Krishnaprema Logo

కృష్ణప్రేమ

విజయీ భవ!

13 ఏప్రిల్, 2013

విజయీ భవ!

Picture

‘అయ్యా గోపాలం గారూ ...కొంచెం ఆలస్యమైనా...ఉగాది శుభాకాంక్షలు...'

‘ప్రకాశం గారూ.. రండి రండి... శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు...ఒక్క రోజే కాదు ఏడాది పొడుగునా...'

‘చెప్పండీ.. మనం గానీ ఉగాది అని తప్పుగా అంటున్నామా? యుగాదియే కరెక్ట్ అనుకుంటా'

‘ఉగాది అంటే యుగాదియే. యుండెడిది అనేది వ్యావహారికంలో ఉండెడిది అయినట్టే యుగాది కాస్త ఉగాది అయింది. కన్నడ వారు ‘యుగాది' అనే అంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వ అంటారు. బ్రహ్మ యుగాన్ని ప్రారంభించేడని కృతజ్ఞతగా ఇంటింటా చిన్న గుడి కట్టి ఆహ్వానిస్తారు. ఇతరత్రా బ్రహ్మకి గుళ్ళు ఉండవు కదా.'

‘బ్రహ్మ దేవుడు సరే..ఆయన గురుబ్రహ్మ. గోపాలం గారూ.. ఉగాది గురువారం నాడు వచ్చిందని అంటున్నానని అనుకోవద్దు..నిజంగానే మీరు మా గురువులు..'

‘ఈ ఏడు ఉగాది గురువారం నాడు వచ్చింది కాబట్టి గురు గ్రహమే ఈ ఏడాదికి రాజండీ. అంత పెద్దవాడు సైతం... గురు అన్నా బృహత్ అన్నా పేద్ధ అనేగా అర్ధం ---అందుకే అతను బృహస్పతి... మరి ఈ పెద్దాయన సైతం సూర్యుడి చుట్టూ తిరగాల్సిందే. అంచేత ప్రకాశం మీరైనప్పుడు, మీదైనప్పుడు మేమెంతండీ.'


‘అలా అంటారా? అయితే కాచుకోండి...సందేహాల కిరణాలు వదుల్తున్నాను. చూస్తే ఒక్కో వారం ఒక్కొక్క గ్రహం పేరు కలిగి ఉంది కదా, అలాంటప్పుడు ఏడేళ్ళు ఏడు గ్రహాలూ రాజులు కావాలే. ఆ రకంగా ప్రతి ఏడేళ్ళకి ఒక సారి ఆ రాజ లక్షణాలు ఆ ఏడాదికి ఉండాల్సిందే కదా.'

‘ఉండి తీరాల్సిందే. కేవలం రాజు ఒక్కడే పరిపాలించలేడు. క్యాబినెట్ మారుతుంటే పనితీరు మారుతుంది కదా. అలా ఏడేళ్ళకొకసారి రాజు రిపీట్ అయినా బలగం మారుతుంది. భచక్రం అనేది పన్నెండు రాశులలో ఇరవైఏడు నక్షత్ర సముదాయాలతో ఏర్పడ్డ వలయం. మేష నుంచి మీన వరకు పన్నెండు రాశులు. అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు. సూర్యుడి చుట్టూ ఒక చుట్టు చుట్టి రావడానికి స్థూలకాయుడైన పెద్దాయనకి పన్నెండేళ్ళు పడుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో ఈయన ఒక ఏడాది కాలం ఉంటాడు. ఈ బృహస్పతి వారి ద్వాదశ రాశీ భ్రమణం నుంచే ఉగాది సంవత్సరాలు అరవై జనించాయి. అరవై చొప్పున ఒక్కో వృత్తం ముగిసాక మరొక అరవై సంవత్సరాల వృత్తం మొదలౌతుంది. ఇప్పుడు విజయ నామ సంవత్సరం. అవునా? సరిగ్గా 1953వ సంవత్సరం కూడా విజయ నామ సంవత్సరమే..'

