సినీలాకాశం గడప ... షైనింగ్ సింగర్స్ అడపా దడపా
01 జులై, 2012


'వినీలాకాశం బదులు సినీలాకాశం అంటావ్'
'ఔ. అందులో ఘంటసాల మాస్టారు సూర్యుడంటాను. అభ్యంతరం లేదుగా?'
'ఓ.. నిరభ్యంతరంగా అను. అయితే బాలసుబ్రహమణ్యం చంద్రుడంటాను. సరేనా?'
'బాల చంద్రుడు అంటావ్'
'ఇక మీదట బాలు అనే అంటాను'
'ఘంటసాల వారిని మాస్టారు అనే అంటాను'
'సరే'
'ఓకే'
'ఎందుకు మాస్టారు సూర్యుడంటే - రోజూ సూర్యుడొస్తూ కొత్త వెలుగు తెస్తాడు చూడు- అలా మాస్టారి పాటలు ఎప్పటికప్పుడు ఏవో కొత్త సంగతులు చెబుతూ ఉంటాయి'
'అంతేగా.. అందుకే ఆయన మాస్టారు. ఎన్ని బ్యాచులకో టీచర్లు ఓపిగ్గా ఎంతెంత చెబుతారూ.. అలాగే ఈయనానూ'
'ఘంటసాల వారిని సూర్యుడన్నాం కాబట్టి బంగారు కిరణాలు ఆయన పాటలు. కాబట్టి స్వర్ణ యుగం ఆయనిది. అంటే ముప్ఫై ఏళ్ళ కాలం'
'దేర్ఫోర్ ..బాలు గారిది సిల్వర్ యుగం అందాం. చంద్రుడిది వెండి వెన్నెల కదా'
'సూర్యుడూ, చంద్రుడూ సంధ్యాకాలంలో చూడ ముచ్చటగా ఉంటారు కదూ. అలా మాస్టారూ, బాలుల మేలుకలయిక ఒక సంధి కాలంలో అంటే ఏడెనిమిది ఏళ్ళ కాలంలో జరిగింది'
'నన్ను చెప్పనీ.. వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన రెండు పాటలున్నాయ్ చూడూ.. ఏదీ--- ఎన్నాళ్ళో వేచిన ఉదయం ..ఒకటీ, ప్రతి రాత్రి వసంత రాత్రి... ఒకటి ... వీటిలో ఉదయం ఉంది, రాత్రి ఉంది... కాబట్టి మాస్టారు అండ్ బాలు డిజర్వ్ టు బీ కాల్ డ్ సూర్యుడూ అండ్ చంద్రుడూ..అయితే ...'సినీలాకాశం కేవలం వీరితోనేనా నిండి ఉంది?'...అని ఎవరైనా గొణిగితేనో?'
'ఆ సంగతి చూద్దాం గానీ.. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులంటే..'
'ఏముందీ.. వరసగా ఒకరు సృష్టి కర్త, ఒకరు స్థితి కర్త, ఒకరు లయ కర్త'
'అవునా.. వారు లేందే సూర్యుడూ లేడు, చంద్రుడూ లేడు'
'అంటే..నువ్వనేది ...ఘంటసాల వారికి ...'
'బ్రహ్మ-సృష్టి కర్త అన్నావుగా ..పాటలు సృష్టించేది కవి ...ఘంటసాల వారికి బ్రహ్మ సముద్రాల రాఘవాచార్యులు గారు'
'వారెవ్వా..పాట కి ఒక స్థితి కల్పించేది స్వర కర్త ..కాబట్టి'
'మహా నటగాయకుడు చిత్తూరు వి నాగయ్య గారు ..మాస్టారుకి విష్ణువు'
'మరి ఏ పాట నైనా లయింప చేసేది నిర్మాత ఆర్ దర్శకుడు అనుకుంటే..'
