పుస్తకం లేని ప్రపంచం, పప్పు లేని కంచం!
22 ఏప్రిల్, 2012

పుస్తకం లేని ప్రపంచం, పప్పు లేని కంచం!

ధ రిత్రీ దినోత్సవం (ఆదివారం, ఏప్రిల్ 22), వెంట వెంటనే ప్రపంచ పుస్తక దినోత్సవం (సోమవారం, ఏప్రిల్ 23) ఊరికే వస్తున్నాయా? భూమి తాపం ఎక్కువౌతున్న నేపధ్యంలో ధరి'ట్రీ'ని కాపాడండి మొర్రో అనే నినాదాలు గత పదేళ్లలో మరీ ఎక్కువయ్యాయి. పుస్తాకాలని రక్షించండి కుర్రో అంటే కుర్రకారు వింటోందా? పుస్తకాలకి వెదురూ గట్రా కావాలి కదా, మరి వెదురును నాశనం చెయ్యడం పాడి కాదు కదా అని వారిచ్చే సమాధానం ఆలోచించ దగ్గదే. ఈ మధ్యనే ఒక పాడు వార్త విన్నాం- ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ఇక పైన అచ్చులో రాదు, అచ్చు గ్రుద్దినట్టు అదే రూపంలో కంప్యూటర్ లోనే ప్రత్యక్షమవుతుందిట. అంటే ముద్రణ ఎంత భారమయిపోయింది ఇప్పుడు! ‘మీ కళ్ళు బాగుండాలంటే పుస్తక పఠనమే శరణ్యం, కంప్యూటర్ రీడింగ్ నో నో' అనే నినాదం ఒకవైపు విన వస్తున్న తరుణంలో ఈ వార్త ఎంత దారుణం!
కవిగారన్నట్టు భూమ్మీద సుఖ పడితే తప్పు లేదు కానీ ప్రపంచంలో మంచి పుస్తకాలు సైతం సుఖంగా బతికి బట్ట కట్టాలి. పుస్తకాలంటే కొన్ని స్టాల్స్ లో ఊరికే కనిపించేవి, మరి కొన్ని కొనిపించేవి, కొన్ని బహుమతిగా ఎవరైనా ఇస్తే బావుణ్ణు అని అనిపించేవి - అని మూడు రకాలు. ఒక్కోసారి మంచి పుస్తకాల షాపుకెళితే అందులో సగం షాపు మనింట్లోనే ఉంటే ఎంత బావుణ్ణు అని అనిపిస్తుంది. స్థల పురాణం మన ఇంట్లో సరిపోనితనం గుర్తుచేస్తూ మన ఊహారెక్కల్ని అంతలోనే త్రుంచేస్తుంది.
‘ఈ రోజుల్లో పుస్తకాలు ఎవడు చదివేడిసాడు కనక, కొనడం కూడానా, అదో దండగ' –ఈ టైపు మాటలు ఊరూరా వింటూనే ఉంటాం. ‘ఏం?' అని అడగండి. ‘టీవీకి, కంప్యూటర్ కే టైము చాలట్లే- ఇంకా పుస్తకాలోటా!' చివర్లో వచ్చే ఆశ్చర్యార్ధకం అలా సార్ధకం అవుతోంది. ************* పదండి ముందుకు
పుస్తకాల పురుగులు – అని కొందరిని ఎద్దేవా చేయడం అనాదిగా ఉన్నదే. కొందరిళ్ళలో పురుగులు కొట్టేస్తూ పుస్తకాలు మూలుగుతూ ఓ మూలనుంటాయి. అతిగానూ చదవొద్దు. అలాగని చదవకుండా ఉండనూ ఒద్దు. ‘రీడింగ్ హేబిట్' ఉన్నమొగుళ్ళు వాళ్ళు ఎదురు చూసే పుస్తకం ఎదుట పడితే అలా అలా వాటి వెంట పడితే పెళ్ళాలు నుదురు కొట్టుకోవడం సహజమే. మంచి పనేగా చేస్తున్నదీ అని సర్దుకు పోరేం? ఎవరి ఆనందం వారిది.
బెంగళూరు మిత్రుడు సురేష్ కి కేవలం ఒకానొక జోషి గారి ‘డౌన్ ది మెమొరీ లేన్' పుస్తకం తాలూకు ఫోటో కాపీలు పంపితే ఆయన తిరుగు టపాలో తీర్చుకోలేని ఋణంలా పులగం చిన్నారాయణ సంకలనం ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు' నాకు పంపారు. ఎంత సహృదయం! ఒక పాత ఆల్బం తెరచి చూస్తుంటే చిన్ననాటి స్నేహితుల ఫోటోలన్నీ ఒక్కసారి పక్కన చేరి మాట్లాడినంత సంతోషం కలిగింది, ఆ పుస్తకం లోని ప్రతి పేజీ చూస్తున్నప్పుడు.
బరంపురం లో ఒకాయన ఏడాది క్రితం తన కూతురి పెళ్ళిలో అతిథులకి పుస్తకాలు తాంబూలంలో పెట్టి మరీ ఇచ్చాడట! పుస్తెలతో పాటు పుస్తకాల విలువ పెరిగినట్టే కదా. ఇలా అందరూ చేస్తే దుబారా తగ్గుతుంది. పుస్తకాలు బతుకుతాయి.
