ఎందుకు దొంగా,దొరా, దోచుకోవడం.. ఎందుకు దాచుకోవడం
19 మే, 2012


‘అబ్బబ్బ బ్బ ! దొంగ లం.కొ. వంద రూపాయలు కొట్టేశాడు, నన్నేమార్చి' – రాఘవరావు ఇంట్లో కాలు పెడుతూనే పెళ్ళాంతో అన్నాడు.
‘సర్లే. ఏంటా తిట్టు... మెల్లగా..., చుట్టు పక్కల వాళ్ళు వింటారు..' అందామె.
‘వాళ్ళు వినటానికి మెల్లగా తిట్టమంటావా?' –రా.రా. సరసోక్తి.
‘సర్లే సంబడం' –ఆమె ఊత పదం.
‘ఎలా మోస పోయానో నాకే అర్ధం కావడం లేదు' , గొణుగుడు ఆపలేదు ఆయన.
‘సర్లేవోయ్, దానికంత చింత ఎందుకూ? అవునుగానీ, చెప్పా గుర్తుందా, పనమ్మాయికి రేపు జీతమిస్తానని మాటిచ్చా. తెచ్చావా? లేక పొతే దొంగ ముం. మరో మూడు రోజులు పని మానేస్తుంది' ఆమె బాధ ఆమెది.
‘ఆవిడగారు మానేస్తే నాకే కదా శిక్ష... తెచ్చా.. పనంటే గుర్తొచ్చింది దొంగ వెధవ జురాసిక్ కి ఫోన్ చెయ్యాలి. ' –రా.రా ధోరణే అంత.
ఆమెకి తెలుసు ‘జురాసిక్' అంటే ఈయన గారి కొలీగ్ కె.సి.రాజు పేరు తిరగేసి ఈయన కోడై కూస్తున్నాడని. రాకరాక తన చెల్లెలు గిరిజ వస్తే ఈయన గారి కోడ్ లాంగ్వేజ్ తెలియక ఎంత భయపడిందీ.. ఈయన రాగానే చెల్లెలు సోఫాలో కూర్చున్నది కాస్త లేచి నిలబడితే ‘ఫరవాలేదు జరిగి, కూర్చో' అన్నాడు. అప్పుడు తనే చెల్లితో అంది-
“ ‘జరిగి' అంటే నువ్వే, గిరిజ ని తిరగేసి అన్నారు బావగారు. ఇంగ్లీష్ లో రాసే ‘సత్యం' కాస్త తిరగవేస్తే ‘మేటాస్' అయ్యిందనీ ఇప్పుడంతా అంటారు గానీ, బావగారు ఇలాంటివి ముందే కనిపెట్టేరు” అని. అప్పుడు చెల్లెలు నవ్వేసింది.
‘ఇంట్లో కాబట్టి జురాసిక్ అంటున్నా. అక్కడ ఆఫీసులో నిజంగానే ఆ జురాసిక్ ముందు అంటానా? ఊరికే అదో సరదా' అంటూ రాఘవరావు నెంబరు వెతుకుతున్నాడు.
‘ఫోనా...సర్లే ... ఈలోగా నా పూజ అయిపోతుంది' – ఆమె వేళాకోళం అతని నోటికి తాళం.
‘అబ్బే ..జస్ట్ .. రెండు మాటలే. ఇంటికొచ్చేసే హడావుడిలో అతన్తో చెప్పడం మరిచిపోయా. ...(ఫోనెత్తి) హలో.. రాజూ .. ఆ(--- ఆ భుజంగరావు చేతికి మన ప్రాజక్ట్ కాపీలు ఇవ్వొద్దు. వాడొక పెద్ద పని దొంగ. ఇదిగో అదిగో అంటాడే తప్ప రిజల్ట్ రాదు. అలాగేనా? సరే --- టీ అయ్యిందా? ---ఏ(విటీ? --- పాలవాడు పొద్దుటే పాల పేకేట్ వెయ్యలేదా? – అంత మాత్రానికే దొంగ నాయాల అని తిట్టకోయ్ ... పాపం ఏదో అవసరమొచ్చి రాలేదేమో ... వద్దొద్దు ---ఆ కార్డ్ కి అలా వంద కట్టండీ అంటూ సతాయిస్తారు, మీరే వస్తువు కొన్నా డిస్కౌంట్ ఉంటుంది అంటారు దొంగ నా కొ. లు ---- ఏ(విటీ కట్టేశావా?—‘
ఆమె పూజలో ఉందన్నమాటే గానీ రా.రా. మాటలు వింటూనే ఉంది. 'అపచారం ... ఈయనా నేనూ మాటిమాటికి ఎనిసార్లు ‘దొంగ' అని అనకుండా ఉండలేదివాళ!... ఒక్క ఇవాళేనేమిటీ ...రోజూ ఇంతే. అయినా అలా అనేది మేమొక్కరమేనా? తెలుగిళ్ళ లో ఇది మామూలే' అని మనసులో అనుకుంది.
‘అయితే, నువ్వూ ఆ వంద అలా తగలేసావన్నమాట' అని మాత్రం పైకి అనగలిగింది. డబ్బు ఖర్చు విషయంలో తను చాలా స్ట్రిక్ట్ కదా.
