లకార రకార రకరకాల పేరులంటే తెలుగు వారికి ఎందుకంత ‘ఇది' ?
07 జులై, 2013


తెలుగువారి**‘బాల'ఇష్టాలు:**
తెలుగువారి సినీ సంగీత ప్రపంచ ప్రముఖత్వమంతా ‘బాల ' మయమే, ఔనా కాదా అంటే ఆబాలగోపాలం ఔననే అంటారు.
ఘంటసాల మాస్టారు గారిని చిన్నతనంలో ‘బాల భరతుడు' అనేవారు, ఎందుకంటే ఆయన చిన్న చిన్న పాత్రలు పోషించి పాడుతూ ఉండేవారు కనుక. ఆ తరువాత ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక గాయకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ తనదంటూ ఒక విశేష ముద్ర సృష్టించి ‘ఘంటసాల యుగం ' అనేది ఒకటి ఉండేదనటానికి నిదర్శనంగా ముప్ఫైఏళ్ల కాలం మనముందుంచారు.
అక్కినేని ఆఖరు సారిగా తన పాత్రకి తానే పాడడం, ఆ పాట రికార్డ్ రూపంలో రావడం, చిత్రంలో ఘంటసాల వారి గళం వినిపించడం – అంటే అక్కినేని వారికి తొలిసారిగా ఘంటసాల వారు ప్లే బ్యాక్ పాడడం ఇవన్నీ చరిత్రకెక్కిన గొప్ప విషయాలైతే ఆ చిత్రం పేరు ‘బాల రాజు'!
ఆకాశవాణికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే చప్పున గుర్తొచ్చే పేరు- బాలాం త్రపు రజనీకాంతరావు గారు.
తెలుగువారి ఏకైక పద్మవిభూషణ ధారి బాల మురళీకృష్ణ గారు!
బాల సరస్వతీదేవి గారు సరే సరి. తొలి ప్లే బ్యాక్ గాయని ఆమె.
ఘంటసాల వారి అకాల అస్తమయంతో కొంత వెలితి ఏర్పడడం నిజం. అంతలోనే బాల సుబ్రహ్మణ్యం తన స్వయంకృషితో ఎదిగి నలభై ఏళ్ళ కాలం ఒకటి ‘బాల- ల కొమ్మిస్తే లు యుగం ' అని అనిపించేలా చేశారు.
ఘంటసాల యుగంలోనే మహమ్మద్ రఫీ ‘గోపాలా బాలా నిన్నే కోరి నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను' అని భలే తమ్ముడు చిత్రంలో బాల కృష్ణ తండ్రి గారికి (అదే- నందమూరి తారక రామారావు గారు) పాడితే యిట్టే ఆ పాట హిట్టై కూర్చుంది.
ఫరవాలేదు...తెలుగువారు చిన్నతనంలో ‘పెద్దబాల శిక్ష' చదివినందుకు సంగీత ప్రపంచంలోనే కాదు అడుగడుగునా వారికి దక్కినది ‘బాలా 'నందమే కదా అని అన్పిస్తుంది.
ఒకనాటి రేడియో వినము నేడు మనము- కాని ఆ రోజుల్లో బాలా నందం, బాల వినోదం ఉన్నవే వీకెండ్లు.
బాపు ,రమణ ల వంటి గొప్ప కళా మేధావుల్ని వెలికి తీసింది ‘బాల ' అన్న ‘పేరున్న' పత్రికే.
ఆఖరికి ఆంధ్రదేవుడు కూడా ఉత్తరాదివారిచేత ‘బాలా జీ' అని అనిపించుకున్నాడా లేదా?
తెలుగు పాట- ఊ లలల్ల:
‘బాల ' అనే మాటలో లకారం ఉండడం వల్లనో ఏమిటో ...లలల ...లలల అని ఏపాటకైనా ముడిపెట్టడం ఎంత సులభమో కదా..
'హాసం' అనే సినీ పత్రిక ఒకటి ఉండేది కొన్నేళ్ళు... 'విజయచిత్ర' లాగ. హా అంటే హాస్యం, సం అంటే సంగీతం అని రెండూ కలిపి చేసిన కొత్త ప్రయోగం అది.. ఈ రెండు పత్రికలతో అనుబంధం ఉన్న రావి కొండలరావు గారు ఆర్కే గా అవతారమెత్తి చిత్రసీమలో సంగీత విభాగంలో ఎన్ని ‘లకారాంతాల/లకారాల' పేర్లు గొప్పగా వినిపించాయో చెబుతూ కొన్ని పేర్లు మాత్రమే చెప్పారు హాసంలో. లా (లూచీ)పాయింటు దొరికింది అని శీర్షిక పెట్టి ఆయన ఆ రచన ముగింపులో అంటారు -‘ల'తో ఎక్కడో సినిమా సంగీతం జట్టు కట్టింది. అది రహస్యం కాదు. ఎందుకు కట్టిందో మాత్రం రహస్యం!