'మాస్టారు గారికి శివుడు బి.నరసింహా రెడ్డి గారు...అంటే బి.ఎన్.రెడ్డి ఆర్ బి.ఎన్.ఆర్'
'భేషాతి భేష్.. సరే గాని ..నా ఇతరుల గొణుగుడు విషయం దాటెయ్యడం లేదు కదా? ఒకటి చెప్పు- నాగయ్య గారికి మాస్టారు పాడారు ..విచిత్రమంటావా?'
'టాను. కాని మాస్టారు ఏమన్నారో ఇక్కడే అచ్చం అవే అచ్చులు - తీరైన మాట లో చదివితే ఉభయుల వినమ్రత తెలిసి ముచ్చటేస్తుంది. స్వీయ సంగీతంలో శాంతి నివాసం సినిమాలో నాగయ్య గారికి తాను పాడక పి.బి.ఎస్. కిచ్చారు మాస్టారు. పెండ్యాల గారు భక్త శబరి లో నాగయ్యగారికి శ్రీనివాస్ తోనూ, జయభేరి లో మా.సత్యం తోనూ పాడించారు. అందరూ మెచ్చుకునేది ఒక పాట ఉంది- నాగయ్య గారూ, ఘంటసాల గారూ కలిసి పూలరంగడు ..సినిమాలో పాడిన చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే ..పాట. అలా పాడించిన క్రెడిట్ రాజేశ్వరుడికి దక్కింది'
'అందుకే అది స్వర్ణ యుగం ... మళ్ళీ దాటెయ్యగలవ్..కమ్ back to గొణుగుడు'
'దాటెయ్యడానికి వీలా...వినీలాకాశం బాబూ.. సినీలాకాశ ద్వారాన ఉన్న మంగళ తోరణం చూపిస్తాను'
'మంగళ.. యూ మీన్ ...మార్స్ కాదు కదా .. మరీ రెడ్ ప్లానెట్ కదా..'
'ఔ. రెడ్ లెటర్స్ లో రాసి చూపదగ్గ మహా నట గాయకులు వాళ్ళంతా.. వారి వల్ల సినీలాకాశం మంగళమయమైంది'
'అంటే- సి ఎస్ ఆర్ ఆంజనేయులూ, ఈలపాట రఘురామయ్య, వగైరాలు అంటావ్'
'వారంతా మొదటి వరసలో ఉంటారు. రెండో వరసలో నటులు కాదు కేవలం గాయకులు..'
'అర్ధమైంది- ఎం.ఎస్.రామారావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ ఎం రాజా, పి బి శ్రీనివాస్ వగైరాలు..అవునా?'
'మూడో వరసలో పి.రామకృష్ణ, జి.ఆనంద్, మా.రమేష్ వగైరాలు'
'మరీ పురుష పక్షపాతి వంటారేమో .. స్త్రీ గళాలు ఏవి బాబూ?'
'శుక్రతారలు వారు .. అంటే నట గాయనీ మణులు'
'శుక్ర ..యూ మీన్ -- వీనస్? గ్రహం కదా -తార అంటావేమిటీ?'
'ఇప్పటికీ సామాన్య జన భాషలో సూర్యుడు తార కాదు గ్రహమే. శుక్రుడు గ్రహం కాదు తారే'
'సైంటిస్ట్ ఒకటి చెబితే సామాన్య ప్రజ మరోటి అంటుంది'
'మరాఠీ గీతంలో శుక్రతారా అని పిలవడం విన్నానులే. సరే... నట గాయనీ మణులంటే కమలాబాయి, కమలాదేవి, కన్నాంబ, కాంచనమాల, కృష్ణవేణి, కనకం, తిలకం, జీవరలక్ష్మి , ఎస్వరలక్ష్మి, కుమారి, శాంతకుమారి, బాల సరస్వతి, భానుమతి ..'
