Krishnaprema Logo

కృష్ణప్రేమ

ఈల పాటల మధ్య కా'సిన్ని మా ' గోలలు ---

25 నవంబర్, 2011

ఈల పాటల మధ్య కా'సిన్ని మా ' గోలలు ---

Picture

న్నట్టే నాలుగు రోజులు గడిచాయి కనక మళ్ళీ మరిన్ని 'ఈల'పాటలు- పూర్తిగా తెలుగువే- వినిపించాలని, ఈలల మధ్య
కా' సిన్ని మా' కబుర్లు కూడా చేర్చాలని ఇవాల్టి ప్రయత్నం.

అలనాటి హీరో దేవానంద్ ఇప్పటి వయసు ఎనభై అయినా సినిమాలు (ఎవరు చూసినా చూడకపోయినా సరే ) తీసి 'పారేయడమే' ధ్యేయం గా పెట్టుకోవడం ఆశ్చర్యమే మరి. అదే ఎనభై వయసులో ఉన్న దర్శకుడుబాపు ఇన్నాళ్ళు ఆగి 'లవకుశ' ని తిరగ రాసి రమణ సాయం లేకుండానే 'శ్రీరామరాజ్యం' చిత్రకళా ఖండం చూపించి 'హిట్ ' లర్ అయి అందరి చేతా శాంతంగా బాల నయన తార క మంత్రం జపించేలా చేశారు. అయితే ఇదివరకే ఆయన లవకుశ సాంఘిక ప్రతిని ముత్యాల ముగ్గు గా తీర్చి దిద్దిన సంగతి మనకి తెలిసినదే. అహోబాపూ , ఈ లీల మీ పునర్దర్శనం కావడం మా చేత ఈల వేయిస్తోంది. దేవానంద్ తోనూ,బాపు-రమణ ల తోనూ ఇప్పుడు కొంచెం పనుంది.

ఇప్పటికీ దేవానంద్ అందరికి గుర్తున్నా ఇంచుమించు ఆయన లాగ కనిపించే నటుడు రామ్మోహన్(కనుకనేఆంధ్రా దేవానంద్ అనేవారు) ని మాత్రం చాలామంది మరిచిపోయే ఉంటారు. నట శేఖర కృష్ణ తో తెలుగు తెరంగేట్రం చేసిన రామ్మోహన్( తేనెమనసులు ) కి తొలి తెలుగు రంగుల సాంఘిక చిత్రమే తొలి చిత్రం కావడంఆదుర్తి సుబ్బారావు కల్పించిన అదృష్టం. అయితే అందులో దాశరథి వారి దివినుండి భువికి దిగివచ్చే పారిజాతంపాట సముద్రపొడ్డున చిత్రీకరించడం వల్ల రామ్మోహన్ వేషధారణ కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పైగా ఆదుర్తి వారి పాటల్లో పాత్రలు ఊరికే గడ్డివాము మీద దేకుతుంటాయి ( తేనెమనసులు లో ఈ పాట లాగే బుద్ధిమంతుడు ,పూల రంగడు పాటలు ఉదాహరణలు). రామ్మోహన్ కి వెంట వెంటనే ఆదుర్తి వారి దర్శకత్వంలోనే మరో మనసులు చిత్రం- కన్నె మనసులు - దక్కింది. రమణ గారి బుడుగు చెప్పే ప్రైవేట్ మాస్టారి గురించి బహుశాఆదుర్తి వారు విన్నారేమో ఆయనరామ్మోహన్ తోనే ప్రైవేట్ మాస్టర్ సినిమా తీశారు.