అసలు రహస్యం- తెలు గు అనే పదంలోనే లకారం హాయిగా కొమ్ములొచ్చి మధ్యస్థంగా తటస్థంగా ఉండడమే అని నా ఉవాచ.
లకార గాయక ధీమణులు- చిల కల పూడి సీతారామాంజనేయులు , ఈలపాట రఘురామయ్య (అసలు పేరు కళ్యాణం వెంకట సుబ్బయ్య), ఘంటసాల , లీల ,కోమల , కమలా దేవి, జి.వరల క్ష్మి, ఎస్.వరల క్ష్మి, బాల సరస్వతీ దేవి, వక్కలం క సరళ , సుశీల , శిష్ట్లా జానకి, ఎల్.ఆర్ ఈశ్వరి, స్వర్ణల త, ల త,...వీరంతా తొలి తరం గాయనీ గాయకులనే మొదటి సెట్టు. హిందీ సినీసీమ నుంచి తెలుగు సినీసీమ లోకి వచ్చి ఒకటీ అరా పాడిన ల తా మంగేష్ కర్, ఆశా భోసలే ల పేర్లలోనూ లకారాలున్నాయి సుమండీ- అది ఇంకో సెట్టు. శైల జ, విజయల క్ష్మి,స్వర్ణల త, కల్ప న, కౌసల్య ,మల్లి కార్జున్,ల హరి, మాళ విక- ఇది కొత్త సెట్టు.
స్వరకర్తలు - గాలి పెంచల నరసింహారావు, సాలూ రు సోదరులు (రాజేశ్వరరావు, హనుమంతరావు), పెండ్యాల , ఓగిరాల , ఉప్పల దడియం నాగేశ్వరం(నాగయ్య), బాలాం త్రపు రజనీ, అద్దేపల్లి రామారావు, బాల మురళీకృష్ణ, మద్దూరి వేణుగోపాల్ (మాస్టర్ వేణు),సుసర్ల , అంజలీ ప్రియ ఆదినారాయణరావు ( హాసంలో వేటూరి వారు ‘ఆదినారాయణరావుకి అంజలి' అని ఒక వ్యాసం రాశారు), గుడిమెట్ల అశ్వత్థామ, ఎల ప్పళి ఎం.ఎస్, విశ్వనాథన్, తిరుచిరాపల్లి రామమూర్తి, తాతినేని చల పతిరావు, పాలు వాయి భానుమతి, గోపాలం , పువ్వుల రమేష్ నాయుడు, కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్, శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, చెళ్ళపిళ్ల సత్యం, జెట్టి వీర రాఘవులు వరకు ఘంటసాల యుగం వారైతే బాల సుబ్రహ్మణ్యం, డేనియల్ రాజయ్య (ఇళయరాజా) బాలు యుగం వారు- వీరంతా సంగీత సామ్రాజ్యం ఏలినవారు – వీరిది ఒక సెట్టు. (ఇంతవరకు చెప్పిన వాటిలో ఆర్కే గారు చెప్పని పేర్లు కూడా ఉన్నాయి. ఆయన స్పృశించని అంశాలు కొన్ని దిగువున ఉన్నాయి-).
ఎమ్వీఎల్ అనే ఆయన ఉండేవారు. ఆయన రచయితా, వ్యాసకర్త కూడానూ! ముళ్ళపూడి వెంకట రమణ గారి పేరులో 'రమణ' అన్న మాటని బుడుగైతే 'లమణ' అని పలుకుతాడు కదండీ.. అలా రమణ గారు ( పొడిపొడిగా) మారగా వచ్చిన పేరే ఎమ్వీఎల్ అని సాహిత్యకారులు జోకేవారు. ఇదే తరహాలో ‘ర' ను ‘ల' చేసి అడ్జస్ట్ చేస్తే మనకి - సి.ఆల్.సుబ్బులామన్, భీమవలపు నరసింహాలావు, తోటకూల వెంకటలాజు ,లాజన్ నాగేందల, గులజాడ వెంకటేష్,కొమ్మినేని అప్పాలావు (చక్రవర్తి), మహమ్మద్ లఫీ అని మరో కొద్ది మంది సంగీత ప్రముఖులు లభ్యమౌతారు. ఇదొక కిట్టింపు సెట్టని ఆక్షేపించినా అంత పట్టింపు ఉండకూడదు లెండి..