'జయలలిత, జయప్రద, శైలజ ..కూడానూ'
'అబ్బో.. అవున్లే - చలాకీ నటి జయలలిత 'చల్ల చల్లని వెన్నెలాయె' అని ఒకే ఒక్క పాట పాడారు 'ఆలీబాబా నలభై దొంగలు' చిత్రానికి. మాస్టారే సంగీతం. నటి కాని గాయని శైలజ ఒకే ఒక్క సినిమా 'సాగర సంగమం' లో నటించారు'
'ఇంకే నటీమణి పాడలేదు కదూ?'
'మహా నటి సావిత్రి పాట పాటలో తనవైన నవ్వులు విన్పించినా 'శ్రీ కాళహస్తి చెన్నప్ప' అనే సిన్మా లో పాడారట, విజయ చిత్ర పుస్తకం చెబుతోంది. ఆల్ బొమ్మలు ఉందిగా చూసేయడమే...'
'నటి జమున 'పెళ్లి రోజు' సినిమాలో కదూ 'పెళ్లివారమండి' అని పాట పాడినట్టు జ్ఞాపకం. మరి తతిమ్మా గాయనీ మణులు ఏ హారంలో ఉంటారో?'
'తారా మణిహారంలో!'
'ఓసోస్ ..తారలంటే ఒకటీ పదీ వందా కాదు.. మరీ అతిశయోక్తి అనుకోక పొతే.. శతకోటి.. మనకంతమంది ఫిమేల్ సింగర్లేరీ?'
'కావొచ్చు.. కాని సూర్యుడి పరంగా, చంద్రుడి పరంగా చూసి ఇరవైఏడు తారలు ఎంపిక చేయొచ్చుగా..'
'ఏ ఫర్ అశ్విని, బి ఫర్ భరణి, సి ఫర్ కృత్తిక ...లా ఎవరెవరో?'
'పదహారు కళల చంద్రుడిలా శుక్రుడికి కూడా కళలున్నాయిలే. కాబట్టి ఓ పదహారుగురు మాత్రమే తేలేది. చెప్పగలావా పేర్లు చప్పున?'
'ఎ పి కోమల,కోవెల శాంత, టంగుటూరి సూర్యకుమారి, జిక్కి, పి లీల, కె రాణి, జమునారాణి, పి సుశీల, ఎస్ జానకి, స్వర్ణలత, ఉడుతా సరోజిని, ఎల్ ఆర్ ఈశ్వరి, బి వసంత, ఎస్ పి శైలజ, కె చిత్ర, ... అలిసిపోయాను బాబోయ్ ..'
'పదహారుకే అలసట.. వేలు వేలు అయితేనో?'
'ఏమో.. మరో వందేళ్ళకి అందరుండ వచ్చు'
'అప్పటికీ మాస్టారే సూర్యుడా..భగవంతుడా ..ఆ పని చెయ్. 'మరుజన్మ ఉన్నదో లేదో' అన్నారు మాస్టారు. మాస్టారికి మరు జన్మ ఉంటుందిలే'
'తథాస్తు అనాలి దేవతలు. సరే కానీ .. మార్స్, వీనస్ అనే ఆలోచనకి కారణం?'
' ఏముందీ .. men are from mars, women from venus .. అని లోకోక్తి కదా. ఇలా ఇక్కడ పనికొచ్చిందిలే'
'సినీలాకాశ గడప అని అంటున్నట్టు విన్నాను నీనుంచి ... మధ్యలో ద్వారం అంటూ దారి మార్చేశావ్'
'మార్చలేదూ..ఏమార్చలేదూ.. గడప అని ఎందుకన్నానంటే ...పాపం కొందరు అడపా దడపా ఒకటీ అరా బాగానే పాడినా పెద్దగా గుర్తుండి పోలేదు. అసలు సినిమా పాట పాడడం అనేది ఓ అదృష్ట రేఖ. నటీనటులకి కొన్ని గొంతులే పాడాలి అని ప్రేక్షకులు,శ్రోతలు అడగక పోయినా జనం ఏ గొంతుల్ని మెచ్చితే వాటినే ప్రోత్సాహిస్తారు నిర్మాతలు'
'గాయకులే నిర్మాతలైతే?'