‘దొంగ పీనుగ ..వాడు వచ్చి అదీ ఇదీ చెప్పి ...వాళ్ళ పేరూ వీళ్ళ పేరూ చెబుతుంటే ..మొహమాట పడ్డానోయ్. వందా కట్టేశాను' –అనూహ్య ఖర్చుకి తన సమర్ధన బావుందని మురిసిపోయాడు రా.రా.
‘ఇంతకీ ఆ వాళ్ళూ వీళ్ళూ ఆడవాళ్ళేనా?- అలా ఓ చురక వెయ్యడం ఆవిడ హాబీ.
రా.రా. మాట్లాడలేదు. ‘అమ్మ దొంగా , ఆవులిస్తే పేగులు లెక్కేస్తుంది' అని మాత్రమే గొణుక్కున్నట్టు పెదాలు కదిపాడు.
‘ఆవులిస్తే పేగులు లెక్కేస్తుంది – అనేగా అంటున్నావు. వెర్రిదాన్ని కాను. ఆవులిస్తే ఆవుల్నే లెక్కేస్తాను' ఆమె జోక్ కి నవ్వొచ్చినా దొంగ నవ్వు నటించాడు రా.రా.
టీ.వీ. ఆన్ చేశాడు. ‘రాత్రి సినిమా దొంగ రాముడు టోయ్. నీకు తెలుసా కె.వి.రెడ్డి గారు ఎన్టీఆర్ పాత్రని తోట రాముడు అన్నారా పాతాళ భైరవిలో, ఏ ఎన్ ఆర్ ని పెట్టి దొంగ రాముడు సినిమా తీశారు. అంతకు ముందటేడే అగ్గి రాముడు గా ఎన్టీఆర్ కనిపించారు.ఆ తర్వాత భలే రాముడు ఏ.ఎన్.ఆర్ అయితే బండరాముడు, శభాష్ రాముడు, టాక్సీ రాముడు, టైగర్ రాముడు --- ఇలా ఎందఱో ఎన్టీ - రాముళ్ళు వచ్చేరు. ఆగలేక చలం ఆగి ఆగి ఆఖరికి తోటరాముడు తీశాడు. వింటున్నావా?'
‘శ్రీరామ నామాలు శతకోటి అని కవిగారంటే అతిశయోక్తి అనుకున్నా. నిజమే అన్న మాట. అయినా ఊరికే ఆ సినిమా పేర్లు వల్లె వెయ్యక హాయిగా విష్ణు సహస్ర నామాలు చదూ కోవచ్చుగా... పుణ్యం పురుషార్ధం...' పూజ ముగించి అంటోందామె.
‘పురుషార్ధం అంటే స్త్రీ , శివుడిలో సగం పార్వతి... కాబట్టి అవన్నీ నువ్వు చదివేస్తే నేనూ చదివేసినట్టే' – మళ్ళీ సరసుడయ్యాడు రా.రా.
‘దొంగరాముడు సినిమా చూస్తూ కూర్చుంటావేమో. అర్ధరాత్రి వీధి తలుపు గడియపెట్టడం మరచి పోకు. దొంగలొస్తారు' –ఆవలించిందామె.
‘పూర్వం దొంగలు పెరటినుంచి వచ్చేవారు. ప్చ్. ఇప్పుడంతా అపార్ట్మెంట్స్ కాపురాలు. దొంగలు కూడా మర్యాదగా ఫ్రంట్ నుంచే వస్తారు. దొంగ గారూ స్వాగతం అని గొల్లపూడి వారి నాటకముంది '- గొణగలేదు, పైకి గట్టిగానే అన్నాడు రా.రా.
‘అనకు. పైన తథాస్తు దేవతలుంటారు. గొల్లపూడి పబ్లికేషన్స్ అంటూ ఏవిటి గొడవ?' ... అందామె.
‘ఓసినీ, ముందన్నది నువ్వే కదోయ్. రాజమండ్రి లోని పబ్లికేషన్స్ కాదు నేనన్నది... మారుతీరావు రచన' ... రా.రా. నొచ్చుకున్నా భార్యని మెచ్చుకున్నాడు, తనకి ‘దొంగ' అనే క్లూ సమయానికి ఇచ్చినందుకు, ఎల్లుండి శనివారం ఆఫీసు ప్రోగ్రాం లో ఆ విషయం మీద దంచొచ్చు కనుక.
‘సరే కానీ... దొంగల పని ఏమిటీ... దోచుకోవడమేగా... ఉగ్రకవి ఏమన్నారు తెల్ల దొరని?... ‘ఎవడు వాడు, ఎచటివాడు – ఇటువచ్చిన తెల్లవాడు... మాన ధనం, ప్రాణధనం దోచుకునే దొంగ వాడు..' అనేగా? అలా అన్న ఆ పాటకి పదివేలు బహుమతి ప్రకటించినా ఆయన చేతికి దక్కినవి అయిదు వేలేనట. ‘అదే పదివేలు' అని ఆయన అనుకున్నారట. మిగతా అయిదూ ఏ దొంగ దోచుకు పోయాడో పాపం'
‘పాపం అంటూ దొంగ మీద జాలేమిటీ?'
‘దొంగ మీద కాదోయ్, జాలేస్తే పాపం అనే మాట ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది'
‘నీలాంటి జాలీ మనిషికి జాలి కూడానా? వంటలో సాయపడరాదూ జాలిపడీ'
‘ఓ నా జిలేబీ జాబిలీ , ఎంత తియ్యగా అని నా మనసు దోచుకున్నావ్'
‘అంటే --- నన్నూ దొంగ అంటావా'
‘అమ్మా... నిన్నలా అంటే సినిమా టైటిల్ లా నన్ను ‘దొంగ మొగుడు' అనరూ? సరేగానీ.. విను విను .....'