‘మీరు రాశులన్నీ తీసుకొచ్చి ఇలా కుప్పలా పోస్తే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాగోపాలం గారూ. ఉండండి...అన్నమయ్య వారి ** ఇన్నిరాశుల యునికి** ...పాట మీకు వినిపిస్తా. కాసేపు రిలాక్స్ అవ్వొచ్చు. అయ్యామా... ఇక చెప్పండి మహాశయా. 1953 లో ఉగాది టయింలోనో, తరువాతో పుట్టిన ఆడవారికి విజయ అనో మగవారికి విజయ్ అనో పేర్లు పెట్టి ఉండవచ్చు. పనిలో పనిగా చిత్రసీమకి ఒక పెద్ద దిక్కు ఉండాలని విజయా సంస్థ కూడా అప్పుడే మొదలైందేమో?'

‘వేశారు పప్పులో కాలు...అంతకు ముందే అంటే 1950లో ‘షావుకారు ' చిత్రంతో మొదలైంది విజయా సంస్థ వారి విజయ యాత్ర.'

‘సర్లెండి. మొహమాటానికైనా ఊ అవును అని అనేస్తే పోలా?'

‘మాటంటే మాటే. నో మొహమాటం ప్లీజ్. ఇంకా నయం..చెప్పనా.. అసలు విజయా వారి సినిమాలే లేవు 1953లో. అయితే బహు ముఖ కోవిదురాలు భానుమతి మాత్రం చండీరాణి అనే సినిమాని తెలుగు,తమిళ,హిందీ సినిమాల్లో తీసి, నటించి ఒక విజయ పతాక ఎగరేసింది ఈ 1953 సంవత్సరం లోనే (కనులు చూసినా పాటే ). ఇదే యేడు ఇద్దరు నిర్మాతలు నా నా అంటుంటే మరో ఇద్దరు పర పర అన్నారు.'

‘నా నా , పర పర అంటే రెండు రెండుగానా? యుగం అంటే రెండు అని కాబోలు, ఆ సినీ స్వర్ణ యుగం మొదల్లో ఇలా రెండేసి సినిమా పేర్లు ఉండేవి. ఏదీ ఆ నాలు, ఆ పరలు కాస్త విశదీకరించండీ గోపాలం గారూ.'

నా చెల్లెలు , నా ఇల్లు , పరోపకారం , పరదేశి - ఇవీ ఆ సినిమాలు. 'నా ఇల్లు' సినిమాలోదేవులపల్లి వారు ** అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయీ** .. అనే అందమైన పాట రాస్తే ఆ పాటని జంట స్త్రీ గళాల ద్వారా ఆకాశవాణి వినిపించి గగనవీధిని పావనం చేసింది. పరోపకారం -సినిమా గాయక విద్వన్మణి, స్వర సామ్రాట్టు ఘంటసాల గారు నిర్మాత గా మారి తీసిన తొలి చిత్రం. ఇదే యేడు 'పక్కింటి అమ్మాయి ' అనే సినిమా వచ్చింది. అంజలీ దేవి హీరోయిన్.'

‘అంజలీదేవి అనే కంటే సీతమ్మ వారు అనాలి. లవకుశ వచ్చాక ఆమె సీతమ్మే. ఈ పక్కింటి అమ్మాయి సినిమావే కదా హిందీలో పడోసన్ గా వచ్చిందీ. గాయకుడు కిశోర్ కుమార్ నటించాడు. ఆ పడోసన్ నుంచి మళ్ళీ మరో పక్కింటి అమ్మాయి వచ్చింది. ఇందులో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం నటించారు..'

‘ఇప్పుడింకో అంజలి వచ్చింది. ఆవిడ సీతమ్మ అయితే ఈ అమ్మాయి సీతమ్మ వాకిట్లో .. అని ఏదో సినిమా వచ్చిందిలే, అందులో నటించింది.'

‘పాతవాళ్లే అనుకుంటే ఉహూ(..కొత్తవాళ్ళూ తెలుసే గురువులకి'

‘గురువులు అన్నాకా అప్టుడేటుగా ఉండకపోతే పరువులు పోతాయండీ ప్రకాశం గారూ. ఏం లేదు ఈ అంజలి అనే అమ్మాయి కనపడుట లేదు అని టీవీల్లో ఒకటే గోల గోలగా ఉంటేనూ.. కాస్త చెవి పెట్టి విన్నానంతే...'