'కాలేదా? మాస్టారూ సినిమాలు తీసి బాబోయ్ నా వల్ల కాదు అని చేతులెత్తేశారు. బాలుగారు కూడా సినిమాలు తీశారు. ఇతర నిర్మాతలైనా పూర్తి స్వేఛ్చ సంగీత దర్శడుకిస్తారా, సందేహమే. స్వర కర్త చొరవ తీసుకునీ ఒకరిద్దర్ని కొత్తగా పాడేందుకు అవకాశమివ్వాలనుకుంటే సరి పోదు.. నిర్మాత ఊ( అనాలి. గాయనీ గాయకుల సంగీత బడి కన్నా నిర్మాత రాబడి కూడా ముఖ్యమే.
బాలుగారిని కోదండపాణి గారు తీసుకొచ్చి పద్మనాభం గారి చేత ఒప్పించబట్టి... తొలి ఛాన్స్ దక్కింది. పాణి ఎందరికో చెప్పగా చెప్పగా బాలు పొజిషన్ స్థిరమైంది. అలాగని.. అందర్నీ దొరకబుచ్చుకునీ అవకాశాలు ఇవ్వలేరు కదా.
రామకృష్ణ లక్కీగా ఏ ఎన్ ఆర్ దృష్టిలో పడడం, అన్నపూర్ణా వారి చిత్రానికి పాడడం, అప్పటికే మాస్టారు గారి ఆరోగ్యం బాగులేక పోవడం .. ఇవన్నీ జరిగాయి.
కోదండపాణి ఏసుదాస్ చేత, మహ్మద్ రఫీ చేత తొలిసారిగా తెలుగు పాటలు పాడించారు.
బాలు గారిని చంద్రుదంటున్నాం... కాని ఏసుదాస్ గారు తన తొలి తెలుగు పాటతోనే 'ఓ..నిండు చందమామా'.. (పాణి గారి వరసే) అని మొదలెట్టి 'జాబిలి మెరిసెనే ..జాజులు విరిసేనే' వరకు వచ్చి గొప్ప 'మేఘసందేశం' ఇచ్చి ఇప్పుడు రేసులో కాకుండా రెస్టులో ఉన్నారు.
జి.ఆనంద్ కూడా పాణి ఆధ్వర్యంలోనే 'పండంటి కాపురం' లో తొలిసారిగా పాడినా 'ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక' అని జి.కె. వెంకటేష్ కూర్చిన పాటతో ప్రసిద్ధమయ్యారు.'
'మెయిన్ హీరోలు ఏ ఎన్ ఆర్, ఎన్ టి ఆర్, శోభన్, కృష్ణ .. వీళ్ళకి సరిపోయేలా గొంతులుండాలే..వీరి నలుగురికే కాదు హరనాథ్ , రామకృష్ణ, చంద్రమోహన్.. వీరికి కూడా మాస్టారే పాడేవారు'
'రేలంగి గారికి కూడ'
'రేలంగి పాడగలరు. కాని రోజులు మారుతుంటే .. వేరే గళాలే మేలనుకుంటారు'
'గుర్తు చేశావ్. హాస్య నటుడు పద్మనాభం పాడగలరు. 'తేనె మనసులు' లో కృష్ణగారికి ఒక పాటలో మాటలిచ్చింది పద్మనాభమే. అంతకు ముందు తన స్వంత చిత్రం 'దేవత' లో 'మాఊరు మదరాసు' పాట పాడి హిట్ అయ్యారు. మళ్ళీ సిన్మాల్లో పాడేరా? లేదు కదా. ఈయనే తన మరో సినిమా 'శ్రీరామ కథ' లో రేలంగి చేత పాడించారు. చారు .. అంటున్నాం. నిజంగానే ఆ పాట చారూ చారూ నా బంగరు చారూ.. అనే ప్రారంభమౌతుంది. ఓ విచిత్రం.. పద్మనాభం గారు బాలు గారికి తొలి అవకాశం ఇచ్చారు కదా..ఆ పాట సన్నివేశంలో శోభన్ కి బాలు పాడారా, హరనాథ్ కి శ్రీనివాస్, కృష్ణ, రామకృష్ణ లకి ఈలపాట రఘురామయ్య గారు పాడారు. ఆ తరువాత కొన్నేళ్ళలోనే ఈ అయిదుగురికి బాలు పాడడం ..అదే విచిత్రం.