మనింట్లో పాత సినిమా పాటల పుస్తకాలు దాచుకోవడం ఎంత మంచిదయ్యిందీ , ఆ సినిమా పాటల్లో ‘దోచుకోవడం' అనే మాట వెతికి పట్టుకునీ దాని గురించి చెప్పాలనుంది. దొంగల పని దోచుకోవడం అని అందరికీ తెలుసు. కానీ కవులు ప్రియుడూ ప్రియురాలి మధ్య రకరకాల దోపిడీ పనులుంటాయని కనుక్కున్నారు.
ముందు సరదాగా కొన్ని ‘దొంగ' కబుర్లు చెబుతా...ఏ(విటీ ఆవలింతా?.. ఓహో.. దొంగ నిద్ర అన్నమాట.
పెళ్ళీ-చెప్పులు ‘హళ్ళీకి హళ్ళీ':
మన పెళ్ళికాక ముందు నేనింకా ఒంటరి పక్షిని కదా , అంటే ఏకాకిని. ఓ చిన్న పోస్టు వాడు తన పెళ్ళికి పిలిచాడు. కాలం మారింది... పెళ్లి వేడుక చూడడం, భోజనాలకి టేబిళ్ళ వెనక చెప్పుల్తోనే నిలబడడం మామూలై పోయిందిలే , చెప్పులెక్కడా విడవనక్కర్లేదే, హమ్మయ్య! అని అనుకున్నాను.
ఓ ఆరుగురు చాదస్తులు మాత్రం చెప్పులు విప్పి మండపం పైకి వట్టి పాదాలతో ఎక్కడం చూశాను. చెప్పులతో ఎక్కితే మరియాద కాదేమో , తప్పదే అన్నట్టు నేనూ వారి మార్గాన్నే అనుసరించి చెప్పులిప్పి స్టేజి ఎక్కాను. స్టేజి మీద లైన్ పెరిగి పోతోంది. ఫ్లాష్ లూ, గుంపు గుంపు ఫోటోలూ అయ్యాక వాడినీ, పెళ్లికూతురునీ పలకరించి కిందికి దిగాను. చెమటలు పట్టాయి. చెప్పులు కనపడలేదు. వట్టి కాళ్ళతో ఎంత సేపు పచార్లు చెయ్యడం?
తెలిసినాయన హితోపదేశం చేశాడు. ఆయన అన్నట్టు గానే ఇంకొకరి చెప్పుల్లో చూసీ చూడనట్టు కాళ్ళు దూర్చా. వాటి సైజు కాస్త పెద్దవే. అక్కడ అలా వెతుకుతూ కూచోం కదా. ఎలాగోలా బయట పడ్డాను అనుకున్నా. అంతలోనే వెనకనుంచి ‘సార్, అవి నా చెప్పులు' – ఎవరిదో కేక. అతనూ తెలిసినవాడే. ‘అవున్సార్, నావే' అన్నాడు. అతని పాదాలు చూశాను. నా పాదాలు ఇంకా చిన్నబోయినట్టనిపించింది. నా అవస్థకి పాపం నవ్వక, జాలిపడి ‘ఉండండి మీకు మరో జత తెస్తాను' అన్నాడు. ఎవరు చూస్తున్నారో చూడట్లేదో నాకేమీ తెలియట్లేదు - నా పరువు అక్కడ కిచెన్ వెనక పారేస్తున్న విస్తరాకుల మధ్య ఉన్నట్టనిపించింది.
అప్పటినుంచి ఎవరు పెళ్ళిళ్ళకి వెళుతున్నా ‘ఎందుకైనా మంచిది ఓ బ్యాగూ, అందులో ఓ జత చెప్పులు ఎక్ష్ట్రా
వేసుకునీ మరీ వెళ్ళండి' అంటుంటా..
వయోలీనూ –చెప్పు భయాలూనూ:
అలాగే మరోసారి ఎన్.రమణి గారి ఫ్లూట్ కచేరి జరుగుతుంటే భక్తి చెప్పుల మీద ఉండకూడదనీ నేనూ, నా ఫ్రెండ్ రే ఓ బ్యాగ్ లో మా చెప్పులేసుకునీ కూర్చునీ మా దగ్గరే ఉంచుకునీ కచేరీ ఎంజాయ్ చేశాం. కాని ఆయన తెలియని కీర్తనేదో వాయిస్తూ ‘చెప్పు రామా చెప్పు చెడి నే చేసిన తప్పు ఏదన్నది ఇకనైనా' అని అన్నట్టే నాకనిపించింది.