తెలుగు రాత రకారాకారం:
ఇంకొక చిత్రమేమిటంటే..., సినీ గీత రచయితల పేర్లలో మాత్రం ‘ర'కారమే ఎక్కువ. సముద్రా ల రా ఘవాచార్య,సముద్రా ల రా మానుజాచార్య , కొసరా జు రా ఘవయ్య చౌదరి , మల్లాది రా మకృ ష్ణ శాస్త్రి , సదాశివ బ్ర హ్మం, దేవులపల్లి కృ ష్ణశాస్త్రి , శ్రీ****శ్రీ (శ్రీరం గం శ్రీ నివాసరా వు), పింగళి నాగేంద్ర రా వు, తాపీ ధర్మారా వు నాయుడు, ఆత్రే య (కిళాంబి నర సింహాచార్యు లు), ఆరు ద్ర (భాగవతుల శివశంకర శాస్త్రి), సింగిరె డ్డి నారా యణరె డ్డి, దాశర థి కృ ష్ణమాచార్య , అనిసెట్టి సుబ్బారా వు, , మైలవర పు గోపి, రా జశ్రీ , ఎమ్మెస్ రె డ్డి (మల్లెమాల), పాలగుమ్మి పద్మరా జు, చెర్వు ఆంజనేయశాస్త్రి , జి.కె.మూర్తి , ముళ్ళపూడి వెంకట ర మణ, వీ టూరి –వీరంతా ఘంటసాల యుగం వారు.
వేటూరి సుందరరా మ మూర్తి , జాలాది రా జారా వు, సిరి వెన్నెల సీతారా మశాస్త్రి , అదృ ష్ట దీపక్, భువన చంద్ర , చంద్ర బోస్, భార వి, ర సరాజు, రా మజోగయ్య శాస్త్రి ,అనంత్ శ్రీరాం, చైతన్య ప్ర సాద్, సాయి శ్రీహర్ష , అందెశ్రీ , **** సామవేదం షణ్ముఖ శర్మ,...వీరంతా బాలు యుగం వారు.
ఒక్కటంటే ఒక్క పాట మాత్రమే రాసిన భుజంగరా య శర్మ ఘంటసాల యుగం వారైతే బాలు యుగం నాటి వారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వీరి పేర్లలోనూ రకారాలే ఎక్కువ కదా. తొలి తెలుగు సినీ గీత రచయిత గా (డా. పైడిపాల వివరణ బట్టి) కొందరికే తెలిసిన ధర్మ వరం కృ ష్ణమాచార్య పేరు నలుమూలలా రకారమే.
డా. పైడిపాల వారు ఒక చోట ‘పాటల పల్లకీకి పన్నెండుగురు బోయీలు ' అని శీర్షిక పెట్టి ఇచ్చిన పేర్లు చూస్తే అందులో పదిమంది ఘంటసాల యుగం నాటివారు, ఇద్దరు బాలు యుగం నాటి వారు అని తెలుస్తుంది.
పాటలు సరే –సంభాషణలు వ్రాసిన వారో?, డి.వి. నర సరాజు, ఎన్నార్ నంది, మోదుకూరి జాన్సన్, భమిడిపాటి రా ధాకృష్ణ, మహార థి ...ఇందరున్నారు, ఇందరికి అభయమ్ము ఇచ్చినది ర!
(కాసేపు సినిమాలు, తెలుగు అనేవి పక్కన పెట్టి నోబెల్ ప్రైజుల జోలికి పోతే ఇంత వరకు ఆ ఉత్తమ బహుమానమందుకున్న భారతీయుల పేర్లలో స్పష్టంగా గోచరించే కామన్ అక్షరం ‘R', లేదా ‘ర'!)
తెలుగు వారి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు:
‘అనుకున్నదొక్కటి, అయినదొక్కటి ..అని ఒక పాట ఉంది. .. అది నిజమైంది కొందరి విషయంలో. తొలి తెలుగు సినీ కవిగా అందరూ అనుకునే చందాల కేశవదాసు గారి పేరులో లకారముంది.