‘వారి గోలా గోళీ మనకెందుకండీ! చూస్తూ ఉండండి.. ఉగాది మర్నాటికల్లా వచ్చేస్తుంది ఈ కనపడని అమ్మాయి. ఏమిటీ—నిజంగానే వచ్చేసిందా? ఇక చెప్పండి చెప్పండి 1953 నాటి విశేషాలు ఇంకా ఏమున్నాయో...గోపాలంగారూ. అరవై ఏళ్ళ క్రితం ఇదే విజయ నామ సంవత్సరం వచ్చింది కదా, అలా అయితే ఆనాటి రాశిఫలాలే ఇప్పుడూ వర్తిస్తాయా?'

‘బావుందండీ మీ అడగడం. విజయ నామ సంవత్సరంకి నిజమే కొన్ని లక్షణాలుంటాయి. అవే వచ్చి తీరాలి. కాని అప్పటి వాస్తవ పరిస్థితులు వేరు. ఇప్పటి స్థితి వేరు. అయితే గియితే ...సినీ రంగంలో సాధ్యమే. ఇప్పుడు అనుకున్న ఈ కనపడక కనిపించిన అంజలి అనే అమ్మాయి పేరు చెప్పుకునీ మరో పక్కింటి అమ్మాయి సినిమా వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అరవై ఏళ్ళ తరువాత మీ పక్కింటి అమ్మాయి అదే పక్కింటి అమ్మాయి సినిమా పునర్దర్శనం అని బాజా బజాయించనూ వచ్చు'

'నాకో సందేహం వస్తోంది. కృష్ణప్రేమ సినిమా వచ్చిన అరవై ఏళ్ళకి కృష్ణప్రేమ వెబ్ సైట్ వచ్చిందో ఏమిటో?'

‘కృష్ణప్రేమ పేరిట బహుశా రెండో సినిమా రావడం 1961 లో జరిగింది. కృష్ణప్రేమ వెబ్బేమో 2011 లో కుదిరింది'

‘ఓకే.. అరవై నుంచి ఓ పదేళ్ళు మైనస్. అంతేగా. అదేమిటో ...యుగం అంటే రెండు...అని అనుకోగానే అన్నీ జోడీ జోడీగా జ్ఞాపకం వస్తున్నాయి. అయితే రెండో కృష్ణప్రేమలోనే ఆడ జోడీ యుగళ గీతం ఒకటుంది. వినిపించండి.'

‘అదొకటే ఎందుకూ.. ఆల్రెడీ నా ఇల్లు నుంచి స్త్రీ జోడీ పాట వినేశాం కదా. ఓ అరడజను అలాంటి స్త్రీ జోడీ పాటలు గుర్తు చేసుకుందాం.(కనులు మూసినా పాటే)'

‘అరవై ఏళ్ళ పునరావృత ఫలంగా సినిమాలు తీయడం అనేది ఊహిస్తే చాలా బావుంది. ఇంతవరకు ఈ ఊహ ఎవరికైనా వచ్చిందా? నిజ జీవితంలో అలా అరవై ఏళ్ళ క్రితం ఫలితాలే మళ్ళీ మళ్ళీ రావంటే రావు.'

‘రావని రాలేవని ఊరకే అంటారు.. రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తాయీ'

‘అమ్మమ్మ.. వెంటనే ఆరుద్ర గారి పాటకి పేరడీ రెడీ? ఎలా ఉదయించిందీ థాటూ?'

‘గురుడి దయవల్ల ఉదయమైంది'

‘సూర్యుడి దయ వల్ల సూర్యోదయం కావడం విన్నాం. ఇదేమిటో తమాషాగా ఉంది, గురుడు దయ ఉదయం అనడం.'

‘ఆ పంచాంగం ఒకసారి తిరగేసి చూడండీ.. అబ్బబ్బ తిరగెయ్యడం అంటే అప్ సైడ్ డౌన్ కాదండీ. జోకులూ మీరూనూ. తిప్పండి పేజీలు . ఆగండి. ఈ పేజీలో ఏం రాశారూ. గురూదయాబ్దం అనేగా?'

‘అవును.. గురువు, దయ, ప్రారబ్దం కాబోలు'

‘చక్కని రాజమార్గములుండగా సందులు గొందులు తిరిగితే సంస్కృతం సంధులు ఏం కానూ? గురూదయాబ్దం అంటే గురు+ ఉదయ+అబ్దం. అంటే గురు గ్రహం ఉదయించిన సంవత్సరం'

‘అంటే- వేరే అప్పుడు పెద్దాయన ఉదయించరా?'