భద్రయ్య రాకడ ---కెమెరా పోకడ :
నీకు తెలుసు కదా. మీ బంధువొకాయన, ‘భద్ర పరిచే' గుణం ఉన్న ఆయనే, ఆయనతో పాటు మరో ముగ్గురు డిల్లీ బయల్దేరారు కదా. అప్పుడేమైందీ.. . ఈ భద్రయ్యకే వాళ్ళు కెమెరా అప్పగించేరు. ఈయన రెప్పార్పకుండా రాత్రి అంతా సూటుకేసులోని కెమెరా సేఫే కదా అన్నట్టు చూస్తూ గడిపేశారు. పొద్దునే ఆగిన చోటల్లా బావుందనిపించే దృశ్యాన్ని కెమెరాలో బంధించాలని అంతా అనడంతో సూట్ కేస్ లోంచి తీసి చేతి బ్యాగులోకి కెమెరాని మార్చారు. ఎన్ని తీయగలరు! పైగా మిగతా ముగ్గురూ ‘తీద్దాం' అన్నవారే కానీ అడపా దడపా కునుకు తీస్తున్న వారే. వారిని చూడగానే ఈయనకీ కునుకులొచ్చాయి. పైగా రాత్రంతా జాగారమాయే. గట్టిగా బిగించి బ్యాగుని తల కింద పెట్టుకుని నిద్ర పోతూ కాసేపు, పోక కాస్సేపు అవస్థలు పడుతూ, బ్యాగు తడుముతూ గడిపేస్తున్న దశలోనే వెధవది మాచెడ్డ నిద్ర వచ్చేసింది.
ఎక్కడో పడ్డ బ్రేకుకి నిద్రా భంగమై ఓ సారి బ్యాగ్ తడిమి చూసుకున్నాడు. గుండె ఘుభిల్లు మంది. కెమెరా లేదు. అమాయకంగా కింద పడి ఉంటుందని చెయ్యి పెట్టి కెలికితే చెప్పులూ, చెత్త తప్ప చేతికి కెమెరా అంటలేదు. ఆయన గుండె అప్పుడు ‘లబ్ డబ్' అనలేదు. ‘లబో దిబో' మంది. ఎందుకంటే – ఊరెళుతూ తెలిసినాయాన్ని ‘మీ కెమెరా ఇస్తారూ' అని అరువు తెచ్చుకున్నందుకు పుండు మీద కారంలా ఇలా జరిగిపోయింది.
కాబట్టి తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే -- ఇలా మధ్య మధ్యలో ఈయనగారు బ్యాగ్ తడుముకోవడం ఎవడో జాగర్తగా గమనించి తన అదృష్టాన్ని బేరీజు వేసుకునీ ఉంటాడు... కనుక రెండు కళ్ళూ నిద్దరోతున్నా మూడో కన్నుతో మసలుకోవాలి.
మరికొన్ని వృధా ప్రయత్నాలు జరుగుతాయి, మనవి కావు దొంగలవి.
తెల్ల డ్రెస్సు దొంగ గోడ దూకి పోవంగ :
మా చిన్నప్పుడు ఉదయం నాలుక్కి లేచి చదివే అలవాటు ఉండేది. అమ్మ డ్యూటీ నన్ను నిద్ర లేపటం. ఒకసారి నేను ముందే లేచాననుకునీ వాకిట్లో ‘అదేమిట్రా , అప్పుడే లేచావ్' అంది కళ్ళు నులుముకునీ. ఒక్కసారి షాక్ అమ్మకి . అక్కడున్నది నేను కాను. ఎవడో దొంగ. దొంగ దొంగ అని గట్టిగా అరవడంతో ఒక తెల్ల ప్యాంట్ వాడు పిట్ట గోడ ఎక్కి పారిపోయాడు. నేను రాత్రిళ్ళు తెల్ల పైజామా , పైన లాల్చీ దాల్చే వాడిని. కాబట్టి అమ్మ ఆ చీకట్లో నన్నే దొంగనుకుంది, ఛీఛీ, దొంగనే నన్ననుకుంది.
అన్నలిద్దరూ లేచారు. ముగ్గురం వాడిని పట్టేయాలనే ఊహతో ‘నగర సంచారం' లా బయలు దేరాం. మా ఇంటికి మరో అయిదారిళ్ళ తర్వాతే శ్రీనివాసరావ్ మాస్టారి ఇల్లుంది. ఆ ఇంటి అరుగు మీద ఒక తెల్ల ప్యాంట్ వాడు పడుకున్నట్టు ‘నటించడం' కనిపెట్టాం. వాడి భంగిమ ‘పెర్ఫెక్ట్' గా ఉంది. నిజం నిద్రలో అలా ఉండడం అసంభవం. ‘ఎవడ్రా' అని అరిచాం. విననట్టు నటించాడు. ఇంక ఎక్కువ సేపు సతాయిస్తే మనకే డేంజరేమో అని వెనక్కొచ్చాం. నేను నాలుగు గంటలప్పుడు లేస్తున్తానని తెలియని కొత్త దద్దమ్మ కాబోలు వాడు. అంతా మన మంచికే. ఏం పోలేదు! అమ్మో, నా నోట్ బుక్కులు ఎత్తుకు పొతే నా గతేం కానూ? ఆ రోజుల్లో అన్నీ ఓపిగ్గా చేత్తో గుండ్రంగా రాసుకునేవే, జెరాక్సులా పాడా... వాడే త్రాసుకో బలిచేస్తే?
