తల్లీ నిన్ను దలంచి, నీ ముందు తల వంచి ‘ఈ-పుస్తకం' చేత బూనితిని...
18 ఫిబ్రవరి, 2013


‘కృ ష్ణప్రేమ' రూపం మారింది కదూ... చిన్నప్పుడు పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు వేసుకుంటూ ఎంత మురిసిపోయే వారమో కదా.. అలాంటిది ‘కృష్ణప్రేమ' కి కూడా పుట్టిన రోజు వస్తే కొత్త ముస్తాబు తొడగడం సమంజసమే. ఇప్పుడు ముచ్చటైన మూడో యేట ప్రవేశించింది.
ఏ(విటీ... అప్పుడే రెండేళ్ళు అలా అలా అవలీలగా దొర్లిపోయాయా? ఏళ్ళతో బాటు కబుర్లూ అంతే వేగంగా దొర్లిపోయాయి. ఈ కబుర్లెలాంటివంటే... గాంధి హృదయం నుంచి ఘంటసాల గుండె వరకు, మెహదీ మాధుర్యం నుంచి మహమ్మద్ రఫీ ఔదార్యం వరకు, నండూరి కలం నుంచి నటరాజ కాలి గజ్జెల వరకు, కృష్ణశాస్త్రి మాట నుంచి కోదండపాణి పాట వరకు, వీటూరిజం నుంచి వేటూరిజం వరకు, ఖలే సంగీతం నుంచి ఖన్నా నటన వరకు, జగ్జీత్ ఘజల్ ఫ్లో నుంచి జపాన్ సునామీ వరకు, సుసర్ల వారి గానం నుంచి అవసరాల వారి అవయవ దానం వరకు, మల్లాది మరుమల్లెల నుంచి మల్లెమాల విరిజల్లుల వరకు, రామారావు లోని ఎన్టీఆర్ అనే అక్షర విన్యాసం నుంచి రమణ లోని చెమక్కు అనే అణ్వాస్త్రం వరకు, దాశరధి శతకం నుంచి దేవానంద్ వాచకం వరకు... ఒకటీ రెండూ కాదు ..మూడు వందల అరవై అయిదు + మూడు వందల అరవై ఆరు ..అంటే ...ఏడువందల ముప్ఫై ఒక్క రోజులకి ..కాదు కాదు మూడువందల యాభై నాలుగు + మూడు వందల ఎనభై నాలుగు (అధికమాసం వల్ల) ఈక్వల్టూ ఏడువందల నలభై ఎనిమిది తిథుల వరకు ...ఇంత సుదీర్ఘకాలం ఇంట కూర్చొనీ ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి చేర్చిన కబుర్లు.
అటువంటి కబుర్లన్నీ కథలుగా కంచికి పోనివ్వకుండా ఓ కంట కనిపెట్టమని తొలిసారిగా సరస్వతీ మాతని అర్ధిస్తే తెల్లగా వెన్నెలలా నవ్వేసింది ఆ మహాశ్వేత! అందుక్కారణం - మాఘ శుక్ల పంచమి/ వసంత పంచమి/ శ్రీ పంచమి నాడే ‘కృష్ణప్రేమ' కి అక్షరాభ్యాసం జరగడం! ఇక అక్కణ్నుంచి ఇక్కడి అక్షరాలు ఇక్కడి నుంచి ఆకాశ వీధిలో ఊరేగి ఎక్కడెక్కడికో చేరి సాహిత్య సంగీతాభిమానుల మనోరథం మీద వాలాయి. ఎవరెన్ని రాసినా, అందులోనే పాత వస్తువుని కొత్తగా మార్చినా, ఎవరెంత కూని రాగం తీసినా, తెలిసినంత సంగీతం కూర్చినా అన్నిటి వెనక ఉండేవి ఆ సప్త స్వరాలే, అవి ఆ దేవి వర ప్రసాదాలే. కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, కనులు చదివినా పాటే ---అన్నవి అలా పుట్టుకొచ్చినవే. చదువరుల కళ్ళు శ్రమ పడుతూనే ‘ఈ అక్షర' పరిశ్రమని అర్ధం చేసుకున్నాయి.