‘బుద్ధికి బృహస్పతి అంటారే .. అప్పుడే ఉదయిస్తారు మన మెదడులో. వినండి మరి... ఈ ఏడాది మార్గశిర గురూదయాబ్దం అని ఉంది కదా.'

‘అవును.'

‘అంటే—గురుగ్రహం ఉగాది నాటికి మార్గశీర్ష నక్షత్రంలో ఉంది అన్నమాట'.

‘అయితే- ఈ ఉగాదికి వృషభ రాశిలో గురుగ్రహం ఉండడం అంటే మృగశిర మార్గంలో ఉన్నట్టే కదా.'

‘అదీ బుద్ధికి బృహస్పతి అంటే. బృహస్పతి పరిభ్రమణ కాలం పన్నెండేళ్ళు కదా. ఈ సంవత్సరం 2013 మధ్యనుంచి ఈయన మూడవ రాశి అయిన మిథున రాశిలో ఉంటాడు. సంవత్సరం చివర మూడు అంకె ఉంది , సంవత్సరం మధ్యన ఈయనుండేది మూడవ రాశి అన్నది అతిసులభంగా గుర్తుంచుకోవచ్చు.

నక్షత్రం ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు కాబట్టి ప్రతి రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలుంటాయి. మేష రాశిలో అశ్విని పూర్తిగా, భరణి పూర్తిగా, కృత్తిక ఒక్క పాదం; వృషభ రాశిలో కృత్తిక మూడు పాదాలు, రోహిణి పూర్తిగా, మృగశిర రెండు పాదాలు ఉంటాయి.మిథున రాశిలో మృగశిర రెండు పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలు, పునర్వసు మూడు పాదాలు ఉంటాయి.'

‘ఈ లెక్క వేసుకుంటే ఇంక సంవత్సర ఫలాలు వేరుగానూ ఉండ వచ్చునేమో. ఇంతకీ విజయ సంవత్సరం ఫలాలు ఎలా ఉండాలీ?'

‘‘నందన,విజయ,జయ ఈ మూడు నామ సంవత్సరాలు ప్రయోజనకర సంవత్సరాలు. '

‘ఏమో...నందన ఏం ప్రయోజనకరమైనవి చేసిందనీ? ...వీటికీ అధిపతులెవరైనా ఉంటారా?'

‘ప్రయోజనకరమైనవి అనే కన్నా జన సంచలనం కలిగించినవి జరిగాయి కదా నందనలో. ప్రతి ప్రోగ్రాం లోనూ ఓ సబ్ ప్రోగ్రాం ఉంటే దానికొక అధిపతి ఉంటాడా లేదా? అలాగే ఇవీనూ...'

నందన,విజయ,జయ, మన్మథ,దుర్ముఖ- ఈ పంచ వర్గానికి అధిపతి అహిర్ బుధన్య. అంటే సర్ప సంబంధిత అధిపతి అన్న మాట.'

‘అదేమిటండీ గోపాలం గారూ.. చైనా వాళ్ళకీ మనకీ తేడా ఏమాత్రం లేనట్టుందే. వాళ్ళకీ డ్రేగన్ కదూ ఈ ఏటి చిహ్నం!'

‘వాట్ ఈజ్ ఇన్ చిహ్న్ ‘నేమ్' అని అన్నారెవరో'

‘ఇంకెవరు? నాకు తెలిసి గోపాలం గారే ! అవునూ విజయ గురించి అడిగితే వరసగా ఒక అయిదు సంవత్సరాల పేర్లు చెప్పారేం?''

‘12 x 5 = 60 అండ్ 5 x 12 = 60. ఔనా?'

‘ఏమిటండీ గోపాలం గారూ... మీలో మీరు ఎక్కాలు అప్పచెబుతున్నారా? నన్ను ఇరుకున పెట్టే ఎకసెక్కేలు కావు కదా?'

‘ఉండండి. ఈ ద్వంద్వం గురించి చెబుతా. ప్రతి పన్నెండు ఏళ్ళ కాలాన్ని ఒక యుగం అని అన్నారు. అలాంటి అయిదు యుగాల కాల చక్రమే అరవై ఏళ్ళ కాలం. ప్రతి అయిదేళ్ళ కాలాన్ని కూడా యుగం అనే అన్నారు. అలాంటి పన్నెండు యుగాల కాల చక్రమే అరవై ఏళ్ళ కాలం.'