ఆరు బయలు పడక – ఏడుపు దొంగకిక:
ఎండా కాలంలో వాకిట్లో మంచాలు వేసుకునీ ఆరు బయట రాని గాలి ఉన్నట్టు ఫీలైపోతూ, ధగధగా మెరిసిపోతున్న చెంద్రుడి కాంతి కళ్ళల్లో పడితే నిద్ర రాదేమో అని రెండు చేతులూ ‘ఇంటూ' ఆకారంలో మడిచి నుదుటిని ఆంచడం ఎంత మజాగా ఉంటుందీ? మజా రానిది నిశాచరులైన దొంగలకే. అయితే ఒకసారి ఇలా ఆరుబయట ఆనందంగా నిద్దరోతున్నప్పుడే పాపం మా అన్నయ్యని పెంకుటిల్లు చూరులోంచి జారి పడ్డ దొంగ ముం. ఎర్ర తేలోకటి కుట్టేసింది. చిన్న తేలుని పెద్ద చెప్పుతోనే కొట్టి చంపేశాం. అమ్మమ్మ తేలు మంత్రం వెయ్యడం ప్రారంభించింది. పొద్దుటే దగ్గర్లో ఉన్న ఫిరోజాలీ ఆస్పత్రికి అన్నయ్య వెళ్లినట్టు గుర్తు.
అమ్మమ్మ పూస తీత ..బియ్యం అమ్మికి వాత :
ఫిరోజాలీ అంటే భలే నవ్వొస్తుంది. మా చెల్లి ఓ సారి ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ పూసని ముక్కులోకి తోసేసుకుంది. అది అడ్డం పడి తనకి ఊపిరాడట్లేదు. గబగబా అన్నయ్య ఫిరోజాలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళితే ఆయనకి చెమట్లు పట్టేయి తప్ప పూస తియ్యడం రాలేదు. పైగా పెద్దాసుపత్రికి వెళ్ళమన్నాడు. అన్నయ్య ఇంటికొచ్చి చెప్పాడు ఇదీ సంగతి అని. అమ్మమ్మ ‘ఏం డాక్టర్లురా వీళ్ళు.. లెండి..' అంటూ చెల్లిని తలకిందు చేసింది. పూస చక్కా జారి పడిపోయింది ముక్కునుంచి. గ్రేట్ లేడీ కదూ. ఏవి దొంగ చదువులో, ఏవి నిజంగా చదువులో అనే పసిగట్టే విద్య అమ్మమ్మది. అయితే ఓ సారి ఓ దొంగ కాంపౌండర్ మందులిస్తుంటే అవి తిని కంగారు పెట్టేసింది. ఆ తరవాత వాడిని చెడామడా ఎంత తిట్టి పారేసిందీ.. దెబ్బకి ఊరొదిలి పోయాడు.
బియ్యం బస్తా నుంచి బియ్యం ఒంపి కొలిచేటప్పుడు అమ్మమ్మ ‘దొంగ లెక్క' రాకుండా జాగర్త పడేది. అనుమానం వస్తే మళ్ళీ కొలువు అనేది. ‘అమ్మా కరక్టే ‘ అని బియ్యం ఆవిడ మొత్తుకున్నా వినేది కాదు. రెండో సారి నిజంగానే లెక్కలో తేడా వచ్చేది. అలా బియ్యంది భయ్యం ఎక్కువై అమ్మమ్మతో నెయ్యం చెయ్యడం నేర్చుకుంది.
వానా వానా వల్లప్పా – దొంగా గుండే గుల్లప్పా :
వర్షా కాలం కూడా దొంగలకి చెడ్డ కాలమే. నెత్తిని ‘గిడుగు' వేసుకునీ, టార్చ్ లైట్ తో బురదలో వాళ్ళ అడుగు జాడలు చూస్తూ మనం వెళితే వాళ్ళ కెంత టార్చరూ!
చెప్పు...దొంగ ఏ లింగం? పులింగం?,స్త్రీలింగం? రెండూనా?
లింగ భేదం దొంగ కేల? :
దొంగ అంటే మగ దొంగ కావొచ్చు గానీ కొందరు 'దొంగది' అంటారు, అంటే ఆడ దొంగ!
దొంగ ఎవరా! ఎవరు దొరా?:
‘దొరికిన వాడే దొంగ ...దొరకనివాడు దొరరా బాబూ' అన్నారు మనసు కవి. ‘దొరలా తిరుగుతు దొరకని దొంగలు మనలో ఉన్నారోచ్చి ‘ అన్న మరోకవి పాట ఉంది. బాబోయ్, ఎన్ని తిట్లూ, శాపాలూ ఆ పాటలో..ఇంతకీ ఎవరు దొంగ? దొర ఎవరు? –‘లోగుట్టు పెరుమాళ్ళు కెరుక' !
దోచుకోవడం దొంగల గుణం. ఎన్నిసార్లన్నా అదే అనాలి. మళ్ళీ ఉగ్ర కవి గారే ‘ ప్రతి మనిషి మరి యొకని దోచుకొనేవాడే' అని మొత్తం మనుష్య జాతిలో దాక్కున్న ‘దొంగ' ని బయటికి లాగారు. ఇంకా చాలా ఏళ్ళ తరువాత కూడా ఉగ్ర కవి ‘దేశాన్నే ఇరుకునపెట్టి సిరులన్నీ దోచేస్తారు' అని కొందరి మీద ధ్వజమెత్తారు. ‘మనిషిని మనిషే దోచేస్తున్నా ఆగ్రహ మెరుగక దులుపుకు తిరిగే' వారి మీద మండిపడ్డారు. ఇలాగే ఉంటే ‘పదవులకెక్కి లంచం మెక్కి ప్రజలను దోస్తారు' అని అటువంటి వారి గురించి హెచ్చరించారు. ‘పంచుకు తింటే పాయసము, దోచుకు తింటే విషాన్నము' అని గిచ్చారు.