అలాగే బాలు యుగంలోని ఒక ప్రముఖ గీత రచయిత పేరు సుద్దాల అశోక్ తేజ, వీరి పేరులోనూ లకారం ఉంది. అయితే అడపా దడపా వీరు గొంతెత్తి పాడగలరు కనుక వీరిని గాయక రచయిత అని అనడం మేలు.
మరొకరు కీర వాణి, వీరు కూడా బాలు యుగం నాటి వారే. పేరులోని రకారం బట్టి రచయిత కావాలి. కాని తొలినాళ్ళలో మామ (మహదేవన్) ముద్ర విడలేక మెల్లగా తన బాణీలోకి దిగిన సంగీత దర్శకుడు ఈయన. గాయకుడు కూడానూ. ఇటీవల రచయితగానూ (ఉదాహరణకి- షిరిడీ సాయి) కొత్త అవతారం ఎత్తినవారు కనుక ఈయన మీద రకార ప్రభావం పడిందని చెప్పొచ్చు.
జొన్నవిత్తుల రా మలిం గేశ్వర కవి రెండు లకారాలు, రెండు రకారాలు ధరించిన ఉభయ కుశలోపరి. అటువంటి వారే భాస్కర భట్ల ర వి! జొన్నవిత్తుల వారు ఎన్నో సినిమాలకి ఎన్ని పాటలు రాస్తేనేం మూడు రకారాలున్నశ్రీరామరాజ్యం సినిమాతో మేటి కవి అనిపించుకున్నారు.
ఇంకా రకార ధారులు -ఎ. ఆర్. రె హమాన్, మాధవపెద్ది సురే ష్, వాసూరా వు, రా జ్, కోటేశ్వరరా వు (కోటి), మణిశర్మ , ఆర్ పి పట్నాయక్, చక్రి , దేవిశ్రీప్ర సాద్, వందేమాతరం శ్రీనివాస్, విద్యాసాగర్ , రా ధాకృష్ణన్, శివప్ర సాద్, ...ఇలా ఎందరో నవ్య,భవ్య యుగ సంగీత దర్శకులు ఉద్భవించడం చూస్తుంటే ...తరం మారింది లకారం రకారమైంది (బుడుగు భాష బుడుంగున మునిగింది) అని తెలుస్తోంది. సవరించి మళ్ళీ ఆద్యులైన సి.ఆర్.సుబ్బురా మన్, భీమవర పు నర సింహారా వు, తోటకూర వెంకటరా జు ,రా జన్ నాగేంద్ర , గుర జాడ వెంకటేష్, కొమ్మినేని అప్పారా వు (చక్ర వర్తి), మహమ్మద్ ర ఫీ వంటి పేర్లన్నీ రకార పటిమ గలవే అని చాటాలి.
డేనియల్ రా జయ్య అనే గిటార్ వ్యక్తి ఘంటసాల యుగపు వాడే అయినా 'ఇళ యరా జా' గా మారి బాలు యుగం మధ్య లోనూ ఉండి గడుసుగా లకారం, రకారం రెండూ కలబోసుకున్న మరో ఉభయకుశలోపరి. ఇందాక చెప్పుకున్న భవ్య స్వర కర్తలకి ఈయనే మార్గ దర్శి.
బాలభరతుడై ఘంటసాల గారు ఉన్నప్పుడు స్థానం నరసింహారా వు గారు- ‘మీరజాల గలడా ' అని వ్రాసి, పాడుకున్న గాయకరచయిత. వారి లాగే పి.సూరి బాబు గారు- ‘కళ్ళు తెరువరా నరుడా , నేను గాయకుణ్ణి, నాలో ఎక్కడుందీ లకారం?' అని వాదించగలరు. ‘పొరుగింటి పుల్లయ్య గొడవ లో పడి మరిచాను. బోలెడు రకారాలున్నా నేను గాయకుణ్ణి. పెద్దలు...మీతో ఏకీభవిస్తున్నాను' అంటారు పిఠాపురం నాగేశ్వరరా వు.
ఆకాశ దేశాన ఆషాడ మాసాన మేఘ సందేశం ఇచ్చి మరీ వీరితో ఏకీభవిస్తారు కట్టశేరి జోసెఫ్ ఏసుదాస్. 'తలచినదే జరిగినదా దైవం ఎందులకు? నా పేరులోనూ రకారాలే కదా' అని అంటారు దివిసీమ గాయకులు ప్ర తివాది భయంకర శ్రీనివాస్. ‘అడుగుదామని ఉంది నిన్నొక మాట ...నువ్వు బహుభాషా కోవిదుడివి, రచయితవి..నా పేరులో రకారాలున్నా ఏదో నీ సావాసంతో స్వరకర్తనయ్యా' అని ఈయన భుజం తడతారు ఎం ఎస్ శ్రీరాం. ‘మరి నేనో..నా పాటేమిటీ?' అని అడుగుతారు ‘ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి' వచ్చే మానాప్ర గడ నర సింహమూర్తి.