‘ఏమిటీ తిరకాసూ? దేనిదారి దానిదే అన్నట్టు. ఇటు తిప్పి అటు తిప్పి ఒకటే అనడం కాకపొతే?'

‘అయిదేళ్ళ యుగం లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరుంది. అవి వరసగా – సంవత్సర, పరి వత్సర, ఇడా వత్సర, అను వత్సర, ఇడ్ వత్సర.'

‘ఓహో..అలా అయితే విజయ నామ సంవత్సరం ...అరవైలో ఎన్నో నెంబరూ?'

‘ఇరవై ఏడు'

‘ఎలా గుర్తండీ బాబూ... పట్టిక ఏమైనా మింగేశారా?'

‘ఐదేసి చొప్పున గుర్తు పెట్టుకోవాలి. పెంటడ్ అంటారు ఇంగ్లీషులో. ఐదైదులు ఇరవై అయిదు పోగా వచ్చే పెంటడ్ లో వరసగా వచ్చేవి నందన,విజయ,జయ, మన్మథ, దుర్ముఖ నామ సంవత్సరాలు.'

‘ఓహో.. ఇరవై ఆరు నందన. ఇరవై ఏడు విజయ. సరే..అయితే ఇది పరి వత్సర సంవత్సరమా?'

‘చూశారా ప్రకాశం గారూ ... బృహస్పతి పేరెత్తగానే బుద్ధి బృహస్పతిలా ఎలా పని చేస్తోందో? కాని మీరు తప్పు అని చెప్పుటకు కించిత్తు బాధగా ఉంది. . ప్రభవ= సంవత్సర, విభవ= పరి వత్సర వగైరా అనే లెక్క మీరు తీసుకున్నారు. నిజానికి అలా కాదు. ప్రభవ క్రమం ఇడా వత్సర తో ప్రారంభమైంది. కాబట్టి ఈ విజయ = అనువత్సర, మీరనవచ్చు... ఇన్ని పేర్ల తమషాతో ఒరిగేదేమిటీ అని.'

‘అంతే కదా... అయోధ్యలో రాముడు, రామన్న, రామయ్య అని ఎలా పిలిచినా అక్కడ పలికేది ఒక్కడే.'

‘ఒక్కొక్క పిలుపులో ఒక్కొక్క చొరవ ఉంది కదా. మీరు ఏమండీ అనే వ్యక్తి నా దృష్టిలో ఒరేయ్. మీరు ఒరేయ్ అనే మనిషి నాకు ఏమండీ..కావొచ్చు కదా. అంటే పేరుని బట్టి వ్యక్తి వైశిష్ట్యం తెలుస్తుంది. దాశరథి, రఘుపతి, రాఘవ, జానకీ వల్లభ- ఒక్కొక్క ధర్మం బట్టి అదే రాముడికి అన్ని పేర్లు'

‘బావుందండీ.. అంటే సంవత్సర ఫలితాలు కేవలం ఏక పక్షంగా కాక ఎన్నో విషయాల ద్వారా తెలుసుకోవాలంటారు. ఈ పేర్ల వల్ల అది సాధ్యమంటారు'

‘అనువత్సర సంవత్సరం కాబట్టి దానికి అధిపతి ఒకానొక ప్రజాపతి అని తెలుసుకోవాలి. ఈ అనువత్సర వర్ష లక్షణం ఎలాంటిదంటే కేవలం వర్షర్తువు చివరలోనే వర్షాలు బావుంటాయి.'

‘ఈ పంచాంగ కర్త ఈ ఏడాది అనావృష్టి అన్నాడు.'

‘కావొచ్చు... వానాకాలం చివర్లో వానలొస్తే ఏం ప్రయోజనం? దానర్ధం ముఖ్యమైన నెలల్లో అనావృష్టే అనే అని పంచాంగ కర్త అభిప్రాయం కావొచ్చు. అంతే కాదు...మార్గశిరాబ్ది ఫలమే అనావృష్టి. పంటలకి షడశీతి (ఈతిబాధలు ఆరు) భయం. వ్యాధి భయాలు ఎక్కువే. మిత్ర రాజుల మధ్యనే శత్రుత్వం! ఏదీ పంచాంగం? మళ్ళీ తెరవండి. చూడండి. బార్హస్పత్య మానముచే శ్రీ పరాభవ సంవత్సరం అని అన్నారా?'

