Krishnaprema Logo

కృష్ణప్రేమ

అక్షరాల గవాక్షాల నుంచి ‘ఎగిసి' వచ్చిన వెలుగు రేఖ - సి నా Ray (సి.నా. రె పుట్టిన రోజు- పండగే అందరికి)

29 జులై, 2011

అక్షరాల గవాక్షాల నుంచి ‘ఎగిసి' వచ్చిన వెలుగు రేఖ - సి నా Ray  (సి.నా. రె పుట్టిన రోజు- పండగే అందరికి)

Picture

సిసలైన నానుడి రెట్టించి పలికిన వారికి శుభాకాంక్షలు

డాక్టర్ సింగిరెడ్డి****నారాయణ రెడ్డి – ఎంత పెద్ద పేరో అంత మహోన్నతమైన మనసు! అందరికీ ఆత్మీయులు. ఎందరికో ఆచార్యులు. చిన్నా పెద్దా అందరికోసం సి.నా.రె గా కుదించుకుపోయిన కవి శిఖరం. ఆయన పుట్టిన రోజు ఇవాళ. ఎనభై ఏళ్ళ క్రితం ‘(అక్షర) తారలెంతగా మెరిసేనో (ఈ కాబోయే కవి) చందురిని కోసం'! సి.నా.రె అనే గీత గోవిందులు ప్రస్తుత వయసులో 'అష్ట పదులు' దాటి సహస్ర పున్నములు చూడబోతున్నారు. ఈ సందర్భంగా కలికి వెన్నెల కెరటాల పైన , కలల ఆలలపైన చెరగని అక్షర విన్యాసంతో పాట నావను కల కాలం నడిపించి దిక్కు తోచక అల్లాడుతున్న సినీ లోకానికి దిక్సూచిగానూ , సాహితీ లోకానికి చుక్కాని గాను ఆయన ఉండాలని ఆకాంక్షిద్దాం.

సి.నా.రె అనే మూడక్షారాల జ్ఞాన సముదాయంలో తెలుగు,ఉర్దూ, సంస్కృతం అనే మూడు భాషల సంగమముంది. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు మిషల మిశ్రమముంది. అన్నిటిని మించి సి సలైన నా నుడి రె ట్టించి పలికే జాతీయత ఉంది.


విశ్వమనే అద్దంలో నారాయణ ప్రతిఫలం

గురుదేవులు రవీంద్ర కవి 'గీతాంజలి ' తో 'విశ్వ'కవి అయితే, గురువులు కవి సామ్రాట్**'విశ్వ' నాథ సత్య'నారాయణ'** 'వేయి పడగలు ' పరచి 'జ్ఞాన పీఠ ' పొందితే, ఈ 'విశ్వ' రహస్యం గ్రహించిన మన గీత ‘నారాయణుడు' 'విశ్వంభర ' కావ్య రచన చేయడం, అద్దానికి ప్రతిఫలంగా 'జ్ఞాన పీఠం ' వరింఛి రావడం గొప్ప విషయం కాదా?

వేయి 'పడగల' రచనకు 'పాముల'పర్తి వేంకట నరసింహుల వారి ఒకే ఒక్క హిందీ అనువాదం దక్కితే విశ్వంభర కు మూడు అనువాదాలు దక్కాయి. మహిలో సి.నా.రె లోని త్రైయాక్షరి మహిమ అది.

సి.నా.రె పద్మ భూషణుడు. కళా ప్రపూర్ణ. అడపా దడపా గళం సవరించే గాయకుడు.

ఆయన వ్రాసిన గజళ్ళు ని**,,** స్వర సిరా రసం కలబోసిన గజ నిమ్మ పళ్ళు. అతిశయోక్తి? కాదు- అవి ని శిరాత్రి, ధ్యాన్నం, గలు ఎప్పుడైనా సరే సేద దీర్చి నీరసం పోగొట్టే షరబత్తులు. ఔనా? ‘ ప్రపంచ పదుల ' సాక్షిగా ‘ఔను'!