పురుష పక్షపాతులై మమల్ని మరచిపోతే ఎలా? అని దబాయిస్తారు –అలనాటి (జిక్కి వంటి) వారిని తలచుకుంటూ వర్ధమాన గాయనీమణులు- ఉపద్ర ష్ట సునీత, గోపికా పూర్ణి మ, గీతామాధురి. వీరంతా పేరులో రకారాలు అద్దుకున్నవారే.
‘స్టాప్ ..స్టాప్...ఎవడ్రా వాడూ.. ఈ బసవరా జు పద్మనాభం హాస్య నటుడే కాదు గాయకుడు కూడా, వ్రబ్బో వ్రబ్బో.. అందుకే దేవత సినిమాలో మా ఊరు మదరాసూ నా పేరు రాందాసూ.. అని రకారాలున్న పాట నాకు ప్లే బ్యాక్ పాడాను. తేనెమనసులు సినిమాలో తెరంగేట్రం చేసినకృష్ణ గారికి తొలిసారిగా ప్లే బ్యాక్ పాడాను'అంటారు పద్మనాభం. ‘ఆ( ఆ( ఆ(..నేనూ అంతే...రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి..ఏదీ ...రకారాల పాట పాడిన రా జ్ బాబుని' అని ఎగిరి వచ్చి పడతారు రాజబాబు. ‘సర్లెండి... మీరిలా కొట్టుకోండి..నాకేం తక్కువ? అయినా నేనెందుకు పాడాలి? రెండు లకారాలు, ఒక రకారం ఉన్న నటుణ్ణి. అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే అని తనలా గోపాలం పాడాడు. ముత్యాలూ వస్తావా అని నాలా బాలు పాడాడు.' అని అలిగి వెళ్ళిపోతారు అల్లు రామలింగయ్య.
పింగళి నాగేంద్రరా వు,రా వి కొండలరా వు గొల్లపూడి మారు తీ రా వు, మద్దిపట్ల సూరి, బొల్లిముంత శివరా మకృష్ణ, జంధ్యాల, తణికెళ్ళ భర ణి – సంభాషణల పిట్టలైన వీరంతా తమలో రకారమే కాదు లకారమూ ఉంది అని వాదిస్తే కష్టం.
“అబ్బే లకారంలేదూ, రకారం లేదూ...కొండవీటి చాంతాడంత లిస్టూ నువ్వూనూ” అని దూషిస్తున్నారేమో పైనుంచి ‘కొండవీటి వెంకట కవి ' గారు, ఆయన కవీ, రచయితా కనుక, ఆయన పేరులో అన్నీ కకారాలే కనుక. అవునవును భలే చాన్సులే ఈ ల,ర కారాల్లో ఉన్న మజా అని వంత పాడతారు ఆ అక్షారాలు తన పేరులో లేని గాయక శిఖామణి మాధవపెద్ది సత్యం.
వీరిద్దరూ భలే చెప్పారు అని మురిసిపోతారు అమెరికాలో బంగారు బండిలో వజ్రాల బొమ్మతో ఉన్న మన ఒకనాటి గాయని బి.వసంత , తన పేరులో లకారాలూ, రకారాలూ లేవు కనుక!
ఇదండీ ...ఇంత తతంగం ఉందని తెలిసీ షేక్స్ పియర్ వై ఫియర్ అని ఓదార్చి ‘వాట్ ఈజ్ ఇన్ నేమ్ ' అన్నారు. కాని ఆ ‘వాట్' వాటం బల్బుకున్న శక్తిలా గ్రహించి ‘పేరులో వెలుగు శక్తి ఉంది కాబట్టి పేరుతో వెలిగిపోవాలి' అని తీర్మానించుకున్నాడు తెలుగువాడు.
పేరంటాండ్రు (పేరు అని అంటున్నారు – అని అనుకోవచ్చు):
'వసంతసేన ' సినిమాలో గాయని బి.వసంత ‘బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే 'గా మనల్ని తిరిగేలా చేశారు. సినిమా పేరులోనే ఆమె పేరు ఉందని తెలిసింది కదూ. అలాగని ‘యమలీల ' సినిమాలో గాయని లీల గొంతు , ఉండాలనుకోవడం అత్యాశే. జానకిరాముడు సినిమాలో 'నీ చరణం కమలం' యుగళ**** గీతం ఎస్.జానకి పాడినా అందులో 'జానకి**'** అనే మాట లేక పోవడం నిరాశే.