మనసు కవి కూడా ‘దొంగలె దొరలై దోస్తున్నా మామూలనుకొని పోతున్నారే' ఈ మనుషులు అని బాధ పడ్డారు. సంక్రాంతి వస్తే షావుకార్లు ‘వాకిలి వద్ద కాపు కాచి దోచుకోను, దోచుకున్న డబ్బులన్నీ ఏరుకోను' అని బాస చేస్తే బావుణ్ణు అని ఆశించారు.
ఆస్థాన కవి ‘కష్టపడే నీతిపరుని కడుపు నిండదు.. దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు' అనే సుభాషితం పలికారు. పూట కింత తిండి దొరికితే అంతకు మించి కలిమి ఉంటుందా? ఇది లేమిలో కలిమి.
దొరలకి కలిమి బాగా ఉంటుంది. అలాంటి కలిమిని దోచేవారు దొంగలు అనడం సహజం. ‘కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు, ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు?' అని మనసు కవి తన పాటలో ప్రశ్నిస్తారు. ఇలా కంటి మీద కునుకు లేకుండా చేసే (నిదుర రాని నాకు కలలు కూడ రావే- అని అన్నదీ మనసు కవే) దొరలు దొంగలకంటే కూడా క్షమించరాని వాళ్ళన్న మాట. ‘చెలిమిని కలిమే దోచినదా?' అన్నది మనసుకవి మధనం.
అసలు దొర...బ్రోచేవారెవరురా :
అసలు... దొర అంటే బ్రోచేవాడు అని అర్థం. త్యాగయ్య గారి పంచరత్నాల్లో ఒకదాని మకుటం ‘దుడుకు గల నన్నే దొర బ్రోచురా?' అని చెబుతుంది. నన్ను బ్రోచేవాడు వీడు అని ప్రేయసి నమ్మితే ఆ ప్రియుడే ఆమెకి దొర. ఆ దొరకి ఈ ప్రేయసే దొరసాని. అంతేతప్ప తెల్ల దొరలూ, నల్ల దొరలూ అనే రంగుల తేడా చూపేవి మన కంటి పొరలు!
మనసు ‘వాకిటి తలుపు తెరిచి ఉందనీ' జొరబడితే ఆ సాహసి దొరా? దొంగా? ‘దొరవో మరి దొంగవో, దొరికావు ఈనాటికి' అని ప్రియురాలు ఆట పట్టిస్తే ‘దొంగను కాను, దొరనూ కాను' అంటాడు ప్రియుడు. మరేమిటి? అని ఆమె ప్రశ్నించేలోగా ‘నంగనాచి నసలే కాను' అని గడుసుగా బదులిస్తాడు. భావకవి భావుకత ఇదంతా. ‘దోచుకోవడం' అనే మాటకి బహు దూరంగా ఆయన నిలవడం ఒక గొప్ప వింత.
‘నా మానస చోరుడెవరో..తొలి చూపులలో వలపులు చిలికి దోచిన మగసిరి దొర ఎవరో?' అని వనమంతా వెదికే ప్రియురాలు ఉండాలని మనసు కవి ఎందుకనుకోవాలీ? ఎందుకంటే అదే వనంలో ప్రియురాలు చిలకైతే ప్రియుడు గోరింక కనుక. చిలక మనసు దోచేది గోరింకే కనుక.
‘ఏ సీమ దానవో ఎగిరెగిరి వచ్చావు' అని గోరింక చిలక ప్రియురాలిని ప్రశ్నించడం ఆస్థాన కవి చాతుర్యమైతే, ‘దొరికినాము చివరకు తోడు దొంగలం, దొరలమై ఏలుదాము వలపు సీమలు' అని అదే గోరింక చేత బహువచనంలో సీమ పూర్తి విలాసం చెప్పడం చిత్రసీమ లోని మనసుకవి చాతుర్యం. అంతవరకూ దొంగలైన వారే ఇక పైన దొరలా?
వెన్న దోచినదొకరు ... వెన్నుని దోచే రెందరో :
అందరికీ ప్రియమైన దొంగ ఒకడున్నాడు. ఇంకెవరు? చిన్ని కృష్ణుడే. వెన్న దోచుకున్నాడు కనుక ‘వెన్న దొంగ' అతని తెలుగు ముద్దు పేరు. నవనీత చోరుడు అన్నది దేవ వాక్కు. మనసు కవి మరింత ముందుకు పోయి ‘దోర వయసున్న కన్నియల హృదయాలను దోచుకున్నాడని విన్నాను' కానీ అవి చాడీలు అని తేల్చారు. ఆచార్య కవి ‘వెన్న మీగడలు తిన్నది నిజము.. చిన్నారి.. వెన్నుని దోచిన మాట నిజము‘ అని సమర్ధిస్తూ వెన్న దొంగకి రెండు వైపులా అండగా నిలిచారు. సుందర కవి మాత్రం ‘వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే--- వెన్నెల వేణువులూదాడే..మది వెన్నల దోచాడే' అని కొత్త అలంకారాలు కృష్ణుడికి తొడిగారు. కాని అవి అచ్చ కవి ఎప్పుడో ‘రేపల్లె వాడలో దోచిన వెన్నలు చాలవా చేసిన అల్లరి చాలదా?' అని తొడిగిన పాత బంగారు కణికలే.