నిర్మాత బి.ఎన్.రెడ్డి గారు రంగుల రాట్నం తీసి మరో మోహన్ -చంద్రమోహన్ ని పరిచయం చేశారు. అందులో అన్నయ్య గారామ్మోహన్ వేశారు. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ నివాసం చిత్రంలో రామ్మోహన్ ,కృష్ణ ఉభయులూ ఉన్నారు. అక్కడి నుంచే రామ్మోహన్ కి నెగటివ్ పాత్రలు దక్కుతూ వచ్చాయి.రాను రానూ వేషాలూ తగ్గేయి. కృష్ణ స్వంత చిత్రాల్లో రామ్మోహన్ కనపడే వారు. పండంటి కాపురం లో కనిపించినా మళ్ళీ నెగటివ్ పాత్రే. రామ్మోహన్ ఈల పాట ఒకటి లక్ష్మీ నివాసం లో ఉంది. 'నవ్వు నవ్వించు' అని పాటంతా భారతి పాడితే రామ్మోహన్ ఈల వేస్తుంటారు. వీడియో దొరికితే బావుండేది. రామ్మోహన్ దేవానంద్ తో 'మీ ఈల వేసెద దేవా ' అని అనే ఉంటారు. కనులు మూసినా పాటే లో ఆడియో మీ చేత ఈల వేయిస్తుంది.

ఇక సక్స స్ ఫుల్ హీరో కృష్ణ గారి ఈల పాటలు రెండు మూడు చిత్రాల్లో ఉన్నట్టు గుర్తు. గూఢచారి 116 లో 'డీరి డిరి డిరి - డీరిడి ' వంటి హుషారైన పాటలో ఈలలుంటాయి. అలాగే స్వయంగా ఈల వేసే సంగీత దర్శకుడుజి.కే.వెంకటేష్ 'శ్రీవారు మావారు ' లో కృష్ణ పాట 'పూలు గుసగుస లాడేనని' కి ఈలలు వేశారు. పైగా డా.సి.నా.రె 'గాలి ఈలలు వేసేనని' రాయడం వల్ల ఈల కి ఈలాగ ప్రోత్సాహం లభించింది. ఈ రెండు పాటల వీడియోలు కనులు చూసినా పాటే లో చూసి కృష్ణ గారికి ఘంటసాల , బాలు పాడిన 'ఈ ల' వ్వు సాంగులే బంగారు అనుకోండి.

హీరో ఒక్కడే ఉంటే ప్రకృతి వైపు చూస్తూ రోడ్ల మీదో తోటలలోనో స్టెప్పులు వేస్తూ పాడడం ఆనవాయితీగా ఉండేది ఆ రోజుల్లో. దేవానంద్ హిందీలో 'హం దోనో' చిత్రం తీసి ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా ఈ మధ్య కాలం లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో రంగుల్లోకి మారింది. అదే చిత్రం ఆ రోజుల్లో తెలుగులోఏ ఎన్ ఆర్ హీరోగా**'సిపాయి చిన్నయ్య'** గా అక్కడక్కడా రంగు వేసుకుని వచ్చింది. అందులో ఆరుద్ర విరచితం 'నా జన్మ భూమి ఎంత అందమైన దేశము' పాట ఉంది. ఆ పాటలో ఈలలున్నాయి. అసలే స్పీడ్ గా ఉండే ఎం .ఎస్. విశ్వనాథన్ హార్మోనియం ఆర్మీ మయం చేసి ఎవరి చేతనో ( బహుశా జి.కె. వెంకటేష్ కాబోలు) గట్టిగానే విజిల్స్ వేయించారు. వీడియో లభ్యమే అయినా ఆడియో వినడమే బావుంటుందని కనులు మూసినా పాటే చెబుతోంది.