కస్తూరి శివరావు , రాజబాబు ..హాస్య నటులూ, పాడేవారు కూడానూ'
'రాజబాబు 'రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి' పాట ఒక్కటే పాడినట్టు గుర్తు. శివరావు చాలా పాడారు కదూ'
'ఇంకోటి చెప్పు చూద్దాం .. రాజబాబు కి మాస్టారి గొంతు ..ఏ సినిమాలో? ఏ పాట అది?'
'అడిగితే దొరకవు స్వామీ ..నన్నడిగితే దొరకవు స్వామీ'
'చతుర్ రామలింగడా.. నీ చమత్కారంలోనే ఉందా పాట. పిలిచిన పలికేవు స్వామీ.. అగ్గిదొర సినిమాలోని పాట'
'పి బి శ్రీనివాస్ గారి గొంతు హరనాథ్ కి, కన్నడ రాజ్ కుమార్ కి భలే సూట్ అవుతుంది. ఎనీ అబ్జక్షన్?'
'అమాయకంగా నటించే చలం గారికి కూడా భేషుగ్గా ఉండేది శ్రీనివాస్ గాత్రం. ముద్దు ముద్దు నవ్వు ... ఎంత బావుంటుందీ!'
'పద్మనాభం గారికి పిఠాపురం పాడిన .. మరదలా చిట్టి మరదలా .. పాట, ఎటుపోతేనేం (నిండు అమాస) పాట, పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకులేవే ..పాట .. వహ్వా.'
'పాట ఎవరు పాడారు అని కాదు.. ఎంత బాగా పాడారు అనేది ముఖ్యం. అంతే కాదు.. పాట సన్నివేశం సినిమా కథతో లీనమై ఉంటే అప్పుడు అది ఎవరు పాడినా గుర్తుండిపోతుంది'
'అవునవును- మరీ పెద్దగా చెప్పేవ్. బాపు గారి సినిమా 'సాక్షి' లో కె.బి.కె. మోహన్ రాజు గారు తొలిసారిగా 'రారూ రారూ నీ కోసం.. రారూ ఎవ్వరూ నీ కోసం' పాడారు. ఇప్పటికీ అది గొప్ప పాటే'
'కృష్ణ గారికి నేపధ్య గీతమది. ఈయన ఆకాశవాణి ఆర్టిస్ట్. తరువాత పూలరంగడు, తాశీల్దారు గారి అమ్మాయి సినిమాల్లో శోభన్ గారికి పాడారు. మళ్ళీ కృష్ణ గారికి 'రాధను నేనైతే ..' పాట పాడారు. నెట్ లో ఆయన పేరిట ఓ సైట్ ఉంది. ఆయన పాడిన రేడియో పాటలు, సినిమా పాటలు దొరుకుతున్నాయి. ఆయనో సినిమాకి సంగీతం కూర్చారు. సినిమా రాలేదని విన్నాను'
'కృష్ణ అనగానే మళ్ళీ రామకృష్ణ నటుడు గుర్తొచ్చారు. ఈయనకి బాల మురళీకృష్ణ కూడా పాడారు. అయితే ఎస్పీ బాలు గొంతులా ఉండే ఒకాయన 'విక్రమార్క విజయం' లో 'ఎందుకు బిడియము ఎవరున్నారని' ఎంత బాగా పాడారనీ!'