ఇంతవరకూ బావుంది. పూనా లో ఒకసారి డెక్కన్ బ్రిడ్జి మీది పాత పుస్తకాల వాడి దగ్గర వాతావరణ శాస్త్రం మీద దాసు గారు రాసిన పుస్తకం కనిపించింది. అట్టా గట్రా బావున్నాయి, కొత్తగానే ఉంది పుస్తకం అని నిశ్చయించుకున్నాక బేరమాడి కొని దారిలో తెరిచి చూస్తే వాతావరణ సొసయిటీ వాళ్ళు ఎవరో కుర్రాడికి ఇచ్చిన బహుమతి అది అని తెలిసింది. ఆ సెక్రటరీ తెలిసిన వారే. వారికీ విషయం చెబితే నవ్వేశారు. తాత్పర్యం ఏమిటీ?- ఒకరికి పనికిరానిది మరొకరికి ఎంతగానో పనికి రావొచ్చు. అంచేత పుస్తకం పరహస్తం గతః అన్న నానుడిలో మెలిక ఉంది. ఇక్కడ పరహస్తంలో పుస్తకం పోలేదు, బతికిపోయింది. ఒక పెద్దాయన్ని - ఎప్పుడో తెలిసినవాడు- ఇంకో పెద్దాయన ఈడ్చుకొస్తే మా ఇంటికొచ్చి మాటల మధ్య తను వదులుకోని పాత అభిరుచుల్లో పుస్తాకాలు చదవటం ఒకటి అని చెప్పి మా ఇంట ఉన్న పుస్తక భండారాన్ని కెలికి రంగనాయకమ్మ గారి నవల ‘కృష్ణవేణి ' ని చదివి ఇచ్చేస్తానన్నాడు. ఆనక మనిషి మాయం ఫారిన్ కి. పుస్తకం రాలేదు మా దరికి.
కృష్ణ కృష్ణ రంగ రంగ అని అనుకున్నప్పుడల్లా ఈ ఘటన గుర్తొచ్చి మనసు వికలమౌతుంది. బహుమతిగా ఇవ్వడం వేరు, ఉన్న మతిని పోగేట్టేలా ఎత్తుకుపోవడం వేరున్నర.
నేనూ నా మిత్రుడు సుందరూ విశాఖ లో మహారాణిపేట నుంచి ‘విశాలాంధ్ర బుక్ హౌస్' వరకు అన్నేసి కి.మీ. ల దూరం ఒకసారి నడిచి పుస్తకాలు కొనుక్కొచ్చి వెనక్కొచ్చి, మళ్ళీ జేబుల్లో డబ్బు కుక్కుకునీ అంత దూరం మళ్ళీ నడిచి మరిన్ని పుస్తకాలు కొనుక్కున్న రోజులున్నాయి. అంతెందుకు, అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం బరంపురం లో జరిగినప్పుడు కృష్ణశాస్త్రి గారి పుస్తకాల దొంతర అన్నయ్య ప్రోత్సాహంతో కొన్న సందర్భం ఎంత తీపి జ్ఞాపకం! యూనివర్సిటీ రోజుల్లో మిత్రుడు గిరి పది కిలోమీటర్లు సైకిలేసుకొచ్చి చెలం గారి నవలలు తెచ్చి చదవమనడం ఎంత వింత అనుభూతి! ఎందుకో ‘మైదానం ' లో చెలం గారి శైలి ఇట్టే ఆకర్షించేది.
చాలామట్టుకు ఆ రోజుల్లో నవలలు కన్నా వాటి కవలలు అనదగ్గ సీరియల్స్ పోటీ పడి చదివించేవి. యద్దనపూడి సులోచనారాణి గారి నవలల్లోనూ, సీరియల్స్ లోనూ ఆరడుగుల పొడుగు రాజశేఖర్ కార్ పోర్టికో లో ఆపి హుందాగా రావడం చదువుతూ ఉంటే నవ్వొచ్చి బావుండేది. నవ్వెందుకంటే ఆ ఆరడుగుల పొడుగాయన మా ఊహల్లో ఏ.ఎన్.ఆర్ కావడమే! విశ్వనాథ వారి ‘ కల్పవృక్షం' చదవక పోయినా రంగనాయకమ్మ గారి ‘విష వృక్షం ' చదివి అమాయకంగా మెచ్చుకోవడం ఎంత చేదు నిజం!
తాళ్ళూరి నాగేశ్వరరావు గారి ‘కొత్త ఇల్లు ' సీరియల్ లో అనుకుంటా ‘శ్యామల అత్తగారి ఊరు బరంపురం. వాళ్ళు ‘నన్ను' అనే చోట ‘నాకు' అంటారు' అని ఓ మాట వస్తుంది. ఉడుక్కున్నాం. అయినా ‘ఎందుకబ్బా?' అని కారణం కనుక్కున్నాం. ఒరియా భాష లో ‘నన్ను, నాకు' రెండిటికీ ‘మొత్తే' అని అంటారు. ‘అమ్మా, నాకు పొద్దున్నే లేపు. చదూకోవాలి' అని అక్కడి ఎన్నో కుటుంబాల్లో వింటుంటాం ఇప్పటికీ. అలా బోర్డర్ ప్రాంతాల్లో భాషలు కలసి మెలసి ప్రయాణిస్తాయి. ఈ సమస్య వల్లే మహాకవి****శ్రీశ్రీ గారిని ఓ సందర్భంలో ఇంటర్ వ్యూ చేస్తూ ‘మీరు మురిపించే అందాలే అవి నన్నే చెందాలే- అని రాసారు. ‘నాకే' చెందాలి అని ఉండాలి కదా' అని ఓ వెర్రి ప్రశ్న వేశాను. ఆయన ఓరి వెర్రివాడా అన్నట్టుగా చూసి ‘రెండూ ఒకటే' అని కాబోలు అనడం గుర్తుంది. మహాకవి శ్రీశ్రీ గారి మొత్తం పుస్తకాలు లేని వాళ్ళు సంపాయించుకోవడం ఉత్తమం. ఇజాల మాట పక్కన పెడితే కొన్ని నిజాలు ఆయన అడుగడుగునా చెప్పడం కదిలిస్తుంది. రావిశాస్త్రి , బీనాదేవి - వీరి నవలలు నవ్విస్తూనే వాతలు పెట్టిస్తాయి. ధరిత్రీ దివసం నాడు ఒక పుస్తకం మీ కైవశం కావాల్సిందే- అది ‘పుణ్యభూమీ కళ్ళు తెరు' (బీనాదేవి రచన). దివి వెంకట్రామయ్య గారు వందేళ్ళలో వాసికెక్కిన రచనలన్నీ కీ.శే. సహవాసి పుణ్యమా అని సంకలనం చేసి పెట్టారు.