బాపు గారిని గుర్తుచేసుకున్నాం కనుక ఆయన తీసిన ఈలపాట దృశ్యాలు కూడా గుర్తుకు రావాల్సిందే.బుద్ధిమంతుడు లో 'హవ్వారే హవా హైలేసో - సో సో సో ' పాట 'సో సో' అని అనిపించనిది. అందులో ఆరుద్ర విశాఖ జన పదం 'గుంట' (అమ్మాయి) ని తొలిసారిగా ప్రవేశపెట్టడం వల్ల ఆ మాట తెలియని వారికి అది కొత్తగా , గమ్మత్తుగా విన్పించింది. తెలిసిన వారి చేతఏ.ఎన్.ఆర్ లాగ ఈల వేయించింది. ఉభయ వర్గాల వారి కోసం ఆ పాట వీడియో కనులు చూసినా పాట లో సిద్ధం.

ఇక్కడో విశేషమేమిటంటే- కొన్నేళ్ళ క్రితం మూగ మనసులు సినిమాకిరమణ.ఆత్రేయ మాటలు రాశారు. ఆరుద్ర పాటలు రాయలేదు. అందులో ఏ ఎన్ ఆర్ 'గోపి ' గా ఉన్న జన్మలో పడవ నడిపేరు. అక్కడ 'గోదారీ గట్టుంది ' పాట పాడే జమున అతన్ని అస్తమానూ ఆట పట్టిస్తుంటుంది. పాటలో కయ్యి మనే ఈల ఉంది. కనులు చూసినా పాటే - లో ఆ పాట చూసే వీలుంది. ఆ ముచ్చట మళ్ళీ తీర్చుకోవడానికిబాపు రమణ లు బుద్ధిమంతుడు తీసి ఒక పడవ నడిపే వాడిగా మళ్ళీ ఏ ఎన్ ఆర్ ని మారు వేషంలో చూపిస్తూ 'హవ్వారే హవ్వ ' పాట పెట్టారు.ఆ సినిమాలో ఒక నాగేశ్వరుడి కి శోభన్ కృష్ణుడిగా కనిపిస్తారు. మీకు తెలుసునో లేదో, బాపు 'ఇంటి గౌరవం ' అనే సినిమాకి దర్శకులు. శోభన్ , (కన్నడ నటి) ఆరతి అందులో హీరో హీరోయిన్లు. అందులో ఆరతి శోభన్ ని ఆట పట్టిస్తూ 'హవ్వ హవ్వ సిరిసిరిమువ్వా నువ్వా నువ్వా అని పాడుతుంది. ఆ పాట కవి ఆరుద్రే. ఒక తీగ లాగితే ఇంత డొంక కదలటం చూశారా?

ఇక ఖంగు మని పలికే కొంగర జగ్గయ్య 'ఉయ్యాల జంపాల ' చిత్రంలో కొండగాలి తిరిగిన ప్రభావంతో 'ఓ పోయే పోయే చినదానా' అంటూ కవిత రాసుకుంటూ ఈల వేస్తే ఎవ్వరు కూడా 'అయ్యా, జగ్గయ్యా , కొంచెం తగ్గయ్యా' అని ఎవరూ అనలేదంటే పెండ్యాల వారి స్వర మహత్మ్యమే మరి. జగ్గయ్య వాక్పటిమ తెలిసి ఘంటసాల ఇచ్చిన మాడ్యులేషన్ వహ్వా, భళి భళి! కనులు చూసినా పాటే - లో వీడియో చిక్కిపోయినట్టు ఉంటుందేమో. యూ ట్యూబ్ చేతికి చిక్కింది అంతే!