ఉగ్ర కవి.. దారి తప్పి దొంగైన నిజం మనిషి నోట నుంచి ‘వెన్న దొంగ.. మా తొలిగురువు.. తొలినుంచి మా కులగురువు' అని అనిపించారు. మనలోని ‘చెడు గుణాల్ని' దొంగిలించి కరిగించి మనకి వెచ్చని గీతోపదేశం చేసిన వెన్నదొంగ, కన్నయ్య దొంగా? రంగ!రంగ! మానవాళిని కన్నయ్య.. ఒక సుభద్రని బావ చేతిలో పెట్టిన అన్నయ్య, ఒక ద్రౌపది మానం కాచిన అన్నయ్య!
‘కొలను దోపరికి గొబ్బిళ్ళో' అనీ, ‘గురుతెరిగిన దొంగ కూకూకూ' అని అలనాటి అన్నమయ్య కీర్తించారు.
అయినా కొందరు కవులు కృష్ణుణ్ణి ‘కోకల దొంగ' గానే ఎక్కువగా గుర్తించారు. మనసు కవి ‘చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు ..చిత్తమే దోచాడా చిలిపి కృష్ణుడు' అని అనలేదూ? అంతకు ముందూ అంతే- ‘దొంగ కిట్టయ్య , నీతో ఎట్టయ్య? చీరలు దోచి చెట్టెక్కినావు' అనే పుల్ల విరుపు విమర్శ ఆయనే చేశారు.
మాట కవి ఏమన్నారూ?‘భామలందరూ యుక్తిని పన్ని దొంగ దొరికెనని పోయి చూడగా ఛంగున నెటకో దాటిపోయే డ'ట చిన్ని కృష్ణుడు. ‘మాయా బజార్' కి వెళ్ళిపోయి ఉండాలి. లేదా కాళింది తలపైనో, నాగేంద్రుని తలపుల్లోనో ఉండి ఉండాలి. ‘ఏ తావునరా నిలకడ నీకు' అనేది నిజానికి కృష్ణుడికే చెల్లు.
కృష్ణుడు తొలుత ‘పుట్టింది ఎంతో గొప్ప వంశం', కాని ‘ పెరిగింది ఏదో మరో లోకం'. అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు, చిన్న చిన్న దొంగతనాలు చిననాడే మరిగాడు'. కావొచ్చు గాక, కాని...‘ దొంగైనా దొర అయినా మనసే హరించేనులే' అని లలితంగా తెలుసుకుంటే నందకుమార వశం కాక తప్పదు. ప్రాస కవి మాటల్లో అంతా సత్యం,శివం,సుందరం!
కృష్ణుడు తమ హృదయాన్ని దోచుకున్నాడని గోపికలు అనుకున్నారు. కృష్ణుడు తనని హృదయంలో దాచుకున్నాడని రాధ అనుకుంది. అక్కడే ఉంది తేడా. కృష్ణుడు కలిమి ప్రియుడు కాదు, చెలిమి ప్రియుడు.
కలిమి కన్నా మిన్న అయినది ఒకరినుంచి మరొకరు ‘దోచుకునేందుకు' ఉందని రాధాకృష్ణుల వలన ప్రేయసీ ప్రియులకి అవగతమైంది. అదే –హృదయం /మది/ మనసు అనేది దోచుకోవడం! ఈ మూడింటిని తలదన్నే మరొ దోపిడీ మాట పేరే ‘వలపు'.
ప్రేయసీ ప్రియులు ‘అభిమానవంతులు ' అయి మదరాసు బీచులో తిరిగితే ఎవరిదో టేప్ రికార్డర్ అప్పుడే ‘ఓ మనసు దోచిన చెలికాడా' పాట వినిపిస్తుంది. సీకవి మాట విని ‘మల్లెపూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ' లో వస్తే సరే, అచ్చ కవి మాట విని ‘మలయా నిలమూ వలపులు దోచీ' వీస్తే సరి, ప్రేయసీ ప్రియులకి సంబరమే. మరి మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ గోప్యం గా ‘వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా' అనిపిస్తుందే వీరికి. మనసు కవి అన్నట్టు ‘తీయని వెన్నెల దోచుకుపోయే దినరాజును రానీయకుము' అని వారి మనసు పదేపదే కోరేది అందుకే.
‘ఇంతకీ చెప్పు.. నువ్వు మనసునా దోచింది?' అని నిలదీసి ప్రేయసి గానీ అడిగితే అప్పుడు ఒప్పుకుంటాడు నిజమైన ప్రియుడు - ‘నా మనసే దోచినది నీ మక్కువలోని తీయదనం' అని, ప్రాస కవి పలుకులే తనవనీ.
మరికొందరు డేంజర్ ప్రియులు మనసూ, హృదయం అనేవి ప్రత్యేకంగా చెప్పడమెందుకనీ ఏకంగా మనిషినే దోచుకోవడం గురించి చెబుతారు. ఆచార్య కవి తొలిసారిగా అన్నదే వేదమై ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని' అని ప్రియుడు ప్రియురాలిని చిలిపి నిందాస్తుతి చేస్తాడు. అన్నదే తడవుగా ‘కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ' అని ప్రియురాలు గడుసు జవాబిస్తుంది. ‘దోచుకోవడం, దాచుకోవడం' జంట పదాలు గా వస్తే మంచి మాటలొస్తాయి. కేవలం ‘దాచుకోవడం' అనే మాట వచ్చినా మంచిగానే పలుకులొస్తాయి.