సీరియల్స్ అనగానే ఆంధ్రప్రభ , ఆంధ్రజ్యోతి వంటి మేగజిన్లు అగ్ర తాంబూలం అందుకుంటాయి. ఒకరకంగా ‘భోయినం' అవ్వగానే తాంబూలం వేసుకునీ సీరియల్ చదివే వాళ్ళు ఉండేవారు. టీవీ లొచ్చి ఆ ఠీవిని తన్నేశాయి. కంప్యూటరొచ్చి కాస్త మంచి పనే చేసింది. కనీసం ఎక్కడెక్కడి పుస్తకాలు ఎలక తిరుగుడుతో సాలెగూడు ద్వారా లభ్యమౌతున్నాయి. అలాగనీ అన్నిటికీ టీవీని తిట్టనవసరం లేదు. బరంపురం లో గెలిచి బరంపురాన్ని వదిలేసినా మాజీ ప్రధాని కీ.శే.పివి గారు అంటే మాకు గౌరవమే. మాజీ రాష్ట్రపతి కీ.శే. వి.వి.గిరి గారిదీ బరంపురమే. వారి సతీమణి సరస్వతీ గిరి గారు కవయిత్రి. విశ్వనాథ వారి ‘వేయి పడగలు ' నరసింహారావు గారి బహుభాషా పటిమ వల్ల 'సహస్ర ఫణ్ ' గా రావడం తెలిసినదే కదా. అలాంటి** పీవీ** గారు ఒక తెలుగు కథను టీవీ కి హిందీ సీరియల్ 'అప్నా అప్నా ఆస్మాన్ ' గా అందించారు. అందులో ఒక పెళ్లి వేడుక సందర్భానికి పాట కావాలని సంగీత దర్శకుడు సతీష్ భాటియా అడిగితే మా ఆవిడ ‘ పూర్ణానందుల కళ్యాణం' అని ఓ రెండు మూడు లైన్లు అందించడం, పాడడం చాలా మందికి తెలియదు. అప్పుడు మేం డిల్లీ లో ఉండేవారం. సత్యజిత్ రే కథలు వారి (రే గారి) అబ్బాయి టీవీ కథలుగా అందించడం ఎందరికి గుర్తుందో, లేదో? మళ్ళీ అనేక టీవీ ‘ఛా'నల్స్ వచ్చి – మంది ఎక్కువౌతే మజ్జిగ పలచన అన్న సూక్తిని నిజం చేశాయి. ఒక్కప్పుడు పత్రికల్లోని సీరియల్స్ మనిషి బీపీ ని సమతుల్యంలో ఉంచితే ఇప్పటి టీవీ సీరియల్స్ మనుషుల్లో బీపీ పెంచి గృహ హింస, సమాజ హింసకి దారి చూపుతున్నాయి.
అలాగనీ మేగజిన్లు అన్నీ మెగా సేవలు చెయ్యవు. కొన్ని లోన లోటారమే అయినా పైన పటాటోపంతో దర్శనమిచ్చి కొనిపించేస్తాయి. లోపల పేజీల్లోకి వెళితే గానీ తెలియదు వాటి స్థాయి. ఇప్పుడొచ్చే ఏ మేగజిన్ చూసినా ఏముంది గర్వకారణం, పేజి పేజినా తారా పురాణం! ఆమె కుక్క పిల్లకీ ఆమెకీ ఒకటే సబ్బు, ఆమె ఇంటాయనకీ, వంటాయనకీ ఒకటే జబ్బు- ఇవే విశేషాలు. కొన్ని మేగజిన్లు ఎలాగోలా బతికేయడానికి ఏడేడు సంవత్సరాల చందాలు రాబట్టేందుకు తగిన ఒప్పందాలు చేసేసుకుంటాయి. మరికొన్ని పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతూ ‘మీ మిగులు చందాని మనియార్డర్ చేస్తున్నాం, ఓపిక పట్టండి' అని ఆర్డర్ అయితే వేస్తాయి కానీ మనీ అందజెయ్యవు. ఆ పబ్లిషర్ ఎవడో గానీ ‘అంద చందాల గడసరివాడు'.
‘విజయ చిత్ర ' సంచికలూ, వాటిలో కే.ఆర్.వి.భక్త వర్ణ చిత్రాలూ, మన సత్యం స్టిల్స్ ఎంత ముద్దొచ్చేవీ!అంతటి చందమామ వారే ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ‘హాసం ' అట్టహాసంగా వచ్చి అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు హడావుడి చేసి కొన్నేళ్ళకే చేతులెత్తేసింది. అయినా బదులుగా కొన్ని పుస్తకాలు వారు అందిస్తున్నారు. అదే ఊరట.