ఆంధ్రా దేవానంద్ లాగే ఆంధ్రా దిలీప్ అని ఒకరికి బిరుదుంది. నటుడు చలం ఆ పేరు పొందాడు. ఈయన కామెడీ చేసినప్పుడు పాట ఉంటే ఆ పాటని పిఠాపురం నాగేశ్వరరావు పాడేవారు. అదే కొంచెం కామెడీ, సీరియెస్ నెస్సూ ఉండే పాత్ర అయితే పి .బి.శ్రీనివాస్ పాడేవారు. చలం హీరో అయిపోయాక ఆయనకి ఎస్.పి బాలు పాడారు. చలం 'సంబరాల రాంబాబు ' సినిమా తీసినప్పుడు బాలు పాడుతున్న 'మామా చందమామా వినరావా నా కథ' పాట విని అదే ట్యూన్ లో తానూ పాడాలని సుశీలమ్మ పట్టుబట్టారు. ఈ అనుకోని పరిణామం వల్ల సినిమాలో బాలు సోలో 'కాసుకు లోకం దాసోహం', పి.బి.శ్రీనివాస్, సుశీల యుగళ గీతం 'కన్నులే నవ్వేయి' పాటలు రెండూ సినిమా నుంచి హుష్ కాకి అయిపోయాయి. చలం నటించిన 'మంచికుటుంబం ' లోనెరా నెరా బండి--లేడీ బైస్కిల్ బండి బోల్తా కొట్టినప్పుడు ఒక ఈల పాట వచ్చింది. పాటంతా పిఠాపురం హుషారుగా పాడారు. ఆ పాట ఆడియో వే కనులు మూసినా పాటే ప్రసాదించే పరమ భాగ్యం.

చలం లాగే హాస్య నటుడూ, నిర్మాత అయిన పద్మనాభం చలం సినిమా 'సంబరాల రాంబాబు ' లో గుమాస్తా గా నటించి గీతాంజలి తో పాడిన 'పొరిగింటి మీనాక్షమ్మను చూసారా' లో పురుష కంఠం పిఠాపురం వారిదే. రాజశ్రీ పాటలకి పేరు తెచ్చిన సినిమా అది. సంగీత దర్శకుడు వి.కుమార్ అడ్రస్ తెలియజేసిన చిత్రం అది. ఆ రోజుల్లో ఈ పాటలకి అవార్డ్ రాకపోవడం ఏమిటో?

రాజశ్రీ , పి .బి.శ్రీనివాస్ , ఎం.ఎస్.శ్రీ రాం ల కాంబినేషన్ లో వచ్చిన 'పెళ్లిరోజు ' సినిమా పాటలూ అంతే హిట్. ఇందులో హరనాథ్ , జమున లు పాడే ఓ పాట 'అడుగుదామని ఉంది నిన్నొక మాట'! ఇది కూడా ఈల తోనే ప్రారంభం. కనులు మూసినా పాటే - విన్పించేది ఆ పాటే ( గమనించండి- ఇది అరుదైన పాట. ఎక్కడా అంత సుళువుగా దొరకదు).

శ్రీ రాం, శ్రీనివాస్ కి స్నేహితులు. రాజశ్రీ 'రాధ హృదయం మాధవ నిలయం' అని ఓ లలిత గీతం రాస్తే ఎస్.జానకి చేత శ్రీరాం అద్భుతంగా పాడించేరు. అది ఆ రోజుల్లో రికార్డ్ గా వచ్చింది. చలం 'తులాభారం ' సినిమా తీసి ఇదే పాటని రాజశ్రీ చేత తిరగ రాయించి 'రాధకు నీవేర ప్రాణం' అని సంగీత దర్శకుడు సత్యం చేత స్వరాల ఊపిరి పోయించారు. ఈ తులాభారం సినిమా తలభారం అనే మాట పడినా ఇది మళయాళ తులాభారం కి అనుసరణ కాదు. మళయాళ తులాభారం లో నటించిన శారద కి ఊర్వశి అవార్డ్ దక్కింది. చలం ,శారద నిజ జీవితంలో పెళ్ళాడేరు. మళయాళ తులాభారం 'మనుషులు మారాలి ' గా తెలుగులో మారింది. అందులో శోభన్ హీరో. సగం సినిమా కి ముందే ఆ పాత్ర మాయం. అలాంటి ధోరణి ఇప్పుడుంటే సినిమా మాయమవ్వడం ఖాయం.