'కృష్ణ, రామకృష్ణ సరే.. కృష్ణంరాజు సంగతో... ఈయనకి 'సతీసావిత్రి' సినిమాలో ఎం ఎల్ నరసింహ మూర్తి గారు పాడారు.. యామిని భామిని ఏమనెనూ..ఇదే హీరోకి తొలిచిత్రం 'చిలకా గోరింకా' కదా. అందులో టి ఆర్. జయదేవ్ పాడారాయానికి. అవి మహాకవి శ్రీశ్రీ గీతాలు. ఇంకో గమ్మత్తు ..శోభన్ గారికి 'పొట్టి ప్లీడర్' సినిమాలో రెండు డ్యూయెట్లు ఉంటే.. ఒకటి శ్రీనివాస్ చేత, మరోటి జయదేవ్ చేత పాడించారు. శోభన్ గారి మీది ప్రయోగమే శోభ నిచ్చేదేమో .. '
'జయదేవ్ .. టి.చలపతిరావు దగ్గర పని చేశారు కదూ'
'ఔ. మనుషులు మమతలు ..కన్నా ప్రేమకానుక అనే సినిమాలో ఒకటే కోరిక ఒకటే వేడుక ..అనే డ్యూయెట్ జయదేవ్ ప్లస్ చలపతిరావుల క్రెడిట్..'
'ఇంకో ఆయన.. జాన పదాలు పాడడంలో దిట్ట.. ఎవరూ -- మానాప్రగడ నరసింహమూర్తి .. ఆయన 'చిల్లరదేవుళ్ళు' చిత్రంలో ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి... ఎంత ఆర్ద్రంగా పాడారూ..'
'ఎ ఎం రాజా .. చాలా కాలం విరామమిచ్చి 'పుట్టినిల్లు మెట్టినిల్లు' - చిత్రంలో కృష్ణ కి పాడారు'
'సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు.. కదూ'
'ఔ. ఆయన సతీమణి జిక్కి గారు ..కొంతకాలం విరామమిచ్చి డబ్భైల నాటి సినిమాల్లో మళ్ళీ పాడేరు. చిట్టిపొట్టి బొమ్మలూ చిన్నారి బొమ్మలు.. అన్నది గుర్తుందా. అలాగే .. ఒక పాట నా మిత్రుడు అశోక్ గుర్తు చేస్తే చప్పున పల్లవి గుర్తొచ్చింది.. ఈ తీయని రేయి తెలవారుటె మాని ఇలా నిలిచి కవ్వించనీ... 'చిట్టి తల్లి' సినిమా లోనిదీ పాట. జిక్కి పాడారు. వెతగ్గా వెతగ్గా నెట్ లో ..పాతబంగారం .. లో ఈ బంగారం పాట దొరికింది. 'దివ్యప్రేమ' అనే ఎల్పీ, 'ఏ శుభ సమయంలో ' అనే ఎల్పీ లో ఇలాంటి అరుదైన గాయనీ గాయకుల పాటలు ఉండేవి. అలాగే 'అలనాటి అందాలు' ఎల్పీ కూడ. ఇళయరాజా వారు జమునారాణి, జిక్కి గార్ల చేత అప్పటికొక కొత్త సినిమాలో పాత కాలం నేపధ్యం కోసం పాత వరసే కట్టి పాట పాడించారు'
'తమిళంలో నాయగన్... అనుకుంటా ఆ సిన్మా'
'తరువాత కూడా జిక్కి గారి చేత జాణనులే వర వీణనులే. పాట పాడించారు ఆదిత్య 369 లో'
'అవును..అందులోనూ పాత కాలం నేపధ్యముంది కాబట్టి. ఆ మధ్య నిదురమ్మా నిదురమ్మా.. అనే చక్కని జోలపాట.. ఎవరూ..శ్రీరంగం గోపాల రత్నం గారి పాట వినిపించేవు. ఆవిడ పాడిన వెంకటేశ్వరుడి గీతం కావాలోయ్'
'ఓ అదా.. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట... ఈ పాటలో ప్రత్యేకం ఏమిటో తెలుసా.. పాట టిపికల్ రాజేశ్వరరావు ట్యూను.. పాడడం టిపికల్ గోపాల రత్నాభరణం... విందువుగానీ నెల మధ్యలో ఓ శనివారం. చెప్పు చూద్దాం- నిదురమ్మా నిదురమ్మా.. పాట ఎవరు స్వరపరిచారో?'