‘కృష్ణప్రేమ' ముందూ వెనకా ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు లేవు, ఉన్నవల్లా...ఆవేశం అగ్ని పర్వతంలా అప్పుడప్పుడూ ‘ఎగిసి' పడితే వచ్చిన మాటల లావా, అంతలోనే మనసు చల్ల బరిచే పాటలు గుర్తు చేయిస్తూ ఆ దేవీ ... అంతే.
ఎప్పుడో ఎక్కడో చూసిన పుస్తకాలలోని పుటలు అచ్చం అలాగే గగన మార్గం నుంచి వచ్చి ఒళ్ళో వాలుతుంటే పులకించిన వారెందరో ఉన్నారు. అలా ఒకనాడు అచ్చు వేయించిన ఎందరో మహానుభావులకి తిరిగి కృతజ్ఞతాభివందనాలు సమర్పించడం మా కర్తవ్యం.
చిన్ననాటి ఓనమాల దశ నుంచి ఓ బడిలో చదవాలి అనే దశకి వచ్చినప్పుడు మా తొలి గురువు పేరు సరస్వతమ్మ. ఆమెకి బ్రహ్మ చెముడు. ఆమె ఏదైనా ‘గట్టిగా' అరచినట్టు అడిగేవారు. భయంతో పిల్లలు మెల్లగా గొణిగేవారు. అది ఆమెకి కొంచెం ఇబ్బంది పెట్టేది. అంచేత ఆమె ఓ అద్భుతమైన జ్ఞాన దీపం వెలిగించింది. అదేమిటంటే- చిన్న చిన్న నోటు బుక్కులు పిల్లలకిచ్చి అప్పటికప్పుడు ఆమె కొన్ని లెక్కలు కూడికలో, గుణకాలో, భాజికాలో ఏదో ఒకటి ఠపీ మని అడిగేవారు. వాటికి తాపీగా జవాబులు ఇవ్వడం ధర్మం కాదు, అలాగని ఆదుర్దా పడితే తప్పులు దొరల వచ్చు కదా ...ఈ దశలో కొందరికి పోసిన ముచ్చెమట్లు అవీ తలచుకుంటే ఎన్నెన్ని ముచ్చటలూ?. ఆ నోటు పుస్తకాలు టేబిల్ మీద బోర్లిస్తే ఆమె ఓ అయిదు నిమిషాల్లో దిద్ది అరవాల్సిన వారి మీద అరిచేసే వారు. జిజ్ఞాసని సానబెట్టటం అంటే ఇదే. రేపు పరీక్షల్లో తప్పులు రాసి తెల్లబోవడం అనేది లేకుండా చేసే బాల శిక్ష ఇదే. అంతేగాని . ఊరికే పెదబాలశిక్ష బట్టీ పట్టేయడం కాదు.
ఒకప్పుడు ‘తు చ' తప్పక పఠించే వారట. అంటే – తాళ ప్రతులలో ఎక్కడైనా ఒక మాటలో పొరపాటున తప్పు దొర్లిందని అనిపిస్తే దాని మీద ఒక గీత గీసేవారట. అంటే ఆ మాటని కొట్టి పారేయడమన్నమాట. మరోసారి చదివాక అరరే తప్పు కాదు అని అనిపించినప్పుడు ఆ మాట కింద ‘తు చ' అని రాసేవారట. అంటే – ‘తుడిచినది చదువుము'అని అర్ధం. టైపు నేర్చే వాళ్ళు ‘స్టెట్' అనే మాట వినే ఉంటారు. అదే ఇది. ఇప్పటి సరస్వతీ కటాక్షం ఎంత గొప్పదంటే...మనం నడిపే పత్రికలోని మన అంశాల్లోనే తప్పు దొర్లితే సరి దిద్దడానికి, లేదా తప్పిపోయిన అంశం తిరిగి చేర్చడానికి ఎంతో వీలుంది. అలాంటి వీలు కల్పించుకుంది ‘ఈ' కృష్ణప్రేమ కూడా.