‘అవునవును.. అన్నారు.. ఒక్క విజయ మాత్రమే అనుకుంటే మార్గశిర గురూదయాబ్దం, అను వత్సరం, బార్హస్పత్య మానం అని మరో మూడా? నాలుగు రకాల ఫలితాలు చెబితే నలుగురూ నవ్వరూ? పైగా అయోమయం కదండీ గోపాలం గారూ'

‘బార్హ అన్నది బృహ నుంచి వచ్చినదే. బృహస్పతి పరంగా వచ్చిన గణనం కనుక బార్హస్పత్య మానం అన్నారు. బారాహ్ అంటే పన్నెండు అన్నది గురు పరిభ్రమణం నుంచి వచ్చినదే.'

‘పరిభ్రమణం సరే.. తల తిరుగుతోంది... మరి ఈ పరాభవమేమిటండీ?'

‘మయసభలో దుర్యోధనుడికి పరాభవం ఎదురైనట్టు అంతలా విలవిలలాడకండి. చెప్తా చెప్తా... విజయ తరువాత వచ్చే పన్నెండవ సంవత్సరం పేరే పరాభవ. 907 వ సంవత్సరం నాటికి ముందు ప్రతి 85 లేదా 86 సంవత్సారాల కొకసారి ఒక బృహస్పతి సంవత్సరాన్ని దేశమంతటా తొలగిస్తూ వచ్చారు. కాని ఆ 907 వ సంవత్సరం లోనే దక్షిణ దేశంలో ఈ ‘తొలగింపు'కి స్వస్తి పలికారు. అప్పటికి పన్నెండేళ్ళ తేడా వచ్చేసింది. మనకి ఇప్పుడు ‘విజయ' అయితే ఉత్తరాదికి త్వరలో వచ్చేది ‘పరాభవ'. చెప్పగలరా? 907 ఏ నామ సంవత్సరమై ఉంటుందో?'

‘బాబోయ్...ఏదో 1953 అంటే సరే అనుకున్నా కానీ మరీ ఇంత వెనక్కా పోవడం?'

‘మన బుర్ర కింద ఓ పీక ఉన్నందుకు మనకి కొంచెం ఓపిక ఉండాలండీ ప్రకాశం గారూ'

‘క్లాస్ పీకేరు... ఆ లెక్కేదో మీరే కట్టండి'

‘సింపుల్. ప్రభవ అనేది అరవై ఏళ్ళ కాల చక్రంలో మొదటిది కాబట్టి ఆ తొలగింపు సంవత్సరాల నిర్ణయం అప్పుడు జరిగిందనే కదా అర్థం. అంచేత 907 నాటి ఉగాది ప్రభవే.'

‘బాపురే రమణీయం... అయినా'

‘డౌటేహం కదూ.. ఒకటి గుర్తుంచుకోండి. 9,8,7 ఇవి తగ్గుతూ వచ్చే వరస అంకెలు కదా. మరచి పోలేం. అలా మరచి పోలేనిది 1987. ఆ సంవత్సరం పేరు ప్రభవ. ఎవర్నైనా అడగండీ.. అరవై సంవత్సరాల పేర్లు అప్పచెప్పండీ అని. చెప్పలేరు. ప్రభవ,విభవ.. అని రెండే చెప్పి ఊరుకుంటారు. అంతగా ప్రభవ మనల్ని ప్రభావితం చేసింది.'

‘దొరికింది క్లూ. 1987 నుంచి 907 తీసేస్తే 1080 వస్తుంది. ఈ 1080ని 60 చేత భాగిస్తే సున్నా సున్నా పోయి 18 వస్తుంది. అంటే 1987 నుంచి పద్దెనిమిది అరవై ఏళ్ళ కాల చక్రాలు తీసేస్తే వచ్చే శేషం 907. కాబట్టి 907 సం. పేరు ప్రభవ. లాజిక్ కాకపోయినా గణితం మ్యాజిక్ కూడా అదే చెబుతోంది. అయినా గోపాలం గారూ... ఒకే దేశంలో పంచాంగం విషయంలో ఇన్ని చీలికలా? ఉత్తరాది వారికి పరాభవ రాబోతోందా? అయితే రాబోయే ఎన్నికల్లో ఉత్తర దక్షిణాల్లో ఎవరికి విజయమో ఎవరికి పరాభవమో కదా?'