****గవాక్షాల నుంచి దూసుకొచ్చిన తొలి సినా రేస్ మీద గవేషణ

మధ్య తరగతి మందహాసం ' లో ఆయన ఒక చోట అన్నారు- ‘సముద్ర గర్భంలో కూచొని సరిగమ లేరుకుంటున్నాను' అని. ఆయన గీతాల కడలి నుంచి ఎన్నని ఏరేది? ఒకటి ఆణిముత్యమైతే మరొకటి మరొకటి చేరి మేము కామా ? అని ప్రశ్నిస్తే ఆ అన్వేషణకి అంతేది? అయితే ఒక సుళువు మార్గముంది. ఆయనకంటూ ఉన్న ప్రత్యేక సినీ సంగీత సముద్రంలో కొన్ని ‘తొలి' ముద్రలు కనిపిస్తున్నాయి. వాటిని వెలికి తీస్తే ‘సరి'! ‘గమ'నిస్తే అదే చక్కని గవేషణ. ఆ రకంగా ‘సరిగమ'లు ఏరుకొనడం సబబే.

తొలి ముద్ర అంటే 1962 లో ఆయన సినీ కవిగా ‘కథ' మొదలు పెట్టడమన్నది. ‘గులేబకావళి కథ(1962)' తొలి చూపులోనే ‘నన్ను దోచుకుందువటే' అంది ఆయన కలాన్ని, ఆనాటి కాలాన్ని..

కథ చెబితే ‘అనగనగా ఒక రాజు' అంటారని కమ్మని తెలుగుతనం చాటించిన అందరి ఆత్మ బంధువు(1962)**** సినారె మరో తొలి ముద్ర వేశారు.

వివాహ బంధం(1964)' తో భానుమతి-రామకృష్ణ లు ‘నీటిలోన నింగిలోన నీవె ఉన్నావులే' అని ఈ కవి చంద్రుణ్ణి తొలి సారిగా పోల్చుకోవడం ఎంత మంచిదైంది అంటే తొలిసారిగా భానుమతి వంటి మేధావి గాయనితో పాడే అవకాశం బహుముఖ ప్రజ్ఞాశాలి పి.బి.శ్రీనివాస్ గారికి దక్కింది. ఇదిసినారె పరంగా రెండు అడుగుల ‘తొలి' ముద్ర!

కె.బి.కె. మోహనరాజు అనే పేరు ఆకాశావాణి గాయకుడిగానే కొందరికే తెలిస్తే ఆ గాయకుడిలో ‘చిగురులు వేసిన కలలన్నీ (సినీ రాణి) సిగలో పూలుగ' మార్చే పూల రంగడు(1967)**** అతనికి కొత్త అవకాశ వాణి కల్పిస్తాడని అది తన పరంగా ఒక తొలి ముద్ర అవుతుందని ఎరుగని వారే సినారె!

ఇక- ఘంటసాల యుగం అయిపోవస్తున్న, బాలు యుగం ఆరంభమౌతున్న ఒకానొక సంధి యుగంలో వారిద్దరి తొలి అపురూప పౌరుషేయ యుగళం 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' అన్నది సి.నా.రె వాణి. ఇద్దరు మంచి మిత్రులు(1968)- అయినా భిన్న మార్గాలు- ఒకరిది సౌమ్య వాదం, మరొకరిది ఉగ్ర వాదం – ఈ రెంటినీ ఆ రెండు గొంతుల్లో అద్భుతంగా పలికింపజేసినది స్వర కర్త కోదండపాణి. ఆ ‘తొలి' ముద్ర సినీ భావి తరాలకి మిగిలిన అడుగుజాడ. !

కోదండపాణి తాను కనుమరుగౌతానని తెలియని రోజుల్లో ఎంతో ముందు చూపుతో చేసిన మంచి పని- వాణీ జయరాం వంటి మేటి గాయనిని తెలుగు వాళ్లకి పరిచయం చేయడం. ఆమె తొలి తెలుగు పాట ‘ఎప్పటివలె కాదురా నా స్వామి' అనే చిక్కని జావళి కూర్పరి సినారె! ఈ ‘అభిమానవంతులు ' (1973) ఆమె చేత ఓనమాలు దిద్దించిన తెలుగు పంతుళ్ళు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు. వరుసగా ఎనమండ్రు! ఎవరు వారు? ‘అష్ట విధ నాయికలు'. అందరి స్వభావాలను ఒకే పాటలో అవలీలగా చెప్ప గలిగే సాహసి ఎవరు? ఇంకెవరు? సినారె! ఈ ‘తొలి' ప్రయత్నం ‘మహాకవి క్షేత్రయ్య ' (1976) పేరిట సినీ క్షేత్రంలో మహాకవి సినారె చెయ్యటం తెలుగు వారి అదృష్టం. అది మళ్ళీ మరొకరికి దొరుకుతుందని చెప్పడం మహా కష్టం.