లీల పేరంతా లకార మయమే కనుక ఆమె పాడే ‘అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం ' పాట పల్లవికి ముందు ‘ల ల ల... 'తప్పని సరైంది. ఇక లీల**,సుశీల** ఇద్దరూ కలిసి పాడితే ‘ఏమి హాయిలే హలా...ల ల ల ల ల ' అని అనకుండా ఉండలేరు.
పి.లీల మిస్సమ్మ గొంతుగా ‘ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా ' పాట పాడి మధ్యలో ‘లీల గా ఇపుడే కనిపించెనయా' అని తన పేరు నిలబెట్టారు. దీనికి క్రెడిట్ ఆ పాట రచయిత పింగళి వారికీ ఇవ్వాల్సిందే.
‘చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి ' అని పింగళి వారు ఒక పాటలో ఘంటసాల వారి చేత అనిపించారంటే గాయని సుశీలమ్మ జన్మ ధన్యం అయిందనే అర్థం.
లీల పాడాల్సిన పాట లీల కోరిక మీద జానకి చేత పాడిస్తే ఆ పాట పల్లవిలో చిత్రంగా లీల పేరుంది... ‘నీ లీల పాడెద దేవా '- ఇదీ ఆ పాట మకుటం. ఆరుద్ర గారు లీల పాడతారనే ముందస్తు కబురు విని అలా రాశారో ఏమో!
పాట కోయిలమ్మసుశీల ‘జానకి' పేరు వచ్చిన పాటలు చాలా పాడారు.‘జానకి' పేరున్న పాటలేవీ స్వరజానకి పాడనే లేదు**.** విడ్డూరమే కదూ. మా జానకి చెట్టాబట్టగ, జానకి రాముల కలిపే విల్లు (సీతా కళ్యాణం), జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు (రాజ్ కుమార్), రాముడే రాముడు జానకే జానకని, జానకి అనుకున్నది (పాండవులు పాండవులు తుమ్మెదా- అక్కా చెల్లెలు)- ఇవన్నీ సుశీలమ్మ పాడినవే.
నటీమణులు షావుకారు జానకికి ఎస్.జానకి మంచి మనసులు చిత్రంలో(ఓహో ఓహో పావురమా), జమునకి జమునా రాణి మూగ మనసులు చిత్రంలో(ముక్కుమీద కోపం) తొలిసారిగా పాడడం విశేషం అయితే ఆ రెండు పాటల రచయిత- మనసు కవి ఆత్రేయ కావడం వివ్విశేషం. 'పేరులు' ఎంత చక్కగా అల్లుకున్నాయీ!
పేరు కొద్దీ పాట, మాట :
'రాజనందిని ' లో ‘హర హర పురహర శంభో ' పాట ఎన్ని సార్లు విన్నా బావుంటుంది. కారణం ఎమ్మెస్ రామారావు గారి గాత్రమే. ఆయన పేరులో రాముడు, పాటలో శివుడు - వెరసి అదొక రామే'స్వరం'!
కంచు కంఠం ‘రఘురామయ్య ' గారిది. ఆయన ఆంజనేయుడికి 'నీల మేఘశ్యామా కోదండ రామా ' అని పాట పాడితే కోరస్ నుంచి 'రఘురాం రాం రాం' అనే పిలుపు వినిపిస్తుంది.
శ్రీశ్రీ – మహాకవి పేరులో ఉభయ శ్రీలు. కాబట్టి ఆయన అక్కినేని-ఆదుర్తి అనే అ-ఆ జంట కి పాట రాయాల్సి వస్తే మనసు అనే మాటని రెండు సార్లు, బ్రతుకు అనే మాటని రెండుసార్లు ప్రయోగించారు. ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' అనే ఆ పాటలో భాగ్యము, స్వర్గము అనే జంట పదం అను పల్లవిగా వస్తూ , ప్రతి చరణం చివర్న వచ్చి ఆ పాట జిగేల్ మనే ‘గజల్' అనిపించుకుంది. స్వరకర్త రాజేశ్వరరావు మాత్రం తక్కువా? తగ్గట్టుగానే ‘జయజయవంతి ' (జయ – రెండుసార్లు) రాగాన్ని ఎంచుకున్నారు. అప్పటి ఆ పాట ఇప్పటికీ ‘హిట్ హిట్' హుర్రే.
