Krishnaprema Logo

కృష్ణప్రేమ

సలీం కి వేయి సలాములు - జాలాదికి నమస్సులు వేలాది

16 అక్టోబర్, 2011

సలీం కి వేయి సలాములు - జాలాదికి నమస్సులు వేలాది

Picture

2011 అక్టోబర్ 14, శుక్రవారం -
రెం డు మాణిక్యాలు ఆంధ్ర నేల నుంచి తొలగిపోయాయి.

కొన్నేళ్లుగా మరుగున పడిపోయిన ఆ రెండు మాణిక్యాల నగిషీ తళుకులు ఒక్క సారిగా గుర్తు చేసింది ఆ రోజు. అవి నకిలీ తళుకులు కావు కనుకనే వారు ప్రసాదించి పెట్టిన పాటల రూపంలో నిత్యం ప్రతిఫలిస్తూ ఉంటాయి.

పాట వెనక అందమైన భంగిమల రూప కల్పన చేసి చేసి ఎందరినో ఉన్నత స్థానాన నిలబెట్టి తాను మాత్రం ఏకాకిగా మిగిలి పోయిన దెవరూ?

అంతకు ముందు రాజ ఠీవితో నడిచిన స్టూడియోలకి అతీతంగా దయనీయంగా బతుకు బండిని లాక్కువస్తున్న దెవరూ?

ఎవరి దయనీయ స్థితికి చలించి దాసరి , రామానాయుడు వంటి దాతలు ముందుకొచ్చారు?

అతనే 'డాన్స్ మాస్టర్ సలీం ' అంటే చలించని వారుండరు.

సలీం మాణిక్యం మక్కా వెళ్లి తీరాలన్న ఒక్క గా నొక్క ఆశ తీరక మట్టి పాలు కావడం బాధాకరమే.

తెలుగువాళ్ళు ఎప్పుడైనా కలగన్నారా- ఈ మలయాళ డాన్స్ మాంత్రికుడు తెలుగు జన 'పథం' లోకి చొచ్చుకొచ్చి అద్భుతాలు సృష్టించి ఇస్తాడనీ?

ఇప్పుడు ఎన్ననుకున్నా ఏం లాభం? సలీం జాదూ ఇంక ఉండనే ఉండదు. పాత ఫిల్ము దొంతరల్లో చిందులు వేసే పాత్రలు మాత్రం మాయం కావు. అదొక్కటే ఊరట!


పాటకి ముందు దర్శకుడిచ్చే సన్నివేశపు 'చూచాయ' సూచనలు మనసా వాచా పాటిస్తూ కలం కదిపి కలకలం సృష్టించినది ఎవరూ?

'ప్రాణం ఖరీదు ' - ఆ రెండు పదాల సినిమా శీర్షికే ఒక విప్లవాత్మక సందేశమయితే అందులో 'యాతమేసి తోడినా' ఎండని ఏటి గుండె సాక్షిగా పాటలు, పద విన్యాసాలు సరి కొత్తగా పేర్చుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ విక్రమార్క విజయం సాధించినజాలాది కవి అంటె జాలి, దయ, కరుణ ఆది కల కవిగా 'పుణ్య భూమి నా దేశం' అప్పుడే గుర్తించింది.

ఆయన అటు చెన్నైలో కాదు, ఇటు హైదరాబాద్ లోనూ కాదు- నిత్యం కెరటాలు సత్యాన్వేషణ పనిలో మునుగుతూ తేలుతూ ఉండే విశాఖ లో తుది శ్వాస తీసుకున్న వేళ సినీ పరిశ్రమ 'శ్రమ' అనుకునీ అంత దూరం రాలేదు.'ప్రాణం ఖరీదు' అంటే బతుకు వెల అని జాలాది ఆత్మ నవ్వుకుంది.

జాలాది రాసిన ఏ ఒక్క పాట విన్నా చాలు అగాధమౌ ఆయన పాట జలనిధిలో నవ్య వేదాంతం అనే ఆణి ముత్యముందని తెలుస్తుంది. అందుకే ఆయన్ని మనసారా నమస్కరించేందుకు ప్రతి తెలుగు వాడికీ మనస్కరిస్తుంది.

