నూతన క్లిష్ట పరిస్థితి ప్రసాదించకు భగవంతుడా -- భారత్ ని గెలిపించడం నీ వంతురా --
31 మార్చి, 2011


ఎందుకో ఈ మాట నూతన్ ప్రసాద్ నిన్న (30 మార్చి2011) ఉదయం మనందరి ముఖాల్లో ఆనందం కనిపించాలని అనే ఉంటారు.
భగవంతుడు నూట రెండో జిల్లాకి నీ అవసరం ఉంది రమ్మని అంతలోనే కబురు పెట్టాడు నూటొక్క జిల్లాల అందగాడిని.
లేకపోతె-ఒక్క రోజులోనే రెండు ఉదంతాలా?
ఎప్పటిలా కొత్తదనం నాలో ఏముందని అంటూనే ఉదయం సూర్యుడు 'నీ పేరులో నిత్య నూతనత్వం వరంగా పొందావు కదూ ప్రసాదూ నాలో కలిసిపోవోయి' అనడం ఏమిటీ, కైకలూరు వర ప్రసాదం మన నూతన్ ప్రసాద్ సరే అనడం ఏమిటీ ! మనవి విషాద వదనాలు చేయడం ఏమిటీ?
అదే సూర్యుడు సాయంత్రం అస్తమించేస్తూ దేశంలో అందరి 'మొహాలీ ' వేళ కళ కళ లాడేట్టు చేయడం ఏమిటీ?
ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లో పాక్ టీం ని భారత్ టీం ఓడించడం నూతన్ ప్రసాద్ కనులారా చూసి ఉంటే 'దేశం క్లిష్ట పరిస్థితి లో ఇంక లేదు' అని మాట సవరించుకునే వారు.
రమణ గారి బుడుగుకి బామ్మ మాట ఒక్కటే రక్ష. కానీ మన ప్రసాద్ కి 'బామ్మ మాట బంగారు బాట ' కలిసి రాలేదు. వెన్ను పూసలు పగిలి పోయాయి.'నూటొక్క జిల్లాల అందగాడు ' కి దిష్టి తగిలింది. 'ఇప్పుడు నూటొక్క జిల్లాల అవిటి వాడిని' అని నవ్వుతూ నటుడు మురళీ మోహన్ కంట తడి తెప్పించారట.
అది జరిగి 21 ఏళ్ళయింది. ఇన్నాళ్ళూ వీల్ చైర్ లోకమై అన్ని బాధ్యతలూ భుజాన వేసుకున్నారు. మనిషి బతకాలి -అదే ఆయన సందేశం.
'నిత్య పెళ్లి కొడుకు ' అని ముత్యాల ముగ్గు లో పిలిపించుకున్నా - పిల్లల పెళ్ళిళ్ళు పూర్తి చేసాడు. తన వెంట ఉంటూ ఎల్ల కాలం సేవ చేసిన మానవ మూర్తికి ప్రతిఫలంగా అతని కూతురి వివాహం తానే తండ్రిలా దగ్గరుండీ జరిపించాడు.
ఒక సంస్కారిగా, ఒక సామాజిక ధర్మ మూర్తిగా, ఒక కళా సేవకుడుగా ఆయన పరిపూర్ణుడు.
చిన్న తనంలో అమ్మ కుట్టు మిషన్ చక్రం గిర గిర తిప్పితేనే బతుకు ముందుకు సాగింది. అదేమి విచిత్రమో - సరిగ్గా 360 సినిమాలు పూర్తి కాగానే (ఇక్కడా గిర్రున తిరిగే సినిమా రీళ్ళూ చక్రాలే) కాల చక్రం అతనికి కొత్త మార్గం చూపించింది. ఆ మార్గం లో 'వీల్ చైర్' నడుస్తుందని ఆయన కలగన్నాడా? 360 డిగ్రీలు ఒక 'చక్రం' లో ఉంటాయి- ఇందుకేనా?
