రమణ ---- విరమణ
26 ఫిబ్రవరి, 2011


ముళ్ళ మీద కూర్చున్నట్టనిపించింది మొన్న ముళ్ళపూడి వారు చనిపోయారన్న వార్త టీవీ లో వినగానే. అప్రయత్నంగా లేచి ‘అరరే!' అనుకున్నాను, ఒక ఆత్మీయుడు ఇక లేరు అనేది వాస్తవమని తెలిసి.
ఆంధ్రులందరికీ ఆత్మీయుడాయన. బాపు గారికైతే మరీ ప్రత్యేగాత్ముడు కూడాను.
మన వెంకట రమణ గారు సరిగ్గా ఎనిమిది పదుల కాలం ‘ఎనిమిటి' అనేది లేక బతికిన స్నేహ మూర్తి.
తలుచుకుంటే చాలు గుండె చెమ్మగిల్లుతుంది- ఆయన అంతిమ ఘడియల్లో బాపు వైపు చూస్తూ చేతులు జోడించి నమస్కరించారుట.
అన్నాళ్ళూ స్నేహ హస్తాలు కరచాలనాలే చూసేయి కాని ఇదేమిటీ – అదీ రమణీయత. కృతజ్ఞత కి ప్రతీక.
ఆరుద్ర చేత రెండు సార్లు ముచ్చటపడి తమ సినిమాల్లో ‘టాటా గిడిగిళ్ళు', ‘టాటా వీడుకోలు' అని రాయించుకున్నది ఇందుకేనా? ఏనాటికైనా చెప్పేయక తప్పదని , వయసు భారంతో చెప్పడం తప్పు కాదనీ సెలవు తీసుకున్నారు.
ముళ్ళపూడి వారు తన జీవిత తొలి గమనమంతా ముళ్ళ మీద నడిచినా, ఆ దారిని నవ్వుల పువ్వుల బాటగా మన కంటికి చూపించి, మహారాష్ట్ర లోని పులా దేశ్ పాండే లాగ దిక్కు తోచని వారికి దిక్సూచి అయ్యారు.
ఇంటింటా ఉండే ఓ ‘బుడుగు' ని కనిపెట్టారు. ఇంటింటా తలుపు వెనక్కి పోయే సిగ్గూ పూబంతి ‘సీగాన పెసూనాంబ' ని బయటకు రప్పించారు. ‘బామ్మ' గారికి ఓ డిగ్నిటీ ఇచ్చారు. ‘గోపాళం' లాంటి నాన్నల అమాయక వాత్సల్యాన్ని మెచ్చారు. ‘వింజన్' డ్రైవరూ, ‘ప్రైవేటు మాస్టారు', అబద్ధాలాడేట్టు కనిపించే ‘విస్సినాధం' – వీరందరినీ పలకరించేరు. రెండుజెళ్ళ సీతలు పదారణాల తెలుగు పడతులు సుమా అని పులకరించేరు.
బ్రహ్మకేం తోచక మనుషుల్ని సృష్టిస్తాడు. ముళ్ళపూడి వారు మాత్రం ఏదో తోచి ‘బుడుగు' ని సృష్టించారు. గురజాడ వారిది ‘అడుగు జాడ' అయితే, ముళ్ళపూడి వారిది ‘బుడుగు జాడ'.
ఆ దారి పట్టుకునీ ఓ జంధ్యాల, అతని వెంట ఓ ఈవీవీ సత్తినారాయణా ప్రయాణించి వీరికన్నా ముందే స్వర్గంలో హాస్య రస సమ్మేళనం పిలుపందుకునీ వెళ్ళిపోయారే – ఏమో, ఇంక ‘హాస్య యోగం' మనకుండదేమో!
రమణ గారు భళ్ళున నవ్వించరు. కిసుక్కున నవ్విస్తారు. అది మధ్య తరగతి మంద హాసం. ఆరోగ్యానికి ప్రధమ సూత్రం. ‘గృహమే కాదా స్వర్గ సీమ' అని ఎవరన్నారో కాని కొన్ని ముందు మాటలు ఎగిరి పోయి ఉండాలి. ఎందుకంటే- ‘బుడుగు' పుస్తకం ఉన్న ‘గృహమే కదా స్వర్గ సీమ' అనడం సబబైనది. ఈ బుడుగు అందరికీ ఓ మానస పుత్రుడు. సినిమాల్లో రమణ గారు చూపించడానికి ఎంత ప్రయత్నించినా దొరకని పాత్ర. అప్పటికీ ఒకటీ అరా సినిమాల్లో – ‘మా క్లాసులో సీవీ మురళి లేడూ' అనే అమాయకపు పిల్లల ధోరణి ( స్నేహుతుల ఇంటి పేరుతో సహా చెప్పటం) చూపించినా, ఉహూ( బుడుగుకి సాటి రాలేదు.
ముళ్ళపూడి వారి డైలాగు ‘ప్రేమించి చూడు' లో ఈలాగు:
చలం; ‘నా లక్కీ నంబరు రెండు' ( అని అక్కినేనికి ఇరవై రూపాయలు ఇస్తాడు)
అక్కినేని: ‘అలాగా, అయితే రెండొందలు ఇవ్వొచ్చుగా?'
చలం: ‘రెండు రూపాయలూ ఇవ్వొచ్చుగా'
అంతే! ఆ కితకిత జీవితాంతం మిగిలి పోతుంది.
