భీష్మ త్యాగమే అసలు ప్రేమ అంటే...
14 ఫిబ్రవరి, 2011

భాగం - 1
మాఘ శుక్ల (శుద్ధ) ఏకాదశి – భీష్మ ఏకాదశి – భారత సాంప్రదాయం ప్రకారం, తిథుల విధుల ప్రకారం. అది ఈ రోజే.
ఫిబ్రవరి 14 ‘ప్రేమికుల రోజు' – విశ్వ నిర్ణేతలు నిర్ణయించగా విధిగా కాలేజీ కుర్ర కారు ఆచరిస్తున్న రోజు.
భీష్ముడంటే పితా మహుడిగా, అంటే మంచి తాతయ్యగా ఈ నాటి కుర్రకారుకి తెలుసునో లేదో.
భీష్ముడి తండ్రి శంతనుడు. శంతనుడికి కొన్ని విద్యలు తెలుసు. ముసలితనాన్ని పోగొట్టి యవ్వనాన్ని తిరిగి ఇవ్వగలడు. భీష్ముడి తల్లి గంగా దేవి. శంతనుడి ఒకానొక ప్రతిజ్ఞ్యా భంగం వల్ల ఆమె అతన్ని విడిచి, బిడ్డను తనతో తీసుకు పోయింది. అన్ని విద్యలూ నేర్పి, యవ్వనుడు కాగానే తిరిగి బిడ్డను తండ్రికి అప్పగించింది.
కట్ చేస్తే (ఇది ఇప్పటి భాష కదా..)---
శంతనుడు ఒక మత్స్యగంధిని ప్రేమించాడు. పెళ్ళాడతానన్నాడు. ఆమె తండ్రి దాశరాజు గడుసుగా ఈమె బిడ్డకే రాజ్యం అప్పగించాలి సుమా అని షరతు పెట్టాడు.
తండ్రి ఏదో మనో వ్యధతో ఉన్నాడని పసిగట్టి భీష్ముడు విషయం తెలుసుకున్నాడు. దాశ రాజు దగ్గరకు వెళ్ళాడు. తండ్రికి పెళ్లి చెయ్యమన్నాడు. దాశ రాజువి వింత సందేహాలు. రాబోయే పరిణామాలు ఎరిగిన వాడు. ఇదిగో ఇక్కడే- భీష్ముడు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వాడు. రాజ్య కాంక్ష తనకు లేదన్నాడు. తనకు పెళ్లి అయి సంతానం కలిగితే, వారికేమైనా పట్టం కట్టి పెడతాడేమో అనే అనుమానం రానీయకుండా బ్రహ్మచారి గానే ఉండిపోతానన్నాడు. అదే ‘భీష్మ ప్రతిజ్ఞ'.
శంతనుడు కొడుకు గొప్ప తనానికి అబ్బుర పడ్డాడు. ‘స్వచ్ఛంద మరణం ' ( అనుకున్నప్పుడే మరణించడం) అనే వరమిచ్చాడు.
కట్ చేస్తే –
యుద్ధ రంగంలో నేలకొరిగినప్పుడు ‘అంపశయ్య ' (ముళ్ళ పడక) ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు తలగడ కావాలంటే అర్జునుడే తన గాండీవాన్ని ఏర్పాటు చేసాడు. దాహమంటే అర్జునుడే బాణం ద్వారా నీటిని రప్పించాడు. భీష్ముడు అప్పటికి పితామహుడు. ముఖ్యంగా ధర్మరాజుకు విష్ణు సహస్ర నామాలు నేర్పాడు. ధర్మ బోధలు చేసాడు. చివరకు ఉత్తరాయణ పుణ్య కాలంలో మౌనంగా తనువు చాలించాడు.
అందుకే అనాలి- భీష్మ త్యాగమే ప్రేమ అంటే, అని.

ప్రేమ రెండు రకాలు- ఆర్భాట ప్రేమ, అమాయక ప్రేమ.
రెండూ కలగలుపైతే ఒకరిది గెలుపు, ఒకరిది ఓటమి.
యాసిడ్ దాడుల ప్రేమ ఒక ప్రేమేనా? క్లాసు రూములో కాల్చి పారేయడం ఒక ప్రేమా? నమ్మించి దగా చేయడం ప్రేమా?
ఏమో- ఒకానొక అమాయక ప్రేమ మూర్తి, పేరు సావిత్రి- ఒక అలనాటి మహానటి జీవితం తలుచుకుంటే కంట తడి పెట్టని వారుండరు. అసలు ఆమె పేరులోనే- సా రోఫుల్ గతం, వి షా దాంతం, త్రి శంకు స్వర్గ జీవితం అనే మూడు మాటల్లోని తొలి అక్షర క్రమమే చేరి ‘సావిత్రి' అయిందేమో అనుకోవాలి.
అటువంటి మన మహానటికి నివాళిగా భారత ప్రభుత్వం నిన్న (ఆదివారం, ఫిబ్రవరి 13, 2011 ) 'postal stamp' విడుదల చేయడం అభినందనీయం. కాని పోస్టల్ వారికి ఒక విన్నపం- ఆమె ముఖం పైన అచ్చు గ్రుద్దేయవద్దు. విధి ఆమె నొసట ఎప్పుడో ఒక గ్రుద్దు గ్రుద్ది తాను నవ్వి మనల్ని ఏడ్పించింది.
మంచి ప్రేమ అంటే ప్రేమ పంచేదిగా ఉండాలి. జీవితాలు ‘పంక్చరు' కానివ్వ కూడదు.
-తాతిరాజు వేణుగోపాల్ (ఫిబ్రవరి 14, 2011)