హీరోలకి సాటిగా, కొండొకొచో పోటీగా నటించాడు. అయినా అందరికీ ఆత్మీయుడే.
బెంగళూరు తో ఉద్యోగ అనుబంధం ఉన్న వాడు. గాయ పడిన ప్రసాద్ కాళ్ళకి లేపనం రాసారట కన్నడ 'రాజ్ కుమార్'. ఆత్మీయత కి మరో రూపమే ఓదార్పు. ఓదార్పు నుండే పుట్టేదే చైతన్యం. చైతన్యం మనిషిని కాదు మనసును నడిపిస్తుంది. అది నూతన్ ప్రసాద్ విషయంలో నిజమైంది.
మరో వారం రోజుల్లో నూతన సంవత్సరం 'ఖర' ప్రసాదం గా రాబోతుంటే 'వికృతి' కి బలి అయి పోయిన నూతన్ వర ప్రసాద్ ఆయుష్షు ఆఖరా?
ఒక వరవడి తెచ్చాడు వర ప్రసాద్. తెలుగు సినీ సీమకి ఒక నూతన వరంలా దక్కాడు నూతన ప్రసాద్. అది చాలు. కలకాలం గుర్తుంటాడు.
రెండేళ్ళ క్రితం నవంబర్ 1న అవతరణ దినోత్సవం సందర్భంలో పుణే ఆంధ్ర సంఘం నూతన్ ప్రసాద్ గారిని ఘనంగా సన్మానించింది. నా శ్రీమతి లక్ష్మి గాయని. సినిమాల్లో పాడింది. నూతన్ ప్రసాద్ స్టేజి పైకి రాక ముందు పక్కనున్న రూం నుంచి వింటున్నారు. తను దేవులపల్లి వారి పాట పల్లవుల మెడ్లీ పాడింది. ఆ రోజే దేవులపల్లి వారి జయంతి కదా. నూతన్ ప్రసాద్ స్టేజి పైకి అలా తన వీల్ చైర్లోనే వచ్చి కూర్చునీ లక్ష్మిని ఆశీర్వదించి లక్ష్మి తనకు ఎప్పటినుంచి ఎంత బాగా తెలుసునో చెబుతూ 'ఏదీ ఇందాక ఇది మల్లెల వేళయనీ పల్లవి పాడావే, పూర్తి పాట పాడవూ? ' అన్నారు. పాట పూర్తి కాగానే ఆయన కళ్ళు చెమ్మ గిల్లాయి, అంతలోనే నవ్వించే ధోరణి మొదలెట్టేశారు.
ఆ పాటలో 'చిరిగిన రెక్కల ఒరిగింది ' అనే మాటలు ఆయనకి అన్వయించుకోవచ్చు. 'మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం ' - అటువంటి సీమను ఆయనే మలచుకున్నారు. ఇప్పుడు మొగసాల దాటి 'ద్వారానికి తారామణి హారంలా ' , 'హారతి వెన్నెల కర్పూరంలా ' ఉండేందుకు తరలి పోయారు నూతన్ ప్రసాద్ - 'సుఖ దుఖాలు' రెండూ చవి చూసినప్పటికీ న్యూనత అనేది రానివ్వని 'న్యూ' తన మనసని ప్రత్యక్షంగా చూపించి మరీ!
ఆ 'రాజాధిరాజు ' కి ఇవే కైమోడ్పులు.
'కనులు చూసినా పాటే ' లో 'ఇది మల్లెల వేళ యనీ ' పాట చూడండి. ఈ పాట గురించి మరో సందర్భంలో మళ్ళీ చెప్పుకుందాం.
'కనులు మూసినా పాటే ' లో రెండు శ్రీశ్రీ పాటలు 'బ్రతుకు ' విలువ చెప్పేవి వినండి.
-డా. తాతిరాజు వేణుగోపాల్ 31 మార్చి 2011