జాలాది రాజారావు అందరు కవుల్లా వాడిన మాటలే వాడలేదు. పాడిన పాటే పాడ లేదు. 'ఆడది' అనే ఓ ప్రాణి ఉంది అని గుర్తు చేస్తూ పసుపు తాడు, పలుపు తాడు ప్రయోగాలతో హడలెత్తించిన పదజాలాధి పతి జాలాది. కళ్యాణంకి చేతి వేలికి, నిర్యాణంకి కాలి బొటన వేలుకి ఉన్న అనుబంధాల్ని సున్నిత వాక్యాలతో చెబుతూనే సుతిమెత్తని చీవాట్లు పెట్టగల మామంచి ఉపాధ్యాయులు జాలాది.

కొసరాజు - అనే కొస రాజుకుంటే అదిజాలాది అనే అగ్ని కణమైంది. ఆ అగ్ని కాల్చదు, మాడ్చదు, వెలుగులోకి రండర్రా అని ఆహ్వానిస్తుంది. ఆ వెలుగు తెలుగు వాళ్లకి ఓ మూడు దశాబ్దాలు దక్కింది, అంతే చాలు. జానపదాలు కను మరుగౌతుంటేజాలాది , మరో కవి ద్వయం దాసం గోపాలకృష్ణ , మల్లెమాల జాను తెనుగు జన పదాలు అనే అక్షర లక్షలు కురిపించారు. అవును- ముగ్గురి పేర్లలో ' 'కారముంది కదా.

సలీం చెప్పే కొత్త కొత్త నడకలు అక్కినేని, నందమూరి, ఎమ్జీఆర్, జెమిని గణేశన్, శోభన్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జయలలిత, బి.సరోజాదేవి, శ్రీదేవి, జయప్రద, జయసుధ - ఒకరేమిటీ దాదాపు ప్రతి నటీ, నటుడూ నేర్చిఅభినయించిన వారే.

సలీం 'చీర' పాటల స్పెషలిస్ట్. 'ఇదిగో తెల్ల చీర', 'కోకెత్తుకెళ్ళిందా కొండగాలి', 'కోకచాటు పిందె తడిసే', 'చీర కట్టి ' వంటివి నూతనంగా మలిచి మూడు చీరలు, ఆరు వాన ధారలుగా పాట సామెతను మార్చిన ఘనుడు. ఒకనాటి ఆ సలీం వేయించిన స్టెప్పులకి 'సై సై' అన్న అనార్కలి పురుషుడైతే అక్బర్ 'చక్రవర్తి' 'వహ్వా' అని మెచ్చుకోకుండా ఉండేవాడా?సలీం కి సైదోడుగా 'చక్రవర్తి ' వరసలు ఆనాటి పువ్వులాంటి హృదయాలున్న యూత్ నాల్కల పైన మొగ్గలు వేయించాయి.

సలీం ఇంక శాశ్వతంగా ఏకాకి కారు. సలాం అందుకోండి సలీం సహ్రుదయులనుంచి.

జాలాది వారు లేరని బాధ పడే జాలి గుండె కలవారు జాలాది వారిని మరచి పోయిన వారి మీద జాలి పడుతున్నారు. జాలాది కవి కోకిల శాశ్వత నిద్ర కోరుకుంది. జోతలు అందుకోండి జాలాదీ వినమ్రులనుంచి.

హిందీ సినిమాలకి 'సలీం- జావేద్ ' అనే జంట కవులు ఉండేవారు. వారి ప్రతిభకి పట్టంగట్టినది- 'షోలే '

తెలుగు సినిమాలకి 'సలీం, జాలాది ' వేరు వేరుగా ఉంటూనే వారి వారి ప్రతిభలతో చిత్రాలకి ఇచ్చినవి షో ఆఫ్టర్ షో లే!

సలీం, జాలాది వారి ఉభయ ప్రతిభల మచ్చు తునకలు, జనం మెచ్చు ఆనంద గంగ మునకలు 'కనులు చూసినా పాట' లో తప్పక దర్శనమిస్తాయి.

-డా. తాతిరాజు వేణుగోపాల్, 16 అక్టోబర్ 2011 (ఆదివారం)