'క్విజ్జుల్లో మనం పూర్ బుజ్జీ.. నువ్వే చెప్పు'
'బి.గోపాలం గారు... ఆయన రాజేశ్వరరావు గారితో కలిసి రంగులరాట్నం, బంగారు పంజరం లాంటి సినిమాలకి స్వరాలు కూర్చారు. పెద్దలు మారాలి అనే సినిమాలో అతడే నా జతగాడు అనే పాట గుర్తుందా.. అది ఈయన సంగీతంలో వచ్చినదే. గమ్మత్తు.. ఆయన హాస్య గీతం పాడడం'
'ఎందులో?'
'ఎ ఎన్ ఆర్, ఎన్ టీ ఆర్ లిద్దరూ ఉన్న శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో'
'ఎవరికీ?'
'బాలు గారు ముత్యాలూ వస్తావా అడిగింది ఇస్తావా ...అని అచ్చం ఒకాయనలాగ పాడారే... ఆయనకి!'
'యూ మీన్ .. అల్లు...'
'యస్సూ ..యస్సున్నర ...అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ ... పాట గోపాలం గారు పాడినది'
'కనులు చూసినా పాటే ...చలో చలో అల్లు తమాషా మెలికలు ఫుల్లుగ చూడాలి'
'అదే నా బాధ.. ఫుల్లు , ప్రఫుల్లు ..అని నేనూ ఆశ పడ్డాను. ఆ సినిమాలో తతిమ్మా పాటలన్నీ చూసేందుకు యూ ట్యూబ్ లో ఉన్నాయి. ఇది మాత్రం లేదు. గోపాలం గారి గొంతు వింటే అల్లు విశ్వరూపం కనిపిస్తుందిలే'
'అదియే మన తక్షణ కర్తవ్యమ్. క్లిక్ టు కనులు మూసినా పాటే'
'ఆగాగు- మరీ అంతగా తెలియని, ఒకప్పుడు తెలిసినా ఇప్పుడు మరచిపోయిన గాయనీ గాయకులు రాఘవులు, బసవేశ్వర్, కౌసల్య, సుజాత, సుమిత్ర, శారద, ఆశాలత ల గాన చాతుర్యం కూడా గమనించు .. కనులు చూసినా, మూసినా పాటే ల వైపు వెళ్ళి'
'రాఘవులు... మాస్టారు గారి మానస పుత్రుడిలా చేదోడు వాదోడుగా ఉండేవారు కదూ'
'ఔ. అయన మాస్టారు గారికి అసిస్టెంట్ గా ఉండడమే కాదు ఎమ్మెస్ విశ్వనాథన్, కె వి మహదేవన్ వంటి స్వర స్రష్టల దగ్గరా పని చేశారు. తరువాత స్వయంగా సంగీత దర్శకుడై .. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ..వంటి చక్కని పాటలు చేశారు. మాస్టారు.. మా రాఘవులు ఎంత బాగా చేశాడు అంటూ ఆ పాట గురించి అందరికీ చెప్పేవారట. పెళ్లి సందడి ..మాస్టారు స్వీయ సంగీతంలోని ఈ సిన్మా కోసం జిక్కి, రాఘవులు పాడిన పెళ్ళికొడకా ..పెళ్ళికూతురా..పాట అప్పుడూ ఇప్పుడూ అంతే హిట్. కాస్సేపు లేవనా?'
'బైఠో బైఠో'
'ఆల్ రైటో ..రైటో..'
'మాస్టారు గాయకుడిగానూ, స్వరకర్త గానూ సుపర్బ్. మిగతా సంగీత దర్శకులు గాయకులుగా హిందీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్ గారిని అనుసరించారేమో?'