‘ఒకరి విజయం, మరొకరికి పరాభవం – దేనికదే చెల్లు..హహహ'

‘ఏమైనా సరే...సంఘం బావుండాలి, మనిషి బాగు పడాలి. మనసులు ప్రశాంతంగా ఉండాలి. ఉగాది అంటే ఉంగా ఉంగా వంటి అంటే ఉంగాది ఏ అరమరికలు లేని పసితనం భాషని కాపాడే యుగానికి ఆది అని అనుకోవడమే మేలు.'

‘అంతేనండి ప్రకాశం గారూ...గురు రాజు కావడం వల్ల ఆధ్యాత్మిక చింతనా, దైవిక భరోసా, సత్ చిత్ ఆలోచనా ఎక్కువ కావొచ్చు. అయ్యయ్యో...దీపాలన్నీ వెలిగించి అగ్గిపెట్టిని మరిచిపోయినట్టు తిథిని మరిచాం. ఉగాదిని మనం చైత్ర శుద్ధ పాడ్యమి అని ఒక తిథి పేరిట పిలవాలి'

చిత్ర నక్షత్రం సమీపంలోకి చంద్రుడుపౌర్ణమి నాడు వస్తాడో ఆ పొర్ణమి ఉన్న మాసాన్ని చైత్ర మాసం అంటారు అని ఇప్పుడే సెలవిప్పించుకున్నాను కదండీ గోపాలం గారూ'.

‘చిత్ర నక్షత్రాన్నే చిత్త అని కూడా అంటారు. ప్రకాశం గారూ...ఉగాది ఏ తేదీన?'

‘అదేమిటండీ...హరికథకులే హరి ఎవడు అని అడిగినట్టుంది.'

‘నా కవి హృదయం ఏమిటంటే ... తిథి నుంచే తేది అనే మాట పుట్టిందని చెప్పడం.'

‘ఈసారి మరీ ఏప్రిల్ పదకొండు తేదికి జరిగిపోయింది ఉగాది'

‘కారణం ..గతేడాది భాద్రపదం అధిక మాసంగా రావడమే. 1953 లో వైశాఖం అధిక మాసమైంది తెలుసాండీ?'

‘సాండీ తుఫానులా అయిపొయింది బుర్ర. అప్పచేప్పెను. మీ ఇష్టం.. తినేయండి'

‘ఊరికే కబుర్లేనా? బూర్లేమన్నా తెచ్చారా?'

‘ఉగాది నాడు ఉగాది పచ్చడి స్పెషలండీ. ఎవరో సిద్ధాంతి మూలుగుతున్నట్టే చెబుతూ ఉగాది పచ్చడిలో కొబ్బరి వెయ్యమన్నారు. వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లం, తేనె, కొంచెం కారం, ఇదీ మా కాంబినేషను. ఇలాగే చెయ్యాలనే లేదు హోల్ నేషను!'

‘నేషన్ అన్నారు కాబట్టి చెప్పాలనిపించింది. చెబుతున్నా. దేశమంతటా ఒకేసారి రెండు పండగలు జరపడానికా అన్నట్టు - మన ఉగాది, మేష సంక్రాంతి ఇంచుమించు దగ్గర దగ్గరగా వచ్చాయి అని గ్రహించారా? ఈ ఏడు ఏప్రిల్ పదమూడు రాత్రి అంటే తెల్లవారితే పధ్నాలుగున...సూర్యుడు మేష రాశి లోకి ప్రవేశిస్తున్నాడు. చైత్ర శుక్ల లేదా శుద్ధ పాడ్యమి నాడు ఉత్తరాదిని నవరాత్రి ప్రారంభం. శ్రీరామ నవమికి నవరాత్రోత్సవం పరిసమాప్తం.'

‘ఇప్పుడు చైత్ర మాసం పాడ్యమి తిథి అనగానే ఉగాది ప్రారంభ నక్షత్రం అశ్విని అవుతుంది కదండీ'

‘భేషుగ్గా అన్నారు. ఇరవై ఏడు నక్షత్రాల్లో సగం అంటే చెరొక వైపు పదమూడు చొప్పున తీసుకుంటే మధ్యలో వచ్చే పధ్నాలుగవ నక్షత్రమే చిత్ర.. పదిహేనవ తిథి అయిన పొర్ణమి నాడు చిత్ర నక్షత్రంలో చంద్రుడుంటాడు. అందుకే అది చైత్ర మాసం. ఇలా మిగతా నక్షత్రాలతోనూ ఇలాగే లెక్కేసుకు పోతుంటే తతిమ్మా నెలలు కూడా తెలుస్తాయి.'