ఈసారి ..సారీ ..ఆలస్యమే అయినా కొన్ని అమృత గుళికలు శ్లోకాలు, పద్యాలు, పాటల రూపంలో స్వీకరిస్తే తప్పు లేదేమో...పి.బి.శ్రీని'వాయిస్' లో ‘ యా కుందేందు తుషార హార ధవళా' శ్లోకం వింటుంటే తాను సమర్పించిన ‘సప్త స్వరాలు ' స్వీకరించి తెల్లగా తేట తెల్లమైనట్లు ఉండే గాన మార్గంలో సరిగ పదమని ఆ దేవి ఆదేశిస్తున్నట్టే అనిపిస్తుంది.
ఇక కవి కలం, శిల్పి ఉలి, చిత్రకారుడి కుంచె, గాయకుల తంబురా, నాట్య రమణుల పద యుగం ...ఇవన్నీ ఆ దేవి కల్పించిన ఉపకరణాలే. ‘కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ఈ మూటికీ ముమ్మాటికీ సాటే లేదోయ్ ...అని ఒకనాడెప్పుడో ‘టింగు రంగా ' మని తిరిగిన వేళలో విన్న పాట మరోసారి వింటే కొత్త చైతన్యం రావొచ్చు.
గానమా , నాట్యమా? ఏది కళలందు కడు మిన్న? అనేది అనవసరమైన వాదనే అయినా ఎవరికి వారే వారి వారి ‘ఇగో' ఫిరంగి నుంచి మాటల తూటాలు విసురుకోవడం మామూలే. అటువంటిదో పాట మూల పడిపోతుంటే మోసుకొచ్చి మళ్ళీ వినడం ఆనంద దాయకమే.
నాట్యంలో మళ్ళీ జావళీల తీరే వేరు. అందులో ‘గానం'ది కూడా పై చేయే. ‘ఎప్పటివలె కాదురా ' ఓయ్ తెలుగు శ్రోతా, నా గళం తీరే వేరు అన్నట్టుండే వాణీ జయరాం (తమిళం మాతృభాష) తన తొలి తెలుగు పాట ఎంత చక్కగా పాడారో ‘అభిమానవంతులు ' అయిన శ్రోతలందరికీ తెలుసు. అయినా మరోసారి మెచ్చుకుంటే పోదూ ఆ జావళీ సొగసు! సరస్వతీదేవికి మరో పేరే కదూ ‘వాణి' అంటే.. అదన్నమాట సంగతి...అందుకే స్వర కర్త పాణి ఈ వాణిని అంత చప్పున గుర్తించ గలిగింది!
మల్లాది వారు మన మది ని శారదా దేవి మందిరంగా మార్చుకోవాలని ‘జయభేరి' మ్రోగించి మరీ చెప్పారు. ఆయన చెప్పిన విజయ రహస్యం ఏమిటంటే – మరి మందిరమన్నాక పూజలుండాలి కాబట్టి ఆమె కోరే పూజ మనం చేసే నాద సాధనమే అని తెలుసుకోవాలి, నాద సాధనం అంటే కేవలం రాగం తీస్తే చాలదు, భావం కూడా ఉండేలా గమకాలు అమరాలి. ఇంక ఆమెకి అర్పించుకునే హారాలో? వాటిలో ఏం ఉండాలీ అంటే ‘తరళ తానములే' అట. తానము అంటే ---మాటలు కూర్చక ముందు తనననా అని అంటామే అదన్నమాట. తరళము – అంటే చలించేది అనే అర్థంలోనూ, ప్రకాశించేది అనే అర్థం లోనూ తీసుకోవచ్చును. ఇదీ పూజ, ఇదీ హారం ఆ వరదాయినికి అని గుర్తించే వారి మది శారదా దేవి మందిరం కాకపోతుందా చెప్పండీ.. అందుకే కవులు కచ్చితంగా సరస్వతీ పుత్రులు. వారికి సమ ఉజ్జీలుగా గాయనీ గాయకులు నిలబడాలంటే వారి గళంలో ‘భావం' కోల్పోకుండా జాగర్త పడాలి. ఒకరు రాగం, ఒకరు భావం, ఒకరు తానం అన్నట్టు ముగ్గురు గాయకులు తమ గళాలతో ఈ కవి కల్పిత భావానికి, ఆ స్వరకర్త బాణీకి ఎంత చక్కగా వన్నె కూర్చారో మరోసారి పాట వింటే తెలియకపోతుందా?
మరో సందర్భంలో ‘నాదమే వేదసారం ' అని ఘంటాపథంగా చెప్పేందుకు ఘంటసాల వారు ఆలాపన,రాగం,భావం-అనే మూడింటి సాయం తీసుకున్నారు.
కళావతి అనేది శారదాంబకి ఉన్న మరో పేరని అనుకుంటే ఆ పేరిట ఓ అద్భుత రాగం కూడా ఉంది అని గుర్తొస్తుంది. దీన్నే కాబోలు వలజి రాగం అని అంటారు. ఇంక మన చేతిలో ఆమెకి అతి ప్రియమైన వీణ గనుక ఉంటే ... ఆ కళావతి తన గళం మన గళంగా చేసి ‘మనసే మధుగీతమై ' ఒకసారి ‘శివమనోరంజనీ' భరితమై మరోసారి మంగళ మయంగా పలికించక మానదు.
వీణ పాట అనగానే ఒక మహానటి గుర్తు రాక మానదు. ఆమె పేరు కూడా సరస్వతీ నామధేయమే. అవును మీరు ఊహిస్తున్నది నిజం - శారద ...ఆ నటి పేరు. ‘తను వీణ వాయిస్తూ ‘పాడవేల రాధికా ' అని మరొకరి చేత పాడించినపుడు ‘ఇద్దరు మిత్రులు - అంటే ఇలా ఉండాలి' అని మెచ్చుకున్నాం. అప్పటికింకా తెలియనే తెలియదు ఎవ్వరికీ.. ఈ ‘అమాయకురాలు ' ముందు ముందు వీణ వాయిస్తూ ‘పాడెద నీ నామమే గోపాలా ' అని తానూ పాడుతుందని. ఇక ముచ్చటగా మూడవ సారి ‘ఈ వీణ పైన పలికిన రాగం.. నాలోన విరిసిన అనురాగం ' అని వీణ పాట పాడినప్పుడు అందులో ప్రేమని కోరే ‘అభిమానవంతులు 'ఎలా ఉండాలో తెలుసుకునీ ..అబ్బో ‘చక్కని చుక్కా సరసకు రావే''డివ్వీ డివ్వీ డివ్విట్టం' వంటి హాస్య గీతాల శారద ఎంత ఉన్నతంగా ఎదిగిపోయిందీ అని అనుకున్నామా లేదా?
కళామతల్లి తీరే అంత...కళని నమ్ముకుంటే, కళ్ళలో వత్తులు వేసుకునీ మరీ ప్రతిభకి తగ్గ అదృష్టం కోసం వేచి చూస్తే ఎప్పటికైనా జీవితాన్ని కాంతి మయం చేసి తీరుతుంది.
‘తల్లీ నిన్ను దలంచి పుస్తకంబు చేతన్ బూనితిని..'...కాదు కాదు.. ‘కృష్ణప్రేమ- ‘ఈ' పుస్తకం' చేత బూనితిని. తల్లీ..నువ్వంటే మాకు భక్తి. చేతన్,చేన్,తోడన్,తోన్...తృతియా విభక్తి. ముచ్చటగా మూడో యేటికి ఎదురీదుతూ వచ్చాం. నది రూపంలో నువ్వు మాయమై పోయావో, అంతర్వాహినివై పోయాయో తెలియదు కానీ ..మా నరనరాల్లో అక్షరాల నదీ ప్రవాహం కలకాలం సాగేలా ఆశీర్వదించు తల్లీ ...
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 18 ఫిబ్రవరి 2013