‘దాచాలంటే దాగాదులే' అని బెదర గొడుతూ ‘వలపుల సంకెల బిగిసే దాక వదలను'అంటూ వెంట పడడం, పడుతూ పాడడం అందంగానే ఉంటుంది. ‘ఓ అందగాడా నన్ను నీలో దాచుకో' అనే అర్ధింపు ఎంత అందమైనదీ! అదే ‘ఓ అందగాడా నన్ను నిలువునా దోచుకో' అంటే ఎంత అసహ్యంగా ఉంటుందీ! కాలానుగుణంగా భవిష్య ప్రియులు ఈ రెండో కోవలోకి వచ్చేసే అవకాశాలే ఎక్కువ.
ఏది ఏమైనా త్యాగయ్య గారు ఓ మంచి మాటన్నారు- ‘దొంగ మగని భక్తి మీరి నమ్మితే మంచి దోవ జూప నేర్చునా?' అని. ఎప్పటి మాటో అది- ఇప్పటికీ పాత బడదు. అంచేత – ఇప్పటి ప్రేయసి ఇప్పటి ప్రియుని విషయంలో మెలకువగా ఉండాలి. మనసు దోచుకున్న వాళ్ళూ గుండెలో దాచుకోవడం చేతకాక ఆర్నెల్లు తిరక్క ముందే ‘విడాకు మంత్రం' చదువుతున్నారు. కలిసిన చేతులు (విధి లేక) కాలాక, (విడి) ఆకులు పట్టుకునీ ఏం ప్రయోజనం?
ఈ పట్టిక చూస్తే చాలు నిన్నటి గీతాల్లోని ‘దోచుకోవడాల' వైరుధ్యం తెలుస్తుంది. ఏది బావుందీ, ఏది బావులేదూ అన్నది మీకు తెలుసు ----ఇప్పటి పాటల్లో అటువంటి ‘దోచుకోవడం' ఉందో లేదో చెప్పడానికి ఏదీ ఒక్క పాటా మనసు దోచుకోవడం లేదే... ఇంక పాటలు దాచుకోవడం కూడానా?
‘వోయ్ .. ఉపన్యాసం పూర్తయింది. శనివారం ఫంక్షన్ లోనూ నిద్ర పోగలవ్ ... ఇంద.. పట్టిక రాసి ఉంచా. ఆనక తీరిగ్గా చదువుకో... నీ కనులు చదివినా పాటే కదా...
సీకవి,అచ్చకవి, మనసు కవి, మాట కవి , ఉగ్ర కవి, ప్రాస కవి, ఆచార్య కవి, ఆస్థాన కవి, జన కవి ... అన్నవి తిరగ రాసిన పేర్లు కావు గానీ ..తిరుగులేని కవుల పేర్లు వారెవరెవరై ఉంటారో చెప్పుకో'- చెబుతూనే ఉన్నాడు రా.రా. ఆమె జవాబీయ లేదు. హాయిగా నిద్దరోయింది.
రా.రా. టీవీ ముందే ఉన్నాడు అంటే ‘దొంగరాముడు' సినిమా చూసినట్టు కాదు. అలాగనీ సినిమా చూడట్లేదని టీవీ ఆపనూ లేదు. ఉపన్యాసం అనుకున్నాడు, రాసుకున్నాడు, చదువుకున్నాడు.
దేనిదారి దానిదే- ఎటు తిరగేసినా అదే... దే ని దా రి దా ని దే....
ఒకరి పేరు తిప్పి రా.రా. కొత్తగా ఒక మాట అన్నాడేమో గానీ తన పేరు మాత్రం పొడి పొడిగా రా.రా. అనే అనిపించుకుంటాడు. ఎందుకంటే ఎటు తిప్పినా అది రా.రా. వే కదా, శ్రీశ్రీ లాగ! అదీ అతని బడాయి.
టీవీ కట్టేసి తృప్తిగా నడుం వాల్చాడు రాఘవరావు. రా.రా. కాస్సేపు కనులు మూసినా పాటే, కాస్త సేపు కనులు చూసినా పాటే - అవి కునుకుని దోచేస్తున్నాయి. ఆలోచనతోనే నిద్దర గుర్రు లోకి మారింది . 'మళ్ళీ మర్నాడు ఆఫీసూ, రాజూ, భుజంగరావూ ... రొటీన్...' ఆయన పలవరింత మాటలు గుర్రులో ఆయనకే వినపడటం లేదు.
ఆదివారం ....సూర్యుడి కోపాన్ని ఎలా తగ్గించడమో దిక్కు దోచక బిక్క చచ్చి చూస్తోంది తూరుపు...
‘ప్రతిసారి ఈయన ఉపన్యాసమిచ్చి గిఫ్ట్ ‘దోచుకుంటాడే', తనకెందుకు ‘దొర'కదూ? ...' అక్కడ భుజంగరావు లోలోపల ఒకటే దొంగ ఏడుపు!
ఆ వెచ్చని కన్నీటి తెర వెనుక కనిపించక వినిపించే... ‘మీరాయన లాగ మాటల ‘దొర' కాదు కనుక' – అన్న జురాసిక్ మాటల తీరుపు...
‘ఏమిటో – ఈ దొంగా,దొరా, దోచుకోవడం.. వాటిని ఈయన వేరే పని లేనట్టు.. బుర్రలో దాచుకోవడం' ......రా.రా. భార్య దీర్ఘమైన ని...ట్టూ...రు...పు!
-డా. తాతిరాజు వేణుగోపాల్, 19 మే 2012