Krishnaprema Logo

కృష్ణప్రేమ

‘ఖ-ర' నామ వత్సర ఆఖరి దశలో సంక్రాంతి వత్సా! రా!

14 జనవరి, 2012

‘ఖ-ర' నామ వత్సర ఆఖరి దశలో   సంక్రాంతి వత్సా! రా!

‘ఖ-ర' నామ వత్సర ఆఖరి దశలో

సంక్రాంతి వత్సా! రా!

Picture

2012 మార్చి 23 న ‘నందన ' నామ సంవత్సరం రాబోతోంది. అంటే ప్రస్తుతం 'ఖర ' నామ సంవత్సరం ఆఖరి మూడు నెలల దశలో ఉందన్నమాట. ఇది జనవరి కాబట్టి ప్రపంచం ఇంకా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఘోషిస్తూనే ఉంది. ఐతే భారతీయులకి జనవరి 14/15సూర్యుడుమకర సంక్రమణం ' చేయడం ఒక పండగ. అంటే మరేం లేదు- సూర్యుడు ‘నిరయన ' పద్ధతిలో పదవ రాశి అయిన మకర రాశి లోకి అడుగు పెట్టే వేళ అన్న మాట. సూర్యుడు పన్నెండవ రాశి అయిన మీన రాశి లో ఉండగా చైత్ర మాసం మొదటి తిధి – పాడ్యమి - నాడు మనకి ‘ఉగాది '( యుగాది అని కన్నడిగులు అంటారు). అలాగేఏప్రిల్ 14/15సూర్యుడుమేష రాశి ' లోకి ప్రవేశిస్తాడు కనుక తమిళులు, బెంగాలీ వారు అప్పుడే కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషిస్తారు. అరుదుగా ఏప్రిల్ నాటి మేష సంక్రమణం నాడే మన ఉగాది కూడా వస్తుంటుంది.

భోగి, సంక్రాంతి, కనుమ అనే ముచ్చటైన మూడు పండగల ముప్పేట గొలుసు ధరించి లక్ష్మీ దేవి ప్రతి తెలుగు ఇంటినీ అలరిస్తుంది. ఘంటసాల,సుశీల, జానకి, జమునారాణి,బాలసుబ్రహ్మణ్యం,వాణీ జయరాం వంటి మేటి గాయనీ గాయకులు పాడిన అరుదైన సినీ గీతాలు, లలిత గీతాలు 'ఈ పూట నా మాట ' కి అనుబంధంగా సంక్రాంతి లక్ష్మీ దేవికి స్వాగతం పలుకుతూకనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే లో చోటు చేసుకుంటాయని మీరాశించినట్టే వచ్చేసాయి. కొన్ని అరుదైనవి, కరువైనవి, అంత సులభంగా దొరకనివి కూడా . ముఖ్యంగా ‘డూడూ డూడూ బసవన్న ' పైన గీతాలు. కనులు చదివినా పాటే లో కొన్ని అరుదైన లలిత గీతాలు, భోగి మంటల మీదా, ముగ్గుల మీదా ఉన్నవి దర్శనమిస్తాయి. దేవులపల్లి వారి భావ గీతాల సౌకుమార్యం ఆస్వాదించండి. ఆహా-ఆహాహా లోని ‘ప్రతి రాతా ప్రసిద్ధమే ' లో లలిత సంగీత సామ్రాట్ పాలగుమ్మి విశ్వనాధం గారు దేవులపల్లి వారి ముగ్గుల లలిత గీతాల గురించి చెబుతూ ఏమన్నారో చదవండి.


‘అంతటి మహామహులు అన్నీ చెప్పేకా ఇంకా ఏం మిగులుతాయి మనకి ?' – అని నిరుత్సాహ పడడం లాంటిదే ‘అంత చక్కటి పండగ వాతావరణం ఇప్పుడెక్కడుంది మనకి ?' అనేది.

నిరుటికి నేటికి కొత్తేమున్నది? ఎదుటనే ఉన్నది వికాసమన్నది ' అని కీ.శే. అవసరాల రామకృష్ణారావు మాస్టారు ‘వికాసం ' సంస్థ ఆవిర్భావ సభలో స్వీయ రచన పాడించారు. కానీ ఆయన చతురోక్తి- ‘వికాసం' అనే మాటే ‘కొత్తది' అనే భావం సూచిస్తుంది అన్నదే కదా.

మకర సంక్రమణం ప్రతి ఏటా ఇలా జనవరి లోనే వస్తుంది. కొత్తేముంది? అంటే ఔను మరి ఖర , నందన ఒకటి కావు కదా. కాబట్టి జనావళికి ఏదో మంచి విశేషం సూర్యుడు కలిగిస్తాడనే ఆశ!