‘గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరలో వలపంతా కూరినానోయ్ బావా ' అనడం ఒకే ఒక కవికి నాడు సాధ్యమైంది. ‘వివాహ భోజనంబు'లో అప్పడాలు,పులిహోర దప్పళాలు మరో కవికి పసందయ్యాయి. అట్టు,మినపట్టు, తీపి తీపి బొబ్బట్టు,పప్పు ముద్ద, పచ్చడి – కొసరాజు నాలుక కొసలు రాజుకునేలా చేస్తే ‘నాకూ ఉంది తెలుగు వంటల పట్ల ఆత్మ గౌరవం(1966)' అంటూ తొలిసారిగా రాసిన వంటకాల రచ(స)న – ‘మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు', నిజంగా సినారె సినీ ‘లోకో' భిన్న రుచిని తెలియజేసింది.

ఇక లలితమైన గీతాలకు ‘లా జవాబ్' గా ఏక ఛత్రాధిపత్యం వహించిన సినారె తన పాటల్లో ‘ముత్యాల జల్లు' కురిపిస్తే నటీమణి జయలలిత నాట్యం చేయడం మనకు తెలుసు.సినారె వారి మరో పాటను తానుగా జయలలిత పాడడం జరిగింది ‘ఆలీబాబా 40 దొంగలు(1970)' చిత్రంలో. ఇది కూడా ఒక తొలి ముద్రే!

‘మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు' (ఔనా? అన్నది కొనకళ్ల రత్నమా? కాదు కాదు- నూటికి నూరు పాళ్ళ సినారె రత్నమే. ఇంతటి వైవిధ్యం అనితర సాధ్యం. తన పాటల ‘మాయ' దారిలో ఈ సినారె సిన్నోడు ఎన్నో తొలి ముద్రల కన్ను గప్పి అందరి మనసూ లాగేసిండు.

‘ఇన్ని పాటల్లో ఏదైనా ఒకటి హిట్ కావడం సున్నా, నే బెట్ కడుతున్నా' అనే సూటి ‘పోటీ' మాటలకి అవకాశం లేకుండా, రాకుండా చేసుకున్న ఈ కవికి ఇప్పుడు ఎనభై అనడం తప్పు. ‘సున్నా' తప్పిస్తున్నా. ఇప్పుడు ఆయనకి ఎనిమిదేళ్ళు. ఎనిమిదేళ్ళ ‘సిన్నారి' కి అష్ట దిక్కులనుంచి ఈ పూట శుభాకాంక్షలు!

సి.నా.రె భవిష్య**దర్శన**మదిరె!****

'తరం మారుతోంది -వందే మాతరం స్వరం మారుతోంది అని ఆయన ఈ తరం 'సినీ లోకం పోకడ' గమనించక ముందే తన స్వాతి కలం చిప్పలో స్వాతి సిరా వాన ఒలికించి 'స్వాతి ముత్యం(1986)' వెలికి తీసి 'వటపత్ర శాయికి వరహాల లాలి' అన్నారు. ఆయన తరం వారు, తరువాతి తరాల వారు ఎంత మాత్రమూ మారనే లేదు కనుక ముక్త స్వరంతో ఈ ఎనభై ఏళ్ళ చిన్ని శిశు భాస్కరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరిన్ని ఆశా స్వాతి కిరణాలు వెదజల్ 'లాలి' అని పాడుతున్నారు.

కవి వాక్కులు కేవలం భాషా చమక్కులు కావని తెలిసిపోయింది. ఇప్పుడు 'అనంత శాయి' తన పాన్పు కింద ఒక్కొక్క హాలులో అనేక వరహాలు చూపిస్తుంటే 'అరెసి.నా.రె ఆనాడే భలే వ్రాసినారే!' అని అబ్బురపోతోంది నేటి డబ్బుల లోకం.