పుస్తకం కేవలం చదివిస్తుంది. కంప్యూటర్ చదివిస్తుంది, వినిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది కూడా. మొన్న మొన్నటి వరకు పదో తరగతి పరీక్షలప్పుడు పెద్దవాళ్ళూ, పిల్లలూ రోజుకి ఇరవయ్యేసి గంటలు కంప్యూటర్ ముందు కూర్చునీ కళ్ళు ఇంతింతలు చేసుకునీ డాక్టర్ల వెంట పడితే వాళ్ళు ముక్త కంఠంతో ‘ అదిగో - ఆ బుచ్చి తెరని చూడడం మానేయండి, ఒక వేళ చూసినా వెంట వెంటనే కావాల్సినవి ప్రింట్స్ తీసుకునీ చదవండి. మీ కళ్ళకి మంచిది' అని అనుచిత (డాక్టర్ లు ఫీజు అడగకుండా ఉంటారా?) సలహా పారేశారట. ‘ప్రింట్స్? మళ్ళీ వాటికి డబ్బు తగలెయ్యడమా? కళ్ళు వాచినా ఫరవాలేదు' అని పిల్లలతో పాటు తల్లితండ్రులు వాపోయారట. బుచ్చి తెర అంటే మానిటర్ స్క్రీన్. బుల్లి తెర అంటే టీవీ, వెండితెర అంటే సినిమా అన్నవి పాత మాటలే.
వెండి తెరకి అప్పుడూ ఇప్పుడూ భలే డిమాండ్ ఉంది. అయితే అప్పుడు వెండితెర నవలు అనేవి వచ్చేవి. అంటే థియేటర్ లో చూస్తున్న సినిమా అంతా ఆనక ఇంట్లో హాయిగా చదువుకోవచ్చు అన్న మాట. ఆప్తమిత్రులు , షావుకారు , శంకరాభరణం ముత్యం మూడు వెం.తె నవలలు నా దగ్గరున్నాయి. బాపురమణ ల 'సాక్షి ', 'బుద్ధిమంతుడు ' సినిమాలని ఎమెస్కో వాళ్ళు ఆ రోజుల్లో వేసినట్టు గుర్తు. ఎమెస్కో అంటే చదవడం అయిపోయాక పుస్తకాన్ని పాత పుస్తకాల షాపుకి ‘అమ్మేస్కో' అని అర్థం కాదు. ఎం.శేషాచలం అండ్ కంపెనీ వాళ్ళ హ్రస్వాక్షరి. పాకెట్ బుక్స్, ఇంటింటా గ్రంథాలయం లాంటి నినాదాలతో వాళ్ళు తెలుగు పుస్తక ప్రపంచాన్ని కదిలించారు. ఇంచుమించు ఇలాంటి పద్ధతినే మేగజిన్ కి అనుబంధంగా ఇచ్చే పొట్టి పుస్తకాలతో కొన్ని పత్రికలు ‘సొమ్మలు పోనాయండి ' (రావిశాస్త్రి రచన) అని అన్నాయే కాని ‘సొమ్ములు పోయాయండీ' అని ఎప్పుడూ అనలేదు.
‘వెండి తెర మీద చూశాం కదా, ఇంక పుస్తకం ఎందుకూ, మరో ఖర్చు!' అని ఆ రోజుల్లోనూ బంగారం లాంటి వాగ్ధాటి కలిగి ఉండేవారు కొందరు.
మేగజిన్స్ లో సీరియల్స్ ని ‘ధారావాహికాలు' అనేవారు. వారం వారం కథనెక్కడో ఆపేసి ‘ఇంకా ఉంది' అనో, ‘సశేషం' అనో అనే వారు. కొందరు మరీ నవ్యత్వం ఎక్కువైపోయి ‘ముగింపు మీకూ తెలుసు' అని ఊరించేవారు. ఇలా వచ్చే సీరియల్స్, లేదా తరువాత వచ్చే నవల్స్ కొన్ని నిర్మాతల, నటుల భార్యలని ఆకర్షించేవి. వెంటనే అవి వెండితెర మీదికి సినిమాలుగా మారి పోయేవి. తెలుగువాళ్ళకి శరత్ చంద్ర చటర్జీ రచనలంటే వల్లమాలిన ఇష్టం. అలాంటి ఇష్టానికి బాధ్యుడు చక్రపాణి గారే. వేదాంతం రాఘవయ్య గారు ‘దేవదాస్' ని బెంగాలీ నవల పరంగా చూపిస్తూనే తెలుగు వాకిళ్ళ నిలబెట్టారు. ‘మళ్ళీ జన్మంటూ ఉంటే' అని చంద్రముఖి తో దేవదాస్ అనడం దాసరి వారు గుర్తు పెట్టుకునీ ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు ' అని సినిమా తీసారు. శరత్ రచన ‘బడదీదీ ' బాటసారి - గా మారింది. హిందీలోనూ ‘దేవదాస్ ' సైగల్, దిలీప్, షారూఖ్ ల కాలాల వరకూ రాజ్యమేలాడు. శరత్ నవల ‘పరిణీత ' రెండు సార్లు హిందీ సినిమాగా వచ్చింది. తెలుగులో ఆరాధన (ఏ.ఎన్.ఆర్) కి మూలం బెంగాలీ నవలే. బెంగాలీ దురంధరుడు సత్యజిత్ రే ప్రేమ్ చం****ద్ రాసిన ‘షత్రంజ్ కె ఖిలాడి' ని హిందీ సినిమాగా చూపెట్టినా అది జనతని ఆకర్షించలేక పోయింది.చక్రపాణి గారే భానుమ****తీ రామకృష్ణ గారి రచనలకి ప్రేరణ. అయితే ఆమె రాసిన అతాగారి కథల్లో ఒక్కటైనా సినిమాగా రాకపోవడం ఏమిటో?
గురజాడ అప్పారావు గారి ‘కన్యాశుల్కం ' సినిమాగా మారినా ఆ ‘ఒరిజినల్' చదివితే వచ్చే అనుభూతే వేరు. సినిమాలో మధురవాణిగా సావిత్రి నవ్విన నవ్వు మాత్రం చూడదగ్గదే కాని చదివితే దొరకదు. ఆరుద్ర గారు చెప్పారు- గురజాడ వారికి ‘కన్యాశుల్కం ' పుస్తకంగా చదివించడం కంటే నాటకంగానే ప్రదర్శించడం ఎక్కువ ఇష్టంగా ఉండేదని. సోమయాజులు , రమణమూర్తి వంటి వారు ఎన్నెన్నో ప్రదర్శనలిచ్చి కన్యాశుల్కం నాటకానికి కీర్తి తెచ్చి పెట్టారు. నాగభూషణం గారు ‘రక్త కన్నీర్ ' నాటకంతో పేరుగాంచారు. అది సినిమాగానూ వచ్చింది.