ఎందుకో ‘ఖర ' అనగానే గుఱ్ఱంలా ఉండి అలా కాని దానితో పోల్చి నవ్వుకోవడం కన్నా ‘వాడి అయిన' ‘వేడి అయిన' అనే అర్ధం ఎంచుకోవాలి. అలాగే 2011ఏడాదిలో సగం ఉన్నట్టు అనుమానం. నాకు మాత్రం 2011-2012 ఖర - సంవత్సరం ‘ఖ,ర ' అనే రెండక్షారాల కలయిక గా తోచింది. ఖ- అంటే ఖరీఫ్, ర- అంటే రబీ అనే రెండు పంటల కాలాల సంక్షిప్త రూపమే అని అనిపించింది. ఎందుకో ఈ ‘ఖర ' మాత్రం ఆఖరి దాక గొడవ చేస్తూనే ఉంది. ఖరీఫ్ కాలం లో కరువు, రబీ కాలం లో అకాల వర్షాలు – దొందూ దొందే. రైతుకి రెండు కళ్ళు ఉన్నందుకు రెండు పంటల ద్వారా మిగిలినవి కడగండ్లేనా? అయినా పాపం అమాయక శ్రమ జీవి – ఈ సంక్రాంతి సంబరాలకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు.

ఆ మూడు రోజుల పండగ దృశ్యాలు ఎంత మనోహరంగా ఉంటాయి! రైతులు తమ జీవన సారధులైన ఎడ్లని పూజిస్తారు. స్త్రీలు ‘గోవు మాలచ్చిమికి కోటి దండాలు ' పెడతారు. పిల్లా పాపా ‘గొబ్బెమ్మల ' చుట్టూ కృష్ణలీలలు పాడుకుంటారు. చిన్న పిల్లలకి ‘భోగి పళ్ళు ' పోస్తారు. పెద్దలు పిడకల్ని మాలలు గా సిద్ధం చేసి భోగి మంట ల్లో వేయనిస్తారు. కందమూలాలు (చిలగడ దుంపలు) ఉడికించి తింటుంటే ఆహా! అని టీ వీ స్క్రీన్ లో సగముండే కిశోర్ దాస్ ఆనందం కనిపిస్తుంది.

ఎవరికి వారే తమ తమ చిననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవడానికి ఇదే మంచి సమయం. పరాయి వారి తడికో, బల్లో భోగి మంట కోసం అర్థరాత్రో తెల్లవారు ఝామునో దోచుకొచ్చేయడం గుర్తొచ్చే తీరాలి. చెల్లాయిలు కష్టపడి వేసిన ముగ్గుల్ని తొక్కేసి అమ్మ చేత చీవాట్లు తినడం గుర్తుకు రావాల్సిందే. గోశాలలో ఆవు కొమ్ములకి పసుపు పులమడం గుర్తుకు రాకపోతే ఎలా? హరిదాసుల ‘కృష్ణార్పణం ' చెవికెంత శ్రావ్యంగా ఉంటుందీ! ‘డూ(do) డూ(do) బసవన్న' అంటే ‘ఇంత పని చేశాను, ఇంకెంత చెయ్యనూ?' అనే బసవన్న అనడం – ఆ జోకు పునరావృతమైతే ఎంత బావుంటుందీ! మకర రాశి లోకి సూర్యుడు వస్తూ ‘గోరు వెచ్చని ' గతం సంగతులు గుర్తుకు తెస్తాడు.

రాశులూ అవీ ఏమిటో బాబూ బొత్తిగా అర్ధం కావు- అని గొణిగే వారికోసం ఓ చిట్కా ఇవ్వనా?

మీ చేతి రిస్టు వాచీ కాని, మీ టేబిల్ మీది క్లాక్ కానీ, ఆ గోడ మీదున్న గంటల గడియారం కానీ కాసేపు చూడండి.

12 నుంచి 12 వరకు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఎంత సేపని చూసేది అని విసుక్కోకండి. మీరు చక్రం అన్నారు కదా అదే రాశి చక్రం. ‘భచక్రం' అంటారు.