ఆరుద్ర ని పట్టుకుని ఒకాయన తమాషా చెయ్యబోతే గడుసు వారు ఆరుద్ర ఊరుకుంటారా? కార్లో వెళుతూ ఒకాయన దార్లో రోడ్డు పక్కన కనిపించిన స్మశాన భూములు చూపిస్తూ ‘ఆరుద్రగారూ...ఈ భూములన్నీ మీవేనా?' అని చిలిపిగా అడిగారట. వెంటనే ఆరుద్ర ‘అవును..ఆ రుద్ర భూములన్నీ (ఆరుద్ర భూములన్నీ) నావే' అని బదులిచ్చారట. ఆరుద్ర గారి భూములు ఆరుద్ర గారివే అవుతాయి కదా. అలా తమ పేరుతోనే హాస్యం పండించగల చతురులు అరుదు.
జగపతి సంస్థతో ఆచార్య ఆత్రేయ రచయితగా ఓ ఎత్తు ఎదిగారు. వారి ‘ఆత్మబలం ' సినిమాకి ఆత్రేయ తొలిసారిగా వారికి రాశారు. సంస్థ పేరిట ‘జగపతి' అని ఏ పాటలో రాసేందుకు అవకాశం లేదు కనుక ‘జగతి' అనే పదం వాడారు ఒక పాటలో. అది- ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. ' పాట. ‘జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకొని ...' అనేదే ఆ పంక్తి. జగపతి లోని గకారం గమనించి ‘గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయీ ' పాట, పకారం గమనించి ‘పరుగులు తీసే నీ వయసునకు ' పాట, తకారం గమనించి ‘తెల్లవారనీకు ఈ రేయిని ' పాట ఆత్రేయ రాసే ఉంటారు.
‘నువ్వొస్తానంటే నేవద్దంటానా ' సినిమాలో (త్రిష పేరు సిరి. ఆమెకి అన్నయ్యగా శ్రీహరి నటించారు. సిద్ధార్థ్ పేరు సంతోష్. ప్రభుదేవా దర్శకుడు) ఒక పాటలో ‘సిరికి హరికి మనువంట ..' అని అంటారు సీతారామశాస్త్రి. తన పేరులోని సిరివెన్నెలో, నటుడు ‘శ్రీహరి (సిరిహరి)'యో ప్రేరణ అయి ఉండాలి. అయితే..మళ్ళీ 'సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాలోనూ ‘సిరికి శ్రీహరికి కల్యాణం కానుంది ...' అనే పంక్తి ఉందే...ఇక్కడ సిరి,హరి పునరుక్తం కావడానికి ఎవరు ప్రేరణో చెప్పవా ఓ సీతారామ ప్రభూ, ఓ దేవా అని అడిగినందుకో ఏమో నాట్య నట దర్శక దురంధరుడు ప్రభుదేవా తన 'నువ్వొస్తానంటే..' సినిమాని పదేళ్ళ తరువాత హిందీలో ‘రామయా వస్తావయా ' పేరిట తీసి ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేయిస్తున్నాడు. తెలుగు మాటలు మళ్ళీ పేరు పొందేలా ఉన్నాయి.
రా మయ్యా వస్తావయ్య – అనే తెలుగు పిలుపులు హిందీ వారికి తొలిసారిగా పరిచయం చేసినది రా జ్ కపూర్ (సినిమా – శ్రీ నాలుగొందలా ఇర వై) , అదీ సంగీత దర్శకుడు శంకర్ వల్ల. శంకర్ హైదరా బాదీ. ఈ శంకరే మళ్ళీ బతుకమ్మ పేరు హిందీ వారికి తెలిసేలా చేశాడు ‘బత్కమ్మ బత్కమ్మ ఎక్కడ పోతావ్ రా ..ఇక్కడ ఇక్కడ రా ' పాటతో (చిత్రం- షత్రం జ్, 1969). ఇలా హిందీలో రెండు సార్లు తెలుగు పలుకులు పలికింది మహమ్మద్ ర ఫీ కావడం విశేషం. అందుకే రఫీ తెలుగువారికోసం రెండు పదుల సార్లు తెలుగు పాటలూ పాడి వినిపించారు. హిందీ వారి ఇన్ని రకారాల తెలుగు సేవకి కనులు చూసినా పాట ద్వారా కృతజ్ఞతలు చెప్పడం మన విధి.
