పాట సిరివెన్నెల ఎప్పుడూ కాస్తుంది, అటువంటిది మండు వేసవిలో ‘మావి చిగురు 'లాగ ఒక అక్క మనసులో ఆశ తళుక్కు మని, ‘మాట ఇవ్వమ్మా చెల్లీ ' అంటూ ఒక ‘చిత్ర 'మైన కోర్కె కోరడం గురించి చెప్పాలంటే ఆయనికి ఆయనే సాటి. ‘ శ్రీవారి ప్రేమ ఎంత పొందినా తనివి తీరదే, కావాలి ఇంకొక జన్మ, ఆ చేతుల్లో చిట్టిపాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై వచ్చేది నేనే ' అంటుంది చెల్లెలితో ఆ అక్క (కనులు మూసినా పాటే).

తనివి కి అర్ధం తృప్తి అని నిఘంటువు పేలవంగా చెప్పేస్తేనేం? వక్కలూ,లవంగాలూ వేటికవే వేరు వేరు. ఒకే పాట తాంబూలంలో (తనివి, తృప్తి) వాటిని చేర్చి తేట తెనుగు రసాలూరించిన సిరివెన్నెల కవికి జేజేలు.

ముక్తా ‘యింపు' :

గూగుల్ సెర్చ్ లో ‘తనివి' అని ఇంగ్లీషులో ఇచ్చి చూడండి. మీకు దాశరథి వారి ‘తనివి తీర లేదే ' గానం ముందు దొరుకుతుంది. యూ ట్యూబుకి వెళ్లి ‘తనివి' అని ఇంగ్లీషులోనే ఇచ్చి చూడండీ... మీకో అద్భుత సింహళ గానం దొరుకుతుంది. ‘తనివి సిటిన్నై మ ' పాడిన కళాకారుడు మిల్టన్ మల్లవరచి గురించి అంతగా వివరాలు తెలియవు. కాని ఆయన పాడిన తీరు ఎంత తృప్తి నిస్తుందంటే పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. వారి భాషలో తనివి అంటే ఏమిటో మరి? అసలది తని,వి అని వేరు వేరుగా ఉండ వచ్చునేమో!

ఇంకో రకంగా మనకి తృప్తి మిగిలే గొప్ప పనే చేశారు మన తెలుగు సంగీత పితామహుడు కీర్తిశేషులు సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆయన సింహళ జాతీయ గీతాన్ని స్వరపరిచారంటే ఆశ్చర్యంగా లేదూ?

పనిలోపనిగా కొన్ని సింహళ గీతాలు విన బోతూ ఉంటే మన జమునారాణి గొంతు వినిపించింది.

మరాఠీ వరస నుంచి ‘రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మ ' అనే మణిశర్మ వరస తయారౌతే కాపీ రైటుకి తృప్తిగా నవ్వుకున్నాం కదా; అటువంటప్పుడు ‘చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట సెలవీవమ్మా ' అన్న పెండ్యాల వరస వేరే (సింహళ) భాషలో విన వస్తుంటే ‘తనివి తీరా' విని ‘తృప్తి' పడాలి. చిలక పలుకులు అనేవి ఎటువైపు నుంచి విన్నా చెవికింపే కదా!

(You can listen to ‘dutuda indala luhubanda' sung by Mohideen Beig and Jamunarani for the Simhala film ‘Suraya (1957)' in you tube, an adaptation from Telugu “chiguraakulalo chilakammaa'. When I heard, the male voice appeared to me as of A M Raja).

-డా. తాతిరాజు వేణుగోపాల్ 09 ఆగస్టు 2013