స్వంత నిర్మాణంలో మంచి ఇంగ్లీష్ కథల ఆధారంగా తెలుగు సినిమాలు తీయడానికి ఇష్టపడే బి.ఎన్.రెడ్డి గారు శంబూ ఫిల్మ్స్ వారి ‘పూజాఫలం' చిత్రానికి మటుకు మునిపల్లె రాజు గారి ‘పూజారి ' నవలను తీసుకున్నారు. అన్నపూర్ణా వారు ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి గారి ‘చక్రభ్రమణం ' నవలని ‘డాక్టర్ చక్రవర్తి ' సినిమాగా మలచి తొలి బంగారు నందిని కొట్టేసారు. ఇక్కడో గమ్మత్తు – ఆదుర్తి సుబ్బారావు ఆ సినిమాకి దర్శకులు. ఏ.ఎన్.ఆర్ హీరో. వీరి కాంబినేషన్ తో ‘చక్రవర్తి చిత్ర' అనే నిర్మాణ సంస్థ వెలసింది. వారి మొదటి సినిమా ‘సుడి గుండాలు 'కి ప్రముఖ రచయిత ఎన్.ఆర్.నంది మాటలు రాశారు. అలా ఒక నవల పుణ్యమా అని చక్రవర్తి, నంది – పునరావృతం అయ్యాయి.
యద్దనపూడి సులోచనారాణి వారి ‘జీవన తరంగాలు ' అనే రెండు లావుపాటి నవలా భాగాల్ని అవలీలగా అదే పేరుతో రామానాయుడు గారు సినిమా తీసి ‘హిట్' లర్ అయ్యారు. ఘంటసాల వారికి సహచరుడు అని మాత్రమే జనమెరిగిన జె.వి.రాఘవులు ఈ సినిమాకి చక్కని పాటల వరసలు కూర్చారు. ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో..' ఘంటసాల వారికి ఇష్టమైన పాట. యద్దనపూడి వారి నవలలు ఆత్మీయులు , జైజవాన్ ,సెక్రెటరీ (అన్నిటా ఏ.ఎన్.ఆర్ హీరో) – అవే పేర్లతో సినిమాలుగా వస్తే ‘విజేత ' 'విచిత్ర బంధం' (ఏ.ఎన్.ఆర్ హీరో) గా మారింది. జైజవాన్ తప్పిస్తే వీటన్నిటా హీరోయిన్ వాణిశ్రీ యే. అప్పట్లో ఆమెదే హవా.
శోభన్ , వాణిశ్రీ ల ‘చక్రవాకం ' కూడా నవల నుంచి వచ్చినదే. కొన్నాళ్ళు శోభన్ నవలా నాయకుడు. 'ప్రేమనగర్' నవల సినిమాగా మూడు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ) తయారైపోయాక ‘భారీ సెట్టింగ్స్ తో తీశాను, నా పని అయిపొయింది' అని నిట్టూరుస్తూ ఉండే** రామానాయుడు** గారికి మరో పెద్ద మలుపునిచ్చింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన్ని చూడండని ప్రేక్షక లోకం గిన్నీస్ వారికి పిలుపునిచ్చింది.
నటీమణి విజయనిర్మల గొప్ప ‘నవలా' మణి. ఆమె సులోచనారాణి గారి బహు తీపి ‘మీనా ' నవలని (అది మీ, నా నవల అని తెలుసు కనుక) ‘అంతే తీపిగా మలచడం ‘నావల్ల' కాదు' అనకుండా ‘నావెల్' గా మలచారు. బాపు గారు బొమ్మలాయన గనుక ఎంచక్కా సీను సీనూ బొమ్మేసుకునీ అలాగే తీస్తారు. అలా ఆమె ఆయన్ని ఫాలో అయ్యేవారు, బొమ్మలతో కాకుండా ఫ్రేములతో. అంతకుముందు ద్వివేదుల విశాలాక్షి గారి ‘వారధి ' సీరియల్ నవల ‘రెండు కుటుంబాల కథ ' గా రావడం మీకు తెలుసునా? అందులో హీరో, హీరోయిన్ కృష్ణ , విజయనిర్మల లే. నటి చంద్రకళ కొంచెం నిలదొక్కుకొనీ అద్భుతంగా నటిస్తున్న దశలో ‘కరుణామయి అరుణ ' అనే సీరియల్ ‘దేశమంటే మనుషులోయ్ ' (శోభన్ కార్మిక నాయకుడు) అనే సినిమా సందేశంగా నిలిచింది. కావిలిపాటి విజయలక్ష్మి గారి ‘విధి విన్యాసాలు ' సీరియల్ నవల శోభన్ తండ్రీకొడుకులుగా నటించిన ‘తాశీల్దారు గారి అమ్మాయి ' కాగలిగింది. సీరియల్ సినిమా కావడం ఆ రోజుల్లో విధి విన్యాసం కాదు. విలాసమైన విధి (డ్యూటీ). వాసిరెడ్డి సీతాదేవి గారి ‘సమత ' నవల ఆధారంగా ‘ప్రజానాయకుడు '. (నాగభూషణం. జగ్గయ్య, షావుకారు జానకి) సినిమా రూపంలో తిరిగాడు. స్వీట్ హోమ్ ఫేం రంగనాయకమ్మ గారి ‘బలిపీఠం ' దాసరి నారాయణరావు గారి చేతిలో అద్భుత పీఠంగా వెలిసింది. మాదిరెడ్డి సులోచన గారి నవల ‘ఇదెక్కడి న్యాయం?' వీరి సినిమాగా రావడం న్యాయమే.