12 అంకె మీనరాశి. 1 వ అంకె మేష రాశి. ఇలా ‘మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపేయొచ్చు. కాస్త ఇంగ్లీష్ లో చెబితే బావుణ్ణు అని అనుకునే వారికి ఆ అంకెలే నెలలు అని గుర్తు చెయ్యాలి- కాదా మరి? 12- డిసెంబర్, 1- జనవరి. ఇలా పన్నెండు నెలలు గడియారంలోనే ఉన్నాయి. పాశ్చాత్య పధ్ధతి ప్రకారం అర్ధరాత్రి 12 తరువాతే కదా రోజు ప్రారంభం. అలాగే సాయన పద్ధతిలో డిసెంబర్ 22/23నసూర్యుడు దక్షిణాయనం లో ఉచ్ఛ దశకి (winter solstice) చేరుకుంటాడు. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభం. ఇదే ఇరవై మూడు రోజుల అనంతరం నిరయన పద్ధతిలో జనవరి 14/15 తేదీల్లోకి మారుతుంది. అప్పుడు సూర్యుడు పదవ రాశి అయిన మకరం లోకి ప్రవేశిస్తాడు. 12 అంకె (డిసెంబర్) లాగ 3 అంకె (మార్చి), 6 అంకె (జూన్),9 అంకె (సెప్టెంబర్) మరో మూడు ప్రముఖ బిందువుల్ని సూచిస్తాయి. జూన్ 21/22న సూర్యుడు సాయన పద్ధతిలో దక్షిణాయనం లోకి ( నాల్గవ రాశి-కర్కాటక లేదా కర్క రాశి లోకి) (summer solstice) అడుగు పెడితే నిరయన పద్ధతిలో జులై 14/15 తేదీల్లోకి పరిగణించాలి.కర్క రాశిని జల రాశి అంటారు. తగినట్టుగానే అది వర్షా కాలం. వీటి మధ్య కాలంలో మార్చి 21/22 న ‘విషువత్ ' దివసం (vernal equinox) వస్తే ఏప్రిల్ 14/15 న సూర్యుడు ‘మేష రా శి' లోకి వస్తాడని గమనించాలి. సెప్టెంబర్ 22/23 న మరో విషువత్ దివసం (autumnal equinox) కాగానే అక్టోబర్ 14/15 న ‘తులా ' రాశిలోకి సూర్యుడు వస్తాడని తెలుసుకోవాలి. ఇలా ఆవృతం మీద ఆవృతం పూర్తి చేస్తూ ఒక నిరంతర కార్యక్రమం అమలు చేస్తుంటాడు సూర్యుడు.

రాశుల క్రమం గుర్తుంచుకోవాలంటే- ఈ అక్షర క్రమాన్ని వరసగా 3,4,5 అక్షరాల గుంపుగా మననం చేసుకోండి.
'మేరుమి కసికతు వృధమకుమీ'
మేష,వృషభ,మిథున,కర్క,సింహ,కన్య,తుల,వృశ్చిక,ధనుస్సు,మకర,
కుంభ,మీన రాశులివి.

గడియారం అయిపోయాక ‘పెద్ద స్కేల్ ఎక్కడ ఉందిరా రాస్కేల్' అని పిల్లవాణ్ణి కోప్పడక మీరే వెతికి ఓ పెద్ద స్కేల్ తీసుకు రండి. స్కేల్ కి ఒక వైపు 12 భాగాలు (ఇంచీలు), మరో వైపు 30 భాగాలు (సెంటీ మీటర్లు) ఉంటాయి కదా. 12 భాగాలున్నది ఓ గడియారం సాగదీస్తే వచ్చిందని అనుకుంటే సరి. ఈ 12 భాగాలు సంవత్సరంలో 12 నెలలు సూచిస్తే,30 భాగాలు నెలకి 30 రోజులని చెబుతాయి. అంతేనా? 12 భాగాలు బృహస్పతి (గురు గ్రహం) సూర్యుడి చుట్టూ ఓ చుట్టు చుట్టి రావడానికి పట్టే 12 సంవత్సరాల కాలాన్ని సూచిస్తాయి. సూర్యుడు నెలకో రాశిలో ఉంటే గురుడు ఒక్కో రాశిలో ఒక ఏడాది కాలం ఉంటాడు. 30 భాగాల వైపు చూస్తే శని సూర్యుడు చుటూ తిరిగే 30 సంవత్సరాల కాలం అనేది తెలిసిపోతుంది. ఈ 12,30 ల కనిష్ట సామాన్య గుణిజం (LCM) = 60 ద్వారా వచ్చినవే 60 సంవత్సరాలు. అందుకే ‘షష్టి పూర్తి ' చేసుకోవడం అనే ఆచారం వాడుకలోకి వచ్చింది. శని 12 రాశుల చుట్టూ తిరిగేందుకు 30 సంవత్సరాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటాడు. అలాంటివి
2.5 x 3 =7.5 కాబట్టి ఏడున్నర ఏళ్ళ కాలాన్ని ‘ఏలినాటి శని' అంటారు (తమిళం లో ఏళ్ నార్ అంటే ఏడున్నర కదా –ఓహో అలా వచ్చిందా ఈ మాట అని ఓ దశాబ్దం వెనక నాకు తోచింది). ఇదొస్తే అందరికీ భయం. నిజానికి శని ‘మంద**'** గ్రహంగా పేరు పొందాడు. అతని గమనమే అంత. దూరంగా ఉంటూ రింగులు మోస్తూ తిరగడమంటే సామాన్యమా? అందుకే ఆయన ప్రభావం వల్ల పనులు ‘మందగిస్తాయి' అంటారు.