‘మార్గశిరం అంటే ప్రతి మార్గంలోనూ తలెత్తుకు తిరిగేలా ఉండాలి. డబ్బింగ్ కళాకారుల కడుపు కొట్టేలా టీవీల్లో తెగ డబ్బింగ్ సీరియల్స్ వస్తున్నాయని ఈ మధ్య దుమారం చెలరేగింది. విజయ లో ఈ విషయంలో ఎంత విజయం రానుందో?'

‘డబ్బింగ్ అని వినగానే నాకు విశాఖ పట్నంలోని ఒక దుకాణం దగ్గర చదివినది జ్ఞాపకం వచ్చి నవ్వొస్తోంది.'

‘అదేమిటో చెబుదురూ... మీ నవ్వుని డబ్ చేసి నేనూ నవ్వుతా'

‘ఇచ్చట రుబ్బింగ్ చేయబడును (రుబ్బబడును అనే క్రియకొచ్చిన పాట్లు)...అని షాపు ముందు బోర్డు ఉంది. అదీ జోకు. డబ్బింగ్.. అనగానే మళ్ళీ 1953 లోకి వెళ్ళిపోవడమే మేలు. ఆ ఏడు మరో విశేషం జరిగింది. హిందీ సినీ మహారాజు రాజ్ కపూర్ 'ఆహ్ ' అనే సినిమాని తెలుగులోకి 'ప్రేమలేఖలు 'గా డబ్ చేసి పాటలన్నిటికి అవే హిందీ వరసలిచ్చి మళ్ళీ రికార్డింగ్ జరిపించి విడుదల చేయించింది ఈ ఏడాదే.'

పాడు జీవితమూ యవ్వనం మూడు నాళ్ళా ముచ్చటలోయి.. ఆ పాట డబ్భైల కాలంలో సిలోన్ రేడియో అదే ఆ తర్వాత రేడియో శ్రీలంక గా మారిందే.. అక్కడినుంచి సాయంత్రాలు ఇంచుమించు రోజూ వినిపిస్తూ ఉండేది. అన్నేళ్ల పాత పాటలే అప్పట్లో కొత్తగా వినపడేవి.'

‘అప్పుడు విన్నవి ఈ రోజే వింటున్నట్టు ఉండాలి. ఆ పాత బంగారం తళుకుల శబ్దాలు వినిపించరూ'

ఏకాంతము సాయంత్రము.. '

‘ఇంకా మీ దగ్గరుంది మేలైన గ్రామఫోన్ యంత్రము!'

‘బ్రతుకు తెరువు కోసం పొరుగు ఊళ్లు, పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలు వెళ్ళిపోవాల్సి వచ్చినా మనం మన పద్ధతులు మరచి పోకూడదు. మన ఇష్టాల్ని బలవంతంగా చంపేసుకోకూడదు. ముఖ్యంగా మన తెలుగుని పాతి పెట్టేయకూడదు. గుర్తొచ్చింది. బ్రతుకుతెరువు .సినిమా కూడా 1953లో వచ్చినదే. ఇదే తరువాత జీనేకి రాహ్ అనే హిందీ సినిమాకి మూలం అయ్యింది. చిత్రం ఏమిటంటే ఆ హిందీ చిత్రం నుంచి భార్యాబిడ్డలు అనే తెలుగు సినిమా తయారైంది.'

అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని ఆనాటి కవి అంటే తరువాతి తరం కవి అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి పాడుతుంది చినదానా అని అన్నాడు'

‘తీగలా మీరు దొరికారు. కబుర్లు పందిరి వేశాయి. మళ్ళీ కలుద్దాం'

‘ఎలా కలిసేదండీ.. తీగ లాగితే డొంకంతా కదులుతుంటే...'

‘హ హహ హ్హా ... అదేదో హిందీ పోటీ చానెల్లో ఆ చాన తెచ్చిపెట్టుకునీ నవ్వినట్టు'

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 13 ఏప్రిల్ 2013