'కరెక్టే. రాజేశ్వరరావు మారలేదులే ఈ లోకం అని పాడుతుంటే నాకు ఎస్డీ బర్మన్ కనిపించారు..'
'కోదండపాణి ఇదిగో దేవుడు చేసి బొమ్మ అనగానే నాకు మాత్రం ఎస్వీఆర్, పడవా ఆ శీను .. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ సుమా..'
'రమేష్ నాయుడు... ఓ రామ చక్కని బొమ్మ .. అని పాడుతుంటే..'
' ఎంత మృదుత్వమో ఆయనలో'
'అంత కోపం కూడానుట ..వీరందరికీ, సత్యం గారికినీ'
' అమాయక చక్రవర్తి అంటూ ఎవరూ ఉండరేమో సినీ ఫీల్డులో...'
'గుర్తు చేశావ్ ..గడసరి చక్రవర్తి గారిని .. ఈయన గారి సంగీతమంటే ఎనభైల్లో ఎంత క్రేజూ..తనే చక్రవర్తి అనుకుంటే అప్పుడు దిగారు ఇళయ'రాజ'. రాజా మంచి గాయకుడు. కాస్త మన పి.బి.ఎస్ కి దగ్గర్లో ఉండదూ వాయిస్'
'నయం.. వయసు అనలేదు'
'చక్రవరి అసలు పేరు అప్పారావు. నటుడు, గాయకుడు కూడాను. ఈయనా, రాఘవులు అంతా కలిసి పాడిన పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా... భలే మజాగా ఉంటుంది. అందులో ఎవరు ఏ ముక్క పాడేరో చెప్పగలవా?'
'ఇదిగోభాయ్.. క్విజ్జూ గిజ్జూ జాన్తానై ..'
'చివారాఖరి ప్రశ్న.. దర్శక రత్నం కె వి రెడ్డి గారి శత జయంతి ఈవేళ (జులై ఒకటిన). నమో నమహ. 'పాతాళ భైరవి' చిత్రంలో ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు ..'
'మాస్టారు భలే పాడారు'
'పప్పులో కాలు... ప్రశ్న పూర్తి కాకముందే ఠపీ మని జవాబా? ఆ పాట పాడినాయన వి జె వర్మ గారు నాయనా.. మధ్యలో ఆలాపన మాస్టారిచ్చారు'
'ఎలాగూ ఇన్ని చెప్పేవ్.. వీలు చూసుకునీ కొన్ని లిస్టులూ, విచి క్లిప్పింగులూ ఇద్దూ ...'
'ఆల్ రైటో రైటో .. మళ్ళీ వత్తురా? కృష్ణప్రేమ లోకి.. ఈ కృష్ణపక్షం లోనే సుమా అరుదైన రచయితలు దర్శనమిస్తారు.. అప్పుడు నువ్వు ...ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట !'
'నేను కాదు నాన్నా... ఆపదమొక్కుల స్వామి..'
'ఘంటసాల వెంకటేశ్వరరావు తో మొదలెట్టి తిరుమల వెంకటేశ్వరుడిని రావూ.. అంటూ పిలుస్తున్నాం'
'శుభం!'
(కొసమెరుపు: తీరైన మాట (అచ్చం అవే అచ్చులు) లో 'సు స్వ ర నాగ వ రా న ...ఘంటసాల.. రా' అని ఉంటుంది. దీని భావమేమి తిరుమలేశ! ఏమో..ఆ బొమ్మల్లోనే ఉందేమో అర్ధం, ఎంతాశ !
కనులు చదివినా పాటే--లో అరుదైన 'పాటకుల' జాబితా తో పాటు పాటలూ ఉంటాయి. ఎంతైనా మీరూ మా పక్షపాటకులే!)
-డా. తాతిరాజు వేణుగోపాల్, 01 జులై 2012 / 03 జులై 2012