బృహత్ అంటే పెద్ద కనక గురువు గారికి దండం పెట్టు అని డూడూ బసవన్న చేత ఆడించడం అంటే ఆ బృహస్పతి గ్రహం అనుగ్రహం పొందమని అర్ధం. బసవడు - సాక్షాత్ ‘లయ ' కారుడైన శివుడి బంటు. అలా ఈశ్వర కటాక్షం మన ముంగిట్లోనే ప్రసాదిస్తారు ఆ ఆటగాళ్ళు.

మన స్థితి కి కారకుడైన లక్ష్మీ పతి (విష్ణువు) ప్రసన్నం పొందాలంటే ‘రావమ్మా మహాలక్ష్మి రావమ్మా – నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గానీ, కొలువై ఉందువు గానీ కలుముల రాణీ' అని ప్రతి ఏడూ పాడాలి. ఎంత చక్కగా చెప్పారు కీ.శే. ‘దేవుల'పల్లి వారు!

ఇంక- భోగి మంట అనేది బ్రహ్మ ఈ సృష్టికి అవసరమై చేసిన ఇంధనం ఏర్పాటు అని గ్రహించాలి. ఇలా మూడు పండుగలు త్రిమూర్తుల కార్య కలాపాల ప్రతి రూపాలు.

గోరువెచ్చని సూరీడమ్మా ' అని దివంగత కవి మల్లెమాల అన్నట్టు ఈ మకర సంక్రమణ సూర్యుడు చండ ప్రతాపుడు కాదు. అందుకే ఆ ఆనందం. కొందరు కవులు ఈ సంక్రాంతికి కోయిల కూయడం, మల్లెలు పూయడం లాంటి వింతలు సృష్టించారు (కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే). అవన్నీ రాబోయే ‘కసిరే ఎండల ' కాలంలో అందించే చలివేంద్రాలు. ముందుగానే అనుకుంటే అదో ఆనందం. ఒక్కో ఋతువుకి ఒక్కో తీపి గురుతు ఉంటుంది.

మహారాష్ట్రీయులు సంక్ర్రాంతి నాడు ‘తీళ్ గుళ్ ఘ్యా - గోడ్ గోడ్ బోలా ' అంటారు. అంటే ‘నువ్వులూ బెల్లం మిశ్రమం తీసుకోండి, మంచి మాటలనండి' అని. ఈ చలి కాలానికి అనువైనవి నువ్వులు, వాటి అతి ప్రభావాన్ని అరికట్టేది బెల్లం. వాటి మిశ్రమమే జఠరాగ్నిని నియంత్రిస్తుంది. బొజ్జ బావుంటే మాట మంచిదౌతుంది.

'మాట రాని మౌనమిది' అని అమాయకంగా నోరు మూసుక్కోచోవడమూ మంచిది కాదు. 'నీతో నాకు మాటలేమిటిలే' అన్న అహం కూడా అభిలషణీయం కానే కాదు. సాటి మనుషులతో మంచిగా మాట్లాడడం, సరదాగా ఉండడం అంత కష్టమైన పనా?

ముక్తాయింపు:

బాపు బొమ్మలాంటి అమ్మాయి బాపు వేసిన ముగ్గులాంటి అందమైన జీవితం కలగంటుంది. మరి రమణీయంగా ‘ఉర్రేయ్గోపాలం ' అని అనిపించుకునే కుర్రవాడు ‘భోగి ' అవుతాడో, కందమూలాలు తింటూ 'యోగి' అవుతాడో కానీ కట్నం పైత్యం బాగా తలకెక్కి ‘** రోగి '** కాకూడదని ఓ సందేశం ఇస్తేనో? (నవ్వడం గురించి చెప్పిన కీ.శే. జంధ్యాల ‘నా మూడు పదాలు ఇలా ఉపయోగించుకున్నావా నాయనా' అని పైనుంచి మొట్టికాయలు వేస్తారేమో!)

- డా.తాతిరాజు వేణుగోపాల్ , 14 జనవరి 2012