అంతెందుకు- 'పూలు గుసగుస 'లాడెన్' (శ్రీవారు మావారు ,1973) అని ఒకానొక గాలి ఈలలు వేసిన పాటలో కొన్ని దశాబ్దాల కిందటే ఒక నియంత పేరు చూచాయగా సూచించలేదూ? పూవింటి వాడు 'మదనుడు' నిన్ను గని 'పొద'(బుష్) లో దాగెను' అని అన్నదీ ఈయనే. అయితే 'రహస్యం(1967)'గా 'చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను'అని ఒసామా -'గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను ' అని ఒబామా పరస్పరం అనుకోవడం విశేషం.

'ఒకటి ,రెండు,మూడు విడి విడిగా ఉంటే అంతే -ఒకటిగా కలిపి చూడు అవి నూట ఇరవై మూడు' (నిండు హృదయాలు , 1969) అన్న సత్యాన్ని సి.నా.రె ఆనాడు అంత బాగా ఎలా ప్రకటించ గలిగారో? 1G, 2G, 3G విడివిడిగా ఉంటేనే ఇంత. 123 అయిపోతే అమ్మో ఇంకేమైనా ఉందా?

సినారె సాహితీ చమత్కారం సాహోరే!

'జాబిలిలోనే**** జ్వాలలు**** రేగే, వెన్నెల లోనే చీకటి మూగే' అని ఒకానొక 'నిర్దోషి(1967)' ఎందుకన్నాడూ? చందమామ లాంటి తనకు పట్టిన గ్రహణం కనుక. చంద్ర గ్రహణం పున్నమి నాడే కదా కలిగేదీ? గ్రహణం పట్టిన చంద్ర బింబం కాస్త ఎర్రగా ఉండదూ? చుట్టూ చీకటి రాదూ? రవి కాంచనిది కవి గాంచును.

పగడం అంటే కెంపు. కెంపు అంటే ఎరుపు. పున్నమి జాబిలి తెలుపు. కానీ 'మూగనోము(1969)' పట్టక ముందు మగువ మోము ఎంత అందంగా ఉందీ! అది చూసిన చంద్రుడు ఈర్ష్య పడడూ? ఈర్ష్య పడితె మొహం ఎర్ర బడదూ? ఈ దశ భరించలేక దాక్కోడూ? అందుకే 'పగడాల జాబిలి చూడు గగనాన దాగెను నేడు- కోటి అందాల నా రాణి అందిన రేయి ఎందుకులే నెలరేడు?' అని చమత్కరించడం ఆయనకే చెల్లు. ఈ చంద్రుడి దాగుడు మూతల 'రహస్యం ' తెలిసిన ఈయన ఇంకో సందర్భంలో 'చంద్రుడు నిన్నుగని చాటున ఆగెను ' అన్నారు. చాటునుండి అందచందాలు చూసి చలించడం చరించే చంద్రుడికే చెల్లు.

సినారె****పాటలే చివరి పుటలు కొందరికి

గాయక నిష్ణాతుడు మహమ్మద్ రఫీ చివరి తెలుగు గీతాలు ‘అక్బర్ సలీం అనార్కలి(1978)' లోనిసి.నా.రె గీతాలే.

ఆ చిత్ర సంగీత దర్శకుడు సి.రామచంద్ర కి కూడా అదే ఆఖరి (తెలుగు) చిత్రం.

నీరాజనం(1989)' పాటలు సినారె కలం మాధుర్యాలు. తొలిసారిగా ఓ.పి నయ్యర్ ఈ తెలుగు చిత్రానికి సంగీత మందించేరు. అదే నయ్యర్ వారి ఆఖరి చిత్రం కూడా.

సినారె సినిమా సంభాషణలు కూడా రాసినారే!

ఒకే ఒక్క చిత్రానికి సినారె మాటలు రాశారు. ఆ చిత్రం పేరు కూడా ‘ఏక'వీర కావడం విశేషం.

సినారె పేటెంట్ అనగా**‘ఎగిసి'**అనే పదం అన్నారే

ఎప్పుడో ‘మల్లీశ్వరి(1951)' చిత్రంలో దేవులపల్లి వారు ‘మనసున మల్లెల మాలలూగెనే' అంటూ ఊగే క్రియను సమర్ధిస్తూ ‘ ఎగసిన హృదయము పగులనీకుమా ' అని మల్లి చేత పలికించారు. మళ్ళీ ఇంకే చిత్రంలోనూ ఆ ‘ఎగసిన' అనే పద ప్రయోగం ఆయన చేసినట్లు కనిపించదు.

సినారె కవి హృదయం మాత్రం ఎన్నోసార్లు ‘ఎగిసి ' పడింది. ఉదాహరణకి-

‘ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే...ఇంకా తెలవారదేమి' (ఎన్నాళ్ళో వేచిన ఉదయం-మంచిమిత్రులు),

‘రెక్కా రెక్కా ఆనించి –మిన్నులలో ఎగిసినవి ' (పాలవంక సీమలో గోరువంక వాలింది-పాల మనసులు),

‘ఒక ఉదయం పిలిచింది ఒక హృదయం ఎగిసింది '( ఒక దీపం వెలిగింది-ఏకవీర),

‘జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే దివ్యానందం' (కనులు మాటలాడునని-మాయని మమత),

ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే రసానందం' (కనులు మాటలాడునని-మాయని మమత),

'ఏమేమో ఔతుంది ఎగిసి ఎగిసి పోతుంది' (శ్రీకృష్ణావతారం) .

ఉభయ**‘భా' ‘షాన్'రక్తుడు సినారె**

భా, షాన్ అనే మాటలకి వాటి వాటి భాషల్లో అర్థం ప్రకాశ మనేగా? అలా సంస్కృతం పంక్తులు ముందు రాసి తరువాత తెలుగు పంక్తులు రాయడమో లేక తెలుగు ముందు రాసి సంస్కృతం తరువాత రాయడమో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించుకుంటే –అలా రాసింది ఒక్కరే , అలా రాసి ప్రకాశించింది సినా'రే' మాత్రమె!

‘ఏకవీర(1969)' చిత్రంలో ‘నీ పేరు తలచిన చాలు' అనే రాధికా సాంత్వనం లో ముందు ‘ ఏమి మురళి అది ', ‘ వెదురు పొదలలో తిరిగి తిరిగి ' వంటి చరణ పంక్తుల తరువాత వచ్చే ‘ గోపాలా నంద బాలా నవ మంజుల ---‘ అనే చరణం లోని పంక్తులన్నీ సంస్కృత భాషవే.

కథానాయిక మొల్ల (1970) చిత్రంలో ‘జగమే రామ మయం –మనసే అగణిత తారక నామ మయం' అనే పాటలో మొదటి చరణం –‘ నీల జలద రమణీయ రూపం ' వంటి నాలుగు సంస్కృత పంక్తులతోనూ, రెండవ చరణం ‘ ఆ చిరునవ్వే అమృతపు జల్లు ' వంటి నాలుగు తెలుగు పంక్తులతోనూ శోబిల్లుతుంది.

సినారె సూక్తులు (సినియేతర రచనల నుంచి)

‘చిరునవ్వులు చిగిర్చ వలసిన మాగాణిలో/ చింత బొగ్గులు నారు పోయకు

జెండాలా రెపరెప లాడుతూ ఉండే/ జీవితాన్ని మడిచి వేయకు',

‘చీకట్లో నిల్చొని వెలుతుర్ని చూడు/ జీవితం విచ్చుకుంటుంది

వెలుతుర్లో నిల్చొని చీకటిని చూడు/ విధి గుచ్చుకుంటుంది'

‘జీవిత శైలాగ్రంపై నిల్చి/ దృష్టిని దూరం విసిరేస్తే
పిపీలకాలకూ మనుష్యులకూ/ పెద్ద తేడా కన్పించలేదు'

‘పాతాళాన్ని చుంబించే /బావిలో కూర్చుంటే

కాక శృతి కోకిల రుతి/ ఏకరీతి విన్పించెను'

‘కనబడకుండా దాగిన/ అణువులను ఖైదు చేసి

అగ్నిత్వం ఆపాదించడం /అదేం విజ్ఞానమండీ?'

ధర్మం, సంఘం, దేశం - ఈ మూడింటి త్రివేణీ సంగమం ఎంత మహత్తరమైనదో తెలియజేసిన మూడక్షరాల ముద్దు పేరు సినారె అనబడే డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి అందరి తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు

నిజమే- ఆయన పుట్టిన రోజు

పండగే కదా అందరికీ!

మరి మనం పుట్టింది ఎందుకో తెలియాలంటే ఇటువంటి మహనీయుల బాట తెలుసుకోవాలి.

-డా. తాతిరాజు వేణుగోపాల్ , 29 జూలై 2011