కొత్త తరానికి కొంచెం ముందొచ్చిన నటుడు (గాయకుడు కూడానూ) జే.డి. చక్రవర్తి కి తల్లి కోవెల శాంత (ఒకనాటి గాయని) అంటే వల్లమాలిన అభిమానం. అందుకేనేమో ఆయన సినిమాలో ఒకానొక పాటలో ‘కోవెల్లో దీపంలా ' అనే పాట కవి కలం నుంచి కదిలొచ్చింది.
--------
“రకారం ,లకారం అంటూ కాసేపు ఇంటి పేరూ, కాసేపు స్వంత పేరూ కలబోస్తూ ఏవిటయ్యా తాతిరా జు వేణుగోపాలా నీ చాదస్తం... అసలు రకారం, లకారం కలబోసిన ఏకైక నామధేయం మా ఆవిడదే- రా మల క్ష్మి! హన్నా ...” అని ఆరుద్ర గారు వేసిన మొట్టికాయలతో ఈ ప్రపంచం లో పడ్డాను.
నిజమేస్మీ...ఈ కారాలంటే, పేర్ల మమకారాలంటే నాకెందుకింత ఇది? ఆ ఇది ఏదో చెప్పలేకపోతున్నానా?
తెలుగు వాణ్ణి కాబట్టి, ‘ ఇది**'** అని ఏదో చెప్పలేని దానికి పర్యాయ పదంగా వాడడం తెలిసిన వాణ్ణి కాబట్టి, ‘ఇది' అన్నది తెలుగు వాడి పేటెంట్ పదం కాబట్టి, ‘ఇది' ఇతర భాషల్లో సాధ్యం కానిది కాబట్టి, ‘ఇది' అనువాదానికి నోచుకోలేని పదం కాబట్టి, తెలిసిన ఒకనాటి సినిమా పాటల్లో ‘ఇది' ఎంచక్కా ఉండేదో చూపించి వినిపించి తీరాల్సిందే.
పింగళి నాగేంద్ర రావు ‘పాతాళభైరవి (1951)' లో ‘వినవే బాల! నా ప్రేమ గోల ' అని మొదలెట్టి ‘దిగుల్ దిగుల్ గా ఇది ఇదిగా 'ఉందని తొలిసారిగా ఒక ‘ఇది' ని వెండి తెర పైకి తీసుకొచ్చారు. ఆయనే ‘సి.ఐ.డి.(1965)' గా మారి ‘ఎందుకనో నిను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది ' అని ఇదీ అని చెప్పలేని ‘ఇది'కి మళ్ళీ తెర తీసారు. అప్పుడే ఆత్రేయ ‘నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ' (అంతస్తులు , 1965), ‘అది ఒక ఇదిలే ' (ప్రేమించి చూడు ,1965) అని చెప్పి ఆ ఇది ఏదో ఇద్దరికీ తెలియకున్నా ఇదేదో బాగానే ఉందే అని అనుకున్నారు. కొన్నేళ్ళకి వీటూరి వీరి దారిలో పడి ‘టింగురంగా నా మోహనాంగా(శ్రీరామకథ ,1968)' అంటూ మూడో వ్యక్తిగా ముందుకొచ్చి ‘నాకేదో ఇదిగా ఉన్నది ' అన్నారు. కేవలం ముగ్గురేనా ?...ఇంకెవ్వరికీ ‘ఇది' గురించి తెలియదా? ఏమిటీ ...ఇదియే దేవ రహస్యం?
తెలుగు వెండితెరకి ఇంకా నూరేళ్ళ పండగ ఉంది. మరో ఇరవై ఏళ్లలో ఈ తెలియని ‘ఇది' మళ్ళీ వినిపిస్తుందో లేదో? డౌటే – ఆ ఐదు సినిమాలకి సీక్వెల్స్ వచ్చినా లకార,రకార పేరు మోసిన సినీ కవులు,స్వర కర్తలు బోలెడంతమంది ఉన్నా ‘ఇది ' అనేది ఇదమిద్ధంగా ఇదీ అని చెప్పలేరంటారా? చెప్పిన నాడే కెవ్వు కేక.
(కనులు చూసినా, మూసినా, చదివినా పాటే ----ఏమిటో ఆ 'ఇది'...ఆ ఆయిదు పాటల తోటే..)
-డా. తాతిరాజు వేణుగోపాల్ , 07 జూలై 2013 (ఆదివారం)