ఒకానొక సత్యనారాయణ గారి ‘కౌసల్య ' సీరియల్ నవల ‘తల్లిదండ్రులు ' సినిమాగా (జగ్గయ్య,సావిత్రి,శోభన్) వచ్చింది. పొడుగాయన హరనాథ్ ‘ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు' అని పాడడం ఈ సినిమాలోనే. ‘పాట పాడనా ప్రభూ' అని చంద్రకళ కంట తడిపెట్టించింది ఇందులోనే. ఆచార్య ఆత్రేయ గారు సినిమాల్లో పాటలు రాయక ముందు గొప్ప గొప్ప నాటకాలు రాసిన వారే. వారి ‘గుమాస్తా ' నాటకం సినిమా కాగలిగింది. ఆదివిష్ణు గారు ‘సగటు మనిషి ' గురించి ఎంత బాగా రాస్తారో ‘మంచు తెర ' చాటున నాటకం కూడ అంతే బాగా తక్తి కట్టిస్తారు. కాని అవేవి సినిమాలు కాలేదు. ఆయన ఎన్నో సినిమాలకి మాటలు మాత్రం రాశారు.గొల్లపూడి వారు ‘పిడికెడు ఆకాశం ' అంటూనే కడలిని మించిన కథలు రాశారు. విశ్వనాథ్ గారి ఎన్నో సినిమాలకి మాటలూ రాశారు. దర్శకుడు సింగీతం మంచి కథకులు. విశ్వనాథ్ వారు బి.ఎన్.రెడ్డి గారి దగ్గరా, సింగీతం వారు కె.వి.రెడ్డి గారి దగ్గరా పని చేసి వారి వారి ప్రతిభల ప్రతి రూపాలుగా నిలవడం గొప్పదే.
ఎన్.ఆర్.నంది అంటే ‘మరో మొహెంజదారో ' నాటక శిల్పి అని అందరికీ తెల్సినా తరువాత్తరువాత ‘గుడ్ బై భూదేవీ గుడ్ బై' వంటి సైన్స్ ఫిక్షన్ లతో ‘ఫ్రిక్షన్' సృష్టించారు. ‘దినందినం' అటునుంచి ‘నందినంది ' అని పాఠక లోకం అనగలిగినా అంతకు ముందే అలాంటి సినిమాలు విఠలాచార్య గారు తీసేయడంతో వారి కొత్తదనం ఒక్క సినిమా కూడా కాలేకపోయింది. సింగీతం వారు ‘ఆదిత్య 369' తో భూత, వర్తమాన,భవిష్య కాలాల సరదాలను పండించారు.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయి పడగలు ' వేయి జన్మలెత్తినా సినిమాగా తీయలేరు. వారి ‘ఏకవీర ' ని మాత్రం సినిమాగా తీసి కొందరు నిర్మాతలు విలవిలలాడిపోయారు, థియేటర్ లో ఒకే ఒక్కడు వీరుడిలా కూర్చునీ సినిమా చూడడం తెలిసీ. ఒక సినిమా ఆడక పోవడానికి కారణం అదే సమయంలో మరో దృశ్యకావ్యం జనాకర్షణం కావడం! అది అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉండేదే!
ఇంటూరి వెంకటేశ్వరరావు గారు ‘కుమ్మరి మొల్ల ' కథని తిరగ రాస్తే పద్మనాభం గారి స్వంత చిత్రం ‘కథానాయిక మొల్ల ' గా మలచి బంగారు నందిని కొట్టేశారు. అంటే ఇవాళ్టి భాషలో ‘ఇరగ దీశారు'.
సత్యం శంకరమంచి గారి మంచి ‘అమరావతి కథలు ' బుల్లి తెర మీద పలికాయని విన్నాను. వాటిని చదువుతుంటే వచ్చే ఆ హాయే వేరు. కంట తడి కూడా హాయికి చిహ్నమే. ‘ఇవి కన్నీళ్ళు కావమ్మా- ఆనంద బాష్పాలు' అన్న డైలాగ్ కనీసం వంద సారులైనా వినని తెలుగు ‘సారొస్తారొస్తారొస్తారు' అంటే గనుక అతన్ని తక్షణం సన్మానించాల్సిందే!
మరో యువతరం రచయితలు మల్లాది, యండమూరి వారలు చంటబ్బాయ్ నుంచి రాక్షసుడు వరకు, ఆ ఒక్కటీ అడక్కు – నల్లంచు తెల్ల చీర... అనేంత వరకు చేజేతులా నవలలు రాసేసి సినిమాలుగా రప్పించారు. మాస్ అప్పీల్ వారు తెలుసుకున్న విద్య.
కొన్ని ఇంగ్లీష్ నవలలు కొందరే చదివి సినిమాలుగా తీసేవారు. కొందరు మార్పులు చేసి ‘మా కథ మాదే' అనే ధీమాతో ఉండేవారు. మా అన్న డాక్టర్ బాబు మెడిసన్ చదువుతూ ఇన్ ఎడిషన్ ఇంగ్లీష్ నవలలు ‘ఉఫ్' అని ఊదేశేవాడు. పైగా మొత్తం కథ అప్ప చెప్పెసేవాడు. మా బదులు ఏ నిర్మాతో వింటే ఎంత బావుణ్ణు! దేవానంద్ , సోదరుడు విజయానంద్ ఇలా ఆర్కే నారాయణ్ నవల ‘గైడ్ ' వినో, చదివో సినిమాగా తీసి హిందీ సినిమాల సక్సెస్ కి గైడెన్స్ ఇవ్వగలిగారు. కొందరు హిందీ నిర్మాతలు ధైర్యంగా మారియో పుజో రాసిన ‘గాడ్ ఫాదర్ ' ని ‘ధర్మాత్మా ' అన్నారు. రాజ్ కపూర్ బావగారుప్రేమ్ నాథ్ కొత్త రూపం లో కనిపించి గడగడ లాడించారు ఇందులో. ఆస్కార్ అవార్డ్ కి ఆస్కారం కల్పించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్ ' వికాస్ స్వరూప్ కథ నుంచి పుట్టినదే. త్రీ ఇడియట్స్ – సినిమాకి మూలం చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్ ' అన్నది లోక విదితం. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు ఎక్కువగా తెలుగు నవలలు తెలుగు సినిమాలుగా మారితే ఇప్పుడు ఎక్కువగా హింగ్లీష్ నవలలే హిందీ సినిమాలకి జీవగర్రలౌతున్నాయి. ఈ మధ్య ఇద్దరు తెలుగు కుర్ర రచయిత్రులు ఇంగ్లీష్లో నవలలు దంచేస్తున్నారట. శుభం. సినిమాలకి పనికొస్తున్నాయా లేదా అని నిర్ణయించేది నిర్మాతల భార్యలే గనుక వాటికి అనువాదాలు వస్తేనే తప్ప ఫలితాలు చెప్పలేం.
ఇప్పుడిప్పుడే దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకనాడు పిల్లల కోసం చందమామ సీరియల్స్ ఎంత బాగా రాసేవారో ‘రచన ' పత్రిక ద్వారా తెలుసుకుంటున్నాం. మా మిత్రుడు ప్రకాష్ తల్లితండ్రులు ఇప్పటికీ ఆ చందమామ సీరియల్స్ ఒరిజినల్ వి భద్రంగానే ఉంచి ఉంటారని నా నమ్మకం. కొందరికో మంచి ఆలోచన పుడుతుంది. చేజేతులా కొన్నిటిని జారవిడుచుకోరాదన్నదే. అలాంటివే ఈ లక్షణమైన కలక్షన్లు. ఆంధ్రప్రభ సంచికల్లో వచ్చిన ‘చిట్టిరాజు ' ను ఎవరు మరవగలరు? ఇ.ఎఫ్. డాడ్, ఓ.సోగ్లో – పేర్లు ఎంత బాగా గుర్తుకొస్తాయీ! బుజ్జాయి ‘డుంబు ' ఎంత బావుండేవాడూ! ముళ్ళపూడి వారి ‘బుడుగు ', అవసరాల వారి ‘కేటూ డూప్లికేటూ ' భలే భలే! ‘బాల ' పిల్లల పుస్తకంతోనే బాపూ రమణ లు తెలుగువారికి దక్కారు.
ముళ్ళపూడి వారు హాస్యం, చురకలు, కంట తడి అన్నీ గుదిగుచ్చి కథలు రాసేస్తూ ‘బాపూ ఏదీ చెయి చాపూ' అని ఆయన చేతిలో పెట్టేస్తూ వస్తూ (కొన్ని మాత్రమె ఇతరులకిస్తూ) చివరి క్షణంలో చిరకాల మిత్రుడికి చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోయారు. కాబట్టి ముందు ముందు ‘బాపు రాతల' రామరాజ్యం స్క్రిప్ట్స్ చదువుతూ పుస్తక రూపంలో చదువుతూ గడపాలి తప్ప మరో దారి లేదు.
ప్రస్తుతం తెలుగు సినిమాలు కథలు పోగుట్టుకునీ దారి తప్పాయి. త్యాగయ్య, రాందాసు, కనకదాసు, సాయిబాబా- ఇలా ఈ కథల్లోనూ ఐటం సాంగ్స్ పెట్టి బతకాల్సిన పరిస్థితి దాపురించింది. వందేళ్ళ సినిమా చరిత్ర పుటల్లో తెలుగు వాళ్ళవి ఎనభై పుటలు. ఎనభైల నుంచి ఇప్పటివరకూ చూస్తే శంకరాభరణం స్థాయికి ఏదీ లేదు. ఇప్పుడు స్వర్గీయ చిత్తూరు నాగయ్య అవార్డ్ కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి ఇవ్వడం సముచితమే.
అప్పట్లో అయిదు పైసలు, పది పైసలు ఉన్నట్టే అంతే ధరకి సినిమా పాటల పుస్తకాలు రంగురంగులతో వచ్చేవి. ‘సమయము మించినన్ దొరుకదు' అని నారదుడన్నట్టు ఆ రోజుల్లో కొనకపోతే ఇక ఎప్పటికీ పాటల పుస్తకాలు చేతికందవు. భవిష్యత్తులో కరువు కావొచ్చని కొన్నిటినిబరంపురం లోనే సేకరించాను. మా అన్నయ్య స్నేహితుడు గిన్నీస్ రికార్డ్ కర్హుడు. ఈ ‘బుల్లిమామ' ఎన్నెన్ని పాటల పుస్తకాలనో కొన్నాడు. మా ఛత్రపురం బాబీ కూడా అలా సినిమాకి వెళ్ళి రాగానే వెంట పాటల పుస్తకంతో వచ్చేవాడు. ‘కాకినాడ రేవు కాడ కలుసుకుందమా' అనే పాటలో అన్నట్టు కాకినాడ సినిమాల వీధి నాకు ఎన్నో పాటల పుస్తకాల భిక్ష పెట్టింది.
సినిమా హాల్లో అప్పడాలు వచ్చేవి కాని వాటిని పాటల పుస్తకాలతో కప్పడాలు ఆ రోజుల్లో ఉండేది కాదు. పాటల పుస్తకాలు వైవిధ్యంగా ఉండేవి కాబట్టి అవంటే అందరికీ అదో గౌరవం! ‘ఆత్మ గౌరవం ' పాటల పుస్తకం మీద ‘గ్రామఫోన్ రికార్డ్' బొమ్మ ఉండేది. ‘అంతస్తులు ' – ఒక్కో పేజీ ఒక్కో అంతస్తు అన్నట్టు పెరుగుతూ ఉండేది. వెండి నంది పొందిన ‘కీలు బొమ్మలు ' నాకు తెల్సి ఒకే ఒక్క సినిమా – పుస్తకం డిజైన్ తో పాటల పుస్తకం తీసుకొచ్చింది. పేరు ‘గండరగండడు ' అయినా ఆ చిత్రం పా.పు పొట్టిగా వచ్చింది. కొన్ని పా.పు లు నిలువుగానూ, మరికొన్ని అడ్డంగానూ వచ్చేవి. ‘లేతమనసులు ' వేరుగా వచ్చినా హాల్లో రైల్వే టైం టేబిల్ ఒకపక్క, లేతమనసులు + భక్తప్రహ్లాద ఒకపక్క ఉన్న కార్డ్ ఉచితంగా ఇచ్చేవారు. ‘కృష్ణప్రేమ ' ఇస్తే వీటి నకళ్ళు, మెరుస్తాయి, చెమరుస్తాయి మీ కళ్ళు !
కనీసం ఓ యాభై పుస్తకాలైనా ఇంటి అల్మారాల సొరుగుల్లో ఉండాలి. టీవీ లిప్పుడు గోడనంటుకున్నాయి కాబట్టి మళ్ళీ అరమరికలు లేకుండా అలమరలు పున: ప్రారంభించండి. అన్నీ ఇవాళ కంప్యూటర్ లో దొరుకుతాయి అన్నది భ్రమ మాత్రమే. సగం కాలం యూ ట్యూబు వీక్షణం తినేస్తుంది కొందరిని. ఇంక పుస్తకం చదవడానికి ఓపిక ఉంటుందా?
ఒకాయన తన కూతురుకి నాట్యం నేర్పిస్తున్నాడు కదా అని ప్రసిద్ధ నాట్యాచారిణి కనక్ రేలే చక్కగా రాసిన మోహినీ యాట్టం చదవవయ్యా అని ఇవ్వబోతే ‘ఇప్పుడు కాదు, రిటైర్ అయ్యాక ఇలాంటివి చదవాలి' అని నా మొహం మాడేలా చేశాడు. ‘టయిం వేస్ట్' కాబోలది ఆయన దృష్టిలో. మన అభిరుచులు ఇంకొకరిలో లేనప్పుడు మనం వాటిని వారిముందు ప్రస్తావించకూడదు అని ఆస్ట్రేలియా లో ఉన్న నా మిత్రుడు మురళీధర్ ఇండియా లో ఉన్నప్పుడు అనేవాడు. నిజం.
కంచంలో పప్పు వడ్డిస్తే లొట్టలు వేస్తాం కదా. అంచేత ‘పుస్తకం లేని ప్రపంచం పప్పు లేని కంచం' అంటాను. ఏకీభవిస్తారా? పప్పును చూస్తూ పప్పులో కాలేసి జారిపోవడం తగదు. పుస్తకాలకి అట్టలు వెయ్యాలి. దుమ్మూ ధూళి వాటికి అంటకుండా తుమ్మూ దగ్గూ మనకి రాకుండా చూసుకోవాలి. అవన్నీ మన మెదడును సానబెట్టేవే కనుక ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
‘రామాయణం పుస్తకం తీసుకో వాలీ , తీసుకోవాలి' అని సుగ్రీవుడు అన్న మీద అరవబోతూ ‘గబుక్కున లాగడంలో బుక్కు చిరిగింది' అని వెనక్కి తగ్గడం వల్లే అంత రసాభాస జరిగింది. కనుక మనకి కొమ్ము కాచే ఋక్కులే కాదు, ఒక కొమ్ము తక్కువైనా బుక్కులూ ముఖ్యం. జయ జయ ప్రియ ధరిత్రీ, జై జై బుక్ ఆఫ్ ఎవ్విరి కంట్రీ!
మరి- కనులు చూసినా పాటే – కావాలంటే మూడు భాషల ప్రేమనగర్, తెలుగు జీవన తరంగాలు, బలిపీఠం చూడాల్సిందే.
కనులు మూసినా పాటే – అనుకుంటే మీనా, బలిపీఠం, రెండు కుటుంబాల కథ, పూజాఫలం, ఏకవీర, కన్యాశుల్కం సినిమాల్లోని ఒక్కో పాట వినాల్సిందే.
ఆహా ఆహాహా --ప్రతి ముఖమూ ప్రముఖమే – పుస్తక పరంగా అవేమిటో అనుకుంటే అక్కడకి వెళ్ళి వెతకాల్సిందే.
ప్రతి రాతా ప్రసిద్ధమే - కనక కవిసామ్రాట్, జ్ఞాన పీఠ వర విశ్వనాథ వారి ‘ఏకవీర ' నవల సినిమాగా మారడం గురించి మరో జ్ఞాన పీఠ వర డాక్టర్సి.నా.రె అలనాటి విజయచిత్ర లో ఏమని ముచ్చటించారో తెలుసుకోవాల్సిందే.
ఈ కృష్ణప్రేమ అనేది కంటి ముందున్న డిజిటల్ బుక్ ---- అక్కడ ప్రతి పేజీ పైన ఉంటుంది సుందరానంద జగద్రమణీయ శాంత సందేశం అనదగ్గ మీ లుక్...
-డా. తాతిరాజు వేణుగోపాల్, 22 ఏప్రిల్ 2012