‘అట్టులు ఉట్టినే పెట్టరు- ఇట్టులనే పెట్టెదరు' అనే అక్కినేని ‘అందాల రాముడు' డైలాగూ, రెండు వేళ్ళ డబ్బు సంజ్ఞా ఎవరు మరచి పోగలరూ?
అదే సిన్మాలో రాజబాబు మార్కు డైలాగ్ డిక్షన్లో ‘తీ తా' అంటూ పదే పదే అల్లుని ఆట పట్టించడం, అదేమిటో చెప్పమంటూ అల్లు వెంట పడటం, ‘ అంటే- తీసేసిన తాశిల్దారు' అని తన మార్క్ నవ్వుతో రాజబాబు అనేసి వెళ్ళిపోతే అల్లు తన మార్కు నడకతో సిగ్గుతో అక్కడనుంచి వెళ్ళిపోవటం – ఇవన్నీ ఎపుడైనా మరచిపోగలమా?
ఇందులోనే మరో షాట్ – పడవలో ముందు సీన్- ఝాన్సి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. వెనకనుంచి సీన్: రావి కొండల రావు ‘ దేరీజ్ నో గాడెట్టాల్' అనుకుంటూ చిర చిర లాడుతున్నట్టు. అప్పుడు ఝాన్సి డైలాగ్: ‘ఇప్పుడా ‘డెట్టాల్' గొడవెందుకండీ?'
అంతే – ఆ నవ్వు గలగల గోదారిలా జీవం పోసుకునీ మనల్ని బతికిస్తుంది.
రమణ మార్క్ హాస్యం – ఓ దృశ్య లాస్యం.
ఇద్దరు పల్లెటూరి వాళ్ళు పాట వింటుంటారు. అది ‘గంటసాల స్టోను' అని ఒకడంటే ‘అబ్బే ఇది ఇందీ స్టోననుకో' అని రెండో వాడి బెట్టు.
ఇంకా భాషీయుల నవ్వుల్లోనూ తేడా చూపించారాయన- ‘వాడు హిందీలో నవ్వేడు' అంటారొక చోట.
ఎవరి పాడే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసినా, రమణ గారు వాటిని సందర్భం బట్టీ వాడుకునే తీరుందే – అది రమణీయం. ‘ అతను తలత్ మహమ్మద్ కంఠంలా వణికి పోయాడు' అందుకో ఉదాహరణ.
రమణ నిర్మాతగా తొలి చిత్రం ‘సాక్షి' తీసారు. చిత్రాన్ని మాత్రం ప్రజలు దెబ్బ తీసారు. అప్పటికే ‘ఉంటే ఒకే (ఎస్వీ) రంగారావు ఉండాలి' అనుకునే రోజుల్లో ఓ బక్క పలచని రంగారావు ని తీసుకొచ్చి ‘విలనీ-కామెడీ' రూపంలో ఈ సిన్మాలో చూపించారు. ఆయన అదృష్టం బావుండి ‘సాక్షి రంగారావు' అయ్యాడు ఆ పైన. ఈ రంగారావు మళ్ళీ విశ్వనాథ్ చలవ వల్ల ‘రీ-డిస్కవర్' అయ్యాడు. అందుకు సాక్షి- రమణ గారే.
లక్కీ అని చెప్పుకున్నాం కదా- ఒకటి మాత్రం నిజం. ‘రమణ' పేరులోని మూడు అక్షరాలూ ‘లక్కీ'. అందులో ఏ ఒక్కటీ లేని సినిమాలు హుళక్కీ. బెస్ట్ ఎక్సాంపుల్ – సాక్షి. – ఇందులో ర, మ,ణ లేవు గా. మూగ మనసులు, రక్త సంబంధం, దాగుడు మూతలు, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, రాధా కళ్యాణం, రాధా గోపాళం, అందాల రాముడు, బంగారు పిచ్చుక, ప్రేమించి చూడు వగైరా వగైరా. అన్నిటికన్నా విశేషం
ఏ(విటంటే – ఆయన అతి తక్కువ పాటలు రాసారని లోగడ చెప్పుకున్నాం కదా – వాటిని స్వర పరిచిన వారి పేర్లలో ‘ణ- కార గుణింతం' ఉంది. కావాలంటే చూడండి- ‘మేడ మీద మేడగట్టి' పాట మాస్టర్ వేణు , ‘తెలుసో ఏమో అందానికి అలుకే అందం', ‘కదలే నీడలలో కనబడు వారెవరో' అనే రెండు పాటలూ కోదండపాణి ఒక నాడెప్పుడో స్వర పరిస్తే, మళ్ళీ ‘శాన్నాళ్ళకి' అంటే అయిదారేళ్ల క్రితం ‘తొలికోడి కూసేను తెలవార వచ్చేను' అని ఆయన పాట రాస్తే దాన్ని స్వర పరచింది ఎవరో కాదు- ‘మణిశర్మ!'.
అంతే నండి రమణ గారూ, పద్మశ్రీలు పొంగే ఈ జీవ గడ్డ పైన మిమ్మల్ని ప్రభుత్వం విస్మరించింది. క్షమించేయండి.. మేం మాత్రం ఏ పద్మాసనం అవసరం లేకుండా మీరు అప్పచెప్పిన హాస్య గుళికల్ని నెమరేస్తూ హాయిగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం.
-తాతిరాజు వేణుగోపాల్ (ఫిబ్రవరి 26, 2011)