శోభన్ 'ఏ షామ్ మస్ తానీ'వరసలో ఈల వేస్తూ ఇంగ్లీషు పిలుపులతో పాట పాడి 'కిలాడీ బుల్లోడు ' అనిపించుకున్నారు. కనులు చూసినా పాటే - మనం మరచిపోయిన చంద్రకళ అనే నటిని కళ్ళ ముందు ఉంచుతోంది.

బాల నటిగా శ్రీదేవి నటించిన 'శ్రీమంతుడు ' సినిమా హీరో ఏ.ఎన్.ఆర్., హీరోయిన్ 'బులి బులి ఎర్రని బుగ్గల' జమున. 'నేనే ఆ నేనే ఈ నేను' అనే ధోరణిలో హీరో కరువు తీరా ఎంత ఏకరువు పెట్టినా హీరోయిన్ వినదే! అందుకే 'చెడ్డవాడిగా తిరిగానే' అని చెబుతూ 'ఈల' వేశాడు అతను. 'నీ చెంప దెబ్బలే తిన్నానే' అని కూడా మొహమాట పడక, మళ్ళీ మాట పడక చెప్పుకొచ్చాడు. కనులు చూసినా పాటే - ఉంటే ఈ కబుర్లు ఎందుకు ? (ఇది ఇవాళ రాస్తుంటే ఈ రోజు డిల్లీ లో ఒక మంత్రివర్యులకి జరిగిన పరాభవం గురించి తెలిసింది. సభ్యత మరచి చేయి చేసుకోవడం పౌర హక్కు అనుకుంటే చిక్కే).

ఇదే శ్రీదేవి కొన్నేళ్ళ తరువాత ఏ.ఎన్.ఆర్ సరసన హీరోయిన్ అయి జనాల 'ప్రేమాభిషేకం ' అందుకుంది.

మహానటి సావిత్రి లేదు కానీ ఆమె చక్కని నటనే మనకు 'చివరకు మిగిలే ది' అని 1960 ల్లోనే మనకి తెలిసింది. కనపడక ఈల వేసి కనిపించి పాట పాడిన అప్పటి కాంతారావు కూడా ఇప్పుడు కనపడని లోకాలలో ఉన్నారు.మల్లాది వారి 'సుధ వోల్ సుహాసిని' పాట తెలుగు వారి అశ్వత్థామ లో మదన మోహన్ పోకడలు చూపించింది.కనులు చూసినా పాటే లో తొలి బోణీ ఈ పాటే.

సావిత్రి కోపగించుకుంటే 'నిర్దోషి ' అయిన ఎన్ టీ ఆర్ మౌనంగా ఉన్న మల్లెలలతో తన కథ చెప్పలేదూ? అంతకు ముందు మనసులు హాయిగా ఉన్నప్పుడు 'ఈ పాట నీ కోసమే' అని ఒకరికొకరు అనుకోవడం నిజమే, అది సహజమే అని సినిమా చెప్పింది. కనులు మూసినా పాటే లో ఈ పాట మీ కోసమే!

అలాగే 'తరంతరం నిరంతరం' ఈల వేస్తూ ప్రయాణిస్తే దూరభారమే తెలియదు. కనులు మూసినా పాటే - ఆ దారిని కళ్ళకు కట్టి చూపిస్తుంది.

ఇన్ని ఈల పాటలు విన్నాక తృప్తిగా భోంచేసినట్టు ఉంటే 'ఆకులు పోకలు ఇవ్వొద్దు- నా నోరు ఎర్రగ చెయ్యొద్దు' అని ఎలా అనగలుగుతారు? కనులు మూసినా పాటే - లో అది కూడా కళ్ళు మూసుకుంటూ విని హాయిగా నిద్రపొండి. ఇంకొకరికి మీ 'గురక' 'గోల' గా అనిపిస్తే అది విధి లీల. 'ఈల' గా వినిపిస్తే అది దేవుని లీల.

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 